పచ్చ జెండా

0
11

dropcap]రా[/dropcap]త్రి పదిన్నర అయింది సమయం.

చీకట్లను చీల్చుకుంటూ రైల్వే స్టేషన్ ముందు ఆగింది బైక్. స్టేషన్ నేమ్ బోర్డు మీద వెలుగుతున్న దీపం కాంతి చాలక పోవడంతో స్టేషన్ ఆవరణ చాలా వరకూ మసగ్గా కనిపిస్తోంది. బైక్ స్టాండ్ వేసి మెట్లెక్కి స్టేషన్ మాస్టర్ గది తాళం తీసి లోపలికి నడిచాడు రాజారాం. లైట్ స్విచ్, ఫ్యాన్ స్విచ్ నొక్కి కుర్చీలో కూలబడ్డాడు.

అతని ముఖం రక్తం లేనట్టు పాలిపోయి కనిపిస్తోంది. ఒంట్లోని జీవం ఎవరో బలవంతంగా తీసేసినట్టు నిస్సత్తువుగా ఉన్నాడు. పదిహేను సంవత్సరాలపాటు అంటిపెట్టుకున్న నమ్మకానికి తగిలిన దెబ్బ చిన్నదేం కాదు. బాణం తగిలిన పక్షిలా ఉంది అతని పరిస్థితి.

ఇప్పుడు తనేం చెయ్యాలి?

మరోసారి బుర్రలో కదిలిందా ప్రశ్న. ఇంత హఠాత్తుగా జీవితం అంధకారం అవుతుందని అతనెప్పుడూ అనుకోలేదు. ఎంతో జాగ్రత్తగా పెంచిన చెట్టు ఒక్క గాలివానకి కూలినట్టు కుప్పకూలింది బతుకు. మనసులో ఆలోచనలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే నిస్సహాయంగా కూర్చున్నాడతను. ప్రకృతిని చుట్టుముట్టిన చీకటి అలానే శాశ్వతంగా ఉండిపోదు. కాని వెలుగు రాదని తెలిసినప్పుడు మనిషి ఎటు పయనించాలి?

అతను నెమ్మదిగా కదిలి తెల్ల కాగితం ముందుకి లాక్కుని పెన్ అందుకున్నాడు.

ఏం రాయాలి? ఎక్కడ మొదలెట్టాలి? ఆత్మీయంగా కట్టుకున్న పొదరిల్లు తనది కాదని తెలిసేక, దానికోసం పాకులాడటంలో అర్థం లేదు.

అతను తలవంచి రాయడం మొదలెట్టాడు. అరగంటసేపు రాసాక పెన్ పక్కన పెట్టి కుర్చీలో వెనక్కి వాలాడు. మనసులోని భావాలని కాగితం మీద పెట్టాక స్పష్టమైన ఆలోచన ఒకటి అతనిలో రూపుదిద్దుకుంది.

తన గది నుంచి బయటకొచ్చి ప్లాట్‍ఫారం మీద నిలబడ్డాడు.

***

అది చాలా చిన్న రైల్వే స్టేషన్.

విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళే ప్యాసింజర్ రాత్రి ఎనిమిదింటికి వస్తుంది. తిరిగి ఉదయం ఆరుకి ఆ రైలు రాజమండ్రి నుంచి విజయవాడ వెళుతుంది. ఆ స్టేషన్‌లో ఆగే రైళ్ళు అవే. స్టేషన్‍కి ఊరు మూడు కిలోమీటర్లు కాబట్టి ప్రయాణీకులు ఎక్కువగా ఉండరు. రాత్రి ఒంటిగంటకు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు గంట వ్యవధిలో అటూ ఇటూ వెళతాయి. వాటికి సిగ్నల్ చూపిస్తే మరేం పని ఉండదక్కడ.

ఆ స్టేషన్‌తో ఇరవై సంవత్సరాల అనుబంధం రాజారాంకి. పని చాలా తక్కువ. దానికి తగ్గట్టుగానే నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా ఉంటుంది స్టేషన్. లూప్ లైన్లో నాలుగు గూడ్సు పెట్టెలు మసక చీకటిలో దెయ్యాల మాదిరి కనిపిస్తున్నాయి. అక్కడికి పది కిలోమీటర్ల దూరంలోని ఎరువుల ఫ్యాక్టరీ నుండి పదిహేను రోజులకి ఒకసారి సరుకు తెచ్చి లోడ్ చేస్తారు. ఆ తరువాత భువనేశ్వర్ వెళ్ళే గూడ్సు రైలు వచ్చి నాలుగు ఖాళీ పెట్టెలు వదిలి లోడైన పెట్టెలు తీసుకుని వెళుతుంది.

ఆలోచిస్తూ చుట్టూ చూశాడు రాజారాం. అక్కడొకటి అక్కడొకటి లైట్లు వెలుగుతున్నాయి. ఒక లైట్ కింద బెంచీ మీద ఎవరో కూర్చుని ఉండటం కనిపించిందతనికి. రాజారాం అటు నడిచాడు. అడుగుల చప్పుడుకి తల తిప్పి చూసాడు కూర్చున్న వ్యక్తి.

“ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు?” అడిగేడు రాజారాం.

“నా పేరు సికిందర్ సార్! ఈ ఊళ్ళో పనుండి సాయంకాలం వచ్చాను. పని పూర్తి చేసుకుని, వాళ్ళ బలవంతం మీద భోజనం చేసి బయలుదేరేసరికి తొమ్మిది దాటిపోయింది. రాత్రి ఏడు తరువాత బస్సులు దొరకవట. ఇక్కడే కాలక్షేపం చేసి ఉదయం ప్యాసింజర్‌కి విజయవాడ వెళదామని వచ్చాను. రాత్రి ఎనిమిదికి రాజమండ్రి ప్యాసింజర్ వెళ్ళిపోయాక మీరు ఇంటికెళ్ళి భోజనం చేసి వస్తారని చెట్టు కింద కూర్చున్న సాధువులు చెప్పారు. భోజనం చేసి స్టేషన్ కొచ్చి ఏదో పనిమీద మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళారని వాళ్ళే అన్నారు” చెప్పాడు.

అతని మాటతీరు సంస్కారవంతంగా ఉండటంతో పక్కన కూర్చుని అడిగేడు రాజారాం.

“ఊళ్ళో ఎవరి ఇంటికి వచ్చారు?”

“ఆ మధ్య శాంతి అనే అమ్మాయి ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని పేపరులో వచ్చింది. ఆమెని కలిసి వివరాలు తెలుసుకోవాలని వచ్చాను” చెప్పాడతను.

“ఆ వివరాలు మీకెందుకు?” ఆసక్తిగా అడిగేడు రాజారాం.

“నేనో రచయితని. ఆత్మహత్యల మీద ఓ పుస్తకం రాయాలని సమాచారం సేకరిస్తున్నాను.”

“పుస్తకం రాయడానికి ఇంత కష్టపడాలా?” రాజారాం గొంతులో ఆశ్చర్యం.

చిన్నగా నవ్వేడు సికిందర్.

“సమాచారం సేకరించి రాసినప్పుడే కథ కాని నవల కాని కొంతకాలం జీవించి ఉంటుంది. ఊహల్లోంచి పుట్టిన దానికి సమాచారం సమకూర్చుకుని రాయడానికి మధ్య చాలా తేడా ఉంది. నిజానికి పేపరు వార్త ఆధారంగా శాంతి సంఘటనని రాయచ్చు. ఇక్కడకి రావడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలిసాయి.” చెప్పాడు.

“కొత్త విషయాలా?”

“అవును. అతన్ని నమ్మి మనస్ఫూర్తిగా ప్రేమించింది. ఆ ప్రేమ మైకంలో శారీరకంగా దగ్గరయింది. అతను మరో అమ్మాయిని చేసుకునేసరికి తట్టుకోలేకపోయింది. ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగే ధైర్యం లేక ఆత్మహత్యకి ప్రయత్నించింది. నిజానికి పిరికివాళ్ళే నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తారు.  తమ మీద తమకి నమ్మకం లేనివారు, ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవాలు లెనివారే ఆత్మహత్యకు పాల్పడతారు. జీవితంలో కష్టాలనెదుర్కోలేనివారు, తమ జీవితంపట్లేకాదు, తమని ప్రెమించినవారి పట్లకూడా అభిమానం లేనివారే ఆత్మహత్యకొడిగడతారు” అన్నాడు సికిందర్.

జీవంలేని నవ్వొకటి రాజారాం పెదవుల మీద కదిలి అదృశ్యమయింది.

“పిరికివాళ్ళు చచ్చిపోరు. చావడానికి ధైర్యం కావాలి. జీవితంలో నమ్మకం కోల్పోయినప్పుడే తెగింపు వస్తుంది. ప్రేమించిన వాడు మోసం చేసేసరికి తట్టుకోలేకపోయింది శాంతి. కానీ, ఆ నిరాశలోని ఒక్క క్షణాన్ని ఆమె భరించివుంటె, నిండు జీవితం ఆమె ఎదురుగావుంది. ”

ఆ నిశ్శబ్ద నిశీధిలో వారి గొంతులు స్పష్టంగా వినిపిస్తున్నాయి. దూరంగా స్టేషన్ బయట చెట్టుక్రింద కూర్చుని తత్వాలు పాడుతున్న సాధువుల స్వరాలు లీలగా వినిపిస్తున్నాయి. ఆకాశంలోని చందమామ చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు. స్టేషన్ ఫెన్సింగ్‌ని అనుకుని ఉన్న చెట్ల ఆకుల మధ్య నుండి తీగల్లా నేలని తాకుతున్నాయి వెన్నెల కిరణాలు.

“ఇంతవరకూ పిరికివాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారనే భావనలో ఉన్నాను.” అన్నాడు సికిందర్.

తల అడ్డంగా ఊపాడు రాజారాం.

“ఆరు నెలలకి ఒకసారి ముగ్గురు సాధువులు వచ్చి ఇక్కడ కొంతకాలం ఉండి వెళ్ళేవాళ్ళు. మాకు ఏమీ తోచనప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటాం. వాళ్ళ అనుభవాలు మాతో పంచుకునేవారు. వారిలో ఒక సాధువుకి చిన్నతనం నుంచి కడుపు నొప్పి ఉంది. అతను కుటుంబాన్ని వదిలి సాధువుల్లో కలిసాడు. ఎన్నో ప్రాంతాలు తిరిగి వనమూలికలు, నాటు మందులు వాడాడు. జబ్బు నయం కాలేదు. ఒకరోజు గూడ్సు రైలు కిందపడి ప్రాణం తీసుకున్నాడు. తన కడుపు నొప్పి తగ్గదని నిశ్చయించుకుని, బతికినంత కాలం ఆ బాధ భరించే శక్తిలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోయాడు. అలాంటి పరిస్థితి వస్తే మనం కూడా అదే పని చేస్తాం” చెప్పాడు రాజారాం.

“ఆత్మహత్య మహా పాతకం అంటారు..” సాలోచనగా అన్నాడు సికిందర్.

“చచ్చిపోయాక మహాపాతకం అయితే ఏమిటి, మరోటి అయితే ఏమిటి? నిత్యం నరకం వంటి జీవితాన్ని జీవించేకన్నా కొన్ని క్షణాలు బాధతో కూడిన మరణం నయం కదూ..” అని వాచీ చూసి, “పన్నెండున్నర అయింది. ఎక్స్‌ప్రెస్ వచ్చే ముందు కాల్‌కి ఎటెండ్ కావాలి. మీరు రెస్ట్ తీసుకోండి..” చెప్పాడు.

“విజయవాడకి టిక్కెట్ ఇస్తారా?”

“టైం ఉందిగా. మీరు పడుకోండి. ప్యాసింజర్ వచ్చేముందు లేపుతాను,” చెప్పి, స్టేషన్ వైపు నడిచాడు రాజారాం.

సంచి తలక్రింద పెట్టుకుని నడుము వాల్చాడు సికిందర్. ఆత్మహత్యల్లో ఓ కొత్త కోణాన్ని సాధువు మరణం ద్వారా పరిచయం చేసాడు స్టేషన్ మాస్టర్. తన సమాచార సేకరణ ప్రాథమిక దశలో ఉందని మరింత లోతుగా అధ్యయనం చేయ్యాలని అతనికి అర్థమయింది.

వాతావరణం ప్రశాంతంగా చల్లగా ఉండటంతో నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాడు. ఒక రైలు రావడంతో మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూసాడు. స్టేషన్ దాటిన రైలు ఆగిపోయి కనిపించింది. ఒక కంపార్టుమెంట్ దగ్గర జనం గుమికూడారు. సంచి భుజానికి తగిలించుకుని అటు నడిచాడతను.

గార్డు చేతిలో శక్తివంతమైన టార్చి వెలుగుతోంది. దాని కాంతి పట్టాల మీద ప్రసరిస్తోంది. ఆ వెలుగులో పట్టాలకి అటు ఇటు రెండు ముక్కలుగా పడున్నాడు స్టేషన్ మాస్టర్. కడుపులో దేవినట్టయింది సికిందర్‍కి. గంట క్రితం తన పక్కన కూర్చుని మాట్లాడిన వ్యక్తి నిర్జీవంగా రెండు ముక్కలుగా పడి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తమ మధ్య ఆత్మహత్యల గురించి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.

అప్పటికే ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడా? ఏ కష్టం అతన్ని ఈ పనికి పురిగొల్పింది? సికిందర్ ఆలోచనలు చెదరగొడుతో ఎక్స్‌‌ప్రెస్ ట్రైన్ డ్రైవర్ గార్డుతో చెబుతున్న మాటలు వినిపించాయి.

“స్టేషన్ మాస్టర్ సిగ్నల్ చూపించడం దూరం నుంచి కనిపించింది. ట్రైన్ అతన్ని సమీపించిన మరు క్షణం ఇంజన్ ముందుకి దూకేసాడు. అదుగో సిగ్నల్ లైటు అవతలి పట్టాల మీద పడుంది. ఇంకా గ్రీన్ లైటు వెలుగుతోంది.”

గార్డు జనానికి కాస్త అవతలకి వెళ్ళి విషయం విజయవాడ స్టేషన్‌కి చేరవేసాడు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గుంటూరులో ఉన్నాడు. వెంటనే బయలుదేరి వస్తున్నాడు.

“విజయవాడ వెళ్ళే ప్యాసింజర్ ఎన్ని గంటలకి వస్తుంది.” సికిందర్ గార్డుని అడిగాడు.

“ఆరు గంటలకి వస్తుంది. ఈలోపు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ వస్తాడు. మీరు ప్యాసింజర్‌కి వెళతారు కాబట్టి అతను వచ్చే వరకూ స్టేషన్ చూసుకోండి సార్!” ప్రాధేయపూర్వకంగా అడిగాడు గార్డు.

అంగీకారంగా తలూపాడు సికిందర్. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ వస్తే ఇతను చనిపోవడానికి కారణం తెలుసుకోవచ్చుననే ఆలోచన బుర్రలో కదిలింది.

సికిందర్‌ని, నిర్జీవంగా పడున్న స్టేషన్ మాస్టర్ శరీరాన్ని వదిలి ట్రైన్ వెళ్ళిపోయింది. అక్కడ నిలబడటానికి మనస్కరించలేదు సికిందర్‌కి. గుండెల్లో ముల్లు గుచ్చుతున్నట్టు బాధ. స్టేషన్లోకి నడిచి తెరిచి ఉన్న స్టేషన్ మాస్టర్ రూమ్‌లోకి ప్రవేశించాడు. అంతా కలలో జరిగినట్టు జరిగిపోయింది. ఆ షాక్ నుంచి అతను తేరుకోలేదు. కుర్చీలో కుర్చున్నాక సికిందర్ దృష్టి టేబుల్ మీదున్న కాగితం మీద పడింది.

రాజీ!

నన్ను క్షమించు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసి పదిహేను ఏళ్ళ క్రితం నీ మెడలో తాళి కట్టాను. నా శాయశక్తులా నీ సుఖ సంతోషాల కోసం శ్రమించాను. నేను అనాథని కావడంతో నువ్వు, ఇద్దరు పిల్లలు నా ప్రపంచం అనుకున్నాను. కాని నీకు అసంతృప్తి ఉందని, నా స్థానంలో మరొకరిని చూసాక అర్థమయింది. పిల్లలు నా పిల్లలేనా అనే సందేహం నా గుండెని పిండేస్తోంది. నీకు అడ్డు రాకూడదని ఈ జీవితానికి ముగింపు పలుకుతున్నాను. అందమైన పొదరిల్లులాంటి సంసారాన్ని కూకటి వేళ్ళతో పెకిలిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు.

ఇట్లు

రాజారాం.

ఆ ఉత్తరం చదివేసరికి సికిందర్ కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి.

తెల్లవారుజామున నాలుగు గంటలకి వచ్చాడు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. సికిందర్ ద్వారా జరిగింది. తెలుసుకున్నాడు. ఉదయం ఆరుకి రాజమండ్రి నుండి ప్యాసింజర్ వచ్చింది. అందులో రైల్వే పోలీసులు దిగారు. సికిందర్ నుండి స్టేట్‌మెంట్ తీసుకున్నారు.

“రాత్రి పన్నెండున్నర వరకూ నాతో మాట్లాడారు. ఎక్స్‌ప్రెస్ వచ్చే టైమ్ అయిందని సిగ్నల్ చూపించాలని వెళ్ళారు. ఉదయం ప్యాసింజర్ వచ్చే ముందు లేపుతానని చెప్పారు. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది.” చెప్పాడు సికిందర్.

సికిందర్ టిక్కెట్ తీసుకుని రైలు ఎక్కి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అతని జేబులో స్టేషన్ మాస్టర్ రాసిన ఉత్తరం మడతపెట్టి ఉంది.

(సంచిక ఆత్మహత్య చర్యను ఎట్టి పరిస్థితులలో సమర్థించదు. ఆత్మహత్యను ఒక పరిష్కారంగా భావించదు. ఆత్మహత్య హేయమైన చర్య అనీ, పిరికివారు, జీవితంలో నిలబడి పోరాడే స్థైర్యంలేని వారు మాత్రమే నీచమైన ఆత్మహత్య చర్యకు పాల్పడతారనీ నమ్ముతుంది. ఈ కథలో అభిప్రాయం పూర్తిగా రచయితదే)

[

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here