పచ్చని చెట్టు – ప్రతి ఒక్కరి బంధువు

0
14

[శ్రీ ఆరవేటి రాజకుమార్ రచించిన ‘పచ్చని చెట్టు – ప్రతి ఒక్కరి బంధువు’ అనే బాలగేయం పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]చి[/dropcap]న్నారి బాలలు – పొన్నారి పువ్వులు
నా కథ చెబుతాను – చక్కగా వినుము.

పచ్చని చెట్టును నేను – ప్రతి ఒక్కరి బంధువును
పండ్లు మీకిచ్చి నేను – పరోపకారం నేర్పెదను.

మాడే ఎండలో నేనుంటూ – మంచిగ నీడను ఇచ్చెదను.
చల్లని గాలిని అందిస్తూ – చక్కగ సేదను తీర్చేదను.

పక్షుల గూడును నేనిస్తూ – పసి పాపల్లే చూసెదను
అమ్మగ వలెను మురిపిస్తూ – కమ్మగ నిద్దుర బుచ్చెదను.

గుడిసెకి పై కప్పు నై – రక్షణగా నిలుస్తాను.
ఇంటికి తలుపు నై – కాపలాగా ఉంటాను.

రైతన్నకు నాగలినై – చేదోడుగా ఉండెదను.
పసిపిల్లల ఊయలనై – సిరినవ్వుల తడిసెదను.

కుమ్మరికి నేనేమో చక్రమై ఉంటాను
నావయ్యకు నేనేమో నావనై పోతాను.

అవ్వకి నేనేమో ఊతనై ఉంటాను
కృష్ణయ్యకు నేనేమో మురళినై పోతాను.

మరణించిన మనిషికి – తోడునై వుంటాను.
కాయాన్ని కాల్చేటి – చితి కట్టినౌతాను.

పచ్చని చెట్టును నేను – ప్రతి ఒక్కరి బంధువును.
మీ అందరితో వుంటాను – చివరికి మీతోనే వస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here