[box type=’note’ fontsize=’16’] పర్యటన వినోదాత్మకము, విజ్ఞానాత్మకమూ మాత్రమే కాదు మనిషి తనలోకి తాను చూసుకుంటూ తనని తాను అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. సీనియర్ జర్నలిస్టు జొన్నలగడ్డ శ్యామల అమెరికా పర్యటనానుభవాల సమాహారం ‘పసిఫిక్ పదనిసలు’ ఈ సత్యాన్ని నిరూపిస్తుంది. [/box]
“అమ్మా! థ్యాంక్స్ గివింగ్ టైమ్‌లో మనం శాన్‌ఫ్రాన్సిస్కోకు వెస్ట్ కోస్ట్ అంతా కవర్ చేస్తూ రోడ్ ట్రిప్ వెళ్దాం” అని మా అమ్మాయి దీప చెప్పినప్పటి నుంచి నా మనసు రెక్కలు విప్పి గాల్లో విహరించసాగింది. నిజానికి ‘రోడ్ ట్రిప్’ అనే మాట కూడా నాకు కొత్తే. దాని అర్థం కార్లో ప్రయాణిస్తూ కొత్త ప్రదేశాలు చూడటమని తెలిసింది. అందుకోసం దీప చాలా హోమ్‌వర్క్ చేసింది. ఆరు రోజుల ట్రిప్‌లో ఏ ఏ దారులలో ప్రయాణిస్తూ వెళ్ళాలి, ఎక్కడ ఏమేం చూడాలి, మజిలీలు ఎక్కడ వంటివన్నీ పక్కాగా ప్లాన్ చేసింది.
ఆ రోజు (నవంబర్ 21, 2017) ఉదయం శాండియాగోలో మా నివాసం నుంచి ఏడున్నరకు మా ప్రయాణం ప్రారంభించాం. అదృష్టవశాత్తు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా తొమ్మిదిన్నరకల్లా ‘న్యూ పోర్ట్’ చేరగలిగాం.
అక్కడ పసిఫిక్ మహాసముద్రంలో ‘వేల్ వాచింగ్’ (తిమింగలాను తిలకించడం) మా పర్యటనలో తొలి అంశం. అప్పటికే అక్కడ జన సందోహం బాగా ఉంది. అయితే అనుకున్నదొకటి… అయినదొకటిలాగా మేం వేల్స్‌కి బదులు డాల్ఫిన్లను మాత్రమే చూడగలిగాం. కారణం అది ‘వేల్స్ సీజన్’ కాకపోవడమే. అయితేనేం రెండున్నర గంటల బోటు ప్రయాణం ఎంతో ఆనందాన్నిచ్చింది. పెద్ద పెద్ద డాల్ఫిన్లు సడెన్‌గా పైకి వచ్చి, మళ్ళీ వేగంగా నీళ్ళలోకి ఒక డైవర్ మాదిరిగా దూకినట్టుగా మాయమవటం భలేగా అనిపించింది. వాటి ఆహారం – అదే చేపలు ఉన్న చోట బాగా సందడి చేస్తున్నాయ్. అది సహజమే కదా.
మరో వైపు పెలికాన్లు, సీగల్స్ విహారం కనువిందు చేసింది. అక్కడ పదో పరకో బోట్లు కాదు, వందకు పైగా రకరకాల బోట్లు. మహాసముద్రం అందం ‘యమహా’గా అదరహో అనిపిస్తోంది. మనవాళ్ళు ‘పాల సముద్రం’ అని చెప్పటం నాకు ఆ సమయంలో ఆ నీటిని చూస్తే స్ఫురించింది. నీళ్ళని ఎవరో మథించినట్టు, తెల్లని పాలలా, నురగల తరగలతో ఉవ్వెత్తున చిందులేస్తున్నాయ్. కొన్ని చోట్ల పక్కనున్న కొండరాళ్ళను తమ పాల నురగల వంటి నీటితో అభిషేకిస్తూ ముచ్చట్లు చెబుతున్నాయ్.
నిజానికి సముద్రానికి ఉప్పునీళ్ళు కదా. పాల సముద్రం అంటే? అవన్నీ పాలే అని అనుకోవాలేమో. కేవలం సముద్రం అనే పదాన్ని అక్కడ పరిమాణం దృష్ట్యానే అన్వయించుకోవాలేమో. లేకపోతే ఉప్పుతో పాలు వికటించవూ? నా ఆలోచన దారి మళ్ళుతోందనుకుని మళ్ళీ పసిఫిక్ కేసి చూపు సారించాను. సూర్యకాంతి పడి అక్కడక్కడా నీటి తళతళలు సముద్రానికి కొత్త కళను చేకూరుస్తున్నాయి. సముద్రం నీలంగా ఉంటుందని సాధారణంగా అంటూంటాం కానీ పసిఫిక్‌ని చూస్తే సముద్రానివి సప్తవర్ణాలు అనిపిస్తోంది. కొన్ని చోట్ల తెల్లగా, కొన్నిచోట్ల లేత ఆకుపచ్చగా, ఒకసారి నీల మోహనంగా… అందులోనూ రకరకాల నీలపు ఛాయలతో, కొన్ని చోట్ల గోధుమ వర్ణంలో… ఇలా ఎన్నెన్నో వర్ణాలు.
నా చూపు నింగినంటింది. ఆకాశం తన అందానికి హద్దులే లేవంటోంది. అది నిరంతరం మారిపోయే ప్రాకృతిక వర్ణ చిత్రం. చిత్ర, విచిత్ర వర్ణాలతో, ఆకృతులతో ఏ చిత్రకారుడి కుంచెకూ అందనన్నంత ధీమాతో కనురెప్పపాటులో తన తీరుతెన్నులని మార్చేస్తోంది. దూరాన సముద్రుడు నింగి హద్దులన్నీ చెరిపేసి కలుసుకుంటున్న మనోహర దృశ్యం మనసు అరలలో తిష్టవేసింది. ఇటుగా చూస్తే మహాసముద్రం ఒడ్డున ఇళ్ళు… రకరకాల ఇళ్ళు… ఎంతో పొందిగ్గా, ఎంతో అందంగా. ఎంత అదృష్టవంతులో ఆ ఇళ్ళలో నివసించేవారు! పడిలేస్తూ, అలసట అన్నదే లేకుండా తీరాన్ని తాకాలని సముద్రుడు చేసే నిరంతర యత్నం చూస్తూ వాళ్ళు ఎంతటి స్ఫూర్తి పొందుతారో ఆ ఇంటి ఆవరణలో కూర్చుని సముద్రాన్ని తిలకించేందుకు వీలుగా ఫర్నిచర్… కొన్ని ఇళ్ళకయితే సముద్రాన్ని చేరడానికి నేరుగా మెట్లు. కొందరు చేపలు పట్టే సరదాలో ఉన్నారు. బోటు పైన కొద్ది సేపు నిలుచుని, కొద్ది సేపు కూర్చుని సముద్రాన్ని చూస్తుంటే మనసులో భావనల అలలకు అంతమే లేదు. ఓ చోట జంట డాల్ఫిన్లు మురిపించాయి. అవి రిసో డాల్ఫిన్లని చెప్పారు. కామన్ డాల్ఫిన్లు, రిసో డాల్ఫిన్లు వేరు వేరని బోటు డ్రైవరు వివరించాడు. బోట్లు ఇలా తిరుగుతుంటే ఆ డాల్ఫిన్లు ఎలా తప్పుకు తిరుగుతాయో అనిపించింది. వివిధ దేశాలవారు వారి వేషభాషల్లో తారసపడ్డారు. డాల్ఫిన్లు అక్కడ ఏయే పాయింట్లలో ఉండేదీ డ్రైవర్‌కు చిరపరిచితం కాబట్టి ఆయా చోట్ల వచ్చే ముందరే బోటు ప్రయాణీకులను అలెర్ట్ చేసి అవి బోటుకు ఏ దిక్కులో ఉన్నదీ సూచిస్తూ, ఆ పాయింట్ల వద్ద బోటును నెమ్మదిగా నడుపుతూ అందరూ వాటిని చూసే అవకాశం కల్పిస్తున్నాడు. వైవిధ్య జలచారాలకు ఆలవాలం ఈ మహాంబుధి. డాల్ఫిన్లకు దగ్గరగా, అదీ వాటి నెలవులో ఎంతో సహజంగా తిరుగాడుతుండగా చూడడం ఓ ప్రత్యేకానుభూతినిచ్చింది.
అక్కడి నుంచి మా ప్రయాణం ‘మారో బే’కు మొదలయింది. అదంతా అడవి మార్గం. ‘లోస్ పాద్రేస్ నేషనల్ ఫారెస్ట్’ అది. ‘లోస్ పాద్రేస్’ (స్పానిష్ పదం) అంటే ‘తల్లిదండ్రులు’ అని అర్థమట. ఆదిమానవుడి తొట్టతొలి ఆవాసాలైన అడవులను ‘తల్లిదండ్రులు’గా సంభావించుకోడం ఎంతో సముచితం అనిపించింది. దారంతా మెలికలు, మలుపులు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యాలి. డ్రైవ్ చేసేవారికి దారిలోని ప్రకృతిని వీక్షించడం సాధ్యపడదు. డ్రైవ్ చేసేది మా అమ్మాయి కాబట్టి నేను మాత్రం హాయిగా ప్రకృతికే కళ్ళప్పగించాను. ఎటు చూసినా అనంత సౌందర్యం. ఓ వైపు కొండలు. ఉండి ఉండి… కనిపించి పలకరించే పసిఫిక్. ఇక రకరకాల ఆకృతుల తరులు, విరులు, కాయలు… అబ్బురపరిచే వృక్షసంపద. రకరకాల చెట్లు, మొక్కలు, పచ్చికలు తీరుతీరు దుస్తుల్లా అమరిన కొండలు అందంలోనూ ‘కొండంత’ అనిపించాయి. కొన్ని కొండలు కోనలు శిఖరాల్లా ఉంటే మరి కొన్నిటి ఉపరితలాలు బోర్లించిన పెద్ద పాత్రలను తలపించాయి. ఆకాశం… అడవి… సముద్రం… కొండలు.. ఓహ్! సూర్యకిరణాల తాకిడిని బట్టి మిగిలినవాటి రంగులు మారుతూ కొంత్తందాలు సంతరించుకుంటున్నాయి. వెలుగునీడల హెచ్చుతగ్గుల ప్రభావం అసాధారణమైనది.
నాలుగున్నర నుంచే సూర్యుడు పడమటింటికి వడిగా పయనమవుతున్నాడు. మసకచీకటి మొదలైంది. అడవి అందాలకు ఉప్పొంగిన నా మనసు నా చేత ‘అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం…’, ‘ఆకులో ఆకునై’ వంటి పాటల్ని పాడించింది. మా అమ్మాయి దీప పాపం గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ అలసిపోతోంది. నాకు డ్రైవింగ్‌లో ఓనమాలు కూడా రావు. అయినా ఇండియాలో డ్రైవింగ్ చేసే వాళ్ళయినా ఇక్కడ డ్రైవింగ్ కుదిరే పని కాదు. కారణం ఇక్కడి డ్రైవింగ్ వేరు, పైగా లైసెన్స్ ఎక్కడ ఉంటుంది?
మధ్యాహ్నం తిన్న చపాతీలు అరిగిపోయాయి. మధ్యలో పళ్ళు, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. టైమ్ ఐదున్నరే అయినా ఏడు దాటినట్లుంది చీకటి. ఈ రాత్రికి బస ‘మారో బే’ లోని రిడ్జ్ వే స్ట్రీట్‌లో వున్న ‘ఛక్ అండ్ రస్టీ’ అతిథిగృహం (ఎయిర్‌బిఎన్‍బి)లో. జిపిఎస్ మార్గదర్శనంతో రిడ్జ్ వే వెళ్ళాం. కానీ కాస్తంత కన్‌ఫ్యూజన్. 766 నెం. ఇల్లు కనబడలేదు. దీప ఛక్ గారికి ఫోన్ చేసింది. రెస్పాన్స్ లేకపోవడంతో టెక్స్ట్ పంపింది. ఇండియాలో మనం మెసేజ్ అంటాం, ఇక్కడ టెక్స్ట్ అంటున్నారు. అంతలో దీపకే స్ఫురించి ‘మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళలనుకుంటా’ అంటూ కారును ముందుకు పోనిచ్చింది. ఇంతలో ఓ వ్యక్తి ఎదురురావడంతో కారు స్లో చేసింది. ఆయనంతట ఆయనే ‘ఫలానా ఇల్లు కోసమా? కొంచెం ముందుకు వెళ్ళి ఎడమ పక్కకు తిరగండి’ అని చెప్పాడు. అలా మా బసను చేరుకున్నాం. వెళ్ళగానే ఓ డెబ్భై ఏళ్ల పెద్దమనిషి ఎంతో వినయంగా ఆదరంగా స్వాగతం పలికాడు. ఆయనే మిస్టర్ ఛక్. మా వసతిని చూపించి, ఏవి ఎక్కడ ఉన్నాయో వివరించాడు. లోపలకు వెళ్ళగానే కారిడార్, ఎడమవైపు రెస్ట్ రూమ్… కారిడార్ అవతల ఓ పెద్ద గది… ఓ డబుల్ కాట్, ఓ వైపు టేబుల్‌పై కాఫీమేకర్, మైక్రోవేవ్, స్నాక్స్, రకరకాల కాఫీ పాడ్స్, క్రీమ్స్, టీ పాకెట్లు, గ్లాసులు, పేపర్ ప్లేట్లు అన్నీ ఎంతో నీట్‌గా, అందంగా. మరో వైపు మారో బే కల్చర్‌కు, టూరిజమ్‌కు సంబంధించిన మేగజైన్లు, గోడలకు చక్కటి ప్రకృతి దృశ్యాల ఫ్రేమ్‍లు, సరంజామా పెట్టుకోవడానికి కప్‌బోర్డ్‌లు వగైరా… వైఫై పాస్‌వర్డ్ వివరం అక్కడే రాసి ఉందని చూపించాడు ఛక్. మేం మర్నాడు ఉదయాన్నే బయల్దేరుతామని చెప్పాం. ఆయన, తాను ఎనిమిదిన్నరకల్లా భార్యతో కలసి, కుక్కని తీసుకుని వాకింగ్‌కు వెళతాననీ, వెళ్ళేముందు తనకి చెప్పాలని ఏమీ లేదని, మర్యాదపూర్వకంగా కలవాలనుకుంటే ఆ టైము లోపల కలవవచ్చని, తమ వసతి గురించి నాలుగు మంచి మాటలు రాయదలిస్తే గోడకున్న ఛార్ట్ మీద రాయవచ్చని చెప్పి, గుడ్‌నైట్ అంటూ పైనున్న తన నివాసానికి వెళ్ళిపోయాడు.
మేం రిఫ్రెష్ అయి, మా చపాతీలు తిని నిద్రకు ఉపక్రమించాం. అలసి ఉన్నాం… పైగా అతి మెత్తని పక్క, వెచ్చటి రజాయిలు… వెంటనే నిద్రపట్టేసింది.
(సశేషం)
-జె. శ్యామల