పసిఫిక్ పదనిసలు – 3

    1
    5

    [box type=’note’ fontsize=’16’] పర్యటన వినోదాత్మకము, విజ్ఞానాత్మకమూ మాత్రమే కాదు మనిషి తనలోకి తాను చూసుకుంటూ తనని తాను అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. సీనియర్ జర్నలిస్టు జొన్నలగడ్డ శ్యామల అమెరికా పర్యటనానుభవాల సమాహారం ‘పసిఫిక్ పదనిసలు’ ఈ సత్యాన్ని నిరూపిస్తుంది. [/box]

    ఆ ఇంటామె పేరు ‘మరీ’! దీప ఆమెకు ఫోన్ చేసి మేం వచ్చేస్తున్నామని చెప్పింది. ఆమె తాను ఇంట్లోనే ఉన్నానంటూ దారి కూడా వివరించింది. ఇంకేముంది కారులో చలో…! అతిథిగృహాం ముందు కారు దిగాం. పాత కాలపు ఇల్లు. అయినా బాగుంది. కారు బయటే పార్క్ చేసుకోవచ్చని చెప్పింది. లోపలకు వెళ్ళగానే ‘మరీ’ ఎదురువచ్చింది. ఆమె వయసు యాభై ఉండొచ్చు. అతిథుల గదులు పైన ఉన్నాయాని, షూస్ కిందే విప్పేసి వెళ్ళాలని చెప్పింది. అంతే కాదు, తినే వ్యవహారమంతా తన డైనింగ్ హాల్లోనే చేయాలనీ, రూమ్‌లో తినవద్దనీ చెప్పింది. రూమ్ పాడుచేస్తారని అమె భయం కాబోలు. సరేనన్నాం. మా లగేజీ చూసి ఇన్ని ఎందుకంది. మాది ఆరు రోజుల ట్రిప్ అని, అవసరమనుకున్నవన్నీ తెచ్చుకున్నామని చెప్పాం. ఆమె పెరట్లో ఉన్న పెద్ద వృక్షం, దాని చుట్టూ చప్టా నన్ను ఆకర్షించాయి. చాలా బాగుందన్నాను ప్రశంసాపూర్వకంగా. దానికామె దాని వల్ల చిక్కులొచ్చాయని, కొమ్మలు విరిగి ఇంటి మీద పడితే కష్టమని, చాలా వరకు కొట్టించానని, అందుకు పెద్ద మొత్తంలో డాలర్లు ఖర్చయ్యాయని వాపోయింది. తమ ఇంట్లో బస చేసేందుకు ఎన్నో దేశాల వాళ్ళూ వస్తూంటారని, అందులో ఇండియన్స్ కూడా ఉన్నారని చెప్పి, వారి ద్వారా ఇండియాలో మహిళలు ధరించే భారీ చీరెలు, నగలు, బిందీలు, ఐదు రోజులు గ్రాండ్‌గా సాగే పెళ్ళిళ్ళ గురించి తెలుసుకున్నాననీ, ఇండియాలో ఆడవాళ్ళంతా భర్తలపైనే ఆధారపడి బతుకుతారనీ… ఇలా తాను విన్నవేవో చెప్పింది. ఆమెతో వాదించడం ఇష్టం లేక నేను మౌనంగా ఉండిపోయాను.

    తన భర్త పాంక్రియాస్ క్యాన్సర్‌తో పోయాడని, ఉండి బాధ భరించే కన్నా పోవడమే మేలని చాలా నిబ్బరంగా చెప్పింది. కొడుకు త్వరలో మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడని, తండ్రి పెళ్ళికి హాజరవడానికి తన మనవరాలు మరో ఊర్నుంచి వస్తోందని తమ గురించి చెప్పింది. తన ఇంటి వ్యవహారమంతా కూతురే చూసి పెడుతుందనీ, తనకు ఈ టెక్నాలజీ అంతగా తెలియదని చెప్పింది. మేం మా రూమ్‌కి వెళ్తామని పైకి దారి తీశాం. రూమ్ పరవాలేదు, బాగానే ఉంది. తోచకపోతే కిటికీ నుంచి చూస్తే వీధి సందడంతా కనిపిస్తుంది. మేం కాసేపు కబుర్లు చెప్పుకుని, స్నానాలు చేసి సేదతీరాం. ఎనిమిదింటికి కిందకు వెళ్ళి మెడ్రాస్ కేఫ్ నుంచి తెచ్చుకున్న ఊతప్పాలను మైక్రోవేవ్‌లో వేడి చేసుకుని తిన్నాం. ‘మరీ’ పైన రెండో రూమ్‍లోకి వచ్చే అతిథుల కోసం ఎదురుచూస్తోంది. మేం సెలవు తీసుకుని పైకి వెళ్ళిపోయాం. రెండో రూమ్ అతిథులు ఆ తర్వాత వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళారు.

    మేం మర్నాడు త్వరగా వెళ్ళాలనుకున్నాం. కానీ అంతపొందున్నే వెళ్తే షాపులేవీ తెరవరని ‘మరీ’ అంది. అందుకే కొద్దిగా ఆలస్యంగా లేచాం. తయారై బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళాం. అంతలో రెండో రూమ్‌లోని జంట కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చింది. అతను కమెడియన్ కాగా, ఆ అమ్మాయి నెట్‌ఫ్లిక్స్‌లో పనిచేస్తోంది. వాళ్ళు లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చారు. చక్కని జంట. లోకాభిరామాయణం చెప్పుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ ముగించాం. ఆ తర్వాత మా లగేజి అంతా కిందకు దింపుకుని కారు ట్రంక్‌లోకి చేర్చాం. ‘మరీ’ దగ్గర సెలవు తీసుకున్నాం. ఫ్రెండ్స్‌కు తమ గెస్ట్‌హౌస్‌ని రికమెండ్ చేయమని దీపని కోరింది ‘మరీ’.
    అలా అక్కడ్నించి బయలుదేరి, కారుకి ఇంధనం తాగించి, శాన్‌ ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్‌కు వెళ్ళాం. కేబుల్ కారులో ప్రయాణించి సిటీ చూడాలన్నది మా కోరిక. అందుకే మా కారుని పార్క్ చేయటానికి మిషన్ స్ట్రీట్‌లో ఉన్న ‘ఫిప్త్ అండ్ మిషన్ పార్కింగ్ గారేజ్’కు వెళ్ళాం. కారుని అక్కడే వదిలి బయటకు వచ్చి కొంత దూరం నడిచాం. అన్నీ బహుళ అంతస్థుల భవనాలు. వైవిధ్యభరితమైన డిజైన్లు. అంతా జనమే జనం. సందడే సందడి.

    మార్కెట్ స్ట్రీట్‌ను దాటితే పవెల్ స్ట్రీట్ దర్శనమిచ్చింది. కేబుల్ కార్ల స్టార్టింగ్ పాయింట్ అక్కడే. జనం ఓ పెద్ద రౌండ్‌గా క్యూలో నిలబడి ఉన్నారు. మేము కూడా క్యూలో చేరాం. పిల్లల బొమ్మలు, బూరలు అమ్మేవాళ్ళు, టోపీలు అమ్మేవాళ్ళు… ఇలా ఎన్నెన్నో. మరోవైపు డ్రమ్స్ కొడుతూ అడుక్కునే బిచ్చగాడు.

    అంతలో కేబుల్ కార్ వచ్చింది. కేబుల్ కారును రౌండ్ తిప్పే విధానం చూడడానికి సరదగా ఉంటుంది. నేలపైన చెక్కతో ఏర్పాటు చేసిన పెద్ద రౌండు. దాని చుట్టూ గాడి. ఇద్దరు మనుషులు పనిముట్లతో తమ బలంతో దాని రౌండ్ తిప్పి ఆపారు. ఇంకా మనుషులే ఆ పని చేయడానికి కారణం ఆధునిక యాంత్రిక విధానం తెలియక కాదు, పాత పద్ధతిని ప్రత్యేకతగా చిరకాలం నిలబెట్టాలన్నదే వారి ఉద్దేశం.

    అలా అరడజన్ కేబుల్ కార్లు వచ్చి వెళ్ళాక, మా వంతు వచ్చింది. అందులో మేమే ముందర ఉండడంతో బయట వైపుగా ఉన్న సీట్లలో కూర్చునే అదృష్టం కలిగింది. అక్కడ కూర్చుని శాన్‌ ఫ్రాన్సిస్కో వీధుల్ని నేరుగా వీక్షించడం ఎంతో బాగుంది. కేబుల్ కార్ హారన్ కూడా ప్రత్యేకమే. అదేమంటే గంటల శబ్దం. నడిపే పద్ధతి కూడా ఆసక్తికరమే. డ్రైవర్ నిలుచునే దాన్ని హ్యాండిల్ చేస్తూంటాడు. ఇక్కడ అంతా కొండ ప్రాంతం కావడంతో వీధులన్నీ కూడా ఎత్తు నుంచి పల్లంలోకి ఉన్నాయి. కేబుల్ కార్ అంత ఎత్తు నుంచి కిందకి వెళ్ళటం థ్రిల్లింగ్‌గా అనిపించింది. అలాగే కింద నుంచి పైకి వెళ్ళటం కూడా థ్రిల్లింగే. అయితే మామూలుగా కారు నడిపేవారు ఈ ఎత్తుపల్లాల రోడ్లలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడపాల్సి ఉంటుంది. కొండల ఎగుడుదిగుళ్ళలో అసంఖ్యాక బహుళ అంతస్తుల భవనాలు, చిత్రవిచిత్రమైన డిజైన్లతో కొలువుతీరి ఉన్నాయి. దూరం నుంచి చూస్తే అవన్నీ బొమ్మలల్లే ఉన్నాయి. కేబుల్ కార్‌కు సిగ్నల్స్ వద్ద ప్రత్యేక సిగ్నల్ ఉంది. అలా కారులో ‘మేసన్’ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ‘ఫిషర్‌మ్యాన్స్ వార్ఫ్’ చేరుకున్నాం.

    అక్కడ అతి పెద్ద క్రిస్‌మస్ ట్రీని చక్కగా అలంకరించి ఉంచారు. అక్కడ అందరూ ఫొటోలు దిగుతున్నారు. మేం కూడా ఓ రెండు ఫొటోలు తీసుకున్నాం. అలా ముందు నడుస్తుంటే పాప్ మ్యూజిక్ పాడే వాళ్ళూ, మ్యాజిక్ చేసే వాళ్ళు, చైనా వస్తు సముదాయ షాపులు అంతా ఒకటే కోలాహలం.

    ఒక చోట హరేరామ హరేకృష్ణ వాళ్ళు వచ్చే అందరినీ ఆపి, ప్రసాదం అందించి, చక్కటి ఆంగ్ల భగవద్గీత గ్రంథాన్ని అందించి, తోచిన విరాళం ఇవ్వమని అడుగుతున్నారు. మేం కూడా పుస్తకాలందుకున్నాం. దీప తోచిన మొత్తాన్ని డొనేషన్ కార్డుతో పే చేసింది. వివిధ దేశాల జనాలు, రకరకాల వేషభాషలు. పిల్లలు. అన్నీ షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్ళు… సందడే సందడి. మేం ‘పియర్ 39’ దగ్గరకు వెళ్ళాం. అక్కడ మళ్ళీ పసిఫిక్ కనువిందు చేసింది. ఓ అరగంట బోటు షికారు. అక్కడే ఓ చోట ఓ పెద్ద గట్టుపై సీ లయన్స్ గుంపుగా చేరి, ఒకదానితో ఒకటి కలయబడుతూ, ఆడుతూ రకరకాల విన్యాసాలతో పాటు వింత ధ్వనులు చేస్తున్నాయ్. సీ లయన్స్‌ని ప్రత్యక్షంగా చూడడం నాకు అదే మొదటిసారి.

    ఆ చుట్టుపక్కల అలా అలా తిరిగి, వెంట తెచ్చుకున్నవి తిన్నాం. మళ్ళీ అక్కడి కేబుల్ కార్ పాయింట్ వద్దనికి నడిచి, దాని గురించి అడిగాం. క్యూలో ఎప్పుడు నిలుచున్నా గంటన్నర వెయిట్ చేయక తప్పదని చెప్పాడు. సరే ఇంకొద్ది సేపు గడవపచ్చని పక్కనున్న చక్కటి పార్క్‌లో ఖాళీ బెంచి చూసుకుని భైఠాయించాం. అటువైపుగా ప్రఖ్యాతి చెందిన గిరాడెల్లీ స్క్వేర్ ఉందని చూపించింది దీప. ప్రస్తుత కాలంలో నిత్యం, అనుక్షణం సమాచార అన్వేషణకు ప్రతి ఒక్కరూ చూసేది గూగుల్. ఆ గూగుల్ కంపెనీ కేంద్ర స్థానం కూడా శాన్ ఫ్రాన్సిస్కో. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఆలవాలం శాన్ ఫ్రాన్సిస్కో. ఇలా అనుకుంటూ ఉండగానే కేబుల్ కార్ పాయింట్ వద్ద టికెట్లకు జనం నిలుచుని ఉండడం గమనించాం. వెంటనే లేచి అటువెళ్ళాం. దీప టికెట్ క్యూలో నిలుచుంటే నేను కేబుల్ కార్ ఎక్కే క్యూలో నిలుచున్నాను. అక్కడి పద్ధతి అది. అది కొంతలో కొంత నయం అనిపించింది. క్రమంగా క్యూ చాంతాడంత పెరిగింది. కేబుల్ కార్లు వచ్చాయి కానీ, అక్కడి నుంచి బయలుదేరడం లేదు. బహుశా అందుకు ఇంకా టైమ్ ఉందేమో. దీప టికెట్లు తెచ్చింది. క్యూలో మా ముందు ఒక అమెరికన్ కుటుంబం ఉంది, వెనక ఇండియన్లే. మహారాష్ట్ర వారిలా కనిపించారు. వాళ్ళు పిల్లలతో ఉన్నారు. కేబుల్ కార్లు బయలుదేరడానికి సిద్ధం కావడంతో క్యూ ముందుకు కదలసాగింది. ఏం కారణమో కానీ మా ముందున్న అమెరికన్ కుటుంబం కేబుల్ కార్ ఎక్కకుండా వెనుదిరగాలనుకున్నారు. టికెట్లు వృథా అవుతాయా అని అడిగారు. అందుకు అక్కడున్న సిబ్బంది టికెట్లను మర్నాడు కూడా వాడుకోవచ్చని చెప్పటంతో వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి వెసులుబాటు ఉంటుందని అలా మాకు తెలిసింది. ఈసారి కూడా కేబుల్ కారులో బైటకు ఉండే సీట్లలో కూర్చునే ఛాన్స్ మాకు వచ్చింది. కానీ మా వెనక ఉన్న మహారాష్ట్ర మాత పిల్లల్ని ముందుకు నెట్టింది. అక్రమమైనా చేసేది లేక కారులోపలికి వెళ్ళి కూర్చున్నాం.

    కేబుల్ కార్ ఎత్తుపై నుంచి కిందకి దిగుతుంటే కారులోని వారంతా ‘ఓ’ అని అరిచారు ఆనందంగా. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు మిగల్లేదు. కొద్ది దూరం వెళ్ళగానే వాటి రూట్‌లో ఏం ప్రాబ్లమ్ వచ్చిందో కాని కేబుల్ కార్‌ని నిలిపివేశారు. వేరే షటిల్ వస్తుందని, అందులో అందరినీ ఎక్కిస్తామనీ చెప్పారు. అందరూ ఉసూరుమన్నారు. పైగా ఆ షటిల్ తమ గమ్యస్థానాలకు కరెక్టుగా తీసుకెళ్తుందా అని ఎన్నో సందేహాలు. షటిల్ రాగానే అందరం ఎక్కాం. ట్రాఫిక్ జామ్ కారణంగా మెల్లగా వెళుతోంది. అయితే హైదరాబాద్ ట్రాఫిక్‌తో పోలిస్తే అది తక్కువే. ఎలాగైతేనేం మేం మిషన్ స్ట్రీట్‌లో దిగాం. గరాజ్‌కు వెళ్ళాం. ఇప్పుడు అక్కడ డబ్బు చెల్లించి కారు తీసుకెళ్ళాలి. డబ్బు చెల్లించడానికి అక్కడ మూడు మెషీన్లు ఉన్నాయి. ఒకదానిపై డబ్బు చెల్లించిన పావుగంట లోపల కారు బయటకు తీసుకెళ్ళిపోవాలని రాసి ఉంది. మరో దానిపై అయిదు నిమిషాల్లోనే తీసుకెళ్ళాలని రాసి ఉంది. ఎందుకైనా మంచిదని పావుగంట దాంట్లోనే కార్డు స్వైప్ చేసి రిసీట్ అందుకున్నాం. గరాజ్‌కు వెళ్ళి కారు తీసుకుని బయల్దేరాం. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూసి వెళ్ళాలని మా ప్రోగ్రామ్. అయితే మేం అక్కడకు చేరుకునేసరికే చీకట్లు కమ్మాయి. విస్తా పాయింట్‌లో కారు పార్క్ చేసి ఇతర సందర్శకులను ఫాలో అవుతూ వెళ్ళాం. కానీ బ్రిడ్జ్ పైకి వెళ్ళేందుకు సమయం మించిపోయిందన్నారు. కొద్ది దూరం నుంచే గోల్డెన్ గేట్‌ను చూడగలిగాం. లైట్ల వెలుగులో ఎంతో అందంగా ఉంది. కింద పసిఫిక్ నీటిపై వెలుగులు సరికొత్త అందాలను ఆవిష్కరిస్తున్నాయి. దీప ఫొటోలు తీసింది. కాని ఇంత దూరం వచ్చి ఆ బ్రిడ్జ్ మీద నడవకుండా, తాకకుండా… ఊహూ… నాకు తీవ్ర అసంతృప్తిగా అనిపించింది. అది గమనించి దీప “రేపు పగటి వేళ వద్దాం లే” అంది. ‘సరే’ అన్నాను.

    ఆ తర్వాత కారు తీసుకుని ‘నొవాటో’ ప్రాంతంలో ఉన్న మా అతిథి గృహానికి వెళ్ళాం. పెద్దగా కష్టపడకుండానే చేరుకోగలిగాం. ఫోన్ చేశాం. ఆ గృహస్థు బయటకు వచ్చాడు. ఆయన పేరు టోనీ. మనిషి చాలా సౌమ్యంగా ఉన్నాడు. మాట కూడా సుతిమెత్తగా ఉంది. ఇల్లు చాలా బాగుంది. వృత్తి రీత్యా ఆయన ఇంటీరియర్ డిజైనర్. అందువల్ల ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దాడు. ఇంటిని చూపిస్తూ వివరించాడు. పెద్ద హాలు, మధ్యలో సోఫాలు, అవి దాటి ఎడమకు వెళితే విశాలమైన కిచెన్, డైనింగ్ టేబుల్… అన్నీ ఎంతో కళాత్మకంగా… పొందిగ్గా ఉన్నాయి. మేం మా మేథీ వడలను వేడి చేసుకుని తిని లేచాం. ఇంట్లో ప్రతి గదిని ఒక ప్రత్యేక థీమ్‌తో అలంకరించారు. మాకు ఇచ్చిన గది థీమ్ సముద్రం. గదికి లేత నీలం రంగు. గోడలకు సముద్ర సంబంధిత చిత్తరువులు, సముద్ర జీవుల ఫొటోలు ఉన్నాయి. రెస్ట్‌రూమ్‌ ఎంతో మాడ్రన్‌గా ఉంది. బాత్‌టబ్‌కు గ్లాస్ డోర్‌లు ఉన్నాయి, స్లైడింగ్‌వి. వాటిని సున్నితంగా తెరిచి, మూయాలని ముందే వివరించాడు టోనీ. రకరకాల షాంపూలు, బాడీక్రీములు, మాయిశ్చరైజర్లు, హెయిర్ కండీషనర్లు… ఇలా ఒకటేమిటి ఎన్నో వస్తువులు.
    టోనీ నివాసం బ్యాక్‌యార్డ్‌లో కాబోలు. హాల్లోని మధ్య తలుపుగుండా ఆయన వెళ్ళటం రావటం గమనించా. అటువైపు నుంచి ఓ ఆడగొంతు వినిపించింది కానీ దర్శనం మాత్రం కాలేదు. మేం షవర్ బాత్ చేసి, హాయిగా పడుకున్నాం.

    (ఇంకా ఉంది)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here