పసిఫిక్ పదనిసలు – 4

    1
    5

    [box type=’note’ fontsize=’16’] పర్యటన వినోదాత్మకము, విజ్ఞానాత్మకమూ మాత్రమే కాదు మనిషి తనలోకి తాను చూసుకుంటూ తనని తాను అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. సీనియర్ జర్నలిస్టు జొన్నలగడ్డ శ్యామల అమెరికా పర్యటనానుభవాల సమాహారం ‘పసిఫిక్ పదనిసలు‘ ఈ సత్యాన్ని నిరూపిస్తుంది. [/box]

    [dropcap]మ[/dropcap]ర్నాడు ఉదయం లేచి గబాగబా తయారయ్యాం. ఆ రోజు మా ప్రోగ్రామ్ ప్రకారం మేం ‘ముయర్ వుడ్స్’కు వెళ్ళాలి. అక్కడ పార్కింగ్ దొరకటం కష్టమని, కారును మరో చోట పార్క్ చేసి, షటిల్‌లో ‘ముయర్ వుడ్స్’కు వెళ్ళాలనుకున్నాం. అదే విషయం టోనీకి చెప్పాం. అయితే ఆయన త్వరగా వెళితే ‘ముయర్ వుడ్స్’లో పార్కింగ్ దొరుకుతుందని, లేకపోయినా దగ్గర్లోనే మరోచోట పార్కింగ్ ఏరియా ఉందని చెప్పాడు. టోనీకి ధన్యవాదాలు తెలియజేశాం. ఆయన మా అమ్మాయి రీసెర్చి వివరాలు తెలుసుకుని, మెచ్చుకుని అమ్మకు కొత్త ప్రదేశాలు చూపిస్తున్న దీప ఎంతో మంచి కుమార్తె అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

    మేం వీడ్కోలు తీసుకుని ముందుగా గ్యాస్ స్టేషన్‌కు వెళ్ళి, ఆ పని చూసుకుని ‘ముయర్ వుడ్స్’కు బయల్దేరాం. కొంత దూరం వెళ్ళాక ‘టెన్ కె రన్’ లాంటిదేదో జరుగుతోంది కాబోలు వయసు తేడా లేకుండా పిల్లా పెద్దా అందరూ పరుగుతీస్తున్నారు. వాళ్ళు రోడ్డు దాటి వెళ్ళడానికి వీలుగా పోలీసులు` నిలబడి ట్రాఫిక్‌ని ఆపి, వారు సురక్షితంగా వెళ్ళేందుకు తోడ్పడుతున్నారు. అలా రెండు మూడు చోట్ల కారు ఆపవలసి వచ్చింది. ‘ముయర్ వుడ్స్’ రానే వచ్చింది. అదృష్టం… పార్కింగ్ దొరికింది. టికెట్ తీసుకుందామని కౌంటర్ దగ్గరకు వెళితే… తొమ్మిది లోపల వచ్చేవారికి టికెట్ అవసరం లేదని రాసి వుంది. ఇదేదో బాగుందని లోపలకు నడిచాం.

    అదొక అందాల అడవి. మధ్యలో నడక దారులు. ఆకాశాన్నంటే నిలువెత్తు మహావృక్షాలు.  ‘ముయర్ వుడ్స్’ను నేషనల్ మాన్యుమెంట్‌గా గుర్తించారు. ప్రాచీన ‘కోస్ట్ రెడ్‌వుడ్ ఫారెస్ట్’లోని అవశేషమిది. 1800 ప్రాంతంలో ఈ రెడ్‌వుడ్స్ ఉత్తర కాలిఫోర్నియా తీరప్రాంత లోయలన్నింటినీ దుప్పటిలా కప్పేశాయి.  1905లో వ్యాపారవేత్త అయిన విలియం కెంట్ రెడ్‌వుడ్స్‌ని పరిరక్షించాలనే సద్భావనతో ఆ స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత శాశ్వత సంరక్షణ కోసం ప్రభుత్వానికి అప్పగించాడు. 1908లో ప్రభుత్వం, ‘ముయర్ వుడ్స్’ను నేషనల్ మాన్యుమెంట్‌గా గుర్తించడమే కాకుండా, కెంట్ కోరికపై దానికి పర్యావరణ పరిరక్షకుడైన జాన్ ముయర్ పేరు పెట్టారు. ‘ముయర్ వుడ్స్’ను నేషనల్ పార్క్ సర్వీస్ నిర్వహిస్తోంది. ఇక్కడ అన్ని వయసుల వృక్షాలు ఉన్నాయి. కొన్నిటి వయసు 600ల ఏళ్ళకు పైబడి ఉంది. కొన్ని జీవాన్ని కోల్పోయి, కొన్ని కూలి, విరిగి ఇలా రకరకాల దశల్లో ఉన్నాయి.

    ఇక్కడ తేమ వాతావరణం, తక్కువ వెలుతురు విభిన్నమైన మొక్కలకు, జంతువులకు అనుకూలంగా మారింది. నీడ కోరుకునే మొక్కల రకాలు చెట్ల కింద పచ్చని పడకలా అమరి ‘ఆకుల పానుపు’లా అనిపించాయి. బేలారెల్స్, పెద్ద పెద్ద ఆకులుండే మేపుల్స్ సూర్యకాంతివైపు ఒరిగాయి. అడవి పూల చెట్లయిన ట్రిలియమ్, క్లింటోనియా, రెడ్‌వుడ్ వైలెట్ అడవికి మరింత అందాన్నిస్తున్నాయి. నిశాచరాలైన మచ్చల గుడ్లగూబలు, గబ్బిలాలు, రకూన్లు ఉన్నాయి. జింకల సందడి సరేసరి. ఇవికాక, 50 రకాల పక్షిజాతులున్నాయి. ఉడుతలు, సొనొమ చిప్‌మంక్స్ విహారం మరో ఆకర్షణ. ఇక్కడి ఉడుతలు ఇండియా ఉడతలకంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక సెకోయా (రెడ్‌వుడ్) చెట్లు 380 అడుగుల వరకు పెరుగుతాయి, అయితే వీటి విత్తనం మాత్రం టమేటో విత్తనమంత ఉంటుందట.  ఇక్కడ అత్యధిక వయసున్న సెరోయా చెట్టు వయసు 1200 సంవత్సరాలు. కాలిఫోర్నియా బే లారెల్, మేపుల్, టానోక్ తర్వాతి స్థానం వహిస్తాయి.

              

             

    ‘ముయర్ వుడ్స్’లో పాదచారులకు మాత్రమే లోనికి అనుమతి. పిక్నిక్‌లకు, క్యాంపింగ్‌లకు అనుమతి ఇవ్వరు. అలాగే పెంపుడు జంతువులను కూడా అనుమతించరు. ఇక్కడ సందర్శకుల సౌకర్యార్థం ఓ కఫే ఉంది. అలాగే  ముయర్ వుడ్స్ గిఫ్ట్ షాప్ కూడా ఉంది. కావలసినవారు అక్కడ సావనీర్‍లను కొనుక్కోవచ్చు. ముయర్ వుడ్స్‌లో నడుచుకుంటూ వెళుతుంటే వేరే లోకంలో ఉన్నట్లే ఉంటుంది. కొన్ని చెట్లు పెద్ద పెద్ద మానులతో… దిగువన తొర్రలు ఓ గుహలాగా అమరటం ప్రత్యేక ఆకర్షణ. కొంతమంది అందులో నిలుచుని ఫొటోలు దిగుతున్నారు. కొన్ని చెట్ల కొమ్మలు పెద్ద పెద్దవిగా అడ్డంగా పెరిగి కొన్ని చోట్ల సహజ వంతెనల్లా రూపొందాయి. చిత్ర విచిత్రమైన పూలతో, లతలతో అలంకృతమైన వృక్షాల సోయగం మరో వైపు. ఒకచోట అత్యంత నిడుపాటి వృక్షాలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి పెరిగినట్లున్నాయి. వాటి మధ్య నుంచి సన్నని సూర్యకాంతి ఎంతో అద్భుతంగా అనిపించింది. మధ్యలో సెలయేటి సవ్వడులు చేస్తూ సాగే చిన్న చిన్న నీటి ప్రవాహాలు. చెట్ల వద్ద వాటి వయసు వివరాలు రాసి ఉంచారు. మృతమైన ఓ అతి పెద్ద వృక్షాన్ని చూసి, మానైనా ఆలస్యంగానైనా మరణం తప్పదు కదా అనిపించింది. అయితే అక్కడే ఓ విత్తనం మొలకెత్తి తల ఎగరవేయడమే సృష్టి విచిత్రం. ఎందరో సందర్శకులు ముందు, వెనుక… కొందరు చిన్న పిల్లలున్న వాళ్ళు పిల్లలబండిలో పడుకోబెట్టి దాన్ని నెట్టుకుంటూ నడుస్తున్నారు. అలసినవాళ్ళు అక్కడక్కడా ఉన్న రాతి బెంచీలపై కూర్చుని సేద దీరుతున్నారు. అక్కడ హైకింగ్ పాయింట్ కూడా ఉంది కాని మాకు ఇంకా తర్వాత ప్రోగ్రామ్ కూడా ఉండడంతో వెనుదిరిగాం. బయటకు వచ్చాక ఆవరణలోని బెంచీపై కూర్చుని స్నాక్స్ తిన్నాం. ఆపైన గిఫ్ట్ షాప్‌కు వెళ్ళి సెకోయా వృక్షం బొమ్మ, కింద  ‘ముయర్ వుడ్స్’ అని రాసిన చిన్న జ్ఞాపికలను కొనుక్కున్నాం.

    “నిన్న గోల్డెన్ గేట్ బ్రిడ్జి మీదకు వెళ్ళడం కుదరలేదు కదా, ఇప్పుడు వెళదాం” అంటూ కారు వైపు నడిచింది దీప. నేను అనుసరించాను. ఇంకేముంది కారులో ముందుకు… ముందుకు. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ రానే వచ్చింది. పార్కింగ్ కోసం చూస్తే ఎక్కడా ఖాళీ లేదు. మరో చోట, మరో చోట… ఊహూ… ఏమిటి చేయటం… పట్టువదలని విక్రమార్కిణిలా దీప మరింత దూరం నడపగా ‘బంకర్ రోడ్’ అనే చోట పార్కింగ్ ఏరియా కనిపించింది. అక్కడ ఓ మూడు కార్లు పార్క్ చేసి ఉన్నాయి. ‘ఆహా! ఏమి మన అదృష్టం’ అనుకుంటూ కారుని పార్క్ చేసి, వాటర్ బాటిల్ తీసుకుని ముందుకు నడిచాం. అక్కడ పాదచారులు లేరు. అది నడిచే ప్రదేశం కాదు కాబోలు. అయినా సాహసించి జిపిఎస్ సూచనల మేరకు ముందుకు నడిచాం. అప్పుడే రోడ్డు మీద ట్రాఫిక్ వారు దారిని దిగ్బంధం చేస్తూ కోన్‍ల వంటివి అడ్డం పెడుతున్నారు. కానీ మమ్మల్ని చూసి మేం రోడ్డుకు అటువైపు వెళ్ళాలని గ్రహించి ట్రాఫిక్ ఆపి, దారి చూపించారు. అలా అటువైపు చేరాం మెల్లగా నడిచి, నడిచి. చాలా దూరమే నడవాల్సి వచ్చింది. అయితే చిత్రం, ఇందాక మేం కారు పార్కింగ్ చేద్దామంటే ఖాళీయే లేని ఏరియాలో ఇప్పుడు ఒక్క కారూ లేదు.  ‘అరె, మనం అనవసరంగా తొందరపడి అంత దూరాన పార్క్ చేసి వచ్చామే’ అనుకున్నాం. ఆ తర్వాత తోటి సందర్శకులను అడుగుతూ బ్రిడ్జ్ మీదకు వెళ్ళే దారి వైపు వెళ్ళాం. ఆ సమయంలోనే అక్కడ నడిచేందుకు అవకాశం ఉంది. సాయంకాలమైపోతే బ్రిడ్జ్ మీదకి వెళ్ళనీయరు.

    బ్రిడ్జ్ మీద నడుస్తుంటే చిత్రమైన అనుభూతి. ఇన్నాళ్ళూ పుస్తకాల్లో, టీవీల్లో చూసి ఆనందించిన గోల్డెన్ గేట్ బ్రిడ్జిని స్వయంగా చూడగలగడంతో సంతోషం అతిశయించింది. టీవీలో గతంలో ‘ఫుల్‍హౌస్’ సీరియల్ ప్రారంభంలో ఈ బ్రిడ్జి తరచూ చూసేవాళ్ళం. అదంతా గుర్తుకొచ్చింది. 1937లో నిర్మాణం పూర్తయిన ఈ సస్పెన్షన్ బ్రిడ్జి శాన్ ఫ్రాన్సిస్కోను మెరిన్ కౌంటీతో కలుపుతుంది. 1937లో ఈ బ్రిడ్జి ప్రపంచంలో పొడవైన, ఎత్తయిన బ్రిడ్జిగా పేరొందింది. ప్రస్తుతం యు.ఎస్.లో ఎత్తయిన బ్రిడ్జిగా నిలిచింది. దీనికి ఇంటర్నేషనల్ రెడ్ కలర్‌ను పెయింట్ చేశారు. పొగమంచు దట్టంగా కమ్ముకున్న సమయాల్లో కూడా దూరాన ఉన్న నౌకల వారికి స్పష్టంగా కనపడాలనే ఆలోచనతో ఈ రంగును ఎంపిక చేశారట. దీని నిర్మాణ వ్యయం 35 మిలియన్ డాలర్లు. నిర్మాణ కాల వ్యవధి నాలుగేళ్ళు. ఇవన్నీ తలచుకుంటూ బ్రిడ్జి ఈ చివరి నుంచి ఆ చివరకు నడుస్తూ మధ్య మధ్య అక్కడి నుంచి పసిఫిక్ హొయలను తిలకిస్తూ చాలాసేపే గడిపాం. ఇక తిరిగి వద్దాం అనుకుని ముందుకు కదిలామో లేదో అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు అర్థమైంది. కొంత దూరం నడిచినా రోడ్డు దాటే మార్గం కనబడలేదు. అప్పుడర్థమైంది మాకు అక్కడి కారు పార్కింగ్ స్థలం ఎందుకు ఖాళీగా ఉందో. ఏం చేయాలో తెలియలేదు. కాస్త దూరంలో ఓ నలుగురు అమ్మాయిలు కనిపించారు. వారిలో ఒకరైనా స్థానికులు కాకపోతారా అనుకొని, దీప వారితో మా సమస్య వివరించింది. ఓ అమ్మాయి బదులిస్తూ, నడిచి వెళ్ళడం కుదరదని, ఊబర్‌లో వెళ్ళమంటూ సలహా ఇచ్చింది. మేం పెద్దగా ఆలోచించకుండా ‘ఓకె’ అంటూ వెనుదిరిగి, ఊబర్‌కు కాల్ చేశాం. పావుగంటలో అక్కడ ఉంటానని బదులు వచ్చింది. ‘హమ్మయ్య’ అనుకొని రాతి బెంచీపై కూర్చుని నిరీక్షించసాగాం. ఎంతసేపైనా రాడు. దీప మొబైల్ చూడబోతే చార్జింగ్ తక్కువుంది. మళ్ళీ ఫోన్ చేస్తే ఐదు నిమిషాలన్నాడు. అయిదు కాదు, పది నిమిషాలైనా పత్తా లేడు. మళ్ళీ ఫోన్ చేస్తే ట్రాఫిక్ ఆంక్షల వల్ల మా వైపు రావటం కుదరదని చెప్పాడు. చేసేది లేక బుకింగ్ క్యాన్సిల్ చేసింది దీప. అంతలో మరో జంట ఎదురైంది. దీప వెంటనే మా సమస్య చెప్పింది. ఆమె తన భర్తకు బాగా తెలుస్తుందని అతడికి చెప్పింది. అతడు “మీరు అదుగో అటువైపు ఉన్న మెట్లు దిగి టనెల్‌లోంచి వెళితే రోడ్డుకు ఆ వైపుకి చేరుకోవచ్చు” అని చెప్పాడు. అతడికి థ్యాంక్స్ చెప్పి గబగబా ముందుకు నడిచాం. మా భయం ఎందుకంటే అక్కడ త్వరగా చీకటి పడుతుంది. కారు పార్క్ చేసిన బంకర్ రోడ్డుకు దారి తెలుసుకోవాలి. రోడ్డుకు అటువైపు చేరటంతో ఒక ఘట్టం పూర్తయ్యింది. కానీ ఆ తర్వాత…? అన్నీ చూసిన దారుల్లాగే తోచాయి. ఓ మార్గంలో పైకి నడుస్తుంటే ఓ సర్దార్జీ కనిపించాడు. మేం వెళుతోంది సరైన దారి అవునో, కాదో అని అతణ్ణి అడిగాం. అతడు ఏ మాత్రం తడుముకోకుండా బాగా ముందుకు పొమ్మన్నాడు. ఎగువకు పట్టుదలగా నడుస్తున్నాం. నాకు అలసటగా ఉంది. దీప పరిస్థితీ డిటో… డిటో. తీరా అంతా నడిచాక తప్పుదారి అయితే అన్న అనుమానం, భయం. మళ్ళీ అంతలో సైకిల్ పై వస్తూ మరో వ్యక్తి ఎదురయ్యాడు. అతన్ని అడిగాం. అతడు తనకి తెలిసినంత వరకు ఆ దారి కాదనీ, వ్యతిరేక దిశ కావచ్చనీ, అయినా పైన మరో బృందం ఉన్నారనీ, వాళ్ళని అడిగితే గైడ్ చేస్తారేమోనని చెప్పాడు. జిపిఎస్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ సూచించడంతో మేం క్షణం ఆలోచించి రోడ్డు దాటాం. కొద్ది దూరంలో ట్రాఫిక్ పోలీస్ విధి నిర్వహణలో బిజీగా ఉన్నాడు. బంకర్ రోడ్డుకు ఎటువెళ్ళాలో ట్రాఫిక్ పోలీస్‌నే అడుగుదామన్నాను దీపతో. డ్యూటీ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయటం పద్ధతి కాదంది. మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా డ్యూటీలో భాగమే, ఓ నిముషం చాలు అన్నాను నేను. నా పోరు పడలేక దీప ఎట్టకేలకు ట్రాఫిక్ పోలీస్‌ని అడిగింది.

    అతను బదులిస్తూ అక్కడ నడవడం క్షేమకరం కాదనీ, అటు వైపు ఉన్న టన్నెల్‌కు వెళ్ళి అక్కడి నుంచి వెళితే మంచిదని చెప్పాడు. అందుకు దీప ఇప్పటివరకూ అందంతా నడిచి వచ్చామని, మళ్ళీ వెళ్ళడం మా వల్ల కాదనీ చెప్పింది. ‘అయితే, ఇలాగే ముందుకు వెళ్ళి ఎడమకి తిరిగి నడుస్తూ పోతే బంకర్ రోడ్డు వస్తుందని, కానీ జాగ్రత్త’ అని హెచ్చరించాడు. ఆయనకు థ్యాంక్స్ చెప్పి, కరెక్ట్ దారి తెలుసుకున్న కొత్త ఉత్సాహంతో రోడ్డువారగా నడిచాం. వేరే పాదచారులెవరూ కనిపించలేదు, ఒకరిద్దరు సైకిలిస్టులు మాత్రం కనిపించారు. అలా వెళ్ళగా, వెళ్ళగా బంకర్ రోడ్ కనిపించింది. అక్కడ చాలా కార్లున్నాయి. ఓ లేడీ పోలీస్ కూడా అక్కడ ట్రాఫిక్‌ని నియంత్రిస్తోంది. మేం కాస్త ముందుకెళ్ళి అటు ఇటూ చూసి, మా కారు కనబడడంతో తప్పిపోయిన పిల్ల కనిపించినంత ఆనందపడ్డాం. నిజానికి దారి తప్పింది మేము. పెద్ద కష్టం గట్టెక్కినట్లుగా ఉంది ఇద్దరికీ. మంచినీళ్ళు తాగి, అక్కడి గట్టుపై కూర్చుని చెరొక యాపిల్ తిని, ఓపిక తెచ్చుకున్నాం. ఇక బయల్దేరుదామనుకుని కారెక్కాం. మొబైల్ చార్జింగ్‌తో ఫోన్ ప్రాణ్ం పోసుకోసాగింది. జిపిఎస్ సూచనల మేరకు దీప కారు నడుపుతోంది. అయితే ట్రాఫిక్ వివరీతంగా ఉంది. ఆ రాత్రికి మా బస ఎమరాల్డ్ హిల్స్ లోని గెస్ట్‌హౌస్‌లో. ట్రాఫిక్ వల్ల గమ్యం లేటుగా చేరుకుంటామని, త్వరగా చేరుకోవాలంటే మరో రూట్ ఉందంటూ, ఓకేనా అని అడిగింది జిపిఎస్. దీప ఓకే చేయడంతో గోల్డెన్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళే బదులు వేరే రూట్‌లో వెళ్ళసాగింది కారు. ఆ తర్వాత మరీ పెద్ద బ్రిడ్జి రిచ్‌మండ్ శాన్ రఫెల్ బ్రిడ్జ్ పై నుంచి అలా అలా చాలా దూరం ప్రయాణించి ఎమరాల్డ్ హిల్స్ చేరుకున్నాం. బాగా చీకటి పడింది. ఆ స్ట్రీట్‌లో జన సంచారమే లేదు. మా హోస్ట్ విక్కీ పాస్కల్‌కు అంతకు ముందు ఫోన్ చేసినప్పుడు, విక్కీ జవాబుగా పెద్ద మెసేజ్ పంపింది. తాము ఇంట్లో ఉండకపోవచ్చనీ, కీ ఫలానా చోట ఉంటుందని, ఆ తర్వాత ఏవేవి ఎక్కడ ఉంటాయో, మేం ఏం చేయాలో బోలెడంత టెక్స్ట్ రాసింది. ఇంత అలసిన స్థితిలో అవన్నీ చదివి అర్థం చేసుకోవాలా అన్న నిస్పృహ. అయినా ముందు ఇల్లు కనబడాలిగా. ఇంటి నెంబరు 444 అని అడ్రెసులో ఉంది. కానీ మేం ఆగిన ఇంటి పోస్టు డబ్బా పైన 445 అని నెంబరు కనిపించింది. దీప కారును మళ్ళీ ముందుకు పోనిచ్చింది. రెండిళ్ళ అవతల ఓ ఇద్దరు వ్యక్తులు ఏవో సామాన్లు సర్దుతూ కనిపించారు. ముఖాలు మూస్తేస్తూ తలకు క్యాప్‌లు. నేను ‘వాళ్ళని అడుగుదామా’ అన్నాను దీపతో. తనేమో, ‘అమ్మా నీకు తెలీదు. నాకెందుకో వాళ్ళు మంచివాళ్ళలా అనిపించడం లేదు. అడగను’ అంటూ కారును మళ్ళీ ఓ రౌండ్ తిప్పి, మళ్ళీ జిపిఎస్‌ని సంప్రదించింది. అయినా అది మళ్ళీ ముందర ఇంటి దగ్గరికే చేర్చింది. నేను ఆ ఇంట్లో వాళ్ళని అడుగుదామన్నాను. దీప సందేహిస్తుండగానే లోపలి నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ‘అడుగు… అడుగు’ అని తొందర పెట్టాను. దీప ముందుకు వెళ్ళి విషయం చెప్పింది. “మీరు కరెక్టుగానే వచ్చారు. ఇదే ఇల్లు. నేనే పాస్కల్‌ను” అన్నాడు. తీరా చూస్తే ఇంటి గోడ మీద నెంబరు సరిగ్గానే ఉంది.

    పోస్టు డబ్బాపై నెంబరు ఇంత తికమక చేసింది. బతుకు జీవుడా అనుకుంటూ ఆయననుసరించి లోపలకు వెళ్ళాం. మా రూమ్, కిచెన్ వగైరాలు చూపించి, కావాలంటే పియానో కూడా వాయించుకోవచ్చు అన్నాడు హాల్లోని పియానోని చూపుతూ. అంతలోనే ‘ఇది సమయం కాదనుకోండి’ అన్నాడు నవ్వుతూ. విక్కీ, పాస్కల్ (భార్యాభర్తలు) ఇద్దరూ మ్యూజీషియన్లట. గది బాగుంది. చుట్టూ అనేక అద్దాల కప్‌బోర్దులు. వాటినిండా ముచ్చటైన, ఖరీదైన రకరకాల గాజు సామాగ్రి. రెస్ట్ రూమ్ మాత్రం వెనుకగా ఉంది. అందులో ఇయర్ బడ్స్ దగ్గర్నించి పేస్టులు, క్రీములు, లోషన్లు, హెయిర్ డ్రయ్యర్‌లు… సమస్తం ఉన్నాయి. ఆ పక్కనే బార్స్‌లో కావలసినన్ని టవెల్స్ ఉన్నాయని, ఎన్నయినా వాడుకోవచ్చనీ చెప్పాడు. కిచెన్ కూడా ఎంతో విశాలంగా, సదుపాయంగా ఉంది. మర్నాడు వెళ్ళేముందు తనకు టెక్స్ట్ పంపితె చాలని, కీ పక్కనే ఉన్న టేబుల్‌పై ఉంచమని చెప్పి పాస్కల్ గారు వెళ్ళిపోయారు. మేం పరాటాలను ఫ్రిజ్ లో ఉంచి వేరే స్నాక్స్ తిన్నాం. హాయిగా షవర్ బాత్ చేసి, కంటి నిండా నిద్రపోయాం.

    (ఇంకా ఉంది)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here