పసిఫిక్ పదనిసలు – 6

    1
    8

    [box type=’note’ fontsize=’16’] పర్యటన వినోదాత్మకము, విజ్ఞానాత్మకమూ మాత్రమే కాదు మనిషి తనలోకి తాను చూసుకుంటూ తనని తాను అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. సీనియర్ జర్నలిస్టు జొన్నలగడ్డ శ్యామల అమెరికా పర్యటనానుభవాల సమాహారం ‘పసిఫిక్ పదనిసలు‘ ఈ సత్యాన్ని నిరూపిస్తుంది. [/box]

    [dropcap]ఉ[/dropcap]దయం అలారం మోగగానే ముందు నేను లేచి తయారై మా లగేజి సర్దేశాను. అంతలో దీప కూడా లేచి తయారైంది. తలుపు తెరిస్తే నేలంతా చిత్తడి. రాత్రి వాన కురిసినట్లుంది. మా లగేజిని కారు ట్రంకులోకి చేర్చసాగాం. పీటర్ గారు కాఫీ కప్పుతో బయటకు వచ్చి గుడ్‌మార్నింగ్ చెప్పి, సౌకర్యంగా ఉంది కదా అని అడిగి, నేల తడిగా ఉంది, జాగ్రత్తని చెప్పాడు. ఆయన వెంటే పిల్లి. ‘హలో’ అంటూ నేను దాన్ని పలకరించాను. కారు దగ్గరున్న దీప లోపలికి వచ్చి పీటర్ గారికి బయల్దేరుతున్నామని చెప్పింది. అలా ఆయన దగ్గర వీడ్కోలు తీసుకొని కారెక్కాం. మళ్ళీ మామూలే. గ్యాస్ స్టేషన్‌లో ఇంధనం నింపుకుని, ప్రాచీన చారిత్రక నగరమైన సాల్వాంగ్‌కు బయల్దేరాం. మా ప్రయాణంలోఇది చివరి రోజు. సాల్వాంగ్‌ను చూసి, లాస్ ఏంజిల్స్‌లో ట్రాఫిక్ కష్టాల్లో చిక్కుకోకుండా వీలైనంత త్వరగా మా ఊరు శాండియాగో చేరుకోవాలన్నది దీప ఆలోచన. సాల్వాంగ్ ప్రయాణం హాయిగానే జరిగింది.

    ఆ చక్కటి డానిష్ గ్రామం రానే వచ్చింది. సాల్వాంగ్, శాంటా బార్బారా కౌంటీలో ఉంది. దాదాపు వందేళ్ళ క్రిందట డానిష్ వారు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడి, తమ సంస్కృతికి ప్రతీకగా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దారు. ఇది ‘లిటిల్ డెన్మార్క్’గా ప్రసిద్ధి కెక్కింది. 9000 ఎకరాల విస్తీర్ణంలో నెలకొన్న ఈ గ్రామం ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంది. ఎటు చూసినా వైవిధ్యభరితమైన పూలచెట్లు, అసంఖ్యాక బేకరీలు, రెస్టారెంట్లు, దుస్తులు, బొమ్మలు, ఇతర వస్తువులు అమ్మే షాపులు, గాలరీలు, మ్యూజియం… ఇలా ఎన్నెన్నో. ఈ ప్రాంతం వైన్‌కి ప్రసిద్ధి కావడంతో సాల్వాంగ్‌లో 120 రకాల వైనరీలు అందుబాటులో ఉన్నాయి. డానిష్ ఆర్కిటెక్చర్‌తో ఎంతో కళాత్మకంగా నిర్మించిన అలనాటి ఇళ్ళు, సంప్రదాయ గాలిమరలు ఇక్కడ చూడవచ్చు. డానిష్ రుచులను అత్యధికులు ఇష్టపడతారు. ముఖ్యంగా బేకరీ ఐటమ్స్… పేస్ట్రీలు, గూడీస్, కేక్స్… ఇలా ఎన్నెన్నో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. సాల్వాంగ్‌లో యూరోపియన్ స్టైల్‌లో ఉన్న డేనిష్ విండ్‌మిల్ డిజైన్ బిల్డింగ్ ఎంతగానో ఆకట్టుకుంది. దాని ముందు ప్రతి సందర్శకుడు ఫొటో దిగుతాడు. మేమూ ఆ పని చేశాం. ఆ తర్వాత లిటిల్ మెర్మైడ్ ఫౌంటెన్ చూశాం.  ఓ బేకరీలో మా కోసం, స్నేహితుల కోసం కొన్ని స్నాక్స్ కొనుక్కుని కారెక్కాం. స్నాక్స్, పళ్ళు ఆరగించాం. “అమ్మా! ట్రిప్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. ఇంక ఇంటికే మనం” అంటూ దీప కారు స్టార్ట్ చేసింది.

    కలయా, నిజమా అన్నట్లుగా ఉంది. మా ట్రిప్‌ను తలపోసుకుంటూ, ఆ జ్ఞాపకాలను మనసు గదిలో పదిలపరచుకుంటూ ముందుకుసాగాం. మధ్యలో ఓ రెస్ట్ ఏరియా వద్ద పది నిముషాలు బ్రేక్ తీసుకున్నాం. చిరుతిండి తిని మళ్ళీ బయల్దేరాం. అదృష్టవశాత్తు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండానే మూడింటికల్లా శాండియాగోలోని మా నివాసానికి చేరుకోగలిగాం. కారు పార్క్ చేసి, మా ఇంటి తలుపు తాళం తీసేముందు మళ్ళీ దీప మా ఇద్దరికీ సెల్ఫీ తీసింది. ఆపైన ఇంటి లోపలికి నడిచాంఇక ఇంటినుంచి ఇండియాకే!!!!

    ఇవీ నా అమెరికా పర్యటనానుభవాలు పసిఫిక్ పదనిసలు.

    ఈ పసిఫిక్ పదనిసలు ఇప్పుడు నా మనసున సదా వినిపించే నేపథ్య సంగీతంగా పరిణమించాయి.

    (అయిపోయింది)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here