పాదచారి-12

0
10

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 12వ భాగం. [/box]

[dropcap]“లే[/dropcap]వయ్యా పాదచారీ లేలే మరోసారి నిద్ర నించి లే!…” చురుక్కున కిరణాల్ని సుదుల్ని గుచ్చుతూ అన్నాడు సూర్యుడు.

“అలా అతన్ని నిద్రలేపకండి…”

అడ్డొస్తున్నట్లుగా చెట్టు గాలికి ఊగి కిరణాల్ని అడ్డుకున్నది ఆకుల సైన్యంతో.

“కన్నతల్లి వడిని ఎప్పుడో విడిచిపెట్టాను. అయినా పుడమి తల్లి వడిని వీడలేను” బద్దకంగా బోర్ల తిరిగి పడుకుంటూ పచ్చని కన్నె గడ్డిని ముద్దు పెట్టుకున్నాడు పాదచారి.

“ఆకాశం నిర్మలంగా ఉంది… లేచి చూడవూ!” పక్షిరాజులు హుందాగా చెప్పాయి.

“లేవకపోతే ఊరుకోము… అతి నిద్ర మంచిది కాదు” ప్రేమగా కొప్పడుతూ పాదల మీద నించి పాక్కుంటూ వెళ్లాయి చీమరాజులు.

“సర్లే!… సర్లే!…”

బద్ధకంగా కళ్లు నులుముకుని లేచి కూర్చున్నాడు పాదచారి.

చెట్టు మొదలుకి వాలుగా ఆనుకుని నీలాకాశంలో బంగాలు పూత అలుముకోవడం ఆనందంగా చూశాడు.

“నన్నూ కాస్సేపు మీతో కూర్చోనిస్తారా?”

“మీరెవరు?”

“మీ జనరల్ మేనేజర్ని!”

“ఓహో!”

“సరే!… కూర్చుంటున్నానండోయ్. పెద్ద వాద్దవాణ్నయిపోయాను, లేవనే లేను!”

“ఎందుకొచ్చారట!”

“చాలా కాలం అయింది…. ఎపుడూ మీరు దొరకనే దొరకరు!…..”

“కానివ్వండి….”

“అయ్యా, మీరు నిద్రపోతూనే ఉన్నారు.”

“లేస్తే మరి మీరంతా వదలరుగా?”

“అది కలలోని కలలాంటి భావన మాత్రమే! యజమానీ! నిజంగా మేల్కొనండి!”

“అప్పుడు మీరూ మాయమతారు!”

“ఫరవాలేదు! అందుకే ఎప్పుడోగాని నేను రాను!”

“మిమ్మల్ని నిద్రలేపడం నా విధి!”

“లేస్తే ‘నౌ’, నూ, ‘నే’ నుగా మిగలను!”

“ఈ ప్రపంచపు లౌక్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు.”

“అర్థం చేసుకుంటే నాకు నేనే దూరమవుతాను.”

“ఇపుడు మాత్రం?”

“నా ఊహాల్ని వదిలేసి, నా ఆలోచనలనో, ఆర్భాటాన్నో నిద్రలాంటి మత్తులో ముంచేసి నాకు సత్యంగా, సర్వంగా మిగిలే ఉన్నానుగా…. నిద్రలేస్తే యూ ప్రపంచం నన్ను మళ్లీ తనలోకి లాక్కుంటుంది! అపుడు మళ్లీ చెలరేగేది భ్రాంతి నిండిన జీవితం!”

ఇపుడున్నది భ్రాంతి అనిపించే నిజం! అపుడు ఉండేది ‘నిజం’ అనిపించే భ్రాంతి మాత్రమే!

“మిమ్మల్ని మళ్లీ నేను నిద్రపుచ్చగలను!”

“No you can’t!”

“Why Sir?”

“అపుడు మిరెవరో కూడా నేను గుర్తించలేను గనుక.”

“పోనీండి… మీకు తోచినపుడే మీరు మళ్లీ మీ లోకంలోకి రాగలరుగా!”

నవ్వాడు పాదచారి. తనలో తనుగా మెల్లగా అన్నాడు “ఏమో” అని.

విశ్వాసం వేటనించి తిరిగొచ్చింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు జనరల్ మేనేజరుగారు.

“యజమానీ ఇపుడు నాకు భయమే లేదు… మీరు నన్ను గుర్తు పట్టలేకపయినా విశ్వాసం మాత్రం మిమ్మల్ని మళ్లీ ఇక్కడికి తీసుకురాగలదు. ఎందుకంటే… అది మీలోనే ఉంటుంది…. మిమ్మల్ని వదిలి ఉండలేదుగా మరి!”

పాదచారి ప్రేమగా విశ్వాసాన్ని కౌగలించికున్నాడు.

ఏపుగా పెరిగిన విశ్వాసం ముద్దుగా తోకాడిస్తూ అతని ముఖాన్ని నాకింది.

“OK భాయీ, Here I go!”

విశ్వాసం ముందు నడుస్తూండగా ఇంకోసారి కళ్లు నులుముకున్నాడు పాదచారి.

“ఏ మనిషిలోనూ మానవత్వం లేదు.”

“ఏ మనిషిలోనూ నిజమూలేదు.”

“చాలా మంది ఈ జీవితాన్నే అనంతం అనుకుంటున్నారు పాదచారి!”

“ఇక్కడ మోహమూ, మోసమూ, అశాంతీ, అవకాశవాదమూ ………….”

“నీవు త్యజించిన లోకం చాలా మంచిదే! ఇపుడు నీవు తిరిగి వచ్చిన లోకం కంటే!”

“ఎందుకొచ్చావ్ స్నేహితుడా?”

“రా! రా! మళ్లీ ఓసారి మాతో శ్రమిద్దుగాని!”

“అనంత కాలపు అలల్ని చూడాలనుకున్నావుగదూ!”

“అసలు కాలమే ఇంకిపోయింది ప్రవాహం ఎక్కడిది?”

కొంగల బారులు ఎగురుతూ ఎగురుతూ పాదాచారికి పాఠాల్ని బోధించాయి.

“ఇక్కడ స్నేహానికీ, మోహానికీ, బేధం లేదు.”

గిజిగాడు విచారంగా అంది “స్నేహం మోహమైతే జీవితం వేదనపాలే గదా?”

“నేనూ నామ మాత్రంగానే మిగిలి ఉన్నాను… నన్ను మాత్రం నన్నుగా ప్రేమించిదెవరూ?”

పక్కకి తలతిప్పి చూశాడు పాదచారి. వేదనలత వంగిపోయి వాడిపోయి పుల్లలా చిక్కిపోయి కనిపించింది.

పాదచారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

“ఏం వేదనా! ఎందుకిలా అయ్యావూ!”

“పాపం చేశాను పాదచారీ దానికిది శిక్ష!”

“ఏం చేశావు?”

“అహంభావం పెంచుకున్నాను. వేదాంతిని వెళ్లగొట్టాను… అందుకే యీ బాధ! అందుకేయీ శిక్ష!”

“ఎందుకిలా మారావు వేదనా?”

“ఏం చెప్పమంటావు నన్ను నన్నుగా ఎవ్వరూ చూడలేదు. నా మొహం నిండా, వంటి నిండా రంగులు వేసి మేకప్ చేశారు. నాకూ అదే అలవాటయింది. అందరూ అంతే వాళ్లకు నా మేకప్ సామాను మాత్రమే అవసరమయింది. నేను కాదు…”

 “నా కౌగిలిలో ఉన్నట్లు నటిస్తారు… కానీ వారు నన్ను చేరనివ్వరు…”

విశ్వాసం జాలిగా వేదనలతని చూసింది.

“నీ కుక్కకున్న విశ్వాసం లేదు!”

కన్నీరు కారుస్తూ అంది వేదనలత.

“నీకు నేనుతోడున్నాను.”

వెనక్కి తిరిగి చూశాడు పాదచారి.

విప్లవమూర్తి ఎఱ్ఱబారిన కళ్లతో దర్శనమిచ్చాడు.

“నువ్వెపుడొచ్చావూ?”

“నీవు వచ్చినపుడే! ఆఫ్ట్రాల్ కుక్క నీ వెంట రాగా లేనిది నేనూ రాలేననుకున్నావా పాదచారి? నీనీడగా ఎప్పుడూ నేను నీవంటనే ఉంటూవచ్చాను.”

“ఇప్పుడూ అంతే.”

“నీ తోడు నాకనవసరం!… అవసరం ఉన్న వేదనలతకే తోడుగా ఉండు!”

“వేదన నిన్ను దూరం నించైనా అనుసరిస్తూనే ఉంటుందయ్యా!”

“అయితే నువ్వూ దూరంగానే ఉండు.”

“మరి నేను?” వేదాంతి.

“మరి నేను?” విజ్ఞానాచార్యులు.

“మరి నేను?” మానసి.

“ఆగండాగండి… అందరూ దూరం నించే అనుసరించండి. ప్రతి వారూ మీ మీ అనుభవాల్ని మీ వెంట తెచ్చుకోండి.”

“మరి నీవు వెనక్కి తిరక్కుండా నడుస్తావా?”

“సరే! అలా కాదు! నేనిక్కడే ఉంటాను. మీరు మీ దారిన వెళ్లండి…. నా దగ్గర, నన్ననుసరిస్తూనో ఇంత కాలమూ వస్తున్నారు… ఇపుడలాగ కాదు. ఈ ప్రపంచంలోకి మీరు మీరుగా వెళ్లి మీ స్వరూపాల్ని వెదుక్కోండి… అపుడు మీరు మిమ్మల్ని మీరుగా మీ స్వభావాల్నో తప్పొప్పులనో గుర్తించగలుగుతారు”

“మేం అలా వెళ్లలేము!”

“వెళ్లాలి వెళ్లాలి!”

నీడా ఓ స్వరూపమైనా వ్యక్తో వస్తువో లేక తనంత తానుగా మన లేదు. మేమూ అలాంటి వారమే.

నిన్ననుసరిస్తున్నాం! నీతో నీలో జీవిస్తున్నాం!

మౌనంగా ముందుకు సాగాడు పాదచారి.

“విరిసిన ప్రతి పూవులోనూ

కురిశాయి ప్రకృతి నవ్వులు….”

అలవోకగా తలాడిస్తూ “రా! రా! నువ్వొస్తావని మాకు తెలుసు. నిన్ను మేము చూడనే లేదు!…. మా పూర్వీకులు చెప్పేవారు… నీ గురించి…. ఎపుడొస్తావనీ…. వచ్చాక గుర్తించమనీ….”

పూవులు నవ్వులు కురిపించాయి.

“ఎలా గుర్తించారు?” సంభ్రమంగా అడిగాడు పాదచారి.

“వారు చూసినట్లే నువ్వున్నావు! నీలో మార్పే లేదు వారు చెప్పినట్లే నువ్వున్నావు…”

“ఏమని చెప్పారు?”

“మమ్మల్ని ప్రేమిస్తావనీ, మానవ్వుల్ని నీ పెదవులపైన ప్రతిఫలిస్తావనీ!”

కొంచెం సిగ్గుపడ్డాడు పాదచారి.

“నేను ఇక్కడే అలాగే ఉన్నాను. కదల్లేదు… మెదల్లేదు. అందుకే నిన్ను మళ్లీ మళ్లీ చూస్తూ ఉన్నాను. పెద్దదాన్ని అయిపొయాను కదూ! వయౌభారం! పిల్లలూ పెద్దవాళ్లయ్యారు! వాళ్ల పిల్లలూ పెద్దవాళ్లువుతున్నారు మరి!” ఆప్యాయంగా కొంత ఆయాసంగా అంటున్నట్లు ఊగింది మఱ్ఱి చెట్టు.

గబగబా వెళ్లి కౌగిలించుకున్నాడు పాదచారి.

ఆప్యాయంగా ఆనందందగా కన్నళ్లో, ఆనంద బాష్పాలో రాల్చి నట్లు ఆకులు రాలాయి.

“అపుడు నేను చిన్న… దాన్ని నిన్ను చూశాను. గుర్తు పట్టగలవా?” కొంత విలాసంగా మరి కొంచం సిగ్గు పడుతూన్నట్లుగా ఓ కొమ్మ ఓ వైపుకి వంచి అన్నది సీసపు చెట్టు.

“గతించిన నీడలు… వాటికి నీ భావాల్ని అంటగడుతున్నావు… శభాష్!… హేళనగా వెనుకనించి నవ్వి అన్నాడు సత్యమూర్తి.

“అవి నా భావాలే, అంటగట్టటం ఏమిటి?”

“అవి అప్పటివి! అప్పటికీ ఇప్పటికీ కాలం కొలతల్ని దాటి ప్రవహించింది… అప్పటి నీవు వేరు!… ఇప్పటి నీలో అనేక భావాప్రవాహాలు! అప్పటి నీవు నిశ్శబ్దనిర్వికార ప్రవాహానివి!

“You are wrong!… అప్పటి నేను ‘నాలో’నే ఉన్నాననుకున్న మూర్ఖణ్ని….ఇప్పటి నేను ‘సర్వం’ లోనూ నన్ను చూసుకునే మానవుణ్ని! సామాన్య మానవుణ్ని, అంటే సరిపోతుందేమో? అపుడూ నేనే ఉన్నది ప్రపంచపు బాధల్లో emotions నో ఆనందాన్నో, అవమానాభిమానాల్నో గుర్తించని స్వరూపం అది… ఇపుడు అప్పటి కంటే విశ్వరూపాన్ని విక్షింస్తున్న కేవల ప్రేక్షకుణ్ని… విశ్వమూ నాలోని భాగమే నేనూ విశ్వంలోని జీవకణాన్నే!”

“అంటే పిచ్చి కుదిరిందీ… రోకలి తలకు చుట్టమని అంటున్నావా” నవ్వాడు సత్యమూర్తి.

“నీవే భాష్యం చెప్పు మరి!” నిర్వికారంగా అడిగాడు పాదచారి.

“You are running away from yourself…. నీనుంచి నువ్వే దూరంగా పరుగిడుతున్నావు.”

“నేను అనే సంకుచిత భావం నుండి దూరంగా వెడుతున్నాను. బహుశా పరిగెడుతున్నాను… కానీ పారిపోవటం లేదు. పారిపోవడమూ… పరుగిడిపోవటమూ వేరు వేరు విషయాలు.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here