పాదచారి-16

0
8

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 16వ భాగం. [/box]

[dropcap]పా[/dropcap]దచారిని చూసి నవ్వింది స్నేహ. బూరుగు చెట్టు కజ్జికాయలవంటి కాయల్ని పగలగొట్టి పింజ బిడ్డల్ని గాలికి వదుల్తూ “ఇదిగో పాదచారీ! ఈ నా బిడ్డల కోసమే ఇంత కాలం వేదన పడ్డా! చూశావా! కిరణపు పువ్వుల్లా గాలిలో ఎగురుతూ ఎలా ధరిత్రి మీదకు దిగుతున్నాయో! ఎక్కడో తమ చోటు వెదుక్కుంటాయి…. చల్లని వర్షరాణి ఆగమనంతో మొలకెలెత్తి ఆకుల బట్టలు తొడుక్కుని కిరణాల్తో గాలులతో ఆడుకుని పెరిగి యవ్వనంతో వృక్షాలై మళ్లీ నీడనిస్తాయి. చల్లగా… నాలా…. పాదచారీ! వాటికి అప్పుడు తమ తల్లిని నేనే అని గుర్తుంటుందా?”

తమకంగా మోడై ఆకాశాన్ని చూస్తూ ఆశీస్సుల్లాగా మిగిలిన ఒకటో రెండో ఎండుటాకుల్ని రాల్చింది. కదిలిపోయాడు పాదచారి.

వృక్షపు మొదల్ని గట్టిగా కౌగలించుకుని పగిలిన బెరుడుని మళ్లీ మళ్లీ ముద్దు పెట్టుకుంటూ, బుగ్గల మీదగా జారిన కన్నీటిని బెరడుకే తుడిచాడు పాదచారి.

వృక్షపు కౌగిలి

ప్రకృతి కౌగిలి తల్లి పేరు ఆర్తితో పిలిచిన తరతరాల…. యుగయుగాల ప్రకృతి పిలుపు మోడైన బూరుగు చెట్టు…. గాలికి ఊగి అతనిని దగ్గరికి తీసుకోవాలనే ప్రయత్నం చేసింది.

ఎగురుతూ వెళ్లే మైనా “క్రీర్” మని ఎండ వేడికి అరస్తూ ఓ క్షణం రెక్కలు అల్లార్చి దిశ మార్చుకుంది.

“అక్కడేం ఉంది? ఇటురా! నీ కోసం ప్రకృతి perfume ని తయారు చేశాను. పువ్వుల జల్లు కురిపిస్తా! ఇదుగో లేత లేత జేగురు రంగు ఆకుల గోడుగులు “ready ready” పచ్చని పచ్చని దోర ఆకులూ ఉన్నాయి. బుల్లి పిందెలూ ఉన్నాయి. పచ్చని జలపాతం లాగా పచ్చని నీడను పరిచానోయూ! రా! రా! Come on! come on!” అంటూ నిండు గర్భిణిలా నిగారింపుతో నవ్వింది మామిడి చెట్టు.

“రా! ఇటురా!” అన్నట్లు రాగయుక్తంగా పాడింది వసంత కోయిల. బూరుగును కౌవలించుకున్న పాదచారి ఓ క్షణం అటువైపుకు చూశాడు.

“ఎందుకలా” అన్నట్లు క్యూం, క్యూం అంటూ దీర్ఘం తీసింది వసంత కోయిల.

“అక్కడా ఉన్నానూ… ఇక్కడా ఉంటానూ అక్కడ ఆ చల్లదనమూ నాదే! ఇక్కడ ఈ గ్రీష్మపు వేడీ నావే.!”

ఇంత నిర్లిప్తంగా తనలో తాను అనుకుంటూ బుగ్గని వృక్షానికి ఆన్చుకున్నాడు పాదచారి.

“ఎండ వేడికి నిలబడకు బిడ్డా! కందిపోతావు” అన్నట్లు ఓ కొమ్మ ఊగి నీడ పాశాన్ని పాదచారిపై విసిరింది.

నీడలోకి వెళ్లి తలదాచుకున్నాడు పాదచారి!

“ఇప్పుడు చెప్పు నేస్తమా! ఇపుడు చెప్పు బిడ్డా! ఎందుకు నీకీ ఆవేదన?” అడిగింది బూరుగు చెట్టు, ఆప్యాయంగా… ఆదరంగా… తల్లిలా!

ఆ ఓదార్పులో ఆ ఆప్యాయాతలో కరిగి కరిగి బిగ్గటిల్లి ఏడ్చాడు పాదచారి.

“నా బిడ్డా! నా బిడ్డా!” కొమ్మల్ని ఊపుతూ నీడనిస్తూ కౌగిలించుకుని ఓదార్పు నివ్వలేని తన దురదృష్టానికి తరిస్తున్నట్లు కొద్దిగా గాలిని విసురుతూ మిగిలిన ఆకుల ఆశ్రువుల్ని రాల్చింది బూరుగు వృక్షం!

బిగ్గటిల్లి ఏడుస్తూ వృక్షాన్ని కౌగిలించుకున్నాడు పాదచారి.

“ఓ నా ప్రకృతి తల్లీ! నువు నన్ను చిన్నప్పటి నుంచీ ఎరుగుదువు. అయినా అమ్మ!… ఈ ప్రపంచం నాకు దుఃఖాన్ని ఇచ్చింది. నన్ను ప్రేమించి ప్రేమిస్తున్నట్లుగానే ఉండి గతిని మార్చుకుని తన దారిన తను సాగిపోయిందీ ప్రపంచం! అమ్మా! నేను ఒంటరిని. నా నవ్వుల్ని ప్రకృతీ ప్రజలూ భరించగలరు. కానీ నా అశ్రువుల్ని తుడిచేవారే లేరు. నా కోసం నా కోసమే ఒక్క క్షణం కేవలం ఒక్క క్షణం మిగిల్చేవారు లేరు. తల్లీ! నా భాష ఎంత మౌనమో నా బాధా అంత మౌనమే! నువ్వు ఆకులు రాలుస్తావు! నేను అశ్రువులు రాల్చుకుంటాను! అదీ నీ ఎదుట మాత్రమే! ” వెక్కెక్కి ఏడుస్తూ అనుకున్నాడు పాదచారి.

“నువ్వు నన్ను పిలిచావా? ఇది నిజమా?” సంభ్రమంగా పక్కన నిలచి అడిగింది వేదనలత.

విశ్వాసం మోర ఎత్తి ఓక్షణం ఏడ్చి మరోక్షణం తోకాడిస్తూ తన కాళ్ల మీద నిలబడి పాదచారి పాదాలు నాకింది.

ఓ ఋతువు మళ్లీ తన ఱెక్కలు విప్పి భూమి మీద పరచటానికి సిద్ధంగా గాలిలో తేలుతూ వచ్చింది. నీలి నీలి మబ్బురాణులు తెల్ల తెల్ల కొంగల మీద ఎగిరి వచ్చి ఆకాశపు పురషుణ్ని తమకంగా చుంబించి అతడు నిర్వికారుడైనందున ముఖం నలుపు చేసుకుని అంతలోనే తటాలున చిలిపిగానూ, హుషారుగానూ అతణ్ని ఆట పట్టిస్తున్నట్లు మెరుపు నవ్వులు నవ్వి ‘హూ’ అంటూ నీటి తుంపరల్ని విసిరినాయి.

గరిక వీరుడు నిటారుగా నిలబడి ఎండిన దేహాన్ని ఊగిస్తూ “తొలకరి… తొలకరి…” అన్నట్లుగా ఊగుతూ వర్షరాణిని ఆహ్వానించాడు.

గాలి చెలికత్తెలు వెంటరాగా హోయలుబోతూ వర్షరాణి చిలిపి విన్యాసంతో అరుదెంచింది.

క్షణాల్లో ప్రకృతిని ఊడ్చి పిల్లగాలులే రంగం సిద్ధం చేసినాయి.

నీరసించిన లతలు ఊగుతూ హాయిగా నీరసించిన చిరునవ్వులతో వర్షరాణిని ఆహ్వానించాయి.

“విన్నాం… మీ ఆహ్వానాలని! వర్షిస్తాం మా దయను” అన్నట్లు ఠీవిగా వర్షరాణి వయ్యారం ఒలికిస్తూ నాట్యం మొదలు పెట్టింది.

పుడమి దాహం!

ఎండిన బొరియల్ని పూడ్చుకుంటూ తనలోని తపనని ఆకాశ పురుషునికి తెలియ చేసుకుంటూ పుడమి తల్లి నిట్టూర్చింది.

ప్రకృతి తల్లి పరవశించింది.

ఆనందంతో చెట్టూ పుట్టా బూరుగూ, మామిడీ, సీసపు కన్యా, గరికవీరుడూ అందరూ గాలి కన్నెలతో పోటీ పడి నాట్యం చేస్తూ కొమ్మల సంగీతాలు వినిపిస్తూ వంటిని తడుపుకుని తొలకరి స్నానాలు చేశారు.

ఓ ఋతువు బుల్లి బుల్లి పసిరికతో పచ్చని తివాసీ పరిచింది.

ఓ ఆరుద్ర జీవి మెల్లిగా నిండుగా శాంతిగా సాగిపోతుంటే పాదచారి సంభ్రమంగా చూసి అనుకున్నాడు.

“ఓ అరుద్ర జీవీ! నిన్ను మళ్లీ చూస్తాననుకోలేదు? ఎంత మెత్తని వీపు? నీది…. పచ్చని పసిరిక తివాసీ మీద నువు మెరిసిపోతూ నడుస్తూ ఉంటే చూడ్డానికి ఎంత అద్భుతం! మీరంతా నా నేస్తాలు! మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోనూ?”

“ఎక్కడికా? నా దగ్గరికి.”

నవ్వింది వేదనలత.

“ఎందుకూ?” శాంతంగా నవ్వుడు పాదచారి

“నా బిగికౌగిలిలో ఒదిగిపోవటానికి పాదచారి! రా! మళ్లీ నన్ను కౌగలించుకో! నిన్ను నీవు మరిచి నాలో కరిగిపో!…”

“అదెట్లాగూ? వేదనా! జీవితంలో చాలా ఏళ్లు నీ అశ్రవుల మధువునే పీల్చానుగా! కొంత కాలం నా మానాన నేను సాగిపోతాను! ఇదుగో! ప్రకృతి తల్లి తివాసీ పరిచింది…”

విశ్వాసం ఆనందంగా తోకాడించి పాదచారి పాదాలు నాకింది.

“రా! రా! రా పాదచారీ! ఆ కలనించి యివలకు రా! మా ఛాయల్లో విశ్రమించు…” వృక్షాలు ఊగుతూ కొమ్మల చేతుల్ని ఊపుతూంటే పాదచారి హాయిగా సాగాడు

“మరోసారి మరోసారి

నాకోసం నవ్వుతూ

నా కోసం ఏడుస్తూ

మరోసారి మరోసారి

నాలోనే రేగుతూ

నా లోనే వాగుతూ

నడుస్తాను నడుస్తాను!

నడుస్తాను ఓ నేస్తం!”

హుషారుగా విశ్వాసం వీపు మీద ఓ చరుపు చరిచి ముందుకు నడిచాడు పాదచారి.

ఓ వెన్నెల రాత్రిలో మబ్బులు పరదాలు వేసుకొకుండా తారలు తళుక్కుమన్నపుడు ఓ బండరాయిమిద వెల్లకిలా పడుకుని నిశ్శబ్దపు రాత్రిలో ఎత్తుగా నిలిచి వెన్నెల కిరణాల్ని చల్లగా జార్చే చంద్రుణ్ని చూస్తూ బద్ధకంగా ఆవలించాడు పాదచారి.

“ఈ రోజు పూర్ణిమ కదా! అందంగా గుండ్రంగా మెరిసిపోతున్నావు!”

మరి రేపు? కొద్ది కొద్దిగా ముఖం మాడ్చుకుంటూ రోజురాజుకీ తరిగి పోతావు. ఓ అమావస్యకు పూర్తిగా అదృశ్యమై మళ్లీ ఆశలా రేఖగా ప్రత్యక్షమౌతావు. బలాన్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ మెల్లగా వికసిస్తావు. ఓ వెండి పువ్వూ! నువ్వూ నేనూ ఒకటే!”

తారలు తళుక్కుమని నవ్వాయి.

“నీదీ నాదీ యీనాడు ప్రశాంతే! మబ్బుల పరదాలు తీసి వేసి నీవు వెన్నెల కురిపిస్తుంటే వేదన పరదాల్ని వదిలి విశ్రాంతి నిశ్వాసాల్ని వదులుతున్నాను నేను. అక్కడెక్కడో సముద్రం నిన్ను చూసి పొంగిపోతోంది కదూ! ఈ క్షణాల్లో నేనూ ఎవర్నో తలుచుకుని తృప్తితో ఓలలాడుతున్నాను! ఎంత పోలిక మనిద్దరికీ! నిండైన చంద్రుడితో మాటలు సాగించాడు పాదచారి.

“నీవేమో ఉత్సహపు పొంగులూ, ఆవేశపు మరకలూ… నావేమో విషాదపు మచ్చలూ వేదంతపు తరగలూ…. నీ గుడిసె నీ చుట్టూ ఉంటే నా విశ్వాసం నాకు తోడు ఉంది! ఏల?”

విశ్వాసం కుక్క ఆనందంగా తోక ఊపుతూ పాదచారి పాదాలు నాకింది.

“ప్రకృతి పయనంలో ఇదో బుల్లి మజిలీ” నీలాకాశం వెన్నెల చీర తోడుక్కుని తారహారాలు తగిలించుకుంది.

పాలపుంత వడ్డాణం తళతళలాడగా నిద్రించే ప్రకృతి మీద వెన్నెల పైట కప్పింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here