పాదచారి-2

4
9

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. [/box]

3

[dropcap]“నా[/dropcap] మనసుతో నేను పోరాడుతున్నాను.”

“మనిషి మనసుతో పోరాడటం ఏమిటి?”

“కనీసం మనసంటూ ఓటి ఉంది కనక పోరాడటం! అదీ లేని వాళ్ళ సంగతి?”

“ఎవరున్నారు! ఎవరున్నారు!”

“మూర్ఖుడా, ప్రశ్నలన్నీ నన్నెందుకడుగుతావు? నీ కళ్లతో నువ్వు చూడు. తలుపులు బిగించినట్లు రెప్పల్ని బిగించకు..”

“నీకే కాదోయ్ చూపు ఉందీ! నా దృష్టిలో మనసు లేని మనిషి లేడు!”

“నిజమే! మనిషి లేని మనసూ లేదు! అందుకే ఉన్నది మనుషులు కాదు. మనస్సు లేని మరేవో జీవులు.”

“ఈ లోకం మీద ఎందుకంత ద్వేషం!

“ఈ ప్రపంచంమంత మధురం ఏముంది? ఆలోచిస్తే యీ లోకానికి మించిన అద్భుతం ఏముంది?”

“మరి నీ మాటలు…?”

“లోకం వేరు.. మనసు వేరు.. మనిషి వేరు..”

“టాపిక్ మార్చు.”

“మార్చనుగాక మార్చను!”

“నీ ఖర్మ నీది! నీ పిచ్చి వేదాంతంలోనో , పిచ్చి ఊహలోనో నువ్వే బతుకు! నాకేం. అయినా జీవితంలోని అద్భుత క్షణాల్ని ఆవిరి చేసుకుంటున్నావోయీ వెఱ్ఱివాడా! కళ్ల ఎదుట ప్రపంచాన్ని చూడక కళ్లు మూసుకుని ఆవలి తీరం వేపు అఱ్ఱులు చాస్తావెందుకు? అయినా నీ ఇష్టం నీది! నీ ఖర్మ నీది!”

దారిన పోయే దానయ్య దిశమార్చి వెళ్లిపోయాడు. పాదచారి మౌనంగా కాసేపు నడిచాడు. కొంచెం విచారంగా కళ్లు మూసుకున్నాడు. ఇంకొచెం విచారం పెరిగి ఏడవాలనుకున్నాడు. ప్రయత్నంతో జరగనిది లేదంటారు పెద్దలు. ఏడుపు రాలేదు. గుండె బరువుగా, దిగులుగా, అగాధంలోకి దిగజారిపోతున్న భావన. కనీసం కన్నీళ్లు తోడు రాలేదు.

“ఫో.. ఫో.. ఫో విచారమా! నా దగ్గరకు రాకు!”

తనలో తను అనుకున్నట్లు బిగ్గరగా అరిచాడు.

చూట్టూతా చెట్లు వెక్కిరిస్తూ గలగల్లాడాయి. కిసుక్కున రెక్కలు విప్పిన ఓ కాకి ‘జావ్’ ‘జావ్’ అంది.

***

కొండ మీద గుడి మెట్ల మీదకి గాలి వీచింది. కొబ్బరి చెట్లు కాయల్లేకుండా ఆకుల్ని కదిలించి ‘హూ’ అని నిట్టూర్చాయి. పూజారి పాతిన నందివర్ధనం మొక్క ఊగుతూ ఊగుతూ గొణుక్కుంది. పావురం ఒకటి మెల్లగా మరోదాని పక్కకు చేరి గుసగుసలాడింది.

పాదచారి వళ్లు విరుచుకున్నాడు.

“సూర్యుడొచ్చేశాడోచ్” అనరిచాయి పక్షులు.

“ఎక్కడా” అంటూ కళ్లు తెరిచాయి పువ్వులు.

“ఎన్నాళ్లిలా? నా బ్రతుకింతే! ఇక్కడి నుంచి కదలగలనా? మెదలగలనా?” అనుకుంటూ నిద్రగన్నేరు కళ్లు నులుముకుంటూ లేచింది.

తంగేడు మొక్క రా రా ఇదుగో యీ పుల్ల నీది… దానమిచ్చేశాను తీసుకు ఫో అన్నట్లు నవ్వింది.

పళ్లు తోముకుని మళ్లీ రహదారి పట్టాడు పాదచారి.

“నాకెందుకీ భోగం” కాలరు విచారంగా నిట్టూర్చి ఫర్రుమని చిరిగింది.

“ఇదో యీ ఐదు పైసలూ పట్టుకెళ్లు” దానకర్ణుడు పాదచారి చేతిలో నాణెం పెట్టాడు.

“నువ్వే ఉంచుకో” పాదచారి మళ్లీ కర్ణుడికిచ్చేశాడు.

కర్ణుడు చిర్నవ్వు నవ్వి వెళ్లిపోయాడు.

పాదచారి ఫక్కుమన్నాడు.

ఓ అమ్మాయి ఎఱ్ఱ ఓణీ ఎఱ్ఱ లంగా, ఎఱ్ఱ జాకెట్టు వేసుకొని పూలబుట్ట చేతపట్టుకొని గుడి వైపు మళ్ళింది.

ఎఱ్ఱ జాకెట్టులోనించి తెల్లగా ‘బ్రా’ కనిపిస్తోంది.

ఎక్కణ్నించో, ఏ చెట్టు మీద నుంచో  అకాలంలో అకారణంగా ఓ కోయిల కూసింది.

పాదచారి నిలబడి చుట్టూ చూశాడు.

“మాలో ఏమీ మార్పులేదు” అన్నాయి పరిసరాలు.

“అలాగయితే సరే” అనుకుంటూ ముందుకు సాగాడు.

ఊగుతూ ఊగుతూ చేతుల్ని వెనక్కు ముందుకూ ఊపుతూ పాదాలు కదుపుతూ, కదులుతూ ముందు కెళుతు వెళుతూ వెళ్ళుతూనే ఉన్నాడు పాచదారి. వెడుతూనే ఉన్నాడు బాటసారి!

***

“నాకే నక్షత్రాలు వద్దు. సూర్యకాంతి వద్దు, వెన్నెల వద్దు. కొబ్బరాకుల గలగలలు వద్దు. పిల్ల తెమ్మెర వద్దు. పచ్చని పైరూ, వెచ్చని చోటూ, నలుపుఆకాశం. గఢపు మబ్బులూ,

ఏమీ ఏమీ ఏమీ వద్దు”

“ఏం కావాలి మరి?” అంది మనస్సు

“ఆమె పాదాలు కావాలి! ఒసే మనసా ఆమె పాదాలగోటి కాంతుల్ని చూసి సూర్యచంద్రులు మొహం చాటు చేస్తారు. ఆమె చిరునవ్వు చూసి వెన్నెల ఏడ్చేస్తుంది. ఆమె చేతుల అందం చూశావా? నాకేడుపొస్తోంది. చల్లని చేతుల్తో నా బుగ్గలు నిమిరిన ఆ కాలం గతించిన జీవించే ఉందోయ్! ఆ నవ్వులో ఎంత ప్రేమ ఉందనీ!”

“పాదచారీ is in love. Is it not?” అంది మనసు

‘పాదచారీ is always in love. With world, with himself’ అనుకున్నాడు పాదచారి.

“So పాదచారి! ఎవరామె! ఏమా కథ?” ప్రశ్నించింది మనసు.

“మూర్ఖ మనసా. నీకు తెలీని సంగతి నాకెలా తెలిసిందంటావు, నిజంగా తను నీకు తెలియదా?” పాదచారి కస్సుమన్నాడు.

“నన్నెపుడో దూరంగా పెట్టేశావు కదోయ్!”

“అంతస్సాక్షి, ఆత్మసాక్షి అనుకుంటూ నన్నెప్పుడో అణిచేశావు కదా! నాకెలా తెలుస్తుంది?” ప్రశ్నించింది మనసు.

“నోరు మూసుకో! నా దగ్గరా నీ ఆటలు? నిన్ను ban చేశానా? ఎలాగా? ఓయీ! నువ్వుండ బట్టేగా యీ చికాకు?”

పకపకా నవ్వింది మనసు – “ఓడిపోయాడోడిపోయాడోచ్” అంటూ!

“ఓడను ఓడను, ఓడను నేనిక

ఓటమి నాకిక లేదిక లేదిక”

అనుకుంటూ కళ్లు మూసుకున్నాడు పాదచారి.

ఏవేవో శబ్దాలు!

దిగంతాల నిట్టూర్పులు!

4

“ఎవరు మీరంతా?”

“నీవు నిశ్వాసించిన నిట్టూర్పులం”

“ఎందుకొచ్చారు?”

“మళ్లీ నీ శ్వాసలో కలిసిపోదామని”

“ఎందుకు కలవడం?”

“నిన్ను మళ్లీ యుగాల వెనక్కు తీసుకుకెళ్లాలని?”

“ఎందుకు తీసుకెళడం?”

“నిన్ను నువ్వే చూసుకోడానికి”

“నన్నెపుడూ నేను చూసుకుంటూనే ఉన్నాను”

“ఆ నీవు వేరు, మేం చూపించే నువ్వు వేరు”

“నేనెప్పుటికీ నేనే”

“దాన్నే అహంభావం అంటారు”

“సరే, ఇప్పుడేం చేస్తారు?”

“టెలివిజన్  play లాగా నిన్ను నీకు చూపిస్తాం మూల్యం nothing!”

“అదేం?”

“మళ్లీ నీలో మేము జీవిస్తాం!” అంటూనే శ్వాసలు ప్రవేశించాయి.

ప్రపంచమూ, ఆకాశమూ, నక్షత్రసమూహాలూ గిఱ్ఱుగిఱ్ఱున తిరిగి పోతున్నాయి. వెనక్కి, వెనక్కి.. అగాధంలోకి! అయోమయంగా! ఎవరో ఏమో మాట్లాడుతున్నారు. వ్యక్తి కనుపించని మాటలు, భావం ఉన్నా భాష లేని మాటలు!

“ఓయీ మనిషీ! నీ సృష్టి అద్భుతం! అయితే అది విశాల విశ్వం కాదు! అగ్గి పెట్టెల భవనం! ఎక్కడిక్కడే దారులు! ఎక్కడిక్కడే గోడలు! అవిగో అవన్నీ నీవు నీ కోసం సృష్టించుకొన్న సంకెళ్ళు! ఇవిగో యివన్నీ నీవు నీ కోసం ఏర్పరుచుకొన్న ముళ్ల పొదలు! ఆ ప్రక్కన నీ మత కుల వికటాట్టహాసాలు, ఇదుగో యీ ప్రక్కన ప్రేమ పేరుతో పెంచుకున్న నీ పచ్చ పచ్చని వృక్షాలు, ఏడుస్తావా? నవ్వుతావా? ఏడవాలంటే అటు పక్క ఆ ఎండలోకి, మంటలోకి ఫో! నవ్వాలంటే ఇటు ప్రక్క యీ నీడకురా! Choice is yours!”

“నాకా రెండూ వద్దు.”

“మరేమీ కావాలి?”

“అక్కడెక్కడో ప్రేమ నక్షత్రం మెరుస్తోంది. దాని కాంతి కావాలి!”

“ఎన్ని కాంతి సంవత్సరాలు పడుతుందో!”

“ఇవ్వలేకపోతే ఫో!”

“ఇచ్చేస్తున్నా! ఇప్పుడే ఇచ్చేస్తున్నా.” ఓ తెరపడింది. ఆ తెరమీద పగలూ-రాత్రీ, వెలుగూ-చీకటీ, ఏడుపు-నవ్వూ, ఆనందం-ఆవేదనా, భయమూ-భ్రాంతీ, ధైర్యమూ-ధైన్యమూ ఒకటొక్కటిగా వెలిగి ఆరిపోయాయి. చీకటీ వెలుగూ కాని సంధ్య నిలిచింది. నిర్వికారపు నీడ నిలిచింది.

“రా! రా!” అని చేతులు చాచింది. కాలపు హస్తాలతో బంధించింది. మోహపు ముద్దు పెద్దాలపై  చికిలించింది. పాదచారిని పారవశ్యంలో పారవేసింది!

***

“నేనిది కావాలనుకున్నాను. అయినా ఇందులో ఏముంది? ఏదో ఉందనుకున్నాను. ఆ ఉందనుకోటంలో ఉన్న తృప్తీ, ఆనందమూ నా ఊహలోనిదో కానీ, కావాలనుకున్న దానిలోనిది కాదుగదా?”

“నేనంటే ఎవరు?”

“ఏమిటి నువ్వడిగేది?”

 “అదే.. నా ఊహల్లోని ఆనందం. నేను కావాలనుకున్నదానిలో ఉందన్నావుగా? మరి ఆ కావాలనుకునే ‘నేను’ ఎవరు?” ప్రశ్నించింది మనసు.

“క్షమించండి మనసుగారూ? గుర్తించినది మీరే! ప్రకృతికీ, ప్రస్తుతానికీ.”

మనసుగారు నవ్వారు. “సరేనోయ్ పాదచారీ! ఒప్పుకుంటునన్నావన్నమాట. నీలోని సౌందర్యం నీ దృక్కులోంచి ప్రవహించి మళ్లీ నిన్నే పరవశింప చేస్తోంది అవునా?”

“మరి అన్నింటి  మీద సమదృష్టి లేదుగా! కొన్నే సౌందర్య స్వరూపాలని అనుకుంటున్నానుగా! నా దృక్ సౌందర్యం పరిమితమా?” ప్రశ్నించాడు పాదచారి.

కాలికి ఎదురు దెబ్బ తగిలి ‘అమ్మా’ అన్నాడు పాదచారి. మనసు వేలిని ఆశ్రయించి బాధని తెలియచేసింది. అదక్కడే ఆగింది. ఆలోచనా ఆగింది. కుంటు కుంటూ ముందుకి నడిచాడు. చీకటి పడుతూ పడుతూ ఉంది. ఆకాశంలో ఆలోచనల చీకటి ఆలముకుంది. రివ్వున గాలి! పార్కు బెంచీ మీద కూలబడ్డాడు.

“నువ్వు లేక పోతే నేను బ్రతకనే లేను” ప్రక్కన పొద బాట నించి విన వచ్చిన స్త్రీ గొంతు.

“నేనూ అంతే! నా జీవితానికి ఆనందమూ, అర్థమూ నువ్వే!” మగగొంతు.

“నా ప్రేమ అనంతం!” ఆడగొంతు.

“నీవు నా దేవతవి! నేను పూజారిని!” మగ గొంతు.

“ఈ సృష్టిలో ఎవరూ ఇంత ప్రేమని అనుభవించి ఉండరు.” ఆడ గొంతు.

“హూ” మగ గొంతు.

పాదచారికి కోపం వచ్చింది. ఒక్క ఉదుటున లేచి పొద పక్కకి వెళ్లి “లేవండి” అనరిచాడు. Art of kissing practice చేస్తున్న ప్రేమికులు ఉలిక్కిపడి లేచారు.

“బుద్దిలేని వాళ్లల్లారా! సినిమా డైలాగులు వల్లించడానికిదేనా స్థలం? ఏమోయ్? నీ జీవితానికి అందమూ ఆనందమూ తనా? నిన్ను తంతాను. అప్పుడూ ఇదే మాట అనగలవా? అంత ప్రేమ ఏడిస్తే ఇలా భయం భయంగా ముద్దులెందుకు? కొంపలోనే ఏడవచ్చుగా” భీకరంగా అన్నాడు పాదచారి.

ప్రేమికులు భయం భయంగా చూస్తూ తడబడుతూ పరుగులాంటి నడకతో పారిపోయారు. పొదకి కోపం వచ్చినట్లు ఊగింది. పాదచారి శాంతించాడు.

“అయినా నాకెందుకు!” అన్నట్లు సిమెంటు బెంచీ మీద శరీరాన్ని వాల్చాడు.

“నువ్వు పిచ్చి వెధవ్వి” అన్నట్లు మొదటి నక్షత్రం ఆకాశంలో తళుక్కుమంది.

“అవునవ్వును” అన్నట్లు అయిదారు నక్షత్రాలు వరుసగా వెలిశాయి. వీధిలో విద్యుద్దీపాల్లా టప్ టప్ మనుకుంటూ క్షణాల్లో ఆకాశం నక్షత్ర దీపాల్ని వెలిగించింది.

“ఓ నక్షత్రాల్లారా! ఎప్పట్నించీ మీరీ డ్యూటీ చేస్తున్నారూ! ఏమేం చూశారూ? ఈ సృష్టికి ఆదీ, అంతమూ చూసిన జ్ఞాపకమేదైనా ఉందా? మొదట్లో మానవుడు నాలానే ఆలోచించాడా? ప్రేమను వెదకుతూ తన్నుతాను వెతుక్కున్నాడా? ”

“తెలుసు తెలుసు!” తళుక్కుమన్నాయి తారలు.

“అన్నింటిక్కనా నేనే నీ దగ్గరలో ఉన్నాను. నన్నడక్క వాటి నెందుకుడుగుతావూ?” నెలవంక వోరగా చూస్తూ వెలిసింది.

“సరే నువ్వే చెప్పు!” రాజీ కొచ్చాడు పాదచారి.

“గేట్లు మూసేస్తున్నాం లేవండి” అన్నాడు పార్కువాలా.

పాదచారి లేచాడు. నడుస్తూ కుంటుతూ గుడిమెట్లు చేరాడు. నాలుగు మెట్లెక్కి అయిదవ మెట్టు మీద కూలబడి ఏడో మెట్టు వంక జాలిగా చూశాడు.

ఆరో మెట్టు తనదికాదు!

ఆమెది కాదు!

అయిదుకీ, ఏడుకీ అది మధ్య దూరం!

అది అక్కడే ఆగిన తొలి ఘట్టం!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here