పాదచారి-21

0
8

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 21వ, ఆఖరి భాగం. [/box]

[dropcap]“ఆ [/dropcap]రెంటినీ కూడా నేను తేలేదు. ఇహ పోతే నేను నిర్వచించటానికి ప్రయత్నించలేదు” నిర్లిప్తంగా అన్నాడు పాదచారి.

“నీ నిర్వచనంతో నాకు పనేమిటి? ప్రేమ దైవం అన్న నిర్వచనం సర్వజనామోదమైంది, నువ్వు కాదంటే అది మారదు” కల్పించుకున్నాడు విజ్ఞానాచార్యులు.

“మారినా మారకపోయినా ప్రేమ దైవం కాదు. రెండు వేర్వేరు. రెండూ ఉత్తమమైనవి కనక దీన్ని దానితోటి దాన్ని దీనితోటీ పోల్చారు. అంతే అసలింకో విచిత్రం ఉంది… రెండిటి స్వరూపం ఎవరికీ తెలీదు.”

“అంటే దేముడు లేడనే వాదానికి దీగుతున్నావా?” కోపంగా అన్నాడు విజ్ఞానాచార్యులు.

“ఆ విషయంతో నాకేం పని? మానవుడు తనకి అతీతమైంది ఒకటి తనే సృష్టించుకుంటాడు! ఆ సృష్టి పదార్థ సృష్టి కాదు… మనో సృష్టి…. ఎందుకంటే పదార్థ సృష్టి తెలియబడుతుంది. మనో సృష్టి అలాక్కాదు…. తెలియబడదు. అనుభవానికి అందుతుంది…. అదీ ఎవడి బుద్ధి నైశిత్యాన్ని బట్టి వాడికి. కనుక పోలికతోనో మనోసృష్టితోనో నాకు పని లేదు. దైవం నిర్వికారి. ప్రేమ అనేది నిర్వికారి కాదుగా…. ఆ దృష్టితో చూసినా?” వివరించాడు పాదచారి.

“అయితే?” ప్రశ్నించాడు విజ్ఞానాచార్యులు.

“ప్రేమించటం నా తత్వం. అది నా లోని భాగమే. బహుశా ఎక్కువ భాగం అదేనేమో….”

“చాలా బాగుంది! ప్రేమ నిన్ను ప్రేమించిందంటున్నావు మళ్ళీ ప్రేమ నీలోని భాగమంటున్నావు. గుడ్… ” పరిహాసంగా అంది మానసి.

“ప్రేమ అనేది వ్యక్తి స్వరూపం కాదు. అది తత్వస్వరూపం. సరే, ఆ వ్యక్తిలో ఉన్న తత్వము ప్రేమ. నాకూ నా ప్రేమకీ ఉన్న విడదీయరాని సంబంధమే, ఆమెకీ ఆమె ప్రేమకీ కూడా ఉంది. ఎవరూ తనలోని ప్రేమతత్వాన్ని తనే చూడలేరు. ఎందుకంటే అది ఎప్పుడూ వేరొకర్ని ఆశ్రయిస్తుంది. కానీ… శరీరాన్ని కాదు. ఇంకా చెప్పాలంటే నీలో ఉన్న ప్రేమ ఎప్పుడూ ఇతరుల్ని ప్రేమస్తుంది. కానీ నిన్ను కాదు. మానసి, మనసూ అట్లాంటిదే! మనసు నీదే, కానీ అది ఆరాధించేది వేరొకర్ని. కనుక, ఇతరుల ప్రేమనీదైతే. నీ ప్రేమ ఇతరులదౌతుంది. అలా ఆలోచించు. తను నేనూ వేరు వేరు కాదన్న దానికి అర్థం అవుతుంది. నా ప్రేమ తన దగ్గరుంటే, తన ప్రేమ నా దగ్గరుంది. ఇప్పుడు వేరు ఎలా అవుతాం? ఇక పోతే ఆ ప్రేమను గుండెకు హత్తుకునే ధైర్యం లేదన్నారు. ప్రేమకి ధైర్యం కావాలా? అంటే ప్రేమ కంటే ధైర్యం గొప్పదనా? అసలు ధైర్యం ఉన్నదే ప్రేమ నీడన. ప్రేమ లేనప్పుడు ధైర్యం ఉండనే ఉండదు. Impossible. కనుక ధైర్యం ఉందా లేదా అనేది ప్రశ్న కాదు. తను తన సర్వాన్నీ నా పాదల ముందు పోగుపోసింది. కానీ తను ప్రేమను తత్వంగా చూడక సశరీరిగా చూస్తోంది. అప్పుడు ప్రేమ ‘బంధన’ అవుతుంది. ఆ బంధన తీయనిదే కావొచ్చు. కానీ బంధనకు వంటి నిండా బంగారు నగలు పెట్టుకున్నా బరువు బరువేగా. బంగారు విలువైందని బరువు తగ్గదుగా.”

“ఇంతకీ నువ్వనేదేమిటీ? దాని మానాన్న దాన్ని వదిలి నీ దారి నువ్వు పడతానంటావా?” అసహనంగా అరిచాడు విప్లవమూర్తి.

“ఊహూ! ఏ క్షణంలో నా భాగమైందో ఆ ప్రేమ నాతోనే పయనిస్తుంది. అయితే తత్వంగా. ఊహూ… అలా క్కూడా కాదు, ఈ వృక్షపు నీడన నేను విశ్రమించినట్లు తనూ కొన్ని క్షణాలు నా గుండెల్లో విశ్రమిస్తుంది. నా క్షణాల సీసాల్లో తన సారాన్ని నింపుతుంది. తనవైన క్షణాల్లో నా తత్వాన్ని దాచుకుంటుంది. అప్పుడు అంతా అద్భుతమే… అంతా అద్వైతమే…”

మెల్లగా తనలో తనుగా అనుకుంటూ చిన్న నవ్వు నవ్వాడు పాదచారి.

ఎవ్వరూ మాట్లాడలేదు. ఓ మౌనపు కెరటం అందర్నీ కౌగిలించింది.

ఓ పెద్ద మబ్బు మండతున్న సూర్యుడ్ని పరిహసిస్తూ కిరణాలకి అడ్డంగా తన శరీరం పరిచింది. కుంటలో పడ్డ ఏనుగులాగా మబ్బులో ఇరుక్కుపోయాడు సూర్యుడు.

“శభాష్…. గెలిచావు మేఘరాజా” అని మబ్బు వీపు తట్టడానికన్నట్టుగా ఓ చిరుగాలి రివ్వున వీస్తూ పైకెగసింది.

పుడమి తాపం తీర్చుకున్నట్టు బీడల నాశికాలతో ఉస్సు మని నిట్టూర్చింది.

తుఫానులో సముద్రులో చిక్కుకున్న వాడికి కొయ్యదుంగలాగా, దుఃఖంలో మునిగిన వాడికి ఆశలాగా… ఓ తెల్లని కొంగ విశాలమైన రెక్కలు అల్లారాస్తూ నీలాకాశంలోకి దూసుకుపోయింది.

తల్లి వేరు పెరగ్గానే బిల బిల మని పిల్ల వేర్లు పుట్టుకొచ్చినట్టు, ఆ కొంగ వేనుకనే కొన్ని వేల కొంగలు క్రీకారం చేస్తూ వంచిన విల్లులా ఒకదాని పక్క ఒకటి అమరి డిసిప్లిన్డ్ సోల్జర్స్‌లా దూసుకుపోయాయి.

“చూసావా మానసీ! ఒక ఆశ వెయ్యి ఆశలకు కారణమౌతుంది. అయితేనేం? ఆశ అంతటి జీవ వస్తువు ఇంకేముందీ?

లేచి వృక్ష మాతని “వెళ్ళస్తాననట్టు” స్పృశించి హుషారుగా ముందుకు కదిలాడు పాదచారి. విశ్వాసం హాయిగా తోకాడీస్తూ కుయ్ కుయ్ మని రాగాలు తీస్తూ పాదచారిని అనుసరించింది.

“ఆ విశ్వాసం నన్ను అతని దగ్గరకు చేరనివ్వదు” కోపంగా అంది వేదనలత మానసితో.

“మంచిదిదేగా…” ఆలోచిస్తూ అంది మానసి.

పాదచారి మనస్సులో ఓ ఆనంద కెరటం

“జీవీ జీవనం జీవితం

జీవితం జీవనం జీవుడే

జీవుడే జీవితం జీవనం

జీవమే జీవుడూ జీవితం.”

ఏదో పిచ్చి కవిత అల్లి పచ్చని సీసపు చెట్టుకి వినిపించాడు పాదచారి.

“అర్థం ఉన్నా లేకపోయినా మేం ఆనందిస్తాం. ఎందుకంటే, ఆనందానికి అర్థం వెదకటం ఎందుకూ?”

పకపకా నవ్వి తత్వం బోధించింది సీసంగారు. నవ్వి ముందుకెళ్ళాడు పాదచారి.

“నిన్న ముద్దు పెట్టుకోవాలనుంది…” వెళ్తూ వెళ్తూ ఆగి ఓ అగ్ని పుష్పంతో అన్నాడు పాదచారి. ముందుకు వొంగి.

“ఆలస్యం ఎందుకూ?” పెదిమ అందుస్తున్నట్లు పాదచారి వైపుగా జరిగింది కొమ్మరాణి.

ఆ స్పర్శతో ఆనందించి ఈల వేస్తూ ఉత్సాహంగా ముందుకు నడిచాడు పాదచారి.

ఎక్కడ లేని ఉత్సాహంతో యజమాని కాళ్ళకి అడ్డంపడతూ, తోకాడిస్తూ, ఉబికిన ఉత్సాహం ఆపుకోలేక ముందుకు దూకుతూ వేగంతో పరిగెత్తింది విశ్వాసం.

నవ్వుతూ వెనక నడిచాడు పాదచారి.

***

అమృత

“నువ్వు లేక నేను లేను… లేనేలేను”

తమకంగా అన్నాడు పాదచారి.

“నాకు తెలుసు పిచ్చోడా! నాకు తెలుసు! నీకు తెలియని ఓ మాట చెప్పనా? నువ్వు లేక పోతే నా existence లేనేలేదు.” గుండెలకు వెచ్చగా హత్తుకుంటూ అంది అమృత.

“నువ్వు స్త్రీవి…. ఓ అమృతా, నీ దైవత్వాన్ని నేను ఊహించలేను…. నీ సన్నని వేళ్ళ స్పర్శ నాకు చెప్పోంది… కానీ నేను దాన్ని అంటే, ఆ స్పర్శలోని అద్భతాన్ని వర్నించటానికి అశక్తుడ్ని… ఎందుకంటే నా భాష బలహీనమైంది గనక. ఓ అమృతా, నా పోషణకు నీవు లేని క్షణమూ, నీ స్పృహ నా మనస్సులో లేని క్షణమూ నాకు లేనే లేదు. అలాంటి క్షమమే నా దృష్టిలో మరణం. నేను పురుషుడ్ని అయితే నువ్వు శక్తివి. శక్తిలేని పురుష స్వరూపం దేనికీ” ఆమె మెత్తని గుండెల్లో తలదాచుకున్నాడు పాదచారి.

ఓ అనంతం గడ్డకట్టిన అనుభూతి.

***

మానసి

“ఇదిగో… ఇదినా అందమైన ముసుగు!… కనిపిస్తోందా పాదచారీ?” విచారంగా అంది మానసి.

“ఊహూ!… నీ ముసుగు కనపడటంలా!… దాని వెనకాల క్షణక్షణమూ నా భావాలకి అనుగుణంగా నీవు మార్చుకునే రూపాలూ కన్పించటంలా!… స్వచ్ఛమైన ఓ తెల్లని వెలుగుతున్న చైతన్యం కనిపిస్తోంది. నీవు వేసుకుంటున్నాననుకున్న ముసుగూ, మార్చుకుంటున్నాను అంటున్న రూపాలూ అవన్నీ ఆ చైతన్యమే.”

“ఎలా?”

“మట్టితో లక్ష బొమ్మలు చెయ్యి. అది పిల్లి బొమ్మ, ఇది కుక్క బొమ్మ, అది సింహం బొమ్మ, ఇది ఒంటె బొమ్మ అన్ని గుర్తు పట్టగలవు. ఓ వర్షం కురిసి ఆ బొమ్మలు కరిగిపోతే? మట్టి మట్టిగానే ఉంటుంది. రూపాలు మాత్రం పోతాయి. మట్టి ఎక్కడికీ పోదు. కనక అసలు పోయేదే లేదు. So ఓ మానసీ, నువ్వూ నీవు గానే ఉన్నావు. పోయిందీ లేదు. పోగొట్టుకున్నదీ లేదు. నాకు ఏ ముసుగూ కనిపించడంలేదు” వెన్నుతట్టాడు పాదచారి.

“నిన్ను కౌగిలించుకోవాలని ఉంది పాదచారీ” ఆనందంగా కౌగిలించుకుంది మానసి.

పకపకా నవ్వాడు పాదచారి.

“ఇదిగో ఇప్పుడు మాత్రం ముసుగు కప్పేయడంలా వుంది” అంది.

***

విజ్ఞానాచార్యులు

“అపారమైన విజ్ఞానం సంపాయించాను! కానీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నేర్చుకున్నది సముద్రంలో నీటి బొట్టంత కూడా లేదని అనిపిస్తుంది!…. ఏమంటావ్ పాదచారీ?”

“చాలా వినయంగా చెప్తున్న మూర్ఖత్వమంటాను…”

“ఓ విజ్ఞానాచార్యా… ఎందుకీ పిచ్చి గోల? ఓ లేత ఆకుని చూడండి. అత్యంత సహజంగా సూర్యకాంతిలో పత్రహరితాన్ని సమకూర్చుకుంటుంది. రాలిపోయే కాలం వస్తే ‘చిటుక్కు’ మని నిట్టూర్చి రాలిపోతుంది. అంతే! తను చీకిపోయి ఎరువుగా మారి మరో జీవికి బలాన్నిస్తుంది. అదే ఆనందం. అదే విజ్ఞానం! అదే సర్వస్వం!… నాకు తెల్సింది అదే” నవ్వుతూ ముందుకి నడిచాడు పాదచారి.

“హూ… విజ్ఞాన దాహం లేకపోవటం పిచ్చితనం… అయినా నీతో నాకెందుకు?” చరచరా నడిచాడు విజ్ఞానాచార్యులు.

“నా పేరు మీకు తెల్సా?” వస్తూనే ప్రశ్నించిందావిడ.

“మీ పేరు నాకెలా తెలుస్తుందీ?” నవ్వాడు పాదచారి.

“నా పేరు సందేహం… ఇదిగో… అబ్బ నాలానే ఉంటుంది… నా కంటే కొంచెం జాగ్రత్త ఎక్కువ… ఈ పక్కన నిలబడిందే… ఇది నా చెల్లి… పేరు అనుమానం…”

“బాగుంది…” తలవుపాడు పాదచారి.

“ఏం బావుంది?…” అనుమానంగా అడిగింది అనుమానం.

“ఏదో మరి…. మాములుగా బాగుందీ అన్నా అంతే” బుర్ర గోక్కున్నాడు పాదచారి.

“అది సరే గానీ, ఓ ఆకు పుట్టటం, పెద్దదవటం రాలిపోవటం అదే జీవితమనీ అదే విజ్ఞానమనీ అన్నావటగా!… నేను నిన్నో ప్రశ్న అడగొచ్చా?” సందేహిస్తూ అడిగింది సందేహం.

“సందేహం ఎందుకూ?”

“నా పేరు సందేహం గనక!…”

“O.k. ప్రొసీడ్…” నవ్వాడ పాదచారి

“విజ్ఞానంలో సందేహం ఉండదా?” ప్రశ్నించింది సందేహం.

“ఎందుకూ, ఎలా? అన్న ప్రశ్నల్ని పుట్టించి సమాధానం వెదికించేది సందేహం, ఆ సందేహపు పునాది మీద సాగేది అన్వేషణ. ఆ అన్వేషణకి కావాల్సింది సంకల్పం. ఆ సంల్పబలమూ అన్వేషణా ఓ చోట పోగుపడితే, ఆ పోగుని మళ్ళీ మళ్ళీ పరిశోధించి పరిశోధించి గాలించి గాలించి, చిత్రికపట్టి అసలు సిసలైన సారాన్ని పిండితే ఉద్భవించేది విజ్ఞానం. సందేహం బిగినింగ్ అయితే రిజల్టు విజ్ఞానం.”

“ఎలా?” ప్రశ్నించింది అనుమానం….

“పాలు తీసి వేడి చేసి తోడు పెట్టి ఆ పెరుగుని చిలికి వెన్నతీసి, మళ్ళీ కరగ బెడితే వచ్చేది నెయ్యి. నెయ్యికి మూలం పాలు అయినా, నేతికి పాల యొక్క గుణం, రూపం etc లు ఉండవు. అలానే విజ్ఞానానికి మూలం సందేహం అయినా విజ్ఞానంలో సందేహం ఉండదు.”

“మరి అనుమానమంటే” ప్రశ్నించింది అనుమానం. ‘Of course అది నా పేరేననుకో’ అన్నది.

“లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ఊహించుకోవటం… అది భ్రాంతిలోంచి పుట్టింది.”

“ఊహూ అర్థం కాలా…” తల అడ్డంగా ఊపింది అనుమానం.

“O.k రోడ్డు మీద ఏదో కనపడింది చీకట్లో… అది పాము అనో, తాడు అనో ఊహించటం బ్రాంతి. పామా? తాడా? అని ఊగులాడటం పరిశీలించటం అది సందేహం. అయ్యో అది పామేనేమో అని అనుకొని పారిపోవడం అనుమానం.”

“అది సందేహం ఎందుకు కాకూడదూ?” ప్రశ్నించింది అనుమానం.

“సందేహం పాజిటివ్ ఫోర్స్. అనుమానం నెగటివ్ ఫోర్స్. సందేహానికి ప్రిజుడిస్ లేవు. అనుమానానికి ఉన్నాయి. అనుమానంలో ego(అహంభావం) ఉంటుంది. సందేహంలో ఉండేది జిజ్ఞాస.”

“అంతేనంటావా?” నీరసంగా అంది అనుమానం

“ఔ… ఔ…” అన్నట్లు “భౌ… భౌ…” మంది విశ్వాసం.

పాదచారి ముందుకి కదిలాడు.

పాదలు నడుస్తూనే ఉన్నాయి.

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here