పాదచారి-5

9
9

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 5వ భాగం. [/box]

అద్దానికి అవతలి వేపున

[dropcap]”అ[/dropcap]ద్దానికి ఆవల ‘తీరం’
అద్దానికి యీవల ‘మోహం’
అద్దంలో నీ ప్రతి బింబం
వెలుగుతున్న మిథ్యా రూపం”

“నేను చిరంజీవిని” అరిచాడు పాదచారి. గాలీ, ధూళీ, విననట్లు నిశ్శబ్దంగా ఊరుకున్నాయి.

“చెప్పేది మీకే! నేను చిరంజీవిని” మళ్ళీ కోపంగా గట్టిగా అరిచాడు పాదచారి.

మిట్టమధ్యాహ్నపు టెండలో మదించిన అడవి, నీడల పొడిని వృక్షాగ్రాల నుంచి కిందకి జల్లుతూ పాదచారి అరుపుకి ఉలిక్కిపడి లేచి ఊగుతూ గాలిని లేవగొట్టింది.

‘యస్! యస్’ అన్నట్లుగా బుస్ బుస్ మని ఓ పాము పడగెత్తి పాదచారిని ఓసారి పరికించి చూసి, పక్కకి ఒదిగి పక్కుంటూ వెళిపోయింది.

ఓ అడవి తీగ ముద్దాడుతున్నట్లుగా తను పెనవేసిన వృక్షాన్ని ఊగుతూ స్పృశించింది.

పాదచారి తలపైకెత్తి ఆకాశపు నీడల్ని చూసి మెల్లగా తలదించుకుంటూ గొణుక్కున్నాడు “అయినా నేను దుర్బలుణ్ణి”.

“ఏమిటి ఏమిటి?” అంది ఓ తీతువు పిట్ట.

“అదే, నేను చిరంజీవిని”, “అయినా శక్తిహీనుణ్ణి”

ఇంకోసారి ఇంకొంచెం మెల్లగా అన్నాడు పాదచారి.

చింత చిగురు కొరికి “క్రిక్! క్రిక్”మంటూ అరిచిందో గిజిగాడు.

“ఎలా! ఎలా” అన్నట్టుగా “కుహూ! కుహూ!”అంటూ కూసిందో ఆవలించే కోయిల.

తొలకరికి మొలకలెత్తిన పచ్చని పచ్చికమీద ఎఱ్ఱ ఎఱ్ఱగా అడుగులు వేస్తూ పాకింది ఓ ఆరుద్ర పురుగు.

మెల్లగా దాని ముఖమల్ వీపును నిమిరాడు పాదచారి.

“నన్ను నేను మరిచిపోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఓ అందమైన ఆరుద్రజీవీ! – నా ప్రయత్నంలో గెలవటానికి కాసేపు నన్ను నీ వీపుని నిమరనీ!” పాదచారి పొందిగ్గా కింద కూర్చున్నాడు.

“నిన్ను నీవు మరిచిపోవడం! వహ్వ! శభాష్! పాదచారీ! నీలోనించి పారిపోవటానికి నీవే ప్రయత్నించే పలాయనవాదీ!” సత్యమూర్తి పకపకా నవ్వాడు.

గిరుక్కున వెనక్కి తిరిగాదు పాదచారి.

“నేనూ వచ్చాను!” అంటు బుసల్లాంటి పొగలు ముక్కుల్లోంచి జారుస్తూ నిలిచాడు విప్లవమూర్తి.

“నేను నీకు ఎప్పుడూ ఇచ్చేది సపోర్టే” అలవోకగా అందంగా వచ్చి లాలనగా భుజం మీద చెయ్యి వేసింది కవితాకుమారి.

“One at a time” అంటూ విశ్రాంతిగా కూర్చున్నాడు విజ్ఞానాచార్యులు.

“ఎందుకొచ్చారు మీరంతా? నా మానాన నన్ను వదిలెయ్యలేరా? ఫొండి! ఫొండి!” అరిచాడు పాదచారి.

“మాకు సమాధానం చెప్పేదాక వదలనే వదలం” భీష్మించారు అందరూ!

“ముందు నా వంతు!” కరుగ్గా అన్నాడు విప్లవమూర్తి.

“Ladies First” అంది కవితాకుమారి.

“పెద్దవాణ్ణి నేను…” దగ్గుతూ అన్నాడు విజ్ఞానాచార్యులు.

“Excuse me please” అంటు ముందుకొచ్చి నిలిచాడో పొడవైన వ్యక్తి.

“మీ మేనేజర్ని”

“దేనికి మేనేజర్‌వి? ఏం మేనేజ్ చేస్తుంటావు?”

“మీ ఊహల ఫ్యాక్టరీనీ, ఆశల కర్మాగారాల్నీ మేనేజ్ చేస్తూంటాను.

“ఇపుడెందు కొచ్చావు?”

“తాళాలు కావాలి సార్!”

“దేనివి?”

“జ్ఞాపకాల గ్రంథాలయానివి!”

“దానితో నీకేం పని?”

“సార్! నేను మీ సేవకుణ్ణి! అపుడపుడు లైబ్రేరియన్‌గా కూడా పనిచేస్తుంటాను. మీరు గుర్తించలేదేమో!”

“సరే సరే! ఇప్పుడేం పని బడింది?”

“జ్ఞాపకాల గ్రంథాలయం చాలా కాలంగా మూతబడి ఊరుకుంది. దాని అణువుల గ్రంథాల్ని దులిపి బాగు చేద్దామని!”

“ఓ నా సేవకుడైన మేనేజరూ… నీ దార్న నువు ఫో!”

“అలా వీల్లేదు… అతనికి తాళాలివ్వాల్సిందే” కరుగ్గా అన్నాడు విప్లవమూర్తి.

“మేమూ దాన్ని చూస్తాము” అన్నాడు సత్యారావు.

అందులో కవితలూ, కథలూ ఉన్నాయా?” కుతూహలంగా అడిగింది కవితాకుమారి.

కాసేపు ఆగి మళ్ళీ అంది “నేనూ దాన్ని చూసినట్లే, అందులో ఉన్నట్లే గుర్తు. చాలాకాలం అయింది. ఎంత మంది అతిథులో! ఎంత మంది అతిథులో! మర్చిపోయేను. మరే, మర్చిపోయే ఉంటాను!”

“నా ఎదుట నువు మాట్లాడకు. నీలో కొన్ని గుణాలే నాకిష్టం! మిగతాదంతా శూన్యం” కరుగ్గా అన్నాడు విప్లవమూర్తి.

“మీరిద్దరూ పిచ్చివాళ్ళే” డిక్లేర్ చేశాడు సత్యారావు.

“ఆగండాగండి! అందరూ సమానమే” గడ్డం నిమురుకుంటూ అన్నాడు విజ్ఞానాచార్యుడు.

“వీళ్ళందర్నీ ముందు వదుల్చుకోడం ఎలా?” ఆలోచించాడు పాదచారి.

“అయ్యా! తాళాలు” remind చేశాడు మేనేజర్.

“సరేగాని మేనేజరూ! నీ ఫ్యాక్టరీ దేన్ని ఉత్పత్తి చేస్తుంది?” ప్రశ్నించాడు పాదచారి.

“ఇ… హి… హీ! ఫ్యాక్టరీ తమదేనండీ! నేను just care taker ని!”

“అంటే నువ్వేం చేస్తావు?”

“జనరల్ మేనేజర్ గారి పర్మిషన్‌తో అన్నిట్నీ, అంతట్నీ రికార్డు చేసి సక్రమంగా షెల్ఫుల్లో దాయటమో, file చేయటమో చేస్తుంటానండీ”

“ఆ జనరల్ మేనేజర్ ఎవరు?”

“వారు తమ దర్శనం చేసుకుంటానన్నారండీ!”

“పిచ్చి మాటల కాలయాపనా?” గద్దించాడు విప్లవమూర్తి.

అందరూ లేచి చుట్టూ చేరారు.

“వీళ్ళను వదిలించుకుంటాను” గుండె జేబులోనుంచి తాళాలు గుప్పెటతో తీసి దూరంగా విసిరేశాడు పాదచారి.

“ఆహా – హా! ఊహూ – హూ” ఆనందంగా కేరింతలు కొడుతూ అందరూ పరిగెత్తారు.

నిట్టూరుస్తూ చుట్టూ చూశాడు పాదచారి.

ఆకాశం మబ్బుల్తో నిండిపోయి అద్భుతమైన ఆయిల్ పెయింట్ వేసుకుంది.

ఉరుములు మెరుపుల చిత్రాలు చిక్కగా అలుముకున్నాయి.

చెట్లన్నీ ఊగుతూ ఊగుతూ “రా! రా! రండి! రండి! వర్షకన్యా!” అంటూ వర్షరాణిని ఆహ్వానించాయి. మృగశిర మూడోకార్తె. ముచ్చటగా చినుకుల శిరోజాల్ని చిక్కగా విదిలించింది.

అడవిలత వృక్షపురుషుడిని తమకంగా కౌగిలించు ఊగుతూ ముద్దులిచ్చేస్తోంది!

“ఈ లోకం నాకు విడిది!” అనుకున్నాడు పాదచారి.

“ఈ వృక్షాలు, పశుపక్ష్యాదులు అన్నీ నేనే!”

కొండలు లోయలు

కోనలు పూవులు

అన్నీ అన్నీ నా నేస్తాలే!

అన్నీ అన్నీ నా దేహాలే!

“రా! రా! పాదచారీ! నా ప్రియమైన బాటసారీ! నా కాలపు నీడలో కూర్చో! చినుకుల వేటనించి తలదాచుకో!” పిలిచింది ఓ కొండవాలు.

కాలు మీద కలౌ వేసుకుని వాలుగా పడుకుని కొండవాలుని చేత్తో నిమిరి, “ఈ లోకం నాకు విడిది! ‘నా’ లోకానికి ఒకసారి సెలవల్లో వెళ్ళొస్తాను?” అనుకుంటూ మళ్ళీ గొణుక్కున్నాడు పాదచారి.

కుయ్… కుయ్ మంటూ పక్కనచేరి పాదాలు నాకింది కుక్కపిల్ల.

నేను అలసిపోలేదు!

నేను సొలసిపోలేదు!

నే ఓడిపోలేదు!

నే వాడిపోలేదు!

మరెందుకు నీకీ నిద్ర?

ఇంకెందుకు యీ మౌనపు ముద్ర?

దిగ్గున లేచి హుషారుగా యీల వేశాడు. కుక్కపిల్ల వీపు మీద చిలిపిగా చరిచి, “చల్ చల్” అంటూ ముందుకు నడిచాడు.

***

“నేను శిల్పిని కాదు!”

“కనీసం చిత్రకారుణ్ణి కాదు!”

“భావాల్ని భాషలో ఇమిడ్చే కవిని కాదు”

“కవి చెప్పలేని భావాల్ని ఉత్తినే రాగంలో వెలయించే గాయకుణ్ణి కాదు”

“వైణికుణ్ణి కాదు – కాలపు సైనికుణ్ణి కాదు!” గడ్డిపువ్వుతో అన్నాడు పాదచారి.

“నీ భావాలు మాకు తెలుసు! అయినా మళ్ళీ మళ్ళీ వింటాం!” కొంచెం దూరంలో ఉన్న మఱ్ఱి ఆకులు కలకలంగా అన్నాయి.

“సరే! చక్కగా కూర్చుని చెప్పు! ఇదిగో నీ కోసం పచ్చగడ్డి సింహాసనం!” గరిక వీరుడు ఒదిగి చోటు ఇచ్చాడు.

పాదచారి కాసేపు ఆలోచించాడు.

“మీరంతా నా నేస్తాలు. వినండి! వినండి!”

“ఆకాశంలో పక్షుల్లారా!

భూమిని సాగే జీవుల్లారా!

చెట్టుల్లారా! పుట్టల్లారా!

దిక్కుల్లారా! దృక్కుల్లారా!

రారండోయ్ ఓ కథ కోసం!

నే చెప్తానది మీ కోసం!” ఎలుగెత్తి పిలిచాడు పాదచారి. కోయిలా, గిజిగాడూ, చీమరాజులూ, పింఛపు నెమలీ, అందరూ చుట్టూ చేరారు!

“మా ఖర్మ ఇంతే! కదల్లేం! మెదల్లేం! సరే ఇక్కడినించే వింటాములే. చెప్పు!” అన్నాయి వృక్షాలు.

“అదుగో! అది ‘నా’ లోకం!

అదుగో! అదే సిసలైన ‘నా’ దేహం!

అక్కడే ఉంది నా దివాణం!

అక్కడికే ఇప్పుడు మన ప్రయాణం!”

ఓ తార కలువలా కళ్ళు చికిలిస్తూ విచ్చుకుంది.

పాదచారి పకపకా నవ్వుతూ పరుగులు పెట్టాడు!

***

“పాదచారీ!”

“ఊఁ”

“ఇలాగే ఉంటావా?”

“ఊఁ”

“మాట్లాడవేమి?”

“ఎక్కడో పాల సముద్రం మధ్యన ఓ పెద్ద తామరాకుపై శాంతంగా పడుకున్నాను”

“పిచ్చీ!”

తన గుండెల్లో దూర్చిన అతని తలను పైకెత్తి చిట్టి చిట్టి ముద్దులు పెట్టింది అమృత.

ఎంత చక్కని సువాసన ఆమెది?

తమకంగా కౌగిలించుకుని గుండెల్లోకి మళ్ళీ దూరిపోయాడు.

తల నిమురుతూ అంది “ఆకాశం చూడు! ఎంత స్వచ్ఛంగా ఉందో!”

“నేను చూడను”

“ఏం?” నవ్వింది.

“అన్నీ నాకు ఇక్కడే ఉన్నాయి. స్వచ్ఛమైన నీలాకాశం, నీలి నీలి సముద్రాలూ, పచ్చ పచ్చని పైరులూ, అడవులూ, మృదువైన మల్లెలూ, మనసూ అన్నీ నాకిక్కడే ఉన్నాయి.”

“అయితే అలాగే ఉండిపోతావా?”

“ఆ! ఎప్పటికీ!”

“నా పిచ్చివాడా!… నా పిచ్చివాడా!” తలపైకి ఎత్తి మళ్ళీ ముద్దులు పెట్టి అంది “ఈ లోకం నిన్ను చూసి నవ్వుతుంది” అంటూ నవ్వింది అమృత. ఆమె నున్నని మెడని నిమురూతూ అన్నాడు పాదచారి – “నాకేం?”

“మానం లేని వాడవంటుంది”

“అనుకోనీ”

“లోకంతో పనే లేదా!”

“లేదు.”

కొద్దిసేపు ఆగి తను అంది “నాకు లోకంతో పని ఉంది. నేను స్త్రీని. ఈ లోకపు రక్షణ కావాలి.”

దిగ్గున తల ఇవతలికి తీశాడు పాదచారి.

“లోకం రక్షణ ఇవ్వగలదా? స్త్రీ అయినంత మాత్రానా….”

తను నవ్వింది.

“నీది వేడి రక్తం చూడు! లోకం లోకమే!”

“అవును లోకం లోకమే. మనిషి తిండి లేక ఎండేటపుడు ఏమీ చెయ్యని లోకం మంచి చెడ్డల న్యాయాలకి నేను ఉన్నానని కూస్తుంది. లోకం లోకమే!”

“అయినా తప్పదు పాదచారీ!”

“సరే!… నువు లోకంతో రాజీపడు. నాకు లోకం అంటే లెక్క లేదు. అది గౌరవించినా, గౌరవించకపోయినా నా దార్న నేను తల ఎత్తుకునే నడుస్తాను.”

కాసేపు అతని ముఖంపై ముద్దులు పెట్టి అంది – “అయితే నేను మారాలి కొంత.”

“ఎలా?”

“కష్టమే! అయినా నిన్ను దూరంగా ఉంచాలి”

“చూడూ!” మాట పెగల్లేదు పాదచారికి. కాసేపయ్యాక తమాయించుకుని అన్నాడు – “నీ కోసం ఏం చెయ్యను? లోకానికి తల ఒగ్గనా? సరే! ఈ లోకానికి బానిసనవనా? సరే! ఈ లోకపు పిచ్చి రీతుల్ని పాటించనా? సరే! ఇంకేం చెయ్యను? చెప్పు.”

ఎంత బలహీనుడవయ్యావు?… ఓ స్త్రీ కోసం?”

“ఇది బలహీనతా! ఏమో! ఇక స్త్రీ సంగతా! మరి కొన్ని మాంసపు ముద్దలు. అందమన్ అమర్పు. అయినా అందులో అద్భుతం లేదు. చూడు!… నీ చేతులు నా తల నిమురుతున్నాయి. అందులో అద్భుతం నేనేమని చెప్పను? వేళ్ళంటావా? అవి తయారైంది ఎముకలూ, రక్తం, మాంసంతో! ఊహూఁ! దాని వెనకాల కనపడకుండా ప్రవహించే అనురాగమో, ప్రేమో, ఆనందమో దాన్ని ఎట్లా చెప్పడం? నేను చూసేది దాన్ని.”

“ఆ భావన అందరిలోనూ ఉంది!”

“ఉండవచ్చు అమృతా! ఆ భావన అందరిలోనూ ఉంటుంది కానీ, ఓ మాట విను. ఏ స్త్రీని చూసినా నీలోని ఓ అణువు అక్కడున్నట్లనిపిస్తుంది. కనీసం శరీరం ఆకృతిలో ఓ అణువు. ఆ అణువు కోసం ప్రపంచం సర్వాన్నీ ప్రేమిస్తున్నాను. ప్రతి స్త్రీలోనూ విహ్వలంగా నేను వెతుక్కునేది ఆ అణువులే. అపుడే ప్రపంచమే నీవయ్యావు. నీకు ‘ఆది’ ఎక్కడా! అంతమెక్కడా! ఇపుడు చెప్పు దీనిని బలహీనత అంటారా? ఓహోయ్! ఇది బలహీనత అయితే ఇంక బలం అన్న మాట లేనే లేదు.”

“నీ వన్నీ పిచ్చి ఊహలూ, పిచ్చి లోకమూ!” చిరునవ్వుతో దయగా ముద్దు పెట్టింది అమృత.

“కావచ్చు! కానీ అమృతా నేను ‘నా’లాగానే సుఖిస్తున్నాను. నేను ‘నా’లాగానే వెదుక్కుంటున్నాను. నన్ను నేనే పోగొట్టుకుంటున్నాను. ఆ పోగొట్టుకోటం ఏమిటో తెలిసిందీ తెలుసుకున్నదీ నీ దగ్గరే.”

పాదాలపై తలవాల్చి విశ్రమించాడు పాదచారి.

‘ఓ క్షణం’ ఆశ్చర్యంగా అలానే ఆగిపోయింది.

“ఇంకేమీ యీ లోకంలో నీకు వద్దా?”

“కావల్సింది యేముందీ? ఎందుకసలు కావాలనుకోవడం? నేను వచ్చాను. నేను వెడతాను. ఈ రావడం, పోవడం అన్నది నా చేతిలో లేదు. మరి దెనికి పోగు చెయ్యడం?”

“ఫలానా అని నీ గుర్తు యీ ప్రపంచం మీద నిలపడానికి!”

పకపకా నవ్వాడు పాదచారి.

“చూడూ ప్రపంచాన్ని జయించిన మహావీరులేమయ్యారు? మార్పులూ చేర్పులూ చేసిన మహామహులేమయ్యారు? ముక్కు మూసుకున్న వేదాంతులేమయ్యారు? లోకానికి దూరంగా ఆకూ-అలమూ తిని బతికిన ఋషీశ్వరులేమయ్యారు? శ్మశానవాటికలో అణువులుగా మిగిలిపోయారుగా! ఏవీ వారి గుర్తులు? మాటలు రాని, భాష లేని ఆదిమానవులు తమ ‘గుర్తు’ అని తెలియకుండానే ఎన్ని సృష్టించారో? ఎలా సృష్టిలో కలిసిపోయారో? వికృతీ లేదూ, ప్రకృతీ లేదు. ఉన్నదమ్తా అలానే ఉంది. దేశభక్తులు పోయినా దేశం ఉన్నచోటే ఉంది. జయించిన వాడూ లేడు. జయించిందీ లేదు. ఏదో కాసేపు ‘ఇది నా గుర్తు’ అనుకోవడమే. ఎందుకో యీ వృథా ప్రయాస?”

“ప్రజలంతా మూర్ఖులనీ, నీదొక్కటే నిజమనా నీ అభిప్రాయం?” చిరుకోపంగా అడిగింది.

“ప్రజలు ప్రజలే! ఎవరిక్కావలసిన రీతిలో వారు బ్రతుకుతారు. ఎవరిక్కావలసిన ‘గుర్తు’ వారేర్పరుచుకుంటారు. అంతెందుకు, నాలా నిర్లక్ష్యంగా ఉండమని నేనేం ప్రబోధించడం లేదుగా! ఇది నా ఉద్దేశం. నా మటుకు నేను అలాగే ఉంటాను.”

“ఓ రోజు ఇందుకే ఏడుస్తావు”

“పోనీలే! ఏడ్చినా నేనేగా! ఏ మనిషీ ఎప్పుడూ నవ్వాలనుకోవడమూ అత్యాశే! ఏడ్చే క్షణమే ఉంటే అదీ అద్భుతమే. అందులోనూ ఉన్నది సౌందర్యమే.”

“నువ్వు  పిచ్చివాడివోయీ!” గట్టిగా పాదచారి తలను గుండెల్లో దాచుకుని అంది.

ఆనందంగా నవ్వాడు పాదచారి.

తల్లిని బిడ్డలా కౌగిలించుకున్నాడు.

ఓ తీతువు పిట్ట అరిచింది.

గభాల్న కళ్ళు తెరిచాడు. అంతా కలే!

అంతా నిజమే! చుట్టూ చూస్తే అపుడే వస్తున్న సూర్యుడు. కళ్ళు నులుముకుని లేచాడు.

“నా జీవితమూ, నా కలా రెండూ ఒకటే! ఒక దాన్లో ఇంకోటి ఎప్పుడూ కలిసే ఉన్నాయి” అనుకుంటూ ముందుకు నడిచాడు. కుక్కపిల్ల బద్దకంగా వళ్ళు విరుచుకుని అతని వెనకాల అడుగులు వేస్తూ నడిచింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here