[dropcap]డా. [/dropcap]విజయ్ కోగంటి, డా. పద్మజ కలపాల సంయుక్తంగా ‘రస్తా’ ఆన్‍లైన్ మ్యాగజైన్‍లో నిర్వహించిన కాలమ్‌లో వెలువడిన వ్యాసాల సంపుటి ‘పడమటి రాగం’. ఇది పాశ్చాత్య రచయితల పరిచయ వ్యాస సంపుటి.
ఇందులో – విలియం బ్లేక్, కోలరిజ్, వర్డ్స్‌వర్త్, బైరన్, షెల్లీ, జాన్ కీట్స్, జేన్ ఆస్టిన్, బ్రాంటీ సిస్టర్స్, వాల్ట్ విట్మన్, దొస్తాయవిస్కీ, వర్జీనియా ఉల్ఫ్, హెన్రిక్ ఇబ్సెన్, ఎమిలీ డికిన్సన్, మార్క్ ట్వెయిన్, గీ ద మోపస, ఏంటన్ చెఖోవ్, జార్జ్ బెర్నార్డ్ షా, ఓ హెన్రీ, ఫ్రాంజ్ కాఫ్కా, యుజిన్ ఓనీల్, అనా అఖ్మతొవా, బర్తోల్ బ్రెహ్ట్ – గురించి విశిష్టమైన వ్యాసాలున్నాయి.
***
“విజయ్ కోగంటి, పద్మజ కలపాల అందిస్తున్న ‘పడమటి రాగం’ పశ్చిమ కవన, కథన రీతులను, వాటి తాత్విక, చారిత్రక నేపథ్యాలను ఒక చోట చేర్చడం ద్వారా ప్రపంచ సాహిత్యం గురించి సమగ్ర అవగాహనను అందిస్తోంది. పుస్తకం ఇంగ్లీషు సాహిత్యానికి మాత్రమే పరిమితం కాదు. మనిషి మదిలోని చీకటిని వెలిగించిన రష్యన్ నావలికుడు దోస్తయేవ్ స్కీ, ఇప్పటికీ తాజా అనిపించేలా దైనందిన జీవితాన్ని కళ్లకు కట్టిన మరో రష్యన్ కథకుడు ఆంటన్ చెఖోవ్, మనిషికి పురుగుకి పెద్ద తేడా ఏముందని విషాదించిన చెక్/జర్మన్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా, స్టాలినిస్టు నిరంకుశం మీద కవితాస్త్రాలు విసిరిన రష్యన్ కవయిత్రి అనా అఖ్మతోవా, మన అభ్యుదయ/విప్లవ కవనాల తొలి చాలు జర్మన్ నాటకకర్త/కవి బెర్తోల్ బ్రెహ్ట్…. ఇంకా పలువురిని ఈ పుస్తకం పరిచయం చేస్తుంది.
కవిత్వం, కథ చదవడం లేదా రాయడం నేర్చుకునే వారికి ఈ పుస్తకం చక్కని కరదీపిక అవుతుంది. ఎప్పటికప్పుడు కమ్ముకునే చీకట్లలో ఇలాంటి కరదీపికలు అవసరం.
‘చీకటి రోజులలో పాడడముంటుందా? ఉంటుంది,
చీకటి కాలం గురించి పాడడముంటుంది.’
‘ప్రతిరోజూ తిండి కోసం నేను అబద్ధాలనమ్మే మార్కెట్ కెళ్తాను. నేను బహుశా అమ్ముకునే వారి మధ్య నా స్థానాన్ని తీసుకుంటాను.’
అంటూ విజయ్, పద్మజ ఉటంకించిన బెర్తోల్ బ్రెస్ట్ మాటలు ఈ పుస్తకం వైఖరికి మచ్చుతునకలు” అని వ్యాఖ్యానించారు శ్రీ హెచ్చార్కె తమ ముందుమాట ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఒక్కటే మనిషి హృదయ స్పందన’లో.
***
“‘పడమటి’ పేరంటేనే స్ఫురించేది పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దేశాలు. ఆయా దేశాలలో ఆయా కాలాల్లోని ఆధిపత్య సంస్కృతిని, అధికార దురహంకారాలను నిరసిస్తూ, ఎదిరిస్తూ ప్రజల పక్షాన నిలిచి సాహిత్య సృజన గావించిన మహా రచయితల జీవన రాగాన్ని వినిపిస్తూ వారి ఉత్తమ సాహిత్యాన్ని పరిచయం చేస్తున్న మంచి పుస్తకం ‘పడమటి రాగం’. భిన్న రీతులలో, విభిన్న ప్రక్రియలలో విశిష్ట సాహితీవేత్తలుగా పేరొందిన ప్రపంచ ప్రసిద్ధ రచయితల సాహిత్య కృషిని మన ముందుంచుతున్న ఈ చిరు పొత్తం వారి సమగ్ర సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఒకానొక సాహిత్య ప్రయోజనాన్ని సాధిస్తోంది. ప్రపంచంలో గతకాలంలో విరాజిల్లిన సాహిత్యోద్యమాలు, నూతన ఆవిష్కరణలను తెలియజేసే చారిత్రక పత్రమీ పుస్తకం. అంతేగాక ఆయా దేశాల జీవన, సాంస్కృతిక సారాంశాన్ని రూపుకట్టి ప్రాపంచిక దృష్టిని ప్రసరిస్తున్న రచన ఇది. విలువైన సాంస్కృతిక వారసత్వ సంపదను మన ముందుంచుతూ ప్రపంచీకరణ సందర్భంలో ఆదాన ప్రదానాల అవసరాన్నీ, ఆవశ్యకతను మరింతగా నినదిస్తున్నదీ గ్రంథం. రచయితలు విజయ్ కోగంటి, పద్మజ కలపాల అభినందనీయులు. అభ్యుదయ రచయితల సంఘం (అ.ర.సం.) పక్షాన శుభాకాంక్షలు.” అని శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ వెనుక అట్టపై పేర్కొన్నారు.
***
“తన చుట్టూ జరిగిన జరుగుతున్న సాంఘిక రాజకీయ విప్లవాల పరిస్థితులేమీ తనను ప్రభావం చేయనట్లుగా మధ్య తరగతి కుటుంబాల మాత్రమే వ్రాసింది. సమకాలీన నెపోలియన్ యుద్ధాలు, ఫ్రెంచి విప్లవ ఘటనల గురించి ఆమె ఏమీ వ్రాయలేదు. ప్రేమలో పడడం, అపార్థాలు, చెప్పకుండా వెళ్ళి పోవడాలు, కుంగిపోవడం, అనేక సంఘర్షణల తర్వాత నిజాన్ని గ్రహించడం వంటి ఇతివృత్తాలతో మధ్య తరగతి కుటుంబాల కథలను వ్రాసింది” అంటారు జేన్ ఆస్టిన్ గురించిన వ్యాసంలో.
***
“మనిషి – ప్రకృతి మధ్య సంబంధం గురించి వివరిస్తూ ‘మానవుల మానసిక శ్రేయస్సు ప్రకృతితో ముడిపడి ఉందని, ప్రతి మనిషి ఈ జీవితాన్ని పూర్తిగా ఆనందించాల్సిన అవసరం ఉంద’ని చెప్పాడు. వాల్ విట్మన్ ప్రతి కవితలోను ‘ప్రకృతి, మానవుడు సృష్టించిన కృత్రిమ ప్రకృతి, ఏదో ఒక రూపంలో – కొండలు, కోనలు, వాగులు, తటాకాలు, రెల్లుగడ్డి, ఆకాశం, నక్షత్రాలు, చెట్లు ఆకులు, పూలు, గడ్డిపరకలు, రాళ్ళు, భవనాలు, రహదారులు, ఇళ్ళల్లో ఉండే అనేక వస్తువులతో సహా’ ఇలా అన్నిగా నవ్వుతూ పలకరిస్తాయి. ఒక తాత్త్విక స్థితిని కల్పిస్తాయి. పరిపూర్ణమైన జీవితాన్నిహత్తుకోమని చెపుతాయి.” అంటారు వాల్ విట్మన్ గురించిన వ్యాసంలో.
***
“ఇక అకాల్పనిక రచనలను పరిశీలిస్తే ఉల్ఫ్ చాలా సూటిగా సమాజంలోని పురుషాధిక్యాన్ని ప్రశ్నించింది. ఎవరికెవరు తక్కువ కాదనీ ప్రతి వ్యక్తిలో ఈ రెండు పార్శ్వాలు సమానంగా ఉండాలని చెప్పింది. ‘అ రూం ఆఫ్ వన్స్ వోన్’ రెండు వేర్వేరు సందర్భాలలో ఆమె ప్రసంగాల సంకలనం కాగా, ‘త్రీ గినీస్’, ‘మీ అభిప్రాయంలో యుద్ధాన్ని నిరోధించడం ఎలా?’ అన్న ప్రశ్నకు ప్రతిస్పందనగా వచ్చిన 130 పేజీల వ్యాసం. ఈ రెండు రచనల ద్వారా మహిళల పట్ల చారిత్రక వారసత్వంగా చూపబడుతున్న వివక్ష – అంటే ‘ఆనాటి విద్యా విధానం, అది స్త్రీ పురుషులు మరియు సామాజిక దృక్పథంపై చూపుతున్న ప్రభావం, చారిత్రకంగా, సాహితీ పరంగా స్త్రీని చిత్రీకరించిన విధానం మరియు (మహిళా) రచయితలు ఎలాంటి రచనా శైలి దృక్పథం కలిగి ఉండాలి’ అనే అంశాలను ఉల్ఫ్ వివరిస్తుంది.” అంటారు వర్జీనియా ఉల్ఫ్ గురించిన వ్యాసంలో.
***
“డికిన్సన్ కవిత్వంలో ప్రముఖంగా ప్రకృతి అందాలు, వనాలు, పుష్పాలు ప్రస్తావనకు వచ్చే అంశాలు. అనేక రంగుల పూలు ఆమె వ్యక్తపరిచే భావోద్వేగాలకు ప్రతీకలుగా కనిపిస్తాయి. నైరాశ్యం, రోగం, మృత్యువు ఆమెపై చిన్నతనం నుంచి కలిగించిన ప్రభావంవల్ల మరణ ప్రస్తావన ఆమె కవితల్లో తప్పనిసరిగా కనిపించే ఒక అంశం. దీన్ని అనేక ప్రతీకల ద్వారా – సిలువ, మునక, ఉరి, ఊపిరి ఆగినట్లున్న స్థితి, గడ్డ కట్టుకొని పోయే స్థితి, ముందస్తు సమాధి, కాల్పులు, కత్తిపోట్లు వంటి పద ప్రయోగాల ద్వారా తెలియచేస్తుంది.
ఆమె ఏకాంత జీవితంలో ఒంటరితనాన్ని మృత్యువును ఎదురొడ్డి పలకరించింది. అందరూ తలచి భయపడే మృత్యువును జీవితపు అంతంలా కాక జీవితం లోని ఒక భాగంగా భావించింది. తప్పించుకోలేని నిజంలా గుర్తించి తానే పలకరించింది.” అంటారు ఎమిలీ డికిన్సన్ గురించిన వ్యాసంలో.
***
ఇంకా అనేక మంచి వ్యాసాలున్న ఈ పుస్తకం ఆసక్తిగా చదివిస్తుంది.
***
పడమటి రాగం (వ్యాస సంపుటి)
రచయితలు: విజయ్ కోగంటి, పద్మజ కలపాల
పేజీలు: 154
వెల: ₹ 150/-
ప్రతులకు:
ఛాయా రిసోర్స్ సెంటర్,
8-3-677/23, 202 కె.ఎస్.ఆర్. గ్రాండియర్,
యెల్లారెడ్ది గూడా, హైదరాబాద్ 500073
ఫోన్: 040-23742711
~
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు