విశ్వకవి విలక్షణ సృష్టి – ‘పడవ మునక’

0
6

(రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘పడవ మునక’ అనే అనువాద నవలను పరిచయం చేస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.)

[dropcap]60[/dropcap], 70, 80 దశకాల్లో తెలుగునాట నవలలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. ఎందరో రచయితలు, రచయిత్రులు తమ మేధోసంపత్తితో తెలుగుభాషని సుసంపన్నం చేశారు. అంతకుముందు బెంగాలీ నవలల తెలుగు అనువాదాలు రాజ్యం చేశాయి. శరత్ చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఆశాపూర్ణాదేవి వంటి వారి అనువాద రచనలు తెలుగువారు విపరీతంగా చదివేవారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు రచయితలు, రచయిత్రులందరికీ వీరి రచనలే ప్రేరణ కలిగించాయి అని చెప్పవచ్చు.

రవీంద్రనాథ్ ఠాగూర్ అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది జాతీయగీతం. ఆయన కవి మాత్రమే కాకుండా కథకుడు, నవలా రచయిత, చిత్రకారుడు, విద్యావేత్త. అయన రచించిన బెంగాలీ నవలని తెలుగులో ‘పడవ మునక’ పేరుతోనూ, ఆంగ్లంలో ‘ది షిప్ రెక్’ పేరుతోనూ, హిందీలో ‘నౌకాడుబీ’ పేరుతోనూ అనువదించారు. తెలుగు ‘పడవ మునక’ నవలలో పాత్రలు, పాత్రల స్వభావాలు చక్కగా తీర్చిదిద్దారు. కొన్ని సంవత్సరాల కాలం కొన్నినెలలుగా మారి, పాఠకుల గుండెల్లో ఒదిగిపోయిన అనుభూతి కలిగిస్తుంది ‘పడవ మునక’.

రచయిత పరిచయం:-

“జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల?” అన్నట్లు రవీంద్రనాథ్ ఠాగూర్‌ని పరిచయం చేయాల్సిన పనిలేదు. కానీ ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకోవటం సముచితం. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7 న జన్మించారు. మహర్షి దేవేంద్రనాద్, శారదాదేవి వీరి తల్లిదండ్రులు. ఈయన మొదటి రచన వాల్మీకి ప్రతిభ అనే నాటకం. తర్వాత కచ దేవయాని, ముక్తధార, శరదోత్సవ్, కాబులీవాలా, గోరా, కుముదిని  మొదలైన కథలు, నవలలు రచించారు. నవలల్లో గోరా, పడవ మునక ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. విశ్వభారతి, శాంతి నికేతన్ వంటి విద్యాసంస్థలను స్థాపించారు. వీరి రచన ‘గీతాంజలి’కి 1913లో నోబెల్ బహుమతి లభించింది. రవీంద్రుడు 1941 ఆగస్ట్ 7 న మరణించారు.

కథ క్లుప్తంగా:-

రమేష్ చంద్ర కలకత్తాలో లా చదువుతున్నాడు. అతడితో పాటు చదివే జోగేంద్ర ఇల్లు కూడా పక్కనే. జోగేంద్ర తండ్రి పేరు ఆనందబాబు, చెల్లెలి పేరు హేమమాలిని. పక్కపక్క ఇళ్ళు అవటంవల్ల రమేష్ తరచుగా ఆనందబాబు ఇంటికి వెళ్ళటం, పరిచయం వృద్ధికావటం, హేమమాలినిని ప్రేమించటం జరిగిపోయింది. హేమమాలినికి కూడా రమేష్ అంటే ఇష్టం. రమేష్ లా చదువు పూర్తికాగానే ఇద్దరికీ పెళ్లిచేయాలని ఆనందబాబు ఆలోచన. స్నేహితుడే బంధువు కాబోతున్నందుకు జోగేంద్ర కూడా చాలా సంతోషించాడు.

రమేష్ చదువు అయిపోయింది. లా డిగ్రీ ఫాస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు. ఇక తండ్రి అనుమతి తీసుకుని హేమమాలినిని వివాహం చేసుకోవటమే తరువాయి. ఇంతలో తండ్రి దగ్గరనుంచీ ఉత్తరం వచ్చింది, వెంటనే బయలుదేరి వచ్చేయమని. రమేష్ తన స్వంతఊరికి బయలుదేరాడు. ఊరికి వచ్చిన తర్వాత తండ్రి మరో పెళ్లిసంబంధం నిశ్చయించాడు. రమేష్ తనొక అమ్మాయికి మనసిచ్చాడు అనే విషయం చెప్పటానికి కూడ అవకాశం ఇవ్వలేదు. తండ్రి మాటకు ఎదురుచెప్పలేని రమేష్ బలవంతంగా పీటలమీద కూర్చున్నాడు. తన ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారనే కోపంతో పెళ్ళికూతురి వంక చూడనైనా చూడలేదు రమేష్. పెళ్లి ముగిసిపోయింది.

పెళ్లి అవగానే పెళ్ళికూతురి ఇంటినుంచీ అందరూ రమేష్ స్వగ్రామానికి బయలుదేరారు. మగవాళ్ళు అందరూ ఒక పడవలో, ఆడవాళ్ళు అందరూ మరొక పడవలో, మేళగాళ్ళు ఇతరులు అందరూ మూడో పడవలో ఎక్కారు. పడవలు బయలుదేరాయి. ఒకరోజు అంతా ప్రయాణం సజావుగానే జరిగింది. మర్నాడు ఉదయం హటాత్తుగా మబ్బులు కమ్ముకుని గాలి వీయసాగింది. గాలితో పాటు వర్షం కూడా మొదలైంది. విపరీతమైన గాలి, వాన ఉదృతానికి పడవలు అటూఇటూ ఊగిపోయాయి. ఊగిఊగి  కొంతసేపటికి మూడు పడవలు నదిలో మునిగిపోయాయి. అందరూ హాహాకారాలు చేసారు. తర్వాత ఏమైందో తెలియలేదు రమేష్‌కి. స్పృహతప్పి పోయింది.

రమేష్ కళ్ళుతెరచి చూసేసరికి తనొక ఇసుకదిబ్బ మీద పడిఉన్నాడు. చుట్టూ చూసాడు. అపారమైన జలరాశి తప్ప ఏమీ కనిపించలేదు. ఎడమపక్కన కొంతదూరంలో పెళ్లికూతురి అలంకరణలో ఒక అమ్మాయి పడిఉంది. రమేష్ మెల్లగా ఆ అమ్మాయి దగ్గరకువెళ్లి తనకు తెలిసిన ప్రథమచికిత్స చేశాడు. కొంతసేపటి తర్వాత ఆమెకూడా కళ్ళు తెరిచింది. ఇసుక దులుపుకుని ఇద్దరూ లేచి నిలబడ్డారు. అటుగా వెళుతున్న పడవఎక్కి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు.

ఇంటికి చేరుకునేసరికి వీళ్ళకన్నా ముందు తల్లిద్రండ్రుల, అత్తమామల, బంధువుల శవాలు చేరుకున్నాయి. అందరూ ఏడుస్తున్నారు. నదిలో పడవ మునిగిపోవటంలో అందరూ మరణించారు. అక్కడ అంతా గందరగోళంగా ఉంది. వాళ్ళకి అంత్యక్రియలు జరిపించి, దినవారాలు జరిపించి తేరుకునేసరికి రెండునెలలు ఇట్టే గడిచిపోయాయి. ఈ రెండునెలల్లో రమేష్ భార్య ముఖం చూసే, ఓదార్చే అవకాశం కూడా రాలేదు. ఇక ఈ పల్లెటూరిలో ఉండి ఏం చేస్తాడు? బంధువులు ఎవరూ లేరు. ఇరుగుపొరుగు వారి సలహాతో భార్యని తీసుకుని కలకత్తా వచ్చేసాడు రమేష్. ఇదివరకు తను ఉండే ఇంట్లోదిగారు. ఈ రెండునెలలు రమేష్ గురించిన ఎలాంటి వార్త తెలియక పోయేసరికి ఆనందబాబు కుటుంబం కంగారుపడుతున్నారు. విషయం తెలిసిన తర్వాత అందరూ సానుభూతి చూపించారు.

ఒకరోజు రమేష్ పుస్తకం చదువుకుంటూ “సుశీలా! మంచినీళ్ళు తెచ్చిపెట్టు” అన్నాడు. ఆ అమ్మాయి మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ “నన్ను సుశీలా అని పిలుస్తారేమిటి? నా పేరు కమల అయితేనూ!” అన్నది.

“కమలా! పెళ్ళిలో మీ అమ్మానాన్నా నిన్ను సుశీలా అని పిలిచినట్లు గుర్తు” అన్నాడు.

“ఇది మరీ బాగుందండీ! నాకు అమ్మానాన్నా ఎక్కడున్నారు? నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. మా నాన్న చనిపోయేనాటికి నాకు ఆరునెలలు కూడా లేవు. మా మేనమామ ఇంట్లో అనాథలా బ్రతికాను. ఎక్కడినుంచో మీరు వచ్చారు. నేనంటే ఆప్యాయత కనబరిచారు. నన్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు” అన్నది.

ఆ మాటలు విని నివ్వెరపోయాడు రమేష్. “మీ మేనమామ పేరేమిటి?” అడిగాడు.

“తరుణీ చరణ చటోపాధ్యాయ”

“మీదే ఊరు?”

“దోచాపుకూర్” చెప్పింది. “అలాగా!” ఆలోచనలో పడిపోయాడు రమేష్. కమల వంటగదిలోకి వెళ్ళింది. రమేష్‍కి అర్ధమైంది. ఈ అమ్మాయి తన భార్య కాదు. తన భార్యకు తల్లిదండ్రులు, బంధువులు అందరూ ఉండేవారు. పెళ్ళికూతురి అలంకారంలో ఉంటే తన భార్యే అనుకుని తీసుకువచ్చాడు. ఇప్పుడు ఎలా! ఈ విషయం చెప్పటమా! మానటమా! చెబితే అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుందేమో! పోనీ ఆమె భర్త దగ్గర వదిలిపెడదామంటే అతను ఎవరో? ఎక్కడ ఉన్నాడో!

మూడు నెలలుగా రమేష్‌కి ఇదే ఆలోచన పట్టి పీడిస్తున్నది. ఈ సమస్యలో పడి హేమమాలినిని కలుసుకోవటం కూడా తగ్గించాడు. తనకి తండ్రి బలవంతంగా పెళ్లిచేసాడనీ, తన భార్య తప్పిపోయిందో, చనిపోయిందో తెలియదనీ, ఈ అమ్మాయి తన భార్య కాదనీ చెబితే హేమ నమ్ముతుందా! హేమే కాదు, ఎవరైనా నమ్ముతారా! ఇదో నాటకం అనుకోరూ! తనని మోసగాడని నిందించరూ! అనుకున్నాడు.

ఒకసారి రమేష్ కమలతో “కమలా! నేను కోర్ట్‌కి వెళితే నీకొక్కదానికీ ఏం తోస్తుంది? బడిలో చేరతావా!” అడిగాడు.

కమల ఆశ్చర్యంగా చూసి “నాకిప్పుడు పద్నాలుగేళ్ళు. నా అంత పెద్ద అమ్మాయిని బళ్ళో చేర్చుకుంటారా!” అన్నది.

రమేష్ నవ్వి “మీ ఊరు పల్లెటూరు కాబట్టి వింతగా చూస్తారేమో! కలకత్తా లాంటి సిటీలో మామూలే! నీకన్నా పెద్ద అమ్మాయిలే చదువుకుంటూ ఉంటారు” అన్నాడు. “మీ ఇష్టం” ముభావంగా అన్నది.

ఆ మర్నాడే రమేష్ కమలని దూరంగా ఉన్న బళ్ళో చేర్పించి, హెడ్ మిస్ట్రెస్‌కి అప్పగించి వచ్చేసాడు. అక్కడే హాస్టల్‌లో లాగా ఉండటానికి, తినటానికి ఏర్పాట్లు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. తిరిగివచ్చిన తర్వాత నిశ్చింతగా అనిపించింది. అయితే ఆ నిశ్చింత ఎంతోకాలం నిలవలేదు. నాలుగునెలల తర్వాత ‘పూజ’ సెలవులు వచ్చాయి (మన ఆంధ్రాలో దసరాకి  విద్యాసంస్థలకి సెలవులు ఇచ్చినట్లుగానే కలకత్తాలో కాళికాదేవి ఉత్సవాలకు సెలవలు ఇస్తారు. వాటిని పూజ సెలవలు అని అంటారు). బడిలో పిల్లలు అందరూ వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోవటం వలన రమేష్‌కి కమలని కూడా తీసుకురాక తప్పలేదు.

మూడు నాలుగు నెలల నుంచీ రమేష్ అన్యమనస్కంగా ఉండటం వలన జోగేంద్రకి ఏదో అనుమానం వచ్చి రహస్యంగా ఎంక్వయిరీ చేశాడు. రమేష్‌కి పెళ్లి అయిందనీ, భార్య స్కూల్లో చదువుకుంటూ ఉందనీ తెలిసింది. స్కూల్‌కి వెళ్లి ఆరా తీసాడు. రమేష్ భార్య ఇక్కడ చదువుకోవటం నిజమే అనీ, అయితే సెలవలకి ఆమె భర్తతో పాటు వెళ్ళిందనీ స్కూల్ వాళ్ళు చెప్పారు. జోగేంద్ర కలకత్తా తిరిగివచ్చి సరాసరి రమేష్ ఇంటికి వచ్చేసాడు.

ఆ సమయానికి కమల యాపిల్స్ కోసి ముక్కలు అందిస్తున్నది. రమేష్ తింటూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెబుతున్నాడు. హటాత్తుగా గుమ్మంలో నిలబడిన జోగేంద్రని చూసి తెల్లబోయాడు. జోగేంద్ర ముఖం చాలా కోపంగా ఉంది.

“రమేష్! ఈ అమ్మాయి ఎవరు?” అడిగాడు.

“నా బంధువు.”

“నీ బంధువులందరి గురించి నాకు చెప్పావుగా! ఈమె గురించి ఎప్పుడూ చెప్పలేదే!”

రమేష్ ముఖం ఎర్రబడింది. “ఈమెను గురించి చర్చించటం నాకు ఇష్టం లేదు. అయితే ఒక మాట చెబుతున్నాను. హేమమాలినికి నేను ఎలాంటి అన్యాయం చేయలేదు”

“ఛీ! అబద్ధాలు చెప్పటానికి సిగ్గులేదూ! తెలుసుకోవలసినవి అన్నీ తెలుసుకున్నాను. నీకు పెళ్లి అయింది. ఈమె నీ భార్య. ఇక్కడ రుజువు కూడా దొరికింది. ఇంకెప్పుడూ మా గుమ్మం తొక్కవద్దు. తొక్కావా! తీవ్రమైన అవమానానికి గురిఅవుతావు” గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు జోగేంద్ర.

రమేష్ గురించి జోగేంద్ర చెప్పిన విషయం విని హతాశురాలైంది హేమమాలిని. ఆనందబాబు కూడా నివ్వెరపోయాడు. హేమమాలిని గబాలున పక్కగదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది. జోగేంద్ర నిట్టూర్చాడు. “ఈ విషయం నలుగురికీ పొక్కి అల్లరి కాకముందే హేమకి మరో అబ్బాయితో పెళ్లి చేసేద్దాం నాన్నా!” అన్నాడు. ఆనందబాబు ఏదో ఆలోచిస్తూ తలూపాడు.

జోగేంద్ర వచ్చి వెళ్ళిన తర్వాత రమేష్ మనసంతా చిరాకుగా అయిపోయింది. ఈ విషయం పెద్దదిచేసి గొడవ చేస్తారేమో, కమల నలిగిపోతుంది కొద్దిరోజులు ఎటైనా తిరిగివస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఆ మర్నాడు మనం కాశీ వెళుతున్నాం అని చెప్పాడు కమలతో. కమల అంగీకరించింది. గోలుండా స్టేషన్ దాకా రైలులో వెళ్లి అక్కడ కాశీ వెళ్ళే స్టీమర్ ఎక్కారు ఇద్దరూ. కమలకీ తనకీ చెరొక గది తీసుకున్నాడు రమేష్. ప్రశాంతమైన వాతావరణం. నది నెమ్మదిగా ప్రవహిస్తున్నది. రెండురోజులు గడచిపోయాయి.

ఒకరోజు పక్క క్యాబిన్ నుంచీ ఒక పెద్దాయన వచ్చి పలకరించాడు. “నా పేరు త్రైలోక్య చక్రవర్తి. అందరూ ‘బాబాయ్!’ అని పిలుస్తారు. మీ పేరేమిటి? ఎందాకా మీ ప్రయాణం?” అడిగాడు.

“నా పేరు రమేష్ చంద్ర. ఎక్కడిదాకా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. పాట్నా, దినపోర్, బక్సాల్, ఘజిపూర్, బెనారస్.. ఈ ఊళ్ళన్నీ చూస్తాం” అన్నాడు.

“నేను ఘజిపూర్‌లో దిగాలి. అప్పటివరకూ మీతో కాలక్షేపం చేస్తాను” అన్నాడు నవ్వుతూ.

చక్రవర్తి రమేష్ తో, కమలతో చనువుగా ఉంటూ జోక్స్ వేస్తూ వస్తూపోతూ ఉన్నాడు. ఈ వృద్ధుడి పరిచయంతో కమలకి కొంచెం ఉబుసుపోకగా ఉంది. ఆమెకి ఇంకా రమేష్‌తో మాట్లాడాలంటే మొహమాటంగానే ఉంది. ఈయన ఇద్దరి మధ్య వారధిలా అయ్యాడు. మరో రెండురోజుల ప్రయాణం తర్వాత స్టీమర్ ఘజిపూర్ దగ్గరకి రాబోతున్నది. చక్రవర్తి అక్కడ దిగటానికి తన సామాన్లు సర్దుకుంటున్నాడు.

“మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఇంటికి వచ్చి కొద్దిరోజులు ఉండండి” అన్నాడు చక్రవర్తి. రమేష్ ఆలోచించాడు. ఇప్పట్లో మళ్ళీ కలకత్తా వెళ్ళటం ఇష్టంలేదు. ఘజిపూర్ లోనే ఉండి లా ప్రాక్టీస్ పెడితే బాగుంటుందేమో! కొత్తప్రదేశంలో ఈయన తోడుగా ఉంటాడు అనుకుని అంగీకరించాడు.

చక్రవర్తి రమేష్‌ని, కమలని ఘజిపూర్‌లో తన ఇంటికి తీసుకువెళ్ళాడు. చక్రవర్తి కూతురు పేరు శైలజ. ఆమెకి భర్త, కుమార్తె ఉన్నారు. శైలజ కూతురు పేరు ఉమ, రెండేళ్ళ పాప. రెండుమూడు రోజుల్లోనే శైలజ, కమల స్వంత అక్కచెల్లెళ్ళ లాగ కలిసిపోయారు. ఉమ కమలకి మచ్చిక అయింది.

ఘజిపూర్‌లో స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు రమేష్. బార్ లో లాయర్ గా తన పేరు నమోదు చేయించుకోవటానికి ఒకసారి కలకత్తా వెళ్లి రావలసిన పనిఉంది. కమలకి చెప్పి బయలుదేరాడు. కలకత్తా అనగానే హేమమాలిని గుర్తు వచ్చింది. హేమమాలిని తనని అపార్థం చేసుకుందని తలచుకోగానే రమేష్ గుండె విషాదంతో నిండిపోయింది. ఒక్కసారి హేమమాలిని చూసి అన్ని విషయాలు మాట్లాడాలని ఉంది. ఒకవేళ ఆమె తనని చూసి ఆవేశపడి తన మాట వినిపించుకోకపోతే ఆమె చేతిలో పెట్టి రావటానికి ఒక ఉత్తరం కూడా రాసి పెట్టుకున్నాడు. అందులో కమలని ఏ పరిస్థితులలో తను చేరదీయవలసిందో చెప్పి, ఆమె భర్త పేరు నళినాక్ష అనీ, అతను హరిద్వార్‌లో డాక్టర్ గా చేస్తున్నాడనే వివరాలు తెలిశాయనీ, అతని కోసం వెతుకుతున్నాడనీ, ఆచూకీ దొరికితే కమలను అతనికి అప్పగించి నిర్విచారంగా హేమమాలినిని చేపట్టాలని అనుకుంటున్నట్లు రాశాడు. ఆనందబాబు ఇంటికి వెళ్లేసరికి దురదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ కనిపించలేదు. అందరూ ఉత్తరదేశయాత్రకి వెళ్ళినట్లు చెప్పాడు నౌకరు. రమేష్ ఘజిపూర్ తిరిగి వచ్చేసరికి కమల పనివాళ్ళతో అద్దెకు తీసుకున్న ఇల్లు బాగుచేయిస్తున్నది. ఇంట్లో, ఇంటిచుట్టూ ఉన్న చెత్తాచెదారం అంతా శుభ్రం చేయిస్తున్నది.

రమేష్ కి మళ్ళీ పనిమీద అలహాబాద్ వెళ్ళాల్సివచ్చింది. శైలజ వాళ్ళు కమలకి తోడుగా ఉన్నారనే ఉద్దేశంతో నిశ్చింతగా వెళ్ళిపోయాడు. ఆరోజు కమలకి అలమరలో రమేష్ చేతిరాతతో ఒక ఉత్తరం కనబడింది. తీసి జాగ్రత్త చేద్దాం అనుకుంటుండగా లోపల కమల అని తన పేరు అసంకల్పితంగా కనబడింది. కుతూహలంగా ఆ ఉత్తరం చదవసాగింది. అది రమేష్ హేమమాలినికి రాసిన ఉత్తరం.

ఉత్తరం చదవటం పూర్తి అవగానే కమల ముఖం పాలిపోయింది. రమేష్ తన భర్త కాదు, అతను హేమమాలినిని ప్రేమించాడు. తన కారణంగా వాళ్ళ వివాహం ఆగిపోయింది. కమల ఆ ఉత్తరం చేత్తో పట్టుకుని నిశ్చేష్టురాలైనట్లుగా మెట్లమీద కూర్చుండిపోయింది. చీకటిపడింది.

రెండురోజుల తర్వాత ఇంటికి తిరిగివచ్చిన రమేష్‌కి కమల కనిపించలేదు. ఉమకి జ్వరం రావటం వల్ల  ఆ హడావిడిలో పడి శైలజవాళ్ళు కూడా పట్టించుకోలేదు. నౌకరు కుర్రాడు కమల తనకి ఒక రూపాయి బహుమతిగా ఇచ్చి ఎక్కడికో వెళ్లిందని చెప్పాడు. అందరూ వెతుక్కుంటూ వెళ్ళారు. గంగానదీ తీరంలో కమల చెప్పులు, తాళంగుత్తి కనబడింది. ఆమె నదిలోదూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అందరూ నిశ్చయించుకున్నారు.

రమేష్ జీవితం చుక్కాని లేని నావలా అయింది. అటు హేమమాలిని, ఇటు కమల ఇద్దరూ దూరం అయ్యాయి. ఇక తన ఉనికికి అర్థం ఏమిటి? పిచ్చిపట్టినట్లు దేశం అంతా తిరిగాడు. రంగపూర్ దగ్గర జోగేంద్ర కనబడ్డాడు. అతను అక్కడ స్కూల్లో టీచర్‌గా చేస్తున్నాడట. చాలారోజుల తర్వాత కలుసుకోవటం వల్ల జోగేంద్రకి రమేష్ ని చూడగానే ఆనందంగా అనిపించింది. రమేష్ మీద ఇదివరకు ఉన్న కోపం ఇప్పుడులేదు అతనికి. కూడా పూర్వమిత్రులు ఇద్దరూ ఆప్యాయంగా కౌగలించుకున్నారు.

రమేష్ జరిగిన విషయాలు అన్నీ చెప్పాడు. కమలతో తనకు గల సంబంధ బాంధవ్యాలు కూడా చెప్పాడు. అన్నీ విన్న తర్వాత జోగేంద్ర “నాన్న, హేమ ఉత్తరదేశ యాత్రకు వెళ్ళారు. బెనారస్ లో కొంతకాలం ఉంటామని చెప్పారు. మనం వెంటనే వెళ్లి వాళ్లకి ఈ విషయాలు చెబుదాం” అన్నాడు. రమేష్ సరేనన్నాడు.

కమల గంగానదీ తీరం వెంట నడుస్తూ కొంతదూరం వెళ్ళింది. రమేష్ ఇంటికి సంబంధించిన తాళం తన దగ్గరే ఉన్నదన్న విషయం గుర్తుకువచ్చి దాన్ని అక్కడ విసిరేసింది. చెప్పులు కూడా వదిలేసింది. కొంతదూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిన పడవలో నవీన్ కాళీ అనే ఆమె పరిచయం అయి కమలకి ఆశ్రయం కల్పిస్తానని బెనారస్ తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కమల జీవితం పెనంమీద నుంచీ పొయ్యిలో పడ్డట్లు అయింది. నవీన్ కాళీ కమల చేత ఇంటెడు చాకీరీ చేయించుకుంటూ అన్నం పెట్టకుండా నిరంతరం సాధిస్తూ ఉండేది.

ఒకరోజు కూరలకి అని బజారువెళ్ళిన కమలకి అక్కడ తన ఇంట్లో పనిచేసిన నౌకరు కుర్రాడు కనబడ్డాడు. కమల లేకపోవటం వల్ల వాడు కూడా ఘజిపూర్ నుంచీ బెనారస్ పారిపోయి వచ్చినట్లు చెప్పాడు. “ఈ బెనారస్ నాకు బాగా తెలుసు అమ్మగారూ! మిమ్మల్ని క్షేమంగా ఉండేచోట చేరుస్తాను” అని ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. అది డాక్టర్ నళినాక్ష ఇల్లు. కమల హృదయం ఆనందతరంగిణి అయింది. నళినాక్ష తల్లిపేరు క్షేమంకరి, వృద్ధురాలు. కమల ఆమె సేవచేస్తూ, ఇంటిపని అంతా చేస్తూ చేదోడువాదోడుగా ఉంటూఉంది.

ఉత్తరదేశ యాత్రకు వెళ్ళిన ఆనందబాబు, హేమమాలిని బెనారస్ వచ్చారు. ఆనందబాబుకి ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ నళినాక్షను పిలుచుకువచ్చింది హేమమాలిని. ఆ విధంగా అతను నాలుగైదు సార్లు రావలసివచ్చింది. ఈ క్రమంలో నళినాక్ష పద్దతులు అన్నీ అర్థం అయ్యాయి ఆనందబాబుకి. నళినాక్ష బ్రహ్మసమాజ సేవకుడు, ఆదర్శభావాలు కలవాడు, సంస్కారవంతుడు. ఇతనితో కుమార్తె వివాహం జరిగితే బాగుంటుంది అనుకున్నాడు.

వివాహ ప్రస్తావన రాగానే హేమమాలిని తలొంచుకుంది “ఇప్పట్లో నా వివాహ విషయం తలపెట్టకండి నాన్నా!” అన్నది. ఆమె మనసులో రమేష్ మెదిలాడు. కొద్దిరోజుల్లోనే  నళినాక్షకి కుటుంబ మిత్రుడు అయ్యాడు ఆనందబాబు. వాళ్ళింటికి వస్తూపోతూ ఉండేవారు తండ్రీకూతుళ్లు ఇద్దరూ. హేమమాలినిని చూసి క్షేమంకరి కూడా మురిసిపోయింది, ఇలాంటి కోడలు రావాలని కోరుకుంది.

వాళ్లకి కాఫీ ఫలహారాలు అందిస్తున్న కమలకి ఈ వివాహ విషయాలు విని భరించటం దుస్సహంగా ఉంది. ఆనాడు రమేష్ హేమమాలినికి రాసిన ఉత్తరం తనతోపాటు తెచ్చుకుంది. దాన్ని చదువుకుంటూ పరధ్యానంగా ఉండిపోయేది పనిమధ్యలో.

క్షేమంకరి మనసులో మరో ఆలోచన ఉంది. ఒకసారి స్నేహితుడితో కలసి దోచాపుకూర్ వెళ్ళిన కొడుకు అనుకోకుండా ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడనీ, ఆమె పడవ ప్రమాదంలో గల్లంతు అయిందనీ, ఇంకా తన మనసులో ఆమె మెదులుతూనే ఉన్నదనీ అనేకసార్లు చెప్పాడు నళినాక్ష తల్లితో. ఎలాగైనా ఈ వివాహం జరిగితే ఆ అమ్మాయి జ్ఞాపకాలు కొడుకు మర్చిపోతాడనీ  ఆశించింది. నిండా పాతికేళ్ళు కూడా లేని కొడుకు విరక్తితో సన్యాసిలా జీవించటం చూడలేకపోతూ ఉన్నది క్షేమంకరి.

కమల నళినాక్ష గది సర్దటానికి వచ్చింది. అతని మంచంమీద కుర్చుని రమేష్ రాసిన ఉత్తరం చదువుకుంటూ ఉంది. అందులో తన భర్త వివరాలు అప్పుడప్పుడు చదువుకొంటూ ఊరట పొందుతూ ఉంటుంది. అందుకే ఆ ఉత్తరం ఎప్పుడూ తనవెంటే ఉంచుకుంటుంది. గది సర్దేటప్పుడు నళినాక్ష పుస్తకాలు, బట్టలు పట్టుకుంటే అతన్ని తాకినట్లే పులకింత కలిగేది. అతని కోటు పట్టుకుని గుండెకు హత్తుకుంది కమల. ఇంతలో గుమ్మంలో అలికిడి అయింది. తలతిప్పి చూసేసరికి నళినాక్ష అక్కడ నిలబడి ఉన్నాడు. కమల హడలిపోయి ఒక్క ఉదుటన అక్కడనుంచీ వెళ్ళిపోయింది. ఆమె చేసిన పనికి నళినాక్ష ఆశ్చర్య పోయాడు. మంచంమీద ఏదో ఉత్తరం ఉంది. కమల దాన్ని అక్కడే మర్చిపోయి వెళ్ళింది. నళినాక్ష ఆ ఉత్తరం తీసుకుని చదివాడు. తనని ఎన్నాళ్ళనుంచో వేధిస్తున్న సమస్య మంచు విడిపోయినట్లు విడిపోయింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.

ఆనందబాబు, క్షేమంకరి కలసి ఆలోచించి నళినాక్షకీ, హేమమాలినికీ వివాహం చేద్దామని అనుకున్నారు. ఈ వివాహం నళినాక్షకి గానీ, హేమమాలినికి గానీ, కమలకి గానీ నచ్చలేదు. ఎవరి మొహంలోనూ ఉత్సాహం లేదు. ఈ పరిస్థితుల్లో జోగేంద్ర రమేష్ ని తీసుకుని వచ్చాడు. జరిగిన విషయాలు అన్నీ తండ్రికి, చెల్లికీ చెప్పాడు. హేమ, రమేష్ ల మనసులు మళ్ళీ కలుసుకున్నాయి. అటు నళినాక్ష కూడా గతంలో తను వివాహం చేసుకున్నది కమలనేనని తల్లితో చెప్పాడు. అపార్ధాలు విడిపోయి రెండు జంటలూ కలుసుకున్నాయి. ఇదీ ‘పడవ మునక’ కధ!

ఇంత పెద్దకథని ఏమాత్రం గందరగోళం లేకుండా సాఫీగా సాగిపోయేటట్లు చక్కగా చెప్పారు రవీంద్రనాథ్ ఠాగూర్. ముఖ్యంగా రమేష్ కమల కలిసి పడవలో యాత్రలకు బయలుదేరటం, ఆ ప్రయాణం ఆసక్తికరంగా వివరించారు. నదిమీద స్టీమర్ మెల్లగా వెళుతుంటే సూర్యాస్తమయపు నీరెండ నదినీటిలో ప్రతిఫలించటం, సాయంత్రం వేళకు తీరంలో లంగరువేయటం, స్టీమరులో వాళ్ళు ఒడ్డున వంట చేసుకోవటం, నదినీళ్ళ కోసం కడవలు పట్టుకుని వచ్చే పల్లెపడుచులు వీళ్ళని వింతగా చూడటం, మళ్ళీ స్టీమర్ బయలుదేరటం ఈ వర్ణనలు అన్నీ చదువుతూ ఉంటే ఆ దృశ్యాలు మన కళ్ళముందు కదులుతూఉన్నట్లు ఉంటుంది.

ప్రకృతి వర్ణనలు చాలాబాగాచేశారు ఠాగూర్. “అప్పుడే నిద్రలేచిన వాడి ఆవులింతలా పడమటి గాలి వీస్తూంది”, “చీకటి ఆవరిస్తూంటే బాతులు ఎక్కడెక్కడ తిరుగుతున్నవీ తమ ఇసుకగూళ్ళకి చేరుకుంటున్నవి”, “చంద్రుడికాంతి భూమిమీద పొగమంచులా కమ్ముకుంటున్నది” వంటి వర్ణనలు ఆహ్లాదకరంగా ఉంటాయి. పుస్తకం చదవటం పూర్తికాగానే ఒక ఊహా ప్రపంచంలో విహరించి వచ్చిన అనుభూతి కలుగుతుంది.

***

పడవ మునక
రవీంద్రనాథ్ ఠాగూర్. తెలుగుసేత: కమలాసనుడు.
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
ముద్రణ : సెప్టెంబర్ 2012,
పుటలు: 208
వెల: ₹ 90.00
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643. 9849992890
ఆన్‍లైన్‌లో తెప్పించుకునేందుకు:
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=241&BrandId=84&Name=Padava+Munaka

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here