స్ఫూర్తిదాయకం ‘పడి’ ‘లేచే’ కెరటం

0
9

[dropcap]జీ[/dropcap]వన సాగరంలో పడుతూ లేస్తూ…. ఎందరికో స్ఫూర్తిదాయకమైన సందేశాలు అందిస్తున్నట్టు ‘పడి లేచే కెరటాలు’ ఈ సమాజంలో ఎందరో! ‘అనవరతం సంక్షుభిత సంద్రంలా భాసించే వాళ్ళ హృదయ ఘోషను’ వినగలిగే వారు, విని అర్థం చేసుకోగల సహృదయులు ఉంటారా!!

‘ఉంటారు’.

సమాజంలో ఇంకా మంచితనమనే ఆర్ద్రత ఉందని, అంగవైకల్యం కల వారికి అందించే సహాయ హస్తాలు ఉన్నాయని, ఆసరాగా నిలిచి తమ భుజాలపై ఎత్తుకునే మహోన్నతులు ఉన్నారని, గుండెలకు హత్తుకునే స్నేహితులు ఉన్నారని, గుండెల్లో గుడి కట్టుకొని ప్రేమించేవారు ఉన్నారని, తమ స్నేహంతో ప్రేమతో ‘ఫిజికల్లీ డిజేబిలిటీ’ని మర్చిపోయేంత అత్యున్నత స్థాయికి చేరేలా సాయం చేస్తారని నిరూపిస్తుంది ప్రఖ్యాత రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ‘సలీం’ రచించిన ‘పడిలేచే కెరటం’.

కానీ, ఆ లోపాన్ని మాత్రమే చూస్తూ, ఎద్దేవా చేస్తూ, మనసుని తూట్లు పొడిచేలా ఎత్తిపొడిచేవాళ్ళూ ఉంటారనీ, తమ మాటలతో కుళ్ళబొడిచేవాళ్ళూ ఉంటారని ఈ నవలలో ‘సాగర్’ అనే పాత్ర అనుభవించిన మానసిక క్షోభ తెలియజేస్తుంది.

తనకిష్టమైన అందమైన సినిమా హీరో లాంటి కొడుకు పుడతాడని ఆశించిన రాజ్యం తనకు పుట్టిన మగ పిల్లవాడి కాళ్లు వంకర తిరిగి ఉండటం, పాదాలు ముద్దలా ఉండటం చూసి మ్రాన్పడిపోయింది. ఆ దిగులుతో రెండు రోజులు బిడ్డకు పాలు కూడా ఇవ్వలేదు. కానీ ఆ బిడ్డ నునుపైన మంచి రంగు చర్మం, అందమైన విశాలమైన కళ్ళు, ముద్దులొలికే మోము చూసి ఆ తర్వాత ఎప్పుడూ తన గుండెల్లో దాచుకొని అపురూపంగా పెంచింది. అంగవైకల్యంతో ఈ సమాజంలో తన బిడ్డ ఎలా బ్రతుకుతాడు అన్న ఆలోచనే ఆమెకు. కటిక పేదరికంతో మగ్గిపోతున్నా, చదువు పట్ల ఆ పిల్లవాడికి కల ఆసక్తిని గమనించి ఎలాగైనా బాగా చదివించాలన్న తాపత్రయమే. తండ్రి కోటయ్యకి కూడా డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నా, సాగర్ ని చదివించాలని తపనే. అన్న ప్రసాద్ తనకు పెద్ద తెలివితేటలు లేవు, పెద్ద చదువులు చదవలేను అనుకొని, తమ్ముడినైన బాగా చదివించాలని ఆరాటం. అందరికీ మించి సాగర్ అమాయకమైన మొఖం, అంగవైకల్యం వల్ల కలిగిన ఇన్ఫీరియారిటీ, మొహమాటం పసిగట్టి అతనికి తోడబుట్టకపోయినా సొంత అక్క కంటే ఎక్కువగా సహాయ సహకారాలు అందించిన సత్యవతి పాత్ర ఈ నవలలో చాలా ముఖ్యమైనది.

సాగర్‌కి సహాయం చేయడానికి, అతను చదువు కోసం డబ్బు ఖర్చు చేయడానికి ఒప్పుకునే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న గొప్ప వ్యక్తిత్వం ఆమెది.

చిన్నతనంలో తనను ‌సైకిల్‌పై తీసుకువెళ్తూ, అడుగడుగునా చేదోడు వాదాడుగా నిలిచిన ‘శ్రీరామ్’ మరో మంచి పాత్ర.

పేదరికంలో మగ్గిపోయే కుటుంబాలలో ఖర్చు తగ్గించుకోవాలంటే మొట్టమొదట కనిపించేది ‘పిల్లల్ని స్కూల్ మానిపించడం’. అలాంటి పరిస్థితుల్లో ఏడో తరగతి వరకు సాగర్ చదివాడంటే – ఆనాటి పాఠశాలలోని గురువులు, సత్యక్క. ఒంగోలు కాలేజీలో చేరినప్పుడు అడుగడుగునా వెన్నుదన్నుగా నిలిచిన వాడు శ్రీరామ్. చదువులో ఫస్ట్, వక్తృత్వంలో ఫస్ట్, వ్యాసరచనలో ఫస్ట్, క్విజ్‌లో ఫస్ట్. ఆనందంగా ప్రైజులు అందుకోడానికి స్టేజి పైకి వెళ్లాడు సాగర్. బాల్యంలో నడుస్తూ నడుస్తూ ఎన్నోసార్లు పడటం సాగర్‌కి అలవాటే. కానీ తన ప్రతిభతో బోల్డన్ని ప్రైజులు తీసుకొని నడుస్తూ స్టేజి మీద…. అందరి సమక్షంలో తివాచీ తట్టుకొని పడటం అన్నది… అతని గుండెకు బలంగా తగిలిన గాయం.

తన శారీరక వైకల్యాన్ని చదువులో గానీ, ఉద్యోగంలో గాని ‘రిజర్వేషన్’ పేరిట ఉపయోగించుకోవటం సాగర్‌కు సుతరామూ ఇష్టం లేదు. కేవలం తన ప్రతిభ ద్వారానే సీటు సంపాదించుకుంటాడు ప్రతిసారీ. చివరకు కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో కూడా. ఫిజిక్స్‌లో రీసెర్చ్ చేసి సైంటిస్ట్‌గా ఎదగాలన్నది అతని ఆశయం. ఫీజు కట్టడానికి ఆర్థిక సహాయం చేసేందుకు అక్క సత్యవతి ఆసరా ఇప్పుడు లేదు. ఆమెకు పెళ్లి అయిపోయింది. దుర్మార్గపు భర్త వల్ల నిస్సహాయంగా మిగిలిపోయింది. ఆంధ్రా యూనివర్సిటీలో పి.జి. కోర్సుకి (ఆ రోజుల్లో) కట్టాల్సిన 400 రూపాయల కోసం ఎందర్నో అప్పు అడిగాడు. తండ్రి, అన్న, మామయ్యలు కూడా పేదరికపు నీడలో అల్లాడుతున్నవారే. చివరికి తను రాసిన పోటీ పరీక్షలో పాస్ అయి, పోస్టల్ డిపార్ట్‌మెంట్‍లో చిన్న ఉద్యోగం సంపాదించుకొని, కడుపు కట్టుకొని, నెలకు కొంత డబ్బు పొదుపు చేస్తూ, చివరికి తన స్వప్నం – ఆంధ్ర యూనివర్సిటీ మెట్లు ‘ఎక్కాడు’ సాగర్.

ఇంటర్మీడియట్లో తనకు చదువులో మంచి పోటీ ఇచ్చిన సంధ్య అక్కడ రీసెర్చ్ స్కాలర్‌గా ప్రత్యక్షమైంది. హుషారుగా పలకరించింది. కలుపుగోలుగా ఉండమని ప్రోత్సహించింది. ఇన్ఫీరియారిటీ వల్ల తన అంగవైకల్యాన్ని తానే మర్చిపోలేకపోతున్న విషయాన్ని అతను తెలుసుకునేటట్లు చేసింది. దాన్ని జయించడానికి ధైర్యాన్ని నూరిపోసింది. తన పట్ల అతనికి లోలోపల ఉన్న ప్రేమ వెలికి వచ్చేలా మాటలు విసిరింది. తద్వారా అతను మనసు విప్పేలా చేసి, తానూ ఐ లవ్ యు చెప్పింది. సాగర్ హృదయం సంద్రంలా ఎగసి పడింది. ఇరువురు జీవితాన్ని పంచుకున్నారు. ఇద్దరు రత్నాల్లాంటి ఆడపిల్లల్ని కని, పెంచి పెద్ద చేసి, పెళ్లిళ్లు చేశారు. యౌవన ప్రారంభంలో తను మనసుపడ్డ మామయ్య కూతురు పల్లవి “మామయ్య కొడుకు కాబట్టి స్నేహంగా ఉన్నాను. హీరో లాంటి వాడిని పెళ్లి చేసుకుంటాను కానీ కాళ్లు లేనివాడిని కాదు” అన్నప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడ్చినా…. చివరకు ఆమె పెళ్లాడింది హీరోని కాదు, విలన్‌ని అని తెలిసి, వెళ్లి, అతనికి ఆర్థిక సహాయం చేసి, తన పోలీస్ ఫ్రెండ్ ద్వారా బెదిరించి, అతన్నే కాదు వారి కాపురాన్నీ దారిలో పెట్టినప్పుడు…. పల్లవి “థాంక్యూ బావ” అంటూ, “సారీ బావ” అని కూడా అన్నది. అది ఎందుకో అతనికి అర్థం అయింది.

చిన్నప్పుడు తనకు చదువుకే కాదు, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుని సాయం చేసిన సత్యవతి అక్క కూడా దుర్మార్గుడైన భర్త వల్ల బాధలు పడి, అతను చచ్చిపోవటం, అన్నల నిరాదరణ వల్ల దుర్భర జీవితం గడుపుతోందని తెలిసి సాగర్ గుండె నీరయింది. వెంటనే వెళ్ళి, ఆమెకు పిల్లలకు అండగా నిలిచాడు. తన కాళ్ళపై తాను నిలబడలేని ఒక పిల్లవాడు ఆత్మవిశ్వాసంతో తాను ‘నిలబడి’ ఎందరి జీవితాలనో నిలబెట్టడం, ఒక విజేతగా నిలబడటం, తన జీవిత ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలని, ఆత్మకథను రాయటం మంచి సంకల్పం.

తన తోటి వారు పరిగెత్తటం చూసి తన అశక్తతకు దిగులు పడేవాడు సాగర్. కారు నడపటం అతనికి ఒక పెద్ద డ్రీమ్. సత్యవతి అక్క తన పాదాలకు అనువుగా, నడవటానికి వీలుగా బూట్లు కుట్టించే వరకు… నడుస్తున్నప్పుడు పాదాలకు రాళ్లు గుచ్చుకుంటే విలవిల్లాడిపోయేవాడు. తర్వాత ఆ బూట్లతో, గుండెల నిండా పొంగిన ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో నడిచాడు… వాటర్ ట్యాంక్ పైకి, కర్నూలు బురుజు పైకి ఎక్కి సంతోషంగా లైట్ల వెలుగుల్లో నగరాలని తిలకించాడు. ఎప్పటికప్పుడు ఏదో విధంగా ‘పడి’పోతున్నా, మళ్లీ కష్టపడి ‘లేచి’ తనను తాను నిరూపించుకుంటూ ఎదిగాడు సాగర్. సత్య అక్క, శ్రీరామ్, అఫ్జల్ వంటి అమృత హృదయులు అతనికి ఆసరాగా ఉన్నట్లే, స్కూల్‌లో శీను, కాలేజీలో రామకృష్ణ, ఉద్యోగంలో తన పై ఆఫీసర్ వంటి విషతుల్యులు మాటల తూటాలను పేల్చేవారు సాగర్ గుండెల్లో. వాటిని తట్టుకుంటున్నట్టు పైకి కనిపించినా, సాగర్ లోలోపల ఒక ఘోష నిరంతరం అల్లకల్లోలపరిచేది. తనలో నిక్షిప్తంగా ఉన్న ఆ ఇన్ఫీరియార్టీని సంధ్య సాంగత్యం వల్ల పోగొట్టుకోగలిగాడు. కారు నడపగలిగాడు. చివరిలో అంటాడు సాగర్ – “తీరని కోరిక ఒకటి ఉంది” అని. మైదానంలో క్రికెట్ ఆడుతూ పరిగెత్తుతున్న పిల్లల్ని చూస్తూ “పరిగెత్తాలి అన్న కోరిక” అనడంతో ఈ నవల ముగుస్తుంది.

తప్పక సాగర్ ఆ కోరికను కూడా తీర్చుకోగలడు. కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, ప్రముఖ రచయిత సలీం రాసిన ‘పడిలేచే కెరటం’ నవలను వ్యక్తిత్వ వికాస పుస్తకాల జాబితాలో ఉంచి విద్యార్థులకు చదివించే అవకాశం కల్పించాలి. పరీక్ష తప్పడం వల్లో, ప్రేమ విఫలం అవడం వల్లో, తమ విలాస జీవనానికి డబ్బు ఇవ్వలేదనో ఆత్మహత్య చేసుకుంటున్న నేటి యువతరం – నడవలేని ( ఫిజికల్లీ డిజేబిలిటీ అనడం అతనికి ఇష్టం ఉండదు) ఒక సాగర్ ఎలా జీవితాన్ని జయించాడో, తాను నిలబడి, తన జీవితాన్ని, తన సన్నిహితుల జీవితాలను ఎలా నిలబెట్టాడో తెలుసుకోవాలి. కాళ్ళు చేతులు సక్రమంగా ఉండి కూడా, ఇతరుల పై ఆధారపడే వారూ, తమ మీద తామే నమ్మకం కోల్పోయిన వారూ సాగర్ జీవితం గురించి విజయం గురించి తెలుసుకొని స్పూర్తి పొందాలి. అప్పుడే ఈ రచనకు సార్ధకత, రచయిత తపనకి పరిపూర్ణత సిద్ధిస్తుంది.

***

పడిలేచే కెరటం (నవల)
రచన: సలీం
ప్రచురణ: జె.వి. పబ్లికేషన్స్
పుటలు: 368
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఈబుక్:
https://kinige.com/book/Padileche+Keratam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here