ఓ అద్భుత లోకంలోకి ప్రయాణం – ‘పాడుతా… తీయగా’ పఠనం!

    0
    5

    [dropcap]సం[/dropcap]గీతం భగవంతుడి భాష. ఒక్క ట్యూన్ (బాణీ)లో లోకంలో ఎన్ని భాషలుంటాయో అన్నీ ఒదిగించవచ్చు. అయితే ఈ బాణీల్లోనే వస్తుంది తేడా అంతా. ఏ ప్రాంతఫు బాణీ వారిదే. వెస్ట్రన్, కర్ణాటిక్, హిందూస్థానీ ఇలా. అంతే కాదు ఇది చైనీస్, ఇది జపనీస్, ఇది కొరియన్, ఇది రాప్ ఇలా రకరకాలుగా చెప్తారు. కానీ సంగీతం సంగీతమే. అది భగవద్దత్తమే.

    ఏ ‘ఘరానా’ అయినా అది పుట్టేది వశించేది సంగీత సరస్వతి పాదాల చెంతనే. లైట్ మ్యూజిక్ అన్నా, జానపదం అన్నా, శాస్త్రీయ సంగీతమన్నా ఏ ప్రక్రియ అయినా అది హృదయాల్ని అలరించేదే!

    ఆకాశపు వీధుల్లో నడయాడుతున్న సంగీతాన్ని, కేవలం ప్రవేశమున్న వారే ‘తరించగలిగే’ సంగీతాన్ని నేలమీదకి జానపదులు తెస్తే, ఇంటింటికీ, ప్రతి వ్యక్తీ పాడుకునే విధంగా, మైమరిచిపోయే విధంగా సంగీతాన్ని సమాజానికి అందించిన ఘనత మాత్రం ‘సినీ సంగీత దర్శకులదే’. శాస్త్రీయ సంగీతం గొప్పదే. కాని దాన్ని గురుముఖతా నేర్చుకోవాలి. సాధన చేస్తే గానీ అది పట్టుపడదు. కానీ సినీ సంగీతం అలా కాదు. ఎవరైన నాలుగుసార్లు ‘విని’ పాడుకోవచ్చు. మరో విధంగా చెప్పాలంటే సినీ పరిశ్రమ made music easy. ‘మేడీజీ’ అన్నమాట.

    సరే. మళ్ళీ ఇందులోనూ బెంగాలీల, మరాఠీల, సూఫీల, క్రైస్తవుల సంగీత రచనలు తమ తమ ప్రత్యేకతలని బాణీల్లోనే చాటుకున్నాయి.

    సినీ సంగీతపు గొప్పదనం ఏమంటే ఇదో సముద్రం. అన్ని నదులను కడలిలో తన కడుపులో దాచుకున్నట్టు, అన్ని ప్రాంతాల వారి సంప్రదాయాల్నీ సినీ సంగీతం మక్కువగా అక్కున చేర్చుకుంది. లేకపోతే ఓ సలీల్ చౌధురి మలయాళీ సినిమా ‘చెమ్మీన్’కి సంగీత దర్శకత్వం ఎలా చేస్తారూ? దాన్ని మన్నాడే ఎలా స్వరాలతో శిల్పీకరిస్తారూ? (ఇది స్వర శిల్పం).

    రామయ్యా వస్తావయ్యా అనే తెలుగు పదం హిందీలో ఎలా ఒదిగిందీ? కులాసా, మజాకా, కలేజా, ఇలాంటి పరభాషా పదాలు తెలుగులో ఎలా ఒదుగుతాయి? సంగీతం విశ్వాత్మకం. యూనివర్సల్.

    ఇదంతా ఎందుకంటే కస్తూరి మురళీకృష్ణ గారిది ‘పాడుతా తీయగా’ మాత్రమే కాదు, ‘పాడనా… తీయగా’ కూడా. తెలుగువాళ్ళ గొప్పదనం ఏంటంటే  మనం పాలూ నీరూ లాగా అన్ని ‘ఘరానా’ల్లోనూ ఒదిగిపోతాం. ఓ నౌషాద్, ఓ రామచంద్ర చితల్కర్, ఓ హేమంత్ కుమార్, ఓ ఎస్.డి. బర్మన్, శంకర్ జైకిషన్, రవీంద్రజైన్, పంకజ్ మాలిక్, గులాం మహమ్మద్, రాంకిషన్, సలీల్ చౌధురి అంతే కాదు, మదన్ మోహన్, వసంత దేశాయ్… వీరందరితో పాటు ఎమ్.ఎస్. విశ్వనాథన్, ఇళయరాజా, ఎ.ఆర్. రెహమాన్, రవీంద్రన్, వీరందరినీ కూడా మనం ప్రాణానికి ప్రాణంగా గౌరవిస్తాం. వారు మనవారే, మన తెలుగువారే అన్నంతగా ప్రేమిస్తాం. ఇతర భాషల వాళ్ళు మరి మన తెలుగు సంగీత దర్శకుల్ని ప్రేమిస్తారా? ప్రేమించిన దాఖలాలున్నాయా? అంటే నో అనే చెప్పాలి. వారి ఖర్మ వారిది. వారి “ఊబి”లో వారిని సుఖంగా వుండనిద్దాం.  ఆ ప్రాంతీయ ‘బురద’ మనకెందుకూ?

    మనం ప్రేమించేది సంగీతాన్ని; దమ్మున్న, సజీవమైన సంగీతాన్నిచ్చే సంగీత దర్శకుల్ని; వాయిద్యాలను తమ శరీరంలో భాగాలుగా భావించే వాద్యకారుల్ని; పాటలోని భావాన్ని అద్భుతంగా పలికించే గాయకుల్ని; ఆ పాటల్ని పాత్రలుగా అమరత్వంతో నింపిన నటీనటుల్ని. యస్… ఇది ముమ్మాటికీ నిజం.

    “ఋజువేమిటీ?” అని ప్రశ్నిస్తే దానికి సమాధానమే కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన “పాడుతా… తీయగా”.

    వారీ పుస్తకంలో హిందీ సంగీత దర్శకుల్నీ, హిందీ గేయ రచయితల్నీ, హిందీ గాయనీగాయకుల్నీ subjectగా తీసుకుని అద్భుతమైన గీత, సంగీత, వ్యక్తి వివరణలను విశ్లేషణను ఇచ్చారు.

    అసలు హిందీ వారినెందుకు తీసుకోవాలి? మన భాషకి ఇవ్వని ప్రాధాన్యత హిందీకి ఎందుకి ఇవ్వాలీ??? అని మీరు అడగొచ్చు. సహోదర సహోదరీమణులారా, హిందీ ప్రవహించినంత సులువుగా, సుందరంగా, సరళంగా మరే భాషా ‘ట్యూన్’ (బాణీ)లోకి ప్రవహించడని ఘంటాపథంగా చెప్పగలను. కొన్ని వేల ఉదాహరణలు ఇవ్వొచ్చు. ఎప్పుడో ఆరుద్ర గారు రాసిన ‘పందిట్లో పెళ్ళవుతున్నాదీ’, ‘ఏకాంతమూ సాయంత్రమూ’, ‘పాడు జీవితమూ యవ్వనమూ’, ‘రా రాదా, మది నిన్నే పిలచెగాదా’ ఇవన్నీ యీనాటికీ సజీవంగా మన గళాల్లో నర్తిస్తున్నాయంటే, కారణం అవి హిందూస్థానీ ట్యూన్‍లు కావడమే.

    ‘సారే జహాసే అచ్ఛా హిందూ సితా హమారా’ అనుకుంటూ ‘పాడుతా… తీయగా’ని పాడుకుంటూ చదవడం మొదలుపెట్టా.

    ఓ అద్భుత లోకంలోకి అంటే ఓ వెయ్యి స్వర్గాలకంటే గొప్పదైన లోకంలోకి అడుగుపెట్టానని మొదటి పేజీలోనే తెలిసిపోయింది.

    పంకజ్ మల్లిక్ సంగీతమంటే ప్రాణం. కానీ ఆయన గురించి నాకు తెలిసింది ఆవగింజంత అని మురళీకృష్ణగారి పుస్తకం చదువుతుంటే తెలిసింది.

    ఈ పుస్తకంలోని ఒక్కో పాటా (ఉదహరించినవి) ఓ పూలతోట. ఒక్కో మాటా తేనెలద్దుకున్న మూట.

    ఇందులోని విశ్లేషణలని విశ్లేషించడం కేవలం మూర్ఖత్వం. ఆ పని నేను చెయ్యను. విశ్లేషణలని ఆస్వాదించడం భావుకత్వం. అందుకే నేను భావనా లోకపు సంగీత అలల మీద విహరిస్తా.  విహారించాక చెప్తున్న మాట ఇది. మళ్ళీ మళ్ళీ మళ్ళీ విహరిస్తాననీ, యీ పుస్తకం Book of All time అనీ, book of the hour కాదనీ. కనుక అర్జంటుగా కొనుక్కొని దాచుకోమనీ.

    మీరడగొచ్చు “శ్రీ మురళీకృష్ణ గారు నాకీ పుస్తకాన్ని పంపి, అభిప్రాయం వ్రాయమన్నారేమో!” అని. కానీ అది అపోహ మాత్రమే. వారు నాకు పుస్తకాన్ని ఇవ్వలేదు (హమ్మా… ఎంత కిలాడీ!).  ఈ పుస్తకాన్ని నేను చదివి ఆనందించాలనీ, చదివితే మహదానంద పడతాననీ తెలిసిన మ్యూజికాలజిస్ట్ రాజా యీ పుస్తకం నాకు కొరియర్‍లో పంపాడు. ఇదిగో, స్కాన్ తీసి మరో సాక్ష్యాన్ని పంపుతున్నాను.

    పుస్తకం చదివాక నా అంతట నేనే ఆనందంతో మైమరిచిపోయా. మీరూ ఆనందించాలనే ఆకాంక్షతో నా అభిప్రాయాల్ని మీతో పంచుకుంటున్నాను.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here