రంగుల హేల 12: పగలూ – ప్రతీకారాలూ

1
8

[box type=’note’ fontsize=’16’] ‘పగలూ – ప్రతీకారాలూ’ మనుషులకే కాదు వస్తువులకూ ఉంటాయంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]చి[/dropcap]న్నప్పుడు బాగా వినేవాళ్ళం. నాగుపాములు పగపడతాయనీ, వాటిని ఇబ్బంది పెట్టిన వారిని గుర్తుపెట్టుకుని సప్త సముద్రాల అవతలికైనా వెళ్ళిపోయి కాటేసి పగతీర్చుకుంటాయనీ. ఆ కథలు వింటూ రాత్రిళ్ళు కాలు కిందపెట్టడానికి భయపడిపోతుండే వాళ్ళం. దుప్పటి కిందకి వేళ్ళాడితే అక్కడి నుండి పాములు మంచమెక్కేస్తాయని విని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. అవన్నీ మూఢనమ్మకాలనీ, పాములకు పగబట్టే శక్తి కానీ, తీర్చుకునే శక్తి కానీ లేదనీ మా సైన్స్ మాస్టారు చెప్పినప్పటికీ పాము కథలు మేం చెప్పుకుంటూనే ఉండేవాళ్ళం భయం భయంగా.

కొందరు మనుషులు కూడా పగబడుతూ ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్త్తూ ఉంటారు. అవకాశం దొరకగానే తమ పని కానిచ్చి తృప్తి పడుతూ ఉంటారు. ఆ విషయంపై పూర్వాపరాలు పరిశోధించడానికి మనకి సమయం ఎక్కడిది? అందుకే మధ్యే మార్గంగా మనకి, అనుమానాస్పదంగా అంటే మనకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడానికి అనుకూలంగా ఉండదనుకునేవాళ్ళకి కాస్త దూరంగా నడుస్తూ నొప్పింపక తానొవ్వక అన్నట్టు మన పని మనం చేసుకుంటూ ఉంటాం.

అప్పుడప్పుడూ సంయమనాన్ని కోల్పోయి మనల్ని ఏడిపించిన వాళ్ళని మనం కూడా ఏడిపించాలని తలపెట్టామనుకోండి చచ్చామే! గతంలో వాళ్ళు మనల్ని ఏడిపించిన సంగతి మరుగున పడిపోయి మనం పెట్టిన ఇబ్బంది హైలైట్ అయ్యి అందరి తీర్పులూ వినవలసి వస్తుంది. అంచేత ఇలాంటివి మన వల్ల కాని పనులు. అందుకే చాలా మందిని క్షమించలేకపోయినా ఇగ్నోర్ అనే మాత్ర మింగి ఊరుకుంటాం.

ఇకపోతే మరో సంగతి తెలుసా మీకు? వస్తువులూ కూడా పగబడతాయి. ఎలాగంటారా? రోజూ ఆఫీస్ మీటింగ్స్‌లో తిని తిని నాకు గుడ్ డే బిస్కట్లంటే మహా విసుగు. మా అటెండర్లని నాకెప్పుడూ అవి పెట్టొద్దని బెదిరించాను కూడా. అప్పుడా బిస్కట్ నా మీద పగబట్టింది.

ఒకసారి నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాను. ఓ సెలవు రోజు ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ చూసి తిరిగి వస్తున్నాను. ట్రావెల్స్ బస్సు వాడు డిన్నర్‌కి అర్ధరాత్రి పన్నెండుకి ఒక చోట ఆపాడు. అక్కడ నూడుల్స్, ఫ్రైడ్ రైస్ మూకుళ్లలో గాల్లో ఎగరేస్తూ టూరిస్ట్స్‌లకి వేడి వేడిగా వడ్డిస్తున్నారు. యువత అంతా ఆశగా తెచ్చుకుని తింటున్నారు. నేనది చూసి జడుసుకుని ఏదైనా బిస్కట్ ప్యాకెట్ కొనుక్కుందామని పక్కనే ఉన్న షాప్‌లో అడిగాను. వాడు గుడ్ డే తప్ప మరో బిస్కట్ లేదన్నాడు. పది రూపాయల గుడ్ డే బిస్కట్ పాకెట్‌ని ఇరవై కి అమ్మాడు. నేనో మూల కూర్చుని ఆవురావురుమని ఓ నాలుగు బిస్కట్లు తిన్నాను. అప్పుడా గుడ్ డే వికటాట్టహాసం చేస్తూ నా మీద పగ తీర్చుకుంది.

మీరు కూడా గమనించండి. ప్రతి రోజూ కాళ్ళకీ చేతులకి అడ్డం పడుతూ పనికి రావని అనిపించిన వస్తువుల్ని చిరాకుతో పడేసిన మరుక్షణం వాటి అవసరం వచ్చేస్తుంది. ఆఫీస్‌లో అనేక అనవసరపు కాగితాలు, ఫైల్స్ గుట్టలుగా ఉంటాయి. ఒకో రోజు అవన్నీ కట్ట కట్టేసి గొడౌన్స్‌కి పంపేస్తుంటాము. ఆ ట్రక్ వెళ్లగానే ఎవరో ఏడుస్తూ దాని వెంట పరుగు మొదలెడతారు, అందులోంచి కొన్ని కాగితాలు ఇప్పుడే కావాలంటూ. ఇలాంటి అనుభవాలవల్లే ఇంట్లోనూ ఆఫీసులోనూ అన్నీ దాచుకుని మన చుట్టూ నిలువెత్తు కుప్పలు పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటాం ఏమో ఎప్పుడేది అవసరం వస్తుందో ఎవరి కెరుక అని గొణుక్కుంటూ.

ఒకసారి స్టెయిన్‌లెస్ స్టీల్ జంతికలు తిప్పే మెషిన్ కొనుక్కుని మా అమ్మిచ్చిన ఇనప జంతికల గొట్టం బైట పడేస్తుంటే మా సహాయకురాలు అడిగి తీసుకుని వెళ్ళింది. ఒక రోజు జంతికలు చేస్తుంటే స్టీల్ మెషిన్ పని చెయ్యడం మానేసింది. కలిపిన పిండి ఏం చెయ్యాలి? అప్పటికప్పుడు సహాయకురాలు ఇంటికి మా అబ్బాయిని పంపి ఆ ఇనప గొట్టం తెచ్చుకుని జంతికలు చేసుకున్నాం. చూసారా! పారేసిన ఇనుప వస్తువు నా మీద ఎలా కసి తీర్చుకుందో !

ఇక మనుషులు సరే సరి. మనం వందసార్లు వాళ్లకి సాయం చేసి వంద ఒకటోసారి చెయ్యకపోతే చాలు కోపం పెట్టుకుని మన ఇమేజ్ పాడు చేస్తారు. మనం మాత్రం అన్నీ మింగి చిదానందమూర్తిలా ఈ రోజిలా గడిస్తే చాలు అన్న ఆధునిక వేదాంతంలో మునిగిపోయి బతుకు బండిని లాగేస్తూ ఉండాలి. మనకి హాని చేసిన వారిపై పగబట్టి ప్రతీకారం తీర్చుకునే అంత టైమూ, ఓపికా మనకెక్కడ ఉంటాయి? మన అదృష్టానికి మనకి విరక్తి కలిగించే మనుషులే మనకి బాసులుగా, సహోద్యోగులుగా అవతరిస్తారు. మనం గరళ కంఠులుగా మారి చిరునవ్వులు అతికించుకోవాలి. తప్పదు.

తమ తల్లి తండ్రులను బాధలు పెట్టిన వారిని పిల్లలు హీరో, హీరోయిన్‌లుగా ఎదిగి ప్రతీకారం తీర్చుకునే పాత సినిమాలు భలే బావుంటాయి. సాధారణంగా ప్రతి సినిమాలోనూ మొదట్లో విలన్లు చేసే దుర్మార్గాలకు ప్రతీకారంగా క్లైమాక్స్‌లో హీరో వాళ్లని కసితీరా చితక బాదుతుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో!

ఇంకా కొన్ని మెత్తటి ప్రతీకారాలుంటాయి. ఎవరో కజిన్ సిస్టర్ మొదటిసారి మనింటికి వస్తుంది. మనమెంతో ప్రేమగా ఆమెని ఆహ్వానించి సిటీలో అవీ ఇవీ చూపించి కాస్త సింపుల్‌గా ఉండే ఒక చీర సరదాగా పెడతాం అప్పటికి వీలు కుదిరి. ఇలా వీలు చేసుకుని ఇంటికి వచ్చిన వాళ్లందరికీ చీరలు కొని పెడితే బావుంటుంది కదా అని మనం మురిసిపడేలోగా ఆ కజిన్ మన మీద పగ బడుతుంది. ఏదో ఒక ఛాన్స్ కల్పించుకుని బాగా ఖరీదైన చీరొకటి మనకి పెట్టి ఛాలెంజ్ చేస్తుంది. మనమింక విల విలలాడిపోయి గింజుకుంటాం. మళ్ళీ ఆమెకి మరొక గిఫ్ట్ కొని పెట్టి పోటీలో పాల్గొనే ఓపిక లేక నోరు మూసుకుని ఊరుకోవడం ఉత్తమం అనుకుంటాం. అదండీ పగా, ప్రతీకారాల ముచ్చట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here