పాలమూరు వలస బతుకు చిత్రాలు – పుస్తక పరిచయం

0
15

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత్రి, వైద్యురాలు డా. గీతాంజలి రాసిన రెండు కవితలు, ఏడు కథలు, రెండు పెద్ద కథలు, ఒక నవలిక, ఒక నాటకంతో ఈ పుస్తకాన్ని వెలువరించారు. మొత్తం 13 రచనలున్న ఈ పుస్తకాన్ని ‘వెన్నెల ప్రచురణలు’ ప్రచురించారు.

***

ఈ పుస్తకానికి రాసిన ‘వెంటాడే కథలు’ అనే ముందుమాటలో – ”  ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ చదవడానికి మనం మళ్ళీ నైసర్గిక మానుష ప్రవృత్తిలోకి వెళ్లిపోవాలి. మనుషులు కావాలి. స్త్రీలం కావాలి. పిల్లలం కావాలి. భూమి కావాలి. చెట్లు కావాలి. నీరు కావాలి. అంటే ప్రకృతి ప్రకృతిలో సహజ భాగమైన మనుషులు కావాలి. ఇక్కడి నాగరికత పొరలు కప్పిన మనం మళ్ళీ అవన్నీ ఛేదించుకొని ఆ స్థితికి వెళ్ళగలమా? గీతాంజలి అట్లా వెళ్లి ఈ కథలు రాసింది.

ఈ కథలని కదిలిస్తే చాలు పాలమూరు వలస కూలీల విషాద పోరాట గాథలు వివరిస్తాయి.

ఇవి కథలు కావు, విషాద గాథలు. ఇందులోనివి పాత్రలు కావు, రక్తమాంసాలున్న మనుషులు. ఆ మనుషులను ఒక భావోద్వేగ పూరితమైన ఆవేశంతో గీతాంజలి ఆవాహన చేసుకున్నది. ఈ కథల్లో మనకు కనిపించే మార్మిక వాస్తవికత ఆమెకు ఆవేశించిన అనుభవమే. ఒక్కమాటలో చెప్పాలంటే పాలమూరు ప్రజల వలసలు, ఆ చేదు అనుభవాలు, అవి కల్పన నుంచి వాస్తవాలుగా ఆమెను సజీవంగా ఆవహించి పాత్రలు కాలేకపోయాయి.

ఈ రచనలొక ప్రవాహం. దుర్భరమైన జీవన్మరణ పోరాట దృశ్యకావ్యం. ఇది రాయడానికి, చదవడానికి మనకు ధైర్యం కావాలి ఈ కథలోని పాత్రల పట్ల మనకు పరిపూర్ణమైన మానవానుబంధం ఉంటే తప్ప ఇది కథలుగా చదువుకునే అర్హత మనకు రాదు” అని వ్యాఖ్యానించారు వరవరరావు.

***

“ఈ పదమూడు రచనలలో మొదటి కథ నుంచి చివరి కథ దాకా ఒక కన్నీటి ధారా ప్రవాహం కనిపిస్తుంది. కథలలో ఎక్కువ లేకపోవడానికి పాలమూరు వలస కూలీల జీవన ఘర్షణ, ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని తట్టినా హృదయాన్ని పిండే వేదన ఉంటుంది. ఏ కథ కూడా మనిషిని ఊపిరి తీసుకోనివ్వదు. కూలీల జీవిత విషాదం ఎంతో లోతుగా ఉంటుంది. ఎంత వేదనాభరితంగా ఉంటుందో ఊహించడం కూడా సాధ్యం కానంత బలంగా, గాఢంగా గీతాంజలి గారి రచనలు సాగాయి. ఇందులో ఆకలి ఉంది, దారిద్ర్యం ఉంది. మరణపు డప్పుల చప్పుడు ఉంది. ఎంత అమానుషంగా, అమానవీయంగా మహిళా జీవితాలతో సమాజం ఆడుకుంటున్న దారుణాలున్నాయి. చిన్న చిన్న అమ్మాయిలు జీవితాలు ఎలా ఛిద్రమయ్యాయి, కాంట్రాక్టర్ల కామవాంఛకు మహిళా కూలీల జీవితాలు ఎలా బలైపోయాయో, ఈ కథల నిండా కనిపిస్తాయి. ప్రతి కథలో భయంకర వాస్తవాలున్నాయి. ఒక కథ చదవడం ముగించాక మరో కథ ముట్టడానికి మనసు ఒప్పదు. ఇంకో చదవడం మొదలు పెట్టాలా వద్దా అన్నంత భయం వేస్తుంది. ఏ భయంకర దృశ్యాన్ని చదవవలసి వస్తుందో అన్న భయం పాఠకుడిని ఆవరిస్తుంది” అని ఈ పుస్తకానికి రాసిన ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు జీవన విధ్వంసం’ అనే ముందుమాటలో అన్నారు ప్రొఫెసర్ హరగోపాల్.

***

పాలమూరు వలస బతుకు చిత్రాలు
రచన: డా. గీతాంజలి
ప్రచురణ: వెన్నెల ప్రచురణలు
పుటలు: 253.
వెల: ₹150
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here