పల్లవించిన కవిత

    0
    6

    [box type=’note’ fontsize=’16’] ప్రేమించి పెళ్ళి చేసుకుని, ఆపై అపార్థాలు, అపోహలతో విడిపోవాలనుకున్న ఓ జంటని కలిపేందుకు – ‘పట్టు విడుపు ఉంటే సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంద’ని నమ్మిన అతని తండ్రి చేసిన ప్రయత్నమే తమిరిశ జానకి వ్రాసిన “పల్లవించిన కవిత” అనే ఈ కథ. [/box]

    [dropcap]స[/dropcap]రయు అంటే ఒకప్పుడు చాలా ఇష్టం భాస్కర్‌కి. కానీ ఇప్పుడా ఇష్టం కరిగిపోయింది. ఐస్ క్రీమ్ కరిగిపోయి చేతిలో పుల్ల మిగిలినట్టు ఇష్టం కరిగిపోయి మనసులో వెలితి మిగిలింది. ఎందుకిలా జరిగింది… ఆలోచించడానిక్కూడా బాధగానే అనిపిస్తుంది. తలంటు పోసుకున్నాక జుట్టు విదిలిస్తే నీళ్ళు రాలినట్టు బాధాకరమైన ఆలోచనలు కూడా తల విదిలిస్తే రాలిపోతే ఎంతబావుంటుంది… తన ఆలోచనకి తనకే నవ్వొస్తుంది. కళ్ళు చెమ్మగిల్లిన దానికి స్పందన ఆ నవ్వు. మనసుకి తెలుసు ఆ సంగతి. అందుకే గతాన్ని తవ్వుతూనే ఉంటుంది… స్పందిస్తూనే ఉంటుంది. అసలు ఆమెని చూశాకే కదా మొట్టమొదటిసారిగా తన మనసు కవితలా కాగితమ్మీద అక్షరరూపమయింది.

    మొదటిసారి ఆమెతో మాట్లాడినప్పుడే కదా వెల్లువలా కవితాఝరి ఉప్పొంగింది హృదయంలో. అతిత్వరలోనే ఒక మంచి కవిగా పేరు కూడా వచ్చేసింది. ఎంత పొంగిపోయేది తన కవితలు చదివి. ‘ఇలా ఎలా రాయగలవు’ అంటూ తన కళ్ళల్లోకి చూసినప్పుడల్లా ఆ చూపుని ఒక కవితగా మలుచుకునేవాడు తను. ఆమె కళ్లల్లోనే తన కవితలు దాగున్నాయనిపించేది. సరయు హఠాత్తుగా వెళ్ళిపోయింది పుట్టింటికి. అలా చేస్తుందని ఊహించలేదు. కవితారూపమే మాయమయ్యాక కవితలేవీ తన మనసులో? అక్షరాలు కనుమరుగైన తెల్లకాగితమైంది కదా తన మనసు. ఆలోచనల్లోనే నిద్ర ఆలోచనల్లోనే మెలకువ రోజులు ఆలోచనల్తో గడుస్తున్నాయో ఆలోచనలు రోజుల్ని దొల్లిస్తున్నాయో అర్ధం కాని పరిస్థితి భాస్కర్‌ది.

    ఆరోజు పొద్దున్నే తండ్రి ఊర్నించి రావడం ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఆయన రావడం ఆశ్చర్యం అని కాదు. పని ఏదన్నా ఉంటే పట్నం వస్తూనే ఉంటాడు. కానీ ఇలా వస్తున్నట్టుగా ముందు ఓ ఫోన్ అయినా చెయ్యకుండా ఎప్పుడూ రాలేదు. అదీ ఆశ్చర్యం. అందుకే అడిగాడు “అదేమిటి నాన్నగారూ వస్తున్నట్టు ఫోన్ చేస్తే స్టేషన్‌కి వచ్చేవాడినిగా!”

    “నాకు తెలియని ఊరా? నువ్వు స్టేషన్‌కి రాకపోయినా ఎన్నోసార్లు ఒక్కడినే వచ్చానుకదా?”

    “నిజమేకానీ… అనుకోకుండా ఆఫీస్ పనిమీద నేనేదన్నా ఊరెళ్తూ ఉంటా కదా…. మీరొచ్చినప్పుడు నేను లేకపోతే!…” నసిగాడు మెల్లిగా.

    “ఓ… కోడలింకా రాలేదా ఆ మధ్య నేను ఫోన్ చేసినప్పుడు కోడలుపిల్ల అమ్మగారింటికి వెళ్ళిందని నాలుగు రోజుల్లో వస్తుందని చెప్పావు కదురా…. వచ్చేసి ఉంటుందనుకున్నాను. వెళ్ళి నెల రోజులై పోయినట్టుంది కదా… ఇంకా రాలేదా…?”

    తల తిప్పుకున్నాడు భాస్కర్రావు చటుక్కున.

    “అయినా రెండు వీధులవతలే కదరా పెద్దనాన్నా వాళ్ళున్నది. మీరు ఇంట్లో లేకపోతే అక్కడికి వెళ్తాను. వాళ్ళింట్లో ఎవరో ఒకరు ఎప్పుడూ ఉంటారు కదా… అది పెద్దసమస్య కాదు” నవ్వుతూ తేల్చేశాడు రామ్మూర్తి. ఆయనకి బాధగా ఉంది కొడుకుని చూస్తుంటే. ఈ తరం చాలామంది యువతలో కనిపిస్తున్న క్షణికావేశాలని తల్చుకుంటూ పడే బాధ అది. నిజానికి ఈసారి ఆయన పట్నం రావడం విత్తనాలో… ఎరువులో… పొలంలో జల్లే మందులో కొనుక్కుని వెళ్ళడానికి కాదు. కొడుకుతో కబుర్లు చెప్తున్నట్టే చెప్తూ కొడుకూ కోడలూ మధ్య వచ్చిన విబేదాలు సరిదిద్దే ప్రయత్నం చేద్దామని ప్రత్యేకం ఆ పనిమీద వచ్చాడు.

    ఆఫీసుకి వెళ్ళాడన్న మాటేగానీ పని మీద ధ్యాస లేదు భాస్కర్‌కి. భార్య ఇల్లొదిలి వెళ్ళినప్పటినించీ ఇదే పరిస్థితి. మనసు పాడవటం అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చిన స్థితి. దృష్టి దేనిమీదా నిలపలేని గజిబిజి మానసిక స్థితి.

    ***

    భాస్కర్‌ది ప్రేమ వివాహం. బంధువులింట్లో శుభకార్యానికి వెళ్ళినప్పుడు చూశాడు సరయుని. ఆమె అందం ఆ అందంలోని సౌకుమార్యం అతన్ని ఆకట్టుకున్నాయి. ఇంటికి వెళ్ళాక కూడా ఆమె రూపమే కళ్ళముందు కదులుతూ మునుపెన్నడూ ఎరుగని భావవీచికలు మనసున అలలై అలరించాయి. కాగితం కలం ఎప్పుడు అందుకున్నాడో ఎప్పుడు కాగితమ్మీద తన మనసు కవితని అల్లేసిందో తనకే తెలియదు. అది మొదలు తను కవిత రాయని రోజు లేదు. తన కవిత లేని పత్రిక లేదు. స్ఫూర్తి సరయు స్పందన తనది. పత్రికలలో కవితలకి ముగ్ధురాలైన వ్యక్తి సరయు. ఆ కవితలకి స్ఫూర్తి తనే అని భాస్కర్ నోటివెంట తెలిసినప్పుడు ఆమె ఆనందానికి హద్దే లేకపోయింది. కించిత్తు గర్వం కూడా కలిగింది. ప్రతి కవితా చదివినప్పుడల్లా ఫోన్ చేసి మెచ్చుకునేది పొగిడేది. భాస్కర్‌కి కవితాలోకంలో వీరవిహారం చేయడం అలవాటుగా మారిపోయింది. అటు ఉద్యోగం ఇటు కవితలు రాస్తూ తన్మయత్వంలో మునిగి తేలడం సరయుని అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండడం ఈ జీవితం ఎంతోబావుంది అనిపించింది భాస్కర్‌కి. ఎంతగొప్పగా రాస్తాడు కవితలు ఇతన్ని పెళ్ళి చేసుకునే అదృష్టం తనకి దక్కితే బావుంటుందని కలలు కనేది సరయు. పరిచయం పెరిగి ప్రేమగా పెళ్ళిగా రూపుదిద్దుకుంది పెద్దల ఆశీర్వాదంతో. డిగ్రీ వరకూ చదువుకున్నసరయు ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదని చెయ్యాలన్న ఆసక్తి కూడా తనకి లేదని ఇంటిపట్టునే ఉంది. అది ఆమె ఇష్టానికే వదిలేశాడు భాస్కర్. పెళ్ళయ్యాక మరింత జోరుగా గోదావరి వరదలా గుండెల్లో పొంగే భావజాలాన్ని సొగసైన ఇంపైన కవితాఝరిలా రూపుదిద్దుతూ కాలమెలా గడిచిపోతోందో కూడా తెలియట్లేదు భాస్కర్‌కి. ఎక్కువసేపు అద్దం ముందు కూచుని తన అందానికి మెరుగులు దిద్దుకోడంలో సరయూకి కూడా కాలమెలా గడిచిపోతోందో తెలియదు. పెళ్ళయిన ఏడాదికి ఆకస్మికంగా వారిమధ్య రేగిన గాలి దుమారం తుఫాను రూపం దాలుస్తుందని ఎవరూహించగలరు? ఆ రోజు కొత్త కవిత రాయడానికి భాస్కర్ ఉపక్రమిస్తుంటే సినిమాకి తీసుకెళ్ళమని పట్టుపట్టింది సరయు. రెండురోజుల కిందటే కొత్తగా విడుదలైన సినిమాకి వెళ్ళొచ్చారు. ఆ మాటే అన్నాడు భాస్కర్ యాథాలాపంగా. వినిపించుకోలేదు సరయు.

    “అదికాదు సరయూ, ఒక పత్రికలో కవితల పోటీ పెట్టారు. రెండు రోజులే గడువుంది పంపించడానికి. నాకో మంచి కవితకి ఆలోచన వచ్చింది. పడుకునేలోపల ఇప్పుడది రాసేసి రేపు కొరియర్ చేసేద్దామని అనుకుంటున్నాను”.

    “అదేమీ కుదరదు. పోటీ లేదు గీటీ లేదు. సినిమాకి వెళ్ళాల్సిందే.”

    ఇంక తప్పదని లేచాడు భాస్కర్. గబగబా లోపలిగదిలోకి వెళ్ళింది సరయు. ఎంతసేపైనా బయటికి రాకపోతే సినిమా మొదలెట్టేలోపల చేరుకోలేమన్న అసహనంతో గుమ్మం దగ్గిరకి వెళ్లి పిలిచాడు. అద్దం ముందు కూచున్న సరయు విసుక్కుంది “నేను రెడీ అవుతున్నాను కదా!”

    ఆ సమాధానం కాస్త చిరాకు అనిపించింది భాస్కర్‌కి. “అద్దం ముందు కూచుంటే నీకు సమయమే తెలియదు. ఎంతసేపు ఆ సింగారాలు?”

    ఆ మాటలకి గయ్యిమంది సరయు. “ఏం? నువ్వు గంటలకి గంటలు కాగితం కలం పుచ్చుకుని కూచుంటావుగా! అప్పుడు నాకు విసుగనిపించదా? అయినా నా అందం చూసేకదా నీకు కవితలు రాయడం వచ్చింది. నీ కవితలకి స్ఫూర్తి నేనేగా. అలాంటి అందానికి మెరుగులు దిద్దుకోడానికి అద్దం ముందు ఎంతసేపైనా కూచుంటాను. నా ఇష్టం.”

    “నీకంత గర్వం పనికి రాదు సరయూ. నువ్వొక్క దానివే లోకంలో అందగత్తెనన్నట్టుగా మాట్లాడుతున్నావు.” సహనం కోల్పోయాడు భాస్కర్. ఆ మాటలు తనని అవమానపరచడానికే అన్నాడని భావించింది సరయు. అంతే విసురుగా అద్దం ముందునించి ఇవతలికి వచ్చింది “ఇంకనేం వెళ్ళు మరో అందగత్తెని చూసుకో. నేనంటే విసుగు పుట్టినట్టుంది. ఇంకా ఇంకా కొత్త కవితలు పుట్టుకొస్తాయి ఆ అందగత్తె వెంట తిరిగితే.”

    “ఏం మాట్లాడుతున్నావు? అర్థం లేకుండా ఏదో ఒకటి వాగద్దు. విసుగులూ చిరాకులూ నీకే కాదు నాకూ వస్తాయి. నోటికేదొస్తే అది నువ్వు వాగితే దానికి తగ్గట్టుగా నేను సమాధానం చెప్పలేననుకుంటున్నావా? తల్చుకుంటే ఒక్కనిమిషం పట్టదు నాకు ఇంకో అమ్మాయి వెంటపడిపోవటానికి”

    అతని మాట పూర్తి కాకుండానే పెద్దగా అరిచింది సరయు – “పో నాకేమీ అభ్యంతరం లేదు. ఇప్పుడే పో. నీ కాళ్ళు పట్టుకుని బతిమాలతానని అనుకుంటున్నావేమో. అలాంటిదేమీ జరగదు. ఇప్పుడే ఈ క్షణంలోనే ఇల్లొదిలి అమ్మావాళ్ళదగ్గిరకి వెళ్ళిపోతాను నేను”. సరయు కళ్లు మొహం ఎర్రబడిపోయాయి. కోపాన్ని బట్టలమీదకూడా చూపిస్తూ గబగబా తన చీరలవీ సూట్‌కేస్‌లోకి విసిరింది. బిత్తరపోయి చూస్తున్నభాస్కర్‌కి నోటమాట రాలేదు. అది మరోరకంగా అర్థం చేసుకుంది సరయు. తను వెళ్ళిపోడం ఇష్టమే కాబోలు అందుకే మౌనంగా ఉన్నాడనుకుంది. వెళ్ళి ఆటో ఎక్కింది. “నువ్వే కాదు నేనూ నిన్ను బతిమాలను. నీ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడవలసిన అవసరం నాకూ లేదంతే” మనసులో అనుకుంటూ తనకేమీ పట్టనట్టే బింకంగా ఉండిపోయాడు భాస్కర్.

    ***

    రాత్రి భోజనం అయ్యాక నెమ్మదిగా అసలు విషయంలోకి దిగాడు రామ్మూర్తి “ మీ మామగారు ఫోన్ చేశారు”. ఒక్కక్షణం ఉలిక్కిపడ్డాడు భాస్కర్. “విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నావా. చాలా బాగుంది. నీకు గుర్తుందా భాస్కర్. చదువుకునే రోజుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాలప్పుడూ నువ్వనేవాడివి సాఫ్ట్‌వేర్ రంగంలోకి వెళ్ళను. ఆ రంగంలో ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకోను. భార్యభర్తలిద్దరూ బిజీగా అయిపోయి టెన్షన్లతో ఒకరిమీదొకరు అరుచుకోవడం దెబ్బలాడుకోవడం ఎడమొహం పెడమొహంగా గడపడం లేదా విడాకులదాకా కూడా వెళ్ళిపోడం జరిగిపోతూ ఉంటుంది. ఆ రంగంలోకి మాత్రం వెళ్ళనన్నావు. నీది పిచ్చి ఆలోచన అన్నాను నేను. నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించలేను అని కూడా అన్నాను. మరి నువ్వు చదివిన చదువు గానీ చేస్తున్న ఉద్యోగంకానీ దానికి సంబంధించినది కాదు కదా? పైగా కోడలసలు ఉద్యోగం చెయ్యట్లేదుగా! దీనికేమంటావు?”

    మౌనాన్నిఆశ్రయించాడు భాస్కర్.

    “నేనూ మీ అమ్మా ఎప్పుడన్నా వాదించుకున్నా మా ఇద్దరి మధ్యా ఏవైనా అభిప్రాయభేదాలొచ్చినా సద్దుకుపోయే మనస్తత్వానికి విలువ ఇచ్చామే తప్ప తెగేదాకా లాగాలని ఎప్పుడూ చూడలేదు. మాలాంటి వాళ్ళని నీలాంటి యువత చేతకాని వాళ్ళకింద తీసిపడేస్తుంది కాబోలు. ఔనా?”

    పాలిపోయిన మొహంతో తండ్రిమొహంలోకి చూశాడు…

    కొడుకు భుజమ్మీద చెయ్యి వేసి అన్నాడు రామ్మూర్తి “ఈ రోజుల్లో ఎంతమందికో ఆవేశం ఉద్రేకం తొందరపాటు నిర్ణయాలు ఉంటున్నాయి. విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతున్నారు అని నేను బాధపడుతున్నప్పుడల్లా నా మాటని నువ్వు కొట్టిపడేసేవాడివి. ఇప్పుడు నువ్వు చేసిన పనేమిటి? విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా గిల్లికజ్జాలకి చిలిపికయ్యాలకి కాపరాలు కూలగొట్టుకుంటారా. మనిషిలా ప్రవర్తించు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు, ఇదేనా మీ ప్రేమ. విసుగులు చిరాకులూ వచ్చినప్పుడు తొందరపడి మాట తూలడం ఎవరికీ మంచిది కాదురా. నేనిప్పుడు నీది తప్పా కోడలిది తప్పా అని లెక్క వెయ్యబోవట్లేదు. పట్టు విడుపు ఉంటే సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని చెప్పదల్చుకున్నాను. విడాకులు తీసుకునేటంత సమస్యా మీది? ఆవేశపడకుండా ఇద్దరూ కలిసి ఒకరికొకరు సద్దిచెప్పుకోలేని సమస్య కాదుగా! గిల్లికజ్జాలు పడి విడాకులంటారా? ఎవరన్నా వింటే నవ్విపోతారు. పొరపాటు జరిగినా పట్టు విడుపు ఉండాలి కదా. ఒకవిషయం గుర్తు పెట్టుకో. ఆవేశం అనర్థానికి దారితీస్తుంది. ఆలోచన ఏది తప్పో ఏది ఒప్పో చూపిస్తుంది. ఆమెకి గర్వం అని నువ్వనుకుంటున్నావు.అదే అభిప్రాయం నీ కోపతాపాలు చూసిన మీదట నీ మీద ఆమెకీ ఏర్పడి ఉండవచ్చుగా?”

    నిజమే అనిపించింది భాస్కర్‌కి. ఆలోచించినకొద్దీ తమ మధ్య వచ్చిన దెబ్బలాట ఆ తర్వాతనించీ పంతాలు పట్టింపులతో దూరంగా ఉండిపోవటం ఎంత హాస్యాస్పదం అనిపించింది. రేపే వెళ్ళి సరయుని తీసుకురావాలి మనసులో నిర్ణయించేసుకున్నాడు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here