పల్లె జీవనము

0
7

[dropcap]ప[/dropcap]ల్లెలో మనుష్యులు సూర్యుడితో మేల్కొంటారు. ఆ ప్రకృతి అందం కొందరికే సొంతము. సిటీలో ఉండి రాత్రి పన్నెండు వరకు కంప్యూటర్ వర్క్ చేసి అదే జీవితంగా బ్రతుకుతూ మనుష్యులు జీవన సరళి మరచి పోయి గడిపేస్తున్న యువత! వాళ్ళలో ఎందరో ప్రముఖులు కూడా.

శ్రీ చక్ర బెంగుళూర్ సాఫ్ట్‌వేర్ ఆఫీస్‍లో ఉద్యోగి. ఇంకా పెళ్లి కాలేదు. ఏవో కన్నడ సంబంధాలు వచ్చాయి. అన్ని విని నవ్వి ఊరుకునేవాడు. ఒక రోజు ఇంటి ఆయన పట్టుబట్టి వాళ్ళ మనువరాలిని చేయాలని చూసాడు.

ఈ విషయం తల్లికి చెప్పాడు.

“వద్దు రా బాబు. మన చుట్టాల పిల్లని చేద్దాము అని ఉంది. వాళ్ళ అమ్మాయి కూడా పిజి చేసింది. సంగీతం వచ్చును. కాస్త సంసార పక్షంగా ఉంటుంది. నాకు చెయ్యి కింద ఆసరాగా ఉంటుంది” అంది.

“సరే అమ్మా. మీకు ఎప్పుడు గౌరవం ఇస్తాను అని తెలుసుగా”

“అవును అనుకో తల్లిగా నా భయం నాది” అన్నది

బావగారి కొడుకు బెంగాలీ పిల్లని చేసుకు వచ్చాడు. ఒక పిల్ల పుట్టాక ఇద్దరికీ గొడవ వచ్చి వెళ్లిపోయింది. మళ్లీ రాలేదు. వాళ్ళ చుట్టాల అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వాళ్ళు ఆ పిల్లను కూడా ప్రేమగా చూస్తారు. ‘బావగారి కొడుక్కి మళ్లీ పెళ్లి కావడం లేదు’ అంటూ శ్రీ చక్ర తల్లి కామాక్షి బాధ పడింది.

“నువ్వు అలాంటి పని చెయ్యకు రా” అని చెప్పింది.

“నేను చెయ్యను కానీ నాకు అక్కడ రోజుకి ఒక సంబంధం చెపుతున్నారు”

“అవును నువ్వు జమీందారువి. బంగారం లాంటి సంబంధం నీది. మేము నీ మీద ఆధారపడి లేము. చెల్లి ఏమో డాక్టర్. అది లండన్‌లో ఉన్నది. రికామికి సంబంధాలు ఎవరికి దొరుకుతాయి?” అంది.

ఒకసారి శ్రీ పండుగకు వచ్చినప్పుడు అరుగుమీద పడింది. కాలు నెప్పి పుట్టింది. ఆ ఊళ్ళో ఎవరూ డాక్టర్ లేడు. వెంటనే టాక్సికి ఫోన్ చేసి పట్నం తీసుకెళ్ళి చూపించాడు. భర్త రావుకి ఎప్పుడు పొలం పనులతోనే సరి. పెద్దగా డాక్టర్స్ అవి తెలియవు. సమయానికి కొడుకు ఉండటం మంచిది అయ్యింది

మావగారు జగన్నాథ శాస్త్రి ఆ ఊరు పెద్ద, ప్రెసిడెంట్ కూడా చేశాడు. కొడుకుల్ని బాగా చదివించి సిటీలో స్థిరపడ్డారు. ఆఖరు వాడు డిగ్రీ చదివి తల్లినీ తండ్రినీ చూస్తూ ఆ పల్లెలో ఉన్నాడు. అతని కొడుకు మాత్రం బెంగుళూరులో ఉద్యోగము.

పెద్దల తరం వెళ్లి పోయింది ఇంకా ఈ తరంలో వినేదేవ్వరు? అందరూ పెద్దలే. ఎవరి మాటకు గౌరవం లేదు.

కామాక్షి బాధ చూసి శ్రీ చక్ర పొలాలు అమర్చి తల్లినీ తండ్రినీ బెంగుళూర్ తీసుకెళ్ళాడు. అక్కడ పెద్ద ఫ్లాట్ తీసుకుని ఉన్నాడు.

తల్లి తండ్రి ఉన్నారు కనుక సంబంధాలు వచ్చిన వాళ్ళు మాట్లాడేవారు. అవన్నీ వద్దు అంటూ బంధువుల పిల్లను కుదిర్చి పెళ్లి ఘనంగా చేశారు.

సరే కోడల్ని దగ్గర పెట్టుకుని బాగా చూశారు. ఏడాది తిరిగేటప్పటికి ఒక బిడ్డ తల్లి అయ్యింది. “ఇంక మేము పల్లెకు వెడతాము. ఎంత కాలం ఉంటాము?” అన్నారు అమ్మానాన్న.

దీనికి కారణం ఒకటి ఉన్నది. వాళ్ళకి ఆ వాతావరణం కుదరలేదు. బాగా చలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో రకం అనారోగ్యం. మళ్లీ వెళ్లిపోదాం అనుకున్నారు.

శ్రీ చక్ర భార్య పిల్లాడు కూడా కొంచెం ఆ వాతావరణంలో ఉండటం కష్టం అన్నట్లు ఉన్నది.

“సరే ఇప్పుడు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక మీరు కూడా వచ్చేస్తే మంచిది” అన్నారు పెద్దవాళ్లు.

సరే అని శ్రీ చక్ర ఆలోచించి మళ్లీ పల్లెకు వెళ్లాలని అనుకున్నాడు. అలా ఆలోచించి పల్లెకు తిరిగి వచ్చారు.

దరిదాపు ఆరు ఏళ్లు బెంగుళూర్‌లో ఉన్నారు. సరే అని పల్లె ఇల్లు రీమోడలింగ్ చేయించి కరెంట్ బాగు చేసి వైఫై అవి పెట్టించారు.

ఇక్కడ వంట మనిషి, పనిమనిషి అందరినీ ఏర్పాటు చేసుకున్నారు. మళ్లీ తిరిగి గత వైభవం తెచ్చారని ఉరి వాళ్ళు అన్నారు. తాత పేరు మనమడు నిలబెడతాడు అన్నారు. మనిషి జీవితం ప్రకృతితో అంతా సంబంధం. వాతావరణాన్ని బట్టి జీవితం ఉంటుంది. చిన్న వయస్సులో ఏదైనా తట్టుకుంటారు. వయసు పెరిగేక అది కుదరదు. వాతావరణం సిటీకి పల్లెకు తేడా ఉంటుంది. పలకరింపులు, ఆప్యాయతలు అన్ని వేరుగా ఉంటాయి.

***

బెంగుళూరు కొత్త ప్రదేశం, ఎరుగని మనుష్యులు  ఏమి మాట్లాడాలో అని సంకోచం ఇవన్నీ కొత్త జీవితంలో ఉంటాయి.

కొడుకువచ్చి కార్లో తీసుకుని వెళ్ళనిదే బయటి ప్రపంచం లేదు. వాడు ఆఫీస్ నుంచి వచ్చాకా పనిగట్టుకుని బంధువులు స్నేహితులు ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఎంత సేపు టీవీ చూస్తాము? ఎంతో ప్రశాంతత. చక్కని వాతావరణం. పెద్ద అపార్ట్‌మెంట్మ్ త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు. ఒకటి అందులో గెస్ట్ రూమ్. పాలు పోసి ఎత్తేలా ఆ పాలరాతి నేల.

ఎంతో బాగుంటుంది అనుకుంటుంది, కానీ ఎన్ని సుఖాలు ఉన్నా మాట్లాడే మనుష్యులు కోసం వెంపర్లాడటం తప్పదు. ఇలాంటి సమస్యలు ఇప్పుడు చాలా కుటుంబాలలో ఉన్నాయి

పెద్ద ఇళ్ళల్లో ఘనంగా పెరిగి సుఖపడి పిల్లల కోసం కొందరు చదువుల కోసం మరి కొందరు సొంత ఉరు వదిలి సిటీకి వెడుతున్న పరిస్థితిలో చాలా సమస్యలు వస్తున్నాయి. నీళ్ళు వాళ్ళు వేసిన సమయానికి పట్టుకోవాలి. కొన్న డబ్బాల నీళ్ళు అందరికీ పడవు. కాచి తాగే అలవాటు ఉన్నవాళ్లు ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు. అక్వా గార్డు వాటర్ కూడా కొందరికి కుదరవు. కానీ వాళ్ళు పిల్లల కోసం కష్టపడుతున్నారు.

పిల్లలను కనడం ఒక ఎత్తు అయితే పెంచి పెద్ద చేసి ఉద్యోగస్థులు అయ్యాక కూడా ఒక ఇంటివాడు అయ్యేవరకు సమస్యే కదా. మగ అయినా, ఆడపిల్ల అయినా తల్లి తండ్రుల బాధ్యతే కదా. అందుకే ఎన్ని సమస్యలు ఉన్నా మహారాజుల మాదిరి సౌకర్యాలు ఉన్నా సరే, కన్న పిల్లలతో జీవించాలని వారు కోసం జీవితాలు గడుపుతున్నారు. పిల్లలు ఒకచోట, తల్లి తండ్రులు మరోచోట – చాలామంది ఉంటున్నారు. కానీ కామాక్షి మంచి కోడలు కోసం వెళ్లి కొడుకు దగ్గర వాడి పెళ్లి అయ్యే వరకు ఉండాలి అన్న దృఢ సంకల్పం వల్ల బెంగుళూర్ వెళ్లారు.

సిటీలో స్వర్గంలా అపార్ట్‌మెంట్లు ఉంటాయి కానీ అందులో ఎంతో జాగ్రత్తగా మెలగాలి. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి, ఇది కొడుకు చెప్పే మాటలు.

ఎక్కడ దుమ్ము ఉండదు. పాలు ఒలికితే ఎత్తేలా ఉంటాయి. అదో రకంగా సుఖ భోగ భాగ్యాలతో కూడిన జీవితము. అయినా సరే కామాక్షి, రావు గారికి కూడా ఎంతో సమస్యగా ఉన్నది  పంటలు పాడి అన్ని చూసుకుంటూ ఉండేవాడు ఇప్పుడు అంతా ఖాళీ సమయమే.  ఏమి కష్టం లేకపోయినా తిని కూర్చోడం కూడా కష్టమే. కొడుకు కార్లో తిప్పుతున్నాడు. అయినా సరే పల్లె ఇంటికి మనసు వెడుతుంది. రావు మనసు పొలం వేపు మళ్ళి, పాలేరికి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాడు.

అందరి క్షేమ సమాచారం చెపుతాడు. ఇల్లు నెలకి ఒక సారి దులిపి కడిగి పెడతారు. ఏదో చూసే మనుషులు ఉన్నారు కనుక ధీమాగా ఉన్నారు.

కామాక్షికి సమయమంతా కూతురు ఆలోచనకే సరిపోతుంది. వంట, పూజ, భోజనాలు. కాస్సేపు టీవీ. పడక వీటితో ఇంటి పనితో సరి పోతుంది. ఆడవాళ్ళు సరి పెట్టుకుంటారు కానీ మగవాళ్ళకి బయట ప్రపంచం లేకపోతే కుదరదు.

కామాక్షి అక్క తెల్లగా ఉంటుంది. బావ కూడా తెల్లగా ఉంటాడు. పిల్లలు తెల్లగా నాజూకుగా అందంగా ఉంటారు. ఇద్దరు కొడుకులు కూతురు కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు. నెల తిరిగేటప్పటికి పది లక్షలు వచ్చి పడతాయి. ఎలా కన్ను వేసిందో రెండవ వాడి ఆఫీస్‌లో సహా ఉద్యోగిని కావాలని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నది. అమె తల్లి తండ్రులకి ఇష్టం లేదు. ఇటు వాళ్ళు సరిపెట్టుకున్నారు, అవతలి వాళ్ళు ఒప్పుకోలేదు.

ఆస్తి అందం అన్ని ఉన్నాయి అందుకు ఆమె ఇష్టపడింది. కానీ ఆమె వేరే రాష్ట్రం పిల్ల. పడికట్లూ తేడా. ఎందుకు నువ్వు అలా చేసుకున్నావు అంటూ నిగ్గదీశారు. దానితో “పెద్ద గొడవ చెయ్యకండి మీ పిల్లకి మీరు పెళ్లి చేసుకోండి. పిల్లలు తల్లి దగ్గర ఉండాలి కనుక అమ్మమ్మ పెంచితే సరి. మేము వాడికి కావాల్సిన హంగులు ఏర్పాటు చేస్తాము” అని కామాక్షి అక్క వాళ్ళు బ్రతిమాలి ఆ పిల్లను పంపేశారు.

పిల్లను ఎవరూ ఇవ్వలేదు. అసలు ప్రేమిచి పెళ్లి చేసుకున్న వ్యక్తితో ఎలా గొడవ పడ్డారు? ఇంక పిల్లని ఎవరు ఇస్తారు?

కామాక్షికి ఆ భయాలు ఉన్నాయి అందుకే ఎంత కష్టం అయినా పిల్లాడు కోసం పెళ్లి వరకు బెంగుళూర్ వెళ్లారు.

***

పిల్లల కోసం జీవితం అన్నట్లు బ్రతికితే కానీ వారి జీవితాలు బాగుండవు. చదువు సంధ్య అన్ని పరిశీలిస్తూ ఉండాలి. వాళ్ళ నీడల వెన్నంటి ఉంటే కానీ వారు ఎదగలేరు. అందుకే పిల్లల కోసం ఎందరో ఎన్నో రకాల జీవిత అవస్థలు ఉన్నా సరే వెళ్లి కుటుంబాలు అక్కడే ఉండి గడుపుతున్నారు. మరి కొందరు సరి పెట్టుకుని, కొందరు ఉండలేక సతమతం అవుతన్నారు. ఆలా ఉంటే కానీ పిల్లల భవిష్యత్ బాగుండేది. మనిషికి మంచి అవకాశం ఒక సారే వస్తుంది దాన్ని వినియోగించుకోవాలి.

“సిటీలో జీవితం చాలా బాగుంది కదా, ఎందుకు ఇక్కడికి మళ్లీ వచ్చారు?” అంటూ బంధువులు ఎకసెక్కం చేశారు. కానీ ఎవరి మాట పట్టించుకోలేదు. “నా పిల్లలు నన్ను అర్థం చేసుకున్నారు అందుకే వాళ్ళు మళ్లీ వెనక్కి వచ్చారు” అంది. అది కొందరు బంధువులకు స్నేహితులకు కొంచెం కన్నెర్రగా ఉన్నది.

సిటీలో వంట మనిషికి పది వేలు, పనిమనిషి రెండు లేక మూడువేల ఇవ్వాలి. మళ్లీ దానికి శీతాకాలం వేడి నీళ్ళు గీజర్ వేసి నీళ్ళు పట్టి ఉంచాలి. అది కూడా ఇష్టం అయితే వస్తుంది, లేక పోతే లేదు.

వృద్దులకి సిటీలో ఇల్లు కూడా ఇవ్వరు, ఎందుకంటే సరిగా దులిపి కడిగి శుభ్రం చెయ్యరు. పెద్ద వాళ్ళకి ఓపిక తక్కువ. ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రము ఉంటుంది.

అందులో మొదటి నుంచీ పల్లె వాతావరణంలో పెరిగి ఇంత వయసు వచ్చాక సిటీ జీవితము కష్టం. కాని కొడుకు జీవితం బాగుండాలి అని వెళ్ళింది. ఇది కామాక్షి పట్టుదలే కూడా.

కామాక్షి కూతురు చిన్నప్పటి నుంచి నుంచి అదో సాహసం టైప్‌గా ఉండేది. పిల్లాడు విన్నట్లు పిల్ల వినలేదు. దానికి అంతా నాన్నమ్మ పోలిక వచ్చింది. “మన ఇంట్లో ఎవరూ విదేశాలకు వెళ్ళలేదు, చదువ లేదు. కనుకనే నేను వెళ్లి చదువుతా” అని పట్టుదలగా మార్కులు తెచ్చుకుని చదివింది. కానీ పెళ్లి విషయంలో తల్లి మాట విన్నది. కని పెంచిన తల్లి తండ్రి తప్ప ఇంకెవరు మన మేలు కోరుతారు అనే ఆలోచనతో చదువు పూర్తి చేసి వచ్చింది. డబ్బు ఉన్నవాళ్లు విదేశాలకు పరుగు పెట్టీ ఇక్కడి ఆస్తులు అమ్ముకున్న ఎందరినో చూసింది. అలా ఎందుకు? తనకు పెద్దలు ఇచ్చిన అస్తి అంతస్తు ఉన్నాయి. అవి నిలబెట్టుకోవాలి. మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకే తాతగారికి ఉన్న పేరుని నిలబెట్టుకొని తగిన మనుమలు అనిపించుకోవాలి. విద్య మనిషిలో సంస్కారం పెంచాలి. కానీ అన్ని వదిలి గర్వపడి విదేశాలకు వెళ్లి సాధించేవి ఏమి ఉన్నాయి. ఆ తరువాత వెనక్కి చూస్తూ కుటుంబంలో నా అన్న వాళ్ళు మిగలరు. ఇలా ఆలోచించి కామాక్షి పిల్లలు ఇద్దరినీ మొదటి నుంచి పెంచింది.

అందుకే విద్యతో పాటు వినయం, జీవితం పట్ల ఆలోచన వచ్చింది. మిగిలిన అన్నదన్నుల ఆస్తులు కూడా రావు కొన్నాడు అనేకంటే పిల్లలు కామాక్షి ఏకమయ్యి వీధి వీధి అంతా కొని మంచితనం పెంచుకున్నారు. మళ్లీ పల్లెలో అన్ని ఏర్పాటు చేసుకుని హాయిగా ఉన్నారు. వంట మనిషి, పని మనిషి, పాలేరు, రైతుల సందడి వచ్చింది.

***

కామాక్షి ఒక్కసారి గతం లోకి వెళ్ళింది. తనకి చదువు తక్కువ. ఇంటి పని వంట పని బాగా నేర్చుకున్నది. ఎన్నో సంబంధాలు చూశారు కానీ, అందరూ ‘డిగ్రీ లేని పిల్ల, వద్దు’ అన్నారు. ఈ రోజుల్లో కాన్వెంట్‌కి పిల్లల్ని పంపాలి అంటే తల్లి విద్యావంతురాలు అయిఉండాలి. మదర్ మస్ట్ బి ఎడ్యుకేటెడ్ బట్ షి డోంట్ డు ఏనీ జాబ్ అంటున్నారు.

పై కోడళ్ళు ముగ్గురు పిజిలు చేశారు. కొందరు సిటీ లోనూ మరి కొందరు విదేశీ ఉద్యోగాలులో ఉన్నారు. కోడళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఒక్క కామాక్షి మాత్రం చదువు తక్కువ. ఇంటిపనులు చెయ్యడం ఎంతో ఇష్టం.

ఆఖరి కొడుకును దగ్గర పెట్టుకుని మావగారు వ్యవసాయం చూసేవారు.

పల్లెలో ఉన్నాసరే పిల్లలని ప్రక్క ఊరు పంపి ఇంజినీర్, డాక్టర్ చదివించారు. ఎవరి జీవితం వారిది. ఆస్తి ఉంది కనుక లోటూ లేదు. ఉద్యోగం చేసే అవసరం లేదు అని పెళ్లికి ముందే చెప్పి చేసుకున్నారు.

కామాక్షి అత్తగారు వెనకాల ఇమిడి పోయింది. ఒకటి అత్తగారు కూడా ప్రేమగా చూసేది. వంటకు మనిషి ఉన్నది. పాలేరు వచ్చి దొడ్లో పని చేస్తాడు. పనిమనిషి వచ్చి ఇంట్లో తడి బట్ట పెడుతుంది.

ఇంత సుఖపడ్డ కామాక్షి బెంగుళూర్‍లో ఉన్నప్పుడు డిష్ వాషర్‌లో గిన్నెలు తోముకుని, వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతుక్కునేది. ‘జాగ్రత్తగా ఉండండి’ అని కొడుకు చెప్పి వెళ్ళేవాడు. వాడు వచ్చే వరకు మొగుడు పెళ్ళాం టీవీ చూస్తూ ఇంటి పనులు చేస్తూ కాలం గడిపారు.

ఏమిటో గ్రహస్థితి బాగాలేదు అందుకే అక్కడ అంట్ల పని, బట్టల పని చెయ్యక తప్పలేదు.

***

సంక్రాంతి వెళ్ళింది. మాఘ మాసం వచ్చింది. సూర్యుడి పూజ. నాలుగు వారాలు అవు పాలు పొంగించి నైవేద్యం పెట్టాలి. ఇక్కడ పిడకలు ఉంటాయి. బెంగుళూర్‌లో గాస్ పై పొంగించింది కానీ తృప్తి లేదు.

“ఒరే పాలేరు రంగడిని పిడకల దండలు తెమ్మని చెప్పు” అని కొడుక్కి చెప్పింది. ‘పూజలు అన్ని కూడా ఏమిటి అన్నట్లు జరిగాయి. ఇంక ఇప్పుడు హాయిగా లీటర్ పాలు పరమాన్నం చెయ్యవచ్చు. చక్కగా అందరికీ పంచవచ్చును’ అని కామాక్షి సంతోష పడింది.

‘ఎక్కడ ఉన్నా కాఫీ సమయానికి కాఫీ; టిఫిన్ సమయానికి టిఫిన్; భోజనానికీ భోజనం కావాలి. మన దేశం ఊరు మనవని అవి మానవు కదా. ప్రకృతి సహజ లక్షణాలు అన్నీ ఎప్పటి లాగానే. కానీ డబ్బు విలువ మారుతుంది. అందుకే ఆ డబ్బు కోసం ఈ పరుగులు పెడుతున్నారు.’ అనుకున్నది కామాక్షి.

ఉన్నదానితో తృప్తి పడి జీవించాలి. అక్క పిల్లలు, చెల్లి పిల్లలు విదేశాలకు వెళ్లారు. ఆఖరుకు తన కూతురు కూడా చదువుకి వెళ్లింది కానీ అక్కడే ఉండదు, ఇండియా రావలసిందే ఎక్కడా స్థిరపడదు కూడా. వాళ్ళ తాతగారు కట్టించిన ఇళ్ళు చాలా ఉన్నాయి. అందులో ఒక ఇంటిని హాస్పిటల్ గా మార్చి కూతురుతో ప్రాక్టీస్ పెట్టించాలి. ఇది కామాక్షి కోరిక.

అందుకే బంధువుల్లో డాక్టర్ పిల్లవాడిని వెతికి పెళ్లి చేయాలన్నది వాళ్ళ తపన. ఇంకేమీ, మళ్లీ వాళ్ళ సొంత ఊరు వర్క్ ఫ్రమ్ హోమ్ ధర్మమా అని వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ వెనక్కి చూసి పొలాలు ఇళ్ళు అందరికీ పూర్వీకుల అస్తి పై ఆసక్తి వచ్చింది.

ఈ వేసవిలో కూతురు పెళ్లి చెయ్యాలని కామాక్షి నిర్ణయం చేసింది. అలాగే పెళ్లి కొడుకుని వెతికింది. కూతురు కావ్య కూడా తల్లి మాట విన్నది

“మనం మన ఊరిలో తాత గారి పేరు నిలబెట్టాలి. హాస్పటల్ లేక కదా మనం వేరే ఊరు వెళ్ళేవారం… ఆ అవసరం లేకుండా నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ పెట్టు” అని కూతుర్ని అడిగింది. సరేనని కావ్య ఒప్పుకుంది.

కన్న తల్లి తండ్రిని వదిలి దేశాలు వద్దు అన్నారు. అలాంటి మనస్తత్వం ఉన్న ఒక సంబంధం వెతికి పట్టుకొని పెళ్లి కుదిర్చారు. శుభస్య శీఘ్రం అన్నట్లు పెళ్లి కుదిరింది.

‘హాయిగా మామగారు అన్ని అమర్చి అల్లుడికి ఇస్తున్నారు, అదృష్ట వంతుడు’ అన్నారు. ముఖ్యంగా ఊరు జనం అదృష్టవంతులు అనుకున్నారు.

‘పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు’ శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన శ్రావ్యంగా సన్నాయిలో పలుకుతుండగా డాక్టర్ కావ్య మెడలో డాక్టర్ శ్రీనివాస్ మాంగల్యధారణ చేశాడు.

డాక్టర్ కావ్య శ్రీనివాస్‌గా అందరి దీవెనలు పొందారు.

శాంతి శుభము

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here