పల్లెకు పోదాం

0
9

[dropcap]ఉ[/dropcap]దయం ఎనిమిది గంటలయినట్లుగా ఎదురుగా ఉన్న గోడ గడియారం సూచిస్తోంది. అప్పుడే మెలుకువ వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాను. ఇంకా నిద్ర పోవాలనిపిస్తుంది. శని, ఆదివారాలే కదా! ఇలా ప్రశాంతంగా నిద్రపోయేది. ఉరుకుల, పరుగుల జీవితం మరీ యాంత్రికంగా మారిపోయింది. ఈ మహా నగరంలో మనిషి సంఘజీవి అనే విషయమే మర్చిపోయి ‘రోబో’ లాగా బ్రతికేస్తున్నాడనిపిస్తుంది. మానవ సంబంధాలన్నీ చుట్టు సర్కిల్ గీసుకుని అందులో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నట్లు తోస్తుంది నాకు. తెల్లవారగానే పిల్లలకు భోజనం రెడీ చెయ్యడం, స్కూలుకు పంపడం, ఆఫీసుకు పరిగెత్తడం, ఇదే రోజు దినచర్య. అపార్టమెంటు ఐదో అంతస్తులో సూర్యోదయ, సూర్యస్తమయాలు కూడా తెలియడం లేదు. అసలు ఇరుగు, పొరుగు ఎవరున్నారో, ఏం జరుగుతోందో? తెలీదు. చాలా చిత్రంగా అనిపించింది నాకు. ఇంతలో ప్రక్కనే ఉన్న ఫోన్ మ్రోగింది. ‘ఎవరబ్బాఈ టైములో’ అనుకుంటూ ఫోన్ తీశాను. “అమ్మా రమ్యా నేనమ్మా, మీ బాబాయిని. ఎలా ఉన్నారు అంతా క్షేమంగా ఉన్నారు కదా!” అన్నాడు. ఏదో ఆలోచనలో ఉన్న నాకు బాబాయి వెంటనే గుర్తు రాలేదు. “మీరా బాబాయి, మేమంతా బావున్నాము. మీరెలా ఉన్నారు? ఏమిటి ఈ టైములో ఇలా ఫోన్” అన్నాను కంగారుగా. బాబాయితో మాట్లాడి దాదాపు సంవత్సరం అవుతోంది. అసలు బంధువులు అనే వాళ్ళెవరు నాకు గుర్తు లేదు. అవసరానికి ఏవో కొత్త బంధాలు కలుపుకోవడం, వాటికోసం లేని భేషజాలు నటించడం, వీటితో బంధుత్వంలో ఆత్మీయత సుదూరమైంది. అందుకే ఈ తరం పిల్లలకు అత్త, మామయ్య, వదిన, బాబాయి, పిన్ని, పెద్దమ్మలాంటి వరుసలేవీ తెలియవు. నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ, “రమ్యా, ఈ సారి వేసవి సెలవులకు మన వాళ్ళంతా తమ కుంటుంబాలతో ఇక్కడికి వస్తున్నారు. మనందరం కలిసి చాలా సంవత్సరాలైంది. అందుకే మీరు కూడా పిల్లలతో మన ఊరు వస్తే మేము ఉభయులము చాలా సంతోషిస్తాము. మీ పిన్ని కూడా అందరినీ చూడాలని చాలా కోరుకుంటోంది” అన్నాడు బాబాయి.

బాబాయి ఆహ్వానంతో నాలో సంతోషం ఉప్పొంగిపోయింది. “తప్పకుండా వస్తాము బాబాయి” అన్నాను ఉబ్బితబ్బిబ్బవుతూ. “సరేనమ్మా” అంటూ బాబాయి ఫోను పెట్టేశాడు. ఆ పల్లెటూరు గుర్తురాగానే నా బాల్యం తాలూకు జ్ఞాపకాలన్నీ నన్ను చుట్టుముట్టాయి. మనసు లోపలి పొరల్లో తిష్ఠవేసుకున్న తియ్యని అనుభూతులు నన్ను గతంలోకి తీసుకెళ్ళాయి. ఏదన్నా చిన్న కార్యక్రమం జరిగిందంటే నాలుగు రాజులు ముందు నుండే రాకపోకలు మొదలవుతాయి. ఏం వదినా బావున్నావా? ఏం బాబాయి ఎలా ఉన్నావు? పిల్లలంతా కులాసానా? ఇలాంటి పలకరింపులతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. అక్కడ కర్రీ సెంటర్లు ఉండవు. నలుగురు కలిసి రకరకాల రుచుల మేళవింపులతో వంటలు చేస్తారు.

పల్లెల్లో పిల్లలంతా ఒక చోట చేరి గోళీలాట, బిళ్ళంగోడి, అష్టాచమ్మా, కబడ్డీ, ఒప్పులకుప్ప, తొక్కుడ బిళ్ళ, లాంటి ఆటలెన్నీ ఆడేవాళ్ళు. ఆ టైములో వాళ్ళల్లో వర్ణించనలవి కాని ఉత్సాహం, ఆనందం ఉరకలు వేసేది. మనం తినే బియ్యం ఎలా తయారవుతున్నాయో ఇప్పటి పిలల్లకు తెలీదు. వరికంకులు, జొన్న కంకులు పైరగాలికి వయ్యారంగా కదలడం, భూమిలోపల గుత్తులుగా పెరుగుతున్న వేరు శనక్కాయల గురించి పుస్తకాల్లో చదవడమే గాని, వాళ్ళెప్పుడూ చూడలేదు. మట్టిగోడలతో కట్టిన మిద్దె ఇళ్ళు, వాటిమీద వెలుతురు కోసం పెట్టిన గవాక్షాలు, గిలకల బావులు, వీధి వాకిలికి రెండు వైపులా అరుగులు ఇవన్నీ పల్లెటూరికే సొంతం. వీధి అరుగుల మీద బుర్ర మీసాలు తిప్పుతూ తాతయ్య, ఆయన చుట్టూ పిల్లలంతా చేరతారు అచ్చు వానరసైన్యంలా. ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పుకుంటూ, ఆయన చెప్పే కథలకు ఊ కొడుతూ, నక్షత్రాలను లెక్కపెడుతూ వెన్నెలమ్మ హాయిని అనుభవిస్తూ పిల్లలంతా నిద్రలోకి జారుకుంటారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కొనలేని ఆనందం, పిల్లలకు, పల్లెలకు మాత్రమే సొంతం. పలక, బలపం చేతిలో పట్టుకుని, కాళ్ళకు చెప్పులైనా లేకుండా, సరిగ్గా గుండీలైనా లేని, లాగు, చొక్కాతో బడికి వెళ్ళడం ‘అ’ అంటే అమ్మ. ‘ఆ’ అంటే ఆవు అంటూ పలకమీద దిద్దుకోవడం ఎంత స్వేచ్ఛగా ఉండేదో, ఆ రోజుల్లో తప్పు చేస్తే మాష్టారు వేసే గోడకుర్చీకి, తొడపాశానికి భయపడి స్కూలుకు వెళ్ళకుండా తప్పంచుకోవడం, టీకాలు వేసే డాక్టర్లు వచ్చారని స్కూలు నుండి పారిపోవడం ఇది ఆ రోజుల్లో పిల్లల వైనం. బఠానీలు, ఉప్పు శనగలు, బొరుగు ముద్దలు, నూగుజీడీలు, పుల్లైసు లాంటివి అమ్మ ఇచ్చిన పావలాతో కొనుక్కోవడం. వాటిని స్నేహితులతో పంచుకుని తినెయ్యడం ఒక తియ్యటి జ్ఞాపకం. గాలిపోయిన సైకిల్ చక్రాన్ని నెట్టుకుంటు మట్టి రోడ్డు మీద పరిగెత్తడం గొప్ప సరదా ఆట. గంగిరెద్దులు, జంగందొరలు, పిట్టలదొర, తోలుబొమ్మలాటలు, హరిదాసులు, వీధీ నాటకాలు పిల్లలకు చాలా ఆశ్చర్యాన్ని సరదాను అందించేవి. సాయంకాలం అయిందంటే పిల్లలంతా రాములవారి గుళ్ళో చేరతారు. గుడి వెనక ఉన్న పున్నాగ చెట్టు పూలతో పీకలు చేసి గోలగోలగా ఊదుతుంటారు. పుజారిగారు కేకలేసేదాకా గుడి గంటలు కొట్టి, గుడి అరుగు మీద దొంగ, పోలీసు ఆట ఆడి అలసిపోయి ఇల్లు చేరతారు. అమ్మ పెట్టే గోరుముద్దలు తిని నిద్రలోకి జారుతారు. ఆ రోజుల్లో పిల్లలకు చదువు బరువు, పుస్తకాల భారం లేదు. ఒక్క ప్రక్క ఎత్తుగా పేర్చిన గడ్డివాములు, మరో ప్రక్క ఆవుల మంద, వాటి చుట్టూ తిరిగే లేగదూడలు, చిక్కటి పాలు, తియ్యటి జున్ను పల్లెలకే సొంతం. మెడలో గజ్జలు, వీపున మూపురంతో వయ్యారంగా నడిచే ఎడ్లు, యజమాని ఇచ్చే సంకేతాలతో పంటను ఇంటికి చేర్చడం పిల్లలు చూసి తీరాల్సిందే. వర్షం పడ్డప్పుడు వచ్చే మట్టివాసన మనిషిలోని ఆస్వాదించే గుణాన్ని తట్టి లేపుతంది. రేగుపండ్లు, కలేపండ్లు, జానపండ్లు, ఈతపండ్లు పిల్లలు తినడానికి చాలా సరదాపడతారు. అట్ల తద్దె, ఉండ్రాళ్ళ తద్దె వచ్చాయంటే తెల్లవారుఝామున పెరుగన్నం తిని, ఉయ్యాల ఊగడం, సంప్రదాయం, గోరింటాకుతో చేతులు ఎర్రగా పండితే మంచి భర్త, లభిస్తాడనే నమ్మకం ఉండేది. ఇలా కల్మషం లేని మనుషులు, కాలుష్యం లేని వాతావరణం పల్లెలకే సొంతం. జీవితంలోని అన్ని దశలలోకి అపురూపమైంది బాల్యం అంటారు. కానీ ఈ తరం పిల్లలకు బాల్యం ఎక్కడుంది? మొబైల్ సాన్నిహిత్యం పెరిగి స్నేహితుల సాన్నిహిత్యం తగ్గింది.

పిల్లలకు ఆడుకునే రోబోలు అందుబాటులోకి వచ్చేశాయి. అంతరిక్షంలో తిరగాడుతున్నట్లు, సూర్యచంద్రులతో ఆడుతున్నట్లు పిల్లలకు అనుభూతిని కలిగిస్తున్నాయి. వయసుకు మించిన విజ్ఞానాన్ని నేర్పతున్నాయి. కానీ పల్లెల్లోని స్వచ్ఛతను కూడా ఒకసారి పిల్లలకు చూపిస్తే, వాళ్ళు కొత్త అనుభూతిని పొదుతారు. మేము చిన్నప్పుడు ఇలా గడిపేవాళ్ళం, ఇక్కడ ఆడుకునే వాళ్ళం అని పెద్దలు చెప్పడం, పిల్లలకు సరదాగా ఉంటుంది. ఒక్కసారన్నా వాళ్ళకు గ్రామీణ వాతావరణం రుచి చూపించాలి. ఇంటి ఎదురుగా ఉన్న వేపచెట్టు మీది కోకిల కుహు, కుహు అని కూయడం పిల్లలు తప్పకుండా వినాలి అనుకున్నాను. ఎలాగైనా శ్రీవారిని, పిల్లలను ఒప్పించి పల్లెటూరు తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here