పల్లెలో ఓ రోజు

2
6

[dropcap]’అ[/dropcap]బ్బ! ఏం వానో! బురదలో కాలు దిగబడిపోతోంది. చెఱువుకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. ఎవరైనా కనబడితే బాగుండు. ఓ పది బిందెలు తెచ్చి తొట్టి నింపుతాడేమో!’ స్వగతాన్ని కొంచెం పైకే అనుకుంటూ వీధి అరుగు మీద నిలబడి చూస్తోంది వైదేహమ్మ. ఆ చిన్నపల్లెలో ఊరి చివర చెఱువు కెదురుగా ఉంది వీళ్ళ ఇల్లు. చెఱువు ఒడ్డున మఱ్ఱిచెట్టు; చెఱువు నిండా తామరలు, చెఱువుకు అటు పక్కన గుడి; దాని పక్కన రావిచెట్టు. చెఱువుకు ఇటు పక్కన గట్టు, ఆ తరువాత పొలాలు. వీరింటి తరువాత మరో మూడిళ్ళున్నాయంతే. చివరి పాకలో కొన్నాళ్ళు, ఇవతలున్న పెంకుటింట్లో కొన్నాళ్ళూ బడి పెట్టారు.

ఊడ్పుల కోసమని పొలాలకి వెళుతున్నారు కూలీలంతా. ఆడవాళ్ళు తలకింత నూనె పట్టించుకొని, నున్నగా దువ్వుకుని, తలలో మందారపువ్వు తురుముకుని వెళుతున్నారు. మల్లెచెండయినా, మందార పువ్వయినా పాయతీసి తలలో పెట్టుకోవటమేగాని చెంప పిన్నుకు గుచ్చి భుజాల వరకు వేలాడేలా పెట్టుకోవడం అప్పట్లో సాధారణంగా కనిపించేది కాదు. “బాగున్నారా! మామ్మగారూ!” పలకరించింది అరుంధతి. “బాగానే ఉన్నా అరుంధతీ! మంచి చీర కట్టావు, బాగుంది రంగు” మెచ్చుకోలుగా అంది వైదేహమ్మ. “అవును మామ్మగారూ! ఈ బచ్చలిపండు రంగంటే మీ పాలేరుకు ఇట్టం. ఆయన తెచ్చిందే. చాన్నాళ్ళయినా రంగుపోలేదు” మురిపెంగా అంది అరుంధతి (నిజానికి అరుంధతి భర్త వీళ్ళ పాలేరు కాదు. భర్త గురించి అట్లా చెప్పటం పరిపాటి). చింతచిగురు రంగు చీర కట్టుకున్న రత్తమ్మ వెనకాలే వచ్చింది. “ఏం వదినా! ఆలస్యమైనట్టుంది” పలకరించింది అరుంధతి. “అవునే! ఇంటికాడ పని కాలేదు. మీ అన్నకి పానం బాగోట్లేదుగా! ఆయనకి మందులిచ్చి వచ్చేతలికి ఈ యాళయింది” బదులిచ్చింది రత్తమ్మ. “అట్టాగా! డాట్టరు కాడికెళ్ళాడా? బిళ్ళలు తెచ్చి ఏసుకుంటున్నాడా?” ఆరాతీసింది అరుంధతి. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ సాగిపోయారు.

పొలానికి వెళుతున్న వీరయ్య ఆగి చెఱువు మెట్ల మీద నిలిచిన నీళ్ళలో కాళ్ళు కడుక్కుని సూర్యుని వైపు తిరిగి నమస్కారం చేస్తున్నాడు. “అదేమిటి వీరయ్యా ఇవాళింకా సూర్యనారాయణమూర్తి కనుపించలేదుగా? ఎవరికి దణ్ణం పెడుతున్నావు?” నవ్వుతూ అడిగింది వైదేహమ్మ. “అదేమిటి వైదేమ్మగారూ! కనుపించనంత మాత్రాన సూర్యుడు లేకుండా పోతాడంటండీ?” బదులిచ్చాడు వీరయ్య. ఉలిక్కిపడింది వైదేహమ్మ. నిజమే వీరయ్య ఎంత చక్కగా చెప్పాడు! అనుకుంది మనసులో. వీరయ్యకు కాస్త భక్తి ఎక్కువ. కమ్మని కంఠంతో తత్వాలవీ పాడుతుంటాడు. ఆ తత్వాలలోని తత్త్వాన్ని వంట బట్టించుకుంటున్నాడు.

వైదేహమ్మ, సత్యవతమ్మ అక్కచెల్లెళ్లు; వితంతువులు. అయినవాళ్ళంతా అక్కడక్కడా ఉన్నారు. చెఱువుకు ఎదురుగా ఉన్న పెంకుటింట్లో వీళ్ళిద్దరే ఉంటారు. నాలుగిళ్ళ అవతల మరదలు, పిల్లలు ఉంటారు. అంతలో భాస్కరం నీళ్ళ కోసం రేవుకొచ్చింది. కొంచెం ఆయాసపడుతోంది. “ఏం భాస్కరం ఒంట్లో బాగుండలేదా?” పలకరించింది వైదేహమ్మ. “అవును వైదేమ్మ గారూ! అసలే ఆయాసం. దీనికి తోడు నిన్నటేల నుండి తలపోటు, అందుకే సొంటి పట్టేసుకున్నాను” బదులిచ్చింది భాస్కరం. అలాగే నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది. బాగా సన్నకారు రైతు కుటుంబం కావటంతో ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ కూడా పనులు తప్పవు మరి. అదే మోతుబర్లయితే పాలేళ్ళు కావడితో నీళ్ళు తెచ్చి పోస్తారు.

అంతలో చాకలెంకడు అటువేపొచ్చాడు. “ఏరా! వెంకా!” కేకేసింది వైదేహమ్మ. “ఏంటి మామ్మగారూ!” అంటూ వచ్చాడు వెంకడు. “నాలుగు బిందెలు నీళ్ళు పోసి పోరా. ఈ బురదలో వెళ్ళలేకపోతున్నాను” అడిగింది వైదేహమ్మ. “నీ కష్టం ఉంచుకోనులే” అని ఆశ చూపింది కూడా. వెంకడికి ఉత్సాహం వచ్చింది. పొద్దుటి నుండీ బీడీ ముక్క లేక నాలుక పీక్కుపోతోంది మరి! చేతిలో పైసా లేక కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే ఇటువేపొచ్చాడు. బీడీ దొరికే మార్గం కనుపించగానే ఉత్సాహంతో గబగబా తొట్టె నింపేసాడు. అర్ధరూపాయి బిళ్ళ చేతిలో పడగానే వాడి కళ్ళు మెరిసాయి. “పెంజెండ్ర పోతున్నావా? వచ్చేటప్పుడు కాస్త ఒక కాయ (సీసాడు) కిరసనాయిలు పోయించుకురా. లాంతరు వత్తి మనూరి కోమటింట్లో లేదన్నాడు. అది కూడా తెచ్చిపెడుదూ!” అడుగుతూనే ఖాళీ సీసా, మరో రూపాయి వెంకడికిచ్చింది వైదేహమ్మ. “అట్టాగే మామ్మగారూ! ఇక్కడున్నట్టుగా రానూ!” అంటూ పరుగులాంటి నడకతో వెంకడు వెళ్ళిపోయాడు. పెంజెండ్ర కూడా పల్లెటూరే అయినా ఈ ఊళ్ళో కంటే మరికొన్ని వస్తువులు దొరుకుతాయక్కడ.

అమ్మయ్య! నీళ్ళగోల అయింది. మడి కట్టుకొని రెండు బిందెలు నూతి నీళ్ళు తెచ్చుకుంటే ఎలాగో ఇవాళ గడిచిపోతుంది అనుకుంటూ పెరట్లోకి వెళ్ళింది – కూరేం కనబడలేదు – ఏం వండాలా అని ఆలోచించుకుంటూ. ఇప్పటిలా చద్ది పెట్టెలో (ఫ్రిజ్)లో సమృద్ధిగా ఉన్న కూరగాయలతో కూరలు చేసుకుని చివరలో అన్నం వండటం ఉండేది కాదు ఆనాటి పల్లెటూళ్ళలో. సామాన్య కుటుంబీకులందరూ ముందు పెద్ద గిన్నెతో అన్నం వండి కూర గురించి ఆలోచించేవారు. ముఖ్యంగా నలుగురున్న పెద్ద కుటుంబాలలో (ఇప్పటి పిల్లలు నలుగురు అంటే లెక్క సరిగా ఉందో లేదో చూస్తారేమో!) ఊళ్ళో పండేవి, లేదా పక్కనున్న పట్నం నుంచి తెచ్చుకునే కూరగాయలే ఆధారం. అప్పుడప్పుడూ కూరల బండి వచ్చేది. రోజూ పట్నం వెళ్ళటమూ కష్టమే; కూరలు తెచ్చి నిలువచేసుకోవటమూ కష్టమే.

వైదేహమ్మ పెరట్లోకి వెళ్ళగానే ముందుగా దడి మీద దట్టంగా అల్లుకున్న కాకరపాదు దర్శనమిచ్చింది. పడి (గింజలు) మొలిచిందే అయినా కాయలివ్వటంలో నిర్లక్ష్యం లేదు పాపం దానికి. ‘కాకర కాయలు మొన్నే కోసా కదా! సరే ముందు ఈ గోంగూర కోద్దాం. పచ్చడికీ, పప్పుకీ కూడా పనికొస్తుంది’ అనుకొని గోంగూర కోయటం మొదలు పెట్టింది. దనాసరి గోంగూర – రుచిలో అద్భుతమే కాని కోసేటప్పుడు మాత్రం కాస్త చేతులకు గీతలు పెడుతుంది. అంతలో పేరయ్య మనుమరాలు వచ్చింది – “అమ్మ ఈ జున్నుపాలు మీకిచ్చి రమ్మంది మామ్మగారూ!” అంటూ. గోగుచెట్ల పక్కనే చెట్ల నిండా విరగబూసిన కనకాంబరాలను చూడగానే ఆ పిల్లకి ఆశపుట్టింది. “మామ్మగారూ! కాసిని కనకాంబరాలు ఇత్తారా? రేపు ఊరెళ్ళాలి” అని అడిగింది. ఆ రోజుల్లో పక్కనున్న పట్నానికి వెళ్ళటమే పెద్ద ప్రయాణం; అప్పుడే ఇలాంటి అలంకారాలన్నీ, ఓపికగా కాసిని కనకాంబరాలు కోసిచ్చింది వైదేహమ్మ. గోంగూర కోసుకుని ఇవతలకు వస్తుండగానే రెండిళ్ళ అవతలుండే తులశమ్మ గారి మనుమరాలు చంటి వచ్చింది “మామ్మగారూ! మామ్మ మీకీ పొట్ట(ట్ల) కాయలు, తోటకూర కాడలు ఇచ్చి రమ్మంది” అంటూ. పిచ్చి(చ్చు)క పొట్లకాయలు (చిన్నగా, పొట్టిగా ఉండే పొట్లకాయలు); తోటకూర కాడలు నవనవలాడుతున్నాయి. వాటిని ఇచ్చినా ఇంకా వెళ్ళకుండా అక్కడే నిల్చున్న చంటిని “ఏం చంటీ! ఏమైనా కావాలా?” అని అడిగింది వైదేహమ్మ. “మామ్మ కరేపాకు తెమ్మంది మామ్మగారూ! పచ్చడి తాలింపుకంట. కొంచెం ఒద్దే (ఎక్కువ) ఇమ్మంది.” “అన్నట్టు రేపు నేనూ, అమ్మా గుడివాడెళతన్నాం మామ్మగారూ! అమ్మమ్మని చూసి చాన్నాళ్ళయింది. మొన్నే మావయ్యాళ్ళింటికి వచ్చిందంట చూసొద్దామనీ. వచ్చేప్పుడు మీకేవైనా తేవాలా?” అడిగింది చంటి. “బాగా గుర్తు చేసావు చంటీ! నాకో తెల్ల గరిటె తెచ్చి పెడుదూ! పాతది విరిగిపోయి తిరగమోతకి ఇబ్బందిగా ఉంది. వెళ్ళేటప్పుడు డబ్బులిస్తా. తీసుకుపో. అట్లాగే ఒక అరవీసె బంగాళాదుంపలు, ఒక సవాసేరు దొండకాయలు కూడా తెచ్చిపెట్టు” అడిగింది వైదేహమ్మ. “అట్టాగే మామ్మగారూ! మేం కూడా పెద్ద చట్టి, సిబ్బి కొనుక్కోవాలి. దాపుడికి బట్టలు కూడా లేవు. డబ్బులు సరిపోతయ్యో, లేదో! మిగిలితే కొనుక్కుంటా. అయ్యో! మర్చిపోయా! దాలి మీద పాలు పెట్టా చూడు అంది మామ్మ” అంటూ “పాలేమైపోయాయో! మామ్మేం తిడుతుందో!” అనే ఆందోళనతో కంగారుగా పరుగెత్తి వెళ్ళిపోయింది చంటి – కరివేపాకు కూడా తీసుకుని.

అంతలో వాకిట్లోంచి పిలుపు – “సత్తెమ్మామ్మగారూ!” అంటూ. పూజకు పూలు కోసుకుంటున్న సత్యవతమ్మ ‘ఎవరా!’ అని వాకిట్లోకి వచ్చి చూసింది. వచ్చిన మనిషి కాపు శేషమ్మ. (ఇక్కడ కులాల గురించి చెప్పటం కాదు. ఆ రోజుల్లో అలాగే అనేవారు గుర్తు కోసం. ఎవరూ ఏమనుకునేవారు కూడా కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ; పరస్పరం గౌరవించుకుంటూ ఉండేవారు) “ఏం శేషమ్మా! బాగున్నావా? ఈ మధ్య మరీ నల్లపూసై పోయావు” పలకరించింది సత్యవతమ్మ. “ఏం బాగులెండి సత్తెమ్మ గారూ! వారం రోజుల నుంచీ జొరం కాత్తాంది. నోరంతా చేదు ఇసం. ముద్ద నోటికి పోటం లేదు (పోవటం). కూత్తంత (కాస్త) పాత చింతకాయ పచ్చడి పెడతారని వచ్చా” అంది శేషమ్మ. “సరే ఆగు” అని చెప్పి తామరాకులో పచ్చడి తెచ్చి ఇచ్చింది సత్యవతమ్మ. “మరి డాక్టరు దగ్గరికి వెళ్ళావా?” అడిగింది ఆత్మీయంగా. “ఎళ్ళా సత్తెమ్మగారూ! అరకు, బిళ్ళలు ఇచ్చాడు. సూదేసాడు (ఇంజెక్షన్). నీరసంగా ఉందంటే బలింబుడ్డి కూడా (టానిక్) రాసిచ్చాడు. ఎళ్ళొత్తా సత్తెమ్మ గారూ! ఆ మద్దెన మీరిచ్చిన నిమ్మకాయ పచ్చడి అయిపోయింది. బద్ద నాలిక్కి రాసుకుంటే బాగుండేది. ఈ పచ్చడి బద్దిరంగా (భద్రంగా) వాడుకుంటే కొన్నాళ్ళొత్తది” అంటూ వెళ్ళిపోయింది శేషమ్మ. పచ్చడి చూడగానే చచ్చిపోయిన జిహ్వ తిరిగొచ్చినట్లయింది ఆమెకి. (ఇప్పటి నాగరికుల్లా థాంక్స్ చెప్పేసి ఇక అంతటితో సరి అనుకోరు వాళ్ళు. తమ కృతజ్ఞతను చూపుల్లో, చేతల్లో చూపిస్తారు)

అక్కా చెల్లెళ్ళిద్దరూ పూజ, వంట, భోజనం పూర్తిచేసుకుని కాసేపు నడుం వాల్చారు – అబ్బాయిలు (వెంకటాచలానికి మారుపేరు) అన్నట్లు ‘కుండ బరువు గుండెకెక్కింది’ అనుకుంటూ – భుక్తాయాసంతో. కొంచెం ఎండ వచ్చి నేల గట్టి పడుతోంది. పక్కింట్లో ఉండే బంధువుల పిల్లవాడు మట్టితో బొంగరాన్ని తయారుచేసుకుని అరుగు మీద ఆడుకుంటున్నాడు.

బొంగరం అంచులు నున్నగా ఉండటానికి గీయటం వల్ల అరుగు మీద మట్టి చారికలు పడుతున్నాయి. బొంగరానికి మధ్యలో పెట్టిన అగ్గిపుల్ల విరిగిపోతే ఖాళీ అగ్గిపెట్టెలో తెచ్చుకున్న వాడేసిన అగిపుల్లల్లోంచి ఒక దానిని తీసి గుచ్చి ఆరబెట్టాడు. ఈలోపు తాటి బుర్రల బండి కట్టే ప్రయత్నంలో పడ్డాడు. “ఏరా రమణా! బామ్మ భోంచేసిందా?” అడిగింది వైదేహమ్మ. “ఇందాకే తింది అత్తయ్యా!” సమాధానం చెప్పాడు ఆ పిల్లవాడు. రమణ నాన్న సోమసుందరం ఈ అక్కచెల్లెళ్ళకు వరుసకి తమ్ముడవుతాడు. గంపెడంత సంసారం. దానికి తోడు పేదరికం. సోమసుందరం తల్లి సీతామహలక్ష్మమ్మ ఎక్కువగా కూతురు దగ్గరే ఉంటుంది మార్కాపురంలో. అప్పుడప్పుడూ వచ్చి వీళ్ళని చూసి, కొన్నాళ్ళుండి వెళుతుంది. ఆ పెద్ద మండువా ఇంట్లో ఆవిడకు ఒక గది ఉంది. ‘బామ్మ గది’ అంటూ పిల్లలు ఎక్కువగా దాంట్లోకి వెళ్ళరు. కాని బామ్మ వచ్చిందంటే వాళ్ళకి పండుగే! చిన్న చిన్న బహుమతులు, ముఖ్యంగా పలకలు, బోలెడన్ని బలపాలు తెస్తుంది వచ్చేటప్పుడు. ఆ రోజుల్లో పిల్లలకి అదే గొప్ప ధనం మరి! పెద్దగా పరిశుభ్రత ఉండదు కాబట్టి కోడలు మనుమరాళ్ళు చేసే వంట ఈవిడ తినదు. విడిగా వెచ్చాలు తెప్పించుకుని తన గదిలో, కుంపటి మీద తనే వండుకుంటుంది. ఆమెకో నియమముంది. సూర్యుడు కనిపిస్తే గాని భోజనం చేయదు. కనిపించకపోతే ఆ రోజు ఉపవాసమే! తన పనులన్నీ పూర్తయ్యాక వచ్చి వీళ్ళ దగ్గర కాసేపు కూర్చుని వెళుతుంది.

“నువ్వున్నన్నాళ్ళు మాతో పాటు ఇక్కడే భోజనం చెయ్యి పిన్నీ!” అని వీళ్ళు చెప్పినా ఆవిడ ఒప్పుకోలేదు. తెల్లగా, బక్కపలచగా, శుభ్రమైన గులాబీ రంగు బట్టతో మితంగా మాట్లాడే సీతామహాలక్ష్మమ్మ అంటే అక్కచెల్లెళ్ళకి అభిమానంతో పాటు గౌరవమూ ఉంది. వృద్ధాప్యం ఆవిడ ఆత్మగౌరవానికి భంగం కలిగించలేదు. కొడుకు కుటుంబానికి చేతనైన ఆర్థిక సహాయం చేస్తుందే కానీ తన నియమాలకు విరుద్ధంగా ఉండలేని క్రమశిక్షణ ఆమెది. వైదేహమ్మ “బామ్మ భోంచేసిందా?” అని అడగటం వెనుక ఇంత కథ ఉంది. ఆ రోజు సూర్యుడు ఆలస్యంగా కనుపించాడు కాబట్టి ఆమె భోజనమూ ఆలస్యమయింది. “అరుగంతా మట్టి చెయ్యకురా!” అరచి చెప్పింది వైదేహమ్మ. వాడు బండి తయారీలో మునిగిపోయి ఆ మాటను విన్నట్లు లేదు. పొలం నుంచి వస్తున్న అబద్ధాలు తాను తెచ్చిన తాటాకును రెండు బుర్రల మధ్య ఉన్న కఱ్ఱకు కట్టి వాడికి సాయం చేసాడు. పమిడి పత్తి, జడపత్తి గింజలు తీసి, మర్నాడు వత్తులు చేసుకోవటానికి వీలుగా తాటాకు బుట్టల్లో సర్ది పెట్టుకుంది సత్యవతమ్మ. “విబూది పండు ఎక్కడుంది?” అడిగింది అక్కని. “ఆ కాగితపు పిండి గిన్నెలో పెట్టా చూడు” బదులిచ్చింది వైదేహమ్మ. మెంతులు, కాగితాలు కలిపి రుబ్బి ఆ పిండితో చిన్న చిన్న గిన్నెలు చేయటం వైదేహమ్మ వంతయితే మధ్య మధ్యలో విబూది చేతికి రాసుకుంటూ వత్తులు చక్కగా చెయ్యటం సత్యవతమ్మ వంతు. “పమిడి పత్తి అయిపోవచ్చింది. జడపత్తి కలపక తప్పటం లేదు” గొణుక్కుంటూ వంటింట్లోకి నడిచింది సత్యవతమ్మ. వత్తులకి జడపత్తి అంత శ్రేష్ఠం కాదు. ఇప్పటిలా బజారులో దొరికే దారపు ముక్కలను కొనుక్కుని దీపారాధన చేయటం కాదుగా మరి! మధ్యాహ్నం కాఫీ కోసం అంటించిన బొగ్గుల కుంపట్లో నిన్న శ్రీహరి భార్య ఇచ్చిన రెండు మొక్కజొన్న కండెలను కాలుస్తోంది సత్యవతమ్మ. వంటపాకలోంచి వీధి గుమ్మం కనుపిస్తూనే ఉంది.

వీధి వాకిట్లోంచి సాలె బ్రహ్మయ్య వరండాలోకి వస్తూ కనుపించాడు. “ఏం బ్రహ్మయ్యా! బాగున్నావా? ఏమిటి పెద్ద మూటే తెచ్చినట్లున్నావు? మంచినీళ్ళు కావాలా? ఇదిగో ఈ కండె ముక్క తిను” అంటూ పలకరిస్తూనే మంచినీళ్ళు, కండె ఇచ్చింది సత్యవతమ్మ. బ్రహ్మయ్య పోలిమెట్లలో ఉంటాడు. ఆ ఊళ్ళో నాలుగైదు కుటుంబాల వాళ్ళు నేతపని చేస్తారు. అప్పుడప్పుడూ ఎవరైనా పెద్దింటి వాళ్ళడిగితే ఇలా చీరలు తెస్తాడు. “బాగున్నా సత్తెమ్మగారూ! వానకాత్త తెరిపిచ్చిందని బయలెల్లా. వైదేహ్మగారేరి? మల్లయ్య గారు మీకీ డబ్బు ఇచ్చి రమ్మన్నారు. ఎట్టాగూ వత్తన్నా కదాని చీరలు కూడా పట్టుకొచ్చాను”. మాట్లాడుతూనే మొక్కజొన్న కండె తిని, మంచినీళ్ళు తాగి, చీరల మధ్యలో పెట్టిన డబ్బు అందించాడు బ్రహ్మయ్య. వాళ్ళ ఊళ్ళో ఉంటున్న మల్లయ్య వీళ్ళకున్న రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. పంట రాగానే కొంతే ఇచ్చి మిగిలింది ఇప్పుడు పంపాడన్నమాట. ఆ డబ్బు ఇది. అందరూ ఉన్నప్పుడు అక్కా చెల్లెళ్ళిద్దరూ కూడా పోలిమెట్లలోనే ఉండేవారు. కాలక్రమాన పెద్ద వాళ్ళతో పాటు పెద్ద మండువా ఇల్లు, పదుల సంఖ్యలోని పొలాలు, ఎడ్లు, గేదెలు, ఆవులు అన్నీ గతించాయి. వీళ్ళు అయినంపూడిలో స్థిరపడ్డారు. లోపల నుంచి వైదేహమ్మ కూడా వచ్చి కూర్చుంది. చెఱువుకు నీళ్ళకోసం వచ్చిన నలుగురైదుగురు ఆడవాళ్ళు కూడా వసారాలోకి వచ్చి చేరారు. “ఇదిగోండి సత్తెమ్మ గారూ! మీరడిగిన వంగ పండు రంగు చీర. వైదేమ్మ గారూ! మీరు ముదురాకుపచ్చ అడిగారుగా?” అంటూ వాళ్ళడిగిన చీరలు తీసిచ్చాడు బ్రహ్మయ్య. ఇక అక్కడ చేరిన ఆడవాళ్ళు చీరలు చూడటం మొదలుపెట్టారు – బ్రహ్మయ్య డబ్బంతా ఒక్కసారిగా ఇవ్వక్కరలేదని హామీ ఇచ్చాక. “అక్కా! ఈ వంకాయ రంగు కోక బాగుందా? పాలపిట్ట రంగుదైతే బాగుంటది. ఈ తూటు పువ్వు రంగు చీర నాకుంది”, “ఈ గచ్చకాయ రంగుది బాగుంది కాని మాపుకాగదు” “ఈ పప్పూ గోంగూర కలనేత చీర బలే ఉంది, చిలకపచ్చ చీరుందా? ఏదీ ఆ నెమలికంటం రంగుది చూపించు” “తోపు రంగుదుందా? కిందటి సారి తీసుకున్న మిరప్పండు రంగు చీర అసలు ఎలవే లేదు (వెలిసిపోలేదు) తెలుసా? దానిమ్మ గింజల్లే అట్టాగే ఉంది రంగు. చింత నిప్పులా ఉందనేది మా అత్త”. “ఈసారి వచ్చేటప్పుడు వక్క రంగు కోకట్టుకురా (పట్టుకురా) కృష్ణ బులుగు ఎలిసిపోద్దా? మానుగాయి రంగు కోక కూడా బానే ఉంటది, ఈ నేరేడు కాయ రంగు కోక కూడా బానే ఉంది, ఈ ఇటిక (ఇటుక) రంగు, బులుగూ బాగానే ఉన్నాయి కాని ఎలిసిపోతాయేమో, ఈసారి తాటాకంచు చీర తీసుకురా. ఈ సిరా రంగు కోక చూడు” – ఇలా సాగిపోయాయి వాళ్ళ మాటలు. వాళ్ళు నిత్యం చూసే రంగులే, వస్తువులే వాళ్ళ మాటలలో దొర్లాయి (నిజానికి లేత రంగు చీరలు అంతగా నేసేవారు కాదు. కాని వాళ్ళు ఉపయోగించే మాటల కోసం చెప్పాను). “బ్రహ్మయ్యా! కాస్త ఆ పెండెం సరిగా కట్టిపో. అవునింతకీ మా పొలంలో ఊడ్పయిందా?” అడిగింది వైదేహమ్మ. “ఇంకా లేదు వైదేమ్మ గారూ! వత్తంటే ఆకుమడి కాడ మల్లయ్యగారి పాలేరు కనబడ్డాడు. రేపు ఊడుస్తారంట. అన్నట్టు ఆ మద్దెన మీ వంట పాక కుట్టటానికొచ్చినప్పుడు (తాటాకులతో) చూరు కుట్టుబద్ద మర్చిపోయాడంట. అడిగి తెమ్మన్నాడు” అంటూనే కంబరి తాడుతో (కొబ్బరితాడు) పెండెం సరిగా కట్టి, చీరల మూట, చూరు కుట్టుబద్ద తీసుకుని వెళ్ళిపోయాడు బ్రహ్మయ్య.

అందరూ వెళ్ళిపోయినా నర్సమ్మ కాసేపు కూర్చుని తన కష్టసుఖాలు వెళ్ళబోసుకుంది. “ఏం నర్సమ్మా! ఏమిటి కబుర్లు?” అని వైదేహమ్మ అడగగానే “ఏంటో వైదేమ్మ గారూ! ఈ మద్దెన అన్నీ చికాకులే. నాకూ వంటో అంతంతగానే ఉంటాంది. ఆయన లాక్కాడకెళ్ళాడు (కాలువలాకులున్న చోటు – గుడ్లవల్లేరు). గేద కూడా ఏంటో సరిగ్గా గడ్డి తింటం లేదు. కుడితి తాగటం లేదు. దానికో తాడు తెత్తానని ఎళ్ళాడు. అక్కడొకాయన మంత్రం ఏసిస్తాడు. తేంగానే కట్టాలి. మాకదే ఆదారం గందా! (కదా) నిన్న సందకాడే ఎళ్ళాడు. రేపొద్దున వత్తానన్నాడు. అందుకే తీరుబాటుగా కూకున్నా. లేకపోతే ఏముంది? పెందరాళే ఇంత ముద్ద తిని పడుకోటమే. మీరన్నట్టు ‘గూట్టో దీపం నోట్టో ముద్ద’ ఆళ్ళ అక్కకి కూడా ఈ మద్దెన పానం బాగోటం లేదు. ఆవిడ అక్కడేగా ఉండేది. ఒక రోజు ఉండొత్తానని ఎళ్ళాడు”.

“అట్టాగా! పాపం ఏమిటి సుస్తీ సీతమ్మకి? కోడలు నీళ్ళోసుకుందా?” అడిగింది వైదేహమ్మ. “ఏం లేదు వైదేమ్మ గారూ! మనేద (మనోవ్యధ) కొడుకు ఏరు కాపురం పెట్టాడు. ఆ కోడలు వచ్చిన కాడ నుంచీ ఎప్పుడూ పేచీలే! పోనీ ఇడిగా ఉండి ఆళ్ళయినా సుకంగా ఉంటారులే అనుకుంటే ఈ మద్దెన ఆ పిల్ల ఆడితో కూడా గొడవపడి పుట్టింటి కెళ్ళిపోయింది. ఇక్కడున్నప్పుడు కూడా పద్దాక (మాటిమాటికి) పుట్టింటి కెళ్ళిపోయేది. పోనీ ఇక్కడుందూగానీ రారా! కలో, గంజో కలిసే తాగి ఒక చోట పడుందాం అంటే ఆడు రాడు. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటది చెప్పండి? అక్కడికీ పెద్ద మడుసులతో (మనుష్యులు) ఒకసారి పంచాయితీ ఎట్టించారు. ఇహ చెల్లుచీట్లు (విడాకులు) తీసుకోక తప్పేట్టు లేదు. రోగం ఏం లేదు కానీ మా ఆడబిడ్డకి పాపం ఈ మనేదే ఎక్కువయింది” – ఇలా కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది నర్సమ్మ.

అంతలో అరుంధతి వచ్చింది. కూలీలంతా పొలం నుండి ఇళ్ళకు తిరిగి వెళుతున్నారు. తోటి వాళ్ళని సందుమొగలో ఉండమని చెప్పి ఆగింది. “మామ్మగారూ! ఇదుగో పండుబాబు గారు మీకీ బెండకాయలు ఇమ్మన్నారు” అంటూ కొంగులో ఉన్న బెండకాయల్ని అరుగు మీద కుప్పగా పోసింది. “మామ్మగారూ! కాత్త మాడి (మామిడి) కాయ పచ్చడెట్టండి – ఎండు పచ్చడి (మాగాయ)” – అడిగింది చనువుగా. పాత గాజు గిన్నొకటి చూసి పచ్చడి పెట్టి తెచ్చి అరుగు మీద పెట్టింది సత్యవతమ్మ (ప్లాస్టిక్ కవర్లు, గిన్నెలు, డబ్బాలు లేవు ఆ రోజుల్లో, వంటకి ఇత్తడి గిన్నెలు, పులుసు మొదలైన వాటి కోసం రా(తి)చిప్పలు, పచ్చళ్ళ కోసం జాడీలు… సాధారణంగా బ్రాహ్మణ కుటుంబాలలో ఇవే ఉండేవి. బ్రాహ్మణేతరులు వీటితో పాటు తెల్ల (అల్యూమినియం) గిన్నెలు కూడా వాడేవారు. స్టీలు గిన్నెలు, గ్లాసులు ఉన్నా అవి పరిమితంగా ఉండేవి. తరువాత తరువాత ఇత్తడి కంటే స్టీలు గొప్ప అనుకునే రోజులొచ్చాయి. కాలం ముందుకు కదిలాక ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయింది).

“వత్తా మామ్మగారూ! ఇయాళ చలులుకులొచ్చాయి. (చలి వలన రోమాలు నిక్క బొడుచుకోవటం) ఇంటికెళ్ళి కూసిని ఉడుకు నీళ్ళోసుకుని ఈ పచ్చడితో వర్రగా (కారంగా) ఏడేడిగా (వేడివేడిగా) వణ్ణం (అన్నం) తిని పడుకుంటా. పిల్లకి చెప్పొచ్చా – పొయ్యి మీద బియ్యం పెట్టి పొంతకుండలో నీళ్ళో సెట్టమని” మాట్లాడుతూనే పచ్చడి తీసుకుని గబగబా వెళ్ళిపోయింది అరుంధతి. రెండు బీరకాయలు చేత్తో (చేతితో) పట్టుకుని వస్తూ కనుపించింది చాకలి లక్ష్మి. మధ్యలో ఆగి “బాగున్నారా మామ్మగారూ!” అని పలకరించింది – అరుగు మీద కూర్చున్న సత్యవతమ్మని. “బానే ఉన్నా కానీ ఈ రెండు కాయలేమిటే? ఇంట్లో నలుగురున్నప్పుడు రొండు (రెండు) కాయలెట్టా సరిపోతాయి? అసలే బీరకాయ కూర ఒదుగవ్వదు కూడా (ఎక్కువ కాదు) – ఆశ్చర్యంగా అడిగింది సత్యవతమ్మ. “సరిపోకేంలే మామ్మగారూ! కాత్త ఉల్లిపప్పు (ఉల్లిపాయ), రొండు రామ్ములక్కాయలు (టమోటాలు) ఏసి చేత్తే అదే సరిపోద్ది” – బదులిచ్చింది లక్ష్మి. “కోడలు కాపరాని కొచ్చిందా?” అడిగింది సత్యవతమ్మ. “ఆ వచ్చింది మామ్మగారూ!” చెప్పింది. “అయితే ఇంకేం. నువ్వెళ్ళేసరికి వండి పెడుతుందిలే” అంది సత్యవతమ్మ. “ఆ బరోసా ఏం లేదు. ఆ పిల్లకెప్పుడూ కూటి కుండ, కూరదాక – ఈటి మీదే దేస (ధ్యాస) గానీ పనికి వళ్ళొంగదు” అన్నాడు లక్ష్మి వెనకే వస్తూన్న రాముడు. లక్ష్మి అతని రాకను గమనించలేదు; వెనక్కి తిరిగి చూసింది. “నువ్వెప్పుడొచ్చా? (వు – లోపం) ఆశ్చర్యంగా అడిగింది. “నీ ఎనకమాలే ఉన్నా. (వెనకాలే) సందడి పోతాంది ఎళ్ళొత్తాం మామ్మగారూ!” అంటూ జవాబు చెపుతూనే భార్యతో కలిసి ముందుకు వెళ్ళిపోయాడు రాముడు.

“ఒక తవ్వెడు బియ్యం ఉంటే ఇవ్వవే వైదేహీ! రేపో, ఎల్లుండో ఇస్తాను” అంటూ అప్పుకొచ్చింది దూరపు బంధువైన రంగనాయకి. “పరవాలేదులే, ఇస్తానుండు” అని లోపలికి వెళ్ళి తీసుకొచ్చింది వైదేహమ్మ. అవి తిరిగి రావని తెలుసు. పాపం రంగనాయకి ఒంటరిగా ఉంటుంది. దానికి తోడు అవిటితనం కూడా. సాటివాళ్ళనే అభిమానంతో ఉన్నంతలో ఇలాంటి సహాయాలు చేస్తుంటారు అక్కాచెల్లెళ్ళిద్దరూ. చింతకాయ చాలటం లేదు. ఈసారి ఓ మణుగు పెట్టాలి (8 వీసెలు) సీతమ్మకి, అమ్మాయికి (మరదలు, అక్క కూతురు) కూడా ఇవ్వాలి కదా! మణుగంటే గుర్తొచ్చింది నాగు (తమ్ముడి కొడుకు) మణుగు బూరెలు (జంతికలు) అడిగాడు. రేపయినా చెయ్యాలి – రంగనాయకికి బియ్యం ఇస్తూ మనసులో అనుకుంది వైదేహమ్మ.

మఱ్ఱిచెట్టుకు అటు పక్క ఉన్న పెద్ద రేవు చప్టా మీద బిందెలు పెట్టి ప్రభావతి, దమయంతి మాట్లాడుకుంటున్నారు కాదు గట్టిగానే తిట్టుకుంటున్నారు ఇద్దరూ కలిసి ఎవరినో. “ఆడి జిమ్మడ. ఆడికేం పొయ్యేకాలం వచ్చిందీ! గాలి సచ్చినోడు. గాలి తిరుగుళ్ళూ ఆడూనూ ముదనష్టపోడు, రాలినోడు” ఇలా సాగిపోతోంది తిట్ల పరంపర. మళ్లీ వాన ముంచుకొచ్చేలా ఉందే – అనుకుంది సత్యవతమ్మ – పొలాల మీదుగా పొగలాగా పాకి వస్తున్న వర్షాన్ని చూస్తూ. దూరంగా గొడ్ల రేవు దగ్గరున్న వడ్డాబత్తుల తడిసిన పాకలోంచి పొగ పైకి లేస్తోంది. పెంజెండ్ర నుండి సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న ఆచారి కనుపించాడు. చిన్న ఊరు కావటం వలన గుడికి పెద్ద ఆదాయం ఉండదు. ధర్మకర్తలు వారి పూర్వులు కట్టించిన రామాలయంలో ధూప, దీప, నైవేద్యాలకు ప్రతి నెలా ఇచ్చే వస్తువులతో పాటు పూజారికి కొంత ధాన్యం కూడా కొలుస్తారు. అతడు అయినంపూడిలో ఉండడు. పొద్దున, సాయంత్రం వచ్చి అర్చన చేసి వెళ్ళిపోతాడు. ‘అయ్యో! సందె దీపం పెట్టాలి’ అనుకుని వాకిట్లో కాసిని నీళ్ళు చిలకరించి, సందె ముగ్గు వేసి, దీపాలు వెలిగించి తెచ్చి వరండాలో గుమ్మానికి రెండు వైపులా ఉన్న గూళ్ళల్లో దీపాలు పెట్టి “దీపం జ్యోతి పరబ్రహ్మ” అని చదువుతూ నమస్కరించింది సత్యవతమ్మ. పొద్దు వాటారిపోయింది (చీకటి పడుతోంది).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here