పల్లెటూరు

0
11

[మంగు కృష్ణకుమారి గారు రచించిన ‘పల్లెటూరు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నా[/dropcap] చిన్నతనంలో చూసిన
మా మేనత్త ఇల్లు, కట్టు పల్లెటూరు

పశువులపాకల నిండా
మహాలక్ష్ముల్లాటి ఆవులూ
దూడలూ, పాడి గేదెలూ
కుడితి తొట్టే, వెనక గదిలో
చిట్టూ, పొట్టూ దాణా సంచులూ..

పెరట్లో ఎడ్లబళ్ళూ, రెండు ఎద్దుల
కొమ్ములనిండా అలంకారాలూ..
ఇన్ని పశువుల పనులూ
ఇష్టంగా, చేస్తూ పిచ్చయ్యా..

గుంజకి కట్టిన కవ్వంతో
పెరుగు చిలుగుతూ
గొల్లభామల్లా మా వదినలూ..
వెన్నముంత పట్టుకొని
వంటింట్లోకి వెళుతు యశోదమ్మలా అత్తా..

ధాన్యం గాదె ఉన్న గది దాటితే
మడి వంటిల్లూ,
రెండు మట్టి పొయ్యల మీద
చకచకా వండేస్తూ అత్తా, ఆ పక్కనే నట్టిల్లూ

దక్షిణం గదిలో గాలిని ఆస్వాదిస్తూ
అత్తకి అత్తగారూ, ఆమె సరంజామా

మోటబావి నీళ్ళు తోడుతూ,
రాయబారం పద్యాలు
చదివే మా మావయ్యా

ఎప్పుడూ పొలాల్లో
ఏటికి ఏతం పట్టే మా బావలూ

జామ, నేరేడూ, చింతా, అరటీ,
లేని చెట్లే లేవన్నంత పెద్ద పెరడూ
మల్లె గులాబీ, జాజీ సంపెంగ
పూల ఘమఘమలూ

ఉడతలూ, చిలకలూ
ఇంటి ఆడపడుచులో ఏమో?
ఠీవీగా పండు తింటూనే ఉంటాయీ

పిచికల గూళ్ళూ ధాన్యం కంకులపురీ
పచ్చదనానికి, మరోపేరు,
ప్రేమకీ ఆదరణకీ విలువ కట్టలేరెవరూ..

“అత్తా.. ఇంత ఇల్లే మీది,
మా రాజుగారి కోటలా”
అంటే, మా అత్త జానెడు
జాజులమాల నా రెండు జడల్లో
చంద్రవంకలా పెట్టి
బుగ్గగిల్లి, నవ్వుతూ
“బావని పెళ్ళాడవే.. ఈ ఇల్లు నీదే,
ఈ కోటకి మహారాణివీ,
అధికారిణివీ కూడా నువ్వే” అంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here