పామరులు – పడవతాత 5

0
10

[box type=’note’ fontsize=’16’] బొందల నాగేశ్వరరావు గారు వ్రాసిన మినీ నవల ‘పామరులు – పడవతాత‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఐదవ భాగం. [/box]

[dropcap]మ[/dropcap]రుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా భూపతి ఓ డాక్టర్ను, ఓ పంతుల్ని తీసుకొని నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ రోజు పడవతాత పడవ లేనందున మరో పడవలో కూర్చొని దీవిలో వున్న రామాపురానికి చేరుకొన్నాడు. మెల్లగా నడుచుకొంటూ వూరి మధ్య నున్న అమ్మ వారి గుడి వద్దకు వెళ్ళారందరూ.

అప్పటికే అప్పయ్య సమక్షంలో ఎన్నికలను గూర్చి సమావేశం జరుగుతోంది అమ్మవారి గుడి వద్ద. అది గమనించిన భూపతి హడావుడిగా సమావేశం జరుగుతున్న ప్రాంగణంలో కాలు మోపాడు. అప్పుడు అందరూ ఒక్కసారిగా ఆయన వేపు చూశారు.

“క్షమించండి. ఎవరు సార్ మీరు? ఎవరి కోసం వచ్చారు?” అడిగాడు అప్పయ్య మాట్లాడుతున్న మాటల్ను ఆపి.

“మీ కోసమే వచ్చాను. మీ అందరికి నా నమస్కారాలు. నేను జరగనున్న ఉప ఎన్నికల్లో రేడియో చిహ్నం మీద పోటీ చేస్తున్న అభ్యర్థిని. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ మీ ఓట్లన్ని నాకే వేసి గెలిపించాలని ప్రాధేయపూర్వకంగా అడగాలని ఇందాకా వచ్చాను”విషయాన్ని బయటపెట్టాడు.

“అయితే మాకేంటి?” జనంలో నుంచి ఒకతను అడిగాడు.

“అవునండి. నిన్న మీలాగే ఓసారొచ్చాడు. తనూ ఎన్నకల బరిలో వున్నట్టు చెప్పి తను గెలవటానికి మా ఓట్లన్ని టీవీ గుర్తుకు వెయ్య మన్నాడు.కాని మాకోసం ఏమీ చెయ్యడట”ఇంకొకతను అన్నాడు.

“మీలో అప్పయ్య అంటే యెవరు?” ప్రశ్నించాడు భూపతి.

“నేనేనండి” షేక్ హాండిస్తూ చెప్పాడు అప్పయ్య.

“అప్పయ్యా! వీళ్ళలో కాస్త చదువుకున్నవాడు,తెలివిగలవాడు అంటే నువ్వేనని నేను నిన్నే తెలుసుకున్నాను. మీకు ఇమ్మీడియేటుగా కావలసిన పనులు రెండు. అవి అతి ముఖ్యమైనవి. వెంటనే అమలు పరచవలసినవి. ఆ రెండు పనులను మీకు నేను ఇప్పుడే చేసి పెడతాను!” అంటూనే అందరూ చప్పట్లు కొట్టారు.

అప్పయ్య, పడవతాత, అప్పయ్య మామ ముఖాల్లో సంతోషం వెల్లివిరిసిందప్పుడు. ఆశ్చర్యంతో భూపతి ముఖంలోకి చూశాడు అప్పయ్య.

“అవునప్పయ్యా! మీరు కోరుకొంటున్నట్టు మీ ఆరోగ్యాల కోసం డాక్టరు కావాలన్నారు. వీరే ఆ డాక్టరు. తన పని ఈ రోజునుంచే మొదలు పెడతాడు. ఇక వీరు మీ పిల్లలకు చదువు చెప్పటానికి వచ్చిన పంతులు. ఆ గట్టునుంచి ఇక్కడికి పడవ వస్తుందంటే వీళ్ళిద్దరూ ఇక్కడ వున్నట్టే! వీళ్ళిద్దరికి జీతభత్యాలు ఎంతైనా సరే నేను ఇచ్చుకొంటాను. అంతే కాదు భవిష్యత్తులో మీ కోసం మరెన్నో సంక్షేమ కార్యాక్రమాలను చేపట్టాలని నిర్ణయించుకున్నాను.

ఇక మీరు నాకు చేయవలసిందల్లా ఒక్కటే… మీ ఓట్లేసి నన్ను గెలిపించటమే!” అని ముగించాడు.

అంతే! అందరూ వాళ్ళ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. అప్పయ్య కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతుంటే అలాగే భూపతి కాళ్ళమీద పడ్డాడు. భూపతి అప్పయ్యను పైకి లేపుతూ “లే అప్పయ్యా! నువ్వు ఈ జనం సంక్షేమం కోసం నీ చేతనైన మంచి పనులు చేసి పెడుతున్నావని తెలుసుకున్నాను. వీళ్ళ అభివృద్ధే మీ జీవితాలన్నంతగా నువ్వూ, పడవతాత పాటుపడుతున్నారు. ఈ రోజు నుంచి మీతో నేను కూడా” అని అంటుండగా ‘భూపతిగారికి జై, భూపతిగారికి జై’ అంటూ అందరూ జేజేలు పలికారు.

“అయ్యా! మీరిక్కడికి వచ్చిన తీరు, ధోరణి చూసి భయపడ్డాను. మమ్మల్ని బెదరించో లేక హింసించో మా ఓట్లు వేయించుకొంటారనుకొన్నాను. కాని మీ దయగల మనసుతో మేము కోరిన ఆ రెండు పనులను వెంటనే ప్రారంభించే ఏర్పాట్లతో వచ్చారు.. మీకు మేము సర్వదా కృతజ్ఞులం. మా ఓట్లన్నీ మీకే వేసి గెలిపిస్తామయ్యా” అంటూ మళ్ళీ కాళ్ళమీద పడ్డాడు అప్పయ్య.

“ఓకే! ఎన్నికలు మరో పద్దెనిమిది రోజుల్లో జరగనున్నాయి. అందరూ సంఘటితంగా, అప్రమత్తంగావుండి ఓట్లను వేసి నన్ను గెలిపించండి. వస్తాను అప్పయ్యా! పడవతాతా వెళ్ళొస్తాను. అందరి వద్ద సెలవు తీసుకొంటున్నాను” అంటూ రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అందరి యొక్క ‘ జేజే’ నినాదాల మధ్య పడవ వద్దకు నడిచాడు భూపతి తన అనుచరులతో.

***

భూపతి దీవి వాసులకు ఇచ్చిన మాట ప్రకారం వారానికి నాలుగు రోజులు డాక్టర్ను, పంతుల్ని పడవతాత పడవలోనో లేక మరో పడవలోనో పంపుతున్నాడు. ఇప్పుడు దీవిలోవున్న రామాపురపు ఆదివాసీలు జ్వరం, తలనొప్పి, బేదులన్న చిన్నచిన్న వ్యాధుల వస్తే వాటినుంచి విముక్తి పొంది ఆరోగ్యపరంగా ఆనందంగా వుంటున్నారు. ఇక పంతులు నేర్పుతున్న చదువుతో అక్షరజ్ఞానం కలిగి ప్రపంచాన్నే జయించగలమన్న ధీమాతో వాళ్ళ పిల్లలు ముందుకు దూసుకు వెళుతున్నారు. వాళ్ళలో జ్ఞాన జ్యోతి వెలగడంతో పరిసర ప్రాంతాలు సైతం పరిశుభ్రత నందుకున్నాయి. వూరి జనంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకున్నాయి…

ఎం.ఎల్.ఎ అభ్యర్థి భూపతిగారి దయవల్ల వూరిలో, వూరి జనంలో కలిగిన మంచి మార్పులకు ఆనందిస్తూ ఆయనకు అప్పయ్య, పడవతాతే కాకుండ జనం మొత్తం కృతజ్ఞతా భావంతో ఎన్నికల్లో ఋణం తీర్చుకోవాలని యెదురు చూస్తున్నారు.

రెండు వారాలు గడిచి పోయాయి. ప్రత్యర్థి భూపతి ద్వారా దీవిలో జరిగిన మార్పులు గమనించాడు నారాయణ. తను చేయలేనని చెప్పిన పనులను భూపతి చేసి ఆదివాసీలను తన ప్రక్కకు తిప్పుకొంది సహింలేక పోయాడు. ఓట్లన్నీ భూపతికి పడితే తను ఓడిపోవడం ఖాయమన్నది కనీసం వూహించలేక పోతున్నాడు నారాయణ. ఇప్పుడేం చెయ్యాలి? గెలుపును తెచ్చిపెట్టే దీవిలోని ఆదివాసీల నాలుగు వందల ఓట్లు తనకే దక్కాలి. మరది ఇక కుదరని పనని తెలుసుకున్నాడు. ఓట్లన్నీ తనకు పడాలి లేకపోతే ఆ జనాన్ని ఓట్లు వేయకుండా చేసి భూపతిని ఓడించి తను ఎం.ఎల్.ఎ కావాలి. ఎలా…? ఇందుకు ప్రత్యామ్నాయ మార్గం ఏమిటన్న ఆలోచనలతో సతమతమౌతూ పిచ్చి పట్టిన వాడిలా అయిపోయాడు నారాయణ.

మరుసటి రోజు ఉదయం పది గంటలు—–

పార్టీ ఆఫీసు గదిలో కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు నారాయణ. ప్రతి అయిదు నిముషాలకు గుమ్మం వరకూ వెళ్ళి నిరుత్సాహంతో తిరిగొచ్చి తన సీటులో కూర్చొంటున్నాడు. తనతో పాటు ఆఫీసులో వున్న అనుచరులు ఆయన వాలకం ఏమిటోనని అర్థం కాక తలలు గోక్కొంటున్నారు.

అంతలో ఓ కారొచ్చి ఆగింది. కారులోనుంచి ఇద్దరు వ్యక్తులు దిగారు. వారిలో ఒకడు నారాయణ అనుచరుడు. మరొకరు ఎవరో కాని అతను మన రాష్ట్రానికి, దేశానికి చెందిన వాడు కాదని ఇట్టే తెలిసి పోతోంది. బహుశా అతనో ఇంటర్‌నేషనల్ తీవ్రవాదో లేక స్మగ్లరో అయి వుండవచ్చు. అతని చేతిలో ఓ పొడవాటి, సూట్‌కేసులాంటి బాక్సు వుంది. దాదాపు ఆరడుగుల కంటే ఎత్తున్న తనకు జుట్టు ఎర్రగా వుంది. ఓ చెవికి పోగు పెట్టుకున్నాడు. జుట్టును నల్ల రిబ్బనుతో ముడి వేసుకొని వైట్ అండు వైట్ ప్యాంటు షర్టుమీద నల్లకి కట్ కోటుతో చూసే వాళ్ళకు ఆతని రూపం కాస్త భయాన్ని కలిగిస్తుంది.

ఇద్దరూ నారాయణ వద్దకు నడిచారు. నారాయణ తను కూర్చొంటూ ఎదరే కూర్చోమన్నట్టు సైగ చేశాడు.

“సార్! ఇతనే నేను చెపుతున్న వ్యక్తి. అతి కష్టంమీద ముంబై నుంచి తీసుకు వచ్చాను. ఇంటర్నేషనల్ లెవల్లో మనమనుకొంటున్న పనులు చేసి చూపడంలో దిట్ట. దయాదాక్షీణ్యాలకు అతీతుడు. ఇతని గుండె ఓ బండరాయి. కరుణకు,అర్ద్రతకు అందులో అస్సలు చోటు లేదు. చెప్పిన పని చేస్తాడు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొంటాడు” చెప్పి ముగించాడు అనుచరుడు.

“మరి మనమనుకొన్న వియయాన్ని అతనితో చెప్పావా”అడిగాడు నారాయణ.

“లేదండి.మీరే చెపుతారని….”నసుగుతూ అన్నాడు అనుచరుడు.

“ఓకే! మీ పేరు?” ముఖంలోకి చూస్తూ అడిగాడు నారాయణ.

“శివ సయ్యద్ ఇస్మాయిల్ రాబర్టు.అయితే నన్నందరూ ఎస్.ఐ.ఆర్. అంటారు”

“బాగుంది. మీ పేరులో మూడు మతాలున్నాయ్ ! “

“ఆఁ… నేను చేస్తున్న పనులు అలాంటివి. మూడు మతాల వారికీ నేను నచ్చాలని పేరును అలా పెట్టుకున్నాను. అయితే ఏ మతం వారైనా సరే పైసలిస్తే ఎంతటి పనైనా చేసి పెడతాను. పోలీసుల కన్ను కప్పి ఫారిన్ కంట్రీలకు వెళ్ళి తల దాచుకొంటాను. మళ్ళీ మీలాంటి వాళ్ళు పిలిపిస్తే ఇండియాకు వస్తాను. నాకు కావలసిందల్లా డబ్బు, డబ్బు. ఆ డబ్బుతో లగ్జురీగా బ్రతకడం” తన్ను గూర్చి క్లుప్తంగా చెప్పాడు ఎస్.ఐ.ఆర్.

“నేను మీకప్పగించే పని చాలా ప్రమాదకరమైనది. ప్రాణాలను పైకి పంపే పనది. చాలా కష్టతరం.”

“ఎన్ని ప్రాణాలనైనా నా వద్ద వున్నపథకాల ద్వారా లేపేస్తాను. నేను వూర్లనే ఖాళీ చేసిన వాణ్ణి. కాని అందుకు తగ్గ డబ్బు తీసుకుంటాను. ఎవరి కంట పడకుండా, మీకూ పోలీసుపరంగా ఇబ్బంది కలుగకుండా వెళ్ళిపోతాను. విషయాన్ని చెప్పండి”

షాక్ తిన్నారు నారాయణ. “ఎందరినైనా ఖాళీ చేస్తావా?”

“ఏం చెయ్యాలో చెప్పండి?”

“నేను ఇక్కడ జరుగుతున్న ఉపఎన్నికల బరిలో టీవీ గుర్తు అభ్యర్థిని. సర్వేలు ప్రకారం నాకూ, నా ప్రత్యర్థికి గట్టి పోటీ వున్నట్లు, మా ఇద్దరిలో ఏ ఒక్కరు గెలవాలన్నా ఆ దీవిలో వున్న రామాపురంలోని నాలుగు వందల ఆదివాసీల ఓట్లే కీలకమని చెప్పారు. వాటికోసం నేను ఆ దీవికెళ్ళి వాళ్ళ ఓట్ల కోసం ప్రయత్నించాను. ఆ ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపించాలంటే ఎన్నికలకు ముందే వాళ్ళకు రెండు పనులు చేసి పెట్టాలన్న ప్రతిపాదన నాముందుంచారు. అదేమిటంటే ఒకటి…. వాళ్ళను వ్యాధుల బారినుంచి తప్పించి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడేందుకు ఓ డాక్టర్ను, చదువు చెప్పేందుకు ఓ పంతుల్ని ఇప్పుడే ఏర్పాటు చేయమన్నారు. అది కుదరదని, ఆ పనులను నేను గెలిచి ఎం.ఎల్.ఎ. అయిన తరువాత చేసి పెడతానన్నారు. అందుకు వాళ్ళు ఎంతో తెలివిగా ఆలోచించి ఎన్నికల తరువాత చేయనన్నా వుద్దేశ్యంతో కుదరదని పంపించేశారు. అప్పుడు నా ప్రత్యర్థి భూపతి ఆ పాయింటును తనకు అనుకూలంగా మలచుకొని ఓ డాక్టర్ని, పంతుల్ని తనతో దీవికి తీసుకెళ్ళి పనులను ప్రారంభించి తెలివిగా ఓట్లను తన వైపుకు తిప్పుకున్నాడు. వాళ్ళిక నాకు ఓట్లు వేయరు. ఆ కీలకమైన ఓట్లు నాకే పడాలి లేకపోతే వాళ్ళు ఓట్లే వేయకుండా వాళ్ళను ఏదైనా చెయ్యాలి! ఏమంటావ్?” అడిగాడు నారాయణ.

“ఓకే! అర్థమైంది. ఆ ఓట్లు ఎటూ మీకు పడవు. అందువల్ల మీ ప్రత్యర్థి గెలుస్తాడన్నది మీ భయం. పది లక్షలిచ్చుకోండి ఆ ఓట్లను మీ ప్రత్యర్థీకీ పడకుండా ఒక్క బాంబుతో వూరినే ఖాళీ చేసి వెళ్ళిపోతాను.ఆ ప్రదేశంలో ఆరు నెలల వరకూ ఎలాంటి పురుగు పుట్రే కాదు కదా కనీసం గడ్డి కూడా మొలవకుండా బీడులా తయారు చేసి వెళ్ళిపోతాను”

“ఓకే! ఆ పని త్వరగా చెయ్యాలి” అన్నాడు నారాయణ.

“ఈ రోజు రాత్రే ముగించి చూపుతాను. చాలా?!” అన్నాడు ఎస్.ఐ.ఆర్.

తయారుగా వుంచుకున్న పది లక్షల బ్రీఫ్ కేసును ఎస్.ఐ.ఆర్. చేతికిచ్చాడు. బ్రీఫ్ కేసుతో వెళ్ళి కారులో కూర్చొన్నాడు ఎస్.ఐ.ఆర్. కారు వెళ్ళి పోయింది.

***

గంట రాత్రి ఏడున్నర—-

పడవ తాత పడవలో ఉదయం సంతకొచ్చిన జనాలు వాళ్ళవద్ద వున్న వస్తువులను అమ్ముకొని వాళ్ళకు కావలసిన వెచ్చాలను కొనుక్కొని ఒక్కొక్కరూ మర్రి చెట్టు వద్దకు చేరుతున్నారు. కొందరైతే అలా వచ్చేటప్పుడు వాళ్ళకు కావలసిన అన్నమో లేక టిఫినో తెచ్చుకు తిని హాయిగా పక్క పరచుకొని నిద్రకుపక్రమించారు ఎటూ రేపు ఉదయమే కదా పడవ వాళ్ళూరికి వెళ్ళేదన్నవుద్దేశ్యంతో.

ఆకాశంలో పిండారబోసినట్టు వెన్నెల. చల్లటి గాలి వీస్తోంది. ఆ చల్లటి గాలికి అందరూ పడుకున్న వెంటనే నిద్రపోయారు. అప్పయ్య, సీతలు కూడా రెండు టీ కొట్టు బెంచీలను ఒక్కటిగా చేసుకోని అందులో పడుకుని నిద్రపోయారు.

పడవ తాత మర్రిచెట్టుకు దూరంగా తన పడవకు దగ్గరగా పడుకోని నిద్రపోయాడు.

గంట రాత్రి పదయ్యింది.—

అందరూ బాగా నిద్ర మత్తులో వున్న సమయాన వున్నట్టుండి అక్కడికి ఓ జీపొచ్చి ఆగింది.. జీపులో నుంచి పెద్ద పొడవాటి పెట్టెలాంటి బాక్సుతో ఎస్.ఐ.ఆర్. దిగాడు. జీపు వెంటనే వెళ్ళి పోయింది. నిద్ర మత్తులో వున్నారు కనుక అక్కడికి జీపొచ్చిందీ, అందులో నుంచి ఆ పొడవాటి మనిషి ఎస్.ఐ.ఆర్. దిగింది ఎవరూ గమనించలేదు.

ఎస్.ఐ.ఆర్. ఒడ్డునున్న ఓ పడవ దగ్గరకు వెళ్ళాడు.అక్కడ పడవైతే వుంది కాని దాన్ని నడిపే చుక్కాని పరిసరప్రాంతాల్లో కనబడక పోయే సరికి ఇసుకలో మెల్లగా అడుగు తీసి అడుగు వేసుకొంటూ పడవతాత పడవ వద్దకు వచ్చాడు ఎస్.ఐ.ఆర్. చుట్టూ చూశాడు. అక్కడే గుడ్డ పరచుకొని నిద్ర పోతున్న పడవతాతను గమనించాడు. దగ్గరగా వెళ్ళాడు. పడవతాతను తట్టిలేపాడు. కళ్ళు నులుముకొంటూ పడవతాత లేచి ఆ పొడవాటి మనిషి వంక ‘ఏమిటి? ‘ అన్నట్టు చూశాడు.

“నేను ఆ దరికి వెళ్ళాలి. పడవను తీయ్!” అన్నాడు ఎస్ .ఐ.ఆర్ .

ఆశ్చర్యపోయాడు పడవతాత. “గంట పదకొండు కావొస్తుంది. ఈ వేళప్పుడు కుదరదు బాబూ! మా వాళ్ళకొరకే ఈ పడవ ఇక్కడుంది. అటు చూడండి అందురూ వ్యాపారానికి వెళ్ళొచ్చి ఏదో తెచ్చుకున్నది తిని అలసిపోయి నిద్ర పోతున్నారు. వాళ్ళకోసం వున్న ఈ పడవ రేపు వుదయం ఎనిమిది గంటలకే అందర్నీ ఎక్కించుకొని బయలుదేరుతుంది. మీరెళ్ళి రేపు వుదయం రండి. వెళ్ళండి”అంటూ మళ్ళీ పడుకోబోయాడు,

“కుదరదు. ఆ దీవిలో నాకు అర్జంటు పనుంది, నేను ఇప్పుడే వెళ్ళాలి. కూర్చొంటాను పడవను తీయ్!” అని పడవ దగ్గరకు వెళ్ళ బోయాడు.

“ఆగండయ్యా! మా వాళ్ళు ఉదయానే బయలుదేరుతారు. వాళ్ళతో పాటు మిమ్మల్ని తీసుకువెళతాను. రాత్రుల్లో నాకు పడవ నడపడం ఇబ్బందికరం.”

నవ్వి “పిచ్చోడా! వెన్నెల పిండారబోసినట్టు పట్టపగలులా వుంది, నది కూడా అలజడి లేకుండా వుంది. నన్ను తీసుకెళ్ళి ఆవల వదిలిపెట్టి వెంటనే వచ్చేద్దువు కాని… రా! నువ్వు అడిగే డబ్బిస్తాను” అంటూ వంద రూపాయల కట్టను తన ముందుకు విసిరాడు.

డబ్బును చూశాడు పడవతాత. మనసు డబ్బుమీద లగ్నమై కాస్త చలించింది, ఆకాశంలోకి చూశాడు. చక్కగా వెన్నెల కురుస్తోంది. ఆ వెన్నెలకు నది నీళ్ళు నాట్యమాడుతున్నట్టు కనబడుతున్నాయ్! పడవతాత అతని ముఖంలోకి చూశాడు. తను ఓ చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో మృత్యువు కనబడినట్టు వూహించుకొని గట్టిగా కళ్ళు మూసుకొని “కుదరదయ్యా! కావాలంటే పడవలోనే పడుకోండి ఉదయాన అందరితో మిమ్మల్ని తీసుకు వెళతాను” తెగేసి చెప్పాడు పడవతాత.

ఉగ్రుడై పోయాడు ఎస్.ఐ.ఆర్. “మర్యాదగా వచ్చి పడవను నడుపు. అటు వేపు నన్ను విడిచి పెట్టి రావడానికి కేవలం రెండు గంటలు పడుతుంది, నువ్వు తిరిగొచ్చి బాగా రెస్టు తీసుకొని ఉదయాన మీ వాళ్ళను తీసుకు వెళ్ళొచ్చు. ఆ డబ్బెంతో తెలుసా…! పది వేలు. రెండు గంటల్లో పది వేలు నీ జేబులో వుంటాయి.” పడవతాతకు ఆశ కలిగేలా మాట్లాడాడు ఎస్.ఐ.ఆర్.

అంతే! పడవ తాతకు డబ్బు మీద ఆశ కలిగింది. రెండు గంటల్లో పది వేలు. తన శేషజీవతం మొత్తం పడవ నడిపినా అంత డబ్బు సంపాయించలేడు. వెంటనే తలకు కండువాను చుట్టుకున్నాడు. తెడ్లను చేతికందుకున్నాడు, పడవను మెల్లగా నడుపుతున్నాడు. రెండు గంటల వ్యవధిలో అతన్ని అక్కడ విడిచి పెట్టి తిరిగి రావాలన్న వుద్దేశంతో.

పడవను ఆ వెన్నెల రాత్రిలో నీళ్ళతొనుకుతో అర కిలోమీటరు నడిపాడు. దాదాపు ఇంకా రెండు కిలోమీటర్లు వుంది అవతలి ఒడ్డుకు.

ఉన్నట్టుండి ఎస్.ఐ.ఆర్.బాక్సును తెరిచాడు. అందులో రెండు రకాల తుపాకులున్నై. వాటికి మధ్య పెద్ద వుండల్లాగా బాంబులను తలపిస్తూ మూడు ముద్దలున్నై.

తెడ్లు వేస్తున్న పడవతాత వాటిని చూశాడు. నిముషంలో వొణికి పోయాడు. నోట మాట రాలేదు. ఓ రకంగా అవి తుపాకులు, బాంబులని తెలిసినా ఆ విషయం ఎస్.ఐ.ఆర్. చెపితే వినాలనుకొన్నాడు. ఎలాగో దైర్యాన్ని కూడదీసుకొని “అవి ఏమిటయ్యా?” అని అడిగాడు భయపడుతూనే పడవతాత. నవ్వాడు ఎస్.ఐ.ఆర్.

“వీటిని గూర్చి నీకు తెలియాల్సిన అవసరం లేదులే! తెడ్లను త్వరగా వేసి నన్ను ఆ ఒడ్డుకు చేర్చే పని చూడు. అయినా వీటిని గూర్చి తెలుసుకొని నువ్వేం చేస్తావ్?” ఓ తుపాకిని పూర్తిగా విప్పి విడి భాగాలను తుడిచి మళ్ళీ ఒక్కటిగా చేస్తూ అన్నాడు.

“నేనేం చేస్తానయ్యా! తెలుసుకొందామని అడిగానంతే” అన్నాడు కాని తన మనసులో అతను ఎవరికో హాని తలపెట్టే వుద్దేశ్యంతోనే దీవికి వెళుతున్నాడని గ్రహించాడు.

పడవతాత ముఖంలోకి చూశాడు ఎస్.ఐ.ఆర్. తను ఏదో ఆదుర్దాతో తెడ్లను వేస్తున్నట్టు గ్రహించాడు.

“నీ పేరేమిటి” పడవతాతనడిగాడు ఎస్.ఐ.ఆర్.

“పేరెందుకులేయ్యా! నన్ను అందరూ పడవతాత అని పిలుస్తారు. మీరూ అలాగే పిలవండి.”

“ఓకే! వీటిని గూర్చి ఎంతో ఆసక్తిగా అడిగావు కనుక చెపుతున్నాను. ఇవి రెండు రకాల తుపాకులు.ఇక ఇవి వున్నాయి చూశావా బాంబులు. ఇందులో ఇదిగో ఈ ఒక్క బాంబును తీసి విసిరామంటే దాదాపు చుట్టుప్రక్కల ఒక కిలోమీటరు వరకు స్మాష్ అంటే మాడి మసై పోతుంది. ఆ పరిధిలో ఏ ఒక్కరు వున్నా మృత్యువాత పడక తప్పదు” అన్నాడు కుతూహలంతో ఎస్.ఐ.ఆర్.

పడవతాత తెడ్లను వేయడం ఆపేశాడు. ఆయనకు ఒళ్ళంతా అంతటి చల్లదనంలో కూడా చెమటలు పట్టినై. సంబాళించుకోని “పోనీ వాటినీ ఇప్పుడు రడీ చేస్తున్నారెందుకూ?” అడిగాడు.

“పనుందిలే! నువ్వు త్వరగా పోనీయ్ పడవను”

“తెలియాలయ్యా! ఆ సంగతి నాకు తెలియాలి చెప్పయ్యా! వాటిని ఇప్పుడు రడీ చేస్తున్నారెందుకూ? చెబితే తెలుసుకొని తెడ్లను త్వరత్వరగా వేస్తాను” అంటూ తెడ్లను వేయడం ఒక్క నిముషం ఆపాడు పడవతాత.

“తెడ్లను వేయడం ఆపేశావేం? చెపుతాను. తెడ్లను వేయవయ్యా బాబూ” ఎస్.ఐ.ఆర్.కి భయంతో వచ్చాయా మాటలు.

మళ్ళీ మౌనంగా తెడ్లను వేస్తున్నాడు పడవతాత, ఎస్.ఐ.ఆర్.ను, అతని పెట్టెలోని హాని కలిగించే సామగ్రిని చూస్తూ.

“అవునూ… ఇంకెంత దూరం వెళ్ళాలి మనం?”

“ఇంకో కిలోమీటరుంటుందయ్యా! అంటే ఈ బాంబులను ఆ దీవిలో వుపయోగించటానికి తీసుకు వెళుతున్నారా!?”

“కరక్టు. ఖచ్చితంగా పసిగట్టావ్. అందుకే తీసుకు వెళుతున్నాను “

“ఎందుకనయ్యా! అక్కడున్న వాళ్ళేం పాపం చేశారు? ఈ బాంబు వేస్తే దీవిలో వున్న జనం మొత్తం చచ్చిపోతారుగా!?”

“ఆఁ…వాళ్ళందర్ని చంపాలనేగా నన్ను ఇక్కడికి పంపుతున్నారు! అవును తాతా! అక్కడున్న జనం చేతిలో నాలుగొందల ఓట్లు వున్నాయ్! వాటిని మేము సపోర్టు చేస్తున్న అభ్యర్థికి వేసి గెలిపించరట. ఎవరో భూపతని మా ప్రత్యభ్యర్థికి వేసి అతన్ని గెలిపిస్తారట. అందుకే ఓట్లు వేయడానికి వాళ్ళను, ఆ వూరిని లేకుండా చేయాలని నన్ను పంపారు. నేనా ఒడ్డుకు వెళ్ళిన ఒక్కగంటలో మొత్తన్ని క్లోజ్ చేసి వెళ్ళి పోతాను” అంటూ ఆ నిశీధి వేళలో పకపక నవ్వాడు ఎస్.ఐ.ఆర్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here