పంచాయితీ పరమేశ్వరుడు

2
11

[హిందీలో మున్షీ ప్రేమ్‍చంద్ వ్రాసిన ‘పంచ్ పరమేశ్వర్’ అనే కథని ‘పంచాయితీ పరమేశ్వరుడు’ పేరిట తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు దాసరి శివకుమారి.]

[dropcap]జు[/dropcap]మ్మన్ షేక్, అల్గు ఛౌదరి ఇద్దరూ బాల్యం నుండే మంచి స్నేహితులు. పెద్దయిన తర్వాత ఇద్దరూ కలిసి వ్యవసాయం చేశారు. మరి కొన్ని లావాదేవీలు కూడా ఇద్దరూ కలిసే చేశారు. జుమ్మన్ హజ్ చేయటానికి మక్కా వెడితే అల్గు ఛౌదరే అతని ఇంటిని జాగ్రత్తగా చూసుకునేవాడు. అలాగే అల్గు ఛౌదరి కూడా పొరుగూళ్లకు వెళ్లినప్పుడు జుమ్మన్ ఆ పని చేసేవాడు. ఇరువురి మధ్య ఏనాడూ మతం కానీ, ఆచార వ్యవహారాల పట్టింపు కానీ రానే లేదు. స్నేహానుబంధాలకు మూలము మంత్రమైన ఇరువురి ఆలోచనలు మాత్రమే పంచుకున్నారు.

జుమ్మన్ తండ్రి జుక్రాతి వీరికి విద్యను బోధించాడు. అల్గు గురువుగారికి ఎంతో సేవ చేసేవాడు. తన చదువును కూడా లెక్కపెట్టకుండా గురువుగారికి నిరంతరం హుక్కా తయారు చేసి ఇచ్చేవాడు. అల్గు తండ్రికి కూడా చదువు మీద కంటే గురువుగారి సేవా శుశ్రూష మీదే నమ్మకం ఎక్కువ. గురువుగారి ఆశీస్సులుంటే చదువు దానంతట అదే వస్తుంది. ఒకవేళ రాకపోతే చదువు వచ్చే యోగ్యత అల్గుకు లేదని మాత్రమే అనుకున్నారు.

కాని గురువుగారికి మాత్రం ఆశీస్సుల పట్ల అంత నమ్మకం లేదు. వంశప్రతిష్ఠ, జ్ఞానం వలనే మనిషి ఎదుగుదల సాధ్యమవుతూందని నమ్మేవారు. దానికి తగ్గట్లు గానే జుమ్మన్ షేక్ తన వంశం మూలంగా, అమూల్యమైన జ్ఞానం వలన, చుట్టు పక్కల గ్రామాల్లో కూడా చిన్నా, పెద్దా పోస్టు.. జవాను నుండి కానిస్టేబుల్ వరకూ అందరూ గౌరవించేటట్లు చేసుకున్నాడు. జుమ్మన్ వ్రాసిన దస్తావేజుల్లో కోర్డు గుమాస్తాలు కూడా తప్పులు వెతకలేకపోయారు. కాని అల్గు ఛౌదరి మాత్రం తన సంపద కారణంగా గౌరవాన్ని పొందాడు.

***

జుమ్మన్‍కు బంధులైన ఒక ముసలి మేనత్త వున్నది. ఆమెకు భర్తా, పిల్లలు ఎవరూ లేరు. జుమ్మన్ ఆమెను మాయజేసి ఆమెకున్న ఆస్తిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ రిజిస్ట్రేషన్ అయ్యేవరకు ఆమెను ఏడుమల్లెల ఎత్తున జుమ్మన్ దంపతులు చూసుకున్నారు. పులావ్‍లు, సమోసాలు తినిపించారు. కాని కొద్ది రోజుల్లోనే వారిద్దరూ ఆమెను కర్కశంగా చూడసాగారు.

షేక్ భార్యతో ముసలి అత్త ఎంతగానో మొర పెట్టుకున్నది, తాలింపు పప్పు లేకుండా చపాతీలు కారంతో తినటం కష్టం, కాస్త మంచి తింటి పెట్టమని బతిమాలుకున్నది.

“ఏమే ముసలిదానా! ఇప్పటికీ నువ్వు తిన్న తిండితో ఒక ఊరిని కొనుక్కోవచ్చు. నోరు మూసుకుని పెట్టింది తిను” అని విదిలించి కొట్టింది.

చేసేదేం లేక అత్త జుమ్మన్ మీద ఫిర్యాదు చేసింది. కాని ఫలితం శూన్యం. తన భార్యకు ఏ మాత్రం నచ్చజెప్పలేదు. అత్త బాగోగులు పట్టించుకోలేదు.

ఏడ్చి ఏడ్చి ముసలామెకు శోష వస్తున్నది. కడుపుకు సరైన తిండి లేదు. ఒంటికి చాలినంత బట్టలేదు. చివరకు ఒక రోజు జుమ్మన్‍తో తేల్చుకోవాలనుకున్నది.

“నాయనా! జుమ్మన్! మీతో నేనిక పడలేను. నాకు కొంత డబ్బువ్వండి. నా గిద్దెడు గింజలు నేనుడకేసుకుంటాను” అంది.

“ఇక్కడ రూపాయలు చెట్టుకు కాస్తున్నాయా?” అని గద్దించాడు.

“నేనూ మనిషినే. కడుపు నింపుకోవాలా? అక్కర్లేదా?”

“ఆఁ, మరే పాపం చచ్చి బతికి వచ్చావాయె. రకరకాల రుచులతో భోజనం కావాల్సి వచ్చింది.” అన్నాడు వెటకారంగా.

ముసలామెకు విసుగు, కోపంతో వచ్చాయి. ఆ పై దుఃఖం కూడా ముచ్చింది. “ఇలా అయితే నేను పంచాయితీ పెడతాను” అన్నది.

వలవైపుకి వెళ్తున్న జింకను చూసి వేటగాడు లోలోపల నవ్వుకున్నట్లుగా జుమ్మన్ కూడా నవ్వుకున్నాడు. పైకి మాత్రం “అలాగే. ఖచ్చితంగా పంచాయితీ కెల్లు, రాత్రింబగళ్లు నేనూ నీ గోల పడలేక పోతున్నాను” అన్నాడు.

పంచాయితీ తీర్పు తనకు అనుకూలంగానే వస్తుందని జుమ్మన్‍కు బోలెడు నమ్మకం. ‘చుట్టు పక్కల గ్రామాలలో అయినా సరే నా సాయం పొందని వారెవరున్నారు? నాకు వ్యతిరేకంగా, సాక్ష్యం చెప్పి శత్రుత్వం పెంచుకునే వాళ్లెవరైనా వుండటం కల్లో మాట. అంత ధైర్యంగా ముందుకొచ్పి నన్నెదుర్కోగలిగే సత్తా ఎవరి కుంది? స్వర్గం నుండి దేవదూతలేం పంచాయితీ తీర్పు చెప్పటానికి దిగిరారు గదా!’ అనుకున్నాడు ధీమాగా.

ఆ తర్వాత ముసలామె చేతికర్ర తాటించుకుంటూ వంగిన నడుముతో ప్రతి అడుగూ భారంగా వేసుకుంటూ ఎంతోమంది దగ్గరకు తిరిగి తన గోడు వెళ్ళబోసుకున్నది. కొంతమంది మనసున్న వాళ్ళకి కన్నీళ్లు వచ్చాయి. మరికొందరు భుజం తట్టి ధైర్యం చెప్పారు. మరికొందరు అన్యాయం చేసిన వారికి శాపనార్థాలు పెట్టారు. “ఇవ్వాళ చస్తే, రేపటికి రెండు రోజులవుతాయి, కాని బతికినంత వరకూ పొట్ట నింపుకోవాలిగా”, అన్న ఓదార్పు మాటలు చెప్పారు. అత్త వంగిన నడుం, చింపిరి జుట్టు, బోసి నోరు, ఆ నోటితో ఆవిడ చెప్పే మాటలకు వినోదంగా నవ్వుకున్నారు. అంతేకాని ఎవరూ కూడా ముందుకు వచ్చి పంచాయితీ పెద్దగా ఉండటానికి ఒప్పుకోలేదు. ఆమె తిరిగి తిరిగి చివరికి అల్గు ఛౌదరి దగ్గరకు వచ్చి విషయమంతా చెప్పింది. న్యాయం చెప్పమని బతిమాలు కున్నది. “నన్నెందుకు అడుగుతున్నా వమ్మా, ఊర్లో చాలామంది పంచాయితీ కొస్తారు. పెద్దలుగా కూర్చుంటారు. నీకు న్యాయం చేస్తారు. నన్నొదిలెయ్” అన్నాడు.

ముసలామె ఛౌదరిని పట్టుకుని ఏడ్చేసింది. “నాయనా! నువ్వు రాకపోయినా నేను చేయగలిగింది ఏమీ లేదు. నిన్ను ఒత్తిడి చేసే హక్కు నాకు లేదు. కానీ నా పరిస్థితిని అర్థం చేసుకో” అంటూ బావురుమన్నది.

దాంతో ఛౌదరి జాలిపడి “నేను పంచాయితీ కొస్తానమ్మా. కాని నేను కలగజేసుకోలేను” అన్నాడు.

“ఎందుకు బిడ్డా!”

“నేను నీకు ఎలా చెప్పాలమ్మా? మీ సంతోషం కోసం నేనక్కడికి వస్తే జుమ్మన్‍తో విరోధం వస్తుంది. మేమిద్దరం ఎంత స్నేహితులమో నీకూ తెలుసు.”

“చూడు బిడ్డా! స్నేహం కోసం న్యాయాన్ని, నువ్వు తెలుసుకుని నమ్మినదాన్ని విడిచిపెడతావా?”

ముసలామె మాటలకు ఛౌదరి జవాబు చెప్పలేక పొయ్యాడు. కాని ఆ మాటలే మనసులో ప్రతిధ్వనించసాగాయి.

***

ఆ సాయంత్రం చెట్టు కింద పంచాయితీ పెట్టారు. షేక్ జుమ్మన్ అక్కడి నేలంతా శుభ్రం చేయించాడు. వచ్చేవాళ్ల కోసం తమలపాకులు, హుక్కా, పొగాకు లాంటి ఏర్పాట్లన్నీ చేశారు. అల్గు ఛౌదరి కూడా పంచాయితీ కొచ్చాడు. అతణ్ని దూరంగా చూసి జుమ్మన్ మౌనంగానే స్వాగతం చెప్పాడు.

సూర్యాస్తమయం కావస్తుంది. చెట్ల మీద పక్షులు చేరి అవీ వాటి పంచాయితీ పెట్టుకున్నాయి. పంచాయితీకి చాలా మంది వచ్చారు. నేలంతా జనంతో నిండిపోయింది. కాని వారిలో ఎక్కువమంది ప్రేక్షకులు గానే వుండిపోవటానికి ఇష్టపడ్డారు. జుమ్మన్‍తో అవసరం వున్న వారు మాత్రం మర్చిపోకుండా వచ్చి కూర్చున్నారు. హుక్కా తయారవుతున్నది. అది పట్టుకుని కుర్రాళ్ళు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. హుక్కాలో నుంచి గుప్పుగుప్పున పొగ వస్తూ అంతటా కమ్మేసింది. బాగా సందడిగా వుండేటప్పటికి ఏదో విందు జరుగుతుందని ఊరకుక్కలు గుంపుగా చేరాయి.

ఐదుగురు పంచాయితీ పెద్దలుగా కూర్చున్నారు. వాళ్లు రెండు పక్షాల వాదనలు వింటారు. ముసలి అత్త తన గోడు వెళ్లబోసుకోవటం మొదలు పెట్టింది. “పంచాయితీ పెద్దలారా! నా ఆస్తినంతా మూడేళ్ళ కిందట నా మేనల్లుడు జుమ్మన్‍కు రాసిచ్చాను. రాయించుకున్న రోజు – నాకు సరైన తిండీ, బట్టా ఇచ్చి నన్ను పోషిస్తానని మాటిచ్చాడు. కాని జుమ్మన్ భార్య నన్ను ఏడిపించని రోజు లేదు. నా కడుపు నిండిన రోజూ లేదు. ఇలా సరైన బట్ట లేకుండా, కడుపుకు తిండి లేకుండా నేనూ ఇంక ఏడుస్తూ బతకలేను. వాళ్లకు నేనెందుకూ పనికి రాని దానినయ్యాను, ఈ వయసులో నేను కోర్టుకెళ్లలేను. నా బాధలు ఈ పంచాయితీతో కాక ఎవరికి చెప్పుకోను? అందుకే మిమ్మల్ని తీర్పు చెప్పమంటున్నాను. మీరు ఏ సూచన చేసినా నేను ఒప్పుకుంటాను. నాలో ఏదైనా తప్పుంటే చెప్పండి. సరిచేసు కుంటాను. జుమ్మన్‍లో ఏదైనా చెడు కనపడితే సరిచెయ్యండి. ఏమీ లేని బిచ్చగాడిలా మారి నన్నెందుకిలా మాడుస్తున్నాడో అతనికి విప్పి చెప్పండి.”

రాంధన్ మిశ్రా లాంటి కొద్ది మంది మాత్రం జుమ్మన్ వలన నష్టపడ్డవారే. వారు శ్రద్ధగా గమనిస్తున్నారు. ఇపుడు శిక్ష ఎవరికి? జమ్మన్ భార్యకా? అత్తకా? ఎవరైనా సరే పంచాయితీ తీర్పును పాటించాల్సిందే అనుకున్నారు.

తనతో శత్రుత్వమున్న వారిని జుమ్మన్ అక్కడ గమనించాడు. అత్త మాటలకు తను సమాధానమివ్వటం మొదలుపెట్టాడు.

“పంచాయితీ ఆజ్ఞ సాక్షాత్తు అల్లా ఆజ్ఞే. మా అత్త ఎవరినైనా తన మాటలతో మార్చేయగలదు. అందుకే ఇక్కడ నాకు పొసగని వారిని పోగుచేసింది” అన్నాడు.

అత్త పెద్దగా అరుస్తూ “హే అల్లా! జుమ్మన్! నీకు మిత్రులెవరూ లేరా ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావు? ఆ మాత్రం నాకూ తెలుసు” అన్నది.

“నన్నసలు మాట్లాడనివ్వవా? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నీకు కావలసినవారినే తెచ్చి పెట్టుకో” అన్నాడు కోపంగా

అత్త మేనల్లుడి అనుమానాన్ని అర్థం చేసుకున్నది. “బిడ్డా! ఇక్కడ కూర్చున్న వాళ్లకు కాదు. అల్లాహ్‍కు భయపడు. పంచాయితీ ఎవరికీ మిత్రుడు కాదు, శత్రువు కాదు. నువ్వెందుకలా అనుకుంటున్నావు! నీకు వీళ్ల మీద నమ్మకం లేకపోతే వదిలేయ్. నువ్వు అల్గు ఛౌదరిని నమ్ము. అతణ్ణే న్యాయం చెప్పమందాం” అన్నది.

‘అల్గు అయితే బాగుంటుంది. అతను నావాడే’ అనుకుని సంతోషపడ్డాడు. ఆ సంతోషాన్ని మాత్రం బయటకు కన్పించ నివ్వలేదు.

కాని అల్గు పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇటువంటి సమయంలో తను న్యాయమూర్తిగా ఉండటం సబబు కాదనుకున్నాడు. “అమ్మా! జుమ్మన్ నాకు మంచి స్నేహితుడు. ఆ సంగతి నీకు తెలుసు” అన్నాడు. అత్త మాత్రం, గంభీరంగా “బిడ్డా! స్నేహితుడి కోసం తన పరువును ఎవరూ తీసుకోరు. పంచాయితీ హృదయంలో, వాక్కులో దేవుడే ఉంటాడు. పంచాయితీ వారి నోటి నుండి వచ్చినది భగవంతుని వాక్కే” అన్నది.

చివరకు ఒప్పుకొని అల్గు ఛౌదరి పంచాయితీ పెద్దగా, న్యాయమూర్తిగా అయ్యాడు. అది చూసి జుమ్మన్ శత్రువులు ముసలి అత్తను తిట్టుకున్నారు. ‘ఆఁ.. ఇక తీర్పు ఏంటో వినక్కరలేదు. ఈ ముసల్దానికి వున్న మతి కూడా పోయింద’నుకున్నారు.

అల్గు ఛౌదరి విచారణ ప్రారంభించాడు.

“జుమ్మన్ షేక్! మనం పాత స్నేహితులం. ఎన్నో సార్లు మనమిద్దరం ఒకరి కొకరం సాయం చేసుకున్నాం. కాని ఇప్పుడు.. ఇప్పుడు నేను మీ ఇద్దరి మధ్యా తీర్పు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మీరిద్దరూ నాకు సమానమే. పంచాయితీకి, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి.” అన్నాడు.

ఆ మాటలు విని అల్గు పూర్గిగా నా వాడే, ఏదో జనం కోసం ఇలా మాట్లాడుతున్నాడని జుమ్మన్ అనుకోసాగాడు. “న్యాయవర్తీ! అత్త నాకు ఆస్తి ఇచ్చి మూడేళ్ళయింది. నేనామెను ఆనాటి నుండి బాగానే చూసుకుంటున్నాను. దాని అల్లానే సాక్షి. ఇప్పటివరకు నేను ఆమెను తల్లి గానే భావిస్తున్నాను. కానీ మా ఇంట్లో ఆడవారికి, అత్తతో పడటం లేదు. దానికి నేనేం చేయగలను? అత్త నన్నిప్పుడు నెలవారీ ఖర్చులకు డబ్బడుగుతున్నది. తను వేరే వండుకుంటానంటున్నది. ఆమె ఆస్తి నుండి వచ్చే ఫలసాయంతో అది వీలు కాదు. ఇంట్లో మాతో పాటు ఒక ముద్ద అయితే పెడతాం గాని. అదే కాక ఆమె నాకు రాసిచ్చిన దానపత్రంలో తిండీ, బట్టా ఇవ్వాలని మాత్రమే వున్నది. నెలవారీ ఖర్చుల సంగతి రాసుకోలేదు. లేకుంటే పొరపాటున గూడా, నేను ఇలాంటి పరిస్థితి రానిచ్చే వాడిని కాదు. ఇప్పుడిక మీ ఇష్టం. ధర్మం ప్రకారం మీరు న్యాయం చెప్పొచ్చు” అన్నాడు.

అల్గు ఛౌదరికి తరచూ కోర్టు కెళ్ళే పనిబడేది. అతనికి చట్టమూ బాగా తెలుసు. ఆ అలవాటుతో జుమ్మన్‌ను విచారణ చేయడం మొదలుపెట్టాడు. అతని ప్రతి ప్రశ్న జుమ్మన్ హృదయాన్ని సమ్మెటలా తాకింది. ఆ ప్రశ్నలు విన్న ప్రేక్షకుల్లో వున్న రాంధన్ మిశ్రా విస్తుపోయాడు.

ఈరోజు అల్గుకు ఏమైందని జున్మన్‌కు నోట మాట రాలేదు. ‘ఇప్పటి వరకు అల్గుతో నేను ఎన్నో విషయాలు మాట్లాడి వున్నాను. ఇంత తక్కువ సమయంలో అల్గులో, నా మూలాలను తవ్వేంతగా మార్పు కన్పిస్తున్నది. అతను దేనికి బదులు తీర్చుకుంటున్నాడో తెలియటంలేదు. ఇన్ని రోజుల మా ఇద్దరి స్నేహం వలన ఏమీ ఉపయోగం వుండదా?’ అనుకున్నాడు.

అల్గు తీర్పునిచ్చాడు. జుమ్మన్ షేక్ ఆలోచనలో పడ్డాడు.

“జుమ్మన్ షేక్! మీ వివాదాన్ని పంచాయితీ వారు పరిశీలించారు. మీ అత్తకు నెలవారీ ఖర్చులు చెల్లించాలనే అనుకుంటున్నారు. అత్త ఆస్తి ఆమె నెలవారీ ఖర్చులకు బాగా సరిపోతుందనే తేలింది. ఇంకా మా నిర్ణయం ఏంటంటే అలా ఖర్చులు చెల్లించటం ఇష్టం లేకపోతో నీకిచ్చిన దానపత్రం రద్దు అవుతుంది.”

ఆ మాటల్ని విన్న జుమ్మన్ మానం వహించారు. ‘స్నేహితుడు అనుకున్నవాడు శత్రువులాగా ప్రవర్తించి గొంతుపై కత్తి పెట్టటాన్ని కాలదోషం కాక మరేమంటాం? మనం పూర్తిగా నమ్మిన వ్యక్తి సరైన సమయంలో ద్రోహం చేశాడు. ఇలాంటి సందర్భాల లోనే నిజమైన స్నేహితుడెవరో తెలిసిపోతుంది. నిజంగా ఇది కలియిగ స్నేహమే. ఇలాంటి ప్రవర్తన వలనే సమాజంలో అరాచకాలు, అనారోగ్యాలు కూడా కలుగుతున్నాయి’. జుమ్మన్ ఆలోచనలు ఇలా సాగాయి.

రాంధన్ మిశ్రా, మరి కొందరు ఇతర పంచాయితీ సభ్యులు అల్గు ఛౌదరి యొక్క నిజాయితీని, నైతికతను బహిరంగంగానే మెచ్చుకున్నారు. అసలైన పంచాయితీ, అసలైన తీర్పు అంటే ఇదే. పాలను పాలుగా, నీటిని నీటిగా మార్చబడింది. స్నేహం వుండాలి. కాని నమ్మిన సత్యాన్ని అనుసరించటం అన్నిటికన్నా ముఖ్యం. ఇటువంటి సత్యబలంతోనే భూమి పది కాలాల పాటు స్థిరంగా వుంటుంది. లేకుంటే అది పాతాళానికి పోతుంది.

ఈ తీర్పు అల్గు, జుమ్మన్‍ల స్నేహవృక్షం మూలాలను కదిల్చి వేసింది.

ఇసుక నేలపై నిలబడ్డ జమ్మున్ ఈ తీర్పును జీర్ణించుకోలేకపోతున్నాడు. అత్త పరిస్థితి మాత్రం మెరుగుపడింది. ఆదరణ దొరుకుతోంది. కత్తి డాలును చీల్చినట్టుగా, మిత్రుడి మోసం జుమ్మన్ మనసును కోయసాగింది. ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం కాచుకుని వున్నాడు.

***

మంచి పని సాధించాటానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి కానీ చెడ్డ పనులు తేలిగ్గానే చెయ్యొచ్చు. ఇప్పుడు జుమ్మన్‌కు అవకాశం అందినట్లే వున్నది. గత సంవత్సరం బాటేసర్ నుండి అల్గు ఛౌదరి మంచి సంకరజాతి ఎద్దుల్ని కొనుగోలు చేశాడు. పెద్ద పెద్ద కొమ్ములతో చాలా అందంగా వున్నాయి. వాటిని చూడటానికి జనం నెలల తరబడి వచ్చారు. అలాంటి ఎద్దుల్లో ఒక ఎద్దు ఇప్పుడు చనిపోయింది. “ఇది నాకు చేసిన ద్రోహానికి దేముడు వేసిన శిక్ష కాదా?” అని జుమ్మన్ మిత్రుల దగ్గర అన్నాడు.

జుమ్మనే తన ఎద్దును విషం పెట్టి చంపాడని అల్గు ఉద్దేశం. ఇదే మాట అత్త, ఛౌదరి భార్య కూడా అనుకున్నారు.

ఇప్పుడు ఒక్క ఎద్దుతో ఏ పనీ జరగదు. దాని జంట ఎద్దు కోసం ఎంత వెదికినా దొరకలేదు. ఉన్నదాన్ని కూడా అల్గు ఛౌదరి అమ్మేశాడు. సంజు సాహు అనే వ్యక్తి బండి బాడుగ తోలుకోవటం కోసం ఎద్దును కొన్నాడు. నెల రోజుల్లో డబ్బు ఇస్తానని చెప్పాడు. ఎద్దు మంచి బలిష్ఠంగా వుంది కాబట్టి రోజుకు మూడు, నాలుగు దపాలు సరుకుల లోడు వేసి దాన్ని పరుగులు పెట్టించసాగాడు. ఊరి లోని నెయ్యి, బెల్లం కొనుగోలు చేసి మార్కెట్‌కు తోలడం, మార్కెట్ నుండి నూనె, ఉప్పు తెచ్చి అమ్ముకోవటం చేస్తాడు. ఎద్దు చేత పనిచేయించాలనే ధ్యాసే కాని దానికి మంచి మేత వేయాలని, సరైన టైముకు నీళ్లు తాగించాలన్న ధ్యాస వుండేది కాదు. విశ్రాంతి ఇచ్చే ఊసే లేదు. దాన్ని తిన్నగా ఊపిరి కూడా తీసుకోనిచ్చేవాడు కాదు. అల్గు ఛౌదరి ఇంట్లో అయితే ఆరు నెలల కోసారి పొలం దున్నటం, మిగతా సమయంలో పరుగులు పెట్టించటం చేసేవాళ్లు. మంచి మేతా, నీళ్లు, ఉడికిన కందిపప్పు, నెయ్యి కూడా తినిపించేవారు. రోజూ ఒక వ్యక్తి ఎద్దుకు గడ్డితో రుద్దటం, నిమరటం చేసేవాడు. అలాంటి ప్రశాంతత ఇక్కడ లేనే లేదు. ఒక్కనెల లోనే ఎద్దులోని జీవం పోయి, ఎముకలు పొడుచుకు వచ్చాయి. ఇలాంటి స్థితిలో కూడా కొరడా దెబ్బలు తినేది.

ఆరోజు సాహు నాల్గో దఫా నూనె, ఉప్పు బండికి లోడు వేసి ఊరికి చీకట్లో తిరిగొస్తున్నాడు. ఎద్దుకు ఓపిక లేక అడుగు కూడా సరిగా వేయలేకపోతున్నది. రాత్రవుతుందని అదే పనిగా బాదసాగాడు. పరుగు లంకించుకున్నది కాని శ్వాస కూడా అందటం లేదు. సాహు కొట్టటం మానలేదు. బరువు లాగలేక ఒక్కసారిగా నేలన కూలిపోయింది. సాహు కసిగా కాలితో తన్నాడు. ఎద్దును లేపాలని చాలా రకాలుగా ప్రయత్నించాడు. దాని ముక్కురంధ్రాలలో పుల్లలు పెట్టి తిప్పాడు. అయినా ఎద్దులో చలనం లేదు, సాహుకు అప్పుడు అనుమానం వచ్చింది. ఎద్దు కనురెప్పలు తెరిచి పరీక్షగా చూశాడు. నోరు కూడా తెరిచి చూశాడు.

‘ఓరి దేవుడో! ఈ ఎద్దు ఇంటికెళ్ళిందాక కూడా వుండకుండా దారి లోనే చచ్చింది. ఈ రాత్రిపూట సరుకునేం చేయాలో!’ అన్న గాభరాతో “ఎవరైనా వున్నారా?” అని బిగ్గరగా అరిచాడు.

ప్రొద్దుగుంకగానే పసిపిల్లలకు రెప్పలు నిద్రకు పడ్డట్టు గానే పల్లె దారులు కూడా నిర్మానుష్యంగా, మూసుకుపోతాయి. సమీపంలో ఏ గ్రామమూ లేదు. అటూ ఇటూ వచ్చే మానవ సంచారమూ లేదు. కోపం పట్టలేక దగ్గర్లో దొరికిన రాళ్ళను ఏరి ఎద్దును సత్తువ కొద్దీ ఆ రాళ్లతో కొట్టాడు. “ఇప్పుడు బండెవడు లాగుతాడు? నీ తాతా?” అని తిడుతూ, కాళ్లతో, చేతుల్తో మోదసాగాడు.

ఎన్నో బుట్టల బెల్లం, నెయ్యి అమ్మగా వచ్చిన రెండు వందల యాభై రూపాయల సంచీ నడుముకి కట్టుకుని వున్నాడు. ఇంకా బండిపై నిండుగా నూనెడబ్బాలు, ఉప్పు బస్తాలు పేర్చి వున్నాయి. వాటిని వదిలి పెట్టి సాహు ఇంటికి వెళ్లలేకపొయ్యాడు. రాత్రంతా మేల్కొని వుండాలని నిర్ణయించుకున్నాడు. దొరికిన గడ్డీ గాదంతో మంట వేసుకుని కొంచెం సేపు గడిపాడు. అర్ధరాత్రి అయింది. ఆ తరువాత తెలియకుండానే నిద్ర లోకి జారుకున్నాడు. తెల్లవారుఝామున మెలకువ వచ్చింది. నడుమున కట్టుకున్న డబ్బు సంచీ, బండిలోని చాలా నూనె డబ్బాలు లేవు. తెల్లవారిన తరువాత బండితో సహా ఇంటికి చేరుకున్నాడు. విషయం తెలియగానే సాహు భార్య శోకాలు పెట్టి ఏడ్చింది. అల్గు ఛౌదరిని, అతని ఎద్దును శాపనార్థాలు పెట్టసాగింది.

“దుర్మార్గుడు! పనికిమాలిన ఎద్దును అంటగట్టాడు. మా కష్టార్జితమంతా నాశనమైంది” అని రకరకాలుగా తిట్లు లంకించుకున్నది ముక్కు చీదుకుంటూ.

కొన్ని నెలలు గడిచిన తర్వాత అల్గు ఛౌదరి తన ఎద్దు ధర చెల్లించమని అడిగాడు. సాహు, అతని భార్య కాట్లకుక్కల్లా అల్గు మీద విరుచుకుపడ్డారు. “మా జీవితాలు నాశనం చేశావు. పనికి కాని ఎద్దును అంటగట్టి ఇంకా ఏం ముఖం పెట్టుకొని డబ్బులిమ్మంటున్నావు? మేమూ వ్యాపారస్థులమే కాని మూర్ఖుళం కాదు. నీకంతగా రేటు కావాలంటే మా ఎద్దును తోలుకుపో. పొలం దున్నటానికి మా తిప్పలేవో మేం పడతాం. ఎద్దు చాలా? ఇంకా ఏమైనా కావాలా?” అని తిట్టి పంపారు.

ఈ సమాజంలో దుర్మార్గులకేం కొదవలేదు. అలాంటి వారు కొందరు సాహును సమర్థించి, వత్తాసు పలికారు. అలా అని చూస్తూ చూస్తూ ఎద్దు వెల 150 రూపాయలు పోగొట్టుకోకూడదని చౌదరి ఆలోచించాడు. నచ్చచెప్తామని మరో మారు సాహు ఇంటికెళ్లాడు. సాహు భార్య తగవుకొచ్చింది. గొడవ విని చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు. పెద్ద రగడే జరిగింది. సాహు భార్య లోపలికెళ్లి తలుపులు బిగించుకున్నది. మరి కొంతమంది కూడా పోగయ్యారు. “ఇలా మాటల్తో పని జరగదు. పంచాయితీ పెట్టండి. పంచాయితీ తీర్పు ఏం చెప్తుందో వినండి” అని సలహా ఇచ్చారు. అల్గు కూడ సరేనన్నాడు.

***

పంచాయితీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు అల్గు, ఇటు సాహు తమ తమ బలాలను పోగు చేసుకుంటున్నారు. ఆ మూడోరోజు పంచాయితీకి ఏర్పాట్లు జరిగాయి. అది సాయం సమయం. పొలాల్లో కాకులు కూడా పంచాయితీ పెట్టుకున్నాయి. అది మానవుల గురించే. వీరు బఠాణీ కాయల లాంటి వారు, తమ స్నేహితులకు ద్రోహం చేయటానికి వెనుకాడరు. వారేమో మన కాకుల్ని పనికిమాలినవని నిందిస్తారు. వారికా హక్కు ఎక్కడిదని వాటి ప్రశ్న.

పంచాయితీ పెద్దలు కూర్చున్నారు. రాంధన్ మిశ్రా నోరు విప్పాడు. “ఇంకా ఆలయం ఎందుకు? పంచాయితీ పెద్దలు న్యాయవర్తిని ఎన్నుకోండి. ఛౌదరి చెప్పు, ఎవర్ని ఎన్నుకొంటావు?”

అల్గు ఛౌదరి వినయంగా అన్నాడు “నేను సాహును అర్థం చేసుకున్నాను. అతన్నే ఎన్నుకోమందాం.”

సాహు లేచి నిలబడి గట్టిగా “నేను జుమ్మన్ షేక్‍ను ఎన్నుకుంటున్నా” అన్నాడు.

ఆ పేరు వినగానే అల్గు కలవరపడ్డాడు. ఎవరో చెంప మీద లాగి కొట్టినట్లుగా అయింది. రాంధన్ మిశ్రా ఛౌదరి స్నేహితుడు. అతనికి పరిస్థితి అర్థమయింది. “ఛౌదరీ! నీకు ఇష్టమేనా?” అన్నాడు.

“నాకేం అభ్యంతరం లేదు” అన్నాడు చౌదరి నిరుత్సాహంగా.

మనం ఎప్పుడైనా సరైన మార్గాన్ని కోల్పోయినప్పుడు జ్ఞానం మనకు నమ్మకమైన మార్గదర్శి అవుతుంది. దానికి ఉదాహరణ ఒక పత్రికా విలేఖరి మామూలు వ్యక్తిగా వున్నప్పుడు మంత్రివర్గం మీద తన రచనలతో దాడి చేస్తాడు. అదే తను, మంత్రివర్గంలో చేరినట్లైతే అప్పుడు తన ఆలోచనలు న్యాయంగా, ఆలోచనాపూర్వకంగా వుంటాయి. అలాగే యువకులు కూడా తమ యవ్వనంలో బాధ్యతారహితంగా వుండి తాము స్వయంగా కుటుంబ బాధ్యతలు మోసేటపుడు ఎంతో బాధ్యతగా మెలగుతారు. ఇప్పుడు జుమ్మన్ షేక్ పరిస్థితి కూడా సరిగా ఇలాంటిదే. తను పంచాయితీ న్యాయవర్తిగా ఎన్నుకోబడగానే అతని మానసిక స్థితి మారిపోయింది. ‘ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఏం మాట్లాడినా అది దైవ వాక్కే అవుతుంది. నేను సత్యమే పలకాలి’ అనుకున్నాడు.

మధ్యవర్తులు ఇరుపక్షాల వారిని ప్రశ్నలడిగి, జవాబులు రాబట్టారు.

సంజు, ఎద్దు ధర చెల్లించాల్సిందేనని అందరూ ఒప్పుకున్నారు. కాని ఆ ఎద్దు త్వరగా చనిపోయింది కాబట్టి, సంజుకు నష్టం కలిగించినందు వలన ఎద్దు ధరలో రాయితీ ఇవ్వాలని అడుగుతున్నాడు. ఈ మాటతో కొందరు ఏకీభవించలేదు. ఎద్దును క్రూరంగా హింసించి చంపాడు కాబట్టి అతనికి శిక్ష పడాలి. అప్పుడే జంతువుల్ని చెండుకు తినే వాళ్లకు భయం కలుగుతుందని వాదించారు.

వాదనలన్నీ విని జుమ్మన్ షేక్ తన తీర్పును చెప్పాడు.

“మధ్యవర్తులైన పంచాయితీ పెద్దలు ఈ కేసును పరిశీలించారు. ఎద్దు ధర ఇవ్వనని సంజు అంటున్నాడు. కాని అతను ఛౌదరి దగ్గర ఎద్దును కొన్నప్పుడు దానికి ఎటువంటి జబ్బూ లేదు, బలిష్ఠంగా కూడా వున్నది. ఆ సమయం లోనే ధర చెల్లించాల్సి వుండి కూడా చెల్లించలేదు. అలా అయితే ఈ రోజు సంజుకు ఇలా మాట్లాడే అవకాశముండేది గాదు. ఎద్దుకు సరైన తిండి పెట్టక, అధిక శ్రమ చేయించటం వలన ఎద్దు చనిపోయింది. దీనికి సంజుకి తప్పకుండా శిక్ష పడాలి.” అన్నాడు.

ఆ మాటలు విని “కొంతైనా రాయితీ ఇప్పించండి” అని సాహు బతిమాలుకున్నాడు.

“అది అల్గు ఛౌదరి ఇష్టం. ఛౌదరి మంచి మనసుతో రాయితీ ఇస్తే తీసుకోవచ్చు..” అని గూడా జుమ్మన్ అన్నాడు. ఛౌదరి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. లేచి నిలబడి “పంచాయితీ పరమేశ్వరుడికి జై” అన్నాడు బిగ్గరగా.

దాంతో మిగతావారు కూడా అలాగే అరిచారు, “పంచాయితీ పరమేశ్వరుడికి జై. ఇది మనుషుల వాక్కు కాదు. దేవుడి వాక్కే. నిజంగా పంచాయితీలో పరమేశ్వరుడుంటాడు. అబద్ధాలు నిలబడవు. నిజాయితీ మాత్రమే నిలబడుతుంది..”

కొంచెం సేపటికి జుమ్మన్, ఛౌదరి దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నాడు. “ఛౌదరీ! నువ్వు నా కేసును పంచాయితీ చేసేటప్పుడు నిన్ను నేను చాలా ద్వేషించాను. అప్పటి నుండీ శత్రువులా చూశాను. కానీ ఈ రోజు న్యాయవర్తిగా కూర్చొనప్పుడు తెలిసి వచ్చింది. పంచాయితీకి ఎవరూ శత్రువులు కాదు, ఎవరూ మిత్రులు కాదు. దేవుడి వాక్కే పంచాయితీ నోటి నుండి వస్తుందని నమ్ముతున్నాను” అన్నాడు.

ఆ మాటలు విన్న ఛౌదరి కళ్ల వెంట నీళ్లు కారసాగాయి. ఇద్దరి హృదయాల్లోని మలినాలు, ఆ నీటిలో కొట్టుకుపోయి మాడిపోయిందనుకున్న ఇద్దరి స్నేహతీగ మళ్లీ పచ్చగా మారింది.

హిందీ మూలం: మున్షీ ప్రేమ్‌చంద్

తెలుగు సేత: దాసరి శివకుమారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here