రంగుల హేల 10: పండితుల అపండితత్వాలు

2
9

[box type=’note’ fontsize=’16’] “అందరికీ మరాళం వలె పాలనూ నీళ్ళనూ వేరు పరిచే ప్రజ్ఞ లేకపోవచ్చు. కనీసం తమ అపండితత్వాన్ని దాచుకోవడానికి తగిన పాండిత్యం తప్పనిసరి” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]మా[/dropcap] బాటనీ డిపార్ట్‌మెంట్ హెడ్ భాస్కర్ రావు గారు అంటుండే వారు ప్రతి వాళ్ళకీ కొంత ఇడియాసిటీ ఉంటుందని. చాలా పెద్ద వాళ్లకి చిన్న విషయాలు తెలీవని. సరే వాటిని ఒప్పుకోవచ్చు. పేద్ద డాక్టర్ గారికి మూడో క్లాస్ పిల్ల పాఠంలో ఉన్న కొన్ని విషయాలు తెలీకపోవచ్చు. కానీ ప్రముఖులైన కొందరు పెద్దవాళ్ళిచ్చే కొన్ని స్టేట్‌మెంట్స్, చేసే పనులు మనకి చిరాకును పుట్టిస్తాయి. ఇరిటేషన్ తెప్పిస్తాయి. బీ.పీ. పెంచుతాయి.

ఒక సెంట్రల్ జైలును సందర్శించిన ఒక రాష్ట్రాధిపతి అంటారు “చిన్న చిన్న నేరాలకు పెద్ద పెద్ద శిక్షలు పడకుండా ఉండే విధంగా నేను చర్యలు తీసుకుంటాను” అని. శిక్షలు భారతీయ శిక్షాస్మృతి ననుసరించి పడతాయి దానిని ఈయనెలా సవరిస్తారు? ఈయన దయార్ద్ర హృదయంతో ఏమైనా చేయగలడా ఆ విషయంలో? ఖైదీల సంక్షేమం దృష్ట్యా, అక్కడి జైలు వాతావరణం ఎలా ఉంది? వారికి సరైన తిండి సదుపాయం ఉందా? వాళ్ళ ఆరోగ్యం గురించి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా? వారిలో పరివర్తన దిశగా వారికి ఏమైనా శిక్షణ ఉందా? వారికి మంచి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా? పై చదువులు చదవాలనుకున్నవారికి అవకాశం ఉందా? అన్న విషయాలపై సదరు రాజకీయ నాయకుడు శ్రద్ధ తీసుకుని వివరాలు కనుక్కుని తగు సూచనలు చేస్తే బావుంటుంది కానీ ఆ స్టేట్‌మెంటు లేమిటి? అని ఎవరైనా చిరాకుతో అవాక్కవక తప్పదు.

ఒక సీనియర్ సినీ హీరో గారు స్వయంగా చిత్ర నిర్మాతగా ఉండి అనేక హింసాత్మక, శృంగారాత్మక హిట్ సినిమాలు నిర్మించి బాగా లాభపడి కొడుకును హీరోగా నిలబెట్టి ఆనక ఒక అవార్డుల సభలో గెస్టుగా వచ్చి సినిమాల్లో వయోలెన్స్, అసభ్యత పెరిగిపోయాయని తమ రోజుల్లో అలా ఉండేది కాదని సన్నాయి నొక్కులు నొక్కుతుంటాడు. ఆ స్పీచ్‌కి మనకి కడుపులో మండుతుంటే మిడిగుడ్లేసుకుని చూస్తూ ఉండాల్సిందే !

బాలీవుడ్ చిత్రసీమను దశాబ్దాలుగా ఏలిన బిగ్-బీ గారు అనేక గొప్పగొప్ప చిత్రాల్లో నటించి తన్నుతాను నిరూపించుకున్నారు. దేశంలో అత్యధిక పారితోషికం కూడా తీసుకున్న హీరోగా పేరున్న ఆయన, అనునిత్యం అనేక యాడ్స్‌లో దర్శనమిస్తూ మన సహనాన్ని పరీక్షించే ఆయన అంతటితో ఆగలేదు. చపలత్వం అధికమై సొంత కొడుకు భార్య, ఓ సినిమాలో చేసే అర్ధ నగ్న డాన్స్‌లో కొడుకుకు పోటీగా ఆమె మీద పడుతూ డాన్స్ చేసాడు చూసే వాళ్ళకి రోత పుట్టేటట్టు. అయితే మనం ఏమీ చెయ్యలేం పళ్ళు కొరుక్కుని కోపాన్ని మింగడం తప్ప.

మా ఆఫీసులో ఒక పెద్దాయన ఫైనాన్స్ సెక్షన్‌లో మేనేజర్‌గా ఉండేవాడు, మొహమంతా బొట్లూ- నామాలతో చూడగానే ఆయన సిద్ధాంతి గారు అని తెలిసేటట్టుగా. అందరికీ జాతకాలు, మంచి చెడ్డలూ చెప్పేవాడు. వాస్తు విజ్ఞాని. ఇల్లు కట్టుకునే వాళ్ళు ఆయనను తీసుకెళ్లి ప్లాన్ చూపించి సలహాలు తీసుకుని గృహ ప్రవేశం నాడు గౌరవంగా బట్టలు పెట్టి దక్షిణ ఇచ్చేవారు. అంతటి పెద్దాయనా టీ అమ్మే కాంటీన్ కుర్రాడిని పక్కకి పిల్చి “నాక్కొంచెం టీ చిక్కగా పెట్టి తేవయ్యా” అనేవాడు. “అలాగే సారూ“ అంటూ వాడు అందరి కోసం పెట్టిన యాభై కప్పుల టీ లోంచే ఒక కప్ తెచ్చి ఇచ్చేవాడు. అసలక్కడ ఒక్కడి కోసం కాఫీ, టీలు చేసే గిన్నెలే ఉండవని తెలియని దైవజ్ఞుడతను. ఆయన్ని చూసి మేం నవ్వుకునేవాళ్ళం.

మా బస్సు మిత్రురాలు ఒకావిడ సెక్రటేరియట్‌లో సెక్షన్ ఆఫీసర్. పెద్ద కొడుకు బిటెక్ చేసేవాడు. ఆవిడకి చిన్న కొడుకు అంటే చాలా గారాబం. వాడి గురించిన ముచ్చట్లు రోజూ చెబుతూ ఉండేది. ఆ కుర్రాడు డిగ్రీ చేసి రిటెన్ టెస్ట్‌లో ఎంబీఏ సీట్ సంపాదించాడు. కోయంబత్తూర్ కాలేజీలో చేరాడు. ఆవిడ మా బస్సుమేట్స్ అందరికీ స్వీట్స్ పంచింది. ఏమైందో తెలీదు. ఒక సంవత్సరం తర్వాత ఆ కుర్రాడు చదువు మానేసి వచ్చేసాడు. ఈ సంగతి తెలిసి మేమంతా కంగారు పడిపోయాం. ఆరా తీసాం. ఆవిడ “మా అబ్బాయికి ఎంబీఏ నాలెడ్జి అంతా వచ్చేసిందండీ. డిగ్రీ లేకపోతే ఏమైంది? డిగ్రీలున్న వాళ్ళకి ఉద్యోగాలొస్తున్నాయా చెప్పండి?” అని ఎదురు ప్రశ్న వేసేసరికి మేమంతా తెల్ల మొహాలు వేశాం. “వాడి తెలివితేటలకి ఏదో ఒక రోజు ఉద్యోగం అదే వెతుక్కుంటూ వస్తుంది” అని మమ్మల్ని ఆవిడే ఓదార్చింది కూడా! మేమంతా నిజమే సుమండీ అన్నట్టుగా తలలూపాము. ఆవిడంత ధైర్యంగా ఉన్నాక మాకెందుకూ దిగులు? అనుకుని ఊపిరి పీల్చుకున్నాం.

కొందరు లబ్దప్రతిష్టులైన సీనియర్ కవులు తమకి నిత్యం బాకా వాయిస్తూ, చాడీలు మోసుకొస్తూ రెండుపూటలా తమ కాళ్ళకి మొక్కే శిష్యులను కాబోయే గొప్ప కవులు అంటూ అందరికీ పరిచయం చేస్తూ స్టేజి లెక్కిస్తుంటారు. వాళ్ళు రాసే పిచ్చి కవిత్వాన్ని వీళ్ళు మెచ్చుకుంటూ మీసాలు మెలేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రతిభ లేకుండానే బలవంతంగా రుద్దబడిన రచయితలూ, కవులూ మనకి బోలెడు మంది మీటింగుల్లో కనబడుతూ ఉంటారు. వాళ్ళ గురువులు వాళ్ళనలా చలామణీలో పెట్టేసి పై కెళ్ళిపోతుంటారు మన జుట్లు మనల్ని పీక్కోమని.

రాజకీయ నాయకులైనా, హీరోలైనా, మరే ఇతర పెద్దలైనా ఔచిత్యం ఎరిగి మాట్లాడాలి, ప్రవర్తించాలి. సొంత శిష్యులైనా, బంధువైనా,సంతానమైనా వారి సత్తాను బట్టి మాత్రమే ప్రోత్సహించాలి. అందరికీ మరాళం వలె పాలనూ నీళ్ళనూ వేరు పరిచే ప్రజ్ఞ లేకపోవచ్చు. కనీసం తమ అపండితత్వాన్ని దాచుకోవడానికి తగిన పాండిత్యం తప్పనిసరి. ఏమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here