పంద్రాగస్టు

0
10

[స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘పంద్రాగస్టు’ అనే కవితని అందిస్తున్నాము.]

[dropcap]పం[/dropcap]ద్రాగస్టు నాడు తెగినవి
దాస్య శృంఖలాలు
స్వేచ్ఛా గాలులు వీచినవి

అధికార పగ్గాలు
వచ్చినవి నల్ల
దొరలకు తెల్ల దొరల నుండి

మువ్వన్నెల జెండా ఎగిరింది
ఎఱ్ఱ కోట మురిసింది
వాడ వాడలా జెండా ఎగిరింది
సర్వ జనులు సంతసించ

ప్రగతి ప్రణాళికలు
ఉద్యోగ కల్పనలు
సేద్యపు నీటి సదుపాయాలు
పారిశ్రామిక అభివృద్ధి
కార్యక్రమాలు
జోరందుకున్నాయి

అనుభవం తక్కువ
చేసిన వాగ్దానాలు ఎక్కువ
లంకె బిందెలు లేవాయే
ఆకలిదప్పులు తీర్చ

తినే నోళ్ళు పెరుగుతున్నవి
తినడానికి తిండి సరిగా లేదు

రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది
కొత్త రాజులు పుట్టుకొచ్చారు
పాలితులు, పాలకులు
రెండు తరగతులుగా
విభజించబడ్డారు ప్రజలు

సంపద కొద్ది మంది
చేతుల్లో బందీ అయ్యింది
తెల్ల ధనం నల్ల ధనంగా
రూపాంతరం చెందింది
తీరాలు దాటుతుంది

డెబ్బై ఆరు యేండ్ల భారతదేశ
ముఖచిత్రం ఇది
ముచ్చటపడడానికి
ఏమున్నది..

నిరాశావాదం బువ్వ పెట్టదు
ఎక్కడేసిన గొంగళి అక్కడే లేదు
జరిగిన అభివృద్ధి తక్కువ
జరగాల్సింది ఎక్కువ

చేయి చేయి కలుపుదాం
అవినీతిని అరికడుదాం
ఒళ్ళు వంచి పని చేద్దాం

మేరా భారత్ మహాన్
అనే రోజు కోసం ఎదురు చూద్దాం
పరాయి ప్రభువుల పారదోలిన మనం
పేదరికాన్ని, నిరుద్యోగాన్ని
పారద్రోలలేమా..??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here