వైవిధ్యభరితమైన ‘పంజాల పలుకులు’

1
11

[dropcap]డా.[/dropcap] బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి ప్రభుత్వ పాలనా శాస్త్ర ఆచార్యులుగా పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ పంజాల నరసయ్య వెలువరించిన ‘పంజాల పలుకులు’ అనే కవితా సంపుటిలో (ఈ-బుక్) 100 కవితలున్నాయి.

నడుస్తున్న చరిత్రను కవితా వస్తువుగా చేసుకున్నాననీ, సమకాలీన సమస్యలపై ఇదొక రన్నింగ్ కామెంటరీ అని తమ ముందుమాటలో ప్రొ. నరసయ్య పేర్కొన్నారు.

తనని ఎవరో వెంటాడుతున్నారని భావిస్తాడో వ్యక్తి. చీకటిలో నడుస్తున్నప్పుడు ఫాలో కావడం లేదని, వెలుతురులో నడిస్తే ఫాలో అవుతున్నారని అంటాడు. అదెవరో ‘నీడ’ అనే కవిత చెబుతుంది.

పంచభూతాలకు కులం లేదని చెప్పే కవిత ‘అడిగా..’. మనుషుల్లో వస్తున్న మార్పులకు ‘మనిషి మారుతున్నాడు’ కవిత అద్దం పడుతుంది. ధనం వెంట పరుగులు తీస్తూ తోటివారిని పట్టించుకోని విధంగా మారిపోతున్న మనుషుల తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు కవి.

అప్పు చేయడం వల్ల ఎన్ని తిప్పలో ‘అప్పయితే సేయ..’ అన్న కవితలో వివరించారు. ఆడవాళ్ళతో వంటింటి సేవలు చేయించుకునే మగాళ్ళకు చురక వేశారు ‘అలవాటు’ కవితలో.

రాజకీయ నాయకుడైపోయి ఓ వెలుగు వెలగాలనున్న వ్యక్తి కలలు ఎలా కల్లలయ్యాయో ‘కమస్కం’ కవిత చెబుతుంది. అలవాట్లకు మనుషులు ఎలా బానిసలవుతున్నారో ‘పెద్ద తిట్టు’ కవితలో చెప్పారు కవి.

ఓ భర్త పొందిన అవార్డులేమిటో ‘జీవిత సాఫల్య పురస్కారాలు’ అనే కవితలో తెలిపారు. ఓటు హక్కు విలువను ఒక కవితలో చక్కగా చెప్పారు ప్రొఫెసర్ గారు. ఎన్నికల ప్రక్రియ ధనమయమైపోయిందని వాపోయారు మరో కవితలో.

ఏడవడానికి కూడా అర్హత ఉండాలని ‘ఏడిచా..’ అనే కవిత చెబుతుంది. అమ్మప్రేమని అత్యంత సరళంగా అలతి పదాలతో చెప్పిన కవిత ‘బుజ్జిగాడు’.

తెలుగువారి ఆంగ్లభాషా వ్యామోహంపై కవి విసిరిన విసురు ‘నా శ్వాస’. స్త్రీ పురుష సంబంధాల గురించి తిరిగి రాయాల్సిన సమయం ఆసన్నమైందని ‘సంబంధాలు’ అనే కవితలో వ్యాఖ్యానిస్తారు.

‘బాల్యంలో ఉగాది’ కవిత కవి చిన్నతనాన్ని ఆయనకు గుర్తు చేస్తూనే, పాఠకులకూ వారి బాల్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. తర్కానికి అందని సత్యం బ్రహ్మరాత అని అంటూ అంజయ్య గారు ముఖ్యమంత్రి ఐన తీరును ప్రస్తావిస్తారు ఓ కవితలో.

భార్యాభర్తలు కలిసి ఉంటే ఆనందమేమిటో సినీ ఫక్కీలో చెప్పిన కవిత ‘భార్యాభర్తలు’. సీతారామ కళ్యాణం గురించి నాలుగు వాక్యాలలో రాసిన చక్కని కవిత ‘అందరిది’.

జీవితంలో కష్టాలకు వెరవకూడదని, కష్టం వెంటే సుఖమూ ఉంటుందని ‘చీకటి వెలుగులు’ అనే కవితలో చెప్పారు కవి. నవ్వు గురించి, నవ్వించటం గురించి ఆలోచింపజేసే కవిత ‘నవ్వు’.

ఉస్మానియా క్యాంపస్ లోని విద్యార్థి జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చే కవిత ‘చెప్పాలని ఉంది’. క్యాంపస్ రోజులను, మిత్రులను గుర్తు చేసే మరో కవిత ‘గుర్తొస్తున్నాయ్..’

నిజమైన జ్ఞానమేమిటో ఒక కవితలో చెప్పారు నరసయ్య గారు. కష్టాలు లేని జీవితం, లగేజ్ లేని ప్రయాణం ఊహించకూడదని అంటారు మరో కవితలో.

కరోనా నేపథ్యంలో రాసిన కవిత ‘బతుకు బతికించు’. కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తల గురించి చెప్పిన కవిత ‘ప్రమాణ స్వీకారం’. ‘మేలుకొలుపు’, ‘ప్రతిజ్ఞ’, ‘పెద్దాయన మాట’, ‘ఒక మాట’ ‘కరోనా effect’, ‘ఏడుపు వస్తుంది’, ‘అంతిమ యాత్ర’, ‘కరోనా.. నిన్న, నేడు, రేపు’ , ‘కష్ట కాలం’, ‘నేనొక మోనార్క్‌ను’, ‘పుట్టింటి బుద్ధులు’, ‘గృహ నిర్బంధంలో’, ‘నా గురించి నేను’ కవితలు కరోనా నేపథ్యం లోనివి. కరోనా కాలం నాటి వెతలు, భయాలు, దుర్ఘటనలు మరోసారి పాఠకుల మనసులలో కదలాడతాయి.

ధనం, అధికారం చూసుకుని మిడిసిపడకూడదని, ఎవరిని చిన్నచూపు చూడకూడదని ఓ కవితలో చెప్పారు. ప్రేమికుల మధ్య జరిగే సంభాషణని ‘రస సంభాషణ’ కవితలో తెలిపారు.

‘నేస్తమా, కుశలామా!’ అనే కవితలో కవిత్వం ప్రాధాన్యతని వెల్లడించారు. సాటివారిని పట్టించుకోకుండా, తెలియనట్లు వెళ్ళిపోయే ‘మనుషులకేమైంది’ అని ప్రశ్నించారు. కాలం, ధనం విలువైనవేనంటూ స్నేహం మరీ మరీ విలువైనదని అన్నారు ఒక కవితలో.

ఒక యాచకురాలి మరణాన్ని తెలిపే కవిత ‘ఆమె’. హైదరాబాదులో డబుల్ డెక్కర్ బస్ ఎక్కి తిరిగిన రోజులను తలచుకుంటూ చక్కని కవిత రాశారు నరసయ్య గారు.

జీవితమంతా ఎవరో ఒకరు చెప్పినట్టు నడుచుకుని ఏదో తన ఇష్టప్రకారం చేయలేకపోయిన వ్యక్తి ఆవేదనని ‘నా బాధే.. మీ బాధ’ అని కవితలో వ్యక్త చేశారు. శ్రమ శక్తిని నమ్ముకోవాల్సిన అవసరం గురించి ఓ కవితలో చెప్పారు.

రిటైరయిన ఉద్యోగుల మనోభావాలకు అద్దం పట్టిన కవిత ‘రిటైర్ అయ్యాను కదా!’. గాంధీజీని స్మరించుకుంటూ అల్లిన కవిత ‘మహాత్మా!’.

అభిప్రాయ భేదాలున్నా, కలిసి మెలిసి ఉండే భార్యాభర్తల జీవితాన్ని ‘భార్యాభర్తల గోల’ కవిత చెబుతుంది.

మనసు తెరిచి మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని అర్థవంతంగా చెబుతుంది ‘ముచ్చట్లు పెట్టుకుందాం’ కవిత. సలాం అంటే గులాం కాదని, సలాం అంటే సంస్కారమని ‘సలాం’ కవితలో అంటారు.

‘Dance to her tune’, ‘Be a demander’, ‘Who Am I’ అనే ఇంగ్లీషు కవితలు కూడ ఈ సంపుటిలో ఉన్నాయి.

***

వైవిధ్యభరితమైన అంశాలతో, అలతి పదాలతో, సూటిగా చెప్పిన కవితలివి.

***

పంజాల పలుకులు (కవితా సంపుటి)

రచన: ప్రొ. పంజాల నరసయ్య

ప్రచురణ: పంజాల ప్రచురణలు, హైదరాబాద్

పేజీలు: 128

వెల: అమూల్యం

ప్రతులకు:

https://drive.google.com/file/d/19VHfduSFQ53sD7XSlO-it2IAs21thsMh/view

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here