పంజరపు పక్షి

1
9

[మాయా ఏంజిలో రచించిన ‘Caged Bird’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(రెండు పక్షులను ప్రతీకలుగా తీసుకొని రాసిన కవిత ‘Caged Bird’. స్వేచ్ఛాపక్షి తెల్ల అమెరికన్లకు, వారనుభవిస్తున్న సమాన హక్కులకు ప్రతీక. పంజరపు పక్షి అణచబడిన నల్ల అమెరికన్లకు, వారికి అందని స్వేచ్ఛాఫలాలకు ప్రతీక. మాయా రాసిన సీరియస్ కవితల్లో ఇది ఒకటి. నల్ల జాతి ప్రజల తొక్కివేయబడ్డ ఆకాంక్షలకు, వారి నిస్సహాయతకు, బానిస బతుకుల్లోంచి బయటకు రావాలనే వారి తపనలకు పంజరపు పక్షి గొంతునిచ్చి రాసిన కవిత. జీవితమంతా తాను ఎదుర్కొన్న అసమానత, అమానవీయత ప్రేరణతో మాయా ఈ కవిత రాసి ఉంటుంది. స్వేచ్ఛ రుచి ఎలా ఉంటుందో తెలియని పంజరపు పక్షి అవిశ్రాంత ఆలాపన సుదూరపు కొండల్లో మారుమోగి, ఏదో ఒక రోజు బానిస పక్షి విముక్తమవుతుందనే ఆశావహ భావనతో రాసిన కవిత ఇది. 10 సెప్టెంబర్ 2023 మాయా ఏంజిలో అనువాద కవితలు ‘సంచిక’లో 25వ వారం.)

~

[dropcap]స్వే[/dropcap]చ్ఛగా తిరుగాడే పక్షి
గాలి వాలుకు తగినట్టుగా దూకుతుంది
ప్రవాహపు అంచుల వరకు
దిగువ వాలుకు తేలుతుంది
నారింజరంగు సూర్యకిరణాలలో
తన రెక్కలని ముంచి అల్లార్చి
ఆకాశం తనదేనని చెప్ప సాహసిస్తుంది

రెక్కలు కత్తిరించి
పాదాలు కట్టేసి
ఇరుకైన పంజరంలో
బంధించబడ్డ బానిస పక్షి
అరుదుగా ఇనుప చువ్వల నుంచి
బయటికి చూస్తుంది
అతి కష్టంగా గొంతెత్తి పాడుతుంది

పంజరపు పక్షి
తనకు తెలియని విషయాలను
భయకంపితయై
వణికే గొంతుతో పాడుతుంది
సుదూరపు కొండల దాకా
ఆ స్వరం ప్రతిధ్వనిస్తుంది
నిర్బంధపు పక్షి ఎగరలేని అశక్తతతో
స్వేచ్ఛా రాగమాలాపిస్తుంది

స్వేచ్ఛాపక్షి మరో మలయ సమీరాన్ని ఊహిస్తుంది
ఈశాన్యపు గాలులు ఈలలేస్తూ
శ్వాసించే తరువుల మధ్య నుంచి
మరింత మృదువుగా వీస్తాయి
మంచున తడిసిన లే పచ్చికను మేసేందుకు
బలిసిన ఆకుపురుగులు ఎదురు చూస్తుంటాయి
స్వేచ్ఛాపక్షి నీలాకాశం తన స్వంతమనుకుంటుంది

పంజరపు పక్షి
తన స్వప్నాల సమాధి పైన
నిలబడి ఉంటుంది
తన నీడ, తన ఉనికి తనకే
పీడకల అరుపులా ధ్వనిస్తుంది
విరిచిన రెక్కలు
విరగ్గొట్టిన కాళ్ళతో
విముక్తి గీతం పాడేందుకు గొంతెత్తుతుంది

తొణికే స్వరంతో
పంజరపు పక్షి
తానెరుగని స్వేచ్ఛను కోరుతూ
భయభ్రాంతయై ఆలపిస్తుంది
కొండాకోనల్లో ఆ స్వరం మారుమోగుతుంది!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


మాయాతో విడాకులు తీసుకున్న తర్వాత Tosh Angelos తిరిగి మిలిటరీలో చేరి కొంతకాలం పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల అతని వివరాలు ఎవరికీ పెద్దగా తెలియలేదు. కొంతకాలం తరువాత అతని 53వ యేట Portland (Oregon) లో అతడు మరణించాడన్న సంగతి తెలిసింది. అప్పటికి మాయా Porgy dance ట్రూప్‌కి సంబంధించి యూరోప్‌లో విస్తృతంగా పర్యటిస్తూ ఉంది.

దక్షిణ అమెరికాలో నల్లజాతి ప్రజలపై ఆనాడున్న సామాజిక మానసిక అణచివేతలపై తనదైన అవగాహనతో అనేకమైన రచనలు చేసింది మాయా. నల్లవారి సమస్యలు వాటి పరిష్కారాలు తన రచనల్లో సూచించేది.

మాయా క్రమంగా celebrated writer గా ఎదిగింది. Performer, సామాజిక కార్యకర్త, కథలు, కవితలు, వ్యాసాలు, బాలసాహిత్యం కాకుండా ఆత్మకథనాలు కూడా వెలువరించింది.

1969లో I know why the caged birds sings అన్న ఆత్మకథలో తన జీవితపు తొలినాళ్ళ గురించి రాసింది.

బాల్యంలో తానెదుర్కున్న హింస, వర్ణవివక్షతో బాటు తరువాతి రోజుల్లో తాను మానసికంగా ఎలా దృఢంగా తయారైందీ అందులో వివరంగా చర్చించింది. ఈ పుస్తకం National Book Award కొరకు నామినేట్ అయ్యింది. 3 Best spoken word album గ్రామీ అవార్డులు తీసుకుంది మాయా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here