పరమేశ్వరుడూ – పచ్చి మిరపకాయ బజ్జీ

1
10

[box type=’note’ fontsize=’16’] “ప్రతి క్షణమూ శివుడికి మనోహరమూ, మహదానంద దాయకమూ, మదన బాణ సంచాలన సంజాత మహా శృంగార రసభావ శిఖరాయమాణమూ అయింది” అంటున్నారు జొన్నలగడ్డ సౌదామినిపరమేశ్వరుడూ – పచ్చి మిరపకాయ బజ్జీ” కథలో. [/box]

[dropcap]”ఆ[/dropcap]హా జన్మ ధన్యమైంది” అన్నాడు నంది నవ్వుతూ

“ఎవరిదీ” అన్నాడు భృంగి జనాంతికంగా.

“మిరపకాయ బజ్జీది” అన్నాడు నంది మెల్లగా.

“ఎందుకు”

“చంద్రుణ్ణీ సూర్యుణ్ణీ ఒకేసారి పక్కపక్కనే నిలిపి కలిపి చూబించింది.”

తపస్వి అవటంచేత ఒక నిమిషం ఆలోచించి “నువ్వు చెప్పింది సరే” అని చిరునవ్వు నవ్వాడు భృంగి

***

పైమాటలకి అన్నిటికీ కొద్ది రోజుల నించీ కైలాసంలో జరుగుతున్న హడావుడే కారణం.

పరమ శివుడు గారు పార్వతీదేవి ముఖారవింద సందర్శన కుతూహలాయమాన చిత్తులు కావటమే వీటన్నిటికీ అసలు కారణం.

పార్వతీదేవి తపస్సుచేసి అర్ధనారీశ్వరత్వం సంపాయించటం చేత, ఇద్దరి ముఖ భాగాలూ పక్కపక్కనే ఉండటం వల్ల, పరమ శివుడు గారికి ఆవిడ ముఖారవిందాన్ని చూడటానికి వీలుకావట్లేదు.

కైలాసం తపోప్రదేశం కావటం వల్ల అద్దాలు లాంటి శృంగార రస పోషకాలు తక్కువవటమూ, ఉన్న కాసినింటినీ అమ్మవారు పీకించి కొట్లో పారేయించిన దగ్గిరినించీ శివుడుగారికి ఇదే అవస్థ.

ఎంతైనా మొగుడుగారూ, అసలు సిసలు పదహారణాల మొగవాడూ, మొనగాడూ, కాస్తంత చేదస్తుడూ, అయినందు వల్ల శివుడుగారు భార్యా ముఖారవిందాన్ని చూడాలని శపథం పట్టారు.

వెంటనే నందిని, భృంగిని, చండిని అత్యవసరంగా పిలిపించారు, విషయం వివరించారు శివుడుగారు.

“అయ్యా, ఇది సులువైనదే కదా, ఒక అద్దం పట్టుకొద్దాం” అన్నాడు నంది.

“అదీ కొట్లో పెట్టడానికా” అన్నాడు శివుడు.

“అమ్మవారు తమ ఇచ్చ వచ్చినప్పుడు అర్ధనారి స్వరూపం వొదిలి తమ నిజ స్వరూపం తెచ్చుకోవచ్చు కదా అప్పుడు తమరు చూడవచ్చు కదా” అన్నారు వాళ్ళు.

“మీరు చెప్పింది సరైనదే, కాని ఆవిడకి ఇప్పటప్పట్లో ఆ స్వరూపం వొదిలే వుద్దేశం లేనట్లుంది” అన్నారు శివుడుగారు కొద్దిగా చిరాకూ, పరాకూ కలిపి.

బ్రహ్మాండం పట్టని భక్తి గురించో, అసాధ్యమైన యుద్ధాన్ని సుసాధ్యం చేయటం గురించో వివరంగా చెప్పగల వాళ్ళు శృంగారం గురించి ఏమిచెబుతారు?

కానీ వీళ్ళ అసాధ్యం కూలా, చట్టున నంది గారు ఒక ఎత్తు వేశారు.

ఆమధ్య కాళిదాసు వొచ్చిన దగ్గర్నించీ ఈ సంస్కృత కవుల బడాయి ఎక్కువైపోయింది.

దానికి తోడు ఈ మధ్య శ్రీనాథుడని అదేదో నోరు తిరగని భాషలో కవిట, వాడు కవి సంఘాలు పెట్టి సమావేశాలు పెట్టి హడావిడి చేస్తున్నాడు.

వీళ్ళందరి నెత్తి అణచటానికి నంది గారు లేచి నిలబడి “ప్రభూ, ఇది కాస్త సూక్ష్మమైన అంతఃపుర వ్యవహారం స్వామీ, మామూలు కుటుంబాల్లో ఒక అద్దం కొనుక్కోవడంతో తీరే చిన్న సమస్య, మన దగ్గర ధనం అనేది పూర్ణానుస్వారం కాబట్టి, ఎల్లాగో కొన్నా అది వినియోగంలోకి రాదు కాబట్టి ఇది మా ఊహకి అందటల్లేదు. ఇల్లాంటి చోట్ల మహాకవులైన కాళిదాసు, శ్రీనాథుడు లాంటి వాళ్ళు చమత్కృతి చూబించితే కాని మాట నెగ్గదు” అని విన్నవించిన మీదట శివుడు గారు కవిసభ ఏర్పాటు చేశాడు.

కవులంటే చూడటానికి అందరూ ఒకటే కానీ అదొక నానాజాతి సమితి.

సంస్కృత కవులూ, ప్రాంతీయ భాషా కవులూ, స్త్రీ కవులూ, పురుష కవులూ, కుల, మత, ప్రాంత, భాషా, భావ భేదాలతో రకరకాల మంది ఉన్నా, ముందు నుంచీ పాతుకుపోయి ఉన్న సంస్కృత బృందం వేరుగా కూచుని ఆలోచించి కాళిదాసుని ముందుపెట్టి శివుడుగారి దగ్గిరికి పోయింది. మిగతా అన్ని బృందాలూ గమనిస్తూనే ఉన్నాయి.

“అయ్యా, ప్రశాంతమైన తటాకంకో నదికో అమ్మవారితో వెళ్ళి దాని వొడ్డున కూచుని వొక్కసారి వొంగి ఆ ప్రశాంతమైన జలంలోకి చూస్తే మీకు కావలసిన ప్రతిబింబం మీకు కనిపిస్తుంది” అని కాళిదాసు మనవి చేశాడు. నవ్వుతూ శిరహ్ కంపం చేసాడు శివుడుగారు.

సాయంత్రం అర్ధనారీశ్వర మూర్తి సేవక సమేతుడై దగ్గరలోని సరస్తీరానికి వెళ్ళటం చూసి సంస్కృత కవి బృందం జేజేలు కొడుతూంటే కాళిదాసు పొంగిపోయాడు. మిగతా కవిబృందాలన్నీ కుళ్ళుకుని తిట్టుకున్నయ్యి.

మరుసటి రోజు పొద్దున కాళిదాసునీ, అవ్వయారునీ, శ్రీనాధుడినీ ముఖ్యులైన అయిదారుగురిని పిలిచారు. వెళ్ళాక నంది – “అయ్యా, కాళిదాసు గారూ, మీరు ఇచ్చిన ఆలోచన పూర్ణంగా చింత్యం. దాని వల్ల పనేమీ జరగలేదు పైపెచ్చు శివుడు గారికి కోపం వొచ్చింది” అన్నాడు

“అయ్యా, అసలు ఏం జరిగిందో చెబుతారా” అన్నాడు కాళిదాసు.

“ఏముందీ చెప్పటానికీ, అర్ధనారీశ్వరులు వెళ్ళి సరస్సు వొడ్డున కూచుని కాసేపు మాటా మంతీ ఆడి శివుడుగారు వొంగి సరస్సు లోకి చూసేటప్పటికి గంగమ్మ ఈర్ష్యతో ఆ నీళ్ళని మంచుగా మార్చటంతో ప్రతిబింబం కనపడలేదు”

అని ఆగి “మీ ఆలోచన మీ కవిత్వమంత రమ్యంగా లేదు కాళిదాసు గారూ, మీ కవులందరూ పుస్తకాలు రాసుకోటానికి తప్ప దేనికీ పనికిరారు అని అర్థమైంది” అని వెళ్ళిపోబోయాడు నంది.

“అయ్యా, నన్ను మాట్టాడనిస్తారా” అని శ్రీనాథ మహాకవి కంఠం ఘట్టిగా వినిపించింది. నంది తలతిప్పి చూశాడు. “ఏమిటి” అన్నట్టు తలపంకించాడు.

“అయ్యా, నంది గారూ, ఒక్క ప్రయత్నంతోనే మా కవిలోకానికి కళంకం ఆపాదిస్తున్నారు. చిన్న పామే కదా అనుకుంటే కర్ర చిన్నదైపోయింది. ఈసారి మా ప్రతిభ చూడండి. ఒక అవకాశం మా తెలుగు కవులకి కూడా ఇవ్వండి” అన్నాడు శ్రీనాథ మహాకవి.

“అయితే ఆ చెప్పేదేదో మాకు చెప్పండి. మాకు నచ్చితే అప్పుడు స్వామి దగ్గిరికి” అన్నాడు నంది.

శ్రీనాథుడు వెళ్ళి నంది చెవిలో కాసేపు ఏదో చెప్పాడు. నంది మొహం వెలిగింది. “శంకరులతో మాట్లాడి పిలుస్తాను” అని ఆనందంగా వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు పొద్దున్న అంతిపురంలో అర్ధనారీశ్వరుడు కొలువుండగా చెలికత్తెలు వొచ్చి ఆ రోజు ఉభయంలో చేయబోయే పదార్ధాలు ఏమిటి అన్న పట్టిక చదువుతున్నారు. పరమేశ్వరుడు సవిలాసంగా చేరగిలబడి చెయ్యి ఎత్తాడు. చెలికత్తెలు ఆపారు. మెల్లగా కుడిచేత్తో ఎడమ చేతిని నిమురుతూ “నీ చేతి వంట తిని చాలా రోజులయ్యింది” అని ప్రేమగా అన్నాడు.

పార్వతీ దేవికి ఆశ్చర్యం వేసింది. రోజూ ఏది ఎవరు పెడితే అది తిని ఆనందించే భర్త, ఎప్పుడూ ఈ పదార్ధం కావాలని అడగని భర్త అడిగేటప్పటికి రెట్టించిన ఆనందంతో “ఏమి చెయ్యమంటారు” అంది.

“నువ్వు చేసిన అన్ని పదార్ధాలూ బావుంటాయి కానీ నీ మిరపకాయ బజ్జీలు మట్టుక్కు మహాద్భుతం, వర్ణనాతీతం” అన్నాడు శివుడు. ఎలాగైనా తన ముఖం చూడటానికి వేసే ఎత్తేమోనని చిన్న అనుమానం వొచ్చింది అమ్మవారికి. పరకాయించి చూసింది. పరమేశ్వరుడు మామూలుగా వున్నట్టు మొహం పెట్టాడు.

“సరే, ఇద్దరం కలిసి చేద్దాం లెండి” అన్నది దేవి. శివుడు తలఊపాడు.

సాయంత్రం నాలుగు గంటలకి పచ్చి మిరపకాయ బజ్జీ చేయ్యటం కోసం అన్నీ సిద్ధంగా ఉంచమని చెలికత్తెలకి ఆదేశాలు వెళ్ళాయి.

సాయంత్రం నాలుగైంది. అర్ధనారీశ్వరుడు గారు మెల్లిగా నడుచుకుంటూ వచ్చారు. చెలికత్తెలు వేచి ఉన్నారు. కుడిచేత్తో కత్తి పట్టుకున్నాడు శివుడు. దేవి సవిలాసంగా పచ్చి మిరపకాయ ఎడం చేతితో తీసి బావుందో లేదోనని అటూఇటూ తిప్పి చూసి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసింది. బావుందని తలకాయ ఊపి కుడిచేతికి అందించింది. శివుడుగారు దాన్ని బల్ల మీద పెట్టి జాగ్రత్తగా తన ప్రతిభ అంతా చూబిస్తూ కోశారు. “మీరెప్పుడూ ఇంతే, మిరపకాయ కూడా సరిగ్గా కొయ్యలేరు, మళ్ళీ మాట్లాడితే మహేశ్వరులు, సకల భువన సంహారకారీ, భక్త రక్షా పర తంత్రులు” అన్నది దేవి. అచలుడైన శివుడు గారు ఎందుకు మాట్లాడుతారు? ఏమీ మాట్లాడలేదు.

దేవి కత్తి తీసుకుని ఇంకో కాయ కత్తిరించి “చూడండి, ఇలావుండాలి” అని చూబించింది. శివుడుగారు తల ఊపారు. శివశ్శక్త్యా యుక్తో కదా. “నువ్వేది చేసినా సరిగ్గా చేస్తావు” అని పొగిడాడు శివుడుగారు.

“కస్తూరి ఏది” అని అడిగింది అమ్మవారు. “ఈ ఆడవాళ్ళకి ఏవి లేవో అవే ఎందుకు గుర్తుకొస్తయ్యో తెలీదు. అసలు వాటి అవసరమేమిటో కూడా తెలీదు. మనదేమో ఎప్పుడూ అయ్యవార్లంగారి నట్టిల్లే కదా” అని మనస్సులో అనుకుని “కుబేరుడి కొట్టుకి వెళ్ళాడు తల్లీ, నంది. ఈ పాటికి రావాలిసిందే” అని భృంగి అంటూండగానే నంది సరుకులతో వొచ్చాడు.

సరుకులు అన్నిటినీ చెలికత్తెలు సద్దితే, “కుడిచెయ్యి మీది, మిరపకాయల్లోపల గింజలు తీయండి” అని అంటే శివుడుగారు నవ్వుతూ గింజలన్నీ తీసి మిరపకాయలో అన్ని పొడులూ, చూర్ణాలూ, పదార్ధాలూ అమ్మవారు చెప్పినట్టు వేశారు. “ఇన్నిరోజులకి ఓసారి పరవాలేదు అనిపించారు, కానీ ఇదిగో ఇలా సర్దితే బావుంటుంది కదా, ఎంత చెప్పినా అర్థం చేసుకోరు కదా” అంటూ మెప్పుతో కూడిన దెప్పిపొడుపు వొదిలింది అమ్మవారు. “అయ్యో , నీ చెయ్యి పెట్టద్దన్నానా, అసలే ఎర్రగా మెరిసిపోతూ ఉంటుంది, చూడు ఎలా పండిపోయేంత ఎర్రగా అయిందో, అసలే సున్నితమైన చేతులు ఏమయ్యాయో” అని అంటున్న మొగుణ్ణి “చాల్లెండి, మన పని మనం చేసుకుందాం” అని వారించి చెలికి సంజ్ఞ చేసింది కంటితో.

చెలులు వొచ్చి పెద్ద బాండీ పెట్టి, కింద పొయ్యి వెలిగించి, నూనె బాండీలో పోసి నెయ్యి, నూనె లాంటి పదార్ధాలు చుట్టూ పెట్టి కొద్ది దూరంగా నిలబడ్డారు.

మెల్లిగా అర్ధనారీశ్వరులు పొయ్యి దగ్గరికి చేరారు. నూనె వేగిందా, లేదా అని అమ్మవారు మొగుడిపేరు మనసులో తలుచుకుని కొద్దిగా పిండి బాండీలో వేశారు. మెల్లిగా అది ఎల్లా వేగుతోందా అని వొంగిచూసింది తల్లి.

శివుడి కళ్ళు చటుక్కున మెరిశాయి. ఒక్క క్షణంలో చెమట పోసింది శివుడికి. స్తంభించిపోయాడు. శరజ్జ్యోత్స్నా శుద్ధమైనదీ, సిగలో వెలుగుతూ ఉన్న చంద్రుడు ఎంత పేలవమైన కాంతి ఉన్నవాడో అందరికీ తెలిసేలా చేసిందీ, ఉపమానం అనే పదమే లేని సౌకుమార్య స్వరూపమూ, సర్వప్రపంచ సౌందర్య సమాహార చంద్రిక లాంటి అమ్మవారిని చూసి, మూలాజ్ఞాన మహాంధకారమేఘ విఛ్ఛిన్న మహాసూర్యమండలం లాగా ప్రకాశిస్తోందీ, పుష్కలావర్త సంఛన్న గోపగోపికా నివహాలు ఇంద్ర గర్వహరణ తర్వాత చూసిన ఎండలాగా వెలుగుతోందీ, చింతామణీ మంత్ర జప సముత్పన్న మహాద్భుత విజ్ఞాన దీప కాంతిలాగా విరాజిల్లుతోందీ, కామేశ్వరీ కామేశ్వర ద్వంద్వ సముద్భూత ఓంకార నాద రూప జ్యోతి లాగా విలసిల్లుతోందీ ఈమే కదా అని ఆనందపడ్డాడు. ఇన్ని రోజుల కోరిక తీరింది అని కరువు తీరా చూస్తున్నాడు స్వామి. అమ్మవారి చీరకొంగు వెనక ఇన్నాళ్ళూ భయంభయంగా దాక్కున్న మన్మధుడు ఈసారి నేను గెలిచానని విజయగర్వంతో పూలబాణాలు వేసి ఠపీ ఠపీ మని శివుణ్ణి కొడుతున్నాడు. కిలికిలిత మీశాన రిపుణా అన్నాడు శ్రీనాథుడు.

అమ్మవారు గ్రహించింది. ఈ ఆడవాళ్ళు ఎలా గ్రహిస్తారో మొగుళ్ళకి ఎప్పటికీ అంతుపట్టదు కదా.

అమ్మవారు సిగ్గు పడింది. దాంతో కంగారు పడింది. నూనేమో ఇంకా పూర్తిగా వేగలేదు. ఏంచెయ్యాలో పాలు పోలేదు. శివుడు తీక్ష్ణంగా నూనెలో అమ్మవారి ముఖాన్నే చూస్తున్నాడు. ప్రతి క్షణమూ ఆయనకి మనోహరమూ, మహదానంద దాయకమూ, మదన బాణ సంచాలన సంజాత మహా శృంగార రసభావ శిఖరాయమాణమూ అయింది.

కాళిదాసూ, శ్రీనాథుడూ, కవిబృందాల్లో భావించగలిగిన వాళ్ళూ , ఆనందంతో సూర్యుడి లాగా వెలిగిపోతున్న అయ్యవారి సగం ముఖమూ, సిగ్గుతో విరాజిల్లుతూ, చంద్రుడిలా వెలుగుతున్న అమ్మవారి సగం ముఖమూ ఒక్కసారి పక్కపక్కగా చూసి శ్రీచక్ర బిందువుని భావన చేసి భూమానంద నిధానులు అయ్యారు. గంగమ్మ తల్లికి కోపం వొచ్చి అక్కడ ఏమీ చేయలేక భూమండలంలో పెద్ద వరద తెచ్చి తన కోపాన్ని తగ్గించుకుంది.

అమ్మవారు ఒక్క క్షణంలో తెప్పరిల్లి చటుక్కున పక్కనే తయారుచేసి ఉన్న పచ్చి మిరపకాయలని శెనగపిండిలో ముంచి నూనె ఇంకా వేడెక్కకున్నా ఆ నూనెలో ఒకటి తరవాత ఒకటి తొందరగా వేసి బాండీ మొత్తం నింపేసి విజయగర్వంతో శివుడిని తలుచుకుని నవ్వింది. అది జగన్మోహనం గానూ, సకల భువన సమాకర్షకం గానూ, సమ్యగానంద సంధాయి గానూ ఉంది. శివుడు తన ఉత్తరీయం తో అమ్మవారి చెమటని తుడుస్తుంటే ఆవిడ సిగ్గుతో ఆయన చేయిని పక్కకి నెట్టింది.

అమ్మవారు కావాలనే శివుణ్ణి చూడనిచ్చి ఆయన కోరిక తీర్చి అనుగ్రహించిందా, లేక శివుడే ఎలాగొలా అమ్మవారిని చూసి తన పంతం నెగ్గించుకున్నాడా అంటే నాకనిపించేది మొదటిదే.

ఎలాగైనా మా జొన్నలగడ్డ వారికి ముట్నూరు అగ్రహారం ఇప్పించిన శ్రీనాథుడుకి దణ్ణం.

శ్రీనాథ మహాకవి బుర్రలోదూరి అమ్మవారి చేతి స్పర్శ అందుకున్న పుణ్యానికి ఆంధ్రదేశాన్ని ఏలుతున్న పచ్చిమిరపకాయ బజ్జీకి దణ్ణం.

పచ్చిమెరపకాయ తగిలి ఎర్రగా అయిపోయి మన మనసంతా నిండిపోయిన అమ్మవారి ఎర్రటి చేతికి కాసిన్ని దణ్ణాలు.

అమ్మవారి ముఖారవిందాన్ని దర్శించాలని అనుకుని తన పట్టు నెగ్గించుకున్న శివుడికి మరిన్ని దణ్ణాలు.

అయ్యవారిని ఎలాగొలా గెలిపించి ఆనందించిన అమ్మ వారి ధీమత్తత మనకి కూడా కాసింత ఇమ్మని ఇంకాసిని దణ్ణాలు.

విజయగర్వంతో మందహాసంచేసిన ఆ వేయి పేర్ల తల్లికి, విజయం మనందరికీ ఇమ్మని వెయ్యి దణ్ణాలు.

ఆనందంతో అమ్మవారి ముఖాన్ని తుడిచిన ఆ అయ్యవారికి కూడా వేయి దణ్ణాలు.

సిగ్గుపడి మొగుణ్ణి గెలిపించిన శృంగార కళానిధికి కోటి దణ్ణాలు.

అర్ధనారీశ్వరులై వెలిసి భార్యాభర్తల సంబంధానికి భాష్యం చెప్పిన ఆ ఆది దంపతులకి అందరు జనాలనీ అందునా జొన్నలగడ్డ వాళ్ళనీ, వాళ్ళ వాళ్ళనీ శివరాత్రి సందర్భంగా ఆశీర్వదించమని లెక్కపెట్టలేని దణ్ణాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here