‘భూమానందం’ – ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి ‘పారిజాతావతరణము’ పుస్తకానికి ముందుమాట

0
13

“అద్వితీయం బ్రహ్మైవ భూమా”

[dropcap]భూ[/dropcap]మ అంటే నిరతిశయానందస్వరూపమైన బ్రహ్మము. భూమయే ఆత్మ. భూమయే సద్వస్తువు. భూమాన్యమైన దృగ్విషయం వేరొకటి లేదు అన్న దృష్టితో జీవవిచారం, కర్మవిచారం, ఆత్మవిచారం, బ్రహ్మవిచారం కావించినవారికి విషయాభిలాష రూపుమాసి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి వల్ల భూమస్మృతి కలుగుతుంది. భూమస్మరణ వల్ల వాసనారూపములైన అహంకార మమకార కామక్రోధాది హృదయగ్రంథులు విడిపోతాయి. భూమబ్రహ్మవిద్యాఫలంగా శుద్ధము, బుద్ధము, ముక్తము, కేవలము, అఖండము అయిన సచ్చిదానందస్వరూపం స్వానుభవగోచరం అవుతుంది. “యో వై భూమా మహన్నిరతిశయం బహ్వితి పర్యాయా స్త త్సుఖమ్” అని సామవేదీయ తలవకార బ్రాహ్మణాంతర్గత ఛాందోగ్యోపనిషత్సప్తమాధ్యాయ త్రయోవింశఖండం వద్ద శ్రీ శంకరులు. పాణినీయానుసారం ‘బహో ర్భావః’ అన్న అర్థంలో షష్ఠ్యంత ‘బహు’ శబ్దానికి ‘పృథ్వాదిభ్య ఇమనిచ్’ వల్ల ఇమనిచ్ ప్రత్యయం, ‘బహో ర్లోపో భూ చ బహో!’ (బహోః పరయో రిమేయసోః లోపః స్యా దృహోశ్చ భూరాదేశః భూమా భూయాన్) అన్న అనుశాసనంతో ఇమనిచ్‌కు లోపం, ‘ఆదేః పరస్య’ అన్న పరిభాషా సూత్రాన్ని అనుసరించి ‘బహుమన్’ అని ఉండగా ‘బహు’ శబ్దానికి ‘భూ’ ఆదేశం, ఆపైని ప్రత్యయాది ఇకారలోపం కలుగగా ‘అతిశయేన బహు’ అన్న అర్థంలో ‘భూమా’ శబ్దం నిష్పన్నమవుతుంది. బహుత్వభావము అని అర్థం. అందువల్లనే ఛాందోగ్యంలో సనత్కుమారుడు నారదునికి నిరతిశయానంద బ్రహ్మోపదేశాన్ని ‘భూమ’ అనే శబ్దంతో చేశాడు. “యత్ర నాన్యతృశ్యతి నాన్యచ్ఛృణోతి నాన్యద్విజానాతి స భూమా” అని భూమ శబ్దాన్ని సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన బ్రహ్మమునకు ఉపలక్షకంగా వివరించాడు. బ్రహ్మవిద్యను కరతలామలకం కావించాడు.

బ్రహ్మవిద్యానిరతులైన శ్రీ భూమయ్య గారికి భవిష్యదర్థాన్వయద్యోతంగా నామకరణం చేసిన పుణ్యదంపతులకు నమస్కరణంతో ఈ నాలుగు మాటలు.

పారిజాతావతరణ కథానైపథ్యం

పారిజాతావతరణం బహుకావ్యనిర్మాతలైన ఆచార్య భూమయ్య గారి నవీనసృష్టి, విష్ణు బ్రహ్మ పాద్మ బ్రహ్మవైవర్త భాగవత హరివంశాది పురాణ ప్రసిద్ధమై, అనేకభాషలలో అనేక ప్రక్రియలలో వెలసిన ఉదంతాన్ని తెలుగునేలకు తెచ్చి నంది తిమ్మన గారు నాటిన ప్రసిద్ధ ప్రబంధకల్పవృక్షానికి కాల్పనికతను జోడించి రూపొందించిన మిశ్రబంధం ఇది.

కొంతకాలంగా భూమయ్య గారు ప్రసిద్దేతివృత్తాలను స్వీకరించి వాటిని స్వోపజ్ఞమైన శిల్పకల్పనతో వర్తమాన సమాజ పరిస్థితులకు అన్వయించి వైచిత్రీప్రాణశక్తితో కావ్యసృజన చేస్తున్నారు. ‘జ్వలితకౌసల్య’ కావ్యంలోని మాతృ హృదయదీప్తి, ‘త్రిజట’ వృత్తాంతంలోని ఆధ్యాత్మిక జీవశక్తి, ‘ప్రవరనిర్వేదము’లోని ఔపనిషద సిద్ధాంతదర్శనం, ‘మకరహృదయము’లోని తత్త్వపరిష్కారం ఇందుకు నిదర్శనలు.

ఆ శ్రేణిలో ఇది ఒక సరిక్రొత్త ప్రక్రియ. తెలుగు సాహిత్యంలో ప్రణయతత్త్వ ప్రతీకీకరణకు ఒక అభినవ కావ్యకల్పన.

ఇది పారిజాతాపహరణం కాదు. పారిజాతావతరణం. గర్భితార్థప్రకాశకమైన వినూత్నశీర్షిక.

దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు అందులో నుంచి ఆవిర్భవించిన స్థావరజంగమాత్మకములైన పెన్నిధులు పధ్నాలుగింటిలో పారిజాత కల్పవృక్షం ఒకటి. ‘పారోఽస్తీతి పారీ’. పారము (ఒడ్డు) కలది కాబట్టి సముద్రానికి పారి అని పేరు. ‘పార ముదక మస్మి న్నస్తీతి వా’. పారము (నీరు) అందులో ఉన్నది కాబట్టి పారి. పారిగర్భజాతం కాబట్టి పారిజాతం అయింది. పారిజాతం, మందారం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం అన్నవి దేవతరువులు. ఆ పారిజాతం దివినుంచి భువికి దిగివచ్చిన కథానకమే పారిజాతావతరణం.

భూమయ్య గారు కల్పించిన చిత్రాతిచిత్రమైన కథాసంవిధానం ఇది:

నారదుడు తనకిచ్చిన పారిజాత కుసుమాన్ని రుక్మిణికి బహూకరించి దీనవత్సలుడైన శ్రీకృష్ణుడు సత్యభామ మందిరానికి వెళ్ళాడు. “దీనవత్సలుడు” అన్న ఆ ఒక్క విశేషణం సంభవింపనున్న పరిణామాలన్నింటికి ప్రథమపరిచాయికగా అమరింది. ఆ దీనవత్సలతే సత్యభామ పాత్రలో బింబప్రతిబింబభావాన్ని పొందింది.

సత్యభామ నాథుని రాకకై సర్వసన్నాహాలతో స్వాగతసత్కారాలను సిద్ధం చేసింది. పారిజాత పరిమళోల్లాసపూర్ణమైన ఆయన దర్శనంతో ఆమె కన్నులలో పారిజాతాలు విరిసి పరిమళించాయట. ఆ పరిమళానికి ఆయన పరవశించాడు. ఆ మధురవేళ ఆమె రుక్మిణీదేవి మందిరం నుంచి వచ్చిన చెలి ద్వారా తాను విన్న వార్త నిజమేనా? అని తెలియగోరింది.

శ్రీకృష్ణుడు జరిగిన వృత్తాంతాన్ని ఆమెకు వినిపించాడు. ఆ మహర్షి ఒక్క పువ్వునే తీసికొనివచ్చాడు. రెండు పూలైనా తెచ్చివుంటే బాగుండునే అని నేనను కొన్నాను – అని కూడా ఆమెతో అన్నాడు.

అక్కడి నుంచి భూమయ్య గారి కల్పనలో రసపారిజాతాలు వేయిపరిమళాలతో విరిశాయి. అనిదంపూర్వమైన కథాసంనివేశ ప్రపంచనం జరిగింది.

సత్యభామ అన్నది కదా, స్వామీ, రెండు పూలు తేలేదని మీకు ఎందు కనిపించింది? ఆ రెండవదానిని ఎవరికిచ్చినా భేదభావాన్ని చూపించినట్లే కదా. ఎనిమిదిమంది ప్రియాంగనలకు, పదహారువేలమంది భామలకు ఎవరు మాత్రం ఎన్నెన్నని బహుమతులను తేగలరు? ఆ మహర్షి తెచ్చినది మీ కోసం. మీరప్పుడు రుక్మిణీదేవి మందిరంలో ఉన్నారు కనుక ఆ దివ్యప్రసూనాన్ని మా అక్కగారికి ఇచ్చారు.

మేమందరమూ మీ ప్రియపత్నులమే. అందరమూ మీ ప్రేమవారాశిలో ఓలలాడుతున్నవాళ్ళమే.

అంటూ, ఆమె నాథునికి భక్తినీరాజనాలను సమర్పించింది.

స్వామీ! మిమ్మల్ని ఒక్క కోరిక కోరాలని ఉన్నది. అదీ దీనజనహితార్థమే అని కోరుతున్నాను. మన నగరిలో దీనులు, ఆర్తులు, వృద్ధులు, వికలాంగులు – ఇంతమందికి పూర్వకర్మపరిహారమంత్రమై ఆనందదాయకం కాగలిగిన ఆ వేల్పుచెట్టు మన ముంగిట ఉన్నట్లయితే, మన ద్వారక భూలోక స్వర్గమే కాగలదు కదా. మీరు ఆపన్నశరణ్యులు. అందరికీ ఆత్మబంధువులు. పుడమి ప్రజల మేలుకోసం మీరు ఈ వరదానం చేయరూ!

అని శ్రీకృష్ణుని అర్థించింది.

అమృతధారల వంటి ఆ పలుకులు పరమాత్మ మనస్సును లోగొన్నాయి. ఆమె విశ్వశ్రేయోభిలాషకు, దీనజనోద్ధరణతత్పరతకు ఎంతో ఆనందించాడు.

అంతలో నారదమహర్షి వారి సన్నిధికి వచ్చాడు. సత్యభామ కోరిక ఆయనకు మెప్పుకూర్చింది. దీనమానవసేవ కంటె పరమార్థం ఏముంటుంది? ఈ విశేషాన్ని దేవేంద్రునికి విన్నవిస్తాను – అన్నాడు.

ఇంతవరకు కథలో పూర్వభాగం. ఉత్తరభాగం ఇంతకంటె రంజకంగా సాగింది.

సత్యాకృష్ణులు గరుత్మద్రథాన్ని అధిరోహించి స్వర్గనగరికి బయలుదేరారు. దేవేంద్రుడు వారికి ప్రియవచనాలతో స్వాగతం పలికాడు. ఇంద్రోపేంద్రులు, శచీపత్యల కౌగిలింతలలో భూలోకస్వర్లోకాలు ఒక్కటైనట్లు తోచి లోకమంతా పరవశించింది.

శ్రీకృష్ణుడు నరకుని నుంచి గ్రహించిన కుండలాలను దేవమాతకు సమర్పించాడు. దేవేంద్రుడు పారిజాత తరువును ఆ దంపతులకు సగౌరవంగా సమర్పించాడు. పరిచారకులు దానిని గరుత్మంతుని మూపుపై నిలిపారు. సత్యాకృష్ణులు అందరికీ ప్రేమతో వీడ్కోలిడి ద్వారకకు తిరిగివచ్చారు. సత్యభామ సతులందరినీ ఆహ్వానించి, ప్రజలను ఆహ్వానించి నారద మహర్షి సమక్షంలో పుణ్యతరుప్రతిష్ఠను నిర్వహింపజేసింది. పారిజాత పరిమళవాయువీచికల ప్రభావం వల్ల కనులు లేనివారికి చూపువచ్చింది. అంగవైకల్యం తొలగి చెట్టు దగ్గరికి నడిచివచ్చారు. లోకాన్ని అసత్తు నుంచి సత్తుకు, తమస్సు నుంచి జ్యోతిస్సుకు, మృత్యువు నుంచి అమృతత్వానికి నడిపించిన సత్యాదేవిని అందరూ కన్నులలో నిలుపుకొన్నారు. కృష్ణపరమాత్మకు ప్రణమిల్లారు. దయచూపే మీ చూపే మాకు దారిచూపే దీపకాంతి అని నిండైన కృతజ్ఞతతో చేతులు జోడించారు. లోకానికి చైత్యచోదన లభించింది.

ఆదర్శ ప్రపంచ ప్రతీకీకరణం

ఇందులో కథ ఏముంది? కథలో నాటకీయత ఎక్కడుంది? నాటకీయములైన మలుపులు ఎక్కడున్నాయి? అవేవీ లేని కావ్యం కావ్యమెట్లా అవుతుంది? అంటే, అదే ఈ ప్రక్రియలోని వినూత్నత్వం. కథ పాతదైనంత మాత్రాన కావ్యకళ పాతది కానవసరం లేదు కదా. విశ్వనాథ వారన్నట్లు,

“ఇందులో రహస్య మెచ్చట నున్న దనఁగా – కవి తీసికొనిన కావ్యములోని కథ, సాధింపఁదలఁచిన రసము, వాణి కభిముఖముగా చూపించెడి శిల్పము – వీనికి ప్రాధాన్యముండును. ఈ చేఁతలో నతఁడు కవితాశక్తిని జూపించెనేని ఆ కావ్యము రమ్యముగా నుండును. కథ ప్రాఁతదను ప్రశ్న లేదు. కల్పన క్రొత్తగా నున్నచో కథకు ప్రాఁతదనము లేదు. కథలోని నామములు ప్రాఁతవైనను కల్పన క్రొత్తదైనచో కావ్యము క్రొత్తది”.

దీనిని గురించి మరింత లోతుగా చర్చించే ముందు ఇంకొక ముఖ్య విషయాన్ని వివరించాలి. ఈ విధంగా ప్రాక్తనమైన కథను యథోద్దిష్టంగా మార్చి చెప్పే స్వాతంత్ర్యం కవికి ఎట్లా వచ్చింది? అన్న దృగ్విషయాన్ని గురించి చెప్పాలి. ‘యథాస్మై రోచతే విశ్వం, తథేదం పరివర్తతే’ అన్న ఆలంకారిక సూత్రసాధకతను పరికించాలి.

వ్యాసకృతములని చెప్పబడే పురాణములన్నింటిలోనూ యీ పారిజాతహరణ కథ ఒక్కతీరున లేదు. బ్రహ్మవైవర్తంలో ఉన్నదున్నట్లు విష్ణుపురాణంలో లేదు. విష్ణుపురాణంలో ఉన్నట్లు రుద్రభట్టు కన్నడ జగన్నాథవిజయంలో లేదు. నంది తిమ్మన గారు పూర్తిగా ఒక్క మూలాన్ని గ్రహించి అందుకు విధేయంగా తన ప్రబంధాన్ని అనురణింపలేదు. మహాకవి కదా!

జైనమహాకవి జనసేనుని సంస్కృత హరివంశంలో సత్యభామ గృహాలంకరణ కృత్యంలో మగ్నురాలై – శాకుంతలంలో పరధ్యానంలో ఉన్న శకుంతల తన ఆశ్రమానికి వచ్చిన దుర్వాస మహామునిని గమనింపనట్లే – తమయింటికి అతిథిగా వచ్చిన నారద మహర్షిని గుర్తింపదు. ఆ ఉదాసీనతకు ఆగ్రహించిన నారదుడు విదర్భ దేశానికి వెళ్ళి అక్కడ రుక్మిణికి శ్రీకృష్ణుని గురించి తెలియజేసి వారి వివాహాన్ని అనుఘటిస్తాడు. సపత్నీవైరానికి ప్రాతిపదికగా రూపొందిన ఘట్టం అది.

ఉమాపతి మహోపాధ్యాయుని పారిజాతహరణ (సంగీత) నాటకావ్యంలో నారదుడు శ్రీకృష్ణుని సందర్శించి, పారిజాత పుష్పమహిమను వివరించి, దానిని ఆయనకు సమర్పిస్తాడు. శ్రీకృష్ణుడు దానిని రుక్మిణి వేనలిలో అలంకరిస్తాడు. చెలికత్తె సుముఖితో అక్కడికి అడుగుపెట్టిన సత్యభామ వారిని చూస్తుంది. భూమయ్య గారి కావ్యంలో లాగానే ఆమె రుక్మిణీదేవియే ఆ పుష్పబహూకృతికి అర్హురాలని, పైగా ప్రద్యుమ్నునికి తల్లి కాబట్టి మరింత ఆదరణ పాత్రురాలని అనుకొంటుంది. అయితే, భూమయ్య గారి కథలో లాగా కాకుండా, సుముఖి సత్యభామకు అడ్డుపడి, ఆమె మనసులో మానవసహజమైన మాత్సర్యాన్ని రగుల్కొలుపుతుంది. పారిజాతాన్ని దివినుంచి భువికి తీసికొనివచ్చేందుకు శ్రీకృష్ణుడు అర్జునునితో కలిసి దేవేంద్రుని యుద్ధంలో ఓడించి ఆ మహాకార్యాన్ని సాధిస్తాడు. నారదుడు సత్యభామకు, సుభద్రకు పతిప్రణయసిద్ధి వ్రతాచరణ విధిని గురించి తెలియజెప్పి, వ్రతం ముగిశాక కృష్ణార్జునులను ఇద్దరినీ దానంగా పొందుతాడు. సత్యాసుభద్రలు రత్నాభరణాదులతో భర్తలను విడిపించుకొనబోతే అందుకు తిరస్కరించి నారదుడు విపణివీథిలో వేలానికి పెట్టబోతాడు. చివరికి ఒక్కొక్క గోవును వారినుంచి దానంగా స్వీకరించి, కృష్ణార్జునులను వారికి అప్పగిస్తాడు. కథ సుఖాంతం అవుతుంది. ఇది ఉమాపతి మహోపాధ్యాయుని సంవిధానశిల్పం.

మహాకవి శంకరదేవుని పారిజాతహరణ నాటకావ్యంలోని చిత్రణ మరొక తీరున మనకు కనబడుతుంది. (అస్సామీ సాహిత్య పరిభాషలో నాట లేదా అంకీయ నాట కావ్యమంటే సంగీతరూపకమని అర్థం). నారదుని ద్వారా పారిజాత మహిమను విని రుక్మిణి ఆ దివ్యపుష్పాన్ని తనకు ఇవ్వమని భర్తను అడుగుతుంది. ఆ తర్వాత నారదుడే స్వయంగా సత్యభామ యింటికి వెళ్ళి, కృష్ణుడు పారిజాతాన్ని రుక్మిణికి బహూకరించిన ఉదంతాన్ని చిలవలుపలవలుగా వినిపిస్తాడు. సత్యాకృష్ణులు అర్జునసమేతంగా పారిజాతం కోసం దివికి వెళ్తారు. ఇంద్రుడు శ్రీకృష్ణుని ఎంతో గౌరవించినా, శచీదేవి మాటలకు లోగి, మనసు మార్చుకొని యుద్ధసన్నద్ధుడవుతాడు. పారిజాతం భువికి వస్తుంది. పతిప్రణయసిద్ధికై సత్యాసుభద్రలు శ్రీకృష్ణుని మహర్షికి దానం చేస్తారు. చివరికి నారదుడు సత్యాసుభద్రలచే గోదానం చేయించి, కృష్ణార్జులను విడిపిస్తాడు.

ఇవన్నీ దేశంలో వెలసిన కథలూ గాథలు. భూమయ్య గారి కల్పన వీటన్నింటికంటె వైచిత్రీప్రాణశక్తిని కలిగిన నవీనతమ చిత్రణ. ఇందులోని సౌందర్యదర్శనాన్ని అధికరించి, సృజనవిజ్ఞానాన్ని ఉపలక్షించి, కాల్పనిక నవ్య కవిత్వోద్యమంలో ఈ కావ్యానికి నిరూఢమైన స్థానాన్ని నిర్ణయింపవలసిన ఆవశ్యకత ఉన్నది.

భూమయ్య గారు సంప్రదాయబలాన్ని, పద్యకవిత్వాన్ని తమ సాహిత్య ప్రక్రియలకూ, సిద్ధాంతాలకూ అండదండలుగా నిలుపుకొన్నారు. దేశికవితారీతిని అభిమానించి తెలుగుదనానికి వెలుగునిచ్చే తేటగీతిని తమ కవిత్వాభివ్యక్తికి దీపికగా మలచుకొన్నారు. ప్రణయాన్ని ప్రతీకీకరించే లక్ష్యంతో వ్రాసినందువల్ల ఇందులో పారిజాతహరణ కథలోని సంఘర్షణ ఇతివృత్తం కాలేదు. వ్యక్తుల అభిమాన దురభిమానాలు, వ్యక్తిత్వవైరుధ్యాలు, జీవితంలోని ఉత్థానపతనాలు, దైవీ మానవశక్తుల నిమ్నోన్నతాల భావసంఘర్షణ చిత్రణకు రాలేదు.

కథానాయిక సత్యభామ ఇందులో మాత్సర్యగ్రస్తమనస్కురాలు కాదు. సపత్నీప్రాతికూల్యం ఆమె స్వభావం కాదు. దీనజనోద్ధరణకు దీక్షితురాలైన దీప్తమతి ఆమె. పారిజాతాన్ని పుడమికి తెచ్చి ఆర్తజనుల ఆర్తిని తొలగించటం మాత్రమే ఆమె జీవితాదర్శం. భూమయ్య గారు మానవతావాదం నీడలో ఆమె వ్యక్తిత్వాన్ని అపురూపమైన అందంతో మలిచి కష్టాలూ కన్నీళ్ళూ లేని లోకాన్ని చూడటంకోసం జీవించిన ఆదర్శమహిళగా ఆమెను తీర్చిదిద్దారు. భర్త ఆమె ఆదర్శానికి తోడునీడగా నిలిచాడు. ఇంద్రాది దేవతలు, నారదుడు ఆమెకు సహకరించారు. అంగనా పరివారమంతా అంగరక్ష అయింది.

ఈ ఆదర్శ ప్రతీకీకరణను రష్యన్ మేధావి తల్లజుడు, మహారచయిత మాక్సిమ్ గోర్కీ 1939లో ప్రకటించిన తన ‘ఇనోరియా రూస్కోయ్ లితెరతురీ’లో విశదీకరించాడు. “స్వచ్చమూ, స్వచ్చందమూ, విమలమూ, విషాదరహితమూ అయిన ఇటువంటి ఆదర్శ మానవసంబంధాన్ని నెలకొల్పటమే” కవిత్వోద్యమం పార్యంతిక ఫలమని నిర్దేశించాడు. “వాస్తవికజగత్తులో లేని అపూర్వమైన అనుభవాన్ని ఆదర్శంగా లోకానికి అందివ్వడమే కాల్పనిక సాహిత్యోద్యమ లక్ష్యం” అన్నాడు.

దీనినే మరికొంత విపులీకరిస్తూ ప్రముఖ విమర్శకులు ఎ.కె. ద్రెమోవ్ గారు తమ ‘రొమాంటిక్ టిపిఫికేషన్’ అన్న వ్యాసంలో, “సామాజిక పురోగమనానికి దోహదం చేసే నూతనస్వప్నాలను కల్పనాజగత్తులోనికి తీసుకొనిరావటం నవ్య సాహిత్య సంప్రదాయాలలో ఒకటి” అని మరింత స్పష్టం చేశారు. “ప్రణయతత్త్వ ప్రతీకీకరణలోని అభ్యుదయాదర్శం వర్తమానం అనే పునాదిపైని ఒక నవసమాజాన్ని నిర్మించటమే” అని చాటి చెప్పారు.

“వర్తమానపరిస్థితుల పట్ల అసంతృప్తిని కాల్పనిక రచయిత కళాదర్శంగా పరివర్తించి, వాస్తవజగత్తులో చోటుచేసుకోనున్న అనివార్య పరిణామాలను సాహిత్యంలో ఘటితాంశాలుగా నిరూపించటం జరుగుతుంది. ఆ ఆదర్శానికి స్పష్టమైన రూపం లేనప్పటికీ, అందులో సంభావ్యత లోపించినప్పటికీ – ఆగామి యుగంలోని దృగ్విషయాలన్నీ పాఠకులకు దృష్టిగోచరం అవుతాయి. కళాప్రపంచం లోని ఆ రసాత్మకత సమ్మోహకంగా భాసించి, సమాజం దానిని వాస్తవీకరించాలనే ప్రయత్నాన్ని మొదలుపెడుతుంది. సంఘజీవితంలో మార్పులు వస్తాయి. మానవ ప్రవృత్తి సంకుచిత స్వార్థం నుంచి విడివడి విశ్వశ్రేయోభిముఖంగా ప్రయాణిస్తుంది” అని వివరించారు. ఆ కాల్పనికాదర్శమే పారిజాతాపహరణాన్ని పారిజాతావతరణ కావ్యంగా భూమయ్య గారిచే నవ్యప్రతీకాత్మకంగా ఆవిష్కరింప జేసింది.

రమ్యకవితావిలాసం

భూమయ్య గారి కవిత మసృణభావోపేతమైనది. తేటగీతి ఆయన చేతిలో కొత్త ఒయ్యారాలను సంతరించికొని, ఒడుపులను నేర్చికొన్నది. సత్యాకృష్ణుల దాంపత్య జీవనమధురిమను ఆయన ఎంతో రమ్యంగా చిత్రించారు. సత్యభామ ఈ కావ్యంలో శ్రీకృష్ణ భక్తురాలు. భక్తిభావం ఆమె జీవితాన్ని నిర్మలీకరించింది. స్వార్థనిర్ముక్తమైన ప్రేమాతిశాయిత విశ్వప్రేమగా రూపుదిద్దుకొన్నది. ఇదే భూమయ్య గారి కవిత్వాదర్శం.

అంధులు కననేర్చిన, వికలాంగు లెల్ల
నడువ నేర్చిన, బధిరజనమ్ము లెల్ల
వినగ నేర్చిన, ఆ మూగ జనులు మాట
లాడ నేర్చిన – ధర కాదొ అమరపురము.

ఆకలికి అన్న మొసంగునంచు వింటి,
ఏది కోరిన అది ప్రజ కిచ్చునంట;
ప్రజల బాధల బాపు నా పారిజాత
వృక్ష మిచట నున్న కలుగు హితము ప్రజకు.

అని సత్యాదేవి అభ్యుదయ హృదయాకాంక్ష. సత్యాకృష్ణులు స్వర్గానికి తరలివెళ్ళినప్పుడు భూమయ్య గారి మనస్సులో ఉన్నది ఈ కాల్పనిక కవిత్వోద్యమ చైతన్యమే.

లోకం సత్యాకృష్ణుల దీనవత్సలతను కనుగొని మనసారా సన్నుతించింది. ఈ కావ్యం ప్రసాదించిన కొత్తచూపుకు పరవశమైన పాఠకలోకం ఆ పలుకులను ప్రతిధ్వనిస్తుంది:

పుట్టి లోక మెరుగను కన్ను పుకున్న,
కన్ను పుట్టెను; నిన్ను, లోకమును గంటి,
పుట్టిన దిపు డన్న తలంపు పుట్టె మదిని,
పుట్టి నిను పట్టుకొంటి, నీ పట్టు విడువ.

అచ్చమైన కవిత్వాభివ్యక్తికి ప్రథమోదాహరణం ఇది. భూమయ్య గారి శైలీశైలూషి నృత్యకళాకోవిదత్వానికి ఉదాహరణీయం.

ఈ కథాసూత్రం అల్లికను మొదలు పెట్టిన నారదుడే కథకు పరిసమాపన భరతకృత్యాన్ని నిర్వహించాడు. “అందుకొనరాని అతిలోకమైనవాని, నందుకొనివచ్చి మానవులందరికిని, అందజేయువారికి శుభమస్తు” అని నిండు దీవెనలను కురిపించాడు.

అక్షరాక్షరం ప్రేమభావం ఉట్టిపడుతున్న ఈ నవీన కావ్యావతరణకు హృదయపూర్వక స్వాగతం!

‘కవిరాజహంస’ ఆచార్య భూమయ్య గారికి భూమానందపూర్వకంగా నిండు కైమోడ్పులు!!

ఏల్చూరి మురళీధరరావు

***

పారిజాతావతరణము
రచన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య
ప్రచురణ: మనస్వినీదేవి
పుటలు: 100
వెల: ₹ 100
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ – ఫోన్: 040-24652387
విశాలాంధ్ర అన్ని శాఖలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here