పరిమళించిన మానవత్వం

1
7

[dropcap]ర[/dropcap]విచంద్ర ఇంజనీర్ కావడానికి అతని తల్లి పడిన శ్రమ, ఆమె ఆవేదన, ఆశయం, కృషి అన్నిట్ల ఫలితమే అతన్ని ఇంజనీరుని చేసింది.

కొడుకు ఇంజనీరు అయ్యేడన్న వార్త విన్నప్పుడు ఆమె కళ్లలో మెరసిన కాంతి అతనెప్పుడూ మరచిపోలేడు. అదో అద్భుతమైన దృశ్యం. రవిచంద్ర తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయేడు. అతని తల్లి అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ అతన్ని తీర్చిదిద్ది ప్రయోజకుడ్ని చేసింది. ఎన్ని కష్టనష్టాలకు తల వొగ్గి, కొడుకుని ఇంజనీరుగా చూడాలన్న ఆమె కలలకు అతనో రూపాన్నిచ్చి, శాయశక్తులా ప్రయత్నించి ఆమె కలలను సార్ధకం చేసాడు రవిచంద్ర. ఉద్యగంలో చేరి మొదటి జీతం అందుకుని తల్లిని చూసి ఆమె దీవెనలు అందుకోవాలని అతని మనసు ఆరాటపడుతోంది. అతని ఈ ప్రయాణానికి కారణం ఆమె!

రైలు బండి కన్నా తొందరగా పరుగులు పెడుతున్నాయి అతని ఆలోచనలు. ఎప్పుడు తల్లిని చూద్దామా ఎప్పుడు తల్లితో తనివి తీరా, కులాసాగా కబుర్లు చెపుదామా; తల్లి ఒడిలో తల దాల్చి ఆమెతో ముచ్చట్లాడుదామని అతని మనసు ఆరాట పడుతోంది. అతనికి క్షణం ఓ యుగంలా అనిపిస్తోంది. రెక్కలుంటే ఎంత బాగుణ్ణు అమ్మ ముందు వాలిపోనూ అని తొందర పడుతంది మనసు. తనైన వాళ్లను, అత్యత ఆప్తులను కలుసుకోవాలన్న ఆరాటం మనిషిని, మనసుని నిలకడగా వుండనీయదు. ఆ ఆతృత ఆరాటం అలాంటివి మరి!

మంచి ఉద్యోగం దొరికింది. తల్లి శ్రమ తన కృషి ఫలించింది. ‘ఇక తల్లికి ఏ కష్టం యిబ్బంది కలగకుండా కంటికి రెప్పలా చూసుకోవాలి. ఒక సుకుమారమైన పువ్వులా చూసుకోవాలి. ఇన్నేళ్లు తన కోసం పడిన శ్రమ అలసట, ఆవేదన మరిపించి ఆమెను అపురూపంగా చూసుకోవాలి! మరి జీవితంలో కష్టం అనేది లేకుండా, మహారాణిలా ఆమెను చూసుకోవాలి’ – యివి రవిచంద్ర ఆలోచనలు. అతని ధ్యాస, శ్వాస అంతా తల్లి గురించే!

రైలు బండి గమ్యం చేరుకోబోతున్నదనగా రవిచంద్ర తొందర, ఆతృత మరీ అధికం అయ్యాయి. ఒక్కక్షణం ఆలస్యం కూడ అతను భరించలేకపోతున్నాడు. రైలు బండి వేగం తగ్గింది. ప్లాట్‌ఫాం సమీపిస్తోంది బండి. కిందకి తొందరగా దిగయ్యాలన్న ఆరాటం రవిచంద్రలో అధికం అయింది. బేగు భుజానికి తగిలించుకుని ఒక్క సారిగా కిందకి దూకేడు. తల్లి దగ్గరకి వెళ్లబోతున్నానన్న ఆలోచన, ఆనందం అతనిలో అధికమై మరే ఆలోచనలకు తావివ్వలేదు. భుజానికి తగిలించుకున్న బేగు బండి తలుపుకు కొట్టుకోవడం బండి అగే ముందు ముందుకు వెనక్కు ఊగిసలాటలో అతను అదుపు తప్పి, తూలి ఫ్లాట్‌ఫాం మీదకి పడిపోవడం అన్నీ నిముషాల మీద జరిగిపోయేయి.

రవిచంద్రకి ఒళ్లంతా గాయాలై రక్తం కారుతోంది. మనిషి స్పృహలోనే వున్నాడు. కాని లేవలేని పరిస్థితి చుట్టూ జనం మూగిపోయేరు.

“ఏంటీ? ఏం జరిగిందీ?” అంటూ అటుగా వచ్చేడు స్టేషను మాష్టారు. రక్తపు మడుగులో నిస్సహాయ స్థితిలో వున్నాడు రవిచంద్ర. అతని పరిస్థితి చూసేడు స్టేషను మాష్టారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పింది విన్నాడు. ఓసారి తల తిప్పి చూసేడు.

“సరి! సరి! మీరంతా ఎందుకిలా గుమిగూడారు? వెళ్లండి! వెళ్లి మీ పన్లు చూసుకోండి?” అంటూ కసిరాడు అధికార స్వరంతో. రవిచంద్ర అతన్ని స్టేషను మాష్టారుగా గుర్తించాడు. అతని వంక ఆరాధనా పూర్వకంగా చూస్తూ తన జేబులో వున్న డబ్బు, వేలికి వున్న దేముడి వుంగరం తీసి యిస్తూ “నన్ను ఎలాగైనా కాపాడండి సార్! మా అమ్మను తొందరగా చూడాలి. ఆమె నా కోసం ఎదురు చూస్తూ వుంటుంది. ఆమె కోసమైనా నన్ను కాపాడండి! ప్లీజ్! మీకు పుణ్యం వుంటుంది!” అంటూ రెండు చేతుల జోడించి నమస్కరింస్తూ ప్రాధేయ పడ్డాడు రవిచంద్ర. స్టేషను మాస్టారు గద్దింపులకి జనం దూరంగా వెళ్లిపోయేరు. కాని దూరం నుండి ఈ దృశ్యం చూసి బాధపడ్డారు. కాని ఏం చేస్తే ఏం అవుతుందో అన్న భయం వారిని ఏమి చెయ్యనివ్వ లేదు. ఏ ఒక్కరు ఏం చెయ్యలేకపోయేరు. ఆ క్షతగాత్రుని ఆవేదన, రోదన స్టేషను మాస్టారు మనసుని కదలించలేదు. అతనిలో ఏ మాత్రం స్పందన లేదు.

“మనకెందు కొచ్చిన పెంటండీ బాబూ! లేని పోని చికాకులు తెచ్చి నెత్తికెక్కించుకోవాల? కేసులు కోర్టులు అంటూ ఆఫీసుల చుట్టూ తిరగాల ఎందుకొచ్చిన తంటాలియన్నీ బాబూ! గూట్లో రాయిని తీసి గుండల మీదెట్టుకున్నట్టు ఈ చికాకులన్నీ మనకి ఎందుకు సుట్టుకోవాల? ఎల్లండల్లండి! మీదారిన మీరెల్లండి?” అంటూ అక్కడ మిగిలి వున్న కాస్త జనాన్ని తరిమి రవిచంద్ర యిచ్చిన డబ్బు, ఉంగరం నెమ్మదిగా జేబులో వేసుకుని, డ్యూటీ అవర్స్ అవగానే వెళ్లిపోయేడు. ఎవిరికి తోచిన విధంగా వాళ్లు అనుకుంటూ నెమ్మది నెమ్మదిగా జనం నిష్క్రమించారు. ఫ్లాట్‌ఫాం అంతా ఖాళీగావుంది.

ఈ దృశ్యం చూసి ప్రకృతి చెలించింది. ఆకాశం స్పందించి మబ్బులతో తన బాధను పంచుకుంటున్నట్టు మౌనంగా రోదిస్తూ వర్షం రూపంలో కన్నీరు కారుస్తోంది. గగనం గుండలు బ్రద్దలయ్యే యన్నట్లుగా ఉరుములు ఉరుముతున్నాయి. ఆశ్చర్యపోయి ఆవేదన మనసంతా కళ్లు చేసుకున్నట్లుగా ఆకాశం మెరిసింది. తనను తానే ఓదార్చుకుని సంభాళించుకుని మౌనంగా రోదిస్తోంది. పడమటి దిక్కున ఆకాశం ఎర్రబడుతోంది. మెల్ల మెల్లగా సూరీడు మబ్బు తెరల్లోంచి బయటపడి, సాయంసంధ్యల నెత్తుటి ముద్దలా ఎరుపెక్కుతున్నాడు. అస్తమించే అవస్థలో ఫ్లాట్‌ఫాం మీద రవిచంద్ర కూడ అలాగే అసహనంగా అచేతనంగా పడివున్నాడు. వర్షంలో తడిసిన కాకులు, అటు యిటు ఎగురుతూ తమ రెక్కల్ని టప టప లాడిస్తున్నాయి. ఓ కాకి ఒక కరెంటు తీగ మీద పడి చచ్చిపోయింది. పక్కన కాకులు అరిచి, గోల చేస్తూ ఆ కాకి చుట్టూ చేరి అటు యుటు తిరగుతూ (ఎగురుతూ)తమ సంతాపాన్ని, దుఃఖాన్ని మిగతా కాకులకి తెలియజేస్తున్నాయి. అది ఆ కాకికి జరిగిన విపత్తుకు తమ గాఢ సంతాపం అయివుండవచ్చు. ఆ అరుపులకి అర్థం. ఆ విధంగా కాకులు తమ ఆవేదనని, బాధని వ్యక్తపరస్తూన్నాయేమో మరి పశువుకి, పక్షులకి వున్న జాతి అభిమానం సమైక్యతా కూడా లేదేమో ఈ నాగరికత నేర్చిన మనుషులకి అనుకునే వుంటుందా కాకి మూక!

అరగంట గడిచింది. రవిచంద్ర స్థితిలోను పరిస్థితిలోను ఏ మార్పూ లేదు. అతనలాగే అచేతనంగా పడివున్నాడు. డ్యూటీ ముగించుకుని అటుగా వెళ్లిపోతున్న రైల్వే పోర్టరు కంట పడిందా దృశ్యం!

“అరే! యిదేటీ? ఈ బాబు నెవరూ సూడ్నేదేటి? అరె రె….!” అంటూ దగ్గరగా వచ్చి చూసేడు. అలా పడివున్న రవిచంద్రను చూడగానే అతని హృదయం ద్రవించింది. ముక్కు దగ్గర చెయ్యి వుంచి చూసేడు. శ్వాస ఆడుతోంది. నెమ్మదిగా కళ్లు విప్పాలని ప్రయత్నింస్తున్నాడు రవిచంద్ర. కాని మాట పలుకు లేవు. సహాయం కోసం సాటి కూలీలను కేక వేసేడు పోర్టరు.

“ ఓ! ఎంకటేసూ! ఒరే ఏసుపాదం! అరే రహీమన్నా! రండిరా! రండి! రండి! బేగ రండిరా! అంటూ అందర్నీ కేక వేసేడు. ఆతృతగా అంతా పరుగు పరుగున వచ్చి చేరేరు ఆ కేకలకి. ఆ దృశ్యం చూసిన ఓ కూలీ అన్నాడు ఆత్రంగా “ఆటో తెత్తానన్నా! ఆ బాబుని లెగనెత్తి పట్టుకోండి, నెమ్మదిగా” అని అనగానే మరో కూలీ యిద్దరి సాయంతో లేవనెత్తి తన కండువాతో అతని ముఖం తుడిచి “అరే సిమాద్రీ! సోడా కాయ తీసుకురా!” అని పురమాయించేడు.

 “ఓరే ఓబులేసూ! నీసీసాలో నీళ్లతో మొగం కడగరా ఏ తల్లి కన్న బిడ్డో! అంటూ అంతా ఎవరికి తోచిన సపర్యలు వాళ్లు చేసేరు.

ఇంతలో కానిస్టేబుల్ అక్కడికొచ్చి లాఠీ టక టక లాడిస్తూ…. “ఏం చేస్తున్నార్రా! మీరంతా యిక్కడ?” అంటూ అడిగాడు.

ఆటో తెచ్చే ప్రయత్నంలో ఒకరు. రవిచంద్రకి సోడా పట్టే ప్రయత్నంలో మరొకరు యిలా ఎవరికి తోచిన సపర్యలు వాళ్లు చేస్తున్నారు ఆ సమయానికి.

“ఒరే ఈరిగా! ఆ అబ్బాయిని అమాంతం రచ్చించెయ్యాలనే? అయినా నీ కెందుకొచ్చిన తంటారా యిది? నాకు బుద్ది లేకనే సయ్యలేదనుకున్నావా? ఊ… సినిమా హీరోలా బిల్డప్పియ్యమాక! అనవసరంగా కరుసయిపోతావు రోయ్! నీకెందుకొచ్చిన పని గాని. ఆడ్నలా ఒగ్గేసి నీదారిన నువెళ్లరా బాబూ! అన్నాడు మరో ఆసామి.

“అదేటి బాబు అలగంటారు? ఆ బాబుది మాతరం పేణం కాదా? నాకు తెలిసిందొక్కటే బాబూ. ఏ పోలీసోళ్లు ఏ నాయిత్తానాలూ యివ్వలేనిది మడిసి పేణాలు. చేతనయితే అవి కాపాడాలి అంతే బాబు నాకు తెలిసింది!”

“ఏంట్రయ్! పె…ద్ద సిన్మా హీరోలా పోజులు పెట్టమాక! ఆడ్నలాగే ఒగ్గేయ్! రేపు కేసయితే అప్పుడేడుద్దువుగాని. నీ వల్లేం అయే పని కాదని నీ దారిన నువ్వు పోరా పోలీసోళ్లొచ్చాక అప్పుడు… అప్పుడు సుద్దాంలే! అన్నాడు నిర్లక్ష్యంగా.

“ఏటండీ సూసేది అప్పుడు? అప్పుడు సూసేది ఆ బాబు శవాన్నా?… పోలీసోళ్లు! పోలీసోళ్లు అంటూ మమ్మల్ని ….. బెదిరిచమాకండి. ఆళ్లేటి సేత్తారండీ? మహా అయితే మామక్కలిరగదన్ని, మమ్మల్ని బైటకెల్లమంతారు. కూలి పని కెక్కడయితే ఏం లేండి? మాదేం పెబుత్తం యిచ్చిన నౌకిరీ కాదు బాబూ! కట్టపడి పని సేత్తాం! కడుపుకి కూడు తింటాం. మాం బేంకుల్లో డబ్బులు దాచుకోలేం. మేడలు, మిద్దెలు కట్టనేం! మాకిదే ఆనందం బాబూ. పదరా ఏసుపాదం! తరవాత ఆ బాబుతో తీరిగ్గా కబుర్లాడదువు. యిప్పటికే నేటయిపోనాది. పద! పద! అబాబుని పట్టుకో! అదిగో ఆటో తెచ్చిండు” అంటూ అంతా కల్సి రవిచంద్రని ఆటో దగ్గరికి తీసికెళ్లి లోపల పడుకోబెట్టేరు. ఆ రోజు అర్జించిన కూలి డబ్బులు పోగుచేసుకున్నారు. మనికి జీవితంలో పని కొచ్చేది నలుగురు అని అప్పటికే తెల్సిరాలేదు ఆ కానిస్టేబులుకి. రవిచంద్రను తీసికెళ్లిన ఆ నలుగురు తమకు రాబోయే విపత్తు గురించి (ఒక వేళ ఏదయినా జరిగినా) మరేయితర విషయాల గురించి గాని, డబ్బు గురించి గాని ఆలోచించలేదు. వారి శక్తి దయాగుణం వారి ధనం, వారంతా ఆలోచిస్తున్నది ఒక్కటే ఆదే రవిచంద్ర ప్రాణాలు కాపాడడం. అదే వారి ఆలోచన, ఆవేదన ధ్యేయం.

వారి ఆలోచనల కన్నా వేగంగా దూసుకుపోతోంది హాస్పిటల్ వైపుగా రవిచంద్రను తీసుకువెళ్తున్న ఆటో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here