గుండెల్ని మెలిపెట్టే ‘పరియేరుం పెరుమాళ్’

5
7

[box type=’note’ fontsize=’16’] “గుర్రమెక్కిన పెరుమాళ్ కథ యేమిటి? ఈ కథలో అది ప్రత్యేకంగా యేమి సూచిస్తుంది?” అని ప్రశ్నించి, “కథకు స్పష్టమైన దిశానిర్దేశం వుంది. ముగింపు కూడా అసంపూర్తి సంభాషణతో, కాస్త ఆశావహంగానే ఉంది” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘పరియేరుం పెరుమాళ్’ సినిమా సమీక్షలో. [/box]

[dropcap]ఒం[/dropcap]టికన్నుతో చిత్రాన్ని, మరో కన్నుతో సబ్ టైటిల్స్ని చూశాను ఈ చిత్రాన్ని. అలా చూసినా ప్రభావావంతమైన చిత్రామే. అయితే నిజంగా పూర్తిగా ఆస్వాదించాలంటే (మరో పదం తట్టట్లేదు, యెందుకంటే ఇది గుండెల్ను మెలిపెడుతుంది అలాంటప్పుడు ఆస్వాదించడం అనవచ్చునా?) తమిళం భాషా సంస్కృతులు తెలిసిన వాళ్ళకు యెక్కువ వీలు. నా వ్రాత ఆ వార లోతు తక్కువే వుంటుంది. గోడలకు పోస్టర్లు వేస్తున్నుప్పుడు, ఆ పాటలప్పుడు, rap అప్పుడు, సాంస్కృతిక భోగం (లాంటి) నృత్యం అప్పుడు నా స్పందనలను పూర్తిగా అక్షరీకరించలేను. అయినా సాహసం.

కులాల వారీగా విభజించబడ్డ ఈ దేశంలో వో వెనుకబడ్డ కులస్థుడు లా కాలేజీలోనైతే సీటు సంపాదిస్తాడు గాని, పరిస్థితుల్లో పెద్ద మార్పు వుండదు. బాహాటంగా చేయలేనివి దొంగచాటుగా, డబ్బిచ్చి చేయించడం; ఇక చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా వుండేలాంటి అమానవీకరణ దళితుల పట్ల కొనసాగుతూనే వుంది. యెన్నో ప్రేమ కథలు విరామం లేకుండా వస్తూనే వున్నాయి, కాని ఇలాంటి కథలు తక్కువే. మరాఠీలో “court”,”సైరాట్లా”గా తమిళంలో పా రంజిత్ సినెమాలు. పక్క రాష్ట్రాలలో లా మన తెలుగు రాష్త్రాలలో మనం ఇలాంటి చిత్రాలు వూహించనూ లేము.

చిత్రం మొదట్లోనే నలుగురు దళితులు తమ వేటకుక్కలకు స్నానం చేయిస్తూ, తాము కబుర్లాడుకుంటూ వుంటారు వో నీటి మడుగు దగ్గర. అంతలో పెద్ద కులం వారొస్తారు. మిగతా వాళ్ళు భయంతో ముందే లేచి వెళ్ళిపోయినా, కాస్త పౌరుషం ప్రదర్శించిన పరియేరుం పెరుమాళ్ (కతిర్) నల్ల కుక్క కురుప్పిని వాళ్ళు రైలుపట్టాల దగ్గర కట్టేసి అది రైలు చక్రాల కింద చనిపోయేలా చేస్తారు. అంతకు ముందే ఆ నీటి గుంత దగ్గర ఉచ్చ కూడా పోస్తారు. ఇది ప్రముఖంగా ఆ వైఖరి ని తెలుపుతుంది దళితులపట్ల. మిగతా చిత్రమంతా ఇదే పరచుకుని వుంది!

పరి– పరియేరుం పెరుమాళ్ కు క్లుప్త రూపం, తిరునల్వెల్ ప్రభుత్వ లా కళాశాలలో జేరతాడు. అన్ని విషయాల్లోనూ చురుకుగా వున్న అతను ఇంగ్లీషులో మాత్రం మెతక. ఆ కారణంగా అపహాస్యాలకూ అవమానాలకూ గురవుతాడు. సహ విద్యార్థిని జో (ఆనంది. జ్యోతి కి క్లుప్తనామం) అతనికి ఇంగ్లీషు నేర్చుకోవడంలో సహాయం అందిస్తుంది. ఇద్దరూ మంచి మిత్రులవుతారు. అతని పట్ల తనకు వున్న ఇష్టాన్ని తన ఇంట తెలుపుతుంది కూడా జో. అక్క పెళ్ళికి పరిని మాత్రం ఆహ్వానిస్తుంది, తప్పకుండా రమ్మంటుంది. పిల్లలకు అడ్డురాని కులాలు, పెద్దవాళ్ళకు మాత్రం తప్పకుండా వస్తాయి. ఆ సమయంలో జో ని అక్కడి నుంచి తప్పించి వచ్చిన పరిని వో గదిలోకి తీసుకెళ్ళి కుమ్మేసి, మొహాన ఉచ్చ పోస్తారు. మొదట్లో ఆ నల్ల కుక్క కురుప్పి కథ ఈ విధంగా పునరావృతమవుతుంది. ఆ అవమానం అతన్ని క్రూరుడిగా మారుస్తుంది. అతన్ని మరింతగా అణిచివేయడానికి అతన్ని వో సారి లేడీస్ టాయ్లెట్లలోకి తోసి గొళ్ళెం వేస్తారు. ప్రిన్సిపాలుకు ఫిర్యాదు వెళ్తుంది. మరోసారి తాగి కాలేజికి రావడం, ఇంకోసారి దెబ్బలాట కారణంగా ఇలా అతనికి కాలేజి నుంచి వరుసగా వార్నింగులు అందుతుంటాయి. తండ్రిని రప్పించి ఫిర్యాదులూ చేస్తారు. అతను మాత్రం తనకు జరుగుతున్నవేవీ జోకి చెప్పడు. తన యుద్ధం తనే చేస్తుంటాడు. అతని మీద హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది. కథను కేంటీనులో జో తండ్రి, పరిల సంభాషణతో ముగిస్తాడు దర్శకుడు.

పా రంజిత్ నిర్మించిన, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినెమా దళితుల పరిస్థులను అద్దం పడుతుంది. యెక్కడా పెద్ద పెద్ద తీర్మానాలు అవీ వుండవు. కథ సహజ గతిలో సాగుతుంది. అన్నీ మన ముందే వుంటాయి, గ్రహించాలంతే. సెల్వరాజ్ దర్శకత్వం, కతిర్ నటనా బాగున్నాయి. కాలేజీ అబ్బాయి, అమ్మాయి వున్నప్పటికీ వాళ్ళ మధ్య ప్రేమ వున్నప్పటికీ ఆ అంశం చుట్టూ కథ అల్లటం బదులు వారి వెనుక వున్న సామాజిక పరిస్థితులమీద ఫోకస్ యెక్కువ. వో సుపారీ హంతకుడు పాత్రను తయారుచేసి ఇలా యెన్నెన్ని రకాలుగా దళితుల పట్ల వివక్ష వుంటుందో, యెలా అణిచివేస్తారో అన్నీ చూపించాడు దర్శకుడు. మరెవరూ ఆమెను చూడకుండా వో దళిత స్త్రీని గుండు గొరగడం, వొకతన్ని బస్సునుంచి తోసి చంపెయ్యడం : పై కులం అమ్మాయిలను కోరే సాహసం కూడా చేయకూడదని మిగతా దళితులకు హెచ్చరికగా , పరి తండ్రిని రోడ్డు మీదే లుంగీ లాగి పారేసి నగ్నంగా చేసి అవహేళన చేస్తూ వెంబడించడం. అలాగే సమాజంలో జరుగుతున్నట్టే యెక్కడా ఇవి చర్చనీయాంశాలు కావు, ఎవరికీ శిక్షలు పడవు. వాళ్ళ చావు వాళ్ళు చావాల్సిందే. కాలేజిలో జేరిన మొదటి రోజే యేం కాదలిచావు అన్న దానికి “డాక్టర్” అంటాడు పరి. లా చదివి డాక్టర్ వి అవుతావా అని అడిగితే, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అవుతా అని చెబుతాడు. అలాంటి ఆశయంతో వచ్చిన వాడికి వొక విలువైన ఆయుధం అయిన విద్యను అభ్యసించడానికి కూడా యెన్నెన్నో అవరోధాలు. చివర్లో ఆ ప్రిన్సిపాల్ అంటాడు కూడా, నేనూ చర్మకారుడి సంతానమే, కాని నా తండ్రి ఉనికిని గర్వంగానే ప్రకటిస్తాను. నేను నా ఫోకస్ ని చెదరనివ్వలేదు కాబట్టీ ఈ రోజు ఈ సీటుమీద కూర్చున్నాను. నువ్వు కూడా చేయాల్సింది అదే, అంటాడు. ఈ విధంగా కథకు స్పష్టమైన దిశానిర్దేశం వుంది. ముగింపు కూడా అసంపూర్తి సంభాషణతో, కాస్త ఆశావహంగానే ముగించాడు. వొక పాట సురియల్ పోకడలు పోతుంది. దాని నిండా నీల వర్ణం అలుముకుంటుంది. కురుప్పి చనిపోయినా కథంతా నడుస్తూ వుంటుంది, వొకోసారి గాయాలతో, వొకోసారి నీలి రంగు పులుముకుని. చక్కటి మెటఫర్ లా వాడుకున్నాడు దాన్ని. అలాగే పరి తండ్రి ఆడవేషం వేసి చేసే వీధి నృత్యం అద్భుతంగా వుంది. మంచి సంగీత నేపథ్యంలో ఆ నృత్యాన్ని ఆస్వాదించేవాళ్ళ మధ్య అవమానం, సిగ్గు, అపరాధ భావనలతో పరి నిలబడి వుంటాడు.

సంగీతం, చాయాగ్రహణం కూడా చక్కగా వున్నాయి. నేనైతే ఇంతే వ్రాయగలను. గుర్రమెక్కిన పెరుమాళ్ కథ యేమిటి? ఈ కథలో అది ప్రత్యేకంగా యేమి సూచిస్తుంది? ఇలాంటి కొన్ని కల్చరల్ స్పెసిఫిక్ విషయాలు ఆ ప్రాంతాన్ని, భాషనూ యెరిగినవాళ్ళు మెరుగ్గా చెప్పగలరు. కాని అవేమీ తెలీకపోయినా సినెమా చూస్తే దాని ప్రభావానికి లోను కాకుండా మాత్రం వుండరు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here