పర్యాటకులకు గుప్తనిధి – గుజరాత్

0
12

[ఇటీవల గుజరాత్ లోని పలు దర్శనీయ ప్రాంతాలలో పర్యటించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ షేక్ అమీర్ బాష.]

[dropcap]దే[/dropcap]శ విదేశాల నుంచి పర్యాటకులను విశేషంగా ఆకర్షించే రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. గుజరాత్ అందాలను అన్వేషించాలని నేను కుటుంబ సమేతంగా బయలుదేరాను. గుజరాత్‌లో చూడవలసిన ముఖ్య ప్రదేశాలను ఎంచుకొని, ప్రయాణ సౌకర్యార్థం ‘వైబ్రాంట్ హాలిడేస్’ (Vibrant Holidays) అనే సంస్థ సహకారం తీసుకున్నాం. సంస్థ కార్యదర్శి శ్రీ కృనాల్ శుక్ల గారు (Krunal Shukla) మా ప్రయాణ ప్రణాళికను రూపొందించి, మేము వెళ్లిన ప్రతి చోట మంచి వసతి సౌకర్యం, కారు ఏర్పాటు చేశారు. 11 రోజుల పర్యటన కార్యక్రమం. ఒకటవ తారీకు ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నాం. విమానాశ్రయంలో వైబ్రాంట్ వారి ప్రతినిధి మమ్మల్ని ఆహ్వానించి, హోటల్‌కి తీసుకొని వెళ్లారు.

ప్రయాణ ప్రయాణ బడలిక తీర్చుకొని, ముందుగా మహాత్మా గాంధీజీ 1917లో సబర్మతి నదీ తీరాన విశాలమైన ఆవరణలో నిర్మించిన సబర్మతి ఆశ్రమం దర్శించాము. ఆశ్రమ కార్యకలాపాలతో పాటు గాంధీజీ జీవితానికి, భారత స్వాతంత్ర సమరానికి సంబంధించిన చిత్రపటాలు దర్శించాము.

ఇక్కడి నుంచి గుజరాత్ రాజధాని నగరం గాంధీ నగర్ ద్వారా ప్రయాణించి ‘మోదేరా’ (Modhera) చేరుకున్నాం. ఇది చాళుక్య రాజుల కాలంలో ఓ మహా పట్టణం. దాన్ని చరిత్రలో ధర్మారణ్యం అని కూడా పిలిచేవారు. 12వ శతాబ్దంలో చాళుక్యులు కట్టించిన అతి సుందరమైన సూర్య దేవాలయం ఇక్కడ ఉంది.

పుష్పవతి నదీ తీరంలో కట్టిన ఈ ఆలయం, దానిని అనుకొని ఉన్న పుష్కరిణి యొక్క వాస్తు కళ, శిల్ప సంపదను వర్ణించనలవి కాదు. త్రేతాయుగంలో రావణ సంహారం తరువాత శ్రీరామచంద్రుడు పాప పరిహారార్థం ఈ ప్రాంతంలో యాగం చేశాడని పౌరాణిక గాథ. ప్రస్తుతం ఈ ప్రాంతం భారత పురావస్తుశాఖ పర్యవేక్షణలో ఉంది. ఇక్కడి నుండి 50 కిలోమీటర్ల దూరంలో మరో అద్భుతమైన చారిత్రక కట్టడం ‘రాణి కీ వాప్’ లోతైన అందమైన బావి. దాదాపు వేయి మీటర్ల లోతు బావి సరస్వతీ నదీతీరానికి సమీపంలోనే ఉంది. ఈ చారిత్రాత్మక కట్టడాన్ని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. అత్యంత రమణీయమైన శిల్పసంపదతో అలంకరిచబడిన ఈ బావిని క్రీ.శ. 1063లో రాణి ఉదయమతి తన భర్త రాజా బీమ్‌దేవ్ జ్ఞాపకార్థం నిర్మించారు. సరస్వతీనది జలాలను ఈ బావిలోకి మళ్లించి ప్రజల సౌకర్యార్థం నిల్వ ఉంచే వారని చరిత్ర. నిజంగానే ఇది ఓ అద్భుతమైన కట్టడం.

తిరుగు ప్రయాణంలో ఇక్కడ నుండి అహ్మదాబాద్ వెళ్ళి అటల్ వంతెన, మోడీ స్టేడియం, డైనోసారస్ పార్కు చూచి, అనంతరం ‘అక్షరధాం’కు వెళ్ళాం.  చలువరాళ్ళతో నిర్మించబడిన అక్షరధామ్ మనోహరమైన ఆలయం. చుట్టూతా పచ్చటి ప్రశాంత వాతావరణం. ఇక్కడ సాయంత్రం జరిగే దృశ్య శ్రవణ ప్రదర్శన (లైట్ అండ్ సౌండ్ షో) విశేషమైన ప్రజాదరణ పొందింది. తప్పక చూడవలసినది.

మరుసటి రోజు వదోదరా (వట వృక్షం-Baroda)కు బయలుదేరే ముందు అహ్మదాబాద్ లోనే మరో అపురూపమైన చారిత్రాత్మక కట్టడం ‘సిద్ది బషీర్’ మసీదును దర్శించుకొన్నాము. ఈ మసీదుకు అనుకుని ఉన్న షేకింగ్ మీనార్లు చిత్రమైనవి. 1452లో కట్టబడిన ఈ మసీదు మరాఠా యుద్ధంలో చాలా వరకు కూలిపోయి, ముఖద్వారం ’షేకింగ్ మీనార్లు’ మాత్రం పర్యాటకులను ఈ రోజుకూ ఆకర్షిస్తాయి. సైన్సుకు అంతు పట్టని ఓ వింత. మనం ఒక మీనారును కదిలిస్తే కొన్ని సెకండ్ల తర్వాత రెండవ మీనార్‌లో ఆ కదలికల తాలూకు ప్రకంపనాలు కనిపిస్తాయి. రెండు మీనార్లను కలిపే కట్టడంలో ఎలాంటి కదలిక ఉండదు. ఆనాటి గుజరాత్ సుల్తాన్ అహ్మద్ షా బానిసైన సిద్ధి బషీర్ ఈ మసీదును కట్టించాడని గ్రంథస్తం అయింది. ఈ కట్టడం కూడా పురావస్తు శాఖ అజమాయిషీలో ఉంది.

వదోదర గొప్ప చారిత్రాత్మక నగరం. గైక్వాడ్ రాజ వంశస్థులు కట్టించిన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను దర్శించడానికి పర్యాటకులు తప్పనిసరిగా వెళ్తారు. దర్శనీయమైన చారిత్రక కట్టడం. విశాలమైన, సుందరమైన ఈ రాజభవంతి 1890లో ‘ఇండో సరాసనిక్ రివైవల్’ వాస్తుకళారీతిలోమహారాజా శాయాజీ రావు నిర్మించారు. పట్టణ మధ్య భాగంలో నిర్మించబడిన ‘సుర్ సాగర్’ కొలను, ‘ప్రతాప్ విలాస్ ప్యాలెస్’ చూడాల్సిన ప్రదేశాలు.

బరోడా నుంచి ఏక్తా నగర్ చేరుకున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జ్ఞాపకార్థం చాలా డబ్బు వ్యయంచేసి నిర్మించిన అత్యాధునిక నగరం ఇది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ’స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అనే విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఇక్కడ నెలకొల్పబడింది. కింద భవన సముదాయంలో ఓ విశేషమైన సంగ్రహాలయం, ఆధునికంగా నిర్మించబడిన థియేటర్ ఉన్నాయి. దగ్గరలోనే నర్మదానది ఆనకట్ట, చుట్టూ వేలీ ఆఫ్ ఫ్లవర్స్, జురాసిక్ పార్క్, బటర్‌ఫ్లై పార్క్ లాంటి ఉద్యానవనాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దేశవిదేశాల నుంచి ఈ ఏక్తా నగర్‌ను చూడడానికి వేలకొలది పర్యాటకులు వస్తారు.

అక్కడినుంచి భావనగర్ సమీపంలోనే, అరేబియా సముద్రతీరాన కూలీయాక్ అనే ఓ చిన్న ఊరు చేరుకున్నాం. ఇక్కడి విశేషమైన  ఆలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. తీరంనుండి కిలోమీటర్ దూరంలో సముద్రం లోపల ఉన్న ‘నిష్కళంక మహాదేవ’ ఆలయం దర్శించాము. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంటుంది, అలల తాకిడి తక్కువగా ఉన్నప్పుడే ఈ ఆలయాన్ని దర్శించే వీలుంటుంది. మిగతా సమయాల్లో ఈ ఆలయం సముద్రంలో మునిగి ఉంటుంది. ఆలయంలో అద్భుతమైన శివలింగం, గోపురం, త్రిశూలం ఉన్నాయి. ఇది అత్యంత పురాతన ఆలయం అని స్థల పురాణం. దాయాదులను చంపిన కళంకం పోవడానికి పాండవులు – శ్రీకృష్ణ పరమాత్ముని సలహా మేరకు శివుని గురించి తపస్సు చేశారు. ఆ పరమశివుడు లింగ స్వరూపుడై అవతరించాడని పురాణం చెబుతుంది. అందుకే దీన్ని నిష్కళంక మహాదేవ ఆలయం అంటారు. యుగాలు గడిచినా ఆలయo చెక్కుచెదరలేదు. మేము సరైన సమయంలోనే వెళ్ళాము కాబట్టి  దర్శనం అయింది.

అక్కడనుంచి మా ప్రయాణం కేంద్రపాలిత ప్రాంతం ‘డయు’ వైపు సాగింది. డయు అతి తక్కువ జనాభా కలిగిన ప్రదేశం, ఒకప్పుడు ఇది పోర్చుగీసు వారి పాలనలో ఉండేది. అరేబియా సముద్రంలోని చిన్నదీవి ఇది. ఓ వంతెన మార్గం గుండా గుజరాత్ రాష్ట్రానికి, main landకు కలపబడింది. సముద్ర మధ్యలో కట్టిన జైలు, పోర్చుగీసువారి డయ్యు కోట, కేథడ్రల్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఈ సముద్రతీరాలు, మాన్‍గ్రూవ్ (mangrove forest) అడవులు చాలా సుందరంగా ఉంటాయి. ఈ మడ అడవుల  అందాలు చూసిన తర్వాత మా ప్రయాణం సాసన్ గిర్ అడవుల వైపు సాగింది.

ప్రపంచ పటంలోనే గిర్ అడవులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గిర్ అడవులు భారతదేశ సింహాలకు ప్రసిద్ధి. అంతేకాక, మనుషులు వన్యప్రాణులతో కలిసి సహజీవనం చేసే ప్రాంతం ఇదొక్కటే. జంగల్ రిజార్ట్సులో మా వసతి. రాత్రి భోజనం అనంతరం, గిర్ వనాల గురించి అక్కడి ఆచార వ్యవహారాల గురించి, ఆటవికుల జీవనశైలి గురించి, వన్యప్రాణుల గురించి అడవిలో మనం సంచరించే సమయంలో  తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మంచి డాక్యుమెంటరీ చిత్రాన్ని చూపిస్తారు.

ఉదయం ఆరు గంటలకల్లా టాపు లేని జీపులో అడవిలోకి తీసుకెళ్తారు. మనతోపాటు డ్రైవరు, గైడ్ ఉంటారు. అడవిలో ఎక్కడ ఫెన్సింగ్ లు కానీ బ్యారికేడ్లు కానీ ఉండవు. దాదాపు మూడు గంటల పాటు దట్టమైన అడవిలో ఆ ఎత్తైన చెట్ల మధ్య, చల్లని గాలిలో వన్య ప్రాణులను, వివిధ రకాల పక్షులను చూస్తూ ప్రయాణించడం మరిచిపోలేని అనుభవం. దారిలో మనకు చిన్న చిన్న పల్లెలు, ఆటవికుల నివాసాలు కనిపిస్తాయి. దారి పొడవునా అడవి దున్నలను, జింకలను, సాంబార్, నెమళ్ళు, కోతులను, సరస్సుల్లో ముసళ్లను చూసాము. ఓచోట రెల్లుగడ్డి పొదల మధ్య కూర్చుని ఎండ కాచుకుంటున్న రెండు సింహాలు, వాటి పిల్లలను చూసేసరికి, మా ఆనందానికి అవధులు లేవు. క్రూర జంతువుల్ని, మృగరాజును  అంత దగ్గర నుంచి చూచి, ఆనందంతోపాటు ఏదో భావోద్రేకానికి గురైనాము. ఒక మగ సింహము, ఒక ఆడ సింగము హుందాగా కూర్చొని ఉన్నాయి. వాటి మూడు పిల్లలు  ఆడుకుంటున్నాయి. డ్రైవరు మా బండిని చాలా దగ్గరకు తీసుకెళ్లాడు. వాటికి మాకు మధ్య కేవలం నాలుగు ఐదు అడుగుల దూరం మాత్రమే ఉంటుంది. దాదాపు 5 నిమిషాలు అక్కడే ఆగి చూస్తూన్నా అవి పట్టించుకోలేదు.  తమ పనిలో ఉన్నాయి ఈ అనుభవం, అనుభూతి మాటల్లో వర్ణించలేము. అపురూపమైన అనుభవాన్ని అందించిన ప్రకృతి మాతకు నమస్కరిస్తూ అడవి నుంచి సోమనాథ క్షేత్రానికి బయలుదేరాము.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథీశుని దర్శించుకొన్న తర్వాత, త్రివేణి సంగమంలో స్నానం చేసాము. ఇక్కడ హిరణ్య, కపిల ,సరస్వతి  నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయి. పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని గడిపిన గుహలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి సముద్ర తీరాన పాండవులు పూజించిన పంచ శివలింగాలు ఉన్నాయి. సోమనాథ్ నుంచి  పోర్ బందర్ వెళ్లి  జాతిపిత గాంధీజీ జన్మించిన  ఇంటిని, మ్యూజియంను చూసి  మరో పవిత్ర స్థలమైన ద్వారకకు చేరుకున్నాం. ద్వారక విశిష్టత గురించి చెప్పవలసిన పనిలేదు. ఇది ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుని సామ్రాజ్యం. ద్వారకాధీశుని ఆలయం ఎంతో శోభాయమానంగా ఉంది. దైవ దర్శనం తర్వాత ఇక్కడ నుంచి సముద్ర మధ్యలో ఉన్న బైట్ ద్వారకకు లాంచిలో బయలుదేరాము. శ్రీకృష్ణ మందిరంతో పాటు బలరామ మందిరం, జాంబవతి ఆలయం, ఆంజనేయ మందిరం- ఇవన్నీ చూసాం. ద్వారకలోని శ్రీకృష్ణ మందిరాల్లో ‘ధ్వజారోహణము’ అనే ముఖ్య పూజాకార్యక్రమం చూసి తీరవలసిందే. ద్వారకకు రెండు మైళ్ళ దూరంలో పురాతనమైన ఆలయం, శిల్పసంపద, 2500 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఓ పురాణ కథ ఉంది. దుర్వాస మహాముని శాప కారణంగా రుక్మిణీదేవి శ్రీకృష్ణుని ఎడబాటులో ద్వారకా పట్టణానికి దూరంగా అడవిలో తపస్సు చేసిన స్థలం ఇది.

ఈ ఆలయాన్ని దర్శించి, అరగంట ప్రయాణం చేసి సుప్రసిద్ధ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాము. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదవది. ఈ ప్రదేశాన్ని ‘అవుద్ నాగనాథ్’ అంటారు. శివపురాణం ప్రకారం ఈ ప్రాంతం దారుకావనం లో భాగమని ప్రతీతి. గుజరాత్ లో ఇన్ని విశేషమైన పవిత్ర స్థలాలను దర్శించాము.

మా తర్వాత మజిలీ, యాత్ర  ‘భుజ్’ వైపు సాగింది. Kutch ఎడారికి ముఖద్వారంగా ఉన్న  భుజ్ ఓ చారిత్రాత్మక పట్టణం. మహారాజు ‘మొదటి రావు కింగర్జీ’ కొండ రాళ్లతో కట్టించిన కోట చూడదగ్గ ప్రదేశము. ప్రక్కనే ‘పరాగ్ మహల్’, ‘ఆయినా మహల్’ (అద్దాల భవంతి) పర్యాటకులను ఆకర్షిస్తాయి. 2001లో వచ్చిన భూకంపం సృష్టించిన బీభత్సంలో ఈ కట్టడాలు చాలావరకు దెబ్బతిన్నాయి. ఈ భూకంపం వందలాది మందిని మృత్యువాత తోసింది, వేల మందిని నిరాశ్రయులను  చేసింది. ఆనాటి ప్రకృతి విలయతాండవం, ఆ తర్వాత జరిగిన పునర్నిర్మాణ కార్యక్రమాలను అద్భుతంగా ప్రదర్శించే ఓ వినూత్నమైన ప్రదర్శనశాల ‘స్మృతి వనం’ ఇక్కడ నిర్మించారు. లిఫ్ట్, ఎస్కలేటర్‌ల సౌకర్యంతో అత్యంత ఆధునికంగా విజ్ఞానపరంగా రూపొందించిన ప్రదర్శనశాల భవనం ఇది. భూమి యొక్క నిర్మాణం గురించి, భూకంపాలు ఎలా వస్తాయో తెలిపే విజ్ఞాన సౌధం ఇది. ఇక్కడి ఫైవ్ డి థియేటర్లో కూర్చుని భూకంపం వస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకునే వీలు కల్పించింది ఈ ఆధునిక పరిజ్ఞానం. ఇలాంటి ప్రదర్శనశాల దేశంలో మరెక్కడా లేదు.

ఇక్కడ నుంచి గంటన్నర ప్రయాణం తర్వాత మరో వింతైన ప్రదేశానికి చేరుకున్నాం, మా ఆనందానికి అవధులు లేవు. అది వైట్ రన్ ఆఫ్ కచ్ అంటే కచ్ ప్రదేశంలోని తెల్లటి ఎడారి. భారతదేశంలో మరెక్కడా ఇలాంటి తెల్లటి ఎడారి కనిపించదు. వేల మైళ్ళ విస్తీర్ణంలో ఎటుచూసినా ఉప్పుతో నిండిన మైదానాలే. ఈ ఎడారి మధ్య నిర్మించిన గుడారాల్లో మాకు బస ఏర్పాటు చేశారు. పేరుకు గుడారమైనా ఏసీతో పాటు అన్ని వసతులు ఉంటాయి. సంధ్యా సమయంలో ఆ ఉప్పు ఎడారిలో వెళ్లి సూర్యాస్తమం చూడడం, మరుసటి రోజు ఉదయం సూర్యోదయం చూడడం గొప్ప అనుభూతి. సూర్యు కిరణాలు ఉప్పుపై పడి రంగురంగుల వజ్రాల్లా మెరుస్తూ కనిపిస్తాయి.  కచ్ అమిత ఉష్ణ ప్రదేశం. బిoదెడు నీళ్ల కోసం పది మైళ్ళు నడిచి వెళ్లాల్సి  ఉంటుంది. ఇంతటి కష్టతరమైన ప్రదేశంలో కూడా విశిష్టమైన సంస్కృతి వెలసి ఉంది. జనం తమదైన నృత్య గానాలతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను  ఆకట్టుకున్నాయి.

మరుసటి రోజు ఉదయాన్నే ఆ అందమైన తెల్లటి ఎడారిలో సూర్యోదయాన్ని చూసి ఆనందించి, మరో ప్రత్యేకమైన ప్రదేశాన్ని సందర్శించాలని బయలుదేరాము.

ఇది కూడా మనదేశంలో మరి ఎక్కడ చూడలేని ప్రదేశం. దాదాపు 5000 ఏళ్ల ముందు వెలసిన హరప్పా నాగరికత అవశేషాలు, ఆ కాలం నాటి పట్టణ శిధిలాలు బయటపడిన ప్రదేశం లోథాల్ (Lothal) – అంటే గుజరాతి భాషలో మృతుల నగరం అని అర్థం. 1955 నుంచి 1962 వరకు జరిగిన తవ్వకాల్లో నాటి నాగరికతకు సంబంధించిన ఓడరేవు, పట్టణం బయటపడినవి. ఇదే విధంగా గుజరాత్ లోనే ‘డోలావేర’ అనే మరో ప్రదేశంలో కూడా సింధు నాగరికత అవశేషాలు బయటపడ్డాయి. ఇక్కడ దొరికిన అపురూపమైన శిలాజాలు, అస్తిపంజరాలు, పాత్రలు, అలంకార సాధనాలు పురావస్తుశాఖ వారు భద్రపరిచారు. ఆ రోజుల్లోనే అపురూపమైన వాస్తుకళ ఉండేదని ఈ నగర అవశేషాలు నిరూపిస్తాయి.

 

గుజరాత్ రాష్ట్రంలో ఇన్ని విశిష్ట ప్రదేశాలు ఉన్నాయి కాబట్టే పర్యాటకుల గుప్తనిధిగా అభివర్ధించవచ్చు.

అపురూప ప్రదేశాలే కాక గుజరాతీయుల స్నేహశీలత, సంస్కృతి చవి చూసాo. భోజన ప్రియులను గుజరాతీ భోజనం, డోక్లా, తీయటి ఊరగాయలు నోరూరిస్తాయి. సాంప్రదాయబద్ధంగా చేసే తీపి పదార్థాలు అమర్కండ్, సీతాఫల్  బాసంతి, కేసర్ శ్రీకాంత్  తిని తీరాల్సినవే. గుజరాతీయుల సాంప్రదాయ నృత్య గానాలైన గరభా, దాండియా, టిప్పని, ఘమర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా స్త్రీలు ధరించే అద్దాలు పొదిగిన రంగురంగుల దుస్తులు ఇక్కడి ప్రత్యేకత.

మరచిపోలేని అనుభవాలతో ఆనందకరంగా మా 11 రోజుల గుజరాత్ పర్యటన ముగిసింది.

మా పర్యటనలో అన్ని విధాల సహకరించిన, వైబ్రాంట్ హాలిడే సంస్థ కార్యదర్శి కృనాల్ శుక్లాకు ధన్యవాదాలు అర్పించి ఇంటి ముఖం పట్టాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here