పసి హృదయాలు

18
9

[శ్రీ ఎం. వి. సత్యప్రసాద్ రచించిన ‘పసి హృదయాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“అ[/dropcap]మ్మా! ఇవాళ మాకు కొత్త టీచర్ వచ్చారు, ఏం చెప్పారో తెలుసా!” అంటూ ఏదో చెప్పబోయింది కావ్య, వాళ్ళ అమ్మ విజయతో.

“అలాగా నాన్నా! నేను తర్వాత వింటాను, నాకు ఇంకా ఆఫీస్ పని ఉంది, చేసుకోవాలి” అంటూ హడావిడిగా వంటింట్లోకి వెళ్ళింది విజయ, ఆఫీస్ నుండి వచ్చిన అయిదు నిముషాలకే.

‘నేను ఏం చెప్పినా అమ్మ పూర్తిగా వినదు’, అనుకుంటూ దిగాలుగా హోమ్ వర్క్ చేసుకోవడం మొదలుపెట్టింది కావ్య. కావ్య 10వ క్లాసు చదువుతోంది. కావ్యకు ఒక తమ్ముడు ఉన్నాడు. పేరు రవి. 6 చదువుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రవి పనులన్నీ దాదాపు కావ్య చూసుకుంటుంది. స్కూల్ నుంచి వచ్చాక వాడికి టిఫిన్, పాలు కూడా కావ్యనే ఇస్తుంది. ఇంటికి వచ్చి కావ్య, రవి ఇద్దరూ హోమ్ వర్క్ చేసుకుంటారు.

కావ్య తండ్రి మాధవ రావు, ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తాను లేకపోతే కంపెనీ ఆగిపోతుందేమో అన్నట్టు పనిచేస్తాడు. ఇంటికి వచ్చినప్పటినుంచి ఫోన్ కాల్స్‌లో బిజీగా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ‘సండే ఫాదర్’ అనవచ్చు. ఆదివారం మటుకు భార్య పిల్లలతో బాగా గడుపుతాడు.

విజయ, కెనరా బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తోంది. ఉదయం అయిదు గంటలకు లేచిన దగ్గరనుంచి ఒక యంత్రం లాగా పనిచేస్తోంది. మాధవరావు, కావ్య ఇద్దరూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. కాబట్టి వీళ్ళకి ఆర్థిక స్తోమత అంతగా లేదు. అందుకని ఇద్దరూ కష్టపడతారు. చిన్నతనం నుంచి డబ్బు కోసం వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళ పిల్లలు పడకూడదు, అన్న ఉద్దేశం తోనే ఇద్దరూ కష్టపడి పని చేస్తున్నారు. కానీ, కావ్య మటుకు ఇంట్లో ఒంటరితనం ఎక్కువగా అనుభవిస్తోంది. ఆదివారం మటుకు కావ్యకి పండగే. ఎందుకంటే, కావ్య తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో ఉండి కావ్య, రవితో కాలం గడుపుతారు. అందుకని కావ్య తన హోం వర్క్, అసైన్‌మెంట్ అన్నీ శనివారం రాత్రికి పూర్తిచేస్తుంది, రవి చేత కూడా పూర్తి చేయిస్తుంది.

ఇలా రెండు ఏళ్ళు గడిచాయి. కావ్యను ఇంజనీరింగ్‌లో చేర్పించాడు మాధవ రావు. మొదటి సంవత్సరం చివర్లో చూసుకుంటే కావ్య నాలుగు పేపర్స్‌లో ఫెయిల్ అయింది. విజయకి, మాధవరావుకి అర్థం కాలేదు, కావ్య ఎందుకు ఫెయిల్ అయిందో. మాధవ రావు గట్టిగా అడగకపోయినా, విజయ కావ్యను, చెడా మడా తిట్టి నాలుగు రోజుల పాటు ఇంట్లో ఒక భయానక వాతావరణం సృష్టించింది.

“కావ్యా! ఏం చేస్తున్నావు, భోజనానికి రా!” పిలిచింది విజయ.

కానీ కావ్య నుండి, తన రూమ్ లోంచి, ఏ సమాధానం లేదు, మనిషీ రాదు. ఇక విజయ, డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి కావ్య రూమ్ లోకి వెళ్లి చూసింది. కావ్య, తన రీడింగ్ టేబుల్ మీద తల ఆనించి కూచుని ఏదో ఆలోచిస్తోంది.

“కావ్యా! భోజనానికి రామ్మా!” అని కావ్యను తట్టి పిలిచింది.

“ఆ! వస్తున్నా,” అంటూ పరధ్యానం లోంచి బయటపడి, లేచి భోజనానికి వచ్చింది కావ్య.

“ఏంటమ్మా అంత పరధ్యానం, భోజనానికి రాకుండా,” అడిగింది విజయ కావ్యను.

“ఏం లేదు” అంటూ వచ్చి కూచుంది.

భోజనం చేసేటపుడు ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా సరదాగా కబుర్లు చెప్పే కావ్య, ఏమీ మాట్లాడకుండా కూచుంది. భోజనానికి కూచుంది కానీ తినడం లేదు. ఏదో ఆలోచిస్తోంది.

“ఏంటమ్మా, నాలుగు పేపర్స్ ఫెయిల్ అయితే పరవాలేదు, ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి కవర్ చెయ్యొచ్చు, ముందు కడుపునిండా భోజనం చెయ్” అన్నాడు మాధవ రావు కావ్యతో.

ఆ రోజు కావ్యకు కాస్త ధైర్యంగా ఉంటుందని విజయ కూడా, కావ్యతో పాటు, కావ్య రూమ్ లోనే పడుకుంది. కావ్య పడుకుంది కానీ చాలా సేపు నిద్రపోలేదు.

“నిద్రపో నాన్నా!” అని బుజ్జగించింది విజయ కావ్యను.

“నిద్ర రావడం లేదు మమ్మీ!” అన్నది కావ్య.

“ఏమీ ఆలోచించకుండా పడుకో, నిద్ర వస్తుంది” అన్నది విజయ.

కానీ దాదాపు మూడు గంటల వరకు కావ్య మెలకువ గానే ఉంది. సుమారు మూడు గంటలప్పుడు నిద్రపోయింది.

“ఏమండీ! ఈ మధ్య కావ్య సరిగ్గా నిద్ర పోవటం లేదు. ఏదో దిగులుగా ఉంటోంది. ఏమిటి అని అడిగితే, ఏమీ లేదు అంటుంది. మీరు నెమ్మదిగా ఒకసారి మాట్లాడి చూడండి” అన్నది విజయ, భర్త మాధవ రావుతో.

“ఆ ఏముండదులే, పెద్ద క్లాస్ లకు వచ్చారు, ఈ మధ్య నువ్వుకూడా పేపర్స్ ఫెయిల్ అయిందని తిట్టావు. అన్నీ కలిసి కాస్త దిగులు పడి ఉంటుంది” అని, అదంత సీరియస్ విషయం కాదు, అన్నట్టు దాటేశాడు.

మళ్ళా, వారం రోజుల తర్వాత విజయ గమనించింది..

కావ్య ఏదో దిగులుగానే ఉంటోంది. ఏంటి అని ఆడితే ఏమీ చెప్పదు, ఏం లేదు అంటుంది. అదివరకు కామెడీ సినిమాలు చూసినప్పుడు, పెద్దగా నవ్వేది. ఇపుడు అసలు అక్కడ కామెడీ సీన్ జరిగిందా, అన్న అనుమానం మనకు వచ్చేటట్లు సీరియస్ గానే ఉంటోంది. తనలో తాను ఏదో మాట్లాడుకుంటుంది. గొణుగుతూ ఉంటుంది. అద్దంలో చూసుకుని తనను తానూ తిట్టుకుంటూ ఉంటుంది. కావ్యను చిన్న మాట ఏదన్నా అడిగినా గట్టిగా ఏడ్చేస్తోంది. కావ్య పరిస్థితి విజయకు అర్థం కావడం లేదు. కావ్యకు, కళ్లకింద నల్లగా చారలు వచ్చాయి.

“ఏమ్మా ఈ మధ్య అదోలా ఉన్నావు, కాలేజీలో ఏదయినా ప్రాబ్లెమ్ ఉందా” కావ్యను దగ్గరకు తీసుకుని అడిగాడు మాధవ రావు.

“ఏం లేదు డాడీ” చెప్పింది కావ్య.

“మరెందుకు, సరిగ్గా నిద్రపోవటం లేదు” అడిగాడు కూతుర్ని మాధవరావు.

“నిద్ర రావటం లేదు డాడీ” అన్నది కావ్య.

“నిద్ర పోవటం లేదు, సరిగ్గా తినడం లేదు, ఏదో దిగులుగా కనిపిస్తున్నావు, చెప్పమ్మా!” బుజ్జగిస్తూ అడిగాడు మాధవరావు, కావ్యను.

కావ్య మొహం చుస్తే, కావ్య ఇంక ఏడ్చేస్తుందేమో అనిపించి, “నా బంగారు తల్లీ! ఏదన్న ప్రాబ్లెమ్ ఉంటే మీ డాడీకి చెప్పమ్మా” అంటూ కావ్య తల నిమురుతూ, కావ్య నిద్రపోయేదాకా కావ్య తల, తన ఒళ్ళోనే ఉంచుకుని, కావ్యను నిద్రపుచ్చాడు మాధవరావు.

కావ్య ప్రవర్తనలో మార్పుకు, విజయ బాగా కంగారు పడింది. గుళ్లో పూజలు చేయించింది. జాతకంలో సమస్య ఉందేమోనని జాతకం చూపించి, ఏవేవో జపాలు చేయించింది. అయినా కావ్యలో, ఏ మార్పు రాలేదు.

కావ్యను, కావ్య, రవి, పడుకునే రూమ్ తలుపు లోపల గడియ పెట్టద్దు అని చెప్పారు. విజయ, మాధవ రావు కూడా వాళ్ళ రూమ్ తలుపు గడియపెట్టకుండా పడుకుంటున్నారు. ఏదన్నా అవసరమైతే పిలవమని కావ్యకు గట్టిగా చెప్పారు. అయినా కూడా విజయ నిద్రలో రెండు సార్లు అయినా లేచి వచ్చి కావ్యను చూసి వెడుతుంది. కానీ ఈ సంగతి కావ్యకి తెలీదు.

ఆ రోజు ఆదివారం అయినప్పటికీ, కావ్య, రవి కంటే ముందుగా లేచారు విజయ, మాధవ రావు.

“కావ్యను డాక్టర్‌కి చూపిస్తే బెటర్” అన్నాడు మాధవ రావు విజయతో డైనింగ్ టేబుల్ దగ్గర కూచుంటూ.

“డాక్టర్‌కి ఎందుకండీ, దానికేం జబ్బు ఉందని,” అడిగింది మాధవి, భర్తకు కాఫీ గ్లాస్ అందిస్తూ.

“అది కాదు, నువ్వు, నేను ఇద్దరం నచ్చచెప్పామా!, పూజలు, జపాలు చేయించామా! అయినా ఏ మార్పూ లేదు. కావ్య సరిగ్గా భోజనం చేయదు, నిద్రపోదు. ఈ రెండూ సెట్ అయితే, ఆరోగ్యం దానంతట అదే సర్దుకుంటుంది”, అన్నాడు.

“సరేలెండి, అయితే డాక్టర్ దగ్గర చూపిద్దాం!” అన్నది మాధవి.

అలాగే డాక్టర్ దగ్గర చూపించారు కావ్యని. డాక్టర్ ఆకలి వెయ్యడానికి, నిద్రపట్టడానికీ మందులు వ్రాసి ఇచ్చాడు. పదిహేను రోజులు గడిచింది కానీ కావ్యలో ఎటువంటి మార్పు కనపడలేదు. మళ్ళా అదే డాక్టర్ దగ్గరకు వెళ్లి పరిస్థితిలో ఏ మార్పు లేదని చెప్పారు, విజయ, మాధవ రావు.

ఈసారి డాక్టర్, మరో డాక్టర్‌కి చూపించండి అని, ఇంకో డాక్టర్ పేరు వ్రాసి ఇచ్చాడు. ఆ డాక్టర్ ‘మానసిక వైద్యుడు’. అంటే మానసిక రోగాలతో బాధపడేవారికి వైద్యం చేస్తాడు.

“మా అమ్మాయికి పిచ్చి పట్టిందా డాక్టర్” అడిగారు విజయ, మాధవరావు ఇద్దరూ కంగారుగా.

“లేదండి, మీరు అంత కంగారు పడనక్కరలేదు. ఒక్కోసారి మానసిక ఒత్తిడి మూలంగా పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు కూడా డిప్రెషన్ లోకి వెడతారు. నేను చెప్పిన ఈ డాక్టర్ కౌన్సెలింగ్ ద్వారా రోగిని మామూలు మనిషిని చేస్తారు. అందుకని ఆ డాక్టర్‌కి చూపించమని చెప్పాను” అన్నాడు డాక్టర్.

“భయపడకండి, ఏ సమస్య ఉండదు, అంతా సవ్యంగానే ఉంటుంది” అని ధైర్యం చెప్పాడు డాక్టర్.

గుండె బరువుతో, విజయ, మాధవ రావు ఇద్దరూ కావ్యను తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు. కావ్యకు కూడా వీళ్ళే ధైర్యం చెప్పారు. ఆ డాక్టర్ ఏం చెప్తారో అని దిగులు గానే ఉంది, విజయ మాధవ రావు ఇద్దరికీ. కానీ ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు ఆ రెండో డాక్టర్‌కి చూపించడం తప్ప.

పదిహేను రోజుల తర్వాత డేట్‌లో దొరికింది, ఆ రెండో డాక్టర్ అపాయింట్‌మెంట్, విజయ, మాధవరావు లకు.

ఆరోజు ఇద్దరూ సెలవు పెట్టి, డాక్టర్ ఇచ్చిన టైం కన్నా ఒక గంట ముందుగానే హాస్పిటల్‌కు వెళ్లి కూచున్నారు. ఇద్దరూ చాలా టెన్షన్ పడుతున్నారు. విజయ వెయ్యి దేవుళ్ళకు మొక్కుతోంది. మాధవ రావు అసలు కావ్య ఇంతలా ఎందుకయింది, అన్న విషయం అర్థం కాక సతమత మౌతున్నాడు.

డాక్టర్ గారు లోపలి పిలిచారు. డాక్టర్ గారి పేరు శరత్. డాక్టర్ శరత్ పేరు బోర్డు డాక్టర్ గారి రూమ్ బయట ఉంది. ఆయన పేరు పక్కన ఆయన చదివిన డిగ్రీలు ఏవేవో రాసి ఉన్నాయి.

డాక్టర్ గారి రూమ్ లోకి వెళ్ళగానే నమస్తే చెప్పి ముగ్గురూ నిలబడ్డారు.

“కూచోండి” అన్నారు డాక్టర్ కుర్చీ చూపించి.

“మీ ఫామిలీ వివరాలు చెప్పండి” అడిగారు డాక్టర్ మాధవ రావు ని.

“నా పేరు మాధవ రావు, తాను నా భార్య విజయ, మా అమ్మాయి కావ్య, మాకు ఒక బాబు కూడా ఉన్నాడు, పేరు రవి. నేను ప్రైవేట్ ఆఫీస్‌లో మార్కెటింగ్ మేనేజర్, నా భార్య బ్యాంకులో మేనేజర్, మా అమ్మాయి కావ్య ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది.” అంటూ ఫామిలీ వివరాలు చెప్పాడు.

“మీరు కాకుండా మీతో పాటు ఇంట్లో ఎవరైనా, ఆయా, పని మనిషి, పిల్లల్ని చూసుకోడానికి అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య లాంటి వాళ్ళు ఉంటారా” అడిగారు డాక్టర్ శరత్.

“లేదు డాక్టర్, అలా ఎవరూ లేరు.” చెప్పాడు మాధవరావు.

“మీరు ఆఫీస్ నుండి వచ్చేవరకు పిల్లలు ఒంటరిగానే ఉంటారా” అడిగారు డాక్టర్.

“అవును డాక్టర్” చెప్పాడు మాధవ రావు.

“మరి వీళ్ళు మీరు ఆఫీస్ నుంచి వచ్చాక తినడానికి ఏమన్నా కావాలంటే, ఎవరు రెడీ చేస్తారు, వచ్చాక పిల్లలు పాలు తాగుతారా.” అడిగారు డాక్టర్.

“అవును డాక్టర్, నా భార్య విజయ సాయంత్రం తినడానికి రెడీ చేసి ఉంచుతుంది, మా కావ్య చాలా తెలివిగలది, బుద్ధిమంతురాలు, తన పని చూసుకుంటూ మా అబ్బాయిని కూడా, వాడికి కావాల్సినవన్నీ చూసుకుంటుంది. టిఫిన్ టేబుల్ మీద రెడీ చేసి ఉంచుతుంది విజయ, అది తీసుకుని పిల్లలు తినేస్తారు” అన్నాడు మాధవరావు.

“కావ్యని ఉంచి మీరు ఇద్దరూ ఒక్క నిముషం బయట కూచుంటారా! నేను కావ్యను టెస్ట్ చేసి, మరల మిమ్మల్ని పిలుస్తాను” అన్నారు డాక్టర్ శరత్, విజయ, మాధవ రావుని ఉద్దేశించి. విజయ, మాధవ రావు ఇద్దరూ బయటకు వెళ్లారు.

కాసేపయ్యాక, విజయ, మాధవ రావును లోపలకు రమ్మన్నారు డాక్టర్.

“నేను కొన్ని టాబ్లెట్స్ రాస్తున్నాను, ఇవి వాడి పదిహేను రోజుల తర్వాత రండి” అన్నారు డాక్టర్ శరత్.

కావ్య ని కాసేపు బయట కూచోమని చెప్పి డాక్టర్ గారిని “డాక్టర్ మా అమ్మాయికి పిచ్చి గాని లేదు కదా” అని అడిగింది విజయ, ఎంతో ఆవేదనతో.

విజయ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “లేదండి అటువంటిది ఏమీ లేదు. సామాన్యంగా మానసిక రుగ్మత అన్నది ప్రతిమనిషి లోనూ ఉంటుంది. మన జనాభాలో నలభయ్ శాతం మంది ఈ సమస్యతో బాధ పడుతుంటారు. కాకపొతే ఆ రుగ్మత తీవ్రతరమైన తర్వాత మా దగ్గరకు వస్తారు. పేషేంట్ తనలోతానే మాటాడుకుంటూ ఉంటారు. చిన్న విషయాలకు కూడా ఏడుస్తారు. ఎప్పుడూ ఏదో పోగుట్టుకున్న వాళ్ళ లాగా దిగులుగా ఉంటారు. హ్యాపీగా ఉన్న, ఉండాల్సిన సందర్భాలలో కూడా మూడీగా, ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉంటారు. చిన్న చిన్న పనులు చేయడం అంటే ఇల్లు ఊడవటం, కూర్చున్న వాళ్ళు లేచి వెళ్లి గ్లాస్‌తో నీళ్లు తెచ్చుకోవడం కూడా చెయ్యరు. విసుగు, కోపం, చిరాకు ఎక్కువగా ఉంటాయి. నీరసపడిపోతూ ఉంటారు. ఫ్యూచర్ గురించి ఎక్కువగా బెంగపడిపోతారు. స్టూడెంట్స్‌కి చదువు మీద శ్రద్ధ కూడా తగ్గుతుంది.

ఈ మధ్య కరోనా సమయంలో చాలా మంది నేను చెప్పిన ఈ సమస్యలలో ఏదో ఒక సమస్యతో బాధపడి నాదగ్గరకు వచ్చారు. కొంతమందికి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా వస్తుంది. ప్రతిదీ నెగటివ్‌గా ఆలోచిస్తారు.

ఇంకొందరు ముఖ్యంగా, మగ పిల్లలు లేకుండా కేవలం ఆడపిల్లలు మటుకే ఉన్నవాళ్లు, పిల్లల పెళ్లి చేసి పంపాక, పిల్లల మీద దిగులుతో, కొంత వరకు డిప్రెషన్ లోకి వెడతారు. పెద్ద స్థాయిలో రిటైర్ అయిన ఉద్యోగులు చాలామంది ఒక్కసారిగా, హోదా, పవర్, పలుకుబడి లేకపోయే సరికి కూడా డిప్రెషన్‍౬కు లోనవుతారు.

కాకపోతే మీ అమ్మాయి కావ్యకి, ప్రాబ్లెమ్ అంత సీరియస్ అవలేదు. మీరు ప్రశాంతంగా ఉండండి. మీ అమ్మాయినీ ప్రశాంతంగా ఉంచండి. పదిహేను రోజుల తర్వాత రండి” అన్నారు డాక్టర్ శరత్.

డాక్టర్ మాటలతో పూర్తిగా కాకపోయినా, కొంతవరకు ఊరట లభించింది విజయ, మాధవ రావుకు.

విజయ, మాధవరావు ఇద్దరూ చెరొక వారం రోజులు సెలవు పెట్టి, కావ్యను జాగత్తగా చూసుకున్నారు. వీళ్ళు గమనించినంతవరకు, కావ్య, తిండి సరిగ్గా తింటోంది, అదివరకు కన్నా బాగానే నిద్రపోతోంది. ఇంతకన్నా పెద్ద మార్పు కనిపించలేదు కావ్యలో.

మళ్ళా, విజయ, మాధవ రావు, డాక్టర్ శరత్ గారు రమ్మన్న తేదీ నాడు కావ్యను తీసుకుని వెళ్లారు.

డాక్టర్ గారు వీళ్ళని తన కేబిన్ లోపలికి రమ్మని పిలిచారు. వీళ్ళ ఎదురుగానే, కావ్యను పరీక్ష చేసి, “ఫిజికల్ హెల్త్ కాస్త ఇంప్రూవ్ అయింది. మీకు ఎలా అనిపించింది” అని అడిగారు.

“ఆహారం తీసుకోవడం, నిద్రపోవడంలో కొంచం బాగా అనిపించింది” అన్నది విజయ కాస్త ప్రశాంతంగా.

“ఓకే! మీరు బయట వెయిట్ చెయ్యండి, కావ్యని నేను మరో టెస్ట్ చెయ్యాలి. ఒకవేళ అవసరమైతే, నేను ఎవర్ని పిలిస్తే వాళ్ళు మటుకే లోపలి రావాలి” అన్నారు డాక్టర్.

“ఒక గంట లేదా రెండు గంటలు కూడా పట్టవచ్చు, అంతవరకు మీరు వెయిట్ చెయ్యాలి, ఇవాళ చేసేది మెయిన్ ట్రీట్‌మెంట్” అన్నారు డాక్టర్.

సరే! అని విజయ, మాధవరావు, బయటకు వెళ్లారు. దాదాపు గంటన్నర తర్వాత, డాక్టర్ గారు, విజయ, మాధవ రావుని లోపలి రమ్మన్నారు. విజయ, మాధవరావు ఇద్దరూ ఎంతో ఆత్రుతగా లోపలికి వచ్చారు. కావ్య కనపడలేదు. డాక్టర్ గారు ఒక్కరే తన కుర్చీలో కూచుని ఉన్నారు. డాక్టర్ గారి ముఖమే బాగా అలసటగా ఉన్నట్లు అనిపించింది.

వీళ్ళను చూడగానే, వీళ్ళ కళ్ళు కావ్య కోసం వెతుకుతున్నట్లు గ్రహించారు డాక్టర్ గారు. “కూచోండి” అని కుర్చీ చూపించి, “కావ్య లోపల ఉంది”, అని తన టెస్టింగ్ రూమ్ వైపు చూపించారు. విజయ, మాధవ రావు ఇద్దరూ, స్థిమితపడ్డారే కానీ, డాక్టర్ గారు సీరియస్‌గా ఉండటం, ఇద్దరికీ మనసులో కంగారు గానే ఉంది.

“డాక్టర్ గారూ ఏంటి షర్ట్ అలా తడిసిపోయింది” అడిగింది విజయ ఆశ్చర్యంగా.

“చెప్తాను, నేను ఒకమాట అడుగుతాను చెప్పండి.” అన్నారు డాక్టర్ గారు.

“అడగండి సార్” అన్నాడు మాధవ రావు.

“మీరు ఇద్దరు జాబ్స్ చేస్తుండగా కావ్య పుట్టిందా? లేదా కావ్య పుట్టాక జాబ్స్ వచ్చాయా?” అడిగారు డాక్టర్.

“ఇద్దరమూ జాబ్స్‌లో ఉండగానే కావ్య పుట్టింది సార్” అన్నారు విజయ, మాధవ రావు.

“స్కూల్‌లో చేర్చేవరకు, ఇంటి దగ్గర ఎవరు ఉండేవారు” అడిగారు డాక్టర్.

“బేబీ కేర్ సెంటర్‌లో ఉంచాము సార్” జవాబిచ్చాడు మాధవ రావు.

“మరి తర్వాత?” అడిగారు డాక్టర్.

“ఆరవ క్లాస్ వరకు, మా అమ్మ, అంటే కావ్య వాళ్ళ నానమ్మ, మాతో పాటే ఉండేది. పిల్లల్ని చూసుకునేది. కావ్య 6th లో ఉండగా మా అమ్మ చనిపోయారు, అప్పటినుండి కావ్య తన పనులు థానే చేసుకుంటూ తమ్ముడు రవిని కూడా చూసుకునేది.” చెప్పాడు మాధవ రావు.

“కావ్య వాళ్ళ స్కూల్‌లో, పేరెంట్స్ డేకి మీరు ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు” విజయ, మాధవరావు ఇద్దరివైపు చూస్తూ, అడిగారు డాక్టర్.

ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఒక్కసారికూడా వెళ్లిన జ్ఞాపకం లేదు.

“మీ ఇద్దరిలో ఒక్కరు కూడా, ఒక్కసారి కూడా వెళ్ళలేదు” చెప్పారు డాక్టర్. “నిజమేనా!” అడిగారు డాక్టర్ సౌమ్యంగానే.

“అవును డాక్టర్” సమాధానమిచ్చారు ఇద్దరూ.

“వాళ్ళ స్కూల్‌లో ‘యాన్యుయేల్ డే ఫంక్షన్’కి ఎన్నిసార్లు అటెండ్ అయ్యారు” అడిగారు డాక్టర్.

“ఒక్కసారి కూడా అటెండ్ అవలేదు సర్” చెప్పింది విజయ చాలా బాధతో.

“నేను, పేషెంట్ కావ్యను హిప్నోటైస్ చేసాను. ఇలా చెయ్యడం మా ట్రీట్‌మెంట్‌లో ఒక భాగం. కావ్య మానసికంగా చాలా ఒత్తిడికి గురి అయింది. చిన్నతనం నుండి ఆ అమ్మాయికి, తల్లిదండ్రుల ప్రేమ కరువయింది. మా అమ్మ గానీ, నాన్న గానీ నాతో పదినిముషాలు కూడా మాట్లాడరు, ఎప్పుడూ వాళ్ళ ఆఫీస్ పనులు, ఫోన్ కాల్స్‌తో బిజీగా ఉంటారు. ‘అమ్మ అసలు నేను చెప్పేది వినిపించుకోదు. ఎప్పుడూ, బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను అంటుంది’ అన్నది మీ కావ్య కి మీ మీద ఉన్న కంప్లైంట్.”

“ఆ పిల్లకు మీ ప్రేమ కరువై, ఎవరితో చెప్పుకోవాలో తెలియక చాలా బాధపడుతోంది. పేరెంట్స్ డేకి పిల్లలు అందరూ వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి వస్తారు. మీ పేరెంట్స్ ఏరి? అని టీచర్ అడిగిన ప్రతిసారి, ఏమి చెప్పాలో అర్థం కాక, అబద్ధం చెప్పలేక, ఆ చిన్ని హృదయం ఎంత గాయపడిందో మీకు తెలుసా?” అడిగారు డాక్టర్.

“తను ఈ విషయం మాకు ఎప్పుడూ చెప్పలేదు డాక్టర్” అన్నాడు మాధవ రావు.

“అది పిల్లలు ఓపెన్‌గా చెప్పుకునేంత అవగాహన వాళ్లకు ఉండదు కదండీ. మనమే తల్లిదండ్రులుగా మన ప్రేమను చూపించాలి. కేవలం స్కూల్ ఫీజు కట్టి, మంచి స్కూల్‌లో చేర్పిస్తే సరిపోదు. వాళ్ళతో కొంత టైం స్పెండ్ చెయ్యాలి, ఆడాలి, పాడాలి, ఒక ఫ్రెండ్ లాగా ప్రవర్తించాలి. మీరు ఒక్కసారి నవ్వుతూ మాటాడితే చాలు, అని వాళ్ళు ఎదురుచూసేటట్లుగా, మనం ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి” అని డాక్టర్ గారు కొంచం కోప్పడినట్లే చెప్పారు.

“కావ్య నుంచి కంప్లైంట్ అదే కదండీ, మీరు ఏనాడయినా మీ అమ్మాయితో ప్రేమగా మాట్లాడారా? తాను చెప్పిన మాట ఇంకొకటి చెప్పనా!” అన్నారు డాక్టర్.

“చెప్పండి సార్” అన్నారు విజయ, మాధవ రావు ఇద్దరూ దీన వదనాలతో.

“తనతో మీరు మాట్లాడేవి రెండే మాటలు అని చెప్పింది. ఒకటి.. బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, టాప్ రాంక్‌లో ఉండాలి. రెండవది.. మార్కు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా తిట్టడం. ఈ రెండే మా అమ్మ నాన్నకు మాతో మాట్లాడటం బాగా వచ్చు” అన్నది.

“నా షర్ట్ అంతా తడిసిపోయింది అని అడిగారు కదా! ఇది మీ అమ్మాయి కన్నీటితో తడిసిపోయింది. కావ్య నా భుజం మీద తల వాల్చి చాలా సేపు ఏడ్చింది. తనలో ఉన్న దుఃఖం అంతా కన్నీటి రూపంలో బయటకు వచ్చింది. ఆ పసి హృదయం, ఎవరితోనూ చెప్పుకోలేక, అనుభవించలేక, ఎంత వేదన పడ్డదో నాకు తెలుసు, తడిసిపోయిన నా షర్ట్ చుస్తే మీకు తెలుస్తుంది.. మీకు పిల్లల్ని పెంచడంలో ‘క్రమశిక్షణ’గా ఉంచడం అన్న పేరుతో, వారికి ప్రేమను పంచకుండా, వాళ్ళను భయపెట్టి, వాళ్ళు ప్రేమ కోసం ఎక్కడో వెదుక్కునే పరిస్థితి తెచ్చారు.” అన్నారు డాక్టర్.

“కావ్యకి మీ నుండి ప్రేమ కరువు అవటం మూలాన, ఆటోమాటిక్‍గా, ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడితే వాళ్లకు దగ్గర అవుతుంది. అది మీరు గ్రహించలేదు. కాలేజీలో తనకన్నా సీనియర్, ప్రేమగా మాట్లాడుతూ, పాఠాలలో కావ్యని గైడ్ చెయ్యడం, రాగింగ్ కాకుండా సపోర్ట్‌గా ఉండటం వలన అతనిని ప్రేమిస్తోంది, అని కూడా చెప్పింది. నేను నా ట్రీట్‌మెంట్‌లో భాగంగా, తనలో ఉన్న బాధను బయటకు తీసాను. చెప్పుకొని ఎంతోసేపు ఏడ్చింది. అలా ఏడవటం చాలా మంచిది. బాధ అంతా బయటకు వస్తుంది. మనసు తేలిక పడి, శరీరం రిలాక్స్ అవుతుంది.” అన్నారు డాక్టర్.

డాక్టర్ గారు ఇదంతా చెబుతుంటే, ఏం మాట్లాడాలో తెలియక, అర్థం కాక, విజయ, మాధవరావు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.

“ఈరోజు నుంచి అయినా, కావ్యతో, రవితో ప్రేమగా ఉండండి. ఆఫీస్ పనులు ఎప్పుడూ ఉంటాయి, కానీ పిల్లకు ప్రేమను పంచండి, వాళ్ళతో సంతోషాన్ని పంచుకోండి. లేకపోతే ఇలాంటి విపరీత పరిణామాలను చూడాల్సి వస్తుంది” అని సున్నితంగా, విజయ, మాధవ రావును మందలించారు డాక్టర్ గారు.

“ఈ రోజు ట్రీట్‌మెంట్‌తో చాలా వరకు కావ్యలో, మార్పు కనపడి, బాగుంటుంది. మళ్ళా నెల రోజుల తర్వాత ఒకసారి కావ్యను చెకప్‌కి తీసుకు రండి” అని చెప్పారు డాక్టర్.

పిల్లలు ఇద్దరితోను, ప్రేమగా ఉండాలని, విజయ, మాధవ రావు నిర్ణయించుకుని, తమ జీవన విధానాన్ని మార్చుకుని, విజయ, మాధవరావు పిల్లలిద్దరితోనూ సంతోషంగా గడిపారు.

కావ్యను పూర్తి గా ఆరోగ్యవంతురాలిని చేసినందుకు డాక్టర్ శరత్ గారికి, విజయ, మాధవ రావు ఇద్దరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు.

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here