పాత హిందీ సినిమా పాటలలో శ్రీరాముడు

6
11

[శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కస్తూరి మురళీకృష్ణ రాసిన ‘పాత హిందీ సినిమా పాటలలో శ్రీరాముడు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]హిం[/dropcap]దీ సినిమా పాటలలో ఒకప్పుడు భజనలు ప్రధాన స్థానాన్ని ఆక్రమించేవి. పౌరాణిక సినిమాలు నిర్మించేవారు ఒకప్పుడు. ముఖ్యంగా సినిమాలు వ్రేళ్ళూనుకుంటున్న సమయంలో పురాణ కధల ఆధారంగా నిర్మించే సిమాలను ప్రజలు విపరీతంగా ఆదరించేవారు. దేవీదేవతల సినిమాలు ప్రదర్శించే హాళ్లను దేవాలయాల్లా భావించేవారు. ఊరూ వాడా తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు సామూహికంగా సినిమా థియేటర్లకు వచ్చేవారు. ఆ కాలంలో పౌరాణిక సినిమాలకు ఆదరణను మరింతగా పెంచేవి, సినిమాలలోని పాటలు. శ్రీరామనవమి సందర్భంగా, హిందీ సినిమా సంగీత ప్రపంచంలో శ్రీరాముడి భక్తి గీతాలను కొన్నింటిని పాఠకులకు పరిచయం చేసి వారు మనస్సులలో రామగాన మాధుర్యాన్ని అనుభవించేట్టు చేయటం ఈ వ్యాసం ఉద్దేశం.

హిందీ సినిమాలలో ‘రాముడి’ పాటలనగానే ‘సర్‍గమ్’ సినిమాలో మహమ్మద్ రఫీ పాడినన ‘రామ్‍జీ కీ నికలీ సవారీ, రామ్‍జీ కీ లీలా హై న్యారీ’ అన్న పాట గుర్తుకు వస్తుంది. తెలుగులో ‘సిరిసిరిమువ్వ’ సినిమా హిందీ రూపం ‘సర్‍గమ్’.  ఆనంద్ బక్షీ రచించగా లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ పాటలో రామాయణాన్ని ‘కట్టె కొట్టి తెచ్చె’ అని చెప్తూ ‘ఏక్ బార్ దేఖో జీ న భరేగా, సౌ బార్ దేఖో ఫిర్ జీ కరేగా’ అంటాడు ఆనంద్ బక్షీ. అంటే, రాముడిని ఒకసారి దర్శిస్తే మనసుకు తృప్తి కలగదు. వందసార్లు చూసినా ఇంకా ఇంకా దర్శించుకోవాలనిపిస్తుంది. ఇది నిజం. మన దేవీ దేవతలను ఎన్నిమార్లు దర్శించుకున్నా తృప్తి కలగదు. మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలనిపిస్తుంది.

1981 లో విడుదలయిన ‘మహాబలి హనుమాన్’ సినిమాలో తన హృదయంలో రాముడు నిలిచి ఉన్నాడని నిరూపిస్తూ హనుమంతుడు మహమ్మద్ రఫీ స్వరంలో ‘మన్ కీ ఆంఖోం సే మై దేఖూఁ రూప్ సదా సియా రామ్ కా’ అని పాడతాడు. 1960 దశకం చివరలో వచ్చిన ‘గోపి’ సినిమాలో ‘సుఖ్ కే సబ్ సాథీ, దుఃఖ్ మే న కోయీ, మేరే రామ్ తేరా నామ్ ఎక్ సాచా, దూజా న కోయ్’ అంటూ రఫీ అద్భుతంగా పాడతాడు. రామనామం తప్ప, మరొక సత్యం ఈ ప్రపంచంలో లేదని అంటూ ఆరంభమయ్యే ఈ పాటలో రామభక్తి కన్న తాత్త్వికతను ఎక్కువగా ప్రదర్శిస్తాడు రాజేందర్ క్రిషన్.

‘గోపి’ సినిమాలోనే మహేంద్ర కపూర్ ‘రామచంద్ర్ కహె గయే సియాసే’ అనే పాట పాడతాడు. ఈ పాటలో రామచండ్రుడు సీతకు కలియుగం ఎలావుంటుందో వివరిస్తాడు. ఇప్పుడీ పాట వింటూంటే, భవిశ్యద్దర్శనం చేసి ఈపాటను రచించాడనిపిస్తుంది.  కలియుగంలో, ‘ ధర్మ్ భి హోగా/ కర్మ్ భి హోగా/పరంతు శర్మ్ నహి హోగా/బాత్ బాత్ మే మాత్-పితా కో/ బేటా ఆంఖ్ దిఖాయేగా’ అంటాడు. కలియుగంలో కర్మ వుంటుంది, ధర్మం వుంటుంది కానీ, సిగ్గు అనేది వుండడు. పిల్లలు చీటికీ మాటికీ తల్లితండ్రులను ఎదిరిస్తారు.  ఇంకా, ‘ మందిర్ సూనా, సూనా/ భరీ రహేగీ మధుశాలా/పితా కె సంగ్ సంగ్ భరీ సభా మే/ నాచేగీ ఘర్ కే బాలా’ . మందిరాల్లో కన్నా, మందుశాలల్లో జనాలెక్కువగా వుంటారు. అందరిముందూ తండ్రితో కలసి పిల్లలు నాట్యమాడతారు…..ఇలా, ఇప్పుడు మనం అనుభవిస్తున్నవన్నీ అప్పుడే రాముడు సీతతో చెప్పినట్టు చెప్తుందీ పాట.  మన పురాణాలను ఆధారం చేసుకుని ఏ రకంగా సామాజిక మార్పులతో రాజీపడటం సమాజానికి నేర్పేవారో  ఈ పాట చక్కగా చూపిస్తుంది.

1960 దశకంలో విడుదలయిన ‘నీల్‍కమల్’ సినిమాలో సాహిర్  లూధియాన్వీ రాసిన భజన ‘హే రోమ్ రోమ్ మే బస్నే వాలే రామ్, జగత్ కే స్వామీ, తూ అంతర్యామి, మై తుఝ్ సే క్యా మాంగూ?’ ను భక్తి భావంతో గానం చేసింది ఆశా భోస్లే. వామపక్ష భావాల సమర్థకుడైన సాహిర్, ఓ వైపు రాముడిని, మరో వైపు సినిమాలో హీరో పాత్రని తలపింప చేస్తూ పాటను  రచించాడు. ఈ పాటలో రాముడి గుణగణాల వర్ణన లేదు కానీ, సర్వం ఒక ప్రేమికుడికి సమర్పించుకుని, తనని తాను అంకితమిచ్చుకున్న ప్రేయసి భావనలను భగవంతుడికి సర్వం సమర్పించుకున్న భక్తుడి భావనలపై ఆరోపించి చెప్తాడు సాహిర్. సమర్పిత భక్తిభావం అన్నమాట.

1976లో విడుదలయిన ‘బజరంగ్ బలి’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘హే రామ్ తేరా రాజ్ మే కైసే జియే సీతాయే’ అని రాముడిని ప్రశ్నించే పాట పాడుతుంది. రామరాజ్యంలో సీతల దుస్థితిని, భారతదేశంలో మహిళల దుస్థితిగా వర్ణిస్తూ కవి ప్రదీప్ అత్యద్భుతంగా రచించిన పాట ఇది. ‘హమ్ అప్నే హీ ఘర్ మే బనీ హై అగ్ని సే ఘిరీ చితాయే’ అంటూ మహిళలను గృహహింసకు గురిచేస్తూ. తగులు బెట్టే సంఘటనలను ప్రస్తావిస్తుంది పాట.

‘హే రామ్’ అనే విడుదలకు నోచుకుని సినిమాలో లత, రఫీ పాడిన ‘సబ్ సే పహ్లే, సబ్ సే ఆఖిర్ లూం  మై తేరా నామ్, హే రామ్’ అనే భజన ఎంతో చక్కనిది. సినిమా విడుదల కాకున్నా, ఈ భజన ఆ సినిమా పేరును ఇంకా విస్మృతిలో పడకుండా చూస్తోంది.

‘రామ్ భరోసే’ అన్న సాంఘిక సినిమాలో కిషోర్ కుమార్ పాడిన భజన గీతం ‘రామ్ సే బడా రామ్ కా నామ్, బనాయ్ సబ్కే బిగడే కామ్’ ఎంతో చక్కనిది. కిషోర్ కుమార్ పాడిన అతి అరుదైన భజన గీతం ఇది.

‘గీత్ గాతా చల్’ సినిమాలో ‘జస్పాల్ సింగ్’ పాడిన ‘మంగళ్ భవన్ అమంగళ్ హారీ’ పాట అయితే ఈనాటికీ సజీవంగా నిలచి శ్రోతలను రామభక్తి భావనా తరంగ శృంగాలపై ఓలలాడిస్తుంది. తులసీదాస్ రాసిన ‘రామ్ చరిత్ మానస్’ లోని చౌపాయీలను గుదిగ్రుచ్చి సృజించిన పాట ఇది. ఇప్పటికీ పలువురు ఇది రవీంద్ర జైన్ రాసిన పాటగా భావిస్తున్నారు. ఈ పాటలో వినిపించే ‘రామ్, సియా రామ్, సియా రామ్ జై జై రామ్’ అన్న పాదం శ్రోతలను ఉర్రూతలూపుతుంది. భక్తి ప్రవాహంలో ప్రజలను మునకలు వేయిస్తుంది. ‘రామాయయణం’ టీవీ సీరియల్‍కు రవీంద్ర జైన్‍ను సంగీత దర్శకుడిగా ఎంచుకోడంలో ఈ పాట ప్రధాన పాత్ర వహించింది. ‘రామ్ జీ కీ సేనా చలీ’, ‘యహీ ఓ రావణ్, జిస్ కే కారణ్’ వంటి భజనలను రవీంద్ర జైన్ స్వయంగా రూపొందించి, గానం చేశాడు.

1960లో విడుదలైన ‘భక్త్ రాజ్’ సినిమాలో ‘పాయోజీ మైనే రామ్ రతన్ ధన్ పాయో’ అనే సాంప్రదాయిక భజన పల్లవిని తీసుకుని మిగతా పాటను భరత్ వ్యాస్ రచించాడు. అవినాశ్ వ్యాస్ సంగీత దర్శకత్వంలో భజనల రాణి గీతాదత్ పరమాద్భుతంగా పాడిందీ పాటను.

‘జగ్ కీ భూల్ భులైయ్యా మే మన్
అబ్ తక్ తో బరమాయో
మృగతిరక్షణా మే భటకా మన్
అంత సమయ్ మే రామ్ నామ్ హీ
కామ్ హమారో అయో రీ
పాయోరీ మై నే
రామ్ రతన్ ధన్ పాయో..’

1972లో విడుదలైన ‘సంత్ తులసీదాస్’ అనే సినిమాలో భగవత్ మిశ్రా రాసిన గీతానికి రామ్ కదమ్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ పాటను భీమ్‌సేన్ జోషీ, మహేంద్ర కపూర్‍లు పాడేరు. ‘బోలో జై శ్రీ రామచంద్ర్ కీ జై’ అంటూ ఆరంభమయ్యే ఈ పాటలో మహేంద్ర కపూర్, భీమ్‌సేన్ జోషీల గాన సంవిధానంలో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ‘నహీన్ ఛోడో బాబా రామ్ రామ్. మేరో ఔర్ పఢన్ సు నహీ కామ్’ అంటూ సాగే ఈ పాట ఒకసారి వింటే సరిపోదు. ఎన్నిమార్లు విన్నా తనివి తీరదు. ఈ పాటలో మహేంద్ర కపూర్ హై పిచ్‍ని భీమ్‍సేన్ జోషీ సునాయసంగా డామినేట్ చేయటం తెలుస్తుంది.

1969 లో విడుదలయిన ‘పవన్ పుత్ర హనుమాన్’ అనే సినిమాలో సరస్వతి కుమార్ దీపక్ రచించిన ‘మహిమా అపరంపార్ రామ్ కీ మహిమా అపంపార్’ పాటను,  చిత్ర్‌గుప్త సంగీత దర్శకత్వంలో మహమ్మద్ రఫీ భక్తి రస ప్రవాహాన్ని చిలికిస్తూ పాడేడు. ఈ సినిమాలోని ‘జై బోలో సియా రామ్ కీ’, ‘మేరే రామ్ కహాఁ హో తుమ్’. ‘కలియోం మే రామ్ మేరా, కిరణోం మే రామ్” వంటి భక్తిగీతాలున్నాయి.

1951లో విడుదలైన ‘దశావతార్’ సినిమాలో బి.పి. భార్గవ రచించగా, అవినాశ్ వ్యాస్ సంగీత దర్శకత్వంలో గీతాదత్, భద్రీనాథ్ వ్యాస్‌లు ‘బజావో రామ్ నామ్ కీ థాలీ, ప్రీత్ భరీ ఎక్ థాలీ’ అనే పాటను భక్తి రస ప్రవాహంలో భగవంతుడి దర్శనం తహతహ వేదనను రంగరించి పాడేరు.

తుమ్ బిన్ నైనా తరస్ రహే హైఁ
నిస్ దిన్ ఆంసూ బరస్ రహే హైఁ
బజావో రామ్ నామ్ కీ థాలీ

1952లో ‘లంకాదహన్’ అనే సినిమా విడుదలయింది. ఈ సినిమాలో తలత్ ముహమ్మద్  పాడిన అరుదైన భజన ఉంది. ఎస్పీ కల్లా రచించగా, హన్స్‌రాజ్ బహల్ రూపొందించిన పాట ఇది. ‘బసా లే మన్ మందిర్ మే రామ్, బనేంగే బిగడే తేరే కామ్’ అంటూ ఆరంభమవుతుందీ పాట. గజల్ గానానికి పెట్టింది పేరయిన తలత్ భజన పాడడం ఒక విశేషమైతే, సినిమాలో ఈ పాట హనుమంతుడి పాత్రపై చిత్రీకరించబడటం మరో విశేషం.

చార్ దినోం కీ యే ఉజియారీ
బిన్ తేరే దునియా అంధియారీ
జీత్ ఉసీ కో హోతీ హై
జిస్ కే మన్ మే బస్తే రామ్

జీవితంలో వెలుతురు అంటే సుఖాలు ఉండేది కొద్దికాలమే, ఆ తరువాత అంతా విషాదాంధకారమే. కాబట్టి ఎవరి హృదయంలో రాముడు స్థిరంగా నివసిస్తాడో, వారికే విజయం ప్రాప్తిస్తుంది. కాబట్టి హృదయంలో రాముడిని ప్రతిష్ఠించుకో అంటుందీ భజన.

1947లో ‘శబరి’ అనే సినిమాలో ఒక సాంప్రదాయిక భజన ‘భజోరే, రామ్ నామ్ సుఖ్‍దాయీ’ని జగమోహన్ సుర్‌సాగర్ గంధర్వ గానాన్ని తలపుకు తెస్తూ గానం చేశాడు. ఈ భజనకు సంగీత దర్శకత్వం వహించింది పండిత గణపతి రావు. భవిషత్తులో భీమ్ సేన్ జోషి ఈ పాటను ప్రైవేట్ గా పాడేరు.

జాగ్ జాగ్ రే గవార్
సర్ పే మౌత్ హై సవార్
దో దిన్ కీ యే బహార్
పీఛే పఛ్తాయీ..

జీవితం పరిమితమైనది. ఆనందాలు క్షణికమైనవి. మృత్యువు వెన్నెంటి ఉంటుంది. తరువాత విచారించి లాభం లేదు. ఇదే సమయం, నిజం తెలుసుని జాగృతమై, ఓ మనస్సా, రామ నామ భజన ఆరంభించు. అదే సుఖాన్నిస్తుంది.

ఈ పాట పాడిన జగ్‍మోహన్ ‘సుర్‌సాగర్’ అవార్డు గ్రహీత. ఈయన పాట మహాత్మాగాంధీ కూడా ఎంతో ఇష్టం. మహాత్మా గాంధీ కోరిక పై ఈయన ‘సప్తకాండ రామాయణం’ రికార్డు చేశాడు. ఆ కాలంలోనే విదేశాలు పర్యటించి భారతీయ రాగాలు వారికి వినిపించాడు. భైరవి రాగంలో బెంగాలీ, ఇంగ్లీష్ పాటలను పాడి వారిని మంత్రముగ్ధులను చేశాడు.

తెలుగులో ‘లవకుశ’ సినిమా పాటలను మరచిపోలేము. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం.

1951 లో నానాభాయ్ భట్ తొలిసారిగా ‘లవకుశ’ కథను తెరపై ప్రదర్శించాడు. నిరుపారాయ్ సీత. 1967 లో ‘లవకుశ’లో జయశ్రీ సీతగా నటించింది. తెలుగు ‘లవకుశ’ హిందీలో ‘లవకుశ’గా 1997లో విడుదలయింది. జయప్రద సీతగా, జితేంద్ర రాముడిగా నటించాడు. ఈ సినిమాలో వాల్మీకిగా ప్రాణ్ నటించాడు. ‘కరో నహీ సందేహ్ రామ్ పర్’ అంటూ ‘సందేహించకు మమ్మా’ హిందీ వెర్షన్ పాడేడు.

ఏక్ వచన్ హై, ఏక్ కర్మ్ హై
ఏక్ రామ్ కా బాన్
ఏక్ పత్నీ కా వ్రత్ హై ఉన్‍కా
కరే జగత్ కళ్యాణ్

తెలుగు పాట భావాన్ని మక్కీగా హిందీలోకి అనువదించింది దేవ్ కోహ్లీ. రామ్ లక్ష్మణ్ తెలుగు బాణీని అనుసరిస్తూ సంగీతం కూర్చగా సురేశ్ వాడ్కర్ పాట పాడేరు. దేవ్ కోహ్లీ తెలుగు పాటను ఎంత చక్కగా అనువదించాడంటే హిందీ రాని వారు కూడా తెలుగు పాట పదాలు చూస్తూ హిందీ పాట వింటే పాట సులభంగా అర్థమైపోతుంది.

యది వే ధర్మ్ త్యాగ్ దే అప్నా
ఛంద్ బదల్ దే గాయన్
జన్మ్ వ్యర్థ్ హో జాయే మేరా
వ్యర్థ్ మేరీ రామాయణ్
కరో నహీ సందే రామ్ పర్

1954లో ‘మహాత్మా కబీర్’ అనే సినిమా విడుదలయింది. కబీర్ సినిమాలో రాముడి భజన లేకపోవటం కుదరని పని. ‘రామ్ రస్ బర్సే రే మన్‍వా’ అనే అద్భుతమైన భజనను చంద్రశేఖర్ పాండే రచించగా, అనిల్ బిస్వాస్ స్వరబద్ధం చేశాడు. సి.హెచ్. ఆత్మ తనదైన పంథాలొ ఈ పాటను పాడేడు.

రామ్ రస్ బర్సే రే మన్‍వా, రామ్ రస్ బర్సే
రే మన్ చాతక్ క్యూం తరసే
రామ్ రస్ బర్సే రే మన్‍వా

చాతక పక్షిలా దేనికని  బాధపడుతూ ఎదురు చూస్తావు, రామ రస వృష్టి కురుస్తోంది. ఓ మనసా రామ రస వృష్టి కురుస్తోంది.

1948 లో ‘జై హనుమాన్’ అన్న సినిమా విడుదలయింది. ఈనాడు ఎవ్వరికీ ఈ సినిమా గుర్తులేదు కానీ ఈ సినిమాలో పండిత్ ఇంద్ర చంద్ర శుద్ధ హిందీలో రచించిన గీతా దత్ పాట మాత్రం ఎంతోమందికి తెలుసు. బులో సి రాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ పాట ఆ కాలంలో ఎంతో ప్రజాదరణ పొందింది.

మోహే రామ్ నామ్ ధున్ లాగీ
జుగ్ జుగ్ కీ ప్రీత్ జాగీ

 రామనామం నా మనసుకు నచ్చింది. యుగయుగాలుగా నిద్రాణమై ఉన్న ప్రేమ భావన నా హృదయంలో జాగృతమయింది. రామనామం శాంతి సుఖదాయకం. రామనామం ప్రేమ భావనకు ప్రతిరూపం. సకల ప్రాణులను చేరదీసి, అందరినీ తన వాళ్ళను చేసుకుంటూ ముందుకు సాగుతాడు రాముడు.

రామ్ బసే మేరే మన ప్రాణ్ మే
రామ్ జ్యోత్ జాగీ నైనన్ మే
రామ్ రామ్ మే రామ్ రహే హై
రోమ్ రోమ్ మే రామ్ రహే హై
రామ్ కీ మాయా లాగీ
మోహే రామ్ నామ్ ధున్ లాగీ

1965 లో ‘భరత్ మిలాప్’ అనే సినిమా విడుదలయింది. ఇందులో  ఓ హృద్యమైన సన్నివేశం ఉంది. రాముడు  నది దాటాల్సి వస్తుంది. అయితే ‘రాముడి కాలి దుమ్ము సోకి రాయి అమ్మాయి అయిపోయింది. మరి నా పడవలో కాలు పెడితే పడవ ఏమై పోతుందో?’ అని సందేహిస్తూ ఓ అద్భుతమైన పాట పాడతాడు పడవ నడిపే గుహుడు. భరత్ వ్యాస్ సుందర హిందీ పద బంధాలతో రాసిన పాటకు వసంత్ దేశాయ్ బాణీ కూర్చాడు. ఉత్తర భారత జానపద బాణీ ఆధారంగా రూపొందిన ఈ బాణీలో పదాలు, బాణీ ఒకదానికొకటి తోడై మనోహరంగా ఉంటాయి.

హమ్ నే సునీ కహానీ
గావ్ వాలోంకీ జుబానీ
జాదూ వాలా హై యే రామయ్యా
దయ్యారే దయ్యారే
ఏక్ పత్థర్ ఛువాతో
ఝట్ బన్‍గయీ ఫట్ సే లుగయా

చాలా సులభమైన పదాలలో ‘నీ కాలి దుమ్ము సోకితే ఏమౌతుందో’ అన్న భయాన్ని హృద్యంగా వ్యక్తపరచాడు భరత్ వ్యాస్. ఈ చరణం తరువాత చరణంలో కాళ్లు శుభ్రంగా కడిగి నావలోకి అనుమతిస్తాడు అన్న ఆలోచన కనిపిస్తుంది.

హమ్ భీ  కేవత్ ప్రభు
తుమ్ భి కేవత్ హో
భాయ్ చారా హమ్ సే నిభయ్యో
నదియా కే పార్
నదియా కా పార్ లాగోయో తుమ్హె,
తుమ్ హమ్ కో భీ పార్ లగాయ్యో
హాయ్, హమ్ కో భీ పార్ లగయ్యో
భవ సాగర్ సే పార్ లగయ్యో
హోహో.. భయ్యా రే.. భయ్యా రే.. భయ్యా రే..

‘అందరినీ దరి చేర్ఛే మారాజువే, అద్దరినీ జేర్చమని అడుగుతుండావే’ అన్న భావానికి భక్తిని జోడించి రచించాడు భరత్ వ్యాస్. ‘కేవత్’ అంటే పడవలో నది దాటించేవాడు. రాముడూ, తానూ నది దాటించే వారమే కాబట్టి తమది సోదర సంబంధం అంటూ, ‘నేను నిన్ను ఈ నది దాటిస్తాను, నన్ను భవసాగరం దాటించు’ అంటున్నాడు.. ఒళ్లు పులకరించి, కంట నీరు సంతోషంతో ఎగజిమ్మే భక్తి భావన ఇది.

1962లో ‘సౌతేలా భాయ్’ అనే సినిమా విడుదలయింది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల నడుమ ఉన్న ప్రేమానుబంధాలను ఎత్తి చూపిస్తూ ఆధునిక సమాజంలోని సోదరులకు ఆదర్శాన్ని నిలిపే అత్యద్భుతమైన పాటను శైలేంద్ర అందంగా సృజించాడు. పాటలో పదాలు మాండలికంలో ఉంటాయి. అనిల్ బిస్వాస్ పదాలను బాణీలో ఒదిగించిన విధానం ఈ పాట విలువను మరింత పెంచుతుంది. మన్నాడే. పంకజ్ మిత్ర, అనిల్ బిస్వాస్‍లు సందర్భోచితంగా భావాలు చిలుకరిస్తూ పాటను హృదయానికి చేరువ చేశారు.

దేఖో, భాయ్ భాయ్ కా నాతా దేఖో
అమర్ అగర్ యే ప్రీత్ న హోతీ జగ్ మే క్యా రహ్ జాతా

ఈ పాటలో రాముడు వనవాసం వెళ్తుంటే, లక్ష్మణుడు రాముడిని వదలడు. వెంట వెళ్తాడు.

హమే తుమ్ ఛోడ్ అకేలే
జా నా సకోగే భయ్యా
అకేలే జా నా  సకోగే భయ్యా
రహూ మై సదా తుమ్హారే సంగ్
తుమ్హారే అంగ్

ఇలా లక్ష్మణుడు – సీత, రాముడి వెంట వనవాసానికి వెళ్తుంటే, ‘గయే రామ్ వన్ మే, ఔర్ కరూ మై  రాజ్ తో ధిక్కార్ హై’ అంటూ భరతుడు వారిని ఆపుతాడు.

భయ్యా చలో, లౌట్ చలో
యే ఆసూ కోయీ జోడ్ సకే తో
ఏక్ సాగర్ బన్ జాయే
దో నో  హై ముఖ్ పే లోగోం కే
ఏక్ రామ్ దూజా హాయే

అని రాముడిని అయోధ్యకు తిరిగి రమ్మని బ్రతిమిలాడతాడు. చివరికి రాముడి పాదరక్షలు రాజ్యం చేస్తాయంటూ, పాదరక్షలు తలపై మోస్తూ వెనుదిరుగుతాడు. అన్నదమ్ముల నడుమ ఉన్న ఈ అపూర్వ అనుబంధాన్ని వీధి నాటకంలా ఆడుతుంటే పెద్దల ఒళ్లో కూర్చుని పిల్లలు చూస్తుంటారు. మానవ సంబంధాల ఔన్నత్యం, లోతు, మాధుర్యాలను అర్థం చేసుకుంటారు. ఇలాంటి ఉన్నత విలువలు, సత్ప్రవర్తనలను బాల్యం నుంచీ పిల్లలకు బోధించే వ్యవస్థ ఆధునిక సమాజంలో లోపించింది. దుష్ఫలితాలను అనుభవిస్తూనేవున్నాము. ఇకననినా, రాముడిని బాలంలోనే చేరువ చేయటం ద్వారా ఉత్తమ వ్యక్తుల నిర్మాణం సాధించాలని సమాజాన్ని హెచ్చరిస్తూంటుందీ పాట.

రామ కథ లక్ష్యం మానవ సంబంధాలలోని మనోహరత్వాన్ని, దైవత్వాన్ని మానవులకు బోధించటమే కదా!

ఇంకా, 1963లో విడుదలయిన ‘హరి దర్శన్’ సినిమాలో మన్నాడే పాడిన ‘తెరీ రామ్ కరే రఖ్‍వాలీ’, 1965 లో విడుదలైన ‘ఘర్ ఘర్ మే దీవాలీ’ సినిమాలో శివ్ దయాల్ బతీష్, సుధా మల్హోత్రా పాడిన ‘అబ్ తో రామ్ భజన్ కర్ లేనా’, 1958లో కవి ప్రదీప్ రచించి గానం చేసిన ‘యే కథా  భక్త్ భగవాన్ కీ’ (రామ్ భక్త్ విభీషణ్), 1954లో విడుదలైన ‘తులసీదాస్’ సినిమాలో రఫీ పాడిన ‘ముఝె అప్నీ శరణ్ మే లేలో రామ్’, 1952లో విడుదలయిన “రామ్ హనుమాన్ యుద్ధ్’ లో దిలీప్ ధోలకియా పాడిన ‘భజ్ రామ్ భజ్ రామ్’, 1954లో ‘మహాపూజ’ సినిమాలోని ‘హారియే న హిమ్మత్ బిస్సరియే న రామ్’, 1960లో ‘ఘరానా’ సినిమాలో రఫీ ఆశాలు పాడిన ‘జై రఘునందన్ జై సియారామ్’ వంటి అనేకానేక పాటలు హిందీ సినిమాల్లో వినిపించి దేశ ప్రజలలో భక్తి భావ బీజాలను నాటుతూ వచ్చాయి. సమాజం ముందు ఉత్తమ ఆదర్శాన్ని నిలిపి, ఉత్తమ విలువలు బోధిస్తూ సమాజానికి మార్గదర్శనం చేస్తున్నాయి.

గతంలో సినిమాల్లో తెల్లారే లేచి ఒకరు ఇంట్లో మందిరం ముందు కూచుని భక్తి గీతం ఆరంభించగానే, ఒకరొకరుగా ఇంటిల్లపాదీ వచ్చి చేరేవారు. వారు పూజలో పాల్గొనే విధానాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాలు బోధపడేవి. ఒక పాత్ర మంచిది అనటానికి తెల్లారే గుడికి వెళ్ళి భజన పాడటమే, ఇంట్లో పూజ చేయటమో సూచనలు. ఇప్పుడు ఇళ్ళల్లో పూజలటౌంచి, తండ్రీ కొడుకు కలసి తాగటం, కూతురు తల్లి వికృతంగా ప్రవర్తించటం ఆధునిక అభివృద్ధికి నిదర్శనం అయింది. సమాజంలో సహనం, త్యాగాలు తరిగి, అసహనం, స్వార్ధాలు పెరిగేయి. ఇందుకు ప్రధాన కారణం సమాజం రాముడికి, రామాయణంలో ప్రదర్శించిన విలువలకు దూరం జరుగుతూండటమే!

1943 లో విజయ్ భట్ దర్శకత్వంలో ప్రేమ్ అదీబ్ రాముడిగా, శోభన సమర్థ్ సీతగా నటించిన ‘రామరాజ్య’ విడుదలైంది. స్వతంత్ర పోరాట కాలంలో, రామరాజ్య భావన ద్వారా దేశంలో స్వపరిపాలన ఆలోచనలను, పరాయి పాలనలోని బానిసత్వాన్ని ఎత్తి చూపిస్తూ ప్రజలలో స్వేచ్ఛా స్వతంత్ర భావనలకు రామకథ ద్వారా ఊపునివ్వాలని రూపొందించిన సినిమా ఇది. మహాత్మాగాంధీ తన జీవిత కాలంలో ఇష్టంగా చూసిన ఏకైక సినిమా ఇది. ఆయనకు సినిమా మాధ్యమం పై సదభిప్రాయం లేదు.

ఈ సినిమాలో ‘దేఖో దేఖో దేఖో రామ్ రాజ్య్ మే’ అన్న పాట ద్వారా రామరాజ్యం ఎలా ఊటుందో ప్రజల కళ్ల ముందు నిలిపారు. రమేశ్ గుప్త రాసిన ఈ పాటకు శంకర్ రావ్ వ్యాస్ సంగీత దర్శకత్వం వహించాడు. అమీర్ బాయి కర్ణాటకి, సరస్వతి రాణే, మన్నాడేలు పాడేరు.

దేఖో దేఖో దేఖో దేఖో రామ్ రాజ్య్ మే
చాహు దిశ్ అజబ్ ఖుశ్‍హలీ హై
సుఖ్ సంపతి సే హరీ భరీ ఇస్ భారత్ కే ఫుల్వారీ హై

రామ రాజ్యంలో నలు దిశల సుఖశాంతులేనట. సుఖ సంపత్తులతో భారత్ పూలతోటలా ఉండేదట.

కహీ యజ్ఞ్ హవన్ కహీ వేశ్ పఠన్
గోమాతా కీ రఖ్‍వాలీ హై
హరే భరే హై ఖేత్ అన్న్ జల్ మిలే సదా భర్ పేట్
ఝూమ్‍తీ డాలీ డాలీ హై

రామరాజ్యంలో ఓ వైపు యజ్ఞాలు, మరోవైపు శాస్త్ర పఠనాలు సాగుతాయి. గోమాత సురక్షితంగా ఉంటుంది. పంట పొలాలు పచ్చగా ఉంటాయి. కడుపు నిండా తిండి, నీరు లభిస్తాయి.  ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు.

పైసో కో వ్యాపార్ ధర్మ్ కా బ్రాహ్మణ్ కర్తక్ భర్
సూత్ కో సేవా ప్యారీ హై
హో బ్రాహ్మణ్ ప్రతి పాలన్ శాస్త్ర్ కీ ధార్
సుఖీ సబ్ ప్రజా హమారీ హై
కహీ గీత్ మధుర్
ధ్వని తాల్ మిలే, కహీ పాయల్ కీ ఝంకార్ మిలే

వ్యాపారాలు ధర్మబద్ధంగా సాగుతాయి. బ్రాహ్మణులు ధర్మబద్ధ విధులు నిర్వహిస్తారు. సేవలు చేసేవారు చిత్తశుద్ధితో సేవిస్తారు. ప్రజలంతా ధర్మ బద్ధంగా,   సుఖంగా ఉంటారు. శబ్దం, తాళం మిళితమై మధుర గీతాలు వినిపిస్తాయి. లయబద్ధంగా సిరిసిరి మువ్వల నాదం వినిపిస్తుంది.

రామరాజ్యాన్ని ప్రజల కళ్ళ ముందుంచి, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని క్షామరాజ్యంగా,  అధర్మ రాజ్యంగా చూపించి ప్రజలను దేశభక్తి వైపు మళ్ళించటంలో రాముడు, రామాయణాలను ఆనాటి కళాకారులు ఎంతో సృజనాత్మకంగా వాడుకున్నారు. ఆనాడు భక్తి భావంతో, తన్మయత్వంతో, దేశభక్త్యావేశంతో, సమాజం ముందు ఉత్తమ ఆదర్శం, ఉత్తమ విలువలు ప్రదర్శించే ఉత్తమ కళను సృష్టించాలన్న తపనతో వారు సృజించిన రామ భక్తి గీతాలు ఈనాటి సమాజానికే కాదు, భావితరాలకు కూడా మార్గదర్శనం చేయగల శక్తి కలవి.  రామభక్తిని, రామాయణ సారాన్ని సజీవంగా నిలుపుతూ  తరతరాలకు చేరువ  చేస్తున్నాయి.

[ఈ వ్యాసం సమగ్రమూ, సంపూర్ణము కాదు. రాముడి పాటలనగానే వెంటనే గుర్తుకు వచ్చిన కొన్ని పాటల ప్రస్తావన మాత్రమే ఈ వ్యాసంలో కనిపిస్తుంది. ఇంకా అనేక మధురమైన పాటల ప్రస్తావన, ఇటీవలి ‘స్వదేశ్’ వంటి సినిమాలలో వినిపించిన పాటల ప్రస్తావనలు ఈ వ్యాసంలో లేవు. ఇటీవలి సినిమాల్లోని పాటలనూ ప్రస్తావించలేదు.  ఇది కేవలం పరిచయ వ్యాసం మాత్రమే.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here