పట్నం తీరు

2
14

[మోహనరావు మంత్రిప్రగడ గారు రచించిన ‘పట్నం తీరు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నా[/dropcap]గయ్యది ఓ పల్లెటూరు. అక్కడ అతను ఓ చిన్న రైతు, స్వంత భూమితో పాటు కొంచెం కౌలు భూమి కలిపి వ్యవసాయం చేసేవాడు. అలాగే ఒక్కగానొక్క కొడుకును పట్నం పంపి చదివించాడు. అతను బాగా చదువుకొని మంచి మార్కుల ద్వారా ఉపకారవేతనం సంపాదించి పైచదువు చదివాడు. అతనికి దూరంగా ఓ పట్నంలో మంచి ఉద్యోగం వచ్చింది, అక్కడే తనతో పనిచేస్తున్న అమ్మాయినే వివాహం చేసుకొన్నాడు (ఈ కధ పల్లెవాసుల గురించి, పల్లెలంటే నేటివి కాదు, చాలాకాలం అంటే 1960 కంటే ముందు నాటివి. అప్పటికి చాలా ఊళ్ళకి రోడ్లు కూడా ఉండేవి కాదు, ఏ రకమైన అభివృద్దికి నోచుకోలేదు, కనీసం ఆ ప్రాంతంలో బళ్ళు, తప్ప వాహన సౌకర్యం కూడా లేదు, చాలామంది నడచే వెళ్ళేవారు. సైకిలు కూడా నడవని మార్గాలు, అంచేత ఆ పల్లెవాసులకి దూరంగా ఉన్న పట్నాల గురించి బాగా తెలియదు, వారం సంతలో అన్ని కొనుక్కోనేవారు). ఇంక కథలోకి వద్దాం (ఈ కథ నాకు తెలిసిన ఓ సంఘటనకి కొంత కల్పించి వ్రాయడమైనదని మనవి).

నాగయ్య కొడుకు వచ్చి నాగయ్యని భార్యని తనుండే పట్నం తీసుకెళ్ళాడు. నాగయ్యకి రైలు ఎక్కడం అదే ప్రథమం, చాలా ఉత్సాహంగా అన్ని పరికిస్తున్నాడు. ఓ రోజు ప్రయాణం చేసి గమ్యం చేరారు. నాగయ్య కుమారుడు, తల్లిని తండ్రిని టాక్సీ మీద ఇంటికి తీసుకొచ్చాడు. అదో పెద్ద అపార్టుమెంట్. ఆ రోజుల్లో అవి పెద్ద నగరాల్లోనే ఉండేవి. చిన్న పట్నాల్లో అప్పట్లో ఆ సౌరభం లేదు. నాగయ్య అది చూసి, “ఒరే బాబా మీరుండేది ఇద్దరే కదా, ఇంత ఇల్లేందుకురా” అన్నాడు నోరువెళ్ళబెట్టి చూస్తూ. “నాయనా, ఇదంతా మనది కాదు, ఇందులో ఓ భాగం మనది, మిగతావి వేరే వాళ్ళవి” అన్నాడతని కొడుకు నవ్వుతు. “అంటే అందరు డబ్బులు యేసుకోని కట్టుకొన్నారా” అడిగాడు మళ్ళ నాగయ్యే,

“అలాకాదు నాయనా, ఒకాయన కట్టి అమ్ముతుంటే అందరు కొనుక్కున్నారు” అన్నాడు, “మరి కింద ఇంత కాళి యిడిచెసారేం” మళ్ళా అడిగాడు. “అంటే నాయన అందరి మోటారు బళ్ళు, సైకిళ్ళు పెట్టుకొందుకు” అన్నాడు అతను. ఆ తరవాత నాగయ్య కొడుకు ఫ్లాట్ మొదటి అంతస్తే కనక మెట్ల ద్వారా తీసుకెళ్ళాడు వాళ్ళని. లిఫ్టు మెట్లవెనక ఉండడంమూలంగా నాగయ్య చూడలేదు, పైకి ఎక్కి అతని కొడుకు ఇల్లు చూసి, “ఓరే బాబా ఇది కూడా పెద్దగానే ఉందిరా, ఓ సావిడి(హాలు) రెండు పడక గదులు, విశాలంగా ఉంది” అన్నాడు. నాగయ్య, భార్య కూడా ఆశ్చర్యపోయారు.

అంతలో కోడలు మంచినీళ్ళు పట్టుకొచ్చి “నమస్కారం మావయ్య, అత్తయ్య” అంది కాని కొంచం యాసగా అంది, ఆమెది ఆ పట్నమే. ఎప్పుడో వాళ్ళ తాతగారు ఉద్యోగరీత్యా వచ్చి అక్కడ స్థిరపడిపోయారట. నాగయ్యకి , భార్యకి ఆమెను చూడ్డం అదే ప్రథమం, ఎందుకటే అతని కొడుకు ఇష్టపడి తన ఆఫీసులో పనిచేసే అమ్మాయినే చేసుకొన్నాడు. ఆ సంగతి ముందుగా తండ్రికి చెప్పాడు, కాని వాళ్ళు అక్కడకి రాలేకపోయారు. “మీరు కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం వడ్డిస్తాను” అందా అమ్మాయి.

నాగయ్య అటు ఇటు చూసి “ఏరా కాళ్ళు ఎక్కడ కడుక్కవాలిరా” అని అడిగాడు. అతను వాళ్ళకి బాల్కాని చూపించి కుళాయి త్రిప్పితే నీళ్ళోస్తాయని చూపించాడు. భోజనాలు ఎక్కడ పెడతారో నాగయ్యకి తెలియలేదు, కొడుకు బల్ల చూపించాడు, “ఒరే అంటే మనూళ్ళో వోటేలు (హోటల్) లాగ బల్లమీద కూకొని తినాలా” అని అడిగాడు, “అవునండి, రండి కూచోండి” అంది కోడలు, నాగయ్య కూర్చున్నాడు, అతని భార్య నిలబడే ఉంది. “అదేం మీరు కూడా కూర్చోండి అత్తా” అంది కోడలు, “అదేంటమ్మా మగాడు తిన్నాక కదా నే తీనేది” అంది అమాయకంగా. “అయ్యో అది మనూళ్ళో పద్ధతి, ఇక్కడలా కాదు, కూర్చో” అని దగ్గరుండి ఆమేని కూర్చో పెట్టాడు కొడుకు. మొత్తానికి భోజనాలు అయినయి.

భోజనాలు అయ్యాక తండ్రిని తల్లిని ఓ గది దగ్గరకి తీసుకెళ్ళి “ఇక్కడ రెండు మంచాలున్నాయి, పడుకోండి. లేచాక టీ తాగి బైటకి వెడదాం” అన్నాడు, నాగయ్యకి, భార్యకి ఇదంత విచిత్రంగా అనిపించింది. అయినా పడుకుందుకు వెడుతు “ఒరే బాబా, మద్దెలో ఒంటేలుకి (యూరిన్‌కి) యెళ్ళాలంటే యెక్కడకి యళ్ళాళిరా” అని అడిగాడు. “అదా నాన్నా, ఇదిగో ఈ తలుపు చూడు” అని బాత్రూం చూపించి అది ఎలా ఉపయోగించాలో చెప్పాడు.  ఆ తరవాత సాయంత్రం తండ్రిని తీసుకు బైటకి వెళ్ళాడు, ఓ మాల్ దగ్గర దింపి “అయ్యా, నువ్వు ఈడే ఉండు, నేను కారు షెడ్‌లో పెట్టి వస్తాను, ఏడకి పోకు, నీకు ఇక్కడ భాష రాదు కదా” అని కారు తీసుకు వెళ్ళాడు. ఇంతలో నాగయ్య ఆ మాల్‍లో క్రింద నుంచొని చూస్తున్నాడు, అక్కడ ఓ గదిలా కనిపించింది, దానికేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఇంతలో ఓ ఏభై ఏళ్ళ ఆవిడ వచ్చి ఆ గది తలుపు తీసుకు లోపలకెళ్ళి తలుపేసుకొంది, ఓ ఐదు నిమిషాల తరవాత ఓ ఇరవైఏళ్ళ అమ్మాయి అందులోంచి బైటకి వచ్చింది, అదంతా నాగయ్య నోరావలించి చూస్తన్నాడు. ఇంతలో ఆయన కొడుకు వచ్చి, తండ్రిని చూసి “ఏమిటి నాన్నా చూస్తున్నావు” అని అడిగాడు. “ఓరే బాబా మీయమ్మని తీసుకొచ్చి ఓపాలి ఈ గదిలో కూకొపెట్టాలిరా” అని అడిగాడు

“ఎందుకు నాన్నా” అని అడిగాడతను. “అంటే ముసలదైపోయిందికదా, పనులు సేసుకోలేకపోతంది, ఇందులోకి పంపితే ఓ పాతికేళ్ళ పిల్లవ్వుద్ది కదా పనులు బాగా సేసుకొంటాదనీ” అన్నాడు (ఈ జోకు పూర్వం ఓ పత్రికలో వచ్చింది).

“అలా ఎలా అవుతుంది” అని అడిగాడు కొడుకు ఆశ్చర్యంగా. నాగయ్య అంతక ముందు చూసిన విషయం చెప్పాడు, దానికి అతని కొడుకు నవ్వేసి, “ఓరయ్యా, అది గది కాదు, మనుషులు పైకి క్రిందకి రావడానికి పోవడానికీ గల ఓ మిషనన్నమాట, ఇందాక నువ్వు చూసింది, ఒకావిడ  పైకి వెళ్ళింది, ఆ తరవాత ఓ అమ్మాయి క్రిందకొచ్చిందన్నమాట” అని విడమరచి చెప్పాడతను.

ఆ తరవాత అతని తండ్రిని ఆ లిఫ్టు ఎక్కించి ఆ మాల్ అంతా చూపించి ఇంటికి తీసుకొచ్చాడు అతను. ఆ రాత్రి భోజనాల దగ్గరకి నాగయ్య భార్య రాలేదు, “ఇదిగో ఓలమ్మి తిండానికి రాయే” పిలిచాడు, నాగయ్య. “నేనేందుకు నీకు పడసు పెళ్ళాం కావాలి కదా దాన్నే తెచ్చుకో” అని అరచింది గదిలోంచి ఆవిడ. “అంటే ఓలమ్మి అది కాదే నువ్వు కాంత పడసు దానివైతే ఇంటి పనులు గట్టా సులువుగా సేసుకోంటావని కాని లెపోతే నాకెందుకె పడసు పెళ్ళాం ఈ వయస్సులో, అసలు అది గదని బమ పడీ అలా అడిగాను బిడ్డని, అంంతే రా వచ్చి కూకో” అన్నాడు నాగయ్య. ఆ తరవాత బోజనాలు అయ్యాక ఇద్దరు గదిలోకెల్లి పడుకొన్నారు. నాగయ్య ఐదింటికే లేచిపోయాడు, “ఓ అయ్యా అప్పీడే లెగిసావెందుకు ఇంకా ఎవరు లెగరు పడుకో” అరచిందతని భార్య.

అయన నాగయ్య బాల్కానీలోకి వెళ్ళి చూసాడు బైట వెలుగు రాలేదు, బైటంతా ఎవరు కనపడటంలేదు. తిరిగొచ్చి మళ్ళా పడుకొన్నాడు,

అలా ఓ వారం గడిపారు, వాళ్ళ కోడలు కూడా చాలా సంతోషంగా అత్తమామలను చూసుకొంది.

పది రోజులు గడిచాక నాగయ్యని భార్యని కొడుకు కోడలు తీసుకొని వాళ్ళ ఊరొచ్చారు. ఆ పల్లె, అక్కడ మనుషులని చూసి చాలా సంంతోషపడింది వాళ్ళ కోడలు. ఆమె ఎప్పుడు పల్లెలు చూడలేదు, అందుకు.

ఆ తరవాత ఊళ్ళోవాళ్ళు వచ్చి నాగయ్యని కలిసారు, నాగయ్య పట్నం యిసయాలు రోడ్డుమీద పట్టాల మీద కార్లలాంటివి  నడుస్తాయని, అక్కడ రైలు స్టాండు చాలా పెద్దదని, అలాగే  షాపు ఎక్కడానికి ఓ మిషను పెట్టె ఉందని, ఆ షాపులో బోల్డు వస్తువులు ఉన్నాయని, అక్కడ ఏదైన యిరిగిపోతే బాగు చేయించరంట, అది వదిలేసి కొత్తది కొంటారంట, అని అన్ని విషయాలు విచిత్రంగా చెపుతుంటే అందరు నోరావలించి వినసాగారు, నాగయ్యకి అన్ని చెప్పడానికి వారం పట్టింది.

ఆ తరవాత నాగయ్య మళ్ళా తన పనిలో పడిపోయాడు, మామూలుగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here