పాత్రికేయ నవలాకారుడు శ్రీ వీరాజీ…!!

9
10
శ్రీ వీరాజీ

[dropcap]ర[/dropcap]చనా వ్యాసంగంలో, పాత్రికేయులైనా, నవలాకారులైనా, కవులైనా, కథా రచయితలైనా చాలామంది రచయితలు కలం పేరుతో తమ రచనలను అందిస్తుంటారు. కానీ ఏదో సందర్భంలో వారి అసలు పేర్లు కూడా తెలుస్తుంటాయి. అవసరాన్ని బట్టి అలా వారి అసలు పేర్లు తెలుసుకునే అవకాశం కలుగుతుంది, అలా చాలామంది కవులు రచయితలూ వున్నారు. మచ్చుకి – శ్రీశ్రీ, ఆరుద్ర, కరుణశ్రీ వంటివారు. కానీ కలం పేరుతోనే అసలు పేరుగా ప్రసిద్ధి పొందిన రచయితలు బహు కొద్దిమంది. అలాంటి వారిలో శ్రీ ‘వీరాజీ’ ఒకరు. 1975 నుండీ వీరాజీ గారితో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నాకు పరిచయం ఉన్నప్పటికీ ఆయన చనిపోయేవరకూ ఆయన పేరు నాకు కూడా తెలియకపోవడానికి గల అసలు కారణం, వీరాజీ.. అనేది ఆయన అసలు పేరు అనుకోవడమే! అందుచేతనే నేను ఎప్పుడూ ఆయనను ఈ విషయం అడిగిన సందర్భాలు లేవు. పైగా చెప్పవలసిన అవసరం ఆయనకు రాలేదు.

ప్రముఖ సీనియర్ జర్నలిస్టుగా, నవలా రచయితగా, ఎన్నో జనరల్ నాలెడ్జి పుస్తకాలకు సంపాదకుడిగా, రచయితగా, వీరాజీగా ప్రసిద్ధి పొందిన ఈ మహానుభావుడి అసలు పేరు ‘పిళ్ళా కృష్ణమూర్తి’ గారు. ఈ పేరు చెబితే అది వీరాజీ గారి అసలు పేరని చాలా మంది ఆయన నవలలు చదివిన పాఠకులకు కూడా తెలియదంటే ఏమాత్రం ఆశ్చర్య పోనక్కరలేదు. పైగా ప్రచారానికి చాలా దూరంగా వుండే వ్యక్తి కావడం మూలాన, కొద్ది రోజుల క్రితం ఆయన స్వర్గానికి చేరుకున్నా పత్రికా రంగం ఆయన మరణ వార్తను పాఠకలోకానికి అందించ లేకపోయింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం.

తన పన్నెండవ ఏటనే రచనా వ్యాసంగం మొదలు పెట్టిన శ్రీ వీరాజీ ఆంధ్రా విశ్వవిద్యాలయంనుండి భౌతిక శాస్త్రాన్ని ప్రధాన అంశంగా చదువుకున్నారు. తెలుగు ఆంగ్లభాషల్లో మంచి పట్టు సాధించారు. లెక్చరర్ గానో, కలెక్టరు గానో చూడాలనుకున్న ఇంటి పెద్దల అభీష్టానికి భిన్నంగా, ఆశ్చర్యకరంగా ఆయన జర్నలిస్టుగా స్థిరపడి ఆ రంగంలో పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు.

మనవరాలు, మనవడితో….శ్రీ వీరాజీ

దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు గారు తాను స్వయంగా తయారుచేసిన ‘అమృతాంజనం – పెయిన్ బామ్’ తెచ్చిపెట్టిన లాభాలతో మొట్టమొదట ముంబైలో మొదలుపెట్టిన ‘ఆంధ్రపత్రిక’ తర్వాత మద్రాసు ముఖ్య కేంద్రంగా తరలి వచ్చింది. అలాంటి సాహసోపేతమైన, ప్రతిష్ఠాకరమైన ‘ఆంధ్రపత్రిక’ వార్తాపత్రికలో ఉప సంపాదకుడిగా శ్రీ వీరాజీ 1961 నుండి 1991లో ఆ పత్రిక మూసివేతకు గురి అయ్యేవరకూ, మద్రాసు, విజయవాడ కేంద్రాలుగా, పత్రికకు ఆయన సేవలు అందించారు.

ఒక సమావేశంలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారితో శ్రీ వీరాజీ

1940లో విజయనగరంలో జన్మించి వీరాజీగా ప్రసిద్ధి పొందిన శ్రీ పిళ్ళా కృష్ణమూర్తి – నాటి ఆంద్రపత్రిక ముఖ్య సంపాదకులైన శ్రీ శివలెంక శంభు ప్రసాద్ గారికి ఏకలవ్య శిష్యుడిగా ప్రకటించుకున్నారు. ఆయన ప్రేరణతో పత్రికా రంగంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. ఆంధ్రపత్రిక దినపత్రికతో పాటు తర్వాతికాలంలో రెండు మాసపత్రికలూ, ఒక వారపత్రిక, ఈ గ్రూపులో చేరాయి. అవి, ఆంధ్రపత్రిక (వార పత్రిక), కలువబాల అనే స్త్రీల మాసపత్రిక, బాలరంజని అనే పిల్లల మాసపత్రిక అనేవి. ఆంధ్రపత్రిక ఆదివారం అనుబంధంతో పాటు, మిగతా మూడు పత్రికలనూ శ్రీ వీరాజీ గారు ఎంతో సమర్థవంతంగా నిర్వహించేవారు.

మహానటుడు శ్రీ కమల్ హాసన్ తో శ్రీ వీరాజీ

‘తెర మీద – తెర వెనుక’ అనే శీర్షికతో ఆయన రాసిన సినీ ప్రముఖుల వ్యాసాలు బహుళ ప్రచారం పొందుతుండేవి. సినీ ప్రముఖులు, విద్యార్థి నాయకులపై ఆయన చేసిన (రాసిన) ఇంటర్వ్యూలు, పాఠకలోకంలో కలకలం రేపేవి. ఆయన దగ్గర ఉన్నంత సినిమా సమాచారం మరెవ్వరి దగ్గరా లభించేది కాదు. పత్రికలలో ఆయన ప్రవేశ పెట్టిన సామాన్యుడి సణుగుడు, వీరాజీయం, స్మృతి లయలు, బెజవాడ బాతాఖానీ, వార్తా వ్యాఖ్య శీర్షికలు వీరాజీ గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

వేదగిరి రాంబాబు తమ్ముడు గీతాసుబ్బారావు (కుడి) తదితరులతో శ్రీ వీరాజీ

పాఠకలోకంలో ఆయన ‘ఆంధ్రపత్రిక వీరాజీ’గా స్థిరపడిపోయారు. ఆ రోజుల్లో పత్రిక లక్ష కాపీలు అమ్ముడు పోవడం ఒక రికార్డు. ఆ ఘనత వీరాజీ గారికే దక్కుతుందని వేరుగా చెప్పనవసరం లేదు. ఆంగ్ల – తెలుగు భాషల్లో మంచి ప్రావీణ్యం వున్న శ్రీ వీరాజీ ఏ ప్రక్రియ చేపట్టినా తనదైన ప్రత్యేకత అందులో తప్పక కనిపించేది. కలం చిందులు, తెర మీద – తెర వెనుక, ముచ్ఛట్లు, ఆయన మరికొన్ని శీర్షికలు వీరాజీ గారికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. యూనివర్సిటీ క్యాంపస్ నేపథ్యంగా ఆయన రాసిన ‘తొలి మలుపు’ నవల, రష్యన్, బెంగాలీ భాషల్లోకి అనువదింపబడి వీరాజీ గారికి అంతార్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టింది. క్యాపస్ వేదికగా వచ్చిన తొలి నవలగా దీనికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘ఇద్దరం ఒకటే’ అనే నవల, ఇటాలియన్ భాషలోనికి అనువాదం చేయబడి ఆయనకు ఖండాతర కీర్తిని తెచ్చి పెట్టింది. ‘విడీ వీడని చిక్కులు’ అనే నవల ఆనాటి యువ రచయితలపై ఎంతో ప్రభావం చూపిందని చెబుతారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారం అయిన వీరాజీ గారి సాహిత్య వ్యాసాలు సైతం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. జర్నలిస్టుగా రష్యా ప్రభుత్వం ఆహ్వానంపై వీరాజీ ఆ దేశంలో పర్యటించి, తన యాత్రానుభవాలను 1984లో ఆంధ్రపత్రికలో సీరియల్‌గా రాసి ‘యాత్రానందం’ పేరుతో ప్రచురించినారు. విజయవాడ రేడియో శ్రోతలకు వీరాజీ గారు రాసిన నాటికలు, పాల్గొన్న వార్తావిశ్లేషణలు, కథలు ఎప్పటికీ గుర్తుంటాయి.

 

పత్రికా రంగంలో అడుగు పెట్టక ముందే ఆంద్రపత్రిక గ్రూపుకు చెందిన ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పత్రిక ‘భారతి’ లో వీరాజీ గారి రచనలు అచ్చయ్యేవి. అప్పుడు పత్రికారంగంలో, ముఖ్యంగా ఆంధ్రపత్రిక గ్రూపులో అడుగు పెడతానని ఆయన అనుకోలేదు. ఈ గ్రూపుకు చెందిన సాహిత్య పత్రిక ‘భారతి’ ముందుగా ఆగిపోవడం తెలుగు సాహిత్య కారులను, రచయితలను ఎంతగానో నిరాశ పరిచింది. అప్పటినుండి ఇప్పటివరకూ అలాంటి సాహిత్య పత్రిక రాలేదు.

పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకోసం 20 సంవత్సరాల పాటు ‘అరచేతిలో విశ్వజ్ఞానం’ అనే జనరల్ నాలెడ్జి పుస్తకాన్ని కూర్చి, సంపాదకత్వం వహించారు. అంతమాత్రమే కాకుండా 1973-75 సంవత్సరాలకు విజయవాడ ప్రెస్ క్లబ్‌కు అధ్యక్షుడిగా సేవలందించారు.

సుఖం కోసం నవలతో పాటు, తొలిమలుపు, మునగ చెట్టు, విడీ వీడని చిక్కులు, పగ -ప్రేమ, ఎదిగీ ఎదగని మనసులు వంటి నవలలు వీరాజీ గారికి మంచి నవలాకారుడిగా పేరు తెచ్చి పెట్టాయి. రాతి మేడ.. అనే నవల నాలుగు ముద్రణలు పొందడం అప్పట్లో విశేషమే!

ఒక మంచి జర్నలిస్టు, రచయితగా పేరుతెచ్చుకున్న శ్రీ వీరాజీ, యువ రచయితలను, రచయిత్రులను తాను సంపాదకత్వం వహిస్తున్న పత్రికల ద్వారా ప్రోత్సహిస్తుండేవారు. అలాంటి వారిలో నేనూ ఒకడిని. 1975వ సంవత్సరంలో నేను దంత వైద్య విద్యార్థిగా వున్నప్పుడు, మొదటిసారి ఆంద్రపత్రిక చిరునామా సంపాదించి ఒక వ్యాసం పంపడం జరిగింది. ‘కట్టుడు పళ్ళు అవసరమా?’ అన్నది ఆ వ్యాసం పేరు. అప్పుడు శ్రీ వీరాజీ ఆంద్రపత్రిక ఆదివారం అనుబంధం కూడా చూసేవారు. అది హైదరాబాద్‌కు శనివారం సాయంత్రం వచ్చేది. ఊహించని రీతిలో ఆ మరుసటి వారమే ఆదివారం అనుబంధంలో నా వ్యాసం వచ్చింది. అప్పటి ఆనందాన్ని మాటల్లో వ్యక్తీకరించడం సాధ్యం కాదు. పైగా నేను చదువుతున్న కళాశాలలో నన్నొక రచయితగా నిరూపించిన వ్యాసం అది. ఆ తర్వాత వరుసగా ఆయన సంపాదకత్వం వహిస్తున్న అన్ని పత్రికల్లోనూ నా రచనలకు చోటిచ్చి నన్ను అమితంగా ప్రోత్సహించిన మహానుభావుడు శ్రీ వీరాజీ. కొంతకాలం తర్వాత వ్యక్తిగతంగా కలుసుకుని మంచి స్నేహితులమయ్యాము. విజయవాడ వెళ్ళినప్పుడల్లా, సత్యన్నారాయణపురంలోని ఆయన స్వగృహంలో కలుసుకునేవాడిని. ఆయన హైదరాబాద్‌కు మకాం మార్చిన తర్వాత ఆయనను కలుసుకునే అవకాశం రాలేదుకానీ, ఆంధ్రభూమిలో ఆయన శీర్షిక ‘వీరాజీయం’ తప్పక చదువుతుండేవాడిని. రచయితగా, కాలమిస్టుగా 2011లో హైదరాబాద్ లోనే ఆయన స్వర్ణోత్సవం జరుపుకున్నారు.

ఒక పుస్తకావిష్కరణ

నిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా, హుషారుగా వుండే శ్రీ వీరాజీ 2021, ఆగస్టు 18న తన 80 వ ఏట – హైదరాబాద్ తారనాకలో కన్నుమూసారు. తెలుగు పాఠకులు పుస్తక, పత్రికా ప్రేమికులు ఒక మంచి రచయితను, కాలమిస్టును, సంపాదకుడినీ కోల్పోయారు. అయినా సాహితీలోకంలో శ్రీ వీరాజీ చిరంజీవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here