పౌర్ణమి వంట

0
11

[dropcap]కం[/dropcap]దర్ప దేశపు రాణి  మధురిమ ఒక రోజు తన చెలికత్తెతో మాట్లాడుతూ “ఈ వేళ వంట ఏమిటి చేసావే మీ ఇంట్లో” అడిగింది.

“అమ్మా ఈ రోజు పౌర్ణమి, నేను వంట అసలు చెయ్యను, నా పెనిమిటి ప్రతి పౌర్ణమికి వంట చేసి నాకు పూర్తి విశ్రాంతినిస్తాడు. అదిగాక మా ఆయన చేసే వంట ఎంతో బాగుంటుంది.. అమ్మా మీరు వినే ఉంటారు ‘నల భీమ పాకం’ అంటే పూర్వ కాలంలో నలుడు చేసిన వంట అత్యద్భుతమని కదా! ఆ వంట అయిన తరువాత మా ఆయనే ఎంతో ప్రేమగా వడ్డిసాడు. రాత్రి పౌర్ణమి వెన్నెల్లో ఇద్దరం ఆ పిండి వెన్నెలలో కూర్చుని కబుర్లు చెప్పకుంటూ భోజనం చేస్తాము” అని చెప్పింది చెలికత్తె.

నిజానికి తను మహారాజు భార్య అయినా ఇటువంటి చిన్న విషయాల్లో ఆనందం అనుభవించలేక పోతోంది. రాజావారు పరిపాలనలో ఎప్పుడూ తలమునకలై ఉంటారు! చెలికత్తె తన భర్త వంట విషయం చెప్పి నప్పటినుండి తన భర్త చేత వంట చేయంచి ఆ రుచిని చూడాలనే కోరిక ఆమెలో పుట్టింది.

ఒక రోజు రాజావారు తోటలో ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరుతున్నప్పుడు, రాణి ఈవిధంగా చెప్పింది,

“రాజా, నాకొక కోరిక ఉంది తీరుస్తారు కదా” అన్నది.

“అడుగు రాణీ, అడగక అడగక అడిగావు, తప్పక నేను తీర్చగలిగినదైతే నీ కోరిక తీరుస్తాను” చెప్పాడు రాజు.

“ప్రతి పౌర్ణమికి మీరు రాత్రి వంట చేస్తే ఇద్దరం వెన్నెలలో కూర్చుని తినాలన్న కోరిక, కాదనురుగా” మెల్లగా అడిగింది.

“నీ కోరిక బాగానే ఉంది, కానీ నాకు వంట రాదు, వంటవాళ్ళ ఎదుట నేను వంట చేస్తే చులకన అయి పోతాను, ఆలోచించు”

“మహారాజా రహస్యంగా మీకు వంట నేర్పిస్తాను, మరిన్ని మెళకువలు మీరు వంట వాళ్ళను గమనించి తెలుసుకోవచ్చు, మీకు తెలుసు కదా పాకశాస్త్రం కూడా అరవై నాలుగు కళలలో ఒకటి” వివరించింది మధురిమ.

రాజావారు రాణి చెప్పిన మాటల్ని అర్థం చేసుకుని ఒకింత ఆలోచించాడు.

రాజావారు తన గ్రంథాలయంలో పాకశాస్త్ర గ్రంథాలను చదివి అర్థం చేసుకున్నాడు.

రాణి వద్ద వంటలు నేర్చుకుని, ప్రతి పౌర్ణమికి రాత్రి వంట తానే చేయాలని నిశ్చయించాడు.

ప్రతి పౌర్ణమికి ఆయన మనసు పెట్టి చేసే వంట ఎంతో అధ్బుత రుచితో ఉండేది, ఇద్దరూ పండు వెన్నెలలో కూర్చుని తింటుంటే రాజావారికి ఒక రాజ్యం గెలిచిన ఆనందానికన్నా ఎక్కువ ఆనందం లభించసాగింది.

ఈ విషయం మెల్లగా అంతఃపురంలో అందరికీ తెలిసి అందరు మగవారు పౌర్ణమి వంటలు చేయసాగారు.

మంచి వంట ఆలోచన కలిగించిన చెలికత్తెను పొగిడి ఆమెకు రత్నాల హారం బహూకరించింది రాణి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here