పెద్దల గది

0
11

[dropcap]రా[/dropcap]జు, గిరి మంచి స్నేహితులు. గిరికి నాన్న గారి నాన్న అంటే ఎనభై ఏళ్ల తాతగారు ఉన్నారు.

అయన రాజుకి, గిరికి బోలెడు కథలు, పద్యాలు చెప్పేవారు. వయసు పై బడటం వలన చాలా మెల్లగా కర్ర  ఊతంగా పట్టుకుని నడిచేవారు.

రాజు, గిరి ఆ పెద్దాయనకు అనేక విషయాల్లో ఎంతో సహాయపడేవారు. ఆయన చదువుకోడానికి పుస్తకాలు జాగ్రత్తగా ఆయన ఇంటి గ్రంథాలయం నుండి తీసి ఇచ్చేవారు. పండ్లు వలిచి ఇచ్చేవారు. అందుకే తాతగారికి రాజు, గిరి అంటే అంత ప్రేమ.

ఒకరోజు తాతగారు బాత్‌రూమ్‌కి వెళ్ళారు. అంతకు ముందే పనిమనిషి సబ్బు నీటితో బాత్రూమ్ కడిగింది. ఆమె ఎంత పొడి బట్ట పెట్టి తుడిచినా, గుమ్మానికి ముందు సబ్బు నీటి పొర మిగిలి పోయింది! పాపం తాత గారు  అది గమనించకుండా దాని మీద అడుగు వేసి సర్రున జారి కింద పడిపోయారు. దెబ్బ తప్పంచుకొందుకు అక్కడ ఉన్న కొళాయిని పట్టుకున్నారు. ముసలితనం వల్ల ఎముకలు గుల్ల బారి ఉన్నాయి కనుక ఆ పట్టుకోవడంలో చేతి మణి కట్టు దగ్గర ఎముక చిట్లింది! ఆయన బాధతో “అబ్బా” అని అరచి అక్కడే కూర్చుండి పోయారు. ఆయన అరుపు విని గిరి నాన్నగారు పరుగున వచ్చి ఆయనను  పైకి లేవనెత్తి చేతిని పరీక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లి చేతికి కట్టు కట్టించారు.

తాత గారికి జరిగిన ప్రమాదానికి గిరి, రాజు ఎంతో బాధ పడి ఆయన దగ్గరే ఉండి కొన్ని సపర్యలు చేయ సాగారు.

అప్పుడే రాజు బుర్రలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. పెద్దవాళ్లని జాగ్రత్తగా చూసుకోవడమే కాదు వారికి అటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత పెద్దల మీద ఉన్నట్లు రాజు గ్రహించి గిరి నాన్న గారితో ఈ విధంగా చెప్పాడు.

“అంకుల్, ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పుడు వారి గది ప్రత్యేకంగా కట్టించడం అవసరం కదా, గోడలకు ప్రత్యేకంగా పట్టుకునేందుకు రాడ్ వేయించాలి. కాళ్లు జారకుండా నేల గరుకుగా ఉంచాలి. ఎత్తు గుమ్మాలు ఎత్తు మెట్లు లేకుండా మంచం ఎక్కువ ఎత్తు లేకుండా చేయిస్తే వాళ్లకి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కదా” అని చెప్పాడు.

“రాజు నీ ఆలోచన ఎంతో బాగుంది. పెద్దవాళ్ల పట్ల నీ ఆలోచన, గౌరవం నన్ను కూడా ఆలోచింప చేస్తున్నాయి. అసలు ఇల్లు కట్టేటప్పుడే పెద్దవాళ్ల గది అంటే ‘సీనియర్ సిటిజన్స్ రూమ్’ కట్టిస్తే ఇంట్లో పెద్దవారికి, ఇంటికి వచ్చిన పెద్దవారికి ఇబ్బంది ఉండదు. అదేకాదు వృద్ధుల ఆశ్రమాలలో కూడా  ఇటువంటి వసతులు కల్పించాలి. ఈ విషయాన్ని నా ఫ్రెండ్ ఆర్కిటెక్ట్ (భవనాలు కట్టే ఇంజనీరు) ధీరజ్‌కు చెబుతాను. రాజు నీవు చెప్పినట్టు తాతగారి గదిని, బాత్రూమ్‌ని ఆయనకు అనుకూలంగా మార్పులు చేయిస్తాను” అని గిరి, రాజుల తలలు నిమిరి చెరొక మంచి పెన్ బహుమతిగా ఇచ్చారు.

ఆ మాటలకి ఎంతో సంతోషించి గిరి, రాజు ఆనందంతో చప్పట్లు కొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here