పీటల మీద పెళ్లి??

1
6

[dropcap]”రా[/dropcap]ముడు అనుకోలేదు జానకి సతి కాగలదని ఏనాడూ…” సన్నాయి మేళం వారి సరిగమలు మంద్రస్థాయిలో వినబడుతున్నాయి ఆ కళ్యాణ మండపంలో.

సెలయేటి గలగలలు లాంటి పురోహితుల మంత్రాలు, పట్టుచీరల రెపరెపలు, సుగంధ పరిమళాల ఘుమఘుమలు, అటూఇటూ తిరగుతున్న పడుచు అమ్మాయిల నవ్వుల కిలకిలలతో అక్కడ పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

పెళ్లివేదిక మీద వరపూజ జరుగుతోంది. పురోహితుల పర్యవేక్షణలో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు వరుడు రాంకిరణ్. తనకు కాబోయే అల్లుడ్ని తదేకంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు, పెళ్లికూతురు మైథిలి తండ్రి జానకిరామ్.

‘కొద్ది క్షణాల్లో తన కూతురు ఈ రాంభట్ల వారి కోడలు అవుతుంది. తన గారాల కూతురు ద్వారా ఈ వంశవృక్షం శాఖోపశాఖలుగా పెరుగుతుంది. ఆదర్శ భావాలున్న తన కూతురు చాలా సంబంధాలు తిరస్కరించింది కానీ, రాంరాం పేరుతో కథలు రాసే ఈ రాంభట్ల రాంకిరణ్ భావాలు నచ్చి, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. అంతే తాను కూడా ఇంక వెనుకాముందూ చూడకుండా ఈ పెళ్లికి అంగీకారం తెలిపాడు……’

ఇలా ఆలోచనలో ములిగిపోయిన అతనికి “జానకిరామ్ గారూ! పెళ్లి కూతురు మేనమామలను సిద్ధం చేయండి, బుట్ట మొయ్యడానికి” అన్న పంతులుగారి పిలుపుతో వాస్తవానికి వచ్చాడు.

***

అదే సమయంలో, వేదిక కింద, పెళ్లి కూతురు మైథిలి చేత గౌరీపూజ చేయిస్తున్నారు పురోహితులు. ఆ దృశ్యాన్ని చూస్తున్న పెళ్లి కొడుకు తండ్రి దశరథ్,

“కొద్ది క్షణాల్లో ఈ అమ్మాయి తమ ఇంట్లో కాలు పెట్టబోతోంది. రాంకిరణ్‌కి పది సంవత్సరాల వయసులో తన భార్య చనిపోయింది. సవతి తల్లి తన కొడుకును సరిగా చూసుకోదేమోనని తను ద్వితీయ వివాహం కూడా చేసుకోలేదు. ఇరవై సంవత్సరాల తరువాత తమ ఇంట్లో దీపం వెలిగించడానికి ఈ అమ్మాయి రాబోతోంది. తన కథల ద్వారా చాలా మందికి తెలిసిన తన కొడుకు, వయసు ముదిరి పోతుంది పెళ్లి చేసుకోరా అని అరిచి ఘీపెట్టినా వినని తన కొడుకు, ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన బంగారు బొమ్మలా ఉన్న ఈ మైథిలితో పెళ్లికి రాంరాం ఓకే చెప్పడంతో, ఇక ఆలశ్యం చేయకుండా ఈ పెళ్లికి….”

ఆలోచనల్లో ములిగిపోయిన దశరథ్,

“మేనమామలూ! అమ్మాయిని బుట్టలో కూర్చోబెట్టి తీసుకురండి” అన్న పురోహితుల పిలుపుతో వాస్తవంలోకి వచ్చాడు.

అయితే, ఇలా ఆనందంలో తేలిపోతున్న ఆ తండ్రుల ఇరువురికీ తెలియదు, కొద్ది క్షణాల్లో తమ ఆనందానికి ఊహించని విధంగా అవరోధం కలగబోతోందని.

***

“కళ్లల్లో పెళ్లి పందిరి కనపడసాగె, పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే” అని సన్నాయి మేళం వారు వాయిస్తుండగా, పెళ్లి కూతురు మైథిలిని బుట్టలో కూర్చోబెట్టి వేదిక మీదకు తీసుకువస్తున్నారు అమె మేనమామలు.

“ఆలశ్యం అయితే అయ్యింది కానీ మంచి అల్లుడినే పట్టాడు మీ అన్నయ్య. ఒక్కడే కొడుకు, పైగా పేరున్న రచయిత కూడా! అతని కథలు నేనూ చదివాను” పక్కన ఉన్న భార్యతో చెబుతున్నాడు పెళ్లికూతురి వేలు విడిచిన మేనత్త భర్త.

“బహుశా రామాయణంలోని పేర్లులా, తమ అందరి పేర్లు కూడా కలిసాయని మా అన్నయ్య, మన సంబంధం కాదనుకుని ఈ పెళ్లికి ఒప్పుకుని ఉంటాడు” ఉడుక్కుంటూ బదులిచ్చింది అతని భార్య, సూర్యకాంతం.

పెళ్లి తతంగం మొదలైంది అన్నట్లుగా, “సీతారాముల కళ్యాణం చూతము రారండి” అని మధురంగా వాయిస్తున్నారు వాద్యబృందం. అందరికీ అక్షింతలు పంచుతున్నారు పురోహితులు.

***

ఈలోగా “నో.. ఈ పెళ్లి జరగడానికి వీలులేదు. ఆపండి…. ఆగండి…..” అంటూ బిగ్గరగా ఏడుస్తూ పరుగు పరుగున వేదిక వైపు వస్తోంది ఓ పాతికేళ్ల అమ్మాయి. చీరకట్టు, నుదుటబొట్టు చూస్తూంటే ఏదో సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలా ఉంది.

అంతే, సరిగమలు, గలగలలు, రెపరెపలు, కిలకిలలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.

“ఏం జరిగిందమ్మా! నేను పెళ్లి కొడుకు తండ్రిని. ఇంతకీ నువ్వెవరు?” ఆందోళనగా అడిగాడు దశరథ్.

“ఒహో మావయ్య గారూ! మీరేనా? సూటిగా విషయానికి వస్తున్నా. నా పేరు మాళవిక. నేను మీ కోడలు కావలసినదానిని. మీ రాం నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడు” ఏడుస్తూ చెప్పింది.

“చూడమ్మా! మా వాడు అలాంటి వాడు కాదు. అయినా వాడు మోసం చేసేడని ఎలా చెప్పగలవ్?” లా పాయింట్ తీసాడు పెళ్లి కొడుకు మేనమామ.

“ఇదిగో ఇలా!” అంటూ హాండ్ బేగ్ లోంచి ఫొటోలు తీసి అందరికీ చూపించింది. వాటిలో మాళవిక, రాం తీసుకున్న సెల్ఫీలు, ఆమె చేయి పట్టుకుని చనువుగా ఏదో చేస్తున్న ఫొటోలు ఉన్నాయి.

“అయ్యో! అయ్యో! ఎంత మోసగాడు”

“ఇంక ఈ పెళ్లికి రాంరాం పాడాల్సిందే”

“ఇంకా నయం మూడు ముళ్ళు పడిన తర్వాత అయితే మైథిలి జీవితం బుగ్గిపాలు అయ్యేది”

“ఈ అమ్మాయి ఎవరో ఆపద్భాంధవిలా వచ్చింది”

కళ్యాణ మండపంలో వినిపిస్తున్న ఇలాంటి ఈటెల్లాంటి మాటలతో దశరథ్ సిగ్గుపడి పోయాడు. ‘ఒహో ఇందుకేనన్న మాట తన కొడుకు ఇంత హఠాత్తుగా ఈ పెళ్లికి ఒప్పుకుంట’ అన్న అనుమానం కూడా వచ్చింది.

ఇంకా ఇలా ఎంతమందితో సంబంధం పెట్టుకున్నాడో? మొదటిసారిగా తన పెంపకం మీద అనుమానం వచ్చి, జరుగుతున్న సంఘటన చూస్తూ మౌన ప్రేక్షకుడిలా ఉండిపోయాడు దశరథ్.

“ఏమేవ్, నువ్వన్నది నిజమే! రామాయణంలోలా అందరి పేర్లు కలిసాయని మీ అన్నయ్య ఈ సంబంధం ఒప్పుకున్నాడు. కానీ, అందులో శూర్పణఖలా ఇక్కడ మాళవిక కూడా ఉంటుందన్న విషయం మరచిపోయాడు” వెటకారంగా నవ్వుతూ చెప్పాడు సూర్యకాంతం మొగుడు.

ఈ గొడవ విని రోడ్డు మీద ఉన్న కొంతమంది జనం మండంపం వద్దకు వచ్చి ఆ తతంగం గమనిస్తున్నారు. వాళ్లలో

“చూడమ్మా! ఇలా పెళ్లి జరుగుతోంటే వచ్చి ఆపమనడం న్యాయమా? ఈ రోజుల్లో ఫొటోలది ఏముందమ్మా ఎలాగైనా సృష్టించవచ్చు. ఇంకా బలమైన కారణం ఏదైనా ఉందా?” అడిగాడు లాల్చీ షరాయి వేసుకున్న ఓ పెద్దాయన.

“బాబు గారూ! మీరు పెద్దవారిలా కనబడుతున్నారు. ఇతను ఇలా మోసం చేస్తాడని తెలిస్తే, అన్ని ఫొటోలు ముందుగా తీసుకుని జాగ్రత్త పడేదానిని. ఇలా వచ్చి అల్లరి చేసే గొడవ నాకు ఉండేది కాదు. నాకు మీరే న్యాయం జరిగేలా చూడండి?” వేడుకుంటూ అడిగింది మాళవిక.

“సరే! ఆ అమ్మాయి చెప్పింది విన్నాం. మరి నువ్వు ఏం మాట్లాడవేం? అంటే ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమేనా?” సూటిగా పెళ్లి కొడుకును ప్రశ్నించాడు సఫారీ సూట్ లో ఉన్న ఓ మధ్య వయస్కుడు.

అప్పుడు పీటల మీద నుంచి లేచిన పెళ్లి కొడుకు రాంకిరణ్,

“ఔను. ఆ ఫొటోల్లో ఉన్నది నేనే. కానీ ఆమెను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పలేదు” వివరణ ఇచ్చాడు పెళ్లి కొడుకు.

ఆహూతుల్లో కూర్చుని ఈ తతంగం అంతా గమనిస్తున్నాడు, పెళ్లి కొడుకు గురించి పూర్తిగా తెలిసిన అతని స్నేహితుడు పవన్. తను ఇంకా ఇక్కడే ఉండడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని నెమ్మదిగా లేచి బయటకు నడిచాడు.

వాదప్రతివాదాలు జరుగుతున్నాయి.

“సరే బాబూ! నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పే ఋజువులు ఏమీ ఆమె వద్ద లేవుట. నువ్వేమో ఆమెను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పలేదు అంటున్నావు. పోనీ అలాంటి సమాచారం ఏమైనా నీ వద్ద ఉందా?” అడిగాడు సఫారీ సూటాయన.

“సార్! ఈ అమ్మాయి నాకు ఫేస్బుక్ లో పరిచయం అయ్యింది. నా రచనలు ఇష్టపడి కామెంట్స్ పెట్టేది. ఓ రోజు తన పుట్టినరోజు రమ్మని రిక్వెస్ట్ పెట్టింది. అప్పుడే, తను రాయబోయే మొదటి కథను, సెంటిమెంట్‌గా నన్ను చేయిపట్టుకుని రాయించమంది. అదిగో అప్పుడు తీసుకున్న సెల్ఫీలే ఇవి” వివరణ ఇచ్చాడు రాం.

“అది సరే రాం! ఆ తరువాత ‘మాలా! ఇంక తీసిన సెల్ఫీలు చాలులే’ అన్నావ్ అది జ్ఞాపకం ఉందా? ఆ తరువాత ఏం జరిగిందో అది చెప్పు” సూటిగా ప్రశ్నించింది మాళవిక.

“ఏం జరిగింది? నాకైతే జ్ఞాపకం లేదు” ఆలోచిస్తూ బదులిచ్చాడు రాంకిరణ్.

“ఏం జరిగిందో జ్ఞాపకం లేదా? అయితే సిగ్గు విడిచి నన్నే చెప్పేయమంటావా? పరవాలేదా” బిగ్గరగా అరుస్తూ అడిగింది మాళవిక.

ఆమె ఏం చెబుతోందోనని ఆశక్తిగా చూస్తున్నారు అందరూ.

“అంతా చేసి ఏమీ ఎరుగని నంగనాచిలా ఎలా కూర్చున్నాడో చూడు మోసగాడు. ఇంకా నయం తమ కూతుర్ని చేసుకొమ్మని అడగలేదు” మనసులో అనుకుంది పెళ్లి కొడుకు మేనమామ భార్య.

ఇక ఆ సంభాషణ పొడిగించడం ఇష్టంలేని పెళ్లి కూతురు తండ్రి జానకిరామ్, మొదటిసారిగా నోరు విప్పి,

“చూడమ్మా! నేను పెళ్లి కూతురి తండ్రిని. అసలు ఇక్కడ పెళ్లి జరుగుతోంది అని నీకు ఎలా తెలిసింది?” అనుమానంగా అడిగాడు.

“బాబాయి గారూ! నాకూ తెలియకపోను. తన వాట్సప్ కాంటాక్ట్స్‌లో నేను లేను అన్న ధైర్యంతో కాబోలు, ఇదిగో శుభలేఖ వాట్సాప్‌లో పెట్టాడు. లక్కీగా నాకు తెలిసిన ఓ స్నేహితురాలు ఇది నాకు పంపించింది. బాబాయ్ గారూ! నేనూ మీ అమ్మాయి లాంటి దాననే. నాకూ, మీ అమ్మాయికి కూడా అన్యాయం జరగకుండా మీరే ఏదైనా ఓ పరిష్కారం చూపించండి” అంటూ వేడుకుంది మాళవిక.

“జానకిరామ్ గారూ! ముహూర్తం సమయం దగ్గర పడుతోంది. ఏం చేద్దామంటారు?” అసహనంతో అడిగారు పంతులు గారు.

ఈలోగా లాల్చీ షరాయి వేసుకున్న పెద్దాయన, ఆ కాబోయే దంపతుల తండ్రుల వద్దకు వచ్చి,

“చూడండి సార్. ఆ అమ్మాయిలు ఇద్దరికీ నష్టం రాకుండా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోండి. ఆ అమ్మాయి కూడా అదే చెబుతోంది కదా? ఇక, పీటల మీద పెళ్లి ఆగిపోతే ఎక్కువగా నష్టపోయేది మీరే. ముహూర్తం సమయం దగ్గర పడుతోంది. నా సలహా ఏమిటంటే ఆ మాళవికను పక్కకు తీసుకెళ్లి నష్టపరిహారంగా ఓ లక్షో రెండు లక్షలో ఇచ్చి ఆమెను బతిమాలుకోండి. అనవసరంగా గొడవ పెద్దది చేసుకొని, ఆ అమ్మాయి పోలీసు స్టేషన్ వరకూ వెళ్తే మీకే నష్టం” ఉభయతారకంగా, రాజీ మార్గం సూచించాడు.

“నిజమే, బావగారూ! నన్ను నమ్మండి. మా వాడు తెలియక ఏదో చేసుంటాడు. ఆ అమ్మాయిని బ్రతిమాలి ఆ డబ్బులు ఏవో నేనే ఇచ్చుకుంటా! ముహూర్తం సమయం దగ్గర పడుతోంది. మీరు పీటలమీద కూర్చోండి బావగారూ! మిగతావి తర్వాత చూసుకుందాం. పోలీసు స్టేషన్ అంటే మళ్ళీ తల నెప్పుల వ్యవహారం” అంటూ జానకిరామ్ కి చెప్పి, మాళవిక దగ్గరకు నడిచాడు దశరథ్.

ఈలోగా,

“మీరెవరూ పోలీసు స్టేషన్ వరకూ రానక్కర్లేదు. విషయం తెలిసి మేమే వచ్చాం. ఇలా నేరాలను ప్రోత్సాహించడం కూడా నేరమే సార్” అంటూ ఓ ఎస్సై, నలుగురు పోలీసులతో కలిసి వేదిక వద్దకు వచ్చాడు, అందరూ ఆశ్చర్యంగా చూస్తూండగా.

బిత్తరపోయి చూస్తున్న పెళ్లి కొడుకు రాంకిరణ్ వద్దకు నేరుగా వెళ్లి, అతని చేతిని పట్టుకుని షేక్ హాండ్ ఇచ్చి, “ఏంటి సార్! చదువుకున్న మీరు కూడా ఏమీ తెలుసుకోకుండా అందరినీ ఫ్రెండ్స్ కింద ఏక్సెప్ట్ చేసేయడమేనా? సరే కానీ, పంతులు గారూ! ముహూర్తం దాటకుండా ముందు పెళ్లి తంతు కానివ్వండి” అంటూ వధూవరులు ఇద్దరికీ విషెస్ చెప్పి, ఆహూతుల వైపు తిరిగి,

“వీళ్ళది ఓ పెద్ద ముఠా. రకరకాల పేర్లతో మాధ్యమాలలోకి వచ్చి, పరిచయాలు పెంచుకుంటారు. అవతల వాళ్లని బుట్టలోకి లాగి అవకాశం వచ్చినప్పుడు ఇలా వచ్చి బ్లాక్‌మెయిల్ చేసి చేతికందిన సొమ్ముతో ఉడాయిస్తారు. ఒకవేళ తేడా వస్తే, ఏదో సాకు చెప్పి అందరూ చల్లగా జారుకుంటారు. వీళ్ళ మీద ఇప్పటికే మన రాష్ట్రంలో పది కేసులు ఉన్నాయి. మొన్ననే బెయిల్ మీద బయటకు వచ్చారు. మీ అదృష్టం బాగుండి మేము సకాలంలో వచ్చాం.

అందుకే, మీరందరూ కూడా అనవసరంగా వ్యక్తిగత సమాచారం సామాజిక మాధ్యమాల్లో పంచుకొని మోసపోకండి. అలాగే తెలియని వాళ్లను మీ మిత్రులుగా చేర్చుకోకండి. మిగతా విషయాలు ఈయన చెబుతారు” అంటూ ఓ వ్యక్తిని చూపించి, తర్వాత మాళవికను, పెద్ద మనుషులుగా నటించిన సఫారీ సూటాయన, లాల్చీ షరాయిలను అదుపులోకి తీసుకుని జీపు వైపు నడిచాడు ఇనస్పెక్టర్, అతని బృందంతో.

వేదిక మీద మళ్లీ పెళ్లి సందడి మొదలయ్యింది. ఆ వ్యక్తి ఎవరా? ఏం చెబుతాడా అని ఎదురుచూస్తున్నారు అందరూ. ఆ వ్యక్తి వేదిక మీదికి వచ్చి,

“ఆశ్చర్యపోకండి, నా పేరు పవన్. నేను పెళ్లి కొడుకు రాం స్నేహితుడిని. వాడి గుణగణాలు గురించి నాకు పూర్తిగా తెలుసు. ఈ మాళవిక వచ్చి వీడిమీద అభాండాలు వేయడం చూడగానే నాకు ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. వెంటనే జ్ఞాపకం వచ్చింది. వీళ్ళు గత సంవత్సరం కర్నూలులో మా పెద్దమ్మ కొడుకు పెళ్లిలో ఇలాగే హంగామా చేసి లక్ష పట్టుకుని పోయిన ముఠా అని. వెంటనే లేచి పోలీసు స్టేషన్‌కి వెళ్లి రిపోర్టు చేసా. మిగతాది అంతా మీరు చూసారు కదా!” అంటూ ముగించాడు.

“ఇదిగోనేవ్, మీ అన్నయ్య రామాయణంలో ఆ ఆంజనేయస్వామి కూడా వచ్చేసాడు, ఈ పవన్ రూపంలో. ఇంక మనం ఆలోచించేదేమీ లేదు, అక్షింతలు వేయడం తప్ప” అంటూ నిర్లిప్తంగా చెప్పాడు సూర్యకాంతం భర్త.

“మాంగళ్యం తంతునానేన….”అంటూ పురోహితుల మంత్రాలతో, “ఆనందమానంద మాయనే, మా సీతమ్మ పెళ్లి కూతురాయనే…” అంటూ సన్నాయిమేళం గట్టి వాద్యలతో పట్టుచీరల రెపరెపలతో, పడుచు అమ్మాయిల నవ్వుల కిలకిలలతో అక్కడ మళ్ళీ పెళ్లి కళ జీవం పోసుకుంది.

“నువ్వు మోసగాడివి కావు అని నాకు తెలుసు రాం. అందుకే మౌనంగా ఉన్నాను” అన్నట్టు ఆరాధనగా చూసింది మైథిలి.

“నేను మోసపోయినవాడినే కానీ మోసగాడిని కాను అని నువ్వు గ్రహించావని నాకూ తెలుసు మైథిలి” అన్నట్టు ప్రేమగా చూసాడు రాం.

ఆ కమనీయ దృశ్యం చూసిన దశరథ్, జానకిరామ్ ల కళ్లల్లో ఆనందభాష్పాలు చిప్పరిల్లాయ్.

“ఒరే అబ్బాయ్! మోసాలు ఇలా కూడా జరుగుతాయా?” అడిగారు ఆ పెళ్లికి వచ్చిన ఓ పెద్దాయన, పక్కన ఉన్న మనవడుతో.

“అలా జరిగిన తర్వాతే తెలుస్తుంది తాతా! అది మోసమని” అంటూ చెప్పాడు ఆ యువకుడు తన ఫేస్బుక్, వాట్సాప్ లలో ఉన్న పరిచయం లేని కాంటాక్ట్‌లు తొలగిస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here