పెళ్ళి వైరాగ్యం!!

0
9

[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘పెళ్ళి వైరాగ్యం!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ఇం[/dropcap]టర్ నుంచి బయటి తిండే, ఏదో నాలుగైదేళ్ళ నుంచి వైనంగా నేను ఇంటి పట్టున వండి పెట్టటంతో, కాస్త మనిషివి కనబడుతున్నావు.. ఎంతకాలం నేను ఉంటానూ?!, ఉన్నా ఎంతకాలం చేసిపెట్టిగలనూ?!- ఇప్పటికి నాలుగేళ్ళ నుంచి చూస్తున్నాం సంబంధాలు, ఒక్కటి కలిసిరాలేదు. మా నాయన వినరా, ఆ మార్కాపురం అమ్మాయి ఒప్పుకుందిట, ఊఁ అనరా పెళ్ళికి,శంకరం!”, పంకజాక్షి బ్రతిమాలుతోంది ఒక్కగానొక్క కొడుకుని ఇరవై నిమిషాల నుంచీ, చెవి నొక ఫ్లాటు కట్టుకొని!

సొంతిల్లు కష్టంలే ఈ రోజుల్లో, అందుకని సామెతకు చిన్న పాఠాంతరం ఏర్పాటిది!

శంకరం వంక లేని కుర్రవాడే, కానీ పెళ్ళికి అంత సుముఖం కాదు ఎందుకనో!

ఇప్పటి ఆడపిల్లలు మాట వినరనో, తననే మాట వినేట్టు మార్చేస్తారనో, కొందరు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నా, మిగతా విషయాల్లో ఇమ్మెచ్యూరులనో, ఎక్కువమంది తన కన్నా స్పీడనో, ఎవ్వరి మీదా నమ్మకం లేకనో, అందరిమీదా అపనమ్మకం పెరిగో- లేక అన్నీ కలిపో, మొత్తానికి అంత సుముఖమైతే కాదు పెళ్ళికి.

కేవలం పంకజాక్షి, వెంకట్రావుల కోసమే ఆ మాత్రం కండిషన్‌తో ఒప్పుకున్నట్టు అర్ధాంగీకారం చెప్పాడు సుమారు 4,5 ఏళ్ళ కింద!

దేనికీ?!

పెళ్ళి సంబంధాలు చూడటానికి!

కానీ అందులో శ్రీనాథుల వారికి వేసిన నల్లగుండు లాంటి బిగింపొకటి వేశాడు! ఇప్పటి భాషలో ఫిట్టింగ్!

అదేమిటంటే —

తనకూ, ఆ అమ్మాయికీ- గరిష్టంగా 2 ఏళ్ళే వ్యత్యాసం ఉండాలని!

***

ఆ మాత్రం ఒప్పుకోగానే,ఇక పెళ్ళైపోయిందనే సంతోషపడ్డారు శంకర పితరులు!

సుమారు ఐదేళ్ళ కిందట మొదలెట్టారు అన్వేషణ దంపతులిద్దరూ, విఘ్నేశ్వర పూజ చేసి మరీ, ఆ మాంత్రికుడి ప్రాణం లాంటి, కనబడని పెళ్ళికూతురి కోసం!

మొదటి అంకంగా, కనబడ్డ మేట్రిమోనీ ఆన్‌లైన్ సైట్లలో సభ్యత్వం తీసేసుకున్నారు వీరోత్సాహంతో!

‘ఇక బహుశా నాకు కొన్ని నెలలు, మొబైలులో ఆడపెళ్ళి వాళ్ళతోనే సరిపోతుందేమో’నని వెంకట్రావూ ఆలోచనల్లో, ‘పెళ్ళిసామానుకి హైద్రాబాదా, చెన్నైయ్యా వెళ్ళాల్సింద’ని పంకజాక్షి, మీమాంసలో- మునగానాం తేలానాం అయ్యారు!

వాళ్ళ ఊహ – ‘మా వాడికేం మహరాజు లాగా ఉంటాడు, ఐఐటీలో చదివాడు, బుద్ధికి బృహస్పతీ, నడవడికి నలుగురికీ ఆదర్శం – వీడికి గాక ఎవరి కొస్తాయి సంబంధాలు – తామరతంవరలుగా, టీవీ కార్యక్రమాల్లో ప్రకటనల్లాగా, రాజకీయ నాయకుల వాగ్దానాల్లాగా-’ అని!

పాపం రెణ్ణెల్లైనా ఒకటో అరో వీరు బాగున్నది సంబంధం అనుకుని కాల్ చేయటమే కానీ, ఒక్క కాల్ వీరికి వచ్చిన ‘పుణ్యాన’ పోలేదు.

శుభమా అని పెళ్ళి తలపెట్టి, ఎందుకులే ‘పాపం’ ప్రసక్తి!

***

ఇక ‘ఆఫ్‌లైన్’, అంటే – నేరుగా ఊళ్ళోనే ఉన్న సుదర్శన్ మ్యారేజ్ బ్యూరో, దర్శన్ మ్యారేజ్ బ్యూరో, అన్నిటికీ రన్ రన్ అంటూ వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నారు సభ్యులుగా.

కాళ్ళరిగేట్టు, టాక్సీ బిల్ అదిరేట్టు, వారానికి ఒకటి చొప్పున మార్చి మార్చి ఒక ఏడాది పాటు దండయాత్రలు చేశారు, ఆ యా సంస్థల ఆఫీసులకు.

నమోదు చేసుకున్న కన్యామణుల అడ్రసులు నోట్‌బుక్, అదీ లాంగ్ నోట్‌బుక్‌లో వ్రాసుకోవటం, ఇంటికొచ్చి అఖండ మర్యాదగా వారికి ఫోను చేయటం!

ఇవిగాక చుట్టపక్కాలు చెప్పినవి, ఎవరి ద్వారానో తెలిసి, ఫోన్లు చేసినవి అనేకం.

నక్షత్రం బాగుంటే, గోత్రం ఒకటే అవుతుంది. అన్నీ బాగుంటే, అవతలి వారు రెస్పాన్సే ఇవ్వరు!

కొందరు, ఫోను తీస్తే, మొదటి ముక్కే “మీ వాడి ప్యాకేజీ ఎంతండీ”, అని అడగటంతో, ఆ వాలకం నచ్చక వదిలివేసినవి.

ఎక్కువ శాతం వద్దనుకున్నవి – అబ్బాయి గారు పెట్టిన సదరు షరతు పూర్తి అవక పోవటం వలన!

అనగా, వయోబేధం 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండటం వలన!

తిరస్కరణలో కోటి రకాలు, అన్నీ రుచి చూశారు, పాపం కొడుకు శంకరం పెళ్ళి కోసం!

ఉహూఁ, గ్రహాలు అనుకూలించొద్దూ!

పెళ్ళంటే మాటలా, పై నుంచి ఆర్డర్ రావద్దూ!

***

ఎవరో చెప్పారు, అబ్బాయి జాతకం జాతకరత్న కెవరికైనా చూపించండి ఏదైనా గ్రహాల అడ్డు ఉందేమో, అది తీయించేయవచ్చు. అప్పుడు వివాహ ద్వారాలు వరదల కెత్తేసిన గోదారి గేట్లలా తెరుచుకుంటాయి అని!

అవునుస్మీ, ఆ విషయం తాత్సారం చేశాం, పదపద మిడతంభొట్లు గారి దగ్గరకని, సంరంభంగా వెళ్ళి చూపించారు.

జ్యోతిష్కుడు గారు, కంప్యూటర్లో జాతకచక్రాన్నీ వీరినీ; వీరినీ జాతకచక్రాన్నీ మార్చిమార్చి చూస్తాడే గానీ మాట మాట్లాడితే ఒట్టు!

చివరికి పంకజాక్షి మొహమాటం వదిలి అడిగింది, “ఎట్లా ఉందండీ, వివాహ యోగం ఇప్పట్లో కనబడుతోందా?!” అని!

“ఊఁ ఉహుఁ” అన్నాడాయన బిగ్గరగా!

అనీ, “మీ వాడు అఖండ జాతకుడండీ, ఏమీ కంగారు లేదు, మిగతా అన్ని విషయాల్లో, నిశ్చింతగా ఉండండి”, అన్నాడు.

మిగతా విషయాలలో అంటే ఇది బాగలేదనా?!, అంటే వివాహం కాదనా?!

వెంకట్రావు, పంకజాక్షులకు అనుమాన ప్పరిమాణం పెరిగి పెను భూతానికి దగ్గరౌతోంది!

ఇంకా లాగితే తెగేట్టుందని, ఆయనే చెప్పాడు.

“శుక్రుడు ఆపేస్తున్నాడమ్మా అడ్డంగా కూచుని, అమ్మవారికి ప్రదక్షిణలు చేయమనండీ, సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి మంగళవారం దర్శించుకోమనండి, అంతా మంచి జరుగుతుంది. రేపు మే పోగా, అదే అయిపోతుంది పెళ్ళి” అన్నాడు.

నమ్మటం తప్ప ఏ ఆప్షనుందీ వీళ్ళకు, నమ్మి అక్షరాలా 5000/- చెల్లించుకుని మే దాటి పోవటానికి నిరీక్షిస్తూ కూచున్నారు.

కూర్చోవటం కూర్చోవటం 4 సంవత్సరాలు గడిచిపోయినై. మే పోయి మే వస్తోంది కానీ, ఆ కళ్యాణి మాత్రం దొరకలేదు, కళ్యాణ ఘడియ రాలేదు!

ఇప్పుడు అబ్బాయికి 30 దాటాయి, దేవతా స్థానం కూడా చేరుకున్నాడు, త్రిదశుడై. కానీ దశ మారుతున్నట్లు కనబడలేదు, పెళ్ళి విషయంలో..

***

మంగళవారం నాడు సుబ్రహ్మణ్యాలయానికి వెంకట్రావు వెళ్ళేట్టూ, శుక్రవారం పంకజాక్షి అమ్మవారి గుడికెళ్ళేట్టు ఒప్పందం చేసుకున్నారు భార్యా భర్తా!

ఈ ప్రదక్షిణలూ అవీ, వాడికెక్కడ కుదురుతుందంటే, అవును కుదరదు గాక కుదరదని నిర్ణయించేసుకున్నారు వీరే!

పాపం, చెప్పి చూసింది పంకజాక్షి ఒకసారి అబ్బాయి శంకరానికి!

“ఇవన్నీ నాకెక్కడ కుదురుతై, అమ్మా”, అన్నాడు ముక్తసరిగా!

ఇంకా నొక్కి చెపితే అసలుకే మోసం వచ్చి “అందుకే ఈ గోలే వద్దు నాకు, హాయిగా ఉన్నాను కదా, ఇంకేం కావాలి”, అనేస్తాడని భయం, గొంకూ, సందేహం, ఏ మూలో ఒకింత నమ్మకము కూడానూ!

అందుకే ఆ ఏర్పాటు చేసుకున్నారు, గుట్టుగా పని కాజేయాలని!

చాలా సార్లు చెప్పి చూశారీ నాలుగైదేళ్ళలో, అంత పట్టెందుకురా ఆ వయోభేదం పట్ల అనీ!

ఎన్నో తప్పిపోతున్నాయి మంచివి, వయస్సు తేడా నాలుగైదు ఏళ్ళుండటం వలనా అని,ఇట్లా అయితే కష్టం కుదరటమనీ!

వెంటనే “అయితే మానేద్దాం అమ్మా, ఏం మునిగిపోయింది వెతకటం ఆపేయండి ఇంక మీరు కూడా, టైం వేస్ట్” అనేశాడు!

“సరేలే నువ్ నీ పని చేసుకో, మేం చూస్తాం”, అని వధ్వాన్వేషణ పునః ప్రారంభం!

కాలం పరిగెడుతోంది, అబ్బాయికి కాస్త జుట్టు నెరవటం మొదలైంది.

వధూ వనంలో అన్వేషణ సాగుతోంది, ఆ సీతాదేవి జాడ మాత్రం తెలియట్లేదు ఈ అన్వేషకులకు!

***

ఇప్పుడటు చూడండి కాస్త, ఇంకో కథ కనబడీ, వినబడీ, మిమ్మల్నలరిస్తుంది, బయోస్కోపు లాగా!

***

సంధ్యాబాల మైక్రోసాఫ్ట్‌లో టీమ్ లీడర్. చాలా షార్ప్ అని బంధువుల్లో, ఆఫీసులో మాంఛి పేరు.

ఇంట్లో యువరాణే, రమాదేవీ రామారావులకు ప్రాణమే!

పెళ్ళి విషయం దగ్గరే ఇరు వర్గాలకు హోరాహోరీ, లంచుల దగ్గర, శని ఆదివారాల్లో!

“ఈ సొసైటీ స్టీరియోటైప్‌లలో బిగించే ప్రయత్నాలు మానుకోండి,హాయిగా ఉన్నాను మీరు కూడా హాయిగా ఉండండి. చేసుకోవాలి అనిపించినపుడు,నేనే వచ్చి చెపుతాను,అప్పుడు ఆలోచిద్దాం,సరేనా?! ఈ లోపల,I beg of you, అమ్మా నాన్నా, let me concentrate on my career please” ఇదీ ఆమె సందేశం అర్జునుడి బాణాల సాటి దీటైన మొన గల మాటలతో!

రామారావు ఒక స్నేహపూర్వకమైన నవ్వుతో నిష్క్రమిస్తాడు సన్నివేశంలో ఇక మన పాత్ర లేదన్నట్టు, ఇట్లాంటి సమయాల్లో!

రమాదేవి మాత్రం, “ఏవిఁటే చూస్తుంటే మరీను, రేపు జనవరి కి 30 వస్తయ్యి, ఇంకా ఏమిటి అదనీ ఇదనీ ఆంక్షలు పెడతావు?! ఇట్లాగైతే మేమెట్లా వెతుకుతాము?!” అంటుంది ఆవేశంగా!

బాల, దోసకాయ కూల్‌గా “వెతకద్దు, అనవసరపు తలనెప్పులు పెట్టుకోవద్దు అనే కదా నేనూ చెప్తున్నది, మానేయండి శుభ్రంగా!” అంటుంది రమాదేవికి ఇంకా ఒళ్ళు మండేట్టు!

“అన్నట్టు అమ్మా థాంక్సు, గుర్తు చేసినందుకు! మళ్ళీ మీకు చెప్పటం మరిచిపోతాను, ఈ సారి నా బర్త్‌డే రోజు బయలుదేరి నేనూ పరిమళ, కళ్యాణీ ముగ్గురం సింగపూర్ హాలిడే ట్రిప్ వెళ్తున్నాం, అరేంజ్మెంట్ అంతా అయిపోయింది! ఒక వారమేలే! వెళ్ళటం వెళ్ళటం, జస్ట్ చిల్, అంతే!” అంటూ చెపుతున్నపుడే, ఆఫీసు కాల్ ఏదో వస్తుంది, “హాయ్ రాకేష్, వాట్సప్”, అంటూ కారిడార్ లోకి వెళ్ళిపోతుంది

తల్లి చెప్పాలనుకున్న మాట ఆమె లోనే, నిక్షిప్తమై, పదిలంగా నిదరోతుంది!

అయిదు నిమిషాలు ఊరికే మౌనంగా కూచుని రమాదేవి, ఏమనాలో, ఎవరిననాలో, ఏమనుకోవాలో తెలియక కాఫీ పెట్టుకోవటానికి కిచెన్ దారి పడ్తుంది!

ఇప్పటికి ఆ ఇంట్లో ఇది అనేకసార్లు రిపీట్ అయిన సీనే! అయినా నిత్యనూతనమే, అదేంటో!

***

ఒకసారి, బాల ఆఫీసు నుంచి రాగానే, రామారావు రమాదేవితో అనటం విన్నది – “హాల్లో గోడలకు పాకుతున్న తేమ, టెర్రెస్ నుంచి లీకేజీ ఐతోందిట మేస్త్రీ చెప్పాడు, చేయిద్దాంలే వీలు చూసుకుని”, అని.

ఈ లోపల ఆయనకు ఏవో ఇతర పనుల వల్ల, ఆ పని అట్లాగే ఉండిపోయింది.

ఏదో పెళ్ళికని తల్లితండ్రీ ఊరి కెళ్ళిన సమయంలో, ఒక శుక్రవారం సాయంకాలం, బాల తనతో వాళ్ళ ఆఫీసు బిల్డింగ్ మైన్టెనెన్సు ఇంజనీరుని తెచ్చి చూపించి, శని ఆదివారాల్లో ఆ damp- proofing పని పూర్తి చేయించేసింది.

ఊరి నుంచి వచ్చి చూసిన రామారావు ఆశ్చర్యపోతూ, “నీకెందుకమ్మా ఈ పనులూ?” అని మెచ్చుకోలుగా అని, భార్య వైపు చూసి,

“చూశావా మీ అబ్బాయి చేయించేశాడు ఇంటి పని”, అన్నాడు, ఆనందంగా!

“మీరిట్లా అనటం వల్లే, దానికి ఆ మగవాడి ధైర్యం, అందుకనే వాళ్ళ లాగే పెళ్ళొద్దు, ఇంకాస్త ఆగు, అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా అంటూ ఆడిస్తోంది మిమ్మల్నీ నన్నూ” అన్నది.

ఆమెకూ లోపల సంతోషమే, తమనూ, ఇంటినీ అంత బాగా చూస్తున్నందుకు, చూసుకుంటున్నందుకూ!

ఈ పెళ్ళే, సమస్య అయి తిష్ఠ వేసింది ఆమె మనసులో!

***

ఒకరోజు కోపంతో కంట తడి పెడ్తూ అన్నది రమాదేవి, ముగ్గురూ భోంచేస్తున్నపుడు- “ఇదిగో అమ్మాయి, చెప్పేస్తున్నా, మేము రెండు సంబంధాలు షార్ట్ లిస్ట్ చేశాం, ఏదో ఒకటి నువ్వు అవుననాల్సిందే నేనూరుకోను ఇంక” అని!

“బయట బంధువుల్లో నా స్నేహితురాళ్ళతో తలవంపులుగా ఉంది నాకు. ప్రతి వాళ్ళూ అడిగే వాళ్ళే, ఇంకా ఎప్పుడు చేస్తావ్ అమ్మాయి పెళ్ళి , దేనికోసం నిరీక్షణా? అంటూ! తెల్ల గుర్రం మీద రాకుమారుడెవరో వస్తాడనా?! అంటూ రాగాలు. నేను భరించలేను ఇంక తేలాల్సిందే ఈ విషయం!”

రామారావు కూడా పొడిగిస్తూ, “అవునమ్మా అందరూ ఇదే అడుగుతున్నారు నన్ను కూడా. ఏమిటి ఈ ఆలస్యం అంటూ,ఇక త్వరపడాలి నువ్వు” అన్నాడు.

ప్రశాంతంగా విన్న సంధ్యాబాల అంత కంటే ప్రశాంతంగా, “ఎవరు నాన్నా ఈ అడిగేవాళ్ళూ?! In what way are they concerned?! Tell them, for sure, to shut up! ఇది మన పర్సనల్ విషయం, అంటే నాది. నాకు తెలియదా నాకేది మంచో, ఎప్పుడు ఏది చేయాలో?! మళ్ళీ చెపుతున్నాను, ఇద్దరికీ! నేనే ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత చెపుతాను. ఈ విషయం, అప్పుడు ఆలోచిద్దాం. మీకు చెప్పే కదా అన్నీ చేస్తాను ఇదీ అంతే, నాకు కొంచెం టైం కావాలి ఇంకా!” అని వెళ్ళబోతూ, “ఆఁ నాన్నా ఆయనెవరో మీ ఫ్రెండు అడిగారన్నావే, ఆయన ఈసారి అడిగితే నా పెళ్ళి విషయం, నాకు డైరెక్టుగా ఫోను చేయమను నాన్నా. నేనే చెప్పేస్తాను, క్లియర్‌గా ఆయనకు,ఇంకోసారి నిన్ను విసిగించకుండా, రైట్,” అని నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది, “బై అమ్మా” అని రాగం తీస్తూ!

తల్లీ తండ్రీ ఇద్దరూ డంగ్ అయిపోయి నుంచున్నారు కాస్సేపు, ఆ సూటిదనానికి!

***

అది పొగరుగా అనిపించవచ్చు, కనిపించవచ్చు కానీ అది ఇప్పటి వారి ఆత్మవిశ్వాసం, జీవితం పట్ల భరోసా, మనం ఏదైనా ఎదుర్కొనగలం అనే నమ్మకం అని వారిద్దరికీ బాగా తెలుసు. అందుకే, ఇంకా వెతుకుతున్నారు, షార్ట్‌లిస్ట్ చేస్తూనే ఉన్నారు.

ఆ లిస్టు, ‘షార్టు’, అన్న పదవి పోగొట్టుకొని రూపం పోయి, ‘లాంగ్’ కూడా అవుతోంది క్రమంగా, కానీ ఆ అమ్మాయి ఇంకా పచ్చ జెండా ఊపినట్లు లేదు.

వుయ్ ఆర్ ఇన్ క్యూ అని సంతోషిస్తున్నారు – రమాదేవీ, రామారావూ, అనేక మంది తల్లిదండ్రుల లాగే, ఓపిగ్గా, ఆశగా!

***

అబ్బాయి అక్కడ అట్లా..

అమ్మాయి ఇక్కడ ఇట్లా..

ఇక ఇద్దరికి పెళ్ళి పొత్తు ఎట్లా?!

ఏమో?! అదే తెలియట్లేదు!

***

అమంగళము ప్రతిహతమగుగాక!

రుక్మిణీ కళ్యాణ ఘట్ట పఠన ప్రభావం తగ్గిపోతుందా?!

తల్లులు చేస్తూనే ఉన్నారేఁ, పిల్లల తరఫునా?!

ప్రదక్షిణలు తండ్రులు చేస్తూనే ఉన్నారే, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళల్లో!

అయినా ఈ స్తబ్ధతేమిటి, వివాహరంగంలో!

ఈ విముఖతేమిటి వివాహవ్యవస్థ మీద?!

***

రుక్మిణీ దేవి క్షమించు గాక,

శ్రీకృష్ణదేవులు కరుణించు గాక!

దేవసేనాని దయ చూపు గాక!

ఆర్యా మహాదేవి శ్రీగౌరి మంగళమనుగాక!

***

అర్హులైన అందరికీ, యువతీ యువకులకు సులువుగా తగిన వయస్సులలో వివాహములు జోరుగా అగుగాక!

***

భజంత్రీలు అంత దాకా ఓపిక వహించెదరు గాక!

***

శ్రీరస్తు! శుభమస్తు! కళ్యాణ మస్తు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here