పెంపకం

0
11

[dropcap]వెం[/dropcap]కాయ్ రోజూలాగే బట్టలు ఉతకటానికి వచ్చింది. రాగానే వాకిట్లో వున్న పంపు దగ్గర కాళ్ళు కడుక్కుంటుంది. లేకపోతే బామ్మగారు ఊరుకోరు. ఆ తర్వాత పెరట్లోకి వెళుతుంది. వెళుతూ వెళుతూ ఓ కుర్చీని తీసుకెళ్ళి తనకు దగ్గరలో వేస్తుంది. బట్టలుతికే నీళ్లు బామ్మగారి చింది పడే అవకాశం లేకుండా తన ఎడం పక్కగా ఆ కుర్చీని వేస్తుంది. బామ్మగారొచ్చి ఆ కుర్చీలో కూర్చుని బట్టల్ని జాగ్రత్తగా ఉతికిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఊళ్ళోని విషయాలు చెప్పటం చేస్తూ వుంటారు.

“ఏమే వెంకాయ్! సుభద్ర గారి కోడలు పురిటికి పుట్టింటి కెళ్ళిందా? హైదరాబాద్‍లో వుండే వాళ్ళయినా, తొమ్మిదో నెల రాగానే పద్ధతి ప్రకారం అత్తింటి కొచ్చింది. వాళ్ళమ్మా వాళ్ళు వచ్చి చలిమిడి పెట్టి సీమంతం ఘనంగా జరిపారు. నా కోడలు పేరంటానికి వెళ్ళొచ్చింది. విషయాలన్నీ నాకు చెప్పింది. అత్తింట్లో నిద్రలు చేయించిన తర్వాతే పుట్టింటికి తీసుకెళ్తున్నారట. ఇంకేముంది, పది పదిహేను రోజుల్లో పురుడొస్తుంది. ఈ రోజుల్లో అన్నీ ఆపరేషను కాన్పులే. ఏ బిడ్డ పుట్టినా సంతోషపడాలే. తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా వుంటే సరి” అంటూ తన ధోరణిలో తాను చెప్పుకుపోసాగారు.

రోజూ మాదిరి అయితే వెంకాయ్ కూడా ఊళ్ళో కబుర్లు బామ్మగారితో కలిసి మాట్లాడుతూ వుండేది. కానీ ఇవ్వాళ వెంకాయ్ మనసు బాగా లేదు. రాత్రి నుంచి మొగుడు సుబ్బయ్యతో గొడవ పడుతున్నది.

వెంకాయ్ వాలకం బామ్మగారికి అర్థమయింది. తనకి పిల్లల్లేరన్న దిగులా! లేక ఇంకేదన్నా కారణముందా అని ఆలోచిస్తూ “ఏమిటే అలా వున్నావు? రోజూ వసపిట్టలా మాటలు కొట్టిపోసేదానివి. ఇవాళేమో ఉలుకూ పలుకూ లెకుండా గమ్మునున్నావు?” అనడిగారు.

“ఏదో లేమ్మా, ఎప్పుడూ వుండే బాగోతమే. మా ఆయన మారేదీ లేదు. నేను ఏడవకుండా సుకంగా బతికేదీ లేదు” అంటూ ముక్కు చీదింది.

“ఊరుకోవే వెంకాయ్! అలా కంటి తడి పెట్టబాకు. సుబ్బయ్య కొన్ని విషయల్లో మరీ మూర్ఖంగా తయారవుతున్నాడు. కడుపున పుట్టిన బిడ్డలన్నా వుంటే వాళ్ళని చూసుకుని నీ కష్టాలు మర్చిపోయేదానివి.”

“ఆ రాతే వుంటే నాకీ ఏడుపు ఎందుకమ్మా? ఇప్పుడు నన్ను సాధించటానికి అదొక సాకుగా దొరికింది. ఎందుకత్లా తాగొస్తావు? ఒళ్ళు గుల్లయి పోవటం లేదా అంటాను. ‘తాగకుండా, ఇంటికిచ్చి నా కొడుకును భుజం మీద కెక్కించుకుని తిరగాలా? లేకపోతే కూతుర్ని ఆడించుకుంటూ నీకేం కావాలమ్మా చెప్పు అంటూ మురుసుకోవాలా? అయ్యేం లేకే, ఆ బాదలన్నీ మర్సిపోవటానికే కదే నేను తాగొచ్చేది! తోటివాళ్లందరు కొడుకుల తెలివితేటల్ని గురించి చెప్పుకుని, చెప్పుకుని కులుక్కుంటున్నారు. నా కూతురు అదడిగింది, ఇదడిగింది అని చెప్పి కొట్లమ్మట కొనాలని తిరుగుతుంటే నేను సారా కొట్టమ్మట పడి తిరుగుతున్నాను. పైకి ఏడవలేక, సుక్కేసుకుని ఆ దిగులు మాపుకోవాలని చూత్తన్నాను. మా వాళ్ళందరూ ఇంకోదాన్ని కట్టుకోరా, పిల్లా జెల్లా పుట్టుకొస్తారని తెగ చెపుతున్నారు. నేనే సూత్తా సూత్తా, ఆ పని చెయ్యలేకపోతున్నాను. కానీ ఆలోసిస్తే అదే రైటేమో అన్పిస్తుంది. ఎందుకంటే ఎల్లకాలం మనకు సాకిరీ చేసే ఓపిక వుంటుందా? కొడుకుంటే ముసలితనంలో కూకోబెట్టి ఒక ముద్దెడతాడు’ అంటున్నాడమ్మా.”

“వాడి మొహం. కొడుకుంటేనే కష్టాలన్నీ తీరిపోతాయా? ఈ సాకు చూపించి సుబ్బరంగా తాగి రావటానికిదో వంక. అంతే. మీరిద్దరూ ఒకరికొకళ్ళు బాగుంతే చాలదూ? ఆ వంక చూపించి చాలా ఎక్కువ చేస్తున్నాడు. తాగి రావటం, నిన్ను మాటలతో కుళ్ళబొడవటం. తన్ను తాను సమర్థించుకోవటం. ఈసారి ఇంటికి రానీ, నేను మాట్లాడుతాను.”

ఈలోగా వెంకాయ్ బట్టలు ఉతకటం పూర్తయింది. క్లిప్పులూ, బట్టలూ తీసుకుని ఆరవేయటానికని వెళ్ళింది.

***

సుబ్బయ్య రైలు దిగి కాలవ కట్ట మిద గుండా నడిచొస్తున్నాడు. ఆటోకో, రిక్షాకో డబ్బులు పెట్టటమెందుకులే, సాచి అంగలేస్తే ఊరు ఎంతో దూరం వుండదు అనుకుంటూ తన ఇంటి వైపు నడక సాగించాడు. తన లాగా రైలు దిగి నడిచొచ్చేవాళ్ళు కొద్ది మంది, స్కూలు కొచ్చే పిల్లలు కొంతమంది ఆ దారిన నడుస్తున్నారు. ఆ కాలవ కట్ట బారునా దిగువగా ఇళ్ళు కట్టుకుని చాలామంది కాపురముంటున్నారు. వాళ్ళంతా పనిపాటలు చేసుకునే వాళ్ళే. వాళ్లల్లో రిక్షా వాళ్ళున్నారు. పందుల్ని మేపుకొనే వాళ్ళున్నారు. కాయగూరల్లాంటివి తెచ్చుకుని మారుబేరం చేసుకుని బతికేవాళ్ళున్నారు. సుబ్బయ్య నడిచే దారిలో ఒక చోట ఇళ్ళకు ఎదురుగా కాలవ అంచున ఒక గాడిద పిల్ల పడి వున్నది. దాని వీపు మీద పుండున్నది. అ పుండును పొడవాలని కాకులు వాలుతున్నాయి. ఆ గాడిద పిల్ల కాకుల్ని తన తోకతో తోలుకోలేని స్థితిలో నీరసంగా పడి వున్నది. బడి పిల్లలు అక్కడ ఆగారు. ‘రెండ్రోజుల నుంచీ ఇది ఇలాగే పడి వున్నది. పాపం అస్సలు నడవలేకపోతున్నది’ అని అనుకోసాగారు.

‘రెండ్రోజుల నుంచి ఇలాగే పడివున్నదా? ఎక్కడి నుంచో తప్పిపోయి వచ్చి వుంటుంది. ఈ రోజుల్లో గాడిదలెక్కడ కనబడుతున్నాయసలు?’ అనుకుంటూ సుబ్బయ్య ఒక ఇంటి ముందు ఆగి “లచ్చుమమ్మా!” అంటూ కేకేశాడు.

“ఏం సుబ్బయ్యా? పిలుస్తుండావు” అంటూ లచ్చుమమ్మ బయటికొచ్చింది.

“ఏం లేదులే, బాగుండావా? ఈ గాడిద పిల్ల యవ్వారమేంటి? నీకేమైనా తెల్సా?”

“నాల్రోజుల క్రితం చిన్న చిన్న రోళ్లు తాళ్లకు కట్టి రెండు మూడు గాడిదల మీద ఏసి ఈ కట్టమీదగా నడిసిపోయారు. అప్పుడు తప్పిపోయింది గామోసు ఈ పిల్ల ముండ. దెబ్బ కూడా ఏదో తగిలినట్లుంది. పైకి లేసి అడుగెయ్య లేకపోతోంది. ఈ కాకులొకటి సేరి దాన్ని సికాకు పెడుతున్నాయి. ఇటుగా వచ్చినపుడు ఇష్ అని ఆటిని తోల్తానే వుండాను” అని వివరంగా చెప్పింది.

“మరో మాట సుబ్బయ్యా. నీకేమైనా ఈ గాడిద పిల్ల వాడకాని కొస్తదేమో? దీన్ని తీసుకెళ్ళి సాక్కోరాదూ?”

“నాకేం వాడకాని కొస్తది? మా అయ్య టైంలో లాగా గుడ్డల మూటలు మొయ్యాల్నా ఏంది? ఇప్పడందరూ ఎవరింట్లో వాళ్లు ఉతికించుకోవటమేగా?”

“నిజమేలే. దాని బాద సూడలేక అన్నాను. దానిదీ ప్రాణమేగా. అందుకనే అంటన్నాను”

గాడిద పిల్లను చూస్తూ, లచ్చుమమ్మ మాటల్తో సుబ్బయ్య ఆలోచనలో పడ్డాడు. లచ్చుమమ్మ అన్నట్లు దేనిదైనా ప్రాణమేగా. దీన్నిట్లాగే వదిలేస్తే సచ్చి వూరుకుంటుంది. కాకులు పొడిచి పొడిచి పుండును పెద్దది సేత్తాయి. తీసుకెళ్ళి సాకితే పోద్దేమో! అనుకుంటూ “లచ్చుమమ్మా! నీ కొడుకు ఇంట్లో వున్నాడా? రిక్షా ఏసుకుని పోయాడా?” అని అడిగాడు.

“వుండాడు. అన్నం తింటన్నాడు. తినంగానే బాడుగలకి పోతాడు.”

ఇంతలో లచ్చుమమ్మ కొడుకు బయటకి వచ్చాడు. అతనికి పెట్టె రిక్షా వున్నది.

“ఏరా అబ్బాయ్! ఈ గాడిద పిల్లను కాస్త మా ఇంటి దాకా చేర్చు.”

బడికెళ్ళే పిల్లలు సుబ్బయ్య ఏం చేస్తాడా అని ఇందాకట్నుంచి ఇక్కడే నిలబడి మాటల్ని ఆలకిస్తున్నారు.

“బాడుగిస్తాలే, ఊరికినే వద్దు.”

“ఛ. ఛ. బాడుక్కోసం కాదు. దీన్ని నువ్వేం చేసుకుంటావా? అని ఆలోచిత్తన్నాను.”

“ముందు దాన్ని బతికి బట్ట కట్టనీ, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం” సుబ్బయ్య ఆ మాట అనగానే తన రిక్షాను తెచ్చి అక్కడ నిలిపాడు. బడి పిల్లలూ సాయం చేశారు. ఆ గాడిద పిల్లను లేపి రిక్షాలో పడుకోబెట్టారు. ఆ తర్వాతే పిల్లలు స్కూలు దారి పట్టారు.

సుబ్బయ్య ఇంటికెళ్ళగానే ముందుగా గాడిద పిల్ల పుండుకు బాగా పసుపు అద్దమన్నాడు వెంకాయ్‍ని. ఈలోగా తానొక పల్చని నేత గోతాం ముక్క తెచ్చి పుండున్న చోట గాడిద నడుం చుట్టూ తిప్పి ఆ పట్టా జారిపోకుండా తాడుతో వదులుగా కట్టాడు. “నీ దుంపతెగా, కాకుల చేత బాగా పొడిపించుకున్నావు. నీ వీపు మీద ఏ మిన్నల్లులో పట్టి వుంటయి. వాటిని తినటానికి వచ్చి కాకులు నిన్ను పొడుచుకు తిన్నాయి. పసుపద్ది పట్టా కట్టేశాగా. కాకి వాలదు” అంటూ దానికి పరిచర్యలు మొదలుపెట్టాడు. క్రమంగా అది కోలుకుంది. అటూ ఇటూ నడవసాగింది.

“ఇదేమన్నా కుక్కా? ఇస్వాసంగా పడి వుండటానికి? మేకయినా పిల్లల్ని పెట్టి మందని పెంచుతుంది. ఈ గాడిద గుంటను సాకేదేంటి? దీంతో ఏం చేద్దాం?” అన్నది వెంకాయ్.

“ఆఁ, పిల్లల్ని కనీ, కనీ అలసిపొయ్యావుగా, నడవలేకపోతున్నావు. దీని మీద నిన్నెక్కించి తిప్పుదామనీ” అన్నాడు సుబ్బయ్య వెటకారంగా.

“అంత ఎటకారమెందుకులే. ఆ ఊరేగేదేదో నువ్వే ఊరేగు. కల్లు పాకకు పోతావో? సారా కొట్టుకు పోతావో? వాహనాల మీదెక్కి తిరగాలని నాకేం లేదు. ఆ బోగాలేవో నువ్వే అనుబగించు” అన్నది వెంకాయ్.

గాడిద పిల్ల బాగానే కోలుకున్నది. అటూ ఇటూ చురుగ్గా తిరగ్గలుగుతున్నది. దానే సాకే పని కూడా వెంకాయ్‍కే పడింది.

ఆవాళ దగ్గూ పడిశెంతో ఒళ్లు కూడా కాస్త వెచ్చబడింది వెంకాయ్‍కి. ఊళ్ళోకి బట్టలుతకటానికి కూడా పోలేదు. మర్నాడు జ్వరమింకా ఎక్కువయింది. ఆ రోజు సుబ్బయ్యను వెళ్ళి బట్టలు ఉతికి రమ్మని చెప్పింది. సణుక్కుంటూ ఊళ్ళోకి వచ్చాడు. బామ్మ గారింటికి రాగానే, అలవాటు చొప్పున పెరట్లోకి వచ్చాడు. అప్పటికే బామ్మగారక్కడ కూర్చుని వున్నారు.

“ఏం సుబ్బయ్యా! నువ్వొచ్చావు! వెంకాయ్ కేమయింది? మామూలుగా అయితే తను పని మానేసే మనిషి కాదు”

“అవును బామ్మగారూ. వెంకాయ్‍కి రొంప పట్టింది. కాస్త జొరమూ వచ్చింది. అందుకే నన్నెల్లమని పంపించింది. నేనొచ్చాను.”

“లేకపోతే ఒక మాత్రానికి నువ్వు కదిలి వస్తావా? ఏదో గాడిద పిల్లని తెచ్చావంటగా?”

“అవునమ్మా. కాలవ కట్ట మీద పడి వుంటే జాలేసి తెచ్చి సాకుతున్నాను. ఇంట్లో నా పెళ్ళానికి తిండి పెట్టినట్టే, దానికీ కాస్త తిండేస్తే పడి వుంటది. అవసరమైతే ఏవైనా బరువులు మోయటానికి పనికొస్తది. మా యాడది మీ గురుంచి ఓ.. తెగ చెప్పుద్ది. నాకు మాత్రం తెలియదా ఏంటి? అదైతే కాపురానికి వచ్చిన తర్వాతేగా మీ ఇంటికి రావటం మొదలుపెట్టింది. నేనయితే చిన్నప్పటి నుంచీ అడపాదడపా మా అమ్మా, నాయనలతో పాటు మీ ఇంట్లో తిరిగిన వాణ్ణే కదా! మీ సంగతులు నాకు తెలవవా?”

“నీకు తెలియకపోవటమేమిటి గాని! పిల్లలు పుట్టలేదని వెంకాయ్‍ని తెగ సతాయిస్తున్నావంట. ఇంకోదాన్ని కట్టుకుంటే పోదా అని కూడా అనుకుంటున్నావంట. ఆ కట్టుకున్న దానికీ పుట్టకపోతే ఏం చేస్తావురా? ఇప్పుడీ గాడిద పిల్లను పెంచుకునే బదులు ఏ పిల్లనో, పిల్లవాడినో పెంచుకుంటే పోయేదిగా?”

“పెంచుకున్నంత మాత్రాన కడుపున పుట్టినవాళ్ళవుతారా బామ్మగారూ? ఎంత పెంచుకున్నా పిల్లల్లేని వాళ్ళమన్న మాట మాత్రం అలాగే వుంటది. మన కడుపున పుట్టినవాళ్ళంటూ మనకుండాలి. ఒక్కళ్ళనన్నా కనలేకపోయే మా యాబిడ. దాని అప్పలకూ, చెల్లెల్లకూ, ఇటు నా తోడ బుట్టిన వాళ్ళకూ అందరికీ పిల్లలున్నారు. నా ఖర్మే ఇలా కాలిపోయింది. మా ఆడదానికంటే ఆ గాడిద చాలా నయం. చెప్పినట్లు వింటది. అవసరమైతే బరువులు కూడా మోసికెడతది.”

“నీ మోహం కాదూ! ఎందులో నీకు ఆ గాడిద కంటే మీ యాబిడ తక్కువగా కనబడింది? ఊర్లో బట్టలుతికి చాకిరి అంతా చేసేది వెంకాయ్. ఇటు ఊళ్ళో పని అటు ఇంట్లో పని అంతా చేసుకుంటూ నీకు వేళకు అన్నీ అమర్చి పెడుతుంటే తిని తీరిగ్గా కూర్చుని మాటలు చెప్తున్నావు. తోచిన పూట ఏమైనా పని చేస్తావు. లేకపోతే లేదు. మగ పుటక పుట్టటమే చాలా గొప్పనుకుంటున్నావు. నీకేమో పనీపాటా చేసే అలవాటే కావటం లేదు. పిల్లలంటూ వుంటే వాళ్ళనేం పెట్టి పెంచేవాడివి? ఇంకా నీ యిదానబడి ఉస్సురని ఏడ్చేవాళ్ళు. దేశంలో పిల్లలు లేనివాళ్ళు చాలామంది వున్నారు. నిన్నే పిల్లాడిలా చూసుకుంటూ అది పడి వుంటున్నది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. గాడిద పిల్ల పాటి చెయ్యదా నీ పెళ్లాం? ఒరేయ్ నీకు బొత్తిగా ఆడవాళ్ళంటే బాగా తేలిగ్గా కనపడుతున్నార్రా? అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఊరికే వెంకాయ్‍ని ఆడిపోసుకోవటం కాదు. ఒక పని చేద్దాం. మా చెల్లెలి కొడుకు పెద్ద డాక్టరు. వాడి దగ్గరకు మీ ఇద్దరినీ పంపిస్తాను. మీ సంగతి వాడితో చెప్తాను. మీ ఇద్దరినీ పరీక్ష చేసి లోపం ఎవరిలో వుందో చెప్పమని చెప్తాను. సరేనా? విషయం తెలిసిపోతుంది.”

“డాక్టరు గారి దగ్గరకా? వెళ్ళాలంటారా?” నసిగాడు సుబ్బయ్య.

“అలా అంటా వేంటిరా? పరీక్షలు చేసి ఏమన్నా మందులూ వగైరా ఇస్తాడేమో కనుక్కుందాం. వెంకాయ్‌ మంచింది. దాని ముఖం చూస్తే జాలేస్తుంది.”

ఆ తర్వాత ఆ విషయం బామ్మగారు వెంకాయ్ తోనూ చెప్పారు. మొగుడ్ని తనతోపాటు ఆస్పత్రికి రమ్మని ఒత్తిడి చేసింది. మొగుడూ పెళ్ళాలిద్దరూ ఆస్పత్రి కెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు. విషయం తెలిసింది. ‘సుబ్బయ్య లోనే లోపం వున్నది. వెంకాయ్ గర్భసంచి అంతా ఆరోగ్యంగానే వున్నది’ అని చెప్పి పంపారు.

సుబ్బయ్య ముఖంలో నెత్తురు చుక్క లేదు. ముఖం వేలాడేసుకుని తిరిగి వచ్చాడు. వెంకాయ్‍కి మాత్రం ఉత్సాహంగా వున్నది.

“ఈ మాట నలుగురితో అనబాకు. నన్ను పనికిమాలినోడి కింద చూత్తారు” అని బతిమాలుకున్నాడు సుబ్బయ్య.

“మనకి పిల్లలు ఎందుకు లేరో తెలియాలిగా. బామ్మగారి ఆళ్ల చెల్లెలి కొడుకు చెప్పడా? ఇషయం బయటికి రాదా ఏంటీ?” అన్నది మూతి తిప్పుకుంటూ వెంకాయ్.

విషయమంతా బామ్మగారికి అర్థమైంది. ఒకరోజు సుబ్బయ్యని పిలిపించారు.

“సుబ్బయ్యా! సంగతంతా తెలిసిందిగా. ఇకనైనా వెంకాయ్‍ని సాధించటం మానుకో. ఒక్కొక్కరి ఒంట్లో స్థితి ఒక్కోలా వుంటుంది. దీనికి నువ్వేం సిగ్గు పడాల్సిన పని లేదు. వైద్యం చేయించుకుని పిల్లల్ని కనాలంటే లక్షల తోటి వ్యవహారం. మీ విషయంలో అది కుదిరేది కాదు. చూద్దాం, ముందు ముందు ఏం మార్పులొస్తాయో! ప్రస్తుతానికి మీరిద్దరే ఒకరికొకరు తోడు అనుకోండి” అంటూ సుబ్బయ్యను ఓదార్చి ధైర్యం చెప్పి పంపారు బామ్మగారు.

వెంకాయ్ గాని, సుబ్బయ్య గాని ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేదు. బామ్మగారు కూడా తన నోరు విప్పి ఎవరికీ ఏం చెప్పలేదు. కాని సుబ్బయ్యకు ఒకటే అనుమానం. ఊళ్ళో ఏ ఇద్దరు మాట్లాడుకోవటం చూసినా సుబ్బయ్యకు తన విషయమేమోనని అనుమానం కలగసాగింది. వెంకాయ్ ఎవరితోనన్నా మాట్లాడటం చూసినా, తన పరిస్థితి చెప్పుకుంటుందేమోనని కాపలా కాసేవాడు. వెంకాయ్ వచ్చేదాకా ఆగి మరలా తనతో పాటు ఇంటికి పిలుచుకొచ్చేవాడు. కల్లుపాకకి వెళ్ళటం, కల్లు తాగటం, సారా కొట్టులో సారా తాగటం ఎక్కువ చేశాడు. ఏదన్నా మాట్లాడదలచుకుంటే తను సాకే గాడిద దగ్గరకెళ్ళి తన సొదంతా వెళ్ళగక్కేవాడు. వెంకాయ్‍కి ఆ పరిస్థితి నవ్వు వచ్చేది. జాలీ కలిగేది. సుబ్బయ్యకు నీరసం గానూ, కోపం గానూ రోజులు గడుస్తున్నాయి. వెంకాయ్ ఏదన్నా చెప్పబోతే సుబ్బయ్య వినిపించుకునేవాడు కాదు.

గాడిద దగ్గర కొచ్చి “ఒరే పిల్లగాడా! చెప్పరా, మీ ఆసామికి” అంటూ తను చెప్పదలచుకున్నది సుబ్బయ్య వినేటట్లు చెప్పటం అలవాటు చేసుకున్నది వెంకాయ్.

“అట్లా కుదరదని చెప్పరా పిల్లగాడా! ఈ సుబ్బయ్య మాటంటే మాటే. మారేది లేదు” అంటూ ఒక్కోసారి అక్కడ్నించి లేచిపొయ్యేవాడు.

“నువ్వెప్పటికీ మారేది లేదు. నేను సుకపడేడి లేదు” అంటూ ముక్కు చీదేది వెంకాయ్.

***

పంట కోతకు వచ్చింది. కోసిన వరి పనలు పొలంలో నేల మీద పరిచి వున్నాయి. మూడు రోజులు కాగానే వరి పనల్ని అటూ ఇటూ తిప్పి మరింతగా ఆరేటట్లుగా చేస్తున్నారు. అట్లా పని చేసే వాళ్ళల్లో సుందరం, అతని భార్యా కూడా వున్నారు. సుందరం భార్య ఇప్పుడు ఆరు నెలల గర్భవతి. పనులు చేసుకోకపోతే గడవదు కాబట్టి బామ్మగారి పొలాల్లో పనులు చెయ్యటానికి వస్తున్నది. పొలంలో పని అయిన తరువాత ఇంటికి వెళుతూ, వెళుతూ సలహాల కోసం బామ్మగారి దగ్గర ఆగింది.

“ఎన్నో నెలే నీకిపుడు?”

“ఆరు నెలలు నిండుతాయమ్మా”

“పనులు చేయటం తగ్గించు. బరువులవీ ఎత్తకు.”

“ఒంట్లో ఉశారు గానే వున్నదమ్మా. అందుకే పొలం పనికొచ్చాను.”

“ఓసి నీ దుంపతెగ. కాస్త విశ్రాంతిగా ఇంటి పట్టు నుండు.”

“లేదు లేమ్మా. కాన్పు అయ్యాకా ఎట్లాగూ కొద్ది రోజులు ఇంట్లోనే వుండాలయ్యె. ఇప్పట్నుంచీ పనులు మానుకుంటే గడిచేది ఎట్టాగమ్మా? ఓపికున్నంత వరకూ చిన్నా, పెద్దా పనులు చేసుకుంటేనే కాన్పు తేలిగా అవుతదని మావాళ్ళు అందరూ అంటున్నారు.”

“అదీ నిజమేననుకో. వేవిళ్ళవీ పూర్తిగా తగ్గాయా? తిండి సయిస్తున్నదా? కాన్పుకు పుట్టింటికి పోతావా? ఇదే తొలి చూలుగా?”

“అవునమ్మా. మా అమ్మొచ్చి పిలుచుకుపోతానంటున్నది. ఆబిడా ఒంటరిది. తొమ్మిదో నెలొచ్చినంక ఎలతాను. నాలుగు రోజులు పోయాక మళ్ళీ ఒకపాలి మీ దగ్గర కొస్తాను. పాత చీరలూ, పంచెలూ అన్నీ తీసి వుంచండి. కాన్పయితే నాకు చానా పాత బట్టలు అవసరమవుతాయిగా. ఇప్పుడు నాలిక్కి రాసుకోవటానికి కోడలి గారితో చెప్పి ఏమన్నా పెట్టించండి” అంటూ చనువుగా అడిగింది.

“ఇంట్లో మినప సున్నుండలున్నాయి. ఇస్తుందిలే. కాస్త ధనియాల కారమూ, దబ్బకాయ ఊరగాయా ఇవ్వమని చెప్తానులే. అన్నట్టుగా ఏమే! ఆరోగ్య కేంద్రాన్నుంచి నర్సొచ్చి నెలనెలా నీ ఆరోగ్యాన్ని గురించి తెలుసు కెళుతోందా? ఆవిడొచ్చే టైమ్ తెలుసుకుని ఇంట్లోనే వుండు. ఇచ్చిన మందు బిళ్లలు వాడుతూ వుండు. అసలే చాలా రోజులకు వచ్చిన కడుపు. ఆరోగ్య కేంద్రంలో డాక్టరు చెప్పినట్టు విను. రమ్మన్నప్పుడల్లా వెళ్ళి చూపించుకుంటూ వుండు” అంటూ ఎన్నో సలహాలను చెప్పారు. ఊరగాయ పచ్చడినీ, కారప్పొడినీ పెట్టించారు. అవి తీసుకొని “పాత చీరల కోసం మళ్ళీ వస్తానమ్మా” అంటూ వెళ్ళింది సుందరం భార్య.

ఒక రెండు నెలలు గడిచాయి. సుందరం భార్యకు డాక్టరు చెప్పిన గడువు కన్నా చాలా ముందుగా ఇప్పుడు నెప్పులొస్తున్నాయి. ఇంకా టైముందని వాళ్లమ్మ రాలేదు. బామ్మగారి మినప చేల్లో పని చేస్తున్నాడు సుందరం. కబురు తెలుసుకుని పరుగు పరుగున ఇంటి కొచ్చాడు. తన భార్యను ఆటోలో ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. సమయానికి డాక్టరు గారున్నారు.

“చూడు సుందరం. కాన్పు సహజంగా అయ్యేటట్లు లేదు. ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుంది. నర్సు కాయితాలిస్తుంది. ఆమె చెప్పిన చోట సంతకాలు పెట్టు. సంతకం పెట్టటం రాకపోతే వేలిముద్ర వెయ్యి.”

“అట్టాగే డాక్టరమ్మ గారూ! భయమేమీ లేదుగా. నా పెళ్ళాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. పెళ్ళయిన చాన్నాళ్ళ తర్వాత వచ్చిన కాన్పు. తల్లినీ, బిడ్డనీ రక్షించే భారం మీదేనమ్మా” అన్నాడు సుందరం రెండు చేతులూ జోడించి.

“మరేం భయం లేదు” అని చెప్పారు డాక్టరు గారు.

ఆపరేషను జరిగింది. ఆడపిల్ల. కానీ రక్తం బాగా ఎక్కువగా పోవటం వలన మర్నాడు సుందరం భార్య బాగా నీరసించి పోయింది. డాక్టరు గారు చాలా ప్రయత్నించారు. కానీ పెద్ద ప్రాణాన్ని కాపాడలేకపొయ్యారు. పసిపిల్ల కేర్ కేర్‍మని ఏడుస్తున్నది. సుందరం ఒక వైపునా, అతని అత్త ఒక వైపునా శోకాలు పెడుతున్నారు. ఎవరెన్ని శోకాలు పెట్తినా సుందరం భార్యకు వినబడవు కదా! కన్న కూతుర్ని కంటి నిండా చూసుకోనైనా చూసుకోకుండా కన్నుమూసిన నిర్భాగ్యురాలు ఆ తల్లి.

పది రోజులు అతి భారంగా గడిచినాయి. సుందరం అత్తా వయసుకు కాస్త పెద్దదే. పైగా రోగిష్టి మనిషి. ఈ వయసులో, అనారోగ్యంతో ఈ పిల్లను ఒక్కదాన్నీ నేను పెంచలేను అనేసింది. సుందరానికి ఆ పసిపిల్లంటే మొదటే కోపంగా వున్నది. ఇది పుడుతూనే తల్లిని చంపేసింది. పైగా ఆడ పుట్టుక పుట్టింది. అత్త ఒక్కతీ తీసుకెళ్ళి పెంచలేదు. ఇక్కడే వుంచితే ఆమెనూ పోషించాలి. జబ్బులకు మందులిప్పించాలి. అదంతా తనకు ఇష్టం లేని పని. పోనీ తన తల్లిదండ్రులేమైనా సహాయం చేస్తారేమోనని ఆలోచించాడు.

“నీ అత్తకు ఓపిక లేకపోతే, నాకూ, మీ అయ్యకేనా ఓపికలున్నది? రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లం. ఈ పిల్లని పెంచటం కోసం ఇంటో కూకుంటే జరుగుబాటు ఎట్లారా?”

“నేను పని చేసి డబ్బులిత్తాలే అమ్మా” అన్నా ఆమె వినిపించుకోలేదు.

“ఎట్లాగో అట్లాగా మీ అత్తకే ఒప్పజెప్పు. మగపిల్లాడయినా అయితే చేతికిందకి అక్కర కొత్తాడని ఆలోసించేవాళ్ళం. ఇది ఆడగుంటైపోయింది. నేను దీన్ని సాకలేను. నా వల్ల కాదు” అంటూ కరాఖండీగా చెప్పేసింది.

ఏం చేయాలనుకుంటూ సుందరం తల పట్టుకు కూర్చున్నాడు.

“ఏదైనా అనాథాశ్రమంలో ఒప్పజెప్పిరా అన్నాయ్. ఈ పది రోజులూ సూత్తేనే ఈ పిల్లతో నాకే పనీ అవటం లేదు. రేపట్నించీ నేనూ పనిలోకి బోవాలె కదా. అమ్మను చంపి పుట్టిన పిల్ల పిశాచి ఇది. ఇంట్లో వుంచి పెట్టినా ఏం మంచిది కాదు” అంటూ చెల్లెలు కూడా సతాయించింది. మొత్తానికి అందరి మనసుల్లో ఆ పిల్లంటే అయిష్టత పెరిగిపోయింది. ఏ పని చేయాలన్నా సుందరం చేతిలో రూపాయి లేదు. బామ్మగారింటికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలని వెళ్లాడు. గడ్డం పెరిగి, పీక్కుపోయిన ముఖంతో పిచ్చివాడల్లే వున్నాడు. బామ్మగారి కొడుక్కోసం వెళ్ళి కూర్చున్నాడు. ఈలోగా బామ్మగారు బయటికొచ్చారు. ఆవిడ కుశల ప్రశ్నలు వేయగానే ఏడుపు ఆపుకోలేకపొయ్యాడు. విషయమంతా చెప్పాడు.

“మీ అత్తను ఇక్కడే వుంచుకుని పోషించు. పిల్లను జాగ్రత్తగా పెంచుకోండి. నీ పెళ్లాం ఎంతో కోరికతో ఆ పిల్లను కన్నది. దాని గుర్తుగా వుంటుంది” అన్నారు.

“కాదు లేండి బామ్మగారూ! మాయమ్మా వాళ్ళూ, మా చెల్లెలకూ ఎవరకూ దానిని పెంచుకోవాలన్న ఇంగింతం కావటం లెదు. మా అత్తేమో ముసలిది, పైగా రోగిష్టిది. నేనొక్కడ్నీ ఎట్లా సాకుతాను? ఆ పిల్ల మా యింటో పెరిగే రోజుంటే దానమ్మే బతికుండేది. ఇప్పుడే దారీ కనపట్టం లేదు.”

“పిచ్చి వెధవా! కన్న కూతుర్ని ఎట్లాగైనా పెంచి పెద్ద జేసుకోవాలి గాని వదిలించుకునే ఆలోచనలు చేస్తావేంరా? తల్లి చచ్చిపోతే తండ్రివి నువ్వు బతికే వున్నావు. బాగా ఆలోచించు. మార్గం అదే దొరుకుతుంది. పిల్లకు పోతపాలు పట్టాలిగా. రోజూ కాసిని పాలు మా ఇంటి నుంచే తీసుకెళ్ళు. ఆర్నెల్లు వచ్చేదాకా పిల్లల్ని ఎంత అర్భకులైనా పెంచగలుగుతార్రా. కాసిని పాలు పట్టి, స్నానం చేయిస్తే చాలు. ఆ తర్వాత అన్నం తినిపించి చేతమ్మటే తిప్పుకోవచ్చు.”

“ఇంటానికి బాగానే వుందండీ. కానీ పెంచటమే మా వల్ల అయ్యేటట్లు లేదు. నా కూతుర్ని పట్టించుకునే వాళ్ళు ఎవళ్ళూ లేరండి. నేను పనికి బోతే దీని మీదే మనసు పీకి భయమేసుద్దండీ. ఇంటో వుంచి దాన్ని అన్నేయంగా సంపేకన్నా ఎక్కడన్నా బతికించే సోట చేరుద్దామనుకుంటున్నానండీ. క్రీసు భవనానికి కూడా వెళ్ళి అక్కడున్న అమ్మగార్లనూ అడుగుతానండీ. ఎక్కడ చేర్చమంటారో వాకబు చేత్తానండీ. రేపోమాపో ఈ పని పూర్తి చేత్తానండీ.”

సుందరం గట్టి నిర్ణయమే తీసుకొన్నాడని బామ్మగారికి అర్థమైంది. “సరే, కొద్ది రోజులు చూడు. ఏ దారీ దొరక్కపోతే అప్పుడే ఎక్కడో అక్కడ చేరుద్దువుగాని” అని చెప్పారు.

కొంత డబ్బు బామ్మగారి కొడుకు ఇస్తె అది తీసుకుని సుందరం వెళ్ళిపోయాడు.

వెంకాయ్‍నీ, సుబ్బయ్యనూ బామ్మగారు పిలిపించారు.

“చూడు సుబ్బయ్యా! మా పన్లో కొచ్చే సుందరం తెలుసుగా. వాడి పెళ్ళాం, ఆడపిల్లను కని చచ్చిపోయింది. ఇప్పుడా పిల్లను పెంచలేక ఎక్కడైనా అనాథాశ్రమంలో ఇచ్చేయాలనుకుంటున్నాడు. అలా ఇచ్చేయటం తప్పితే తనకింకో దారి లేదని సుందరం గట్టిగా చెప్తున్నాడు. నాకైతే ఆ పిల్లను తెచ్చుకుని మీరిద్దరూ పెంచుకుంటే బాగుండుననిపిస్తుంది.”

“బామ్మగారూ! వేరే కులపోళ్ల పిల్ల. పైగా ఆడపిల్ల. ఆడపిల్లనే కదా వాళ్ళమ్దరూ వదిలించుకోవాలని చూస్తున్నారు. అదే మగపిల్లాడినయితే ఎట్టాగైనా పెంచుకునేవాళ్ళు.”

“కావచ్చురా. అది చాలా తప్పు. వీళ్ళ ఆలోచనలతో ఆ పసిగుడ్దును తిప్పలు పెడుతున్నారు. అనాథాశ్రమాల్లో కన్నా మీలాంటి వాళ్ళ దగ్గరైతే ఆ పిల్ల సుఖంగా బతికిపోతుంది. ఆ పిల్లకొక ఆశ్రయం దొరుకుతుంది. మీకూ సంతానం వున్నట్లుంటుంది. వేరే వాళ్ళ పిల్ల అనీ, ఆడపిల్లనీ ఆలోచించొద్దు. ఈ రోజుల్లో కులాలను ఎవరు పట్టించుకుంటున్నార్రా? ఏ కులంలోనిదైనా పసిబిడ్డ పసిబిడ్డేరా. పసిపిల్లలు దేవుడితో సమానమంటారు. పసిగుడ్డును తెచ్చి పెంచుకుంటే మీరే అమ్మానాన్న అని గుర్తు పెట్టుకుంటుంది. మాటలు రాగానే మిమ్మల్నే అమ్మా, నాన్నా అని పిలుస్తుంది. ఆడపిల్లే పెద్దయ్యాక కూడా అమ్మానాన్నల్ని ప్రేమగా చూసుకుంటుందిరా. బంధాన్ని అంత తొందరగా తెంచుకుపోదు. రేయ్! సుబ్బయ్యా! దార్లో పడున్న గాడిద పిల్లనే కనికరంతో తెచ్చి సాకావు. ఇంకాస్త పెద్ద మనసు చేసుకుని ఈ పిల్లనీ పెంచుకోండి. పిల్లల్లేని లోటును తీర్చుకోండి. ఎక్కడెక్కడికో వెళ్ళి పసిబిడ్డల్ని వెతుక్కోకుండా కాళ్ళ దగ్గరే పిల్ల సిద్ధంగా వుంది. ఇలా దొరకటం కూడా ఒక అదృష్టమేరా” అంటూ నచ్చచెప్పారు.

వేరే వాళ్ళ పిల్లని వెంకాయ్‍కి అంత పట్టింపు అన్పించలా. సుందరాన్నీ, అతని భార్యనూ చాలా సార్లు ఇక్కడే చూసింది. పాపం అన్పించింది. ఆలోచించగా, సుబ్బయ్య క్కూడా బాగానే వుందనిపించింది.

“సరే బామ్మగారూ! పెంచేదానికి వెంకాయ్‍కే పట్టింపు లేకపోతే, నాకూ వుండదు. మీరు చెప్పిన మాట బాగానే వుందనిపించింది. అట్టాగే చేత్తాం. నే వెళ్ళి సుందరాన్ని మీ దగ్గరకు పిలుచుకు వస్తాను. పిల్లని ఇప్పించండి” అన్నాడు.

“అలాగే రా! పిల్లతో సుఖంగా వుండండి” అని దీవించారు బామ్మగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here