పెంకుటిల్లు

2
12

[dropcap]”ఇ[/dropcap]ప్పుడు అంత అవసరమా? ఆ పాత ఇంటికి, మీకు మరీ చాదస్తం కాకపోతే, ఇంకా దాన్ని బాగు చేయించడం ఏంటి? ఇప్పటికే దాని వయసు వంద సంవత్సరాలు పై బడింది. పైగా ఈ రోజుల్లో దానికి సేవ చేసే వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారు?” అంది విసుక్కుంటూ సుభద్రమ్మ.

సుభద్రమ్మ, పద్మనాభం వృద్ధ దంపతులు, పద్మనాభానికి సుమారు ఎనభై ఏళ్లు, సుభద్రమ్మకు కూడా డెబ్భై ఐదు ఏళ్లు పైనే పడ్డాయి. చాలా కాలంగా వాళ్ళ ఊరిలో వారసత్వంలో వచ్చిన ఇంట్లోనే జీవనం సాగింది, వాళ్ళ అబ్బాయి వెంకట్రావ్ బాగా చదివి, పెద్ద ఉద్యోగం సంపాదించి మంచి హోదాలోకి వచ్చి చాలా గడించాడు.

కానీ ఉద్యోగ రీత్యా పుట్టిన ఊరికి దూరంగా ఉండాల్సి వచ్చింది. వృద్ధాప్యం వల్ల తల్లి, తండ్రులను తనతో పాటే హైదరాబాద్ రెండేళ్ల క్రితమే తీసుకు వచ్చేశాడు. కానీ తండ్రికి ఇంకా ఆ పుట్టి పెరిగిన ఊరు, పెంకుటిల్లుపై మమకారం వల్ల వాటిని అలాగే ఉంచాడు. ఎన్నో సార్లు ఊళ్ళో అపార్ట్‌మెంట్ డెవలప్‌మెంట్‌కు ఇవ్వమని అడిగినా తండ్రిని కాదనలేక ఆస్తిని అలాగే ఉంచేశాడు. కానీ ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి పూర్వం అంత గొప్పగా లేదు. పాతది అయిపోవటం, దాని ఆలన పాలన సరిగ్గా చూసేవారు లేకపోవడంతో ఇల్లు పాడవటం మొదలయ్యింది. ఎందుకో ఈ మధ్య పద్మనాభంకు ఆ ఇంటిపై మనసు పడింది. అక్కడకు వెళ్ళి ఉండాలని చాలా కోరికగా ఉంది. ప్రస్తుతం అక్కడ ఇల్లు బాగోలేదు కనుక బాగు చేయించమని రోజూ కొడుకు దగ్గర నస పెట్టసాగాడు.

“ఇల్లు పాతది అయినంత మాత్రాన, బాగు చేయించడం మానేస్తామా? మనము ముసలి వాళ్ళం అయిపోయాం, మందులు వేసుకుని ఆరోగ్యం బాగు చేసుకోవటం లేదా? నీకోటి చెప్పనా? అది నాకు ఇల్లు కాదు, మధురమైన జ్ఞాపకం. నా బాల్యపు ప్రస్థానం. పురిటి కందుగా ఉన్నప్పటి నుండి ఇప్పటి దాకా విడవని స్నేహం, ఇంకా చెప్పాలి అంటే , ఇంకా బ్రతికే ఉన్న నా తాత. నీకు నచ్చితే రా. లేకుంటే మానేయి. నేను మాత్రం అక్కడ కొన్ని రోజులు ఉండి వచ్చేస్తా. నాకు వెళ్లాలని ఉంది. వెంకట్రావ్‌ను అడిగాను. వాడు అక్కడ పనులు చేయిస్తానని మాట ఇచ్చాడు. వాడు చేయిస్తే సరేసరి. లేకుంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. దాన్ని నేనే బాగు చేయించుకుంటాను. అంతే కానీ నాకు అడ్డు పడకండి.” అంటూ కాస్త విసుగ్గా అన్నాడు పద్మనాభం జండూబామ్ మోచిప్పలకు రాసుకుంటూ.

“ఇంకేం మీరు ఒక నిర్ణయం అనుకున్న తరువాత మార్చగలమా? విన్నట్టు, మారినట్లు కనిపిస్తారు కానీ మీకు నచ్చిందే చేసేస్తారు. మీతో పెళ్ళయిన దగ్గరనుండి చూస్తున్నాను. అదే ధోరణి. ఇంతకూ ఆ ఇంటికి ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? మళ్ళీ మంచి రూపు రావటానికి, కాస్తంత ఆవాసయోగ్యంగా ఉండాలంటే ఈ రోజు లెక్కల ప్రకారం పది లక్షలు అవుతుందిట. ఒక్కసారి ఆలోచించండి. అంత ఖర్చు అవసరమా?” అంటూ కాస్త దీర్ఘం తీసింది సుభద్రమ్మ.

“ఏమిటి పది లక్షలా? నీ మొహం. నీకు ఏమీ తెలియదు. అంత అవ్వదు. సిమెంట్ పనులు, కాస్త రంగులు, కొద్దగా చెక్క మరమ్మత్తులు అన్నీ కలిపినా ఒక రెండు లక్షల్లో అయిపోతుంది. ఆ మధ్య నా స్నేహితుడు గుర్నాధం కూడా ఇలాంటి పనే చేయించాడు. వాడిని అడిగాను. మన వెంకట్రావ్ ఆ రెండు లక్షలు ఖర్చు ఎందుకా అని అనుకుంటున్నాడా? లక్షలు పోసి చదివించాను, మంచి ఉద్యోగం వచ్చి, బాగా సంపాదన పెరిగే వరకు అవసరం అయినప్పుడు ఆర్ధిక సహాయం చేశాను. ఈ రోజు నేను అడుగుతున్నది కూడా చేయడా?” అంటూ కాస్త అసహనంగానే పద్మనాభం విసుక్కున్నాడు.

“అయ్యో. అలాంటిది ఏమీ లేదు. ఏదో మన కోడలు పిల్లే బాగా ఖర్చు అవుతుంది అని అంటే, ఇప్పుడు ఎందుకా? అని నేనే అడిగాను. వాడు ఏమీ అనలేదు. ఏ భావమూ చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. బహుశా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నడేమో? అయినా ఖర్చులు బాగా పెరిగిపోయాయి. మీరు చెప్పే దానికన్నా ఎక్కువే అయ్యే అవకాశం ఉంది. మీ స్నేహితుడు గుర్నాధం ఇల్లు చిన్నది. అదీకాక ఆ ఇంట్లో వాళ్ళ కుటుంబం ఇంకా ఉండనే ఉంది. వాళ్ళు ఉండే నివాసానికి, వాళ్ళు ఉండటం కోసం ఖర్చు పెట్టారు. మనది అలా కాదు. లంకంతకొంప, పెద్ద మండువా ఇల్లు. ఏదో ఇంట్లో కిరాయి ఉన్నవాళ్ళు నెట్టుకొస్తున్నారు కానీ అంత గొప్పగా ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళను ఖాళీ చేయించి ఇది బాగు చేయించాలి. మరోసారి ఆలోచించండి. బాగా ఖర్చు అవుతుందేమో” అంటూ చివరి పదాలు కాస్త వత్తి పలుకుతూ నసిగింది సుభద్రమ్మ.

“ఇదిగో ఈ వ్యవహారం మగాళ్లది. మాకు తెలుసు ఏం చేయాలో, ఎలా చేయాలో. నీరసంగా ఉంది. ఈ నస ఆపి, కాస్త ఓ చుక్క కాఫీ ముఖాన కొట్టు. ఏదైనా చేద్దాం అంటే ముందుకు వెళ్ళనీయరు. ఎప్పుడూ ఇంతే” అంటూ చికాకు పడుతూ తన గదిలో కిటికీ పక్కకు వెళ్ళి బయట చూస్తూ ఉండిపోయాడు పద్మనాభం.

పద్మనాభం విసుగు, కోపానికి ఇంకేమీ మారు మాట్లాడకుండా సుభద్రమ్మ మౌనం దాల్చి కాఫీ తేవటంకోసం అక్కడనుండి లేచి వెళ్ళిపోయింది. అమ్మా, నాన్న మాటలు చాటుగా వింటున్న వెంకట్రావ్ పెద్దగా నిట్టూరుస్తూ అక్కడ నుండి కదిలాడు.

***

వెంకట్రావ్ ఆఫీసుకు వెళ్ళాడు కానీ, ఆలోచనలు అంతా నాన్న గురించే, ఈయనకు ఇప్పటికే ఎనభై దాటాయి, ఏదో దేముని దయవల్ల తల్లి, తండ్రులకు ఆరోగ్యం బాగుంది, కానీ, ఈ వయసులో వాళ్ళను మరలా ఆ ఇంటికి పంపడం ఎలా? ముఖ్యంగా ఇక్కడ సదుపాయాలు అన్నీ అలవాటు పడిన తరువాత అక్కడ ఎలా ఉండగలరు? కొద్ది రోజులే అయినా ఎలా వదులుతాం? ఏమీ అక్కరలేదులే అని అంటే వాళ్ళు నొచ్చుకుంటారు. ఎప్పుడూ ఏమీ అడగని నాన్న అడిగే చిన్న కోరిక తీర్చలేకపోతే ఎలా? అంటూ సాలోచనగా ఉండిపోయాడు.

కాసేపటికి ఏదో ఆలోచన వచ్చిన వాడిలా తన సెక్రటరీని పిలిచి ఏవో సూచనలు ఇచ్చి గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు.

ఉదయం పద్మనాభం లేచేసరికి వెంకట్రావ్ బట్టలు సద్దుకుని ఏదో ఊరు వెడుతున్నట్లుగా అర్థం అయ్యింది. కోడలు రాణిని పిలిచి “ఏమ్మా! వాడు ఏమైనా ప్రయాణమా? కంగారుగా ఉన్నాడు” అని అంటుంటే “అవును మావయ్యా , ఏదో ఆఫీసు పని మీద విశాఖపట్నం ప్రయాణం ఒక వారం రోజులు, మధ్యాహ్నం పదకొండు గంటలకు విమానంలో, అందుకే ఆ కంగారు. మీరు ఏమైనా మాట్లాడాలా?” అంటూ అడిగింది కోడలు రాణి.

“అబ్బే! అదేం లేదులే కంగారుగా ఉన్నాడుగా, ఏమిటా అని” అనేసి తన గదిలోకి వచ్చి మళ్ళీ కిటికీ నుండి బయటకు చూస్తూ గొణుక్కొవటం మొదలు పెట్టాడు.

“వీడు నా విషయం ఏమీ తేల్చలేదు. నాకు ఇక్కడ తోచడం లేదు. ఇప్పుడు ఆఫీసు పని, అంటే ఇంకో పది రోజుల తరువాత కానీ నాకు వీడితో మాట్లాడటానికి వీలు పడదు.” అని ఆలోచనలో పడిపోయాడు.

“నాన్న! నేను ఆఫీసు పని మీద ఊరు వెడుతున్నా. ఒక వారం పైనే పడుతుంది. వచ్చిన తరువాత మీ విషయం ఆలోచిస్తా” అంటూ వెంకట్రావ్, ఎప్పుడు గదిలోకి వచ్చాడో పద్మనాభం పక్కకు వచ్చి నెమ్మదిగా చెప్పాడు.

“ఓహ్!. సరేరా. నువ్వు ఊరు వెడుతున్నావా? జాగ్రత్త. నువ్వు వచ్చిన తరువాతే మాట్లాడుకుందాం. తొందర ఏమీ లేదు” అంటూ కాస్త బింకంగాను, తన విషయం ఆలోచిస్తున్నాడని ఆనందంగాను పలికాడు పద్మనాభం.

అలా ఒక పదిరోజులు గడిచి పోయాయి. ఈ లోపల పద్మనాభం రోజూ తన ఊరిలో ఉన్న తన స్నేహితులందరికీ ఫోన్ చేసి తాను త్వరలో అక్కడకు వచ్చి అందరినీ కలుస్తానని, తన ఇంట్లో ఉంటానని అప్పుడు అందరూ కలసి సాయంత్రాలు గడుపుదామని చెప్పడం మొదలు పెట్టాడు.

అనుకున్నట్టుగానే వెంకట్రావ్ తన క్యాంప్ నుండి తిరిగి వచ్చాడు. ఆఫీసు పని మీద ఒక నాలుగు రోజులు ఖాళీ లేకుండా గడపటంతో పద్మనాభంకు తన కొడుకుతో మాట్లాడే అవకాశం లేక పోయింది.

అలా ఇంకో వారం గడిచింది. పద్మనాభంలో ఆతృత పెరిగింది, వీడు ఆఫీసు పనుల్లో పడి మళ్ళీ తన పని మరచినట్టున్నాడు. ఇవాళ ఏదో ఒకటి తేల్చాలి అని అనుకుంటూ ఆ రోజు ఉదయమే నిద్ర లేచి, స్నానం చేసి వెంకట్రావ్ లేచే సమయానికల్లా హాలులో కూర్చున్నాడు.

”ఏం నాన్న! నిద్ర పట్టలేదా? ఏమైనా పని ఉందా? ఇంత పొద్దున్నే తయారై పోయావు. మీ ఆరోగ్యం ఎలా ఉంది?” అంటూ వెంకట్రావ్ పలకరింపు.

“నేను బాగానే ఉన్నాను. నువ్వే ఆఫీసు పనిలో పడి నా విషయం మరిచావు. ఇంతకూ ఏమి చేశావ్?  నేను ఎప్పుడు మన ఊరికి వెళ్ళేది? దాని గురించి ఏమైనా ఉంటే చెప్పు.” అంటూ చాలా స్థిరంగా అడిగాడు పద్మనాభం.

“అదా నాన్న! నేను మొన్న ఫోన్‌లో మన ఇంట్లో అద్దెకు ఉన్నవాళ్లకు చెప్పాను. అలాగే నా స్నేహితుడు గోవిందంకు పురమాయించాను మన ఇంటిని బాగు చేయించమని. అక్కడ అన్నీ సదుపాయాలు పూర్తవగానే మీరు అక్కడకు వెళ్ళవచ్చు. ఇంకో వారంలో ఆ పనులు పూర్తవుతాయి. అప్పటి దాకా కాస్త ఓపిక పట్టండి. తప్పకుండా నీకు నచ్చినట్టు జరుగుతుంది” అంటూ వివరించాడు వెంకట్రావ్.

విషయం అంతా విన్న పద్మనాభం మొహంలో ఆనందం ప్రస్పుటంగా కనిపించింది. తన కొడుకు తన మాట కాదనకుండా ఒప్పుకున్నందుకు, తన సొంత ఊరుకు వెళ్ళే అవకాశం వస్తున్నందుకు తెగ మురిసిపోయాడు.

గబగబా లేచి వెంకట్రావ్ చేయి పట్టుకుని “థాంక్స్ రా, చాలా మంచి పని చేశావ్” అంటూ చిన్నపిల్లడిలా ఆనందంతో సుభద్రమ్మ ఉన్న గదిలోకి అడుగులు వేశాడు.

నాన్న కళ్ళల్లో ఆనందం చూడగానే వెంకట్రావ్‌కు మనసు ఆర్ద్రం అయిపోయింది. నాన్న అడిగినది చిన్న కోరిక, ఇన్నాళ్ళూ ఎందుకు ఆలశ్యం చేశానా అని నిందించుకుంటూ ఆఫీసుకు సిద్ధం అయ్యాడు. ఇలా ఇంకో వారం గడిచింది. ఈ వారంలో పద్మనాభం చిన్న పిల్లాడులాగా హుషారుగా, ఇంట్లో గడిపాడు.

చుట్టుపక్కల వాళ్ళ అందరికీ తన సొంత ఊరు వెడుతున్నానని, అక్కడ సంగతులు ఎంతో బాగుంటాయని చెప్పడం మొదలుపెట్టాడు.

అనుకున్నట్టుగానే పద్మనాభాన్ని, సుభద్రమ్మను విమానంలో తన స్వంత ఊరుకు పంపించాడు  వెంకట్రావ్. త్వరలో తను కూడా ఓ పది రోజులు ఉండటానికి శలవు పెట్టి అక్కడకు వస్తానని చెప్పి సాగనంపాడు. పద్మనాభంకు విమానం ఎక్కకుండానే గాల్లో ఎగురుతున్నట్టుగానే ఉంది.

సుమారు రెండేళ్ళు అయ్యింది సొంత ఊరు, స్వంత ఇల్లు చూసి, అక్కడ స్నేహితులను వదిలి, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మనసు పడ్డా తన ఊరి వైపు రాలేక పోయాడు.

అలా పాత జ్ఞాపకాలు నెమరు వేస్తుండగానే విమానం దిగడం కూడా అయిపోయింది. అక్కడ నుండి తన కొడుకు పురామాయించిన పెద్ద కారులో తన ఊరికి ప్రయాణం. మనసంతా ఏవో మధుర ఊహలు,  ఏదో తెలియని ఆనందం, ఆతృత అలా ఆలోచనలు తేలిపోతుంటే ఊరి పొలిమేర వచ్చింది.

ఇంక మూడు కిలోమీటర్లలో తన ఊరు. పక్కనే కాలువ, దానికి ఇరువైపులా పహరా కాస్తున్న సైనికుల్లా నిలువెత్తు కొబ్బరి చెట్లు, పచ్చటి రంగులో కొబ్బరి చెట్లపై రంగుల నంబర్లు. అంతా పచ్చదనమే.

అక్కడక్కడ బోడిగా చదును చేసిన రియల్ ఎస్టేట్ భూములు. ఊర్లోకి వస్తుండగానే పెద్ద, పెద్ద కాంప్లెక్స్‌లు, ఎన్నో కొత్త అపార్ట్‌మెంట్లు, ఇది వరకు పెంకుటిళ్లు అన్నీ మాయం అయిపోయాయి. వాటి స్థానే ఇరుకు అపార్ట్‌మెంట్లు, ఒంటి స్తంభం మేడలు తయారయి ఉన్నాయి.

అరె ఇది సుబ్బయ్య హోటల్ ఇక్కడ ఉండేది కదా? ఏమయ్యింది? అరె ఇక్కడ గడియార స్తంభం కొత్తగా మారిందేమిటి? అలా తలుచుకుంటూ తన వీధిలోకి కారు మలుపు తిరగటం, చుట్టూ ఉన్న పెద్ద, పెద్ద మేడలు, వ్యాపార సముదాయాలు చూస్తూ ఆశ్చర్యంగా నోరు వెళ్లబెడుతూ, ఎంతలో  ఎంత మార్పు. ఇదివరకు వాళ్ళు ఎవ్వరూ లేరేమో అన్నట్టుగా, లేక దారి తప్పి వేరే ఊరికి వచ్చానన్నట్టుగా అని అనుకుంటుండగా తన ఇంటి ముందు కారు ఆగింది.

విస్మయంగా తన ఇంటి వైపు చూస్తూ, తాత దగ్గరకు మనమడు పరిగెత్తుతున్నట్లుగా ఇంటి తలుపు తోసుకుని గబగబా వచ్చి మండువాలో సంబరంగా, మౌనంగా కూర్చుండిపోయాడు. ఎన్నాళ్ళయింది, ఈ వాకిలిలో నడిచి, ఈ గాలి పీల్చి, ఈ అనుభూతి పొంది , చుట్టూ పరికించడం మొదలు పెట్టాడు.

ఇంటికే మళ్ళీ జీవం వచ్చినట్లుగా , అన్నీ బాగు పడ్డాయి. గుమ్మాలు, అలమరాలకు నగిషీ ఇచ్చినట్లుగా, గోడలన్నీ కొత్తగా రంగులు వేయించినట్లుగా, నేలంతా సిమెంట్ పనులు పూర్తయి చక్కగా  ముస్తాబయ్యింది. తన కొడుకు దీన్ని ఎవరికో అప్పగించి ప్రత్యేకంగా చేయించి ఉంటాడని అర్థం అయ్యింది. పెరడు అంతా చక్కగా నీటుగా సద్ది ఉంది. వెనకాల వేడినీళ్ళ కోసం షెడ్  కూడా కొత్తగా తయారయ్యింది. అన్నీ చూస్తుంటే మన వెంకట్రావ్ బాగా ఖర్చు పెట్టాడేమో అని సుభద్రమ్మ వైపు తిరిగి అంటుంటే, సుభద్రమ్మ ఆయాసపడుతూ విసుక్కుంది.

“ఇంటిని చూస్తే అన్నీ మరచి పోవటమమేనా, కారులో సామాను అలా వదిలేసి, డ్రైవరుకు డబ్బులు ఏమీ ఇవ్వకుండా ఇలా వచ్చేయటమేనా? అన్నీ సద్దేటప్పటికి ఆయాసం వచ్చింది. మీ మాట పట్టుకుని అనవసరపు ఖర్చు మన అబ్బాయి పెట్టాడు.” అంటూ పద్మనాభంపై కోపం చూపుతూ మనసులో తన కొడుకుపై వాత్సల్యం పొంగుతుంటే చిన్నగా నవ్వుకుంది.

“నేను వాడికి ఒక రెండు లక్షల్లో ఇది కానివ్వమని చెప్పాను, ఇంకొంచెం అయి ఉంటుందిలే, ఎంతైనా వాడు నా వారసుడు”. అంటూ గర్వంగా పద్మనాభం.

“ఆ మా గొప్పేలే. మీకేనా వారసుడు. నాకు కొడుకు కాదా?” అంటూ దీర్ఘాలు తీస్తూ సుభద్రమ్మ తెచ్చుకున్న సామాన్లు సద్దుకోవటం మొదలుపెట్టింది.

ఇంతలో పద్మనాభం చేతిలో మొబైల్ మోగింది. అటునుండి వెంకట్రావ్ “నాన్నా! జాగ్రత్తగా చేరారు కదా, ఇంట్లో మీకు సాయంగా ఓ ఇద్దరు మనుషులు కూడా ఉంటారు, ఉన్నంత కాలం సరదాగా , హాయిగా ఉండండి. కానీ ఇక్కడ ఉన్నన్ని సౌకర్యాలు అక్కడ ఉండవు. పైగా మీకు అలవాటు తప్పింది అంత పెద్ద ఇంట్లో తిరగటం. వంటావిడను కూడా మాట్లాడాను. రేపటి నుండి వస్తుంది. కావాలిసినవి చేయించుకుని తినండి. అంతే కానీ అమ్మను వంట చేయమని ఇబ్బంది పెట్టకండి. నేనూ త్వరలో మీ దగ్గరకు వస్తాను. జాగ్రత్త” అంటూ పెట్టేసాడు.

పద్మనాభం కళ్ళల్లో ఆనందం ఇప్పుడు కదా కొడుకును కన్న గర్వం నాకు వస్తోంది అని అనుకుంటూ సావిట్లో తన తాతగారి మడత కుర్చీలో నెమ్మదిగా కూర్చున్నాడు.

కుర్చీను తడుముతూ ఉంటే అర్థం అయ్యింది, ఆ కుర్చీ కూడా మరమ్మత్తు అయి, కొత్త గుడ్డతో కనిపించింది. కొడుకును తలుచుకుంటూ తాత వడిలో కూర్చున్నట్లు ఆ పడక కుర్చీలో సేద తీరాడు. కాసేపటికి ఒక జంట వచ్చారు.

“అయ్యా! నా పేరు వీరయ్య, ఈమె నా భార్య లక్ష్మి. అబ్బాయి గారు మీరు ఇక్కడ ఉన్నన్నాళ్ళు  మీకు సాయంగా ఉండమన్నారు. ఇదే ఇంట్లో పక్క గదిలో ఉంటాము. రేపటి నుండి వంటకు వేరే ఆమె వస్తుంది” అంటూ సెలవిచ్చాడు.

వింటున్న సుభద్రమ్మ, పద్మనాభం దంపతులకు ఎంతో ఆనందం మనసు నిండా పొంగింది. తమ పుత్రుడు, వెంకట్రావ్ తమ గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడోనని.

పద్మనాభం సాయంత్రం తన అరుగు మీద కూర్చుని వచ్చేపోయే వాళ్ళల్లో తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఎవరో కొంతమంది వచ్చి బాగున్నారా అని పలకరించడం, ఎన్నాళ్ళు ఉంటారు అని అడగడం, పనిలో పనిగా ఈ ఇల్లు అమ్మేస్తారా అని అడగడం అన్నీ మౌనంగా నవ్వుతూ విన్నాడు. అలా ఆ రోజు మొత్తం గడిచింది.

మరునాడు ఉదయం నిద్ర లేవంగానే అన్నీ సౌకర్యాలు ఉన్నా పెరట్లో నూతి దగ్గరకు వెళ్ళి చలిగా ఉందని వద్దని వారిస్తున్నా, చన్నీళ్ల స్నానం చేసేశాడు. మంచి పంచె కట్టుకుని పెరడంతా కలియ తిరిగాడు.

ఇంతలో తన బాల్య స్నేహితుడు ప్రభాకరం రావటంతో ఇంటి సావిట్లోకి వస్తూ

“ఏరా ప్రభాకరం! బాగున్నావా? నీ భార్య కాలం చేసిందని నాకు తెలిసింది కానీ దూరభారం వల్ల వచ్చి కలవ లేకపోయాను. ఏమీ అనుకోకు.” అంటూ పలకరించాడు.

“పరవాలేదు రా. నువ్వు ఫోనులో మాట్లాడావుగా, మరచి నట్టున్నావ్. అయినా వయసు అయ్యిందిగా, చెట్టు నుండి ఆకులా రాలిపోయింది అంతే. అదృష్టవంతురాలు, హాయిగా వెళ్ళింది. నేనే ఇలా మిగిలాను.” అంటూ కాస్త నిర్వేదంగా ప్రభాకరం.

ప్రభాకరం భుజం తడుతూ అనునయంగా పద్మనాభం ఊరుకోపెట్టాడు. అలా వాళ్ళు ఇద్దరూ కబుర్లలో పడిపోయారు.

అలా కబుర్ల మధ్యే ప్రభాకరం పరిస్థితి బాగోలేదని తెలిసింది. కొడుకు, కోడలు ఎక్కడో విదేశాల్లో. ఇక్కడకు వచ్చే పరిస్థితి ఎప్పుడో రెండేళ్ల కొకసారి. ఇక్కడ ఉన్న సొంతిల్లు, మిగతా ఆస్తులు అమ్మేసి చిన్న ఫ్లాట్ ఒకటి కొని ప్రభాకరంను అందులో వదిలేసి వాళ్ళు మిగిలిన డబ్బుతో విదేశాలు చెక్కేశారు. ప్రభాకరం తనకు వస్తున్న అరకొర పెన్షన్‌తో తన శేష జీవితాన్ని నడుపుకు వస్తున్నాడు. రోజూ ఒక పూట హోటల్ నుండి భోజనం, రెండో పూట ఏదో వండుకు తిని కాలం గడపడం దినచర్య అయిపోయింది. ప్రభాకరం స్థితి తెలియగానే చాలా భాధ పడ్డాడు.

అలా పద్మనాభం ఆ ఇంట్లోకి వచ్చి నెల రోజులు గడిచిపోయాయి. పద్మనాభం ఊళ్ళోకి వచ్చినట్లు తెలిసిన స్నేహితులు అందరూ రోజూ కలవటం, సాయంత్రాలు సరదా కబుర్లతో కాలక్షేపం గడిచిపోయింది. ఇన్నాళ్ళూ వేరే ఊరి వెళ్ళిన గోవిందం పద్మనాభంను కలవటానికి ఆ రోజు ఉదయం వచ్చాడు.

“అయ్యగారు బాగున్నారా? అంతా సౌకర్యంగా ఉందా? నేను ఊళ్ళో లేను, అందుకే కలవలేకపోయాను. ఎలా ఉన్నారు? ఇంట్లో ఇంకా ఏమైనా మరమ్మత్తులు, మార్పులు చేయాలంటే చెప్పండి. చేయించేస్తాను.” అంటూ  పద్మనాభం పడక కుర్చీ దగ్గర నిలబడ్డాడు తన మనవడితో.

“బాగున్నా గోవిందం, ఇన్నాళ్ళకు వచ్చావా? ఈ కుర్రాడు మీ మనవడా, బాగున్నాడయ్యా.” అంటూ గోవిందం ఆరేళ్ళ మనవాడిని చేతిలోకి తీసుకుని గోవిందాన్ని కూర్చోమని అక్కడే ఉన్న చెక్క పీట చూపించాడు.

“గోవిందం! మా ఇల్లు బాగా చేయించావయ్యా, అన్నీ పనులు బాగా చేయించి ఈ ఇంటికి ఇంకొన్నాళ్ళు జీవం వచ్చి, జీవితం ఉండేలా చేశావ్. మా వాడు నీకు అప్పగించి మంచి తెలివయిన పని చేశాడు. ఇంతకూ దీనిని బాగు చేయించడానికి ఎంత అయ్యిందంటావ్? ఒక ఐదు లక్షలు అయ్యిందా? అన్నీ నువ్వే దగ్గరుండి చేయించావా? చాలా సంతోషంగా ఉందయ్యా!”అంటూ పద్మనాభం మాట్లాడాడు.

“అయ్యా! అన్నీ నేను చేయించడం ఏమిటయ్యా? నేను చేసింది తక్కువే. కానీ మీ అబ్బాయి ఇక్కడే పదిరోజులు ఉండి చేయించుకున్నాడు. ఐదు లక్షల్లో ఎక్కడ అవుతుంది. పాతిక లక్షల ఖర్చు పెట్టాడు. అప్పటికీ మేమంతా ఇంకా ఎందుకు ఈ పాత ఇంటికి పెట్టుబడి అని అన్నాం కానీ , మౌనంగా నవ్వుతూ చేయించాడు. ఇక్కడ పని ఒక కొలిక్కి వచ్చిన తరువాత నాకు అప్పగించి వెళ్లాడు. పని అవ్వడం మాత్రమే నేను చూశాను. అంతా అయినా తరువాత మిమ్మల్ని ఇక్కడకు వెళ్ళడానికి అనుమతించాడు. ఏం? మీకు ఈ విషయాలు ఏమీ తెలియవా? మీరంటే మీ అబ్బాయికి మహా ప్రాణం. చాలా మంచి కొడుకును మీ దంపతులు కన్నారయ్య.” అంటూ వినయంగా గోవిందం జవాబిచ్చాడు.

ఆ మాటలు విన్న తరువాత పద్మనాభంకు నోట మాట రాలేదు. కేవలం తను ఉండటం కోసం ఈ పాత ఇంటికి ఇంత ఖర్చు పెట్టాడా? ఏదో ఉద్యోగం పని మీద ఊరు వెళ్ళాడు అనుకున్నాం కానీ ఇక్కడకు వచ్చి ఈ పని దగ్గరుండి చేయించాడా? అంత పెద్ద ఉద్యోగంలో ఉండి ఖాళీ కుదుర్చుకుని రావడం నిజంగా గొప్పే? ఒక పక్క ఆనందం, మరోపక్క ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బులయ్యాడు. సుభద్రమ్మ దగ్గర ఇదే విషయం పదే, పదే చెప్పి, కొడుకుని చూడాలని తలుచుకుంటూ కొడుకుకి ఫోన్ చేశాడు.

“ఒరేయి. వెంకట్రావ్ నిన్ను చూడాలని ఉందిరా. ఇక్కడకు వస్తానని చెప్పావుగా, మేము ఇక్కడకు వచ్చి సుమారు రెండునెలలు కావస్తోంది. నువ్వు తొందరగా రారా.” అంటూ వెంకట్రావుకు ఆర్డర్ వేశాడు.

“సరే నాన్నా. ఈ శనివారం విమానంలో మేము ఇద్దరం మన ఊరు వస్తాం. మీకు అక్కడ అన్నీ సదుపాయాలు సరిగ్గానే ఉన్నాయిగా? ఆరోగ్యం బాగానే ఉందిగా?”అని వెంకట్రావ్ అడుగుతుంటే

“ఒరేయి. నేను బాగానే ఉన్నాను. కంగారు ఏమీ లేదు. నువ్వు, కోడలు కలసి వెంటనే రండి.” అంటూ పద్మనాభం ముక్తాయించాడు.

మూడు రోజులు గడిచాయి, వెంకట్రావ్ వచ్చే లోపు పద్మనాభంకు ఏదో ఆనందం, ఆతృతతో కలబోసి కొడుకును ఎప్పుడు చూద్దామా అని కళ్ళల్లో వత్తులు పెట్టుకుని ఎదురు చూశాడు.

అనుకున్నట్టుగానే వెంకట్రావ్ దంపతులు విమానంలో సొంత ఊరుకు వచ్చారు. మధ్యాహ్నభోజనాలు అన్నీ అయిన తరువాత వెంకట్రావ్ చేయి పట్టుకుని ఇల్లంతా కలియ తిరిగటం మొదలు పెట్టాడు.

“ఒరేయి, నాకు ఉద్యోగం వచ్చే ముందు ప్రవేశ పరీక్షలకు ఈ మండువాలో ఇక్కడే కూర్చుని తర్ఫీదు అయ్యే వాడిని. ఇది మా తాతగారి మంచం, నేను నువ్వు ఇక్కడే పుట్టాం. ఈ మడత కుర్చీ మా పెద్ద తాతగారిది, మన తాతగారికి ఇచ్చారు. ఇక్కడ మా చిన్నప్పుడు వడ్ల గాదె ఉండేది. పొలం నుండి ధాన్యం తీసుకు వచ్చి అందులో పోసేవారు. ఇక్కడే వేసవికాలం వస్తే రాసేడు మామిడికాయలు పోసి ఊరగాయ పెట్టేవారు, పెద్ద జాడీ నిండా మా అమ్మ ఆవకాయ పెట్టేది.” అంటూ కనిపించిన ప్రతీ వస్తువు పైన ఒక్కో కథ చెప్పడం మొదలు పెట్టాడు. అలా ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకున్న తరువాత అలసి పందిరి మంచం మీద కూర్చున్నారు.

“ఒరేయ్ వెంకట్రావ్! ఈ పాత ఇంటికి, అంత ఖర్చు ఎందుకు పెట్టావురా? పాతిక లక్షలు అయ్యిందటగా? నేను ఏదో ఓ ఐదు లక్షలు అయితే సరిపోతుందని భ్రమ పడి నిన్ను తొందర పెట్టాను. ఇంత అవుతుందని అనుకోలేదు. అనవసరంగా నీ చేత ఎక్కువ డబ్బులు దుబారా చేయించాను. పైగా నువ్వు పది రోజులు శలవు పెట్టుకుని దగ్గరుండి మరీ ఈ పని చేయించావు. శ్రమ పెట్టాను కదరా. ఏమీ అనుకోకు.” అంటూ నెమ్మదిగా వెంకట్రావ్ చేయి తన చేతుల మధ్య పట్టుకుని సంజయషీ ఇస్తున్నట్టుగా చెప్పాడు పద్మనాభం.

“అయ్యో. నాన్నా. మీరు అలా అంటారేమిటి. అయినా మన ఇంటి కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టగల స్తోమత మనకు ఉంది. పైగా మీరే అంటారుగా ఈ ఇల్లు మా తాత అని. తాత బ్రతికి ఉంటే , ఆరోగ్యం కోసం వైద్యం చేయిస్తాం కదా. ఇదీ అంతే. దగ్గర ఉండి చేయిస్తే బాగా ఉంటుందని నేనే శలవు పెట్టుకుని వచ్చి చేయించాను.

మీరు ఆర్డర్ వేయాలి, నేను చేయాలి. మీకు ఈ ఇంట్లో ఉండటం ఆనందం, ఈ వయసులో మీరు ఆనందంగా ఉండటం నాకు ఇష్టం, ఆనందం. అందుకే మీ ఆనందం కోసం అలా చేశాను. ఇంతకూ మీకు నచ్చిందిగా. ఈ ఇల్లు వీలు కుదిరినంత కాలం ఇలా బాగు చేయించి కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఇది మన ఇంటి వారసత్వంగా వచ్చే తరాలకు అందేలా చూస్తాను. మీరు హాయిగా ఉండండి. నేనేమీ పెద్ద గొప్ప పని చేయలేదు” అంటూ అనునయంగా చెప్పాడు వెంకట్రావ్.

వెంకట్రావ్ మాటలకు పద్మనాభం ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నీళ్ళు రావటం మొదలయ్యాయి. ఇంతలో గోవిందం తన మనుమడితో సావిట్లోకి రావటం చూసి ఇద్దరూ అక్కడకు వచ్చారు. పద్మనాభం మడత కుర్చీలో కూర్చోబోతూ కర్ర ఊడపీకిన కారణంగా దబ్బున క్రింద పడ్డాడు.

గోవిందం మనవడు గలగలా నవ్వుతూ అక్కడినుండి మండువాలోకి పారిపోయాడు. దబ్బున పడ్డ పద్మనాభం “ఒరేయ్ ఆ గడుగ్గాయిని పట్టుకోండిరా.” అంటూ చిన్నపిల్లడిలా నవ్వటం మొదలు పెట్టాడు.

“అయ్యో నాన్న.. ఏమీ అవ్వలేదు కదా” అని వెంకట్రావ్ కంగారుగా అంటుంటే

“ఏమీ లేదురా. ఈ మనవడితో ఈ సరదా బాగుంది. ఇలాగే ఈ జీవితం కొనసాగాలి” అంటూ నెమ్మదిగా లేచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here