పెరటి గోడ

0
9

[dropcap]“రే[/dropcap]పొక్క రోజుకూ ఓపిక చెయ్యి. తెల్లవారు ఝామున బయల్దేరదాం. ఆలస్యమైనదంటే రద్దీ తట్టుకోలేం. విష్ణాలయాలన్నీ అన్నిచోట్లు రేపు కిటకిటలాడుతూ ఉంటాయి” అన్న శారద మాటలకు “సరే అలాగే వెడదాం” అంటూ అన్నపూర్ణ ఫోన్ పెట్టేసి కుర్చీలో కూర్చున్నది. వైకుంఠ ఏకాదశి అనగానే తనకు అమ్మమ్మా, ఆమె చేసిన పూజా పునస్కారాలూ గుర్తుకొస్తాయి. అన్నపూర్ణ మనసు గతంలోకి వెళ్లింది.

“ఏమేవ్ వనజాక్షి ఏం చేస్తున్నావు? ఓసారిలా రా”.

భాగ్యలక్ష్మి గొంతు వినగానే బన్నీ ముక్కతో తడి గిన్నెలన్నీ తుడిచి ఎండపొడలో ఆరబెట్టే వనజాక్షి నీళ్లతో చేతులు కడుక్కుని వచ్చింది, “ఏంటక్కయ్య పిలిచారూ?” అంటూ.

గోడకిటువేపు భాగ్యలక్ష్మి అటువేపు వనజాక్షి. ఇద్దరిళ్ళకూ మధ్య అడ్డు గోడ వున్న మాట నిజమే కాని అది పెద్ద ఎత్తేం లేదు. పిల్లలు తేలిగ్గాను, పెద్దవాళ్లు ఎత్తు పీటొకటి వేసుకుని అటూ, ఇటూ తేలిగ్గా దాటేయొచ్చు

“ఇదుగో ఈ పులుసు గిన్నె తీసుకో. మరింత బెల్లం వేసి చేశాను. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ గిన్నె ఇద్దామనే పిలిచాను. ఇంకా పని కాలేదా? రెండు ఝాములవుతుంది. పిల్లలందరూ ఇళ్ల దగ్గరే వుంటారుగా ఆదివారం కావటం మూలాన, త్వరగా తెమిలి అన్నాలు తినండి. వస్తా” అంటూ తమ ఇంటి లోపలికి వెళ్లింది భాగ్యలక్ష్మి. ఆమె వెనుదిరిగి వెళ్తుంటే ముచ్చటగా చూసింది వనజాక్షి. జారుముడి వేసుకున్న నొక్కులు, నొక్కుల వెంట్రుకలు, జారుముడిలో ఇమిడిన నందివర్ధనం పువ్వు, గోచీ పోసి కట్టుకున్న నెమలి పింఛం రంగుతో వున్న సన్నంచు వరయూరు నేత చీర. పమిట చాటు నుండి కనపడుతున్న పుస్తెలతాడూ, లక్ష్మీదేవి బొమ్మతో వున్న వరహా కాసులు చేర్చి గుచ్చబడిన నల్లపూసల దండా ఆమె కంఠానికి మరింత అందాన్నిస్తున్నాయి. పసుపు రాసుకున్న పాదాల మీద అమరిన పూసలు పొదిగిన కాలి పట్టీలు, వేళ్లకు మట్టెలు. అక్కయ్య మీదున్న ఇష్టంతో ఆమె లోపలికి వెళ్లిందాకా ఆగి గోడమీదున్న గిన్నె తీసుకుని లోపలికి వచ్చింది వనజాక్షి.

“బ్రాహ్మనాళ్లతో నీకు పోటీ ఏంటి? వాళ్ల లాగా స్నానం చేసి అన్నం, కూరా వండుతానంటావు. మనకు గొడ్డూ గోదా వున్నాయి. మగవాళ్లు ఇంటి దగ్గర లేనపుడు జీతగాడు రానపుడు గొడ్ల చావిట్లోకి వెళ్లాలి. వాటి ముందు మేత వేసి రావాలి. కుడితి పెట్టాలి. పేడ కళ్లు ఎత్తాలి. టయానికి పాలు పితికి తెచ్చుకోవాలి. ఇన్ని పస్తుంటే పూజలూ, పునస్కారాలు చేసి, వంట చేయటం కుదిరే పనేనా? లేని పోని ఆలోచన్లు చేయకు.”

“లేదత్తా స్నానం చేసి దేముడి ముందు దీపం పెట్టుకుంటే ఆ దీపం కాంతి బాగుంటుంది. పెందలాడే ఇల్లంతా శుభ్రపడుతుంది. నేను అన్ని చోట్ల పన్లు టయానికి చేసేస్తాగా” అంటూ ఇత్తడి తపేలలోకి సరిపడా ఎసరు పోసి పొయ్యి కెక్కించింది.

“నీ చాదస్తం రోజు రోజుకూ ఎక్కువయి పోతుంది. కట్టె పేళ్ల మసి తోముకుంటే పోదూ? తోమిన తప్పేలా చుట్టూతాను, అడుగు భాగంలోనూ, తడిమట్టి పూసి, దాని మీద బూడిద చల్లి ఆరబెడతావు. ఆరిన తప్పేలా లోకి ఎసరు పోసి పొయ్యి కెక్కిస్తావు. అన్నం వుడికిన తర్వాత నాలుగు అన్నం మెతుకులు తీసి నెయ్యి చేర్చి పాయిలో వేసి దణ్ణమెట్టు కుంటావు. ఆ తర్వాత పాత బట్టతో తప్పాలాకున్న బూడిదంతా తుడిచి లోపల పెడతావు. ఎప్పుడు చూచినా మసేమీ అంటకుండా పాత్రలన్నీ శుభ్రంగా మెరవాలంటావు. నీచు కూరలు తిననే కూడదంటావు.”

“ఇవన్నీ మంచి పన్లేగా అత్తా, చిన్నప్పుడే ఇక్కడికి కాపురానికొచ్చాను. ఆ యేడే భాగ్యలక్ష్మి అక్కయ్య కూడా కాపురానికొచ్చింది. మా ఇద్దరికీ బాగా కలిసిపోయింది. ఈ విషయాలన్నీ అక్కయ్యను చూసే నేర్చుకున్నాను. నన్నూ, పిల్లక్షీ అక్కయ్య ఏనాడూ ఎడం పెట్టనేలేదు. వాళ్లిల్లు అంతా అంటూ, సొంటూ ఏం లేకుండా తిరుగుతాం. మనింట్లో అంతా బాగానే జరిగి పోతుందిగా. మీ కెవ్వరికీ ఏ పన్లూ అలీసెం కావటం లేదు. మామయ్య మాత్రం నన్ను గుళ్లూ గోపురాలకు ఎక్కువగా వెళ్లనివ్వటం లేదు. అయన్నీ బాపనోళ్లు చేసే పన్లు అంటున్నాడు. మనింట్లో ఆడాళ్లను బయటికి ఎక్కువగా పంపరు ఎందుకని?”

“అందరిళ్లలో బాగానే తిరుగుతారు. మీ మావయ్యకే ఇష్టం వుండదు మనం ఆట్టే బయటి కెళ్లటానికి. నీ మొగుడూ ఏం మాట్లాడడు. ఇలాగే కానీ, ఏదో జరిగిపోతుందిగా కాలం.”

కులాల అంతరాలున్నా భాగ్యలక్ష్మికి, వనజాక్షికి స్నేహం పెరిగిందే కాని, తరగలేదు. మగవాళ్ల మధ్య ఇరుగు పొరుగుల సంబంధాలే కాని ఒకరి కొకరు దగ్గరయ్యేంత చనువు పెరగలేదు. ఈ ఇంటి పిల్లలు ఆ ఇంటికీ, ఆ ఇంటి పిల్లలు ఈ ఇంటికి పెరటి మధ్య నున్న చిన్న గోడ దూకి రాకపోకలు చేస్తూ వుండేవాళ్లు. ఆ బజారే బ్రాహ్మణ బజారు. అటూ, ఇటూ అంతా బ్రాహ్మణ కాపురస్తులు, వెంకటాద్రి గారి దొక్కటే కమ్మవారి కుటుంబం. వెంకటాద్రి గారి ఇంటి ఆవరణలోకి ముందు భాగంలో ధాన్యపు కొట్టూ, వెనుక భాగంలోకి భాగ్యలక్ష్మి గారి చుట్టు వంటిల్లూ చొచ్చుకు వచ్చి కనబడతాయి. ఇంటి స్థలం సరిపోకపోతే వెంకటాద్రిగారి చిన్నప్పుడే కొంత స్థలాన్ని పొరుగునున్న బ్రాహ్మణ కుటుంబానికి ఇచ్చివేయటం వలన అలా వాళ్ల కట్టడాలు పొరిగింటిలోకి చొచ్చుకు వచ్చాయని చెప్తారు.

“స్నానం చేసే కదా నేనూ వంట చేస్తాను. ఆవు ఈనింది. గట్టి జున్ను నీకు కుదరదేమోనని నేనే వండాను. తినండక్కయ్యా” అంటూ జున్ను గిన్నెను గోడ మీద పెట్టింది వనజాక్షి.

“నీ మొహం నేనెప్పుడన్నా తిననన్నానా? కొన్ని పాలు విడిగా వుంచే వుంటావుగా, అవి తీసుకొనిరా, మీ బావగారికి, అత్తయ్యగారికి, మామయ్య గారికి నేనే వండుతాను. వాళ్లు వేరే వాళ్లు చేసినవి తినరు. నీకు తెలుసుగా?”

‘ఏమిటి? నేనూ స్నానం చేసే గదా వండేది అనుకుంటూ’ అలవాటు ప్రకారం విడిగా వుంచే జున్ను పాల చెంబును గోడ దగ్గరకు తెచ్చిచ్చింది.

“శివరాత్రి పెందలాడే గుడికెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చెయ్యమను కోడల్ని. ప్రొద్దుపోయి జరిగే శివపార్వతుల కళ్యాణానికి ఏం వుండలేదు. వెడితే నువ్వు కూడా గుళ్లోకెళ్లి దేముడ్ని చూసి పెందలాడే వచ్చెయ్యండి” అంటూ పెద్దగా వినపడే మామగారి మాటలకు ‘ఈయెనెప్పుడూ ఇలాగే మాట్లాడతారు’ అనుకుంది. దానికి తోడు “నాన్న చెప్పాడుగా అలాగే చెయ్యండి” అనే భర్త మాటలు. ‘వీళ్లు మాత్రం మారరు’ అనుకున్నది వనజాక్షి. మాలాంటి మధ్య తరగతి కుటుంబాలలో మాటలు కూడా తక్కువగా మాట్లాడతారు రాబోలు అనుకునేది భర్త మితభాషిత్వాన్ని చూసి.

క్రమంగా పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. చందమామ, బాలమిత్ర లాంటి మాసపత్రికలూ, ఆంధ్రప్రభా ఆంధ్రపత్రిక లాంటి వారపత్రికలూ తెప్పించేవాళ్లు భాగ్యలక్ష్మి ఇంట్లో. అవీ గోడదాటి వనజాక్షి పిల్లల చేతుల్లోకి వచ్చేవి, కార్తీక పురాణం, బ్రహ్మంగారి కాలజ్ఞానం తను చదివి వనజాక్షికిచ్చేది.

ఆదివారాలు వచ్చినప్పుడు బొమ్మల పెళ్లిళ్లు చేసేవాళ్ళు, ఇళ్ల పెరట్లో జేరి రెండు కుటుంబాలకు చెందిన పిల్లలంతా ఆటల్లోకి, బొమ్మల పెళ్లిళ్లకూ కావలసిన వంటలు, పిండి వంటలూ చేసిచ్చే బాధ్యత వనజాక్షిదే. పెరట్లోని అరిటాకులు కోసి కడిగి వుంచేది. అప్పటికప్పుడు వండిన వేడి వేడి అన్నం వండి, అల్లం పచ్చడితో వడ్డించేది. చిక్కటి నిమ్మకాయ మజ్జిగ కలిపి తెచ్చేది. “అన్నం మెత్తగా చెయ్యండి. మజ్జిగ బాగా కలుస్తుంది” అని చెప్పేది. కమ్మని ఆ బొమ్మల పెళ్లి భోజనాలు ఇరు కుటుంబాల పిల్లలకు బాగా గుర్తుండిపోయాయి.

భాగ్యలక్ష్మి అంత పచ్చగా వుండేది కాదు వనజాక్షి. ఆమె ప్రక్కన చాయ తక్కువగా వుండేది. భాగ్యలక్ష్మి అత్తగారు అనసూయమ్మగారు. కోడలు పొరుగునున్న కమ్మ కుటుంబంతో అందునా వ్యవసాయ కుటుంబంతో అంత చనువుగా వుండటం ఆమెకేమంత నచ్చేది కాదు. “ఆ వనజాక్షి నల్లగా వుంటుంది. వాళ్లు ఉల్లిపాయలనీ తింటారు. వాళ్ల చర్మం కూడా, ఆ వాసనే వేస్తూ వుంటుంది. మీ అమ్మేమో దానితో రాసుకుని, పూసుకుని, తిరుగుతుంది. మరీ అంటూ, సొంటూ లేకుండా పోతుంది. ఆ యింట్లో వాళ్లకేం పని ఇక్కడ? బయటి నుంచే మాట్లాడి పంపించెయ్యక నట్టింట్లో దాకా రాబడుతుంది మీ అమ్మ. మీరైనా రాసుకుని, పూసుకుని తిరగటం మానండి. ఇది బ్రాహ్మల కొంప. కాస్త గుర్తు పెట్టుకుని ఏడవండి” అంటూ పిల్లల దగ్గర అజమాయిషీ చెయ్యబొయ్యేది. “ఎప్పుడో ఇంటి జాగా కాస్త కలిపారంట. కలిపిందానికి తృణమో, పణమో తీసుకునే వుంటారుగా. మనమంతా ఇప్పటికి పొరుగు వారి మంచితనాన్ని గుర్తు పెట్టుకోవాలని మీ తాతగారు చెప్తున్నారు. స్థలం మన కివ్వటం వలనే వాళ్ల ఇంటికి ఈశాన్యం తగ్గిపోయిందట. నా శ్రాద్ధమేం కాదూ?” అంటూ గొణుగుతూ వుంటుంది ఆమె.

“పిన్నీ! పిన్నీ! నువ్వు నల్ల పిన్నివా? నేను రేపట్నుంచి నిన్ను అట్లాగే పిలుస్తాను. నాకు బాగుంది, నల్ల పిన్నీ” అంది పదేళ్ల ఉమ పక పక నవ్వుతూ,

వనజాక్షికి ముందేం అర్ధం కాలేదు.

“ఛ నోర్ముయ్, బయటి కెళ్లి ఆడుకో” అని కసిరింది ఉమను భాగ్యలక్ష్మి.

“ఏమిటయ్యా! ఉమ ఏదో అంటున్నది నల్ల పిన్నీ అంటూ.”

“ఏం లేదులే వనజాక్షి దాని మాటలకేం గాని, తెలియక ఏదో వాగుతుంది. పట్టించుకోకు”.

“ఏం కాదు. నాకు బామ్మే చెప్పింది. వనజాక్షి నల్లగా వుంటుందని, అందుకే నేను నల్ల పిన్నీ అన్నాను.”

వనజాక్షి ఒక్క క్షణం చిన్నబుచ్చుకున్నా వెంటనే నవ్వేసింది. “అలాగే పిలువు ఉమా. నాకు బాగానే వుందిలే” అంది.

అలా తమ నోటి వెంట ఎప్పుడు వనజాక్షిని పిలిచినా ‘నల్ల పిన్నీ!’ అనే పదమే వచ్చేసేది.

పిల్లలు యుక్త వయస్కులయ్యారు. ఆ ఇంట్లో, ఈ యింట్లో ఆడపిల్లలకు పెళ్లిళ్లయ్యాయి. ఉమ పెండ్లప్పుడు పెండ్లి శుభలేఖ ఇచ్చారు వెంకటాద్రి కుటుంబానికి. వచ్చి భోజనాలు చెయ్యమనీ చెప్పారు. కాని తమ బ్రాహ్మణ బంధువులతో కాకుండా విడిగా కూర్చోబెట్టి భోజనాలు పెట్టాలన్న సంగతి భాగ్యలక్ష్మికి బాగా గుర్తుంది. అందుకే తన నోటితో వీళ్లనెవరినీ భోజనానికి రండని చెప్పలేదు. తమను పెండ్లి కూతురును చేసేటప్పుడు వనజాక్షి, వాళ్ల అత్తగారూ, వెళ్లి అక్షింతలు మాత్రం వేసొచ్చారు. మగవాళ్లు మాత్రం తాటాకుల్తో పెండ్లి పందిరి వేసేటప్పుడు కాసేపు నిలబడి వచ్చారు. ఆ తర్వాత విడిదింటికి వెళ్ళి పెండ్లి కొడుకును పెండ్లి మంటపానికి తోడ్కొని వచ్చే బంధువులతో కల్సి వెళ్లి, వరునికి స్వాగతం చెప్పి, పెండ్లింటి వరకూ అందరితో కలసి వచ్చి, ఆ తర్వాత తమ ఇంటిలోపలి కొచ్చేశారు.

అంత హడావుడిలోనూ పూట పూటా వంటకాలన్నీ గిన్నెల్లో సర్దించి మనిషి చేత గోడ మీద నుంచే వనజాక్షి ఇంటికి చేరవేయించింది భాగ్యలక్ష్మి.

వనజాక్షి కూతుళ్ల పెళ్లిళ్లకూ అదే పరిస్థితి. “మా ఇంట్లో మీరంతా భోం చేస్తారా? అక్కా! ఎవరైనా వంట బ్రాహ్మణ్ణి పిలిపించి మీ కోసం వంట చేయిస్తాం”.

“నువ్వు అలాంటి వేం పెట్టుకోకు. మీ బావగారు గుళ్లో అర్చకత్వం చేస్తారుగా. ఇలాంటి వన్నీ బాగుండవు. ఏ ఫలహారమో చేసినా పెద్ద వాళ్లు గోలపెట్టేస్తారు. పెళ్లి భోజనాలకు కావల్సిన లడ్డూ, అరిసెలూ చేసేటప్పుడూ నేను దగ్గరే వుండి చెప్పి చేయిస్తారు. అన్ని పనుల్లోనూ మీ అత్తా కోడళ్లకు తోడుంటాను. మా భోజనాల దేముందిలే వనజాక్ష్మి నువ్వవన్నీ ఆలోచించకు.”

“ఉమా వాళ్లకు పెళ్లి శుభలేఖ పోస్టులో వేశారు. మా ఇంట్లో పెళ్లికి తనైనా వస్తుందా అక్కయ్యా?”

“ఇంట్లో ఒప్పుకుని పంపాలిగా చూద్దాం” అంటూ మాట దాటేసింది భాగ్యలక్ష్మి, పెండ్లి భోజనాలు చెయ్యటానికి పూజారిగారి కుటుంబం రాదు కాబట్టి బియ్యం, నెయ్యి, పప్పు, కూరగాయలు, విస్తరాకులతో సహా స్వయంపాకం భాగ్యలక్ష్మి ఇంటికి చేర్చించింది వనజాక్షి,

“వనజాక్షి ఇలారా. ఇదుగో చూడు. నువ్వెప్పుడూ గుడికి సరిగా వెళ్లవు గదా? ఇవిగో వీటన్నింటినీ పరీక్షగా చూడు. ఇవి అమ్మవారి నగలు. ఇవి అయ్యవారి నగలు. ఇది దక్షిణావృతశంఖం. ఎక్కడో తప్పితే, ఇలాంటి శంఖాలు వుండవు. ముక్కోటినాడు ఈ శంఖాన్ని తీసి వాడతారు. ఆ రోజున ఈ శంఖంతోనే తీర్థాన్నిస్తారు. చెవి దగ్గర పెట్టుకుని చూడు, ఓం అని విన్పిస్తుంది. ఇప్పుడు అర్చకత్వం మా వంతు కదా? కాబట్టి వీటిని మా ఇంట్లో దాచిపెడతాం. ఇలా నీకు చూపించానని ఎక్కడా చెప్పకు” అంటూ రహస్యంగా చూపించి వాటిని గురించి వివరించింది.

ఆ ఆభరణాలను, అపూర్వమైన దక్షిణావృత శంఖాన్ని చూస్తూ వనజాక్షి ఆనంద పరవశురాలయ్యింది. భాగ్యలక్ష్మి అక్కయ్యకు తనంటే ఎంత ప్రేమ! తను ఏమిచ్చి ఆమె ప్రేమకు బదులు తీర్చుకోగలుగుతుంది? ఏ జన్మలోనో తామిద్దరూ స్వంత అక్క చెల్లెళ్లయివుంటారు అనుకున్నది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి విని భాగ్యలక్ష్మి గబగబా వాటిని సర్దేసుకుని లోపలకు వెళ్లిపోయింది. రెండిళ్లలోనూ పెద్దవారంతా ఒక్కొక్కరూ కాలం చేశారు. పిల్లల పెళ్లిళ్లు చేసి రెండిళ్లలోనూ అటు భాగ్యలక్ష్మి ఇటు వనజాక్ష్మి పెద్దరికపు హోదాను సంతరించుకున్నారు. అటు పూజారిగారు, ఇటు వ్యవసాయం చేసుకునే వనజాక్షి భర్త ఇద్దరూ పూర్వంలాగానే వుంటున్నారు. ఎప్పుడైనా ఎదురు పడితే చిన్నగా నవ్వుతో పలకరించుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతుంటారు, అంతే. వనజాక్షి కొడుకులిద్దరూ ఉద్యోగాల నిమిత్తం వేరే వూళ్లలో తమ తమ కుటుంబాలతో వుంటున్నారు. కూతుళ్లు కాపురం చేసుకుంటూ అత్తవారింట ఉంటున్నారు. ఇటీవల అకస్మాత్తుగా భర్తా మరణించాడు. ఆమె ఒంటరిదయ్యింది. ఉన్న ఊరూ తన ఇల్లూ, వాకిళ్లు వదిలిపెట్టి ఎక్కడికి తరలి వెళ్లాలని లేనే లేదు వనజాక్షికి. భాగ్యలక్ష్మి సలహాతో గుళ్లకూ, గోపురాలకూ తిరుగుతుంది. పూజలూ, ఉపవాసాలూ ఎక్కువయ్యాయి.

పిల్లలు వచ్చినప్పుడల్లా చెప్తున్నారు “ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, తరువాత ఉపవాసాలుండి పూజలు చేద్దువుగాని” అంటూ.

ఇన్నాళ్లూ తనకు ఆంక్షలు పెట్టి తనను చేయనివ్వని పనులన్నింటిని ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నది. మనిషి పుట్టాక కాస్తన్నా పుణ్యం సంపాదించుకోవాలని తాపత్రయ పడుతున్నది. తనకు వీలైనంతలో దానధర్మాలూ చేస్తున్నది. కార్తీకమాసం నెలా తెల్లవారు ఝామునే లేచి నాలుగ్గంటలకే చన్నీళ్ల స్నానం చేసి గుడికెళ్లి నిత్యాభిషేకంలో పాల్గొనేది. పగలంతా కార్తీక పురాణంతో కాలక్షేపం చేసేది. సంధ్యా సమయంలో మరలా దీపం పెట్టి విష్ణు సహస్రనామ పారాయణ మొదలుపెట్టేది. శివాష్టకం, లింగాష్టకం కంఠతా వచ్చు గాబట్టి, అలవోకగా స్మరించుకునేది. ఆచరించింది. నమకం చమకం కూడా బాగా ఒంటబట్టించుకున్నది.

“మీ బావగారు అర్చకత్వం ఆ నెల్లాళ్లూ ఒక్క ప్రొద్దే తింటూ నక్తాళ్లను నిష్ఠగా చేస్తూ చదివే మంత్రాల కన్నా నువ్వెక్కువ పారాయణ చేస్తున్నావేమోననిపిస్తుంది నాకు” అన్నది భాగ్యలక్ష్మి.

“తప్పు తప్పు అలా అనకక్కయ్యా! అక్షరాలు కూడబలుక్కుని చదివే నేనెక్కడ? అన్ని శాస్త్రాలూ వంట బట్టించుకున్నవారెక్కడ? ఎప్పుడూ అలా మాట్లాడబోకక్కయ్యా” అంటూ లెంపలేసుకున్నది.

పుష్యమాసంలో ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఒంట్లో నలతగా వున్నా ఉత్తరద్వార దర్శనం చేసి సర్వేశ్వరుడ్ని దర్శించుకుని తెల్లవారకుండానే ఇంటి కొచ్చింది. ఉపవాసమున్నది. మర్నాడు ద్వాదశి పారాయణం చేసి పంతులుగారికి సంభావన ఇచ్చి ఆ రోజంతా పూర్తి ఉద్యాపన చెప్పించుకుని ఉపవాసం విరమించాలని అనుకున్నది. పెందలాడే రమ్మని పంతులుగారికి కబురు పంపింది. పంతులు గారికిచ్చే సంభావన కోసం కావాల్సిన సంబరాలన్నీ సిద్ధం చేసుకున్నది. పెరట్లో తోటకూర కాడలు తెంపి కట్టగా కట్టింది. పచ్చి అరటి కాయలూ, అరటి ఆకులు అన్నీ సిద్ధం చేసుకున్నది. బియ్యమూ, నెయ్యి, పప్పు అన్నీ సిద్ధం చేసి తాటాకుల బుట్టలో సర్దింది. ఉదయం పదకొండు గంటలయ్యింది. నాలుక పిడచ కట్టుకుపోతున్నది. నీరసంతో కళ్లు తిరుగుతున్నట్లు అనిపించసాగింది. కాసిని మంచినీళ్లతో గొంతు తడుపుకున్నది. కుంపట్లో పెట్టుకున్న గిన్నెలో పెసరపప్పు పులగం చక్కగా ఉడికింది. నేతి బొట్టుతో తడిపి నాలుగు మెతుకులు పులగం అన్నాన్ని అగ్నిహోత్రుడికి నివేదన చేసి గిన్నెను పక్కగా వుంచింది. సంతులు గారికిచ్చే సంభావనలో ఒక పెద్ద గడ్డ బెల్లాన్ని వుంచి మరొక చిన్న గడ్డ తీసుకుని తరిగి పులగం అన్నంలో చేర్చింది. పంతులుగారు రాగానే ఉద్యాపన చెప్పించుకుని నమస్కరించాలి. ఆ తర్వాత సంభావన ఇచ్చి పంపించి ఉపవాస దీక్ష విరమించాలని చూస్తున్నది. మాటి మాటికి వీధి వాకిలి వంక చూడసాగింది. కాని తాను ఓరగా వేసిన తలుపు వేసినట్లే వున్నది. మరలా కాసిని మంచినీళ్లు తీసుకుని ఒక గుటక వేసింది. లోపలికి పోకుండా బయటికే వచ్చేశాయి. వాంతి అవుతున్నట్లు అనిపించి పెరట్లోకి వెళ్లింది. నిలబడలేక అక్కడున్న గోడకానుకున్నది. ఆ ఆసరాతోనూ నిలబడలేక నేలకు ఒరిగిపోయింది.

వాంతి చేసుకున్న శబ్దంలాగా అనిపించింది ఎవరా? అని భాగ్యలక్ష్మి గోడ దగ్గరకు వచ్చి చూసింది. వనజాక్షి పరిస్థితి గమనించింది. తానేమో మడికట్టుకుని వున్నది. ఆ పరమశివుడికి నైవేద్యం సిద్ధం చేస్తున్నది. సిద్ధం చేసిన నైవేద్యం తీసుకుని, నివేదన చెయ్యటానికై గుడికి వెళ్లటానికి ఆమె భర్త సిద్ధపడుతున్నాడు.

“వనజాక్షి వనజాక్షి” పిలిచింది. జవాబేమీ రాలేదు. ఇదివరకట్ల ఎత్తుపీట వేసుకుని గబుక్కున గోడ దిగి వెళ్లటానికి శరీరం సహకరించటం లేదు. వీధి వాకిట్లో నుంచి తిరిగి వచ్చి వనజాక్షిని పిలిచింది. ‘వూ.. వూ..’ అంది కాని కళ్లు విప్పలేక పోతున్నది. చేతితో తట్టి లేపింది. కాసిన్ని నీళ్ళు ముఖాన చిలకరించింది.

కళ్లు విప్పి పంతులుగారింకా రాలేదు అంటూ గొణిగినట్లు చెప్పి మరలా కళ్ళు మూసుకున్నది. దగ్గర్లో ఎవరూ లేదు. పెరటి గోడ దగ్గరకే వెళ్లి భర్తనే కేకలు పెట్టి, పిలిచింది. గోడ దగ్గరకు వచ్చిన భర్తతో “మన తలుపులు వేసి ఇక్కడకు రండి. వనజాక్షి పరిస్థితి బాగాలేదు” అని చెప్పింది.

“ఎవరన్నా ఆడవాళ్లున్నారేమో చూస్తాను” అంటూ వీధి వాకిట్లోకి వచ్చి చూశాడు గాని చటుక్కున వచ్చి సాయం అందించేవాళ్లెవరూ గోచరించలేదు. తానే భాగ్యలక్ష్మి వున్న చోటుకు వెళ్లాడు.

“మనిద్దరం మరలా స్నానాలు చేద్దాం. ముందు సాయం పట్టండి. వనవాక్షిని లోపల పడుకోబెడదాం” అన్నది. ఆమెను లోపలికి చేర్చి మంచం మీద పడుకోబెట్టబోయారు. అతి కష్టం మీద కళ్లు తెరచి మంచం మీదకు వాలకుండా నట్టింట్లో నేల మీదకే జారి రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ మళ్లీ కళ్లు మూసుకున్నది.

“కాసిని మజ్జిగ తెచ్చి తాగించు, తేరుకుంటుంది”.

భాగ్యలక్ష్మి చెంచాతో మజ్జిగ నోట్లో పొయ్యబోయింది గాని వనజాక్షి గుటకేమీ వెయ్యలేదు. పూజారిగారు నాడి పట్టుకు చూశారు. బలహీనంగా కొట్టుకుంటున్నది.

“మన నాగరాజును కేకేసుకు వస్తాను. సెలైన్ అన్నా పెడతాడు.” అంటూ ముందుకు నడిచారు.

ఈ లోగా కొద్దిగా కళ్లు తెరచింది వనజాక్షి.

“ఏమండోయ మీరిటు రండి. మన శివయ్య కీవేళ నైవేద్యం ఆలస్యమే అవుతుంది. క్షమింపమని వేడుకుందాం. వనజాక్షి చేసిన ఏకాదశి ఉపవాస వ్రతానికి ఉద్యాపన చెప్పటానికి వచ్చే కోటేశ్వర్రావు అన్నయ్య ఈ వేళెందుకో ఆలస్యం చేశాడు. ఏ మాత్రమో మర్చిపోయి ఉంటాడు. ఆ పనేదో మీరు కానివ్వండి. ఆ సంభావనా మీరు పుచ్చుకోండి. తను అప్పుడే ఏమైనా తింటుంది. తాగుతుంది. లేకపోతే నిస్సత్తువ కొచ్చి పడిపోయేటట్లు వున్నది. పిచ్చిది. కటిక ఉపవాసాలు కూడదు అని చెప్తే వినిపించుకోదు. ఇలాగే వదిలేస్తే పేగులు మాడిపోతాయి” అన్నది.

పూజారిగారు ఒక్క క్షణం ఆలోచించారు. ఎలాగు మడి బట్టతోనే వున్నారు. అక్కడున్న కంచు చెంబు అందుకుని పంపు దగ్గర కెళ్లి నీళ్లు కొట్టుకుని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న జలంతో వనజాక్షిని సంప్రోక్షించి ఉద్యాపన కావించారు. అక్కడున్న సంభావన సంచినీ అందుకున్నారు. శరీరం మీద పడ్డ జలంతో సగం స్పృహలోకొచ్చింది వనజాక్షి. మిగతా సగం సంభ్రమంలో వున్నది. ‘ఈ భాగ్యలక్ష్మి అక్కయ్యకు, పూజారి బావగారికి ఏం చేసి బదులు తీర్చుకోగలదు? తన మూలంగా ఈ వేళ మైలబడ్డారు. శివయ్యకు నైవేద్యం పెట్టే వేళ దాటిపోతున్నది. వీళ్ల భోజనాలకూ అకాలమవుతుంది. ఎంతో అపచారం జరిగిపోతుంది’ అనుకుంటూ మరింత కంగారు పడుతూ లేచి నిలబడింది. రొంటిన దోపుకున్న పదకొండు రూపాయల దక్షిణా. భోషాణం మీద పెట్టిన పండూ తాంబూలం తీసి పూజారిగారి చేతుల్లో పెట్టి, పాదాలకు నమస్కరిస్తూ, “నన్ను క్షమించండి, నా వలన పొరపాటు జరిగిపోయింది. మీరు చాలా శ్రమ ఇచ్చాను. దయచేసి నన్ను క్షమించండి” అంది ఎంతో ప్రాధేయపూర్వకంగా,

“మరేం ఫర్వాలేదమ్మా, నువ్వు తేటపడితే, తిండి తింటే ఆ శివయ్యా చాలా సంతోషిస్తాడు. భయపడకు” అన్నారు చిరునవ్వుతో,

“నీ ఉపవాసం పూర్తయింది కాని, పులగాన్ని వేడి వేడిగా తిను, ఆరిపోతే గొంతు దిగదు. ప్రక్కనే మజ్జిగా వుంచాను. తర్వాత తాగు. ఇంకెప్పుడూ ఇలా కటిక ఉపవాసాలు చెయ్యకు” అంటూ భాగ్యలక్ష్మి మందలించింది.

“వస్తాం” అంటూ ఆ దంపతులు తిరిగి వెళ్తుంటే “ఆ ఆది దంపతులే నాకి వేళ మీ రూపంలో దర్శనం ఇచ్చారు అక్కయ్యా” అంటూ అభిమానంగా వాళ్లనే కళ్ల నిండుగా చూసుకున్నది వనజాక్షి వాళ్లకే మనసు నిండుగా భక్తితో మొక్కింది.

అలా అమ్మమ్మ ఎప్పుడూ పొరుగింటి భాగ్యలక్ష్మి అక్కయ్యను తలచుకుంటూ వుండేది. తరుచూ ఈ వైకుంఠ ఏకాదశి ముచ్చట మాకందరికి చెప్తూవుండేది అని గుర్తు చేసుకున్నది అన్నపూర్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here