పెరటి మొక్క

1
6

[dropcap]కా[/dropcap]లింగ్ బెల్ మోగడంతో ఫోన్ మాట్లాడుతున్న లోలాక్షి “ఒన్ మినిట్” అంటూ అవతల వాళ్లకి చెప్పి వెళ్లి తలుపు తీసింది.

ఎదురు ఫ్లాట్‌లో ఉంటున్న పావని చిరునవ్వుతో “లోపలికి రావచ్చా” అంది. లోలాక్షి ఫోన్‌లో “చిట్టి ఫైవ్ మినిట్స్‌లో చేస్తాను” అని చెప్పి “రండి, రండి … ప్లీజ్ కం” అంటూ ఆహ్వానించింది.

“పర్వాలేదండి మీరు మాట్లాడుకోండి.. బొట్టు పెట్టి వెళ్తాను” అంటూ ఎడం చేయి అరచేతిలో ఉన్న కుంకుమ భరిణలో నుంచి కుంకుమ తీసి ఆవిడకి బొట్టు పెట్టబోయి ఆగిపోయింది పావని. ఆవిడ నుదుట బొట్టు లేదు.. మెడ, చేతులు బోసిగా ఉన్నాయి. ఒక లాంగ్ స్కర్ట్, టాప్ వేసుకుని జుట్టంతా నడినెత్తి మీదకు పెట్టి ఒక క్లిప్ పెట్టింది.

పావని ఆగిపోవడం చూసి “ఏముంది మీ ఇంట్లో” అంది లోలాక్షి.

“నేను అష్టలక్ష్మి నోము చేసుకున్నానండి. వచ్చి పేరంటం తీసుకుంటారని” అని నసిగింది పావని. లోలాక్షి పావని వైపు చూసింది. పట్టుచీర, పొడుగాటి జడ, జడలో కనకాంబరం మాల, కళ్ళకు కాటుక, దోసగింజ ఆకారంలో స్టిక్కర్… స్టిక్కర్ కింద కుంకుమ, చాలా అందంగా ఉంది.

“మీ పసుపు, కుంకుమల కోసమా! ఈ పూజలు, నోములు….” కొంచెం హేళనగా అడిగింది.

పావని మనసు చివుక్కుమంది.. జవాబు చెప్పకుండా “మీకు బొట్టు పెట్టచ్చా” పెడితే ఏమనుకుంటుందో, పెట్టకపోతే ఏమంటుందో అన్నట్టు సందేహిస్తూ కొంచెం నెమ్మదిగా అంది.

“పెట్టకపోయినా పర్వాలేదు.. నాకసలు ఈ పసుపు, కుంకుమలు, పూలు, పూజలు వీటి మీద నమ్మకం లేదు.. అయినా ఎందుకండీ మీరంతా మీ భర్తల కోసం పూజలు, వ్రతాలు చేస్తారు? వాళ్ళు మీకోసం ఏం చేస్తున్నారు? ఉపవాసం కూడా చేసారా!” అడిగింది.

పావని బిత్తరపోతూ అవును, కాదు అన్నట్టుగా తలూపింది.

“మీరు మారరండి.. మారరు” అంది సీరియస్‌గా లోలాక్షి.

“మగవాళ్ళు ఆడవాళ్ళని బానిసలుగా తమ కాళ్ళ కింద తొక్కి పెట్టి ఉంచడానికి ఈ సెంటిమెంట్స్‌ని ఆయుధాలుగా వాడుకుంటారు. మీ మీద ఆధిపత్యం చెలాయిస్తూ మీ అస్తిత్వాన్ని నిర్వీర్యం చేస్తారు.. మీరంతా భర్త అనగానే అతనికి మీమీద సర్వహక్కులు ఉన్నాయని, అతను ఏం చేసినా భరించాలి అనే భావజాలంతో మిమ్మల్ని మీరు వంచించుకుంటూ బతుకుతారు.. హింస… గృహ హింస ఎక్కడ చూసినా ఇదే హింస…. ఎప్పుడు తెలుసుకుంటారు.. ఎప్పుడు మీ హక్కుల గురించి మీలో అవేర్‌నేస్ వస్తుంది…” ఆపకుండా మాటలతో దాడి చేస్తున్న లోలాక్షి ధోరణితో పావనికి చిరాగ్గా అనిపించింది.

ఈవిడ దగ్గరకు ఎందుకు వచ్చానురా దేవుడా అనుకుంటూ వేలితో కుంకుమ ఆమె నుదుట పెట్టి “రండి తప్పకుండా” అంటూ బయటకి నడవబోతూ ఆగి లోలాక్షి వైపు చూసి అంది… “మమ్మల్ని నోములు, వ్రతాలు చేయమనికాని, వద్దు అని కానీ మా మగవాళ్ళు చెప్పరండి… మేమే సరదాకి చేసుకుంటాము. ఈ వంకతో ఒక పట్టు చీర కొనుక్కోవచ్చు అని, చుట్టూ పక్కల ఉన్న తోటి ఆడవాళ్ళతో కాసేపు కలుసుకుని సరదాగా గడపచ్చు అని చేసుకుంటాము. ఇంకో విషయం వారానికి ఒకరోజు కడుపు ఖాళీగా ఉంటే ఆరోగ్యానికే కాదు స్లిమ్‌గా కూడా ఉండచ్చు అని ఉపవాసం చేస్తాము. అలా అంటే మగవాళ్ళు తిడతారని, దేవుడి పేరు చెప్తాము. దేవుడిని మనసారా నమ్ముకుంటే చాలని, వ్రతాలూ, నోములు అవసరం లేదని మాకూ తెలుసండి.. కానీ కొన్ని ఆపదల్లో మా స్వార్ధం కోసం దేవుడి పేరు వాడుకుంటాము… ఆపదమొక్కుల వాడు కదండీ.. వస్తాను” అంటూ వెళ్ళిపోయింది. లోలాక్షి ఊపిరాడనట్టు స్థాణువులా నిలబడిపోయింది.

లోలాక్షి వృత్తి లాయర్.. ప్రవృత్తి సోషల్ వర్కర్… పెళ్లి చేసుకోలేదు.. స్వేచ్చా జీవి.. ఒక్కతే ఉంటుంది. ఆవిడకి ప్రాక్టీసు తక్కువ, హడావుడి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. నగరంలో ఆడపిల్లలకి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఈవిడ అక్కడ వాలిపోతుంది. అక్కడ నుంచి టివిలో ఇంటర్వ్యూలు, వార్తాపత్రికల్లో చర్చలు.. చిన్న, చిన్న కుటుంబ సమస్యలను పెద్దవి చేసి, యాగీ చేస్తుంటుంది. తద్వారా వద్దన్నా కొద్దీ ఆవిడ పేరు అందరి నోళ్ళల్లో నానుతూ ఆవిడ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపచేస్తూ ఉంటుంది. ఆవిడకి కేసుల ద్వారా కన్నా ఉద్యమాల ద్వారా సంపాదన ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు ఆమె గురించి తెలిసిన వాళ్ళు. ఆవిడ కళ్ళు చుట్టూ పక్కల కుటుంబాల్లో సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని డేగ కళ్ళతో చూస్తూ ఉంటాయి. ఒక రోజు ఆ కాలనీలో ఉండే ఒక జంట బయటకు వెళ్తున్నారు. భార్య చంకలో పసిపిల్లను ఎత్తుకుంటే అతను నాలుగేళ్ల బాబు చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. వాళ్ళని చూసి అతను వినేలాగా గట్టిగా పక్కన ఉన్న ఫ్రెండ్‌తో “అటు చూడు అతనేమో పిల్లాడి చేయి పట్టుకుని స్టైల్‌గా నడిపిస్తుంటే ఆమె పిల్లని మోస్తోంది.. ఇది పురుషాహంకారం కాకపోతే ఏంటి?”

ఆ మాటలు విని కోపంగా ఏదో అనబోతున్న భార్యని వారించి అతను ముందుకు వెళ్ళిపోయాడు. లోలాక్షి, ఆమె ఫ్రెండ్ స్త్రీల హక్కులు, పురుషుడి బాధ్యతలు, అసలు స్త్రీలే ఎందుకు గర్భం దాల్చాలి వంటి అంశాల గురించి మాట్లాడుకుంటుంటే విన్న అటు పక్క, ఇటు పక్క ఫ్లాట్స్ వాళ్ళు ఆ ప్రశ్నకి సమాధానం ఏ పురాణంలో ఉంది… ఏ శాసనంలో ఉంది అని ఆలోచిస్తూ ఏమి తోచక … మనకెందుకులే అనుకుంటూ వెళ్ళిపోయారు. అలాంటి చాలా ప్రశ్నలు లోలాక్షి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తనకి తానూ వేసుకుంటూ ఉంటుంది.

ఆరోజు బాల్కనీలో కూర్చుని ఉన్న లోలాక్షి గేటులో నుంచి లోపలికి లారీ వచ్చి ఆగడం చూసి పక్కన ఉన్న ఖాళీ ఫ్లాట్ లోకి ఎవరో వచ్చినట్టున్నారు అనుకుంది. ముప్ఫై ఏళ్ల యువతి, ఆమె వెనకాల అరవై ఏళ్ల మహిళ ఇద్దరు మగపిల్లలు… పన్నెండు, పద్నాలుగేళ్ళు ఉంటాయి… వాళ్ళ వెనక నలభై ఏళ్ల వ్యక్తీ ఇన్నోవా కారులోంచి దిగారు. అందరూ దిగాక ఆఖరున పాతికేళ్ళ యువతి దిగింది. డిక్కీ తెరిచి ఆ యువతి చేతికి కొన్ని కార్టూన్స్ అందిస్తుంటే రెండు చేతుల్లో రెండు, చంకలో ఒకటి పెట్టుకుని ఆ యువతి ముందు వెళ్తున్న వాళ్ళని దాటుకుని ముందుకు వేగంగా నడిచింది.

“ఒసేయ్… నెమ్మదిగా వెళ్ళు…. పడేస్తావు.. అయినా అన్నీ ఒకసారే తీసుకుని వెళ్లకపోతే రెండు, మూడు సార్లు తిరిగితే అలసిపోతావా” అరిచింది పెద్దావిడ. ఆ యువతీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. వాళ్ళ మాటలు లోలాక్షికి స్పష్టంగా వినిపిస్తున్నాయి.

“మీరు రండత్తయ్యా” అంటూ కోడలు ఆవిడ చేయి పట్టుకుంది.

ఆవిడ వెనక్కి తిరిగి కొడుకు వైపు చూసి “పెద్దాడా నా సంచీ జాగ్రత్తగా పట్టుకురా” అని అరచింది.

“సరే” అన్నాడు అతను.

మగపిల్లలిద్దరూ చెరో బ్యాగు పట్టుకున్నారు. వాళ్ళు ఆవిడ మనవళ్ళు కాబోలు అనుకుంది లోలాక్షి. కొడుకు కూడా కొన్ని బాగులు పట్టుకుని లోపలికి నడిచి లిఫ్ట్ నొక్కినట్టున్నారు శబ్దం వచ్చింది. లోలాక్షి కుతూహలంగా గమనిస్తూ ఉండిపోయింది. ఈ బిల్డింగ్‌లో ఇంక వేరే ఫ్లోర్‌లో ఖాళీ ఏమి లేవు. కచ్చితంగా పక్క ఫ్లాట్‌కే వచ్చినట్టున్నారు అనుకుంది. ఆమె ఆలోచిస్తూ ఉండగానే పక్క ఫ్లాట్ తాళం తీసిన చప్పుడు, ఆడవాళ్ళ గొంతులు వినిపించసాగాయి.

“లీలా! ఆ అట్ట పెట్టెలు అక్కడ పెట్టి వెళ్లి నా సామాను పట్రా” పెద్దావిడ గట్టిగా అంది.

“అబ్బా! అమ్మగారూ! మీకన్నిటికీ తొందరే తెస్తున్నా కదా!” లీల అనే అమ్మాయి గొంతులో విసుగు కన్నా చనువు వినిపించింది. ఆ యువతి బయటకి వచ్చి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళడం, రెండు, మూడు సార్లు లోపలికి బయటకి తిరుగుతూ కారులోంచి సామాను తీసుకుని రావడం జరిగింది. తరవాత లారీ లో ఉన్న సోఫాలు, బీరువాలు, మంచాలు ఒకొక్కటే వచ్చాయి పైకి.

ఈ అమ్మాయి ఆవిడ కూతురు కాబోలు అనుకుంది లోలాక్షి. కానీ ఆ అమ్మాయి కట్టు, బొట్టు, వాలకం చూస్తుంటే మాత్రం అనుమానం వచ్చింది.. కూతురా! పనిపిల్లా అని.. మొహంలో ఎక్కడా చదువు వాసనలు కనిపించలేదు.. మాటల్లో చనువు, స్వతంత్రం తప్ప సంస్కారవంతమైన భాష కూడా వినపడలేదు. కానీ బొంగరంలా చలాకీగా బోలెడు పని చేస్తున్న సందడి మాత్రం వినిపిస్తోంది.

సామాను సర్దుతున్న చప్పుళ్ళుతో పాటు మధ్య, మధ్య ఆ పెద్దావిడ అరుపులు వినిపిస్తున్నాయి “ఒసేయ్ లీలా! ఇదిగో ఈ జాడీ వంటగదిలో పెట్టు… ఈ ఫోటో పూజ గదిలో పెట్టు… నా సామాను ఎక్కడ పెట్టావు.. నా పూజ పుస్తకాలు జాగ్రత్తగా పెట్టమన్నానా.. నీకసలు ఒళ్ళు పై తెలియడంలేదు.. ఏవిటే ఆ పరుగులు…” ఆవిడ గొంతులో మందలింపులు, చిరాకు, కోపం, వినిపిస్తూనే ఉంది. మధ్య, మధ్య కోడలి గొంతు సన్నగా వినిపిస్తోంది.

“అమ్మా! దానికి తెలుసుకదా ఏది ఎక్కడ పెట్టాలో ఊరికే అరవకు” విసుక్కున్నాడు కొడుకు.

ఇంటిల్లిపాది ఆ అమ్మాయిని చనువుగా అది, ఇది అంటున్నారు… ఎవరో ఆ అమ్మాయి అనుకుంది లోలాక్షి.

పనిమనిషి అయితే అది, ఇది అని ఎలా అంటారు? పని మనిషి కాకుండా ఇంటి మనిషి అనిపించేలా లేదు. వాళ్ళంతా పచ్చగా, బాగా ఉన్నవాళ్ళలా కనిపిస్తున్నారు. ఆ అమ్మాయి డ్రెస్ వేసుకుంది. గట్టిగా జడ వేసుకుంది. మెడలో పూసల దండలు.. ఇద్దరి బాల్కనీలు పక్క, పక్క ఉండడంతో, బాల్కనీలో ఉన్న వాళ్ళు బాగా కనిపిస్తారు.. మాటలు కూడా చాలా క్లియర్‌గా వినిపిస్తాయి.

మర్నాడు ఆ అమ్మాయి వీధి తలుపు తీసి ఫ్లాట్ ముందు ఊడ్చి, బట్టతో తుడిచి ముగ్గు పెట్టింది.. బాల్కనీలో ఉన్న వాష్ ఏరియాలో అంట్లు తోమింది.. ఆ అమ్మాయి తోముతుంటే లోపల నుంచి కోడలు “లీలా! కాఫీ తాగి వెళ్ళు” అని పిలవడం వినిపించింది.. “తాగుతాలెండి.. ఈ కాసిని గిన్నెలు కడిగి వస్తా” లీల సమాధానం వచ్చింది..

పనిమనిషి కాదేమో అనుకుంది లోలాక్షి ఆ మాటలు విని.. కాసేపట్లో లోలాక్షి పనమ్మాయి మేరీ వచ్చి పది నిమిషాల్లో ఉన్న నాలుగు గిన్నెలు సింక్‌లో తోమి కడిగింది.. ఇల్లు ఊడ్చి, మాబ్ చేసి పరిగెత్తింది. మేరీకి తను ఎప్పుడూ కాఫీ, కానీ, టీ కానీ ఇచ్చిన గుర్తులేదు అనుకుంది లోలాక్షి.

మళ్ళి కాసేపటికి “అమ్మగారూ! మీరు స్నానం చేస్తే బట్టలు జాడించేస్తా… మళ్ళి కాసేపైతే మంచినీళ్ళు రావుట.. బంద్ అయితాయట” అని వినిపించింది లీల స్వరం …

“అయితే అయాయి లేవే… రేపు ఉతుక్కోవచ్చులే… ఇలా రా కాళ్ళు లాగేస్తున్నాయి. ఆ కొబ్బరినూనె డబ్బా ఇలా పట్రా” ఆవిడ స్వరం…

“ఉండండి రాస్తాను.. మీరట్టా పడుకోండి… “

“నువ్వు ముందు వెళ్లి టిఫిన్ తినిరా.. చిన్నమ్మ ఇందాకటి నుంచీ పిలుస్తోంది దోస చల్లారిపోతుంది తినమని.”

“తింటా లెండి..”

“వెళ్ళవే … చెబితే నీక్కాదూ ….” ఆవిడ విసుక్కుంది.

లోలాక్షికి అన్నీ వినిపిస్తున్నాయి.. పని మనిషే కచ్చితంగా.. లేకపోతే అమ్మగారూ! అనదుగా.. ఆవిడకి ఎంత కులాహంకారం! పాపం తక్కువ కులం అమ్మాయనేగా ఒసేయ్, ఏమే ఏవిటే అంటుంది అనుకుంది.

“లీలా! దొండకాయలు కడిగావా!” కోడలి స్వరం వినిపించింది..

“కడిగానండి…” లీల స్వరం…

“ఏం కడిగావే… చూడు… మట్టి… నీకు రాను, రాను బద్ధకం ఎక్కువ అవుతోంది..” కోడలి స్వరంలో విసుగు.

“ఊరుకోమ్మా… ఒకటో, రెండో మట్టి పోలేదేమో.. మళ్ళీ కడిగిస్తాలే… అయినా అక్కడ పెట్టండి మీకెందుకు ఆ దొండకాయలు.. నేను తరిగిస్తాగా…”

 ఇంటిల్లిపాదికీ అహంకారం… ఇదంతా కులాధిపత్య భావజాలం… పైగా ఆవిడ పనమ్మాయి కదా అని కాళ్ళు పట్టించుకుంటుందా! ఇది నేరం… మానవ హక్కులను కాలరాయడం కదా! వీళ్ళకి క్లాసు పీకాలి… పళ్ళు కొరికింది లోలాక్షి.

మధ్యాహ్నం… భోజనం చేసి ఏదో చదువుకుంటూ కూర్చున్న లోలాక్షికి పక్క ఫ్లాట్‌లో నుంచి గట్టిగా కేకలు వినిపించాయి..

“కళ్ళు కనిపించవుటే… అంత మిడిసిపాటు ఏంటి నీకు… బంగారంలాంటి కప్పు పగలకొట్టావు…”

“అబ్బా! నేను చూసుకోలేదు అమ్మగారూ! నా జీతంలో ఆ కప్పు ధర కోసేయండి.. తిట్టమాకండి…”

“మళ్ళీ రోషం ఒకటి… చేసేవి వెధవ పనులు… ఏవన్నా అంటే పొడుచుకుని వస్తుంది రోషం… అసలు నీకు పాయసం ఆ కప్పులో ఎందుకిచ్చింది ఈవిడ…”

“నాకా కప్పు ఇష్టం అని చిన్నమ్మ నాకు ఎప్పుడూ పాయసం ఆ కప్పులోనే ఇస్తుంది..”

“ఇస్తుంది.. ఆవిడదేం పోయింది… ఒక ప్లాస్టిక్ బొచ్చ తెచ్చి పడేయమంటాను వాడితో..”

“ప్లాస్టిక్ కాకపొతే ఇనప ముక్క ఇవ్వండి… ఎందులో తింటే ఏం గుప్పెడు మెతుకులేగా?”

“లీలా! పెద్దావిడతో నీకేంటి … ఆవిడతో ప్రతి దానికీ వాదన వేసుకోడం నేర్చుకున్నావు ఈ మధ్య.. వెళ్లి చెప్పిన పని చేయి..” కోడలి స్వరం దర్పంగా.

లోలాక్షి ఇంక భరించలేకపోయింది. ఎంత పనిమనిషి అయితే మాత్రం అందరూ అంత అవమానకరంగా మాట్లాడతారా! హ్యూమన్ రైట్స్ ఉల్లంఘించడం కదా.. వీళ్ళకి బుద్ధి చెప్పాలి.. లీలని వీళ్ళ మీద తిరగబడమని చెప్పాలి దృఢంగా అనుకుంది. అవకాశం కోసం చూడసాగింది.

మరునాడు సాయంత్రం నాలుగింటికి లోలాక్షి టీ తాగుతోంటే కాలింగ్ బెల్ మోగింది. లోలాక్షి తలుపు తీసి లీలను చూసి బోలెడు సంతోషంతో లోపలికి ఆహ్వానించింది. ఈ అమ్మాయికి తన హక్కుల గురించి తెలియదు పాపం… అందుకే వాళ్ళు ఏమన్నా యజమానులు అని భరిస్తోంది… ఈమే వాష్ చేయాలి అనుకుంది.

“ఆంటే! మీ ఇంట్లో స్క్రూ డ్రైవర్ ఉంటే ఇస్తారా… మళ్ళి వెంటనే తెచ్చి ఇస్తాను” అంది లీల.

“ఇస్తాను కానీ… నువ్వు వాళ్ళ పనమ్మాయివా” అడిగింది లోలాక్షి..

లీల ఆమె మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ “మీకెట్టా తెలుసు” అంది..

లోలాక్షి తడబడుతూ అంది “అది, అది… ఆ పెద్దావిడ నిన్ను అస్తమానం తిడుతూ ఉంటారు… నువ్వు ఎందుకు ఊరుకుంటావు? పైగా నిన్ను వాళ్ళంతా ఒసే, ఏవిటే అంటుంటే ఎందుకు భరిస్తున్నావు.. నీకు కొన్ని హక్కులున్నాయి.. వాళ్ళ మీద కేసు పెట్టచ్చు… పని మనిషివి అయినంత మాత్రాన నిన్ను అగౌరవంగా పిలుస్తుంటే ఊరుకోకూడదు.. నీకేదన్నా సమస్య ఉంటే నాకు చెప్పు… రాత్రి, పగలు బోలెడు పని చేస్తుంటావు.. పని వేళలు అంటూ లిమిట్స్ ఉన్నాయి. నీకు పనికి తగిన జీతం ఇస్తున్నారా!”

లీల ఆవిడ మొహంలోకి నిశ్చలంగా చూస్తూ అంది… “నేను పనిమనిషిని అని మీరంటే నాకు తెలిసింది… నన్ను వాళ్ళు ఎప్పుడూ పనిమనిషి అనలేదు.. అనుకోలేదు… ఆ ఇంటికి పదిహేనేళ్ళ పిల్లగా ఉన్నప్పటి నుంచీ వాళ్ళతోటే ఆ ఇంట్లో ఒక మనిషిగా ఉంటున్నాను. వాళ్ళు ఏ ఇల్లు మారినా వాళ్ళతో పాటే నేను ఉంటాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నప్పుడే చచ్చిపోయింది.. మా నాన్న తాగుబోతు అయి నన్ను కొట్టి ఇంట్లోంచి వెళ్ళ గోడితే ఆ పెద్దమ్మ గుండెల్లో దాచుకుంది… ఆ అమ్మకి నన్ను తిట్టే హక్కే కాదు… కొట్టే హక్కు కూడా ఉంది… ఇంకెప్పుడూ ఇట్టాంటి మాటలు చెప్పకండమ్మా…” విసురుగా బయటకు వెళ్తున్న లీల వైపు తెల్లబోయి చూస్తున్న లోలాక్షి “ఇదిగో స్క్రూ డ్రైవర్” అంది వెనక నుంచి…

లీల వెనక్కి తిరిగి ఆమె వైపు నిరసనగా ఒక చూపు చూసి పక్క ఫ్లాట్ లోకి వెళ్లి పోయింది. “అమ్మగారూ డబ్బులివ్వండి స్క్రూ డ్రైవర్ కొనుక్కోస్తాను… వాళ్ళింట్లో లేదట…” అన్న లీల స్వరం వినిపించి లోలాక్షి మొహం మాడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here