ఫలించిన సలహా

0
7

అనగనగా రామాపురం అనే గ్రామంలో సుబ్బయ్య నివసిస్తుండేవాడు. వ్యాపారంలో దిట్ట, కానీ ఒట్టి పిసినారితనం, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలే రకం కాదు తను. భార్య రత్నమ్మ చాలా సహనం కలది, పెట్టే గుణం ఆమెకు వున్న కూడా ఒక్క మెతుకు నేలపాలు, పరులపాలు కానిచ్చేవాడు కాదు, పెళ్ళై కొన్ని సంవత్సరాలుగా గడుస్తున్నా.. ఇంకా సంతానం కలుగలేదు, “గుళ్ళు గోపురాలకు వెళ్ళి వస్తేనే కదా అంతో ఇంతో పుణ్యం వచ్చేది. దాన ధర్మాలు చేస్తేనే కదా ఫలితం వుండేది ” అని వాపోయేది రత్నమ్మ.. ఊళ్ళో వాళ్ళు చెప్పినా కూడా పెడచెవిన పెడుతూ వస్తున్నాడు సుబ్బయ్య.. 

***

రోజులు వెళ్ళదీయసాగింది.

ఇలా వుండగా సుబ్బయ్య ఏదో పని మీద పట్నం వెళ్ళాల్సి వచ్చింది.

ఆ సమయంలో ఓ సాధువు సుబ్బయ్య ఇంటికి భిక్ష కోసం వచ్చాడు. రత్నమ్మ సాధువు ద్వారానైనా తనకు ఏదైనా సలహా లభిస్తుందని భావించింది. తన భర్త పిసినారితనం గురించి తనకు పిల్లలు కలగని సంగతి సాధువుతో చెప్పింది.

ఇతరులకు సహాయం చేసే స్తోమత వుండి కూడా పిసినారితనంతో వ్యవహరిస్తున్న సుబ్బయ్యలో మార్పు తెచ్చేందుకు సాధువు రత్నమ్మకు ఓ పథకం భోదించాడు. ఆ పథకాన్ని అమలుచేయడానికి రత్నమ్మ ఒప్పుకుంది.

ముందుగా అనుకున్న ప్రకారం  మరుసటిరోజున సాధువు సుబ్బయ్య దుకాణం వద్దకు చేరుకున్నాడు.

‘మీరు త్వరలో కోటీశ్వరుడు అయ్యే లక్షణాలు మీ మోహంలో కనిపిస్తున్నాయ’ని సుబ్బయ్యతో చెప్పాడు. కోటీశ్వరుడు అనే మాట వినగానే డబ్బు మీద ఎంతో ఆశ వున్న సుబ్బయ్యకు మరింత దురాశ కలిగింది. ‘దీనికి నేనేం చెయ్యాలో సెలవియ్యండ’ని స్వామీజీని కోరాడు.

‘రోజూ క్రమం తప్పకుండా ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గు వేస్తే సిరిసంపదలు ఇంటిని వెతుక్కుంటూ వస్తాయ’ని చెప్పాడు. దాంతో పాటు ఇంటిని వచ్చే పసువులకు భిక్షగాళ్ళకు తిండి పెట్టాలని సూచించాడు.

అంతేకాక ‘ధనలక్ష్మీ నీ ఇంటికి  భిక్షగాడి రూపంలో వస్తుందని, అయితే ఎప్పుడు వస్తుందనే చెప్పలేమని ఆవిడను భిక్షతో తృప్తి పరిస్తే నీ ఇంట్లో శాశ్వతంగా నివాసం వుండిపోతుంద’ని చెప్పాడు.

‘నేను ధనలక్ష్మిని ఎలా కనిపెట్టాల’ని సాధువును సందేహంగా ప్రశ్నించాడు సుబ్బయ్య.

‘అలా కనిపెట్టలేం కనుకనే ఇంటి ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ కాదనకుండా తప్పనిసరిగా భిక్షవేయమ’ని గట్టిగా నొక్కి మరీ చెప్పాడు.

మనం ఖర్చు పెట్టేది కాస్తంతే అయినా కోట్లు అదనంగా వస్తాయి అనే ఆశతో సుబ్బయ్య సాధువు చెప్పినట్లు చేయమని భార్యను ఆదేశించాడు.

దీంతో సాధువు ముందుగా చెప్పిన ప్రకారం రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలను ముగ్గు పిండిలో కలిపి రత్నమ్మ ఇంటి ముందు ముగ్గులు తీర్చి దిద్దేది. చుట్టుపక్కల చెట్ల మీదున్న రకరకాల పక్షులు వచ్చి ఆ ధాన్యాన్ని తిని తమ కడుపు నింపుకునేవి.

అదే రకంగా ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాళ్ళకు కడుపునిండా తిండి పదార్థాలు పెట్టడమే కాక తృణమో ఫణమో ఇచ్చి పంపేది.

ఆ యేడాది అనుకోకుండా వర్షాలు సమృద్దిగా కురవడంతో పంటలు విపరీతంగా పండి సుబ్బయ్యకు వ్యాపారం బాగా జరిగి లాభాలు  లక్షల్లో వచ్చాయి.

ఇదంతా సాధువు చెప్పిన సలహా పాటించడం వల్లే అనుకున్నాడు.

ఎన్నో నెలలుగా చేసిన దానాలు అలవాటుగా మారడంతో వాటికి శాశ్వతంగా కొనసాగించమని భార్యకు చెప్పాడు.

తన భర్తతో తాను ఆశించిన మార్పు రావడంతో రత్నమ్మ సంతోషించడమే కాక చేసిన దానాల వలన పుణ్యం కలిగి కొంతకాలం తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

భర్తలో పరివర్తన కలగడానికి తగిన సలహానిచ్చిన సాధువుకి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here