ఫోన్ నెంబర్ ఇవ్వకండి ప్లీజ్

1
6

[box type=’note’ fontsize=’16’] “ఇక ముందు నా కథ ప్రచురించడం జరిగితే దయచేసి నా మొబైల్ నంబర్ మాత్రం ఇవ్వకండి” అని పత్రికలవాళ్ళని ప్రాధేయపడ్డ ఓ రచయిత గురించి చెబుతున్నారు సలీం “ఫోన్ నెంబర్ ఇవ్వకండి ప్లీజ్” అనే కల్పికలో. [/box]

[dropcap]’మీ[/dropcap] కథకు బహుమతి వచ్చింది’ అని పత్రిక ఆఫీస్ నుంచి ఫోనొచ్చినపుడు ఎంత సంతోషపడ్డానో, ‘కథ చివర్లో మీ ఫోన్ నెంబర్ ఇస్తే బావుంటుంది. ఇవ్వమంటారా?’ అని అడిగినపుడు అంతకన్నా ఎక్కువ సంతోషపడ్డాను. తన కథను మెచ్చుకుంటూ కొన్ని వందల ఫోన్లు వచ్చాయని ఒక రచయిత ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ గుర్తొచ్చి నాక్కూడా పాఠకుల నుంచి కొన్ని వందల అభినందనలు అందుకునే అదృష్టం లభించబోతోందని తెగ సంబరపడ్డాను.

కొన్ని సంవత్సరాల క్రితం వరకు కథ నచ్చితే పాఠకులు మెచ్చుకుంటూ ఉత్తరాలు రాసేవారు. నాలానే చాలా మంది రచయితలు వాటిని చదువుకుని సంతోషపడి అపురూపంగా దాచి పెట్టుకుని ఉంటారు. ఎప్పుడైనా మనసు అలజడికి లోనైనప్పుడు, ఆత్మన్యూనత హఠాత్తుగా జొరబడి తన ఇనుప పాదాలతో పాతాళానికి తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ఉత్తరాల కట్టని తీసి ఒక్కో ఉత్తరం చదువుకుంటుంటే ఆ కాశానికి బెత్తెడు దూరంలోకి ఎత్తేసేలా ఉత్సాహం ఉరకలెత్తేది.

కానీ ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల మయం.. ఎవరి చేతిలో చూసినా ఓ మొబైల్ ఫోన్ కన్పించే కాలం. ఖరీదైన ఫోన్లు… కొందరి దగ్గర రెండు మూడు ఫోన్లు.. ఈ రోజుల్లో ధనదర్పాలను ప్రదర్శించడానికి అనువైన సాధనం కూడా సెల్‌ఫోనే. ఎటొచ్చీ నాకర్థం కాని విషయం ఏమిటంటే ఫోన్లో ఎంతమంది అభినందనలు తెలిపినా అవి గాల్లో కలిసిపోతాయి కదా. ఉత్తరాల్ని దాచిపెట్టుకున్నట్టు వీటిని దాచిపెట్టుకోవడం సాధ్యం కాదుగా. ఏమైనా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మసలుకోవటం తప్పనిసరని భావించి నా ఫోన్ నెంబర్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చాను.

మూడు వారాల తర్వాత నా కథ పత్రికలో ప్రచురించబడింది. కథ చివర్లో నా మొబైల్ నంబర్ కూడా ఇవ్వబడింది. ఉదయం తొమ్మిదింటి నుంచి ఫోన్లు రావడం మొదలయ్యాయి.

పదిన్నరకు ఓ ఫోనొచ్చింది. “పత్రికలో ఫలానా కథ చదివానండి. చాలా బాగుంది. ఇంతకు ముందు కూడా ఏమైనా రాశారా?”

“ఇప్పటివరకు దాదాపు రెండువందలకు పైగా కథలు రాశానండి”

“అలానా… నేనెప్పుడూ చూడలేదే… మీరు కొత్తగా రాస్తున్న రచయిత అనుకున్నాను. ఇంతకూ ఏమిటా కథలు? ఏఏ పత్రికల్లో వచ్చాయి?”

నేను ఫోన్ కట్ చేశాను. అతను పత్రికల్లో పడిన నా కథలు చదవకపోతే అది నా తప్పా… కథల పేర్లన్నీ ఏకరువు పెట్టి రెండువందల కథలు రాశానని నిరూపించుకోవాలా? లేకపోతే నమ్మడా? నాలాంటి సీనియర్ రచయితకు ఇంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా?

మరో ఫోన్ వచ్చింది. “మీ కథ చదివాను. చాలా బాగుంది. ఇప్పటివరకూ ఏమైనా పుస్తకాలు ప్రచురించారా?”

“ఆరు కథా సంపుటాలు ప్రచురించాను”

“చాలా సంతోషం. మా ఇంటి దగ్గరే నేనో లైబ్రరీ నడుపుతున్నాను. చుట్టుపక్కలవాళ్ళు సాయంత్రం వచ్చి పుస్తకాలు చదువుకుంటారు. నా అడ్రస్ చెప్తాను. మీరు దయతో మీ ఆరు పుస్తకాలు మా లైబ్రరీకి పంపించండి”

నేను సరే అనకముందే అతను తన అడ్రస్ చెప్పడం ప్రారంభించాడు.

పదకొండింటికి ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. “ఫలానా కథ రాసిన రచయిత మీరేనా?”

కథను పొగుడుతాడన్న ఆశతో ఉత్సాహంగా “నేనేనండి” అన్నాను.

“అందులో ఒక చోట అల్లోపతి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనీ, వాటి బదులు హోమియోపతి మందులు వాడటం ఉత్తమమని ఓ క్యారెక్టర్ చేత చెప్పించారు కదా”

అతనికి ఆ మాట బాగా నచ్చి ఉంటుందని, నాలానే అతను కూడా హోమియోపతి మందులు వాడే వ్యక్తి అయి ఉంటాడనుకుని “ఔనండి. నేను గత పాతికేళ్ళుగా హోమియో మందులే వాడుతున్నాను. ఇప్ప టివరకు అల్లోపతి మందులు వాడాల్సిన అవసరం రాలేదు తెలుసా” అన్నాను.

అతను కోపంగా “మీరలా రాయడం తప్పు. అల్లోపతి మందులు ప్రూవెన్ డ్రగ్స్. హోమియో అంతా ఫేక్. కేవలం ప్లాసిబో ఎఫెక్ట్ తప్ప ఆ గోలీల్లో మందుండదని మీకు తెలీదనుకుంటాను” అన్నాడు.

“హోమియో మందులు పని చేస్తాయని గత పాతికేళ్ళలో అనుభవ పూర్వకంగా తెల్సుకున్నాను. నేను నమ్మిందే రాశాను. తప్పేంటి?” నేనూ కోపంగా అన్నాను.

“మీరు ప్రజల్ని మీ రాతల్లో మిస్ గైడ్ చేస్తున్నారు. అది తప్పు కాదా”

“అల్లోపతి మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే విషయం నిజం కాదా?”

అతను పెద్దపెద్దగా అరవసాగాడు. కథ గురించి కాకుండా అల్లోపతీ హోమియోపతి గురించి పెద్ద గొడవ.. రభస… పిచ్చి కుక్క కరిచినట్టు… కేకలు పెడ్తున్నాడు. ఫోన్ కట్ చేశాను.

మూడ్ అంతా పాడైపోయింది. రచయితని కదా… అసలే సున్నిత హృదయం.. తనకు అల్లోపతి ఇష్టమైతే ఐదో పదో వ్యాసాలు రాసుకోవచ్చుగా. ఎవడు కాదన్నాడు? కానీ నా నమ్మకాన్ని కథలో రాయవద్దనే అధికారం అతనికెవరిచ్చారు? చెత్త మనుషులు… చెత్త మనస్తత్వాలు.. రాత్రంతా చిరాగ్గానే గడిపేశా..

మూడు నెలల తర్వాత వేరే పత్రికలో మరో కథ పడింది. ఓ షాప్‌లో సేల్స్ గరల్‌గా పని చేసే ఓ అమ్మాయికి ఆ ఉద్యోగం చాలా అవసరం. షాప్ యజమాని ఆమెను లొంగదీసుకోడానికి ప్రయత్నిస్తాడు. లొంగకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరిస్తాడు. ఉద్యోగం మారినా అక్కడ కూడా ఇటువంటి పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందన్న నిస్పృహలో ఆ అమ్మాయి లొంగిపోతుంది. అదీ కథ. ఎప్పటికి మల్లే కథ కింద నా మొబైల్ నంబర్ ఇచ్చారు.

కథ బావుందని చాలా మంది ఫోన్లు చేశారు. సాయంత్రం ఆరింటికి ఓ స్త్రీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. “మీ ఉద్దేశంలో షాపుల్లో పని చేస్తున్న ఆడవాళ్ళందరూ క్యారెక్టర్ లేనివాళ్ళా? యజమానికి లొంగిపోయేవాళ్ళా? అలా రాయడానికి మీకు మనసెలా ఒప్పింది? నేనో బట్టల షాప్‍లో పని చేస్తున్నా. నాతో పాటు మరో పదిమంది ఆడవాళ్ళు పని చేస్తున్నారు. అందులో నాలా పెళ్ళయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా భర్త కానీ, వాళ్ళ భర్తలు కానీ ఈ కథ చదివితే ఏమనుకుంటారో ఆలోచించారా? మా పైన లేనిపోని అనుమానాలు రావా? మా యజమాని చాలా మంచివాడు. మీ కథ చదివితే షాప్ యజమానులందరూ స్త్రీలోలురనే అభిప్రాయం కలగదా” కోపం వల్లనేమో ఆమె మాటలు ప్రవాహంలా దూసుకొస్తున్నాయి..

“సమాజంలో మంచివాళ్ళూ ఉంటారు. చెడ్డవాళ్ళూ ఉంటారు. ఓ రచయితగా ఆ రెండు రకాల వ్యక్తుల గురించీ రాయాల్సి వస్తుంది. ఈ కథలో షాపు యజమాని చెడ్డవాడు. అంతమాత్రం చేత ప్రతి షాపు యజమాని చెడ్డవాడని కాదు. ఇందులో ఆ అమ్మాయి లొంగిపోతుంది. అంటే అర్థం ప్రతి అమ్మాయి అలా లొంగిపోతుందని కాదు.”

నా మాటలు పూర్తి కాకముందే మళ్ళా ఆమె అందుకుంది. “షాపు యజమాని ఆ అమ్మాయిని కోరుకున్నా ఆ అమ్మాయి ఎదిరించినట్టు రాయవచ్చుగా. ఎంత పేదరికంలో ఉన్నా ఎన్ని అవసరాలు ముంచుకొచ్చినా తన శీలాన్ని కాపాడుకుని విజేతగా మారినట్టు రాయవచ్చుగా” మళ్ళా శరపరంపరలా మాటలు… తూట్లు పొడుస్తూ… గాయాలు చేస్తూ…

“అందరిలో ఎదిరించే ధైర్యం ఉండదు. కొంతమంది పోరాడకుండానే లొంగిపోతారు. నేను రాసిన కథలో అమ్మాయి అలాంటిది. పిరికిది… అందరూ విజేతలు కాలేరుగా… ఓడిన వాళ్ళ గురించి కూడా రాయాలిగా. అంత మాత్రం చేత…”

మళ్ళా నన్ను మధ్యలోనే ఆపేసింది. “మీ కథ చదివి మా షాపులో పని చేస్తున్న అమ్మాయిలందరం బాధపడ్డాం. మీరు మీ రచనలతో పాఠకుల్ని సంతోషపెట్టాలి… ధైర్యం నూరిపోయాలి. విజేతలుగా మార్చడానికి ప్రయత్నించాలి. అంతేగాని మా కేరెక్టర్ మీద మచ్చపడేలా చేయడం మీకు భావ్యమా? ఈ కథ నా భర్త చదివి నా మీద అనుమానం పెంచుకుంటే నా బతుకేమవుతుందో ఆలోచించారా?” గంటకు పైగా ఆమె మాట్లాడుతూనే ఉంది.

చివరికి “ఈ కథని పుస్తకంలో వేసేటప్పుడు తప్పకుండా మీ బాధని దృష్టిలో ఉంచుకుంటాను” అనే వరకు వదల్లేదు.

“దృష్టిలో ఉంచుకోవడం కాదు. ఆ కథని మార్చాలి. ఆ అమ్మాయి షాప్ యజమానికి బుద్ధి చెప్పినట్టు రాయండి” అంటూ ఫోన్ పెట్టేసింది.

కొన్ని వారాల తర్వాత ఓ పత్రికలో మరో కథ వచ్చింది. అందులో హీరోకి పేదవాళ్ళంటే చాలా జాలి. ఎవరు అతని దగ్గర కష్టాలు వెళ్ళబోసుకున్నా వాళ్ళని తన శక్తికొద్దీ ఆదుకునే మంచి మనిషి. చివర్లో ఓ పని మనిషిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. అదీ కథ. హీరో పాత్రని చాలా ఉదాత్తంగా మలిచానని చాలామంది అభినందించారు.

ఆ సంతోషం కలిగించిన మత్తులో ఉండగానే నా ఫోన్‌కి ఓ మెసేజ్ వచ్చింది.

‘మాది చాలా పేదకుటుంబం. నేను ఎనిమిదో తరగతి వరకు చదివి ఆపేసాను. నాలుగిళ్ళలో పాచిపని చేసుకుంటూ అమ్మనీ ఇద్దరు తమ్ముళ్ళనీ పోషిస్తున్నాను. తమ్ముళ్ళు చదువుకుంటున్నారు. ఐదు వేలు ఫీజు కట్టాలట. దయచేసి సాయం చేయండి. మీ కథ చదివాక మీరు తప్పకుండా సాయం చేస్తారన్న నమ్మకంతో మెసేజ్ పెడ్తున్నాను’ అని రాసి ఉంది. దాంతో పాటు తన బ్యాంక్ ఎకౌంట్ వివరాలు పంపింది.

అదంతా ఫేక్ అని తెలుస్తూనే ఉంది. నేను సమాధానం ఇవ్వలేదు. నాలుగు రోజుల తర్వాత మరో మెసేజ్ వచ్చింది. ‘ఫీజ్ కట్టడానికి రేపే లాస్ట్ డేట్. ప్లీజ్ త్వరగా డబ్బులు పంపరా?’ అని రాసింది. నేను పట్టించుకోలేదు. పది రోజుల తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది. ‘కథ చదివి మీరు చాలా దయగలవాళ్ళను కున్నా. మీ నిజ స్వరూపం ఇదన్నమాట. అలాంటి కథలు ఎందుకు రాస్తారు? మాలాంటివాళ్ళను మోసం చేయడానికా?’ అని రాసి ఉంది.

వెంటనే పత్రిక ఆఫీస్‌కు ఫోన్ చేసి “ఇక ముందు నా కథ ప్రచురించడం జరిగితే దయచేసి నా మొబైల్ నంబర్ మాత్రం ఇవ్వకండి” అన్నాను ప్రాధేయపడ్తూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here