పిల్లిని పట్టుకోబోతే పులి నోట్లో పడినట్లు

0
13

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

[dropcap]కం[/dropcap]దులపాలెం గ్రామంలో కన్నంరాజు అనే గిరిజనుడు ఉండేవాడు. అతని భార్య కన్నమ్మ. స్నేహితుడు మృత్యురాజుతో కలిసి కన్నంరాజు సమీపంలోని అడవికి రాత్రి సమయంలో చెవుల పిల్లులను పట్టుకునేందుకు వెళ్లాడు. చెవుల పిల్లులును వేటాడేందుకు ఒక పద్ధతి ఉంది. ఒక కుండకు చుట్టూ చిల్లులు (కన్నాలు) వేసి దానిని తలపైన బోర్లించుకుంటారు. ముందుగా కుండలో ఒక దీపం బుడ్డి వెలిగించి నెత్తిమీద పెట్టుకుంటారు. దీపం బుడ్డి వెలుతురు చిల్లుల కుండ గుండా బయటకు వస్తుంది. ఒక చేతితో టార్చిలైట్‌ వేసుకుని రెండో చేతితో ఒక కర్రను పట్టుకుంటారు. చెవుల పిల్లులు కుండలోని దీపం ద్వారా వచ్చిన కాంతికి దగ్గరకు రాగా వాటిని కర్రతో కొట్టి అవి పడిపోగా పట్టుకుంటారు. ఇలా చెవుల పిల్లులను చెవులు పట్టుకుని ఒక గోనె సంచిలో బంధించి ఇంటికి తెస్తారు. వాటిని ఒక పెద్ద పంజరం లాంటి బుట్టలో ఉంచి తినేందుకు పచ్చిగడ్డి, ఆకులు, కూరగాయల ముక్కలు వేసి వాటిని పెంచుతారు.

గిరిజనులు చెవుల పిల్లుల మాంసం ఎంతో ఇష్టంగా తింటారు. మగ, ఆడ పిల్లులను ఒక దగ్గర కొన్ని నెలలు కలిపి ఉంచితే అవి కొన్ని నెలలకు ఐదారు పిల్లలు పెడతాయి. వాటిని సంతల్లోను, తోటి గిరిజనులకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. కన్నంరాజు కుండను తలమీద ఉంచుకుని నడుస్తూ, నడుస్తూ తన స్నేహితునితో ఒక చెట్టు దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఒక పులి, జింకలను వేటాడుదామని మాటువేసుకుని ఉంది. కన్నంరాజు అలా నడుస్తూ దాని దగ్గరకు వెళ్లగానే పులి అతణ్ని పట్టుకుంది. స్నేహితుడు ఇది చూసి భయపడి పారిపోయాడు. నెత్తిమీద కుండ క్రిందపడింది. దీపం బుడ్డి ఆరిపోయింది. కన్నంరాజు జీవితం చెల్లిపోయింది. పులి కన్నంరాజును చంపి తినేసింది. మర్నాడు అడవికి వచ్చిన గిరిజనులకు కన్నంరాజు తల కనిపించడంతో వారు గ్రామంలోని అందరికీ ఈ విషయం చెప్పారు. కన్నమ్మ లబోదిబోమని ఏడ్చింది. కన్నంరాజు స్నేహితునికి పులి జ్వరం పట్టుకుంది. అతడు “పులి, పులి” అంటూ కలవరించసాగాడు. ‘పిల్లిని పట్టుకోబోతే పులి నోట్లో పడినట్లు’ అనే సామెత ఈ సంఘటన నుంచి పుట్టుకొచ్చింది. ఎవరైనా చెవుల పిల్లుల కోసం అడవికి వెళ్తే వారికి ఈ సామెత గిరిజనులు గుర్తు చేస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here