పింక్ సిటీ జైపూర్

0
17

[కొన్నేళ్ళ క్రితం చేసిన జైపూర్ పర్యటననీ, అప్పటి అనుభూతులను గుర్తు చేసుకుని పాఠకులతో పంచుకుంటున్నారు డా. కందేపి రాణీ ప్రసాద్.]

[dropcap]ఉ[/dropcap]త్తర భారత రాష్ట్రమైన రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్. భారతదేశంలోనే అత్యంత వర్ణ రంజితమైన రాష్ట్రం రాజస్థాన్. అందునా జైపూర్ అంటే పింక్ సిటీగా పేరు పొందిందే కదా! ఊర్లోని భవనాలన్నీ గులాబీ రంగులో ఉంటే అక్కడి ప్రజల బట్టలు కళ్ళు చెదిరే రంగుల సమ్మేళనంతో అత్యంత మోహనంగా ఉంటాయి. ఇక్కడి కోటలు రాజ భవనాలు, సరస్సులు, సంస్కృతి ఏదైనా ప్రాముఖ్యం కలిగినటువంటిదే. జైపూర్ నగరాన్ని మహారాజా జైసింగ్ 17వ శతాబ్దంలో నిర్మించాడు. అందుకే ఆయన పేరు మీదగానే ఈ నగరానికి జైపూర్ అని నామకరణం జరిగింది. జైపూర్ నగరం అందానికి మాత్రమే పేరు గాంచినది అనుకుంటే పొరపాటే. ఇది కళలకూ, సంప్రదాయానికీ పెట్టింది పేరు. జైపూర్ బంగారు ఆభరణాలకూ, ఎనామిల్ పెయింటింగ్ లకూ, జాతిరాళ్ళకూ పెట్టి పుట్టింది. ఇక్కడి లక్క గాజులు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందినది ఇక్కడ రాజ ప్రసాదాలే కాదు ప్రకృతి దృశ్యాలు అత్యద్భుతంగా ఉంటాయి.

మా వారికీ జనవరి 2011లో కాన్ఫరెన్స్ జైపూర్‌లో అని తెలియగానే మేమంతా ఎగిరి గంతేశాం. జైపూర్ అనగానే రాజ ప్రసాదాలు, కోటలు, అందంగా అలంకరించబడ్డ ఏనుగుల విన్యాసాలు, ఒంటెల సవారీలు, కళ్ళు చెదిరే రంగురంగుల దుస్తులు ఎన్నో గుర్తుకు వచ్చాయి. అన్నింటికన్నా పింక్ సిటీ అంటే నగరమంతా ఎలా పింక్ రంగులో ఉంటుందోనన్న ఉత్సాహం ఆవరించింది మమ్మల్ని. ఇంకా ప్రఖ్యాత హవామహాల్‌ను దర్శించాలన్న ఆరాటం, రాజపుత్ర వీరుల సాహస గాథలు, ఆనాటి రాజుల శిల్ప కళాభిరుచిని ఆస్వాదించబోతున్నామన్న ఆతృత మమ్మల్ని ఒక్కచోట నిలవనీయలేదు. తీరా వెళ్ళే రోజు రానే వచ్చింది. జనవరి 18వ తేదీ రాత్రి 8:50కి హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి 11:00 గంటల కల్లా జైపూర్ చేరుకున్నాం. మేం జనవరిలో వెళ్ళడం వలన బయట విపరీతమైన చలిగా ఉన్నది. మా కోసం వచ్చిన మేనేజర్లు ఒక్కొక్క ఫ్యామిలీని రిసీవ్ చేసుకొని వాళ్ళకోసం కేటాయించబడ్డ హెూటల్‌కు పంపుతున్నారు. అలా మేము కూడా అక్కడి ఫైవ్ స్టార్ హెూటలైన ‘కంట్రీఇన్’కు వచ్చేశాం. వెజిటబుల్ పలావ్, యోగర్టు తిని నిద్రపోయాం.

మరుసటి ఉదయం హెూటల్ లోని ‘మొజాయిక్ హాల్’ లో బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని మావారు వర్క్ షాపు ఉన్నదని ‘బిర్లా ఆడిటోరియమ్’ వెళ్ళారు. పిల్లలిద్దరికీ పరీక్షలున్నందున మాతో రాలేదు. నేను రూమ్ కెళ్ళిపోయాను. ‘బిర్లా సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్’ స్టాచ్యూ సర్కిల్‌లో ఉన్నది. మేము కలకత్తా వెళ్ళినపుడు కూడా కాన్ఫరెన్స్ అక్కడి బిర్లా ఆడిటోరియమ్ లోనే జరిగింది. ఇందులో విద్యకూ వినోదానికీ సంబంధించి అత్యాధునికమైన కంప్యూటరైజడ్ ఆడియో విజువల్ డిస్ప్లే ఉన్నది. దీంట్లో సైన్స్ మ్యూజియమ్, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్, ప్లానెటోరియమ్ మరియు ఆడిటోరియమ్ ఉన్నాయి. ఇది దేశంలోని పెద్ద ఆడిటోరియమ్‌లలో ఒకటి. దీనిలో 1350 మంది జనం పడతారు. ఫార్మాస్యూటికల్స్ మేనేజర్ ఒకరు కారు తీసుకొచ్చి ఓల్డ్ సిటీ చూద్దురు గానీ రండి అని పిలిస్తే వెళ్ళాను. జైపూర్ అంతా మామూలుగా ఉంటుంది. మరి పింక్ సిటీ ఎక్కడ అని రాత్రి అనుకున్నాము. ఇపుడు ఓల్డ్ సిటీ చూశాక గానీ అర్థం కాలేదు. ఒక రాజ ప్రాకారం దాటాక గానీ పురాతన నగరం వచ్చింది. అక్కడి ప్రధాన కూడళ్ళలో తిరుగుతుంటే ఆనాటి రాజుల మధ్య తిరుగుతున్నట్లనిపించింది. ఇక్కడ మొత్తం ప్రతి ఇంటిపై పింక్ కలర్ పరదా కప్పినట్లున్నది. ఇక్కడ ప్రతి భవనం ఎర్ర రాళ్ళతో కట్టబడి ఉన్నది.

హవామహల్, జంతర్ మంతర్, సిటీప్యాలెస్, జల్ మహాల్ లోని నాలుగు అంతస్థులు ప్రస్తుతం నీటిలో మునిగే ఉన్నాయి. కేవలం ఒక అంతస్తు మాత్రమే నీటి పైభాగాన ఉన్నది. సరస్సు మధ్యలో ఉన్న ఈ మహల్ నగర్ ఘర్ కోట నుంచి అద్భుతంగా కనిపిస్తుంది. జల్ మహల్ దగ్గర నుంచి RTDC కి వచ్చాను. RTDC అంటే Rajasthan Textile Development Corporation ఇందులో బట్టలు, నగలు, కార్పెట్లు, షోపీస్‌లు, గృహలంకరణ వస్తువులు ఎన్నో దొరుకుతున్నాయి. మార్బుల్ చూర్ణంతో తయారయిన అమ్మాయి ముఖబింబాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మార్బుల్స్‌లో చాలా రంగులు దొరుకుతాయి. అవి రాళ్ళుగా కొట్టే క్రమంలో చిన్న చిన్న చూర మిగిలిపోతుంది. ఆ చూరను మెత్తగా చూర్ణంగా చేసి ముఖానికి పసుపురంగు, బట్టలు, గాజులు అన్ని పెయింటింగ్ వేసినట్లుగా ఆయా భాగాలల ఈ చూర్ణాన్ని అతికిస్తారు. ఇలాంటి పెయింటింగ్‌లు ఇక్కడ ఎన్నో దొరుకుతాయి. ఇక్కడ కొన్ని వస్తువులు కొనుక్కొని మీల్ టైముకు అశోకా క్లబ్ కు వెళ్ళాను. మహారాజ కుటుంబీకులు ప్రస్తుతం కూడా నివసించే ప్యాలెస్లలో ఒకటి మైసూరు. రెండవది జైపూరు అట.

జల్ మహాల్

సాయంత్రం మేము టవేరా కార్లో ఊర్లో షికారుకు బయల్దేరాం. మా డ్రైవర్ పేరు లాలూ. అతను ఊరంతా తిప్పుతూ అన్ని విశేషాలూ చక్కగా చూపుతున్నాడు. రాజస్థానీలు ఎక్కువగా వెజిటేరియన్ లట. దారిలో ఆల్బర్ట్ హాల్, బిర్లామందిర్, గణేష్ టెంపుల్, విధాన సభ అన్నీ చూసుకుంటూ వెళుతున్నాం. దారిలో లైట్లతో వెలిగిపోతున్న ఓ భవనాన్ని చూపించి ‘ఇదేంటి?’ అని అడిగాను. దానికతను ‘యే హీ విధాన సభా పై రాజస్థానీ కీ సబ్ బద్మాష్ లోగ్ యహా భైఠతే హై!’ అన్నాడు. ఇది విన్నాక సామాన్యులకు కూడా రాజకీయాలంటే ఎంత అసహ్యమో అనిపించింది. ఊరంతా ఎటు తిరిగినా కోటలే కనిపిస్తున్నాయి. ఈ ఊర్లో మూడు నాలుగు మెడికల్ కాలేజీలున్నాయి. నిమ్స్, మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలున్నాయట. షాపుల్లో ఇక్కడ ఎక్కువ టై అండ్ డై ప్రింట్, బాందినీ ప్రింట్, ఇంకా మినాకారీ వర్కు చాలా ప్రసిద్ధి ఇక్కడున్న జవహర్ బజార్లో అన్ని రకాల వస్తువులూ మన హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్‌లా ఉంటుంది. National Handloom Corporation కు వెళ్ళి చీరలు తీసుకున్నాం. ఒక మినాకారీ వర్కు ఉన్న బ్రేస్‌లెట్‌తో పాటు రెండు లెహంగాలు కూడా కొనుక్కున్నాను. ఈ షాపింగులతో ఈ రోజు గడిచిపోయింది.

మరునాడుదయం కాన్ఫరెన్స్ జరుగుతున్న బిర్లా ఆడిటోరియం వెళ్ళాం. అక్కడ దాదాపు 5000 మంది పిల్లల డాక్టర్ల కుటుంబాలున్నాయి. అన్ని రాష్ట్రాల నుంచీ విదేశాల నుంచీ వచ్చి ఉన్నారు. అక్కడంతా సందడి సందడిగా పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నది. ఈ సారి కాన్ఫరెన్స్‌లో విశేషమేంటంటే అందరు పిల్లల డాక్టర్లు గోల్ఫ్ టోర్నమెంట్ ఆడడం. ఇంకా ఈ కాన్ఫరెన్స్ జరిగే రోజు ఎవరిదైనా బర్త్ డే ఉంటే దాన్ని అందరి మధ్యలో అక్కడ ‘సెలబ్రేషన్ జోన్’ అని ఉంది. అక్కడ నిర్వహించారు. చాలా సరదాగా ఉంది. మా మ్యారేజ్ డే 24వ తేదీ, కాన్ఫరెన్సేమో 23వ తేదీతో అయిపోయింది. కాన్ఫరెన్స్ ఇంకొక్క రోజుంటే మేం కూడా మ్యారేజ్ డేని సరదాగా అక్కడే చేసుకునే వాళ్ళం కదా అనుకున్నాం. పిల్లలకు, స్త్రీలకు రకరకాల గేమ్స్ ఉన్నాయి. అక్కడ చాలా లెక్చర్ హాళ్ళలో చాలామంది డాక్టర్లు పేపర్లు ప్రెజెంట్ చేశారు. రాజస్థానీ మహిళలు, పురుషుల డ్రెస్సుల్నీ అందరికీ ధరింపజేసి ఫొటోలు తీస్తున్నారు. ప్రతివారూ పిల్లల్లా సరదాగా ఇలా వేషాలు వేసుకొని ఫొటోలు తీయించుకున్నారు. ఇంకా రాజస్థానీ ఫుడ్ ఐటమ్స్‌ను అందరికీ రుచి చూపిస్తున్నారు. అక్కడకు గ్రామీణ ప్రాంత మహిళల్ని తీసుకొని వచ్చి వారి చేత రొట్టెలు చేయిస్తున్నారు. అవి వేడి వేడిగా తింటుంటే ఎంతో రుచిగా ఉన్నాయి.

హవా మహల్‌

మధ్యాహ్నం నుంచి హవా మహల్‌ను చూడటానికి వెళ్ళాం. ఇది రోడ్డు పైనే ఉన్నది. దీని ముందంతా షాపులున్నాయి. ఈ హవా మహల్‌ను మహారాజు సవాయి ప్రతాప్ సింగ్ నిర్మించాడు. జైపూర్‌కు పేరు తెచ్చింది, ప్రతిభావంతమైనది, విలక్షణమైనది అయిన హవామహల్ క్రీ.శ 1799లో నిర్మించబడింది. ఇది నగర మధ్య భాగంలో ఎర్రరంగు రాళ్ళతో పిరమిడ్ ఆకారంలో కట్టబడి ఉన్నది. ఈ భవనం అయిదు అంతస్థులుగా ఉండి 593 కిటికీలతో అందమైన ఆర్చీలున్న బాల్కనీలతో చూడ ముచ్చటగా అలరారుతున్నది. రాణి వాసపు స్త్రీలు పర్వదినాల్లో ఆయా ప్రధాన రహదారుల్లో జరిగే ఉత్సవాలు ఊరేగింపుల్ని ఈ కిటికీల గుండా తిలకించేవారు. ఈ కిటికీల వలన మంచిగాలి, వెలుతురు కూడా భవనం లోపలకు వస్తుంది. ఈ మహల్ మొత్తం చూడటానికి శ్రీ కృష్ణుని కిరీటంలా దర్శనమిస్తుంది. ఇది మహారాణుల కోసం నిర్మించబడింది.

దీన్ని చూశాక అంబర్ కోటకు వెళ్ళాం. ఇది జైపూర్ కు 11కి.మీ దూరంలో కొండ మీద కట్టబడింది. రాజామాన్ సింగ్ 16వ శతాబ్దంలో ఈ కోటను కట్టటం ప్రారంభించగా 18వ శతాబ్ధంలో సవాయి జైసింగ్ దీనిని పూర్తి చేశాడు. ఈ కోట బయటి నుంచి మామూలుగా కనిపించినా లోపల చాలా అందంగా అలంకరించారు. గోడల మీద ఎక్కువగా వేటాడే సీన్లు ఉన్నాయి. కోటంతా ఎర్ర రంగు రాళ్ళతోనూ, లోపల తెల్లని మార్బల్ తోనూ కట్టారు. రాజ పుత్రులు మరియు మొఘలుల శిల్పకళతో కట్టబడింది. ఈ కోట దగ్గర నుంచి సింగ్ పోల్ మరియు జలేబ్ చౌక్ దాకా యాత్రికులు ఏనుగుల మీద సవారీ చేస్తూ ఆనందపడతారు. ఈ కోటను ఎక్కలేక బాగా కాళ్ళు నొప్పులొచ్చాయి. వాటిని చూస్తుంటే అసలు ఇంతంత కోటల్లో వాళ్ళు రోజూ ఎలా నడిచేవాళ్ళో అనిపించింది. పెద్దపెద్ద కొండల్ని కోటలుగా మార్చేశారు పూర్వపు రాజులు.

అంబర్ కోట

సాయంత్రం ‘సిల్వర్ ఇన్’లో కల్చరల్ ఈవెనింగ్ జరిగింది. అందులో అద్భుతమైన రాజస్థానీ సంప్రదాయ డాన్సులు చూశాం. ఆ కళాకారులు మాతో ఫొటోలు తీయించుకున్నారు. చైనీస్, మొఘలాయీ, జైన్ వంటి అన్ని రకాల ఫుడ్స్ ను అందరూ టేస్ట్ చేశారు.

మేమీరోజు అజ్మీరు, పుష్కర్ వెళ్ళాలనుకున్నాం. మరొక ఫ్యామిలీతో కలిసి మొదటగా పుష్కర్ బయల్దేరాం. ఇది ప్రపంచలోనే ఏకైక బ్రహ్మదేవాలయం. ఇక్కడొక సరస్సు ఉన్నది. ఇక్కడ నీళ్ళు చల్లుకొని గుడిలోనికెళ్ళాం. అక్కడ ఇంద్రుడు, యముడు గుళ్ళు కూడా ఉన్నాయి. గుడి చుట్టూ కొండముచ్చులు విపరీతంగా ఉన్నాయి. యాత్రికుల వద్ద నుండి మరమరాలు తీసుకొని తింటున్నాయి. గుడి లోపలికి ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్ళ నియ్యకపోవడంతో ఇక్కడ ఫొటోలేవీ తీసుకోలేదు. జైపూర్ నుండి పుష్కర్ వచ్చే దారిలో నిండు రంగుల మేళవింపులతో లెహంగాలు ధరించే స్త్రీలు, సంప్రదాయ షేర్వాణీ, తలపాగాలతో పురుషులు కనిపించారు. ఇక్కడ నుంచి అజ్మీర్ వెళ్ళాం. అజ్మీరు వెళ్ళే దారి చాలా బాగుంది. ఈ ఊరి చుట్టూ కొండులున్నాయి. కొండల మధ్యలో కిందికి అజ్మీరు ఉంటుంది. బయట నుంచి ఈ ఊరు కనిపించదు. అన్నింటి కన్నా పెద్ద దర్గా ఇది. చాలా అద్భుతంగా ఉన్నది. అక్కడ ప్రసాదం తయారు చేసే పాత్రలు చాలా పెద్దవి. ఈ ఊరిలో తొంభై శాతం మంది ముస్లిములు ఉంటారు. మనం కూడా టోపీ, కొంగు నెత్తిమీద కప్పుకునీ నమాజ్ కు వెళ్ళాలి. ఇక్కడ కూడా ఫోన్లు, కెమెరాలు లోపలికి తేనీయరు. అజ్మీరు నుంచి జైపూరు వచ్చేటప్పుడు దారిలో ‘మకరానా’ అనే ఊరు కనిపించింది. మనం ఇక్కడ ఇళ్ళలో పరుచుకునే మకరానా మార్బుల్స్ ఈ ఊర్లోనే దొరకుతాయట. సాయంత్రానికి జైపూర్ చేరాం.

పుష్కర్ సరస్సు

జైపూర్ లోని ‘హెవెన్స్ గార్డెన్’లో బ్యాంకెట్ జరిగింది. ఇది చివరి రోజు కాబట్టి చాలా అద్భుతంగా జరిగింది. కాన్ఫరెన్స్ జరిగిన ఈ మూడు రోజులూ మాకు డ్రెస్ కోడ్ పెట్టారు. ఒకరోజు క్యాజువల్ వేర్, ఒకరోజు ఫార్మల్ వేర్, ఒకరోజు ఎత్నిక్ వేర్ ధరించాలి. ఈరోజు మాకందరకూ డాన్స్ ఫ్లోర్ ఇచ్చారు. ఆడవాళ్ళందరూ దాండియా ఆడుకున్నాం. మగవాళ్ళందరికీ రాజస్థానీ తలపాగాలు పెట్టారు. వాళ్ళు డాన్సులు చేశారు. ఉత్తరాది వాళ్ళు అద్భుతంగా డాన్సులు చేశారు. ఇదంతా వీడియోలు తీసుకున్నాం. ఒక గుర్రపు బగ్గీ తెచ్చి పెట్టారు. అందులోకి జంటలు ఎక్కి ఫొటోలు తీసుకున్నారు. గుర్రాలు చాలా అందంగా అలంకరించబడి ఉంటాయి. అలాగే ఏనుగులు కూడా బాగా అలంకరింపబడి ఉంటాయి. వాటిని వరుసగా నిలబెట్టారు. అందరూ ఏనుగులతో, గుర్రాలతో ఫొటోలు తీసుకుంటున్నారు. మేము కూడా చాలా ఫొటోలు తీసుకున్నాము. ఓ పక్క రాజస్థానీ జానపద నృత్యాలైన ఘూమర్, గారాసియా, అగ్ని నృత్యాలు వేదికపై అందంగా సాగిపోతున్నాయి. ఇంకో వేదికపై సినిమా పాటలకు అద్భుతమైన నృత్యాలు చేస్తున్నారు. నోరూరించే రకరకాల ఫుడ్స్ వేడి వేడిగా తింటూ చెవుల కింపైన సంగీతం వింటూ కనువిందైన నృత్యాలు తిలకిస్తూ చాలా చాలా ఆనందిస్తున్నారు అంతా. ఇదంతా ఓపెన్ గ్రౌండ్ కాబట్టి అందరూ చలికి వణుకుతూ సూపుల మీద సూపులు వేడిగా తెగ తాగేస్తున్నారు. చేతిలో సూప్ కప్పుతో ఫైర్ ప్లేస్ కిందికి జేరుతూ అన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నాం. జైపూర్ దర్శనంతో ఆహ్లాదమైన అనుభూతుల్ని ఆనందంగా ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగొచ్చాం.

Photos Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here