Site icon Sanchika

పిట్ట కథ

కథ బాలల కయినా, పెద్దలకయినా అందరినీ ఆనందింపజేయాలి. చిన్నదయినా పెద్దదయినా, పాఠకుడి హృదయంలో క్షణమాత్రం మెరుగుపును మెరిపించగలగాలి. పిట్ట కొంచెం కూత ఘనం అన్న రీతిలో చిన్న కథలొ పెద్ద సత్యాన్ని పొందుపరిచారు శివరామ్‌కుమార్ ‘పిట్ట కథ’లో. ఇది ఆయన తొలి కథ.

ఓ నగరంలోని ఓ అందమైన కాలనీ అది.

అందులో ఉన్న ఓ అందమైన భవంతిలో ఈ కథ మొదలైంది.

ఎన్నో హంగులున్న ఆ ఇల్లు అంచెలంచెలుగా ఎత్తు పెరిగింది.

నగరమన్నాక ఎన్నోకాలనీలు, అందులో భవంతులూ ఉండే ఉంటాయి.

అలాగే అవి నిర్మించేందుకు నియమనిబంధనలూ ఉంటాయి.

పాలకవర్గానికి అప్పుడప్పుడూ అతిక్రమణలూ గుర్తొస్తాయి.

ఆక్రమణలూ, అతిక్రమణలూ గుర్తించాకా కూల్చివేతలు మొదలవుతాయి.

 

కథ మొదలైన ఈ బంగళాలోని బాల్కనీ రోడ్డు మీద కొచ్చిందని తేలింది.

ఇంటివాళ్ళు దాన్ని కాపాడుకోటానికి రకరకాల పోరాటాలు చేసి అలసిపోయారు.

తప్పదని తేలిపోయాక బాధపడుతూనే సాక్షులుగా కూల్చివేత చూస్తున్నారు.

బాల్కనీలోని పూలకుండీల మాటున బతుకుతున్న ఓ చిన్ని పిట్ట ఉంటోంది.

కూల్చివేత అలజడికి ఉలిక్కిపడి ఎగురుతూ ఆవల ఓ తీగపై వాలింది.

 

అక్కడినుంచే ఆ పిట్ట కూలుతున్న భాగాన్ని అదోలా చూసింది.

ఆ చూపు అర్థం చేసుకుంటే గతం నెమరేసుకుంటోందనిపిస్తుంది.

కొన్ని నెలల క్రితమే ఆ బాల్కనీ విస్తరించటానికి ఓ చెట్టు నరికేశారు.

ఆ చెట్టు మీదే ఈ చిన్ని పిట్ట నివాసం.

మన పిట్ట కథ ముగిసింది.

 

 

శివరామకుమార్ kumardvsr@rediffmail.com

 

 

 

Exit mobile version